స్త్రీల ఆత్మగౌరవం, స్త్రీల ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నపుడు స్త్రీల హృదయ స్పందన వినాలి. నిజంగా వారి హృదయ స్పందనను వినగలిగినపుడే వారి హక్కుల గురించో, వారికి జరుగుతున్న అన్యాయం గురించో, వారి సమానత్వం గురించో మాట్లాడగలం. జండర్ పాలిటిక్స్ గురించి దాని వెనకమాల జరుగుతున్న పురుషాధిపత్యపు ఎత్తుగడలు గురించి అవగాహన లేకుండా మాట్లాడే ఏ మాటైనా కంటితుడుపు గానే మిలిగిపోతుంది.
మహిళావరణం పుస్తకం ముందుమాటలో ఓల్గా, వసంత, కల్పన కన్నాభిరాన్ లు చెప్పినట్టు ‘స్త్రీలేమంటున్నారో వినకుండా, స్త్రీలేం కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా సాగిన ఎన్నో ఉద్యమాలు, వాటిలో ఘర్షణపడి నిగ్గుదేలి కొత్త చరిత్రను సృష్టించిన స్త్రీలూ…’ అన్నది స్పృహలో ఉండాలి. మొదటిగా స్త్రీల సమస్యలను స్త్రీ హృదయంతో, మానవత్వపుతడితో అర్ధం చేసుకోవాలి. ఈ స్పృహ లతో రాస్తున్న అతికొద్ది మందిలో ఉత్తరాంధ్ర కవి లండా సాంబమూర్తి ఒకరు. వారు ఇటీవలే వెలువరించిన ‘ఆమెకు మిగలని ఆమె’- కవితా సంపుటిలో ప్రత్యేకంగా వర్తమాన స్త్రీల గుండె చప్పుడు వినిపించారు. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో స్త్రీల సామాజిక స్థితి,మానసిక సంఘర్షణలకు అద్దం పట్టే అతి సన్నుతమైన కవిత్వం ఈ సంపుటిలో మనల్ని పలకరిస్తుంది.
అందులో నన్ను అమితంగా కదిలించిన కవితను పంచుకుంటాను. స్వార్ధపూరిత రాజకీయ కుట్రల్లో స్త్రీల హక్కలు కాలరాయబడుతున్న దుస్థితికి అద్దం పట్టే ‘నగ్నదేశం’ అనే ఈ కవితను చదవండి.
‘నగ్న దేశం’
చంద్రయాన్ వెలుగులో
వివస్త్రదేశాన్ని అలవాటు కొద్దీ
దాచేయాలని చూసినా కుదరదు
ఈశాన్య దిగంబర పర్వం
ప్రపంచం కంటబడే వుంటుంది
అంతర్జాలం పీక మీద
ఎన్నాళ్ళు కాళ్లేసి తొక్కినా
అడవి ఒంటిమీద నెత్తుటి మరక
తుడిపేసుకుంటే పోయేది కాదు
తల్లులిక స్వయంగా తమ బిడ్డల కళ్ళను
పొత్తిళ్ళలోనే పెరికేయడం మేలు
విస్తరిస్తున్న తామర కొలను
ఎప్పుడు ఎక్కడ ఏ క్షణం
దేశాన్ని నగ్నంగా ఊరేగిస్తుందో తెలీదు
నిన్న అమ్మపేగుల్ని చీల్చి
శూలాల చివర చిన్నారి నెలవంకల్ని వేలాడదీసిన
వీర్యపు చుక్కలకు దక్కిన సత్కారం
ఏ ధర్మాన్ని నిలబెట్టిందో
ఇప్పటికైనా తెలిసొచ్చి వుండాలి
ఇవాళ అడవితల్లుల నగ్నకవాతు తర్వాత
మన ఆడబిడ్డల్ని చూస్తూ
బిక్కుబిక్కుమంటూ గడిపే బతుకుమీద
మనకు మనమే ఉమ్మేసుకోవాలి
ఆకలి తరిమితే
మైదానాల బాటపట్టిన కాళ్ళు
ప్రాణాల కోసం తిరిగి అడవిలోకే పరుగుతీస్తున్న
వర్తమానాన్ని భుజాల మీద మోస్తున్నందుకు
గర్వించే తీరాలి
కుకీతల్లుల నెత్తుటి గాయాలు
చల్లారేవి కావు
సరిహద్దు గస్తీని తలచుకుని
పశ్చాత్తాపపడుతున్న రిటైర్డ్ జెండా సాక్షిగా
శిబిరంలో అమ్మ స్తన్యం కోసం
తడుముకునే లేత పెదవుల రోదన సాక్షిగా
వెదురు తడకలకు తగిలించబడిన తలలన్నీ
నగ్నదేశం చరిత్రను తిరగ రాస్తాయి
*
ఎటువంటి వివరణ అక్కరలేకుండానే సమకాలీన రాజకీయ వాతావరణం స్త్రీల బతుకుల్ని ఎలా రాజకీయ కుంపట్లోకి నెట్టి ఎలా చలి కాచుకుంటున్నదో స్పష్టమవుతోంది. ఒక్క మణిపూర్ ఘటనే కాదు, దేశవ్యాప్తంగా జరిగిన జరుగుతున్న దుర్మార్గు చర్యల్ని చూపెడుతుంది. మతం రంగు పులుముకున్న రాజకీయవ్యవస్థలో మొదటి బాదితులుగా నిలుస్తున్న స్త్రీలు ఎదుర్కొంటున్న దుస్థితిని, ఉదాహరణలతో తెలియజేస్తుంది.
ఇవే కాక స్త్రీలు ఇంటా బయట నిత్యం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి. ప్రేమరాహిత్యపు వాతావరణం. దుఃఖం, దిగులు, హేళన, కుంగుబాటు, ప్రేమ, ఆత్మవిశ్వాసం, కోపం మరెన్నో అనేక పార్శ్వాలలో మాట్లాడిన తీరు మనల్ని మనసుపెట్టి చదివిస్తుంది. ‘ఆమెకు మిగలని ఆమె’ కవితా సంపుటిలో కవితలు కొన్ని నేటి స్త్రీల గుండె చప్పున్ని లలితంగా వినిపిస్తాయి. కొన్ని దుఃఖాన్ని దోసిల్లలో పోస్తాయి. దయను, ఆర్ద్రతను అద్దుతాయి. ప్రజాస్వామికంగా, సమన్యాయం, సమానత్వం, సామాజిక గౌరవం గురించి చర్చిస్తాయి. ముందుమాటలో ప్రసేన్ గారు అన్నట్టు… “బయటకు నిటారుగా కనపడే బోలు స్త్రీలు, బాల్యంలోనే మోడులైన స్త్రీలు, ఏడుపే అలంకారమైన స్త్రీలు, సంగీతాన్ని దిగమింగిన కోకిలలలాంటి స్త్రీలు, పేలాల్సిన మందుపాతరలను గుండెల్లో సమాధి చేసిన అనేకానేక ఆమెకు మిగలని ఆమెలకు ఆమెను పునర్లిఖించి అందించాలని పూనుకున్నాడు. ఆ ప్రతిఫలనాలన్నింటినీ ఒక్క దగ్గర చేర్చి తిరుగుబాటునూ వేదననూ ఆవిష్కరించే ముఖచిత్రంగా కూర్చాలని నడుం కట్టాడు.” నిజంగా ‘అతడి లోపల ఆమె పాడే పాటలు’ అయిన ఈ కవితల్ని చదివి కాలం తల్లులపై సాగుస్తున్న దాస్టీకాల కాండని అర్ధం చేసుకుందాం. మన మనసులను, హృదయాలను ఇంకాస్త విశాలం చేసుకునే, మెత్తపరుచుకునే కవితా పాదాల్ని మళ్లీ మళ్లీ వల్లెవేసుకుందాం. మనుషులవుదాం.