నక్షత్ర ధార!

చుక్కలు లెక్కపెట్టడం అనే సరదా కొండదాసు తన పెంకుటింటి మీద పడుకొని తీర్చుకొలేడు. ఎందుకంటే అతనికి లెక్కలు రావు. అతని ఇల్లు ఊరికి దూరంగా ఎక్కడో ఉంది. చుట్టూ రాళ్ల గుట్టలు.. ఆ ఇళ్లు వాటితోనే కట్టారు. పైన పెంకులకు వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. పెంకులు మార్చుకునేందుకు కొత్త పెంకులు కావాలి. కొండదాసుకి ఇంట్లో లాంతరు వెలిగించుకునే అధికారం లేదు. కాబట్టి ఆ చుక్కల వెలుగే దిక్కు. ఆరు బయట మంచం వేసుకొని తనకు కనిపించే చెట్టూ, పుట్ట, రాత్రుళ్ళు తిరిగే పురుగూ పుట్రల పేర్లు తెలుసుకోవాలని కోరిక. కానీ ఎలా! చెప్పేవాళ్ళు ఎవరు?

సరేనని వాటికి తానే ఏదోక పేరు పెట్టబోతాడు. భార్య అది చూసి నవ్వుకునేది. అట్లా చేస్తే అతనికి చిన్నతనంగా ఉండిద్ది.

“ఏంది మే.. బో నవ్వుతున్నావ్. నీకు తెలిస్తే పెట్టు చూద్దాం” అంటాడు.

ఆమె మూతి ముడుచుకుంది.

ఆ మైదాన ప్రాంతం పెద్ద ఆకర్షణీయంగా ఉండదనీ గ్రామస్తులు అనుకుంటారుగానీ కొండదాసుకి ప్రకృతిలో ప్రతిదీ వింతగా కనబడేది. ఈ విశ్వ వింతలను తెలుసుకోవాలని అతనికి తీరని ఆశ.

నాలుగు వరసల ఆ గ్రామం అంతా శుభ్రంగా ఉండేది అతనివల్లే. ఊర్లో అతను తెలియని మనిషి లేడు. అతనికి తెలియని మనిషీ లేడు. కొత్తవాళ్ళు ఊరికి వచ్చి ఎవరి గురించైనా అడిగితే, వాళ్ళను నేరుగా ఆ ఇంటిదాకా తీసుకెళతాడు. కొందరు అపరిచితులు వచ్చి కొత్త కొత్త భాషలు మాట్లాడుతుంటే అది అర్దంకాక, తిరిగి సమాధానం చెప్పలేక అతను సిగ్గుపడటం జనాలకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

“ఇతను ఎందుకు అంత మధన పడతాడు. అతని ప్రావీణ్యం ఇక్కడ ఎవరికి గొప్పగా కనిపిస్తుంది! పిచ్చి వెధవ” అంటారు.

పనిచేస్తూ తనలో తానే మాట్లాడుకుంటాడు. ఎవరన్నా ఏం మాట్లాడుకుంటున్నావు? అంటే, “సందేహాలు.. గుర్తుండవని నెమరు వేసుకుంటున్నా” అంటాడు.

ఆరోజు నడిరాత్రి కొండదాసు గాఢనిద్రలో ఉండగా, నడిజామున దుమ్ము, ధూళి రేగింది. తుఫాను గాలి సర్రున బాణంలా తాకుతుంది. దాని వెనకే వడగాల్పు లాంటి వేడి వాళ్లను తగిలింది. క్షణాల్లో దబ్బున ఇంటి మీద ఏదో బండరాయి పడ్డ శబ్ధం. పెంకులూ, వాటికి ఆసరాగా ఉన్న దూలాలు విరిగి గాల్లో లేచాయి. నిద్దట్లో ఇద్దరికీ భూమి కంపించినట్టై కళ్ళుతెరిచి చూశారు.

ఎదురుగా ధగధగమంటూ ఓ నక్షత్రం. పైకప్పు బద్దలు కొట్టుకొని ఇంట్లో తిష్ట వేసింది. కొబ్బరి చెట్టంత ఎత్తు, ఏనుగంత వెడల్పు. భూచక్ర గడ్డంత తెలుపుతో దేదీప్యమానంగా ఉంది. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని బ్రహ్మాండమైన వెలుగుతో నింపేసింది. భార్యాభ్తలిద్దరూ కళ్ళు మిరిమిట్లు గొని నిప్పును చూసిన కుందేలులా నిలబడిపోయారు.

చెట్ల మీద ఉన్న పక్షులన్నీ కిలకిలలాడుతూ దాని చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఇంకా మాటలు రాని అతని కొడుకు కేర్ మన్నాడు. చీకటిగా, నిస్సారంగా, రంగు వెలసినట్టున్న ఆ ప్రాంతాన్ని రంగుల హరివిల్లులా మార్చింది ఆ నక్షత్రపు వెలుగు.

భార్య భర్తలిద్దరికీ పట్టరాని ఆనందం వేసింది. ఇల్లు గుల్లైందన్న స్పృహ ఇద్దరికీ లేదు. కళ్ళు టపటపలాడిస్తూ ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు.

అప్పటిదాకా అవి సూర్యుడి వల్ల మెరుస్తున్నాయి అనుకున్నాడు కొండదాసు. సొంతంగానే వెలుగుతాయన్న ఎరుక అప్పుడు వచ్చింది. చీకటిలో బతికేవాళ్లకు ఆ వెలుగు పండగయింది.

*

ఊరి నాయకుడు దండపతి వీధి మొదటి వరుసలో ఉంటాడు. చాలా కాలంగా జనాలు అతను నిలబడ్డట్టే నిలబడటం. అతను మాట్లాడినట్లే మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. వాళ్ళకు అదొక మజా. అక్కడి నేల కనుచూపు మేరా ఆయనదే. దాసుకి ఆ నేలను దాటి ఉండాల్సి వచ్చింది. దండపతి ముందు ఎవరూ పెద్దగా మాట్లాడకూడదు.

ఒకసారి అటుగా వచ్చిన ఆయనను చుట్టూ ఉన్న చెట్ల పేర్లు అడిగాడు కొండదాసు.

“అవి ఎందుకు పనికొస్తాయి?” అన్నాడు. “చెప్పినా అర్థం నువ్వు చేసుకోలేవు, నీకంత జ్ఞానం లేదు” అన్నాడు దండపతి.

జ్ఞానం.. ఎలా ఉంటుందదీ. పైన ఉన్న చుక్కల్లా ఉంటుందా? చుట్టూ తిరిగే జీవులలో ఉంటుందా? ఈ చెట్ల వేర్లలో ఉంటుందా? అపరిచిత భాషల్లో ఉంటుందా? ఎలా ఉంటుందదీ? కొండదాసు తీరని కోరిక మరింత బలపడింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం మీద ఆసక్తి పెరుగుతూనే ఉంది.

తన ఇంటి మీద పడిన ఆ నక్షత్రం వెలుగు చూసి చేతులెత్తి మొక్కాడు. “ఇలాంటి ప్రశ్నలకు నువ్వన్నా సమాధానం ఇవ్వు!” అని అడిగాడు.

ఆ నక్షత్రం కొండదాసు కొడుకు చురుకైనవాడని కనిపెట్టింది. అతని చూపు కూడా కొండదాసుకు మల్లే ప్రశ్నలకు జవాబులు వెతికే చూపు. తండ్రిలా భయపడకుండా పెద్దగా నవ్వుతాడు. పాకుతూ ఆ నక్షత్రాన్ని తాకటానికి ఉబలాటపడ్డాడు. ఆ నక్షత్రం ఇదంతా గమనించకపోలేదు.

కొండదాసును చూసి “కొండదాసూ, నీ తీరని కోరిక తీరుతుంది. నీ కొడుకును నాకు అంకితం ఇవ్వు” అంది నక్షత్రం.

భయపడ్డాడు కొండదాసు. తెలియని ఉద్రేకం. “అంటే ఏం చేయాలి! అంకితం ఎలా ఇయ్యాలి.”

“ఆ చిన్నారిని నా ఒడిలో చేర్చు” ఆజ్ఞాపించింది.

కొండదాసు చిన్నారిని ఎత్తుకుని దాని ఒడిలో వేశాడు.

పిల్లాడు కిలకిలా నవ్వాడు. ఆ రోజు నుంచీ చిన్నారి మల్లదాసు నక్షత్రం ఒడిలో పెరిగాడు. త్వరగా మాటలు నేర్చుకున్నాడు. ఎంతలా అంటే, పెట్టాలనుకున్న పేర్లు చెట్టూపుట్టకి పెట్టేశాడు. నక్షత్రం ఏం చెబితే అదే పలికాడు. ఆకాశం విస్తరించినంతమేరా చుక్కలు లెక్క పెడుతున్నాడు మల్లదాసు. అద్భుతం! తనకు చేతకానిది పిల్లాడు చేయడం చూసి ఆశ్చర్యపోయాడు కొండదాసు. అతనికి ఆకాశం పలక, చుక్కలు అక్షరాలు అయ్యాయి.

మల్లదాసునుకి విశ్వంలో ఎక్కడో సుదూరానున్న నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయి. చుక్కల లెక్క వేలు దాటి లక్షలకు చేరింది. ఆ ఊర్లోనే ఎవరికీ సాధ్యం కానన్ని లెక్కలు అతని నోటికి వస్తున్నాయి. లెక్క తప్పిపోకుండా ఒక కర్రతో నేల మీద రాస్తున్నాడు మల్లదాసు. కొండదాసుకి ఒళ్ళు జలదరించింది. దీనంతటికీ కారణం నక్షత్రమే అని మొగుడూపెళ్ళాలకు తెలిసొచ్చింది. ఆనందంతో ఆ మైదానం అంతా తిరిగి గంతులేశాడు. అతని ఇంటికి వచ్చేవాళ్ళెవరూ లేరు కాబట్టి, ఈ సంఘటనను ఎవరూ చూడలేదు. అతను కూడా ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు.

*

కొంతకాలానికి కొండదాసు చనిపోయాడు. తీరని కోరికలు తీరకుండానే చనిపోయాడు. ప్రశ్నలూ, సందేహాలకు సమాధానం లేకుండానే పోయాడు. అతని భార్య కూడా పోయింది. ఎంత దుర్భరం. కాలం చేసింది ఒక వ్యక్తి కాదు, ఒక తరం జిజ్ఞాస.

అప్పటినుండి నక్షత్రమే మల్లదాసుకి ఆసరా అయింది. దానితోనే ఆడి పాడి, కబుర్లాడి ఎదిగాడు. మల్లదాసు తండ్రిలాగా మెత్తనివాడు కాదు. కాస్త గట్టివాడే. మాట నెగ్గించుకునేవాడు. అసలే నక్షత్రం ఒళ్లో పెరిగిన వాడు. కాబట్టి అతని తీరు అంతా వేరు.

ఊరి జనం ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉందనీ గమనించినా దానికి కారణం వాళ్లకి తెలియలేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా అతని కన్నా ముందు అతని మాట వస్తుంది. అదే ఆ నక్షత్రం అతనికిచ్చిన శక్తి. ఆ వెలుగులో గ్రహాల, నక్షత్రాల జాడలు తెలిసాయి. ఇంతకుముందు వింతగా కనిపించినా ప్రతిదాని వెనుక హేతువు తెలిసింది. లోకంలో వింతలు ఉండవని బోధపడింది.

చాలా కాలం గడిచాక ఇప్పుడు నక్షత్రం వెలుగు క్షీణిస్తూ ఉంది. అది చూసి మల్లదాసు కంగారుపడ్డాడు. మళ్లీ ఈ ఇల్లు చీకటి అవుతుందా? తనను ఇంతవాణ్ణి చేసిన ఈ దీపాన్ని కాపాడుకోవాలి. “ఎందుకిలా జరుగుతోంది. దీనికి పరిష్కారం ఏమిటీ?” అని నక్షత్రాన్ని అడిగాడు.

నక్షత్రం “నా వెలుగు కొనసాగాలంటే, నీలాంటి వాళ్లు అనేకమంది వచ్చి నా వొడిలో చేరాలి. నీలాగే నాకు అంకితం కావాలి” అంది.

ఊపిరి పీల్చుకున్నాడు మల్లదాసు. తను ఏ వయసులో నక్షత్రం ఒడికి చేరాడో ఆ వయసు పిల్లలకోసం దూరాన ఉన్న గూడేలకు ప్రయాణయ్యాడు. ఆ ప్రయాణంలో తనలాంటి వాళ్లు అక్కడక్కడా కనిపించారు. మల్లదాసు ఒట్టిపోయిన గేదెలాంటి ఆ ప్రాంతాలను చూసి దిగులుపడ్డాడు. నిస్సారంగా ఉన్న ఆ మనుషులను చూసి అయ్యో అనుకున్నాడు. ఏ ఆశలూ లేని ఆ జనాల చూపులు అతనికి భారంగా అనిపించాయి. అతనే వాళ్ళకు ఆశలు కల్పించే మనిషిగా మారాడు.

గుమ్మాలకు అనుకొని కూర్చున్న వాళ్ళ దగ్గరకు వెళ్లి పసి బిడ్డలను తనతో పంపమని అడిగినప్పుడు. ఆ బడుగు జనం ముఖాల్లో ఆశ్చర్యం.

“నువ్వు ఎవరు? మాకన్నా ప్రత్యేకంగా ఉన్నావే. నీచుట్టూ ఏదో వెలుగు కమ్ముకుందే” అన్నారు.

“ఇంతకుముందు మీలాగే ఉన్నాను. ఇప్పుడిప్పుడే నా మీద ఒక వెలుగు ప్రసరించి ప్రత్యేకంగా తయారయ్యా”నన్నాడు.

వాళ్ళు అబ్బురంగా చూశారు.

“మీ పిల్లలను నాలా ప్రత్యేకంగా చేస్తాను. వెలుగుతో నింపేస్తాను” అని వాళ్ళు అడగకుండానే మాట ఇచ్చాడు.

వాళ్ళకు పట్టరాని ఆనందం. ఆ సమయంలో వాళ్ల పిల్లలను జాగ్రత్తగా తెచ్చి అప్పగించారు. ఎప్పుడూ చూడని వెలుగు చూడటానికి బిక్కుబిక్కుమంటూ ప్రయాణించారు తర్వాతి తరం శిశువులు. వాళ్ల చుట్టూ కూడా రాళ్లురప్పలకి పేర్లు ఉన్నాయన్న విషయం వాళ్ళకు తెలియదు. వాళ్ల భాష లోకమంతా ఉండదు. మరో సంస్కృతి, మారో జీవన విధానం ఎలా ఉంటుందో అప్పటికి వాళ్లకు తెలియదు. ఇవన్నీ తెలుసుకుందామన్న ఆశతో వచ్చిన ఆ అమాయకులకు, వెర్రి వాళ్ళకు ఆ ప్రయాణం మొదట శ్రమ పెట్టినా, తర్వాత ఆ ప్రయత్నం సార్థకమైంది అనిపించింది. వాళ్ళు ఎప్పుడూ చూడని ఆ ప్రాంతం చూసి, లోకం ఇంత పెద్దదా అన్న ఎరుక కలిగింది. ఇక ప్రశ్నలే ప్రశ్నలు. కొండదాసులాగా జిజ్ఞాస కలిగిన తరం అది.

మల్లదాసు పెద్దగా నవ్వి “ఈ మాత్రానికేనా. మీకు తెలియాల్సిన లోకం ఇంకా ఎంతో ఉంది. అది మీకు అన్నీ నేర్పుతుంది. ఈ వెలుగు ప్రయాణిస్తుంది మీ శరీరం మీదకు కాదు, శిరస్సులోకి”

అంతా అబ్బురంగా చూశారు. అందరిని వెంట తీసుకొని వచ్చి నక్షత్రం ఒడిలో చేర్చి మళ్లీ వెళ్లాడు. మరిన్ని ప్రాంతాలు తిరగడం మొదలుపెట్టాడు. అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఎంతోమందిని తీసుకొచ్చి నక్షత్రం ఒడిలో చేరుస్తున్నాడు. బిడ్డల ప్రభ చూసి కన్నవాళ్లు మురిసిపోయారు. నక్షత్రం తిరిగి తన వెలుగు రేఖలకు జీవం పోసుకుంది. మరింత దేదీప్యమానంగా వెలిగింది. మల్లదాసు “హమ్మయ్య! నక్షత్రాన్ని బతికించాను” అనుకున్నాడు.

కానీ మల్లదాసు ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం వెలుగు విస్తరిస్తుంది. అతను ఊరంతా తిరిగేసి వెళ్ళినాక ఆ రాత్రి వెలుగు అలాగే ఉంది. పైగా రోజురోజుకీ వెలుతురు పెరుగుతోంది కాబట్టి రాత్రుళ్ళు కూడా పగలులా కాంతివంతంగా ఉంది. దాంతో ఊర్లో జనానికి కొత్త సమస్య వచ్చి పడింది. వాళ్ళకు కళ్ళు మూసుకున్నా, కళ్ళముందు లాంతరు తగిలించినట్టుంది. కళ్ళు ఆ వెలుగును తట్టుకోలేక అందరికీ కలత నిద్రయింది. రోజులు గడిచేకొద్దీ నిద్దరలేక అంతా అయోమయంగా ఉంది. ఊర్లో అందరికీ అదే పరిస్థితి. ఎవరికీ కునుకు పడటం లేదు. ఆ నిద్రలేమి అందరిలోనూ జనసత్వాలను లాగేస్తున్నట్టు ఉంది. ఈ వింత ఏంటో! దీని సంగతేంటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆరోజు రాత్రి మల్లదాసు రావడం, అతనివెంట వెలుగు రావడం చూసి జనాలకు వెర్రి పుట్టించింది. కొండదాసును ఆపి “అరేయ్ దాసు, ఏమిటి ఆ వెలుగు?” అన్నారు. అతను ఏమి మాట్లాడలేదు.

“నీవల్ల మాకు నిద్ర కరువై అల్లాడుతున్నాం. అసలు ఇంత వెలుగును ఎక్కడ్నుంచి తెస్తున్నావురా?” గట్టిగా నిలదీశారు. అయినా నోరిప్పలేదు. “చాలా రోజులుగా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు! తెలిసి చేశావో, తెలియక చేసావో, ఆ వెలుగును మాత్రం వెంట తీసుకొనిరాకు” పెద్దమనిషి అన్నాడు.

“దాన్ని ఆపడం నాకు సాధ్యంకాదు”.

వాడి సమాధానానికి అందరికీ ఒళ్ళు మండింది. పళ్ళు నూరారు. ఆ రహస్యమేంటో తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు. అతణ్ని ఏమీ అనకుండా కాని వాడా వెలుగును ఎక్కడి నుంచి తెస్తున్నాడో చూడాలని బయలుదేరారు.

*

ఆ గుంపు అతని వెనకాలే వెళ్లారు. అతని ఇంటి సమీపానికి వచ్చాక, అర్ధరాత్రి పూట అగ్నిగోళంలాంటి వెలుగును చూసి మూర్చ పోయినంత పనైంది. అంతెత్తున ఉన్న ఆ తెల్లటి నక్షత్రాన్ని చూసి దిమ్మెరపోయారు. ఆ ఓడిలో ఎంతమంది పిల్లలు ఆడుకోవడం వాళ్లకు భయం పుట్టించింది. కనిపించిన చెట్టును, పుట్టను పేర్లు పెట్టి పిలవడం. కనిపించని నక్షత్రాలను లెక్కపెట్టడం. సృష్టిలో ప్రతిదీ వాళ్లకు అర్థం అవడం. నిజాలు మాత్రమే గ్రహించడం రకంగా భయం పుట్టించింది. సాధారణమైన వాళ్ళు ఆరోజు ఎందుకో అసాధారణమైన మనుషులుగా తోచారు. వాళ్ళనలా మార్చింది ఆ నక్షత్రమే. వాళ్లు నేర్చుకున్నది వాళ్ళ నాలుకల మీద నుంచి తుడిచేయాలి. వాళ్లు ఏమి తెలుసుకుంటే మనకు ప్రయోజనమో అదే వాళ్లకు నేర్పాలి. మరి ఎవరి మీదా ఈ వెలుగుధార కురవకూడదు.. అంతా కళ్ళతోనే కూడబలుక్కున్నారు.

“ఒరేయ్ మల్లదాసు” గట్టిగా కేకేశారు.

అతను నింపాదిగా వచ్చాడు.

“ఈ నక్షత్రం సరాసరి నీ ఇంటి మీదనే ఎందుకు పడింది రా?” అన్నాడు నాయకుడు దండపతి.

“మా నాన్న దాన్ని రమ్మని పిలిచాడు.”

“వాడు పిలిస్తే పైనుంచి రాలి పడిందా! పడితే పడ్డది. దానివల్ల మాకు నిద్ర కరువైంది. దాన్ని తీసుకెళ్లి ఏ నదిలోనో పడేయి” దండపతి.

“అట్లా తీయడం కుదరదు. నేను తీయను” మల్లదాసు.

ఛత్, నేలను గట్టిగా తన్నాడు దండపతి. మల్లదాసును ఉరిమి ఉరిమి చూస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. మిగతా వాళ్ళంతా అతని వెనకాల నడిచారు. “రండి, దీన్ని ఎత్తి అవతల నదిలో పడేద్దాం” అని, రెండు వైపులా పట్టుకొని దాన్ని లేపడానికి ప్రయత్నించారు. అందరూ కలిసినా, అంత బలం ప్రయోగించినా నక్షత్రం లేవడంలేదు. అలా ఎంతసేపు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు. అందరూ చెమటలు కక్కి, నిరసించి ఏం చేయాలా! అని ఆలోచనలో పడ్డారు.

పెద్దమనిషి దండపతికి తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. ఎదురుగా ఉన్న మట్టిగుట్ట వైపు చూశాడు. “ఏ వస్తువునైనా తీసివేయడం కష్టమైనప్పుడు మూసివేయడమే సరైన మార్గం”

“ఇంత పెద్ద వస్తువును ఎలా మూసేస్తాం!” అందరూ ముకుమ్మడిగా అన్నారు.

నాయకుడు ఓమారు నవ్వి “రండి” అని పలుగు, పారలతో గుట్ట దగ్గరికి వెళ్లి మట్టితవ్వడం ప్రారంభించాడు. మిగితా వాళ్ళు సాయం చేశారు. పలుగు దెబ్బకి నేల పగిలి, దానికింద పురాతన విగ్రహాల శిథిలాలు కనిపించాయి. అంతా ఆశ్చర్యపోయి చూశారు. దాంతో మరింత తవ్వటం మొదలుపెట్టారు. వందల ఏళ్లక్రితం చెక్కిన శిల్పాల శిధిలాలు బయట పడుతున్నాయి. కొన్నిటికి చేతులు పోయి, కాళ్లు పోయి, ముక్కు, మూతి కొట్టుకుపోయి అదోరకంగా ఉన్న శిల్పాలు. ఒక్కొక్క విగ్రహం వెనక ఒక్కొక్క పురాణం ఉంది. వాటి గురించి తరాలుగా వింటూనే ఉన్నారు. అవే తమకు అక్కరకు వస్తాయని వాళ్ళు ఊహించలేదు. ఎంతో ఇష్టంగా వాటిని ఎత్తుకొని వరుసగా ఆ మల్లదాసు ఇంటి వైపు నడిచారు. వానర సైన్యంలాగా ఒక్కొక్క ప్రతిమనీ ఎత్తుకొని వరుస కట్టారు. వెళ్లి వెలుగులు చిమ్మే ఆ నక్షత్రం మీద వేసి, దాన్ని కప్పేయడం మొదలుపెట్టారు. ఒక్కో విగ్రహం దానిమీద పేర్చేకొద్దీ వెలుగు హరించుకుపోయింది. వందల శిథిలాలు దానిమీద శవాన్ని కప్పినట్టు కప్పారు. ఆ శిథిలాల మీద వాళ్ల వేలిముద్రలు చాలా బలంగా కాషాయ రంగులో పడ్డాయి. వెలుగు పూర్తిగా ఆగిపోయింది. తలుపులు మూసినట్టు వెలుగు అంతా విగ్రహాలు వెనుక బందీ అయింది. ఇందాకటి వరకు దివ్యంగా కనపడ్డ నక్షత్రం ఇప్పుడు కైలాస శిఖరమంత రాతి కొండలా ఉంది. చుక్క వెలుగు లేదు. జనాలంతా చెమట తుడుచుకొని మల్లదాసుకి బుద్ధి చెప్పామన్న సంతృప్తితో వెళ్లిపోయారు.

చుట్టూ ఉన్న పిల్లలు చెట్టూపుట్టలు, విశ్వ వింతలు వదిలేసి, ఆ విగ్రహాల పేర్లు పలకటం, వాటి చరిత్రలు వల్లె వేయడం మొదలుపెట్టారు.

ఊరు యర్రగొండ పాలెం, ప్రకాశం జిల్లా.  కథా రచయిత, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్.  నాగార్జున యూనివర్సిటీలో M.A. (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనకేషన్) చేశారు. తెలుగు వెలుగు, బాల భారతం పత్రికల్లో కొంతకాలం ఆర్టిస్ట్ గా పని చేశారు. కథలకి, పుస్తకాలకి ముఖచిత్రాలు గీసారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా, సినిమాల్లో రచయితగా పని చేస్తున్నారు. ఇప్పటికి 13 కథలు, కొన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి.  తన కథ 'కేరాఫ్ బావర్చి' కథా సాహితీ వారి ' కథ19 ' లో వచ్చింది. మంచి పేరు తెచ్చింది.

Leave a Reply