నంబూరి పరిపూర్ణ నవలలు – దళిత దృక్పథం

నంబూరి పరిపూర్ణ ప్రధానంగా కథ రచయిత్రి అయినా నిజానికి ఆమె సృజన సాహిత్య ప్రస్థానం లో తొలి రచన నవలిక. అదే ‘మాకు రావు సూర్యోదయాలు’. 1985 ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది. మళ్ళీ ముప్ఫయ్ నాలుగేళ్లకు ‘పొలిమేర’ అనే నవల ప్రచురించింది ( నవంబర్ 2018) పరిపూర్ణ. ఒకరకంగా మాకు రావు సూర్యోదయాలు నవలికకు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిగా ఆమె పొందిన అనుభవాలే ముడిసరుకు. ఈ నవలలో స్త్రీ పాత్రలు తారాదేవి, హేమలత ఇద్దరూ స్త్రీ సంక్షేమ శాఖ ఉద్యోగులే. తారాదేవి స్త్రీ సంక్షేమ విస్తరణాధికారి కాగా హేమలత బాలసదనం సూపరెండెంట్. హేమలత ప్రారంభంలో కనిపిస్తుంది కానీ కథ అంతా తారాదేవి కేంద్రంగానే విస్తరించింది. విధి నిర్వహణలో హేమలత నిజాయితీ బాలసదనాన్ని క్రమబద్ధంగా నడపాలనే ద్రుష్టి, పిల్లల పట్ల బాధ్యతగా ఉండటం చెప్పబడినాయే కానీ బాలసదనం నిర్వహణ తీరు తెన్నులు ఈ నవలేతి వృత్తంలో భాగం కాలేదు.

పంచాయతీ సమితి పరిధిలో విస్తరణాధికారిగా తారాదేవి తన ఉద్యోగాన్ని, స్నేహాలను స్వప్రయోజనాలకు వాడుకొనటమే చూస్తాం.సంపాదించటం, పోగెయ్యటం మీద యావ ఎక్కడినుండి ఎలా వచ్చిందో కానీ తారాదేవి జీవితపు తీరును, పనితీరునూ కూడా ప్రభావితం చేసినవి అవే . తనకన్నా ఇరవైఏళ్లు పెద్దవాడైన భూస్వామి పాపిరెడ్డి తో ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తూ ఒక బిడ్డ తల్లి అయింది. పొలమూ, నగలు ఖరీదైన చీరెలు, వస్తువులు సమకూర్చుకొన్నది. వడ్డీ వ్యాపారాలు, ఉద్యోగ అధికారాన్ని బట్టి లాగే లంచాలు ఆమె జీవితంలో భాగం.స్త్రీ సంక్షేమం పేరుమీద ప్రజల సొమ్ము దండు కొనటానికి ఉద్యోగ హోదాను వాడుకొంటున్న ఆమె వ్యవహార సరళినే కాదు, ఆమె పని ప్రాంతమైన సమితి పరిధిలో ప్రజాపాలనా వ్యవస్థ ఎంత పతనమైందో కూడా ఈ నవలికలో చిత్రించింది పరిపూర్ణ.

తారాదేవి వడ్డీ కి తిప్పే డబ్బు పంచాయితీ సమితి నుండే వస్తుంది. సమితి పరిధిలో సన్నకారు రైతులకు, చిన్న పరిశ్రమ దారులకు ప్రభుత్వం ఇచ్చే రుణాలు ఉద్యోగులను లోబరచుకొని పాపిరెడ్డి కైవసం చేసుకొనే డబ్బునే ఆమె వడ్డీలకు తిప్పి ఆర్జిస్తుంటుంది. సమితి ఆఫీసుకు మేనేజర్ గా వచ్చిన శేషగిరి తోడ్పాటుతో విచ్చలవిడిగా సంపాదించింది. బాల్వాడీలలో, కుట్టు సెంటర్లలో టీచర్ల నియామకంలో తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని కొత్తగా నియమించబడే ప్రతి టీచరు మొదటి నెల జీతం తనకు ఇచ్చేట్లు ఏర్పాటు చేసుకొనటం, ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టె సందర్భాలలో కమీషన్లు గిట్టుబాటు అయ్యేట్లు బేరసారాలు జరపటం, తన ప్రాబల్యాన్ని పెంచుకొనటానికి మహిళల,మహిళా సంఘాల ఉమ్మడి అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులను, ప్రొత్సాహకాలను మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులుగా వుండే ఉన్నతవర్గాల స్త్రీల ఖాతాలలో జమ అవుతుంటే చూస్తూ ఊరుకోవటం ఆమె అక్రమార్జన విధానాలలో భాగమే. అంతకు మించిన నేరం కంచే చేను మేస్తున్న చందంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంస్థలలో ఆశ్రయం తీసుకొంటున్న బాలికను ప్రలోభపెట్టి స్వప్రయోజనాలకు వాడుకొనటం … చీకటి గుయ్యారాలలోకి తోసెయ్యటం. బాలసదానంలో ఆశ్రయం పొంది చదువుకొంటున్న అనాధ బాలిక శ్యామల పట్ల జాలిపడి తన ఇంటికి సెలవులకు పిలిపించుకొని … నేనే చదివిస్తా …పెళ్లిచేసి పంపుతా అని ప్రలోభపెట్టి, రుచికరమైన తిండికి, అలంకరణలకు అలవాటు చేసి చివరకు తన ఇంటి పనులు చేసి పెట్టే మనిషిగా స్థిరపరచిన తీరు అది. అంతకన్నా ఘోరం ఇంట్లో పనులన్నీ చేస్తూ తిరుగుతున్న శ్యామలను పాపిరెడ్డి ప్రలోభపెట్టి లైంగిక సంబంధం ఏర్పరచుకొన్నాడని తెలిసాక ఆ అమ్మాయి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు. సరైన తిండి, ఓదార్పు ఇయ్యకుండా పదహారు పదిహేడేళ్ల పిల్లను ఒంటరి దుఃఖానికి వదిలి వేసిన తీరు.

అది శ్యామలను ఆ ఇల్లువదిలి పోయేట్లు చేసి కూలీ చేసుకొనే పరిస్థితికి అక్కడినుండి పెళ్లి చేసుకున్నవాడు వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిదై చివరకు బతకటానికి రోడ్డు పక్క శరీరం అమ్ముకొనే స్థితికి నెట్టింది. స్త్రీ సంక్షేమానికి బాధ్యతవహించవలసిన ఉద్యోగంలో వున్న తారాదేవి కి స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అమలవుతున్న సామాజిక క్రౌర్యం ఉపన్యాస విషయమే అయింది కానీ అమలు చేయవలసిన అంశం కాలేకపోయింది. లోపలి మనిషిగా నంబూరి పరిపూర్ణ ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ విధానంలో, దానిని అమలు చేయవలసిన ఉద్యోగ వర్గంలో పేద దళిత స్త్రీల భద్రత, అభ్యుదయం అన్న కోణం విస్మరించబడిందని, స్త్రీ శిశు సంక్షేమానికి కేటాయించబడిన నిధులు ఉద్యోగవర్గాలకు, మహిళల అభివృద్ధికి నడుం కట్టామని చెప్పుకొనే ఉన్నత ధనిక వర్గ స్త్రీలకు ఆదాయవనరుగా మారి పోయిందని ఏదైతే అనుభవం నుండి, పరిశీలన నుండి గ్రహించిందో దానిని నిరసన స్వరంతో ఇతివృత్తంలో భాగం చేసింది. అనాధలు, ఒంటరులు అయిన శ్యామల లను వాడేసుకొంటు తొక్కేసుకొంటూ సాగిపోతున్న మహిళా సంక్షేమ స్వభావం ఏమిటో అర్ధం చేసుకొమ్మని సూచించింది. ఆ రకంగా చూసినప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందవలసినవాళ్లకు అందకుండా చేస్తున్న ఉద్యోగవర్గపు స్వప్రయోజనా పరత్వాన్ని విమర్శకు పెట్టటమే ఈ నవలిక ప్రయోజనం గా కనబడుతుంది.

2.

పొలిమేర దళిత జనాభ్యుదయం వస్తువుగా ఉన్న నవల. దళిత అస్తిత్వ చైతన్యం తెలుగు సమాజంలో ఒక సమష్టి శక్తిగా ఆవిష్కృతమైన ఈ గత ముప్ఫయ్ ఏడేళ్ల కాలంలో సాహిత్య వస్తు దృక్పథాలలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఈ చారిత్రక సంచలన సందర్భాలనుండి దళిత సమస్యను తనదైన దృష్టితో సంబోధిస్తూ నంబూరి పరిపూర్ణ వ్రాసిన నవల ఇది. ఉదయం లేచింది మొదలు భూస్వాముల, ఆసాముల ఇంటికి, పొలానికి చాకిరిచేస్తూ పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేని స్థితిలో వాళ్ళ చదువుల కోసం తల్లులు పడే ఆరాటం దగ్గర మొదలై దాని ఫలితంగా చదువులలో ఎదిగివచ్చిన ఇద్దరు దళిత యువకులు తమ చదువును, ఉద్యోగ హోదాలను దళిత పేద వర్గాల సంక్షేమానికి ఉపయోగించే క్రమం ఎంత సుందరమో నిరూపించటంగా సాగిన నవల ఇది.

శ్యామ్ సుందర్ కలెక్టర్ అయి వచ్చాక అతను చేపట్టవలసి వచ్చిన పని 1973 లో పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన భూసంస్కరణల చట్టాన్ని అమలు చేసే కార్యక్రమం. దీనికి ముందు శ్యామ సుందర్ హైస్కూల్ చదువు కాలం నుండి ఇంటర్, బిఎ చదివి ఐ ఏ ఎస్ లో సెలెక్ట్ అయి శిక్షణ పొంది సబ్ కలెక్టర్ గా చేరి జాయింట్ కలెక్టర్ అయి కలెక్టర్ గా పదోన్నతి పొందే వరకు పదిహేనేళ్ల కాలం ఉంది. తరువాత కలెక్టర్ గా సంస్కరణలు చేపట్టి పని చేసిన కాలపు అసలు కథ నడిచిన కాలం పది పన్నెండు ఏళ్లయినా ఉంటుంది. 1973 కు వెనుక పదిహేను సంవత్సరాలు అంటే 1958 నాటికి నవలలో కథ మొదలైనట్లు. తరువాత పది పన్నెండు ఏళ్ళు అంటే 1985 వరకు కావాలి.

1947 స్వాతంత్య్రం తరువాత భారతదేశ నవనిర్మాణానికి ప్రభుత్వం రచించిన పంచవర్ష ప్రణాళికలు,గ్రామీణ అభివృద్ధికి రూపొందించిన జాతీయ అభివృద్ధి పధకాలు, కార్యక్రమాల అమలుకు బ్లాక్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల పేరుతో( జాతీయ అభివృద్ధి విస్తరణ సంస్థ ) సిద్ధం చేయబడిన వ్యవస్థలను పేర్కొని స్థూల స్థాయిలో నవల ఇతివృత్తానికి నేపథ్యం సమకూర్చింది రచయిత్రి. ఈ అభివృద్ధి వ్యవస్థలు 1952 ఏర్పడ్డాయని చెప్పిన దాని బట్టి నవలలో కథ ఆ తరువాత మొదలైనట్లు. జాతీయ అభివృద్ధి విస్తరణ సంస్థ పరిధిలో వుండే ఒక గ్రామాన్ని నమూనా గా చేసి గ్రామీణ అభివృద్ధికి జరగాలని ఉద్దేశించబడిన పనులు ఏమిటి? అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి ? అందుకు ఉన్న అవరోధాలు ఏమిటి? వాటిని సంబోధించి పనిచేయటం ఎట్లా మొదలైన ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే క్రమంలో ఈ నవలలోని ఇతివృత్తం అభివృద్ధి చెందింది.

ఈ నవలలో ఆ గ్రామం పేరు నంది గ్రామం. అది భౌగోళికంగా గుర్తించదగినదా? కల్పితమా అన్నది వేరే సంగతి. జాతీయ అభివృద్ధి విస్తరణ సంస్థ లో క్షేత్రస్థాయిలో పనిచేయవలసిన విలేజి లెవెల్ వర్కరుగా అవధాని అనే పాత్రను ఆ గ్రామము లోకి ప్రవేశ పెట్టి, విధులకు నిబద్ధుడైన ఉద్యోగిగా అతను గ్రామీణ రైతులకు కొత్త వ్యవసాయ విధానాలను పరిచయం చేయటం, యువజన సంఘాలను ఏర్పరచి అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళను భాగస్వాములను చేయటంవంటి పనులు నిర్వహిస్తున్న విషయం చెప్పి ఆ పరిధి లోనే దళిత సమస్యను కేంద్రంలోకి తీసుకొని రావటం ‘హరిజన దినోత్సవం’ నిర్వహణ పరిణామాల క్రమాన్ని ఇతివృత్తంలో భాగం చేయటం ద్వారా రచయిత్రి చేయగలిగింది.

గాంధీ మరణించిన 30 వతేదీ నాడు ప్రతినెలా బ్లాక్ పరిధిలోని ఏ గ్రామంలోనైనా నిర్వహించే ‘హరిజన దినోత్సవం’ నంది గ్రామం లో నిర్వహించటానికి నిర్ణయం జరిగింది. అందులో భాగంగా చేయటానికి నిర్ణయించిన పనులు రెండు. ఒకటి దళిత వాడ లో పరిశుభ్ర గృహాల పోటీ . రెండవది దళితుల చేతి వంటను గ్రామస్తులంతా కలిసి కూర్చుని తినటం, దళితుల దేవాలయ ప్రవేశం. మొదటి కార్యక్రమం కేవలం దళిత వాడకు సంబంధించింది కనుక సజావుగా సాగిపోయింది. సహపంక్తి భోజన కార్యక్రమానికి ఇబ్బందులు ఏమీ రాలేదు. బహుశా ఇష్టం లేని వాళ్లకు రాకుండా వుండే అవకాశం వల్ల కావచ్చు. కానీ హరిజన దేవాలయ ప్రవేశం సమస్యే అయింది. గుడి ధర్మకర్త, ఊరిలోని మోతుబరులు కలిసి గుడి తెరిచి పూజ చేయవలసిన పూజారిని తప్పించి దళితులతో సహా గ్రామ సర్పంచ్ ను కలుపుకొని బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ నుండి ఉద్యోగుల వరకు మూసి తాళం వేసిన గుడి తలుపుల ముందు పడిగాపులు పడేట్లు చేశారు. అధికారుల పట్టుదలతో పూజారిని పిలిపించినా గర్భ గుడి దాపులకైనా వెళ్ళ కుండానే దళితులు మండపంలో నిలబడి హారతి కళ్ళకద్దుకొని వెళ్లిపోయారుకానీ శఠగోపం, ప్రసాదం వంటి దేవాలయ సంప్రదాయాలేవి వాళ్ళ పట్ల పాటించబడలేదు. సరిగదా మరునాడే మాలపల్లికి నిప్పంటించి ఒక కుంటి ముసలివాడి ప్రాణాలు, చంటి బిడ్డతో సహా ఒక పురిటాలు ప్రాణాలు పొట్టన బెట్టుకున్నారు. గుళ్లో కాలు పెట్టి ఫలితంగా నెత్తి మీద నీడను పోగొట్టుకొన్న దళితులు ఆ విషయం పోలీసు స్టేషన్లో రిపోర్ట్ చేసి బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసరు ను కలిశారు. ప్రారంభంలో ఎంతో నిజాయితీగా దళితుల పట్ల సానుభూతితో పనిచేసిన పోలీసులు, సంబంధిత అధికారులు అందరూ రాజకీయ నాయకులు, ఎం ఎల్ ఏ లు, మంత్రులు మోతుబరుల పక్షాన జోక్యం చేసుకొనటంతో మెల్లగా జారుకున్నారు. కేసు విచారణ లేదు. బాధితులకు న్యాయం లేదు. ఆ రకంగా ప్రభుత్వం సంకల్పించిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన హరిజనాభ్యుదయానికి దానిని అమలయ్యేట్లు ప్రజల పక్షాన పనిచేయవలసిన ప్రజాప్రతినిధులు, మంత్రులే అవరోధంగా ఉన్నారని రచయిత్రి సూచించింది.

ఇక ఇటువంటి పరిస్థితులలో భూవసతి లేక, కూలీ పనుల మీద ఆధారపడి బతికే దళితులకు రోజూ ఇంటిల్లిపాది పొట్టగడవటమే ఒక సమస్య అవుతుంటే పిల్లలను చదువులకు వేరే ఊళ్ళు పంపే అవకాశమే లేదు. ఈ పరిస్థితులలో పిల్లల చదువులకోసం ఆరాటపడిన దళిత తల్లులు కోటమ్మ. రేణుకమ్మ. ఐదో తరగతితో ఆపేసి తండ్రితో పాటు తట్టలు మోయటానికి కూలీకి పోతున్న కొడుకును క్రెస్తవ మతంలోకి మారైనా సరే చదువుకు పంపాలి అని కోటమ్మ నిర్ణయానికి రావటంతో కొడుకు ముత్యాలు జేసుదాసు అయినాడు. డాక్టర్ అయినాడు. ఆసుపత్రి సేవలలో కుదురుకొన్నాడు.

జేసుదాసు హైస్కూల్ చదువు ముగించుకొని కాలేజీ లో చేరేనాటికి రేణుకమ్మ కొడుకు శ్యామ సుందర్ ది కూడా అయిదో తరగతి తో చదువు ఆపి కూలి పనులకు వెళ్ళవలసిన పరిస్థితే. రేణుకమ్మ కొడుకు చదువు గురించిన ఆరాటాన్ని కోటమ్మ దగ్గర వెళ్లబోసుకొని ఆమె కొడుకు మార్గంలో తన కొడుకు కూడా చదువుల బాట పట్టాలని ఆశపడుతుంది . అయితే క్రైస్తవానికి మారటం మాత్రం చేయలేనంటుంది. గ్రామీణ అభివృద్ధి పథకాల అమలుకు క్షేత్రాన్ని సిద్ధం చేయవలసిన విలెజ్ లెవల్ వర్కర్ మోహనరావు చెప్పగా విన్నాను అంటూ ప్రభుత్వం బీద, దళిత, వెనుక బడిన కులాల పిల్లల చదువు కోసం సదుపాయాలు చేస్తున్నదని చెప్పి మర్నాడు ఆయనను కలిసి తెలుసుకుందాం అని చెప్పింది. అన్నట్లే తీసుకువెళ్ళింది. కావలసిన అప్లికేషన్ ఫారాలు తెప్పించి కులం సర్టిఫికెట్, ఆదాయపు సర్టిఫికెట్ సమకూర్చి శ్యామ సుందర్ ను అతనితో పాటు మరో పది మంది నందిగం గ్రామ పిల్లలను బడులలో, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చేర్పించాడు మోహన రావు. అలా హైస్కూల్ బయటపెట్టిన శ్యామ్ సుందర్ కలెక్టర్ అయ్యాడు.

దళిత బడుగు బలహీన వర్గాలపిల్లల చదువుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు కోటమ్మకు ఎలా తెలిసాయి ? రేణుకమ్మకు ఎలా తెలియకుండా పోయాయి? కోటమ్మ కొడుకు అప్పటికి హైస్కూల్ చదువు ముగించాడు. వాడి చదువుకొనే మార్గాల గురించి మొదట్లో క్రెస్తవ బోధకులు చెప్పిన మాటలు, బడికి వెళ్లి స్వయంగా చూసి అక్కడి వసతి సౌకర్యాలు తెలుసుకొని రావటం ఇవన్నీ ఆమె ప్రపంచ జ్ఞానాన్ని పెంచాయి. ఎవరు ఏది చెప్పినా మనకు ఉపయోగపడగలది ఏముంది అన్న దృష్టితో వాడిని జాగ్రత్తగా వినటం అలవాటైన లక్షణం వల్లనే మోహనరావు ఎక్కడో చెప్తున్నా మాటలు చెవిన వేసుకోగలిగింది. అవసరంలో గుర్తు చేసుకొని రేణుకమ్మ కు చెప్పగలిగింది. పేద దళిత నిరక్షరాస్య వర్గాలలోకి వారికి మంచి చేసే విధానాలగురించిన తెలివిడిని, ఉపయోగించుకొనే చైతన్యాన్ని కలిగించవలసినది ప్రభుత్వమే. విలేజ్ లెవెల్ వర్కర్స్ పని అదే. మోహన రావు వంటి ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతతోనే ఉంటారు. కానీ అదే సమయంలో లబ్ధిదారులు తెలుసుకొనే ఆసక్తితో కూడా ఉండాలి. ఈ ఆసక్తి కోటమ్మ లో ముందుగా మేల్కొన్నది కనుకనే మోహన రావు మాటలకు చెవి ఒగ్గింది. రేణుకమ్మకు కొడుకు చదువు ఆరాటం ఎంత వున్నా అప్పటికి ఆమె సమాజం కోటమ్మ మాత్రమే. కోటమ్మ అనుభవం తనకు ఉపయోగపడగలదేమో అన్న ఆశతో వెళితే ఆ అనుభవం నుండే ఆమె రేణుకమ్మను మోహనరావు దగ్గరకు తీసుకువెళ్ళింది.

జేసుదాసు, శ్యామ్ సుందర్ వంటి దళిత బిడ్డలు ఎందరో ఎన్నో అవరోధాలను దాటుకొంటూ పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగాలలోకి వచ్చినా అంటరానితనం అనేది వెంటాడుతూనే ఉండటం ఒక సామాజిక విషాదం. శ్యామ సుందర్ పత్రికలో చదివిన ఒక వార్త గా దానిని స్పృశించి వదిలింది రచయిత్రి. ఆర్డీవో గా పని చేస్తున్న వ్యక్తికి ఇల్లు అద్దెకిచ్చిన యజమాని అతను దళితుడు అని తెలిసి తక్షణం ఇల్లు ఖాళీ చేయించిన ఉదంతం అది. అది చదివి కలెక్టర్ శ్యామ్ సుందర్ తీవ్ర మనస్తాపానికి, నిర్వేదానికి గురి అయ్యాడు అంటే అది ‘అంటరానితనం నేరం’ అన్న చట్ట స్థాయి మాట ను బేఖాతరు చేయగల మనువాద సామాజిక సంస్కృతి ముందు చట్టాలను అమలు చేయవలసిన అధికార వర్గ నిస్సహాయతకు సూచనే.

3.

కలెక్టరుగా శ్యామ్ సుందర్ అమలు చేయవలసిన భూసంస్కరణ చట్టం అమలు ఈ నవలలో అసలు కథాంశం. అయినా నంబూరి పరిపూర్ణ ఆ చట్టం అంతకు ముందరి ఆంధ్ర దేశ చరిత్రలో అటు తెలంగాణాలోనూ, ఇటు సర్కారు జిల్లాలోనూ భూమి కోసం జరిగిన పోరాటాల పరిణామంగా భావించినట్లు కనబడుతుంది. తెలంగాణ రైతాంగ పోరాటం మొదలు కొని 1970 ల నాటికి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంగా నక్సల్ బరీ మార్గం పట్టిన ఉద్యమాలను స్థూలంగా ప్రస్తావిస్తూ వాటిలోని “సహేతుకత, న్యాయ నైతికతలు పివి నరసింహారావు గారి విశాల దృష్టిని ఆకట్టుకున్నాయి. బహుకొద్దిమంది అగ్రవర్ణాల చేతుల్లో బంధింప బడి వున్న వందల వేల ఎకరాల భూములకు పరిమితులూ, పర్యవసాన మిగులు భూముల్ని భూమి లేని నిరుపేదలకు పంచె అనుమతులు చట్ట బద్ధం చేసే ప్రక్రియకు పూనుకొన్నారు”. అని చెప్పటంలో అది కనబడుతుంది. అవి సహేతుకమైనవి, న్యాయమైనవి, నైతికత ఉన్నవి అనుకొనటం కన్నా 1970 నాటికి నక్సల్బరీ శ్రీకాకుళంలో రగిలి తెలంగాణాకు వ్యాపిస్తున్న క్రమంలో ఆ నిప్పు కార్చిచ్చు కాకుండా ఉండటానికి భూసంస్కరణల చట్టం తక్షణ అవసరం అయిందేమో..!? రచయిత్రికి అది తెలియని విషయం ఏమీ కాదు. ఆ చట్టం వచ్చిన వెంటనే వందల ఎకరాలను విడదీసి బినామీ స్వంతదారుల పేర కాగితాలు సృష్టించి పంచటానికి మిగులు భూములే లేవన్న స్థితికి తీసుకురావటం గురించి ప్రస్తావించకుండా ఉండలేకపోయింది. ఈ పరిస్థితులలో భూసంస్కరణల అమలు తీరు ఎంత అన్యాయంగా ఉందో చూపించే విధంగానే ఇతివృత్తం సాగింది.

శ్యామ్ సుందర్ మిగులు భూములు చాలావరకు దేవతా వస్త్రాలు అవుతున్న తీరు గమనించాడని, ప్రభుత్వ భూముల అసైన్మెంట్ గురించి ఆలోచించటం మొదలు పెట్టాడని బంజరు భూముల లెక్కలు తేల్చె సర్వేలు చేయించాడని, వందల ఎకరాలు ఉన్న ఆసాములు కూడా తమ భూములకు ఆనుకొని ఉన్న పది పదిహేను ఎకరాల బంజరును కలిపేసుకొన్న విషయం తెలుసు కొన్నాడని వాటిని కలుపుకొని బీడు బంజరు భూమిని భూమిలేని పేదలకు పంచి పెట్టాలని ప్రతిపాదనలు పంపి ఆమోదం పొంది తన కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకున్నాడని ఆ ప్రకారం భూ పంపిణీ జరిపించాడని రచయిత్రి కథనంలో తెలుస్తుంది. దీని పరిణామాలు ఎలా ఉన్నాయో ఒక ఘటన ద్వారా ప్రదర్శిస్తుంది. రంగాపురంలో సోమయ్య అనే దళిత రైతు ప్రభుత్వం అలా తన కు ఇచ్చిన ఎకరం పట్టాభూమిలో సాగు చేసుకొనటానికి కొడుకుతో వెళ్లి భంగపడిన ఘటన అది.ఆ బంజరు కు ఆనుకొని పెద్ద భూస్వామి భూములు ఉన్నాయి. ముప్పయ్ ఏళ్ళక్రితం బీడు భూమిని సాగుచేసుకొని అనుభవిస్తుంటే పంచటానికి ప్రభుత్వం ఎవరు? తగుదునమ్మా అని దున్నటానికి రావటానికి మీరెవరు అని భూస్వామి అడ్డుకున్నాడు. ఇన్నాళ్లకు స్వతంత్రంగా బ్రతకటానికి అవకాశం లభించింది అన్న ఆనందంలో ఉన్న దళిత రైతు సోమయ్య కొడుకు భూస్వామిని ధిక్కరించి మాట్లాడాడు. ఫలితం పొలంలోకి దిగిన ఆ యువకుడిని రౌడీలా చేతిలో పొలంలోనే కూలిపోయాడు. అది చూసి భరించలేక బాణాకర్రతో రౌడీలను ఎదుర్కొన బోయి తండ్రి కూడా హత్యకు గురి అయ్యాడు.

దళితుల దేవాలయ ప్రవేశ ప్రహసనాన్ని పరిణామాలను, భూపంపిణీ పరిణామాలకు సంబంధించిన ఈ ఘటనను కలిపి చూస్తే దళితులు నిచ్చెనమెట్ల హిందూ కుల వ్యవస్థవల్ల, భూస్వామ్య ఆర్ధిక సంబంధాలలో వర్గ వ్యవస్థవల్ల కూడా పీడితులే, బాధితులే అన్నది స్పష్టం. మనువాద మతమూలాలు, వర్గ సమాజ వైరుధ్యాలు నశిస్తే గానీ అసలైన దళిత విముక్తి సాధ్య కాదు. చట్టాల పరిధిలో, ప్రభుత్వ పధకాల పరిమితిలో అది పరిష్కారం కాదని తెలియటం వల్లనే కావచ్చు ఆ తరువాతి నవలేతి వృత్తాన్ని శ్యామసుందర్, జేసుదాసుల ఆదర్శ వాద వ్యక్తిత్వాల చుట్టూ నిర్మించుకొంటూ పోయింది.

4.

దళితులకు పక్క ఇళ్ళు పధకం గురించి కూడా శ్యామసుందర్ అనుభవ కోణం నుండి కొన్ని ప్రశ్నలను ముందుకు తెచ్చింది రచయిత్రి. కలెక్టర్ గా అతను గ్రామాలూ, దళిత కాలనీలు దర్శిస్తూ లబ్దిదారులతో మాట్లాడుతూ తెలుసుకున్నది ఏమిటి? దళిత కాలనీల ఇళ్ల నిర్మాణం అత్యంత నిర్లక్ష్యంగా చేయబడటం. కనిష్ట సభ్యులు ఉన్న కుటుంబ అవసరాలకైనా సరిపోతుందా లేదా అనే ఆలోచనే లేకపోవటం, ఇళ్ల నిర్మాణానికి ఎంచుకొన్న భూమి సరైంది కాకపోవటం, డ్రైనేజీ వసతి ఊసే లేకపోవటం- అన్నిటినీ మించి దళిత కాలనీల నిర్మాణం మొరొక విధమైన దళిత వదల ఏర్పాటుగా వూరికి దూరంగా ఉండటం. ఈ సమస్యలను పరిష్కరించటానికి అతను చాలా శ్రద్ధ తీసుకొని ప్రళికాలు రచించి ఆధికారిక ఆమోదాలు పొంది పని చేసినట్లు ప్రత్యేకంగా దళితులకు కాకుండా సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన పేద బలహీన వర్గాల వారితో కలిపి దళితులకు గృహ సముదాయాలు నిర్మించేట్లు పధకాలు రూపొందించి అమలు చేసినట్లు ఒక సంస్కారవంతమైన సమాజం కోసం అధికారిగా తనకు ఉన్న అవకాశాలను శ్యామసుందర్ వాడుకొంటున్నట్లుగా వ్రాయటంలో ఉన్నది వ్యక్తి ఆదర్శమే. ప్రభుత్వ వైద్యుడుగా పని చేస్తూ ఆ బాధ్యతలను దాటి దళిత నిరుపేద గ్రామీణ రోగులకు చికిత్స చేయటమే కాక స్వంత డబ్బుతో ఆహారం మందులు అందచేస్తున్నాడన్న వార్త పత్రికలలో చదివి శ్యామసుందర్ అతనిని అభినందిస్తూ ఉత్తరం వ్రాయటంలో పని చేసింది కూడా ఆ వ్యక్తి ఆదర్శమే. అదే జేసుదాసుతో కలిసి నంది గ్రామం అభివృధ్ధి కోసం పని చేసేట్లు చేసింది.

ఆ గ్రామం నుండి చదువుకొని బయటి ఊళ్లలో ఉద్యోగాలు చేసుకొంటున్న యువకులను పిలిపించి గ్రామ అభివృద్ధికి ప్రణాళిక రచించటం అందులో భాగంగా నిరక్షరాస్యతను తొలగించటానికి వయోజన విద్యాకేంద్రాన్ని ప్రారంభించటం, బయట ప్రాంతాలలో పని చేసేవాళ్ళు ఏడాదికి ఒకసారైనా స్వజనుల దగ్గరకు వచ్చి స్వగ్రామంలోని ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని ఊరంతా కలిసి ఉమ్మడి ప్రయోజనాలకు పని చేసే చైతన్యాన్ని పెంచుకొనటం, యువజన సంఘాన్ని ఏర్పరచటం, మహిళా మండలిని ఏర్పరచటం, రహదారుల నిర్మాణం, తాగునీరు సౌకర్యం, బడి, వైద్య శాలల ఏర్పాటు మొదలైన వాటితో ఊరి ప్రజల జీవితాలు బాగుపడటం ఇలా నంది గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా పునర్నిర్మించారు శ్యామసుందర్ జేసుదాసు కలిసి.

నిజానికి ఇవన్నీ ప్రభుత్వం చేయవలసినవి. చేస్తున్నవి. శ్యామసుందర్, జేసుదాసు కలిసి చేసిందేమిటంటే నగరాలకు గ్రామాలకు లింక్ మానవ సంబంధాల ద్వారా బలపడేట్లు చేయటం, సమిష్టి ప్రయోజనాల కోసం అందరినీ ఆలోచించేట్లు చేయటం, ఏకాభిప్రాయానికి వచ్చేట్లు చేయటం. ఇలా గ్రామంలో అభివృద్ధి అనేదానికి పంచాయతీ సమితి, బ్లాక్ డెవలప్ మెంట్ సంస్థలను సంపూర్ణంగా, సమర్ధవంతంగా ఉపయోగించుకోగలిగిన ఎరుక కలిగిన ప్రజల చొరవను ప్రాతిపదికగా చేసి చూపింది రచయిత్రి.

మాకు రావు సూర్యోదయాలు నవలికలో పంచాయతీ సమితులు, బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసు లు అవినీతి లంచగొండి తనం వంటి అరాచక పద్దతులతో కునారిల్లి పోతున్నాయని విమర్శ పెట్టిన రచయిత్రి పొలిమేర నవలలో ఆ విధమైన విమర్శను ప్రధాన కథలో భాగంగా కాక పాత్రల మధ్య సంభషణ రూపంలో భాగం చేసింది. ఐఎఎస్ ఆఫీసర్ల సమావేశ ఘట్టాన్ని అందుకోసమే కల్పించినట్లు కనిపిస్తుంది ట్రైబల్ ఏరియా కు ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఆయన విపరీతంగా అక్రమార్జనలకు పాల్పడి ఆస్తులు సంపాదించి ఆ విషయం బయటపడి సస్పెన్షన్ కు గురయిన సంగతి, దళితుడై వుండి కూడా అతను తనకన్నా వెనకబడిన గిరిజనులను ప్రభుత్వం వాళ్ళకిచ్చే కొద్దో గొప్పో సహాయాలను అందుకోకుండా అడ్డుపడటాన్ని, దోచుకొనటాన్నీ శ్యామ్ ముఖంగా విమర్శకు పెట్టింది. పెద్ద చదువులు, ఉన్నతోద్యోగాలు ఉన్న వ్యక్తులలో పెరుగుతున్న అక్రమార్జన, తాగుడు, స్త్రీలోలత మొదలైన అవినీతి జాడ్యం కేవలం వ్యక్తి పరమైనవి కావు అంటాడు శ్యామ్ సుందర్. పదవులు పొందటం కోసం అధికార పార్టీ నేతలకు లక్షల ముడుపులతో పాటు అమ్మాయిలను ఎరవేసే సంప్రదాయానికి బీజాలు వేసిన ఘనత వహించిన ప్రజాసేవకులు నాయకులు ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నప్పుడు ఉద్యోగి వ్యవస్థ వాళ్లనే అనుసరిస్తుంది అని ఉద్యోగ వ్యవస్థలో అవినీతికి నీతి మాలిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఉన్న సంబంధాన్ని శ్యామ్ చెప్పగలిగాడు. ఈ పరిస్థితి పట్ల ప్రజలలో రగులుతున్న అసంతృప్తి నుండి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం అతనిది.

దళిత విముక్తికి ప్రభుత్వం చేయ తలపెట్టిన పనులు ఏవైనా అసంపూర్ణగా ఆగిపోవటం తప్ప సంపూర్ణ ఫలితాలను ఇచ్చేదిశగా కార్యాచరణను నిర్దేశించటం కానీ, అందుకు అవసరమైన సామాజిక సాంస్కృతిక భావజాలంలో మార్పును తీసుకురావటానికి తగిన వ్యూహ రచన కానీ లేకపోవటం శ్యామ్ అనుభవం. అదే రచయిత్రి అవగాహన. అయినా నంబూరి పరిపూర్ణ అందుకు ఉద్దేశించబడిన ప్రభుత్వ వ్యవస్థలపైన ఆశను వదులుకోకపోవటమే నవలలో చూస్తాం. దళిత సమస్యకు సంపూర్ణ పరిష్కారం సంస్కరణలు, సముదాయింపులు ఇయ్యలేవు అని తెలిసిన మనిషి ఆమె. కంచికచర్ల, చుండూరు, కారంచేడు లాంటి ఘటనలను ఎదుర్కొనటానికి పోరాటమార్గమే సరియైనది కూడా ఆమెకు తెలుస. కానీ విద్యాధిక దళిత యువకులు, ఉన్నతాధికారులు తమతమ మార్గాలలో దళిత జాతిని జాగృతం చెయ్యటానికున్న వున్న అవకాశం, అవసరం గురించి కూడా చెప్పటం తన ధర్మంగా భావించింది ఆమె. ( ఏమిటీ పొలిమేర ? శీర్షికతో వ్రాసిన ముందుమాట ) సమాజాన్నిసమూలంగా మార్చగల ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక పోరాటాలు బలపడటం, రెండు అడుగులు ముందుకు ఒక అడుగు వెనకకు అన్నట్లుగా సాగే దీర్ఘకాలిక ప్రజా పోరాటాల గురించిన ఆలోచన మనసులో పెట్టుకొనే తక్షణ అవసరాలకు, ప్రయోజనాలకు అందుబాటులో ఉన్న వ్యవస్థలను చైతన్యంతో చొరవతో ఉపయోగించుకొనటం గురించి సూచిస్తున్న నంబూరి పరిపూర్ణ ప్రజాస్వామిక శక్తుల విజయంలో, విలువల వ్యాప్తిలో ఉద్యోగవర్గం పాత్ర, మరీ ముఖ్యంగా నూతనంగా ఎదిగి వస్తున్న దళిత విద్యావంతులు ఉద్యోగుల పాత్ర కీలకంగా మారాలని కోరుకొంటున్నదని అర్ధం చేసుకోవచ్చు. అంబేద్కర్ ఆలోచనా విధానం కదలికలు ఈ నవల నేపథ్యంలో కనబడుతుంటాయి.

5.

పొలిమేరలు ఊరికీ ఊరికీ మధ్యనే కాదు, ఊరికీ దళితవాడకు మధ్య, భిన్న కులాలమధ్య, మతాల మధ్య, మనుషుల మధ్యా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పటం కట్టబడుతూనే ఉంటాయి. అవి అసమానత ఫలితమూ, అవమాన కారణమూ అయితే మాత్రం తప్పక రద్దుచేసుకోవలసినవే. వాటిని రద్దుచేయాలన్న ఉద్దేశంతో రూపొందించబడిన పథకాలను అమలుచేసే బాధ్యతను ఉద్యోగవర్గం నిజాయితీగా నిర్వహిస్తే లక్ష్యం నెరవేరుతుందని భావించి ఆ దిశగా ఇతివృత్తాన్ని నడిపిన నంబూరి పరిపూర్ణ అందులో భాగంగానే పొలిమేరల రద్దుకు కులాంతర వివాహాలను ఒక మార్గంగా చూపింది.

ముత్యాలు క్రైస్తవం తీసుకొని జేసుదాసు అయినా అతని మాల మూలం చెక్కు చెదరలేదని అతని పెళ్లి ప్రస్తావన సందర్భంలో తెలుస్తుంది. అతను ఇష్టపడి పెళ్లి చేసుకోదలచిన సహోద్యోగి ఆసుపత్రి నర్సు వేదవతి మాదిగ కావటం అతని తల్లిదండ్రులకు అభ్యంతరకరమే అయింది. మేనరికపు పిల్లని కాదనటం, పోనీ ప్రేమించిన పిల్ల సాటి డాక్టరా అంటే అదీకాకపోవటం, అంతకన్నా ఆమె మాదిగ కావటం వాళ్లకు బాధను కలిగించాయి. అమ్మాయి కులం మనకన్నా తక్కువకులం అని బాధపడటం అవివేకం అంటాడు జేసుదాసు. పై కులాలవాళ్ళకు మాల మాదిగ కులాలు రెండూ నీచమైనవే అంటారానివే. దానికి అవమానపడుతున్న మనం మాదిగలను తక్కువచేసి బాధించటం సరైంది కాదు కదా అని అతను తల్లి దండ్రులకు నచ్చ చెప్పాడు. ఆ రకంగా మాలమాదిగలమధ్య పొలిమేరలు రద్దయి కొత్త జీవిత సంబంధాలు మారాకు వేయటం పరిపూర్ణ ఆశ.

ఇక శ్యామ్ సుందర్ పెళ్లి చేసుకొన్నది బ్రాహ్మణ అమ్మాయి మాలతిని. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో భాగంగా జేసుదాసు వేదవతిని తెలుసుకొన్నట్లుగానే శ్యామ్ సుందర్ కూడా ఇన్స్పెక్షన్ లో భాగంగా శ్రీపురంలోని ఝాన్సీ మహిళా మండలిని దర్శించినప్పుడు అక్కడ టీచర్ గా అన్ని పనులలో చురుకైన పాత్ర వహిస్తున్న మాలతిని తొలిసారిగా చూసి తెలుసుకొన్నాడు. అక్కడి నుండి ఆమెను అభిమానించాడు. ఆ తరువాత స్కూల్ ఉపాధ్యాయురాలిగా ఆమె పని నిబద్ధతకు ముగ్ధుడయ్యాడు. ఆమె అట్లా తనకు కలిగిన ఆత్మీయ భావాన్ని తెలుపుతూ ఆమెకు ఉత్తరం వ్రాసాడు. “ ఈ దేశ సంస్కృతి నన్ను అంటరానివాణ్ణి చేసింది. నాతో జీవితం పంచుకునేందుకు సాహసమెంతైనా అవసరం. కులాలు అంతరించాలన్న సంకల్పమనేది వున్నటువంటి విద్యా వంతులైన యువ శ్రేణులు కనీసం వర్ణాంతర వివాహాలకు ఉద్యమించటం అవసరం – మరి ఇతర పోరాట మార్గాలకు తరల లేకపోయినప్పటికీ “ అన్న మాటలతో తన ఉత్తరాన్ని ముగించాడు. ఒక అగ్రకులపు ఆడపిల్ల కుల కుటుంబ కట్టుబాట్లు తెంచుకొని అతని ప్రతిపాదనకు అంగీకరించటం ఆశకు,ఆదర్శానికి సందేహానికి మధ్య ఊగిసలాటలో స్థిర బిందువుకు చేరటమే. ఒక నిర్ణయానికి రావటంతో పని అయిపోదు. భవిష్యత్ జీవితం ఆరోగ్యకరంగా, ప్రజాస్వామికంగా ఎలా నిర్మించు కోవాలి అన్నవివేకం కూడా ఉండాలి. శ్యామ్ సుందర్, మాలతి అలాంటి వివేకం మేల్కొన్న యువతీయువకులు.

వాళ్లిద్దరూ కులాంతర వివాహం వల్ల తల్లి దండ్రులు సంఘబహిష్కరణను, ఒంటరితనాన్ని ఎదుర్కొనేటప్పుడు పిల్లలు వాళ్ళ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో చర్చించారు. పైకులాలు ఆధిక్య భావజాలాన్ని, నిమ్న కులాలు న్యూనతా భావజాలాన్ని ఒదులుకోకపోతే మళ్ళీ ఆ దాంపత్యాలు అధికార అధీన సంబంధాలుగానే ఉంటాయన్నది ఖచ్చితం. చదువుకొని ఉన్నతోద్యాగాలలో ఉన్న దళిత యువకులను ప్రేమించి పెళ్లాడిన అగ్రవర్ణ స్త్రీలు భర్త వైపు బంధువులతో సంబంధాలకు ఇష్టపడక వాళ్ళను స్వీయ మూలాలకు పరాయీకరిస్తున్నారన్న ఆరోపణ శ్యామ్ సుందర్ ది . దాని కి సంబంధించిన కొన్ని అనుభవాలను శ్యామ్ సుందర్ మాలతితో పంచుకొన్నట్లుగా చెప్పి పెళ్లి ఒక రాజకీయ చర్యగా ఉండటాన్ని గర్హించింది రచయిత్రి. ఈ సందర్భంగా మైదాన ప్రాంతాల పురుషులు గిరిజన యువతులను పెళ్లిళ్లు చేసుకొనటం కూడా ప్రస్తావనకు వచ్చింది. అమ్మాయిల పేర ఉన్న భూములపై అధికారం కోసం,ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న ప్రయోజనాలను స్వాయత్తం చేసుకొనటం కోసం జరుగుతున్న రాజకీయ పెళ్లిళ్లు గా వాటి గురించి మాట్లాడుకొంటారు మాలతి శ్యామ్ సుందర్. కులాంతర వివాహాలలో ఎవరిది పై కులమైతే వాళ్ళ ఆధిక్యత, ఆధిపత్యం చెల్లుబాటు అవుతున్న స్థితి గురించిన హెచ్చరికతో ఉండి వాటిని సాగనియ్యకుండా ఎదుర్కొనే దృఢమైన వ్యక్తిత్వం బాధితవర్గం అలవరచుకోవాలి అని రచయిత్రి అభిప్రాయం. కులాంతర వివాహాలలో సమస్యలు ఎన్నున్నా కుల వివక్షను తగ్గించటానికి ఎదో ఒక మేరకు సాధనాలు అవుతున్నాయి కనుక ఆహ్వానించవలసినవే అని ఆమె దృఢంగా నమ్ముతుంది. దానిని నవలేతి వృత్త గమనంలో నిరూపించింది. తాను అంతకు ముందు వ్రాసిన అనల్ప పీడనం, ‘ఆదర్శాలూ – అన్వయాలూ, ఆధునికతా నీ పేరు అమానుష్యత వంటి కథా ఘటనలను కొద్దీ మార్పులతో పొలిమేర నవల ఇతివృత్తంలో భాగం అవటం కూడా గమనించవచ్చు. ఆ రకంగా పొలిమేర నవల అభ్యుదయవాది అయిన బుద్ధిజీవి చేసిన రచనా ప్రయోగం.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply