ధరణి

అది ఫిబ్రవరి 4, 2023 శనివారం – సాయంకాలం ఏడుగంటల మునిమాపు వేళ. మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని గోదావరి తీరాన ఉన్న తిమ్మాపూర్ గ్రామం.

కంకర రోడ్ మీదుగా ఆ ఊరిలోకి దారి తీసే తొవ్వ పొంట వాతావరణం – దుబ్బల మలుసుకొని పండుకున్న కుక్క పిల్ల లెక్క సద్దుమణిగి ఉంది. ఊరి లోపలికి రాగానే రాయి విసిరేస్తే లేచి తీకునాలు తీస్తూ నడుస్తున్న కుక్క పిల్ల లెక్క గుయ్ గుయ్ మనే టీవీల చప్పుడు వినపడుతుంది.
కొందరు యువకులు మూల మీది దుఖానం దగ్గర మొబైల్ ఫోనుల వెలుతురులో అక్కలు ముక్కలు మాట్లాడుకుంటూ విచిత్రంగా నవ్వుకుంటూ గుమికూడి ఉన్నారు.
వాళ్ళ ముందు నుండే ఆ పూట మందం తిండి గింజలు సామాను కొనుక్కొని, అటు చినిగిన జబ్బ మీది జాకెట్ ని దాచలేక ఇటు కొంగులో సామాను పట్టుకోక తప్పని పరిస్థితుల్లో తల కిందికి వేసుకొని నడుస్తుoది ఒక యువతి.
కొద్ది దూరంలో నిలబడి గస్తీ పోలీసులవలే ఏదో షికారు కోసం ఆలోచన చేస్తున్నట్లు ఉన్న కుక్కల గుంపు.
ఇంకా ముందుకు పోతుంటే ఒక ఇంటి ముందు కూర్చోని ఎవ్వరినో బూతులు తిడుతున్న కండ్లు సరిగ్గా కనపడని బొక్కి నోరు ముసలవ్వ.
గ్రామ పంచాయితీ ఆఫీసు ముందు మందు తాగి అటు ఇంటికి పోలేక, ఇటు కలిసుండే మంది లేక రోడ్ పక్కన బెంచ్ మీద పిచ్చివాని వలె కూర్చొని తల కిందికి వేలాడేసిన ఒక ముప్పై ఏండ్ల యువకుడు.
కెమెరా జూమ్ చేసినట్లు ఇంకా కొంచెం ఊరిలోకి వెళ్తే .., మూలమలుపు మీద మిగతా ఇండ్లకి భిన్నంగా ఇంటి ముందు ఎక్కువ వెల్తురుతో కొంత కోలాహాలంగా ఉన్న ఒక గూనపెంకటి ఇల్లు. ఆ ఇంటిలోపల… “ఇగ ఆపతి కాలమచ్చిన నాడు సూడూ.., ఇగ సంపతి కాలమచ్చిన నాడు సూడు” డుమ్ డుమ్ డుమ్ ..” అంటూ రెండు పాదాల నడుమ అనుగవట్టిపెట్టి దుబ్బు (మృదంగం కన్నా చిన్న వాయిద్యం)ని ఒక వైపు చేతితో ఇంకో వైపు వంక చిటికెన పుల్లతో కొడుతూ “ఏయ్” అని గట్టి గొంతుతో మొదలెడుతూ “హే హే హే .., హే హహే హే .. ” అని ముక్కుతో కొస రాగం తీస్తూ పెద్దేవర కొలుపు కొలుస్తున్నాడు డుబ్బుల కిష్టయ్య.
ఆ డుబ్బు సప్పుడు మధ్యల లయబద్ధంగా ఊపే గుంగుర్ల సప్పుడు అన్ని తీర్ల మనుషుల లోలోపటి విచారాలని ఒక దగ్గరికి తెచ్చి- ఇగ జూసుకో నిన్ను నువ్వు అన్నట్లున్నది. మధ్యమధ్యలో పెద్దేవర కాడవెట్టిన అగ్గిచిప్పలో వేసే ఊదు మైసచ్చీ పొగ ఇల్లంతా కమ్మి ఎనుకటి సంగతులని యాదికి తెచ్చి ముంగట పెడుతున్నది.

డుబ్బుల కిష్టయ్య సగం బొత్త మీదికచ్చినట్లు ఉన్న బనియన్ మీద గుండీలు పెట్టకుండ ఉన్న అంగీ వేసి మోకాళ్ళ దాకా లుంగీతో, పిక్కుటం ఉన్న బియ్యం బత్త లెక్క చెక్క పీట మీద కూర్చొని ఉన్నాడు. నెత్తి మీద వెంట్రుకలు లేకపోవడం వల్ల నూనె ముంత కాయ లెక్క ఉన్నాడు. అతని మెదడుకి బతుక్కి పొంతన లేకపోవడం అతని శరీరములో కన్పిస్తుంది. అతని వయసు యాబై కి పైనే. పక్కనే విస్కీ సీసా – చిన్న గాజు గ్లాస్. రిమ్మ దిగిపోకుండా అప్పుడింత అప్పుడింత మందు గొడుతున్నాడు. అతని కండ్లు ఎర్రగా ఉబ్బి అనేక భావోద్వేగాలతో ఉన్నాయి. అప్పుడపుడు డుబ్బు లయ మధ్యలో ఆపి అతను అతి పురాతన పల్లె వీరగాధలు, అతి సామాన్యులు అలగా జనం కష్టాల నుండి గెలిచివచ్చిన సంఘటనలు – గతం, వర్తమానం భవిష్యత్తులో కలిపి చిత్రమైన జీర గొంతులో పాడుతున్నాడు.

అది నీలం పోచయ్య ఇంట్లో జరుగుతున్న “పెద్దేవర కొలుపు”. అప్పటికే బాటిల్ లో సగం వంతు మందు తాగిoడు డుబ్బుల పంతులు.
కొలుపు మొదలైనంక ఆ ఇంట్లో పండుగ వాతావరణం సొచ్చింది.

ఇంటివాళ్ళు, చుట్టాలు, వచ్చిన మనుషులు – ఆ వాయిద్యం , పాటలతో కలెగలసి ఇంట్లకి బయటకి తిరుగుతున్నారు.
అన్ని దర్వాజాలకి మామిడి తోరణాలు, ఇంట్లో ఎటు నాలుగు అడుగులు వేసినా అడ్డం వచ్చే మొగురాలు, ఇంట్లో పావు మూల మొత్తం కుప్పగా వేసిన అమ్మడానికి ఉన్న పత్తి. కిటికీలో పంట మందు డబ్బాలు, గడాంచే మీద వేసిన వడ్ల బస్తాలు, నడుస్తుంటే పైన తాకే ఉట్టీలు, దండెం మీద పద్ధతిగా వేసిన బట్టలు, ఓ మూలకి టేబుల్ పైన కింద పరచిన బోళ్లు.., అందులోనే అరుగు దగ్గర నాలుగు రోజుల కింద పుట్టిన లేగ దూడ. అది పోసిన మూత్రములో తడిసిన చిన్న చిన్న గొతికెలు, ట్యూబ్ లైట్ వెలుగు సరిపోని చీకటి వెలుగుల నీడలో ఇంటి బయట గీకురుగాళ్ళ అరుపులు, మనుషుల కోలాహలం, ఇల్లంతా కమ్మగా తెల్లకల్లు వాసన గుప్పుమని వింతగా వస్తుంది సాంబ్రాణి పొగతో కలిసి.

బడి డ్రెస్సుల మీదనే ఉండి చలికి కాళ్ళు చేతులు పగిలి ఉన్న ఇంటి పక్కల చిన్న పిల్లలు అటు ఇటు జెండా వందనం రోజు లెక్క చప్పుడు సంబరముతో మనుషుల మధ్య నుండి మొగురాలు దాటుతూ ఒకరినొకరు అందుకోవడానికి ఇంటికి బయటికి గాలిలో ఎగురుతున్నట్లు ఊరుకుతండ్రు.
ఆడవాళ్ళంతా కొలుపు కాడికి తక్కువ పడ్డ ఇసిరెలు జెప్ప జెప్ప సదిరి దగ్గర పెడుతుoటే టక్క టక్క మట్టెలు . కాళ్ళ పట్టగొలుసుల చేతి గాజుల చప్పుడు కొలుపు చప్పుడు కి మరింత తాళములా తోడైతాoది.

కడుపులో పేగులు లేని నలబై ఐదు ఏండ్లు దాటిన చాయ నలుపు మనిషి పోచయ్య భార్య జయ, కొంగు నడుముకి దగ్గరగా గుంజి కట్టుకొని సింగులు చెక్కుకొని ఆడ బిడ్డలకు ఇతర ముత్తైదువుల కాళ్ళకి చాలా గౌరవంగా శ్రద్ధతో పసుపు రాస్తుంటే దండ చేతుల కాడ జాకెట్ పైకి వచ్చి ఆమె తెల్లని తోలు చూస్తే నీడ పట్టున ఉంటే ఈమే తెల్లని రంగు మనిషే అన్పించింది. ఆమె వేసుకున్న జాకెట్ వీపు జబ్బల భాగమున రంగు వెల్సిపోయి ముందు భాగముల చూస్తే అది పచ్చరంగు జాకెట్ అని తెలుస్తుంది. మెడలో నల్ల పూసల గుండ్లు , చెవులకు చిన్న కమ్మలు తప్ప ఆమె మీద మరో మాలు లేదు. కానీ మనిషి తేజుగా చురుకుధనంతో ఉంది.

పాత చీర బట్టల రంగు రంగుల అరికంట్లాలు, మాసిపోయిన జిప్పులు ఊడిపోయి పిన్నీసులు పెట్టుకున్న గరం కోట్లు వేసుకున్న ముసలోల్లు గోడని ఆనుకొని ప్లాస్టిక్ కుర్చీలల్లో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నారు. బాగా కల్లు తాగిన ముసలోళ్ల కాళ్ళ మీది దోతి సింగులు తొడల పైకి జారి ఉన్నాయి. తక్కువ తాగినోల్లకి పద్దతిగా మోకాళ్ళు దాటి కింది దాకా ఉన్నాయి.

వాళ్ళకేదో పూనినట్లు- ఒకరి మాట ఒకరు వినకుండా తాపతాపకు మోడీ కేసీఆర్ అని అనేక పెద్ద పెద్ద రాజకీయం ముచ్చట్లు చెప్పుతoడ్లు. ఒకరికి మించి మరొకరు తమకే రాజకీయాలన్నీ పుట్టుకతో తెలుసన్నంత ధీమాగా వాదిస్తండ్లు.
పోచయ్య అల్లుడు శ్రీకర్ బీఎస్ఎన్ఎల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగి. పేరుకే ఇక్కడున్నట్లు కానీ ఆ రాత్రి కూడా ఊరికే ఇంట్లో కొలుపు చప్పుడు వినపడకుండా బయటికి పోతూ ఆఫీసు పని మీదనే సెల్ ఫోన్ చెవి దగ్గరే పెట్టుకొని మాట్లాడుతుండు. అతని పరేశాన్ అంతా అక్కడున్నోల్లకి తెలుస్తంది.
“నీ అక్క నౌకరీగాని బతుకేం సుఖమున్నదని.. ? అచ్చిన కాన్నుంచెల్లి చూత్తన్న కాలు గాలిన పిల్లిలెక్కనే ఆ పిల్లగాడు తిర్గుతండు గాని క్షణమన్న తృప్తిగ కూసోంగా నే జూడలే. నాగనే (సెలవు) పెట్టచ్చే నాత్రి పూట గూడా ఉంటదా గీ నౌకరీ ? దోడ్తూ ….,“పొగాకు నములుతూ నోట్లో దాకా వచ్చిన ఉమ్మిని ఎక్కడ ఊంచాలో తెల్వక కూసున్న కాడనే సాబాతి బండ మీదనే ఊంచి పాదంతో అలుకుపూత లెక్క రాకిండు అందులో ఒక ముసలాయన.

“గిందుకే నిన్ను మందిలకి తీస్కరావద్దు. నీ సావు నువ్వు సావలేవు“ అని ఆ ముసలాయన మూతి మీద ఆమె చేతి పెద్దనేలుతో పొడిసి తొడ మీదికి ఉన్న దొతి సింగులని కిందికి జరిపింది ఆ ముసలాయన భార్య.
ముసలోడు రేశం కొద్ది చేతుల కట్టెని లేపిండు ముసలమ్మ మీదికి.

పోచయ్య కొలుపుకి కొంచెం దూరంగా అరుగు దగ్గర నిలబడి ఎపుడు ఏ అవసరం కొలుపు కాడ పడ్తదోనని చూస్తుండు.
చుట్టాలని చూసినంక – తన లోపలి బుగులు మాయమైనట్టనిపించింది. మెడకి బండ రాయి కట్టుకొని తిరిగే మనిషి కాసేపు ఆ బండ రాయిని పక్కన బెట్టినట్లుంది. యాబై ఏండ్ల పోచయ్య కూడా మాములుగానైతే తెల్లగా ఉండే మనిషే కానీ పొద్దున లేస్తే చీకటి పడే దాకా ఎండలో పొలం పనులు చేసి చేసి శరీర రంగు ఏర్పడదు. పేద గంభీరమైన ముఖం. ఐదున్నర అడుగులతో ఎత్తుకు తగ్గ దొడ్డు కొంచెం తక్కువై సలాక లెక్క ఉంటాడు మనిషి. చారికలు దిగిన గుండ్రటి ముద్ద ముఖం. ఎప్పుడన్న ఏదన్నా కార్యానికి పోతే తప్ప ఎప్పుడు చిన్న గడ్డంతోనే ఉంటాడు. అంగీ లుంగీతో మెడలో ఎప్పుడు పికిలిపోయిన జాజు రంగు తువ్వాలు ఉంటది. తలపై కొన్ని వెంట్రుకలు అక్కడక్కడ తెల్లబడ్డాయి. వాటికెపుడు రంగు వేయడు. పొద్దున లేస్తే బర్రె పాలు పిండడం , పేపర్ చదవడం నుండి పడుకునే వరకి అతని దినచర్య మారదు.

మాఘమాసం. పైగా గంగా మీదుగా చలిగాలి. ఇంటి ముందు పందిరి కింద పెద్ద నెగడు రాజేసిoడ్రు. అక్కడికి కొందరు ఎవరి మందు వాళ్ళే తెచ్చుకొని తాగుతున్నారు. వాళ్ళకి ఇదో సందు దొరికింది. ఇంటి దగ్గరి పిలువని కొందరు ముసలోల్లు కూడా మెల్లగా వచ్చి అక్కడ జమ అయిండ్రు. అనప గుడాలు తెచ్చి మనిషికి ఇన్ని గిన్నెలల్ల పోస్తుంది పెండ్లి అయిన పోచయ్య బిడ్డ శృతి. చుడిధారులో ఆమె గర్భిణి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే శరీరం కొంచెం లావుగా మొఖం ఇటుక రంగులో మెరుస్తుంది చెంపలకు రాసుకున్న పసుపుతో సహా.

పోచయ్య కొడుకు ఇరవై రెండు ఏండ్ల శేఖర్ ఇంకా జన్నారంలోనే ఉన్నాడు అవసరమైన వస్తువులేవో తేవడం కోసం. ఒక ప్రత్యేకత కోసం ఈ మధ్య హేర్ స్టైల్ పెద్దగా పెంచిండు. అతని అవతారం మెకానిక్ లెక్క ఉంటాది.
అతి పురాతన పల్లె ఊబిల నుంచి బయట పడకపోతే తండ్రి తీరుగా తాను ఇక్కడే మునిగిపోవడం ఖాయమని అతనికి పట్నం బోయి ఐటీఐ అప్రెంటీసు చేస్తుoటే దోస్తుల వల్ల కొద్దిగా అర్థమవుతుంది.
అతనికి జన్నారం బస్టాండులో భూమయ్య మామ కలిసిండు. బక్కగా కొంత పొడుగుగా కనిపించే , మామూలు పాంట్ చొక్కాలో , జేబులో పెన్నుతో తల వెంట్రుకలు తెల్లబడి దుమ్ముపట్టి తన కాలానికి కొంత ప్రత్యేకమైన మనిషి లాగా ఉంటాడు అరవై ఏండ్ల భూమయ్య . శేఖర్ వాళ్ల అమ్మ జయకి పెద్ద నాయిన కొడుకు.
“అల్లుడా! ఏందో పరేశాన్లున్నావే? కల్లు పరేశానా? పిల్ల పరేశానా?“ భూమయ్య .
“హే ఇంకా ఎవారం గాడి దాకా రాలే“ పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతున్నాను అనే సంబరములో శేఖర్ “ పెద్దేవరకి గొలుసుకుంటున్నాం మామ ! “.
“గీ కాలములో పెద్దేవర గొలుసుడేoది? అల్లుడా! మీ డాడీ బొత్తిలకు ఎనుకకు పోతండు.“
“ఏ … ఏం చెప్పాలే మామా! అంతా పిసపిస చేత్తoడు. ఏందoటే చెప్పడు … సుట్టాలు పక్కాలత్తెనన్న మనిషి మందిల వడ్తడని గిది మొదలు వెట్టిoది అమ్మ“
“సరే పదా .., నేను సుతా మీ ఇంటికి వస్తపా “
“నీకు గియ్యన్ని నచ్చవు కదా! “
“అన్నం పెట్టెటోడు రైతు – గయినే పిస్సల పడ్డడంటే ఇసారo చేయాలే కదా “ అనుకుంటూనే ఇద్దరు కలిసి బైకు పై తిమ్మాపూర్ వచ్చిoడ్రు.
కొడుకుతో పాటు అన్న భూమయ్యని చూసిన జయ బీరిపోయింది.
“మతలాబు చెప్పనందుకు కోపగించుకోకు అన్న. ఏదో ఇంట్ల మందమే అనీ …“ అన్నది.
“సరే తియి. కానియ్యి “ శేఖర్ , భూమయ్య నెగడు కాడికి నడిసినారు.
“ఊరిని కాపాడెటోడే కట్టుపోతల పoబాల రామన్న ..“ కొలుపు మళ్ళీ అందుకుంది. అంటే పంతులు మరో పెగ్గు పోసిండన్న మాట.
ఆ దేవుణ్ణి చేసుకుంటున్నటువంటి నీలం పోచయ్య కుటుంబం కష్టాలకి కారణం ఎవలనేది చెప్పడానికి చాటల బియ్యం పోసి దాని మీద నీళ్ళు నింపిన చెంబు పెట్టి వల్లు పడుతుండు డుబ్బుల కిష్టయ్య. ఎవల పేరు చెప్పిన కానీ వల్లు ఊగుతలేదు. చెంబు తిరుగుత లేదు.
దానితో మళ్ళీ గట్టిగా పదం అందుకున్నాడు .., వాయిధ్యం జోరుగా మోగుతుంది. సాoభ్రాణి పొగ కమ్ముకున్నది.
“ఇది నీ మాయే కావచ్చునే.., ముందుగాల పుట్టినావమ్మ ఓ ముత్యాల పోశమ్మ ! వెనుకాల పుట్టినదానా ఓ వెములాడ బద్దీ పోశూ !”
చిన్న పిల్లలు ముంగటనే ముద్దుగా కూర్చొని మూతుల దగ్గర చేతులు అడ్డం పెట్టి ఆపుకుంటూ కిల్లకిల్ల నవ్వుతున్నారు . .,
“కోటి మాయలవాడ ఓరి కొమరెల్లి ఓ మల్లన్న కొండగట్టు ఓ హన్మండ్లు,
నల్లగొండ ఓ నరసింహ .., యాదగిరి ఓ నరసన్న ఇది నీ మాయే కావచ్చునే ..,“ పదం ఒక్క తీరుగా సాగుతుంది.
“నీ బాoచెను ఎవ్వల మొక్కు ఉంచుకోము. అనుకున్నయన్ని అనుకున్నట్లైతే మల్లచ్చే సమ్మక్కల పున్నం నాటికి హరొక్కటి చెల్లిస్తా. నేను మాట తప్పే మనిషిని కాను. “ముంగాళ్ల మీద కూర్చున్న వంగిపోయిన మనిషి పోచయ్య తల్లి రెండు చేతులు దగ్గర జోడించి పెద్దేవర గద్దె చుట్టూ వేసిన పసుపు , కుంకుమ , బియ్యం పిండి ముగ్గు పక్కనే మొక్కింది.

“ఇది పాలివాడు చేసేనా పగవాడు చేసేనా
మంత్రకాడు చేసేనా కట్టుబోతలోడు చేసేనా
ఇది దొంగల మాయనా ? ఇది నరుల మాయనా ?
ఇది దొరల మాయనా? ఇది ‘ధరణి’ మాయనా?” పంతులు ఎంత పాడినా కానీ వల్లు అయితే ఊగుతాలేదు.
లాస్ట్ కి దుర్గమ్మ దేవత మీద పడ్డడు పంతులు కిష్టయ్య.
“ఇగో నీలం పోషయ్య మేడల ఉన్న దుర్గమ్మ చూడు
నువ్వు చెప్పకుంటే చూడు ఇగ నా సంగతి ఏందో సూపిస్తా
వాడు (నీలం పోచయ్య )రాజుగా ఒప్పియ్యలేదా?
వాడు రాజుగా మెప్పియ్యలేదా?
నువ్వు వాని ఇంటి మీద చేసినోడెవడో చెప్పకుంటే
పాపకారి ముండకొడుకు ఎవడో దుర్గమ్మని తోలిపాయెనని
నీ మీద మన్ను అంటారు. నా మీద దుబ్బ అంటారు
ధూలు దుమ్మెత్తి పోత్తరే .., ఏ ఏ ఏ .., “

“డుమ్ డుమ్ డుమ్ ..,“ డుబ్బు మెల్లగా మోగినపుడు మెల్లగా గట్టిగా మోగినపుడు స్పీడ్ గా డుబ్బు చప్పుడు కి అనుగుణంగానే వాళ్ళ౦దరి గుండె కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది అక్కడున్న వారి అందరిలో.
అలసిపోయి ఉన్న వారి శరీరాల్లోని శక్తికి ఆ చప్పుడే ఆధారమవుతుంది.
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయి వారో కొత్త లోకములో కొలుపులో అందరూ ఐక్యమైపోయారు.
తమ మంచి చెడ్డలకి కారణమేదో తమ చేతుల్లో చేతల్లో కాకుండా బయట ఉన్నదని – అది తమ పగవాడో ,పాలివాడో ఓర్వక తమ మీద మంత్ర తంత్రాలు చేశారని, పెద్దేవర అవన్నీ బయటపెడుతుందని నమ్మిక. విరుగుడు చెప్తదనే ఆశ.
ప్రకృతి ప్రకోపాలు, మారుతున్న రీతి రివాజులు, మనుషుల మాయామర్మాలు, సమాజం పోకడ జనానికి అర్థం కానీ స్థితిలో – ఈ నమ్మకాల నేపధ్యం , కొంత వాస్తవ పరిస్థితి తెలిసిన గ్రామీణ కళాకారుల కళారూపం ఈ పెద్దేవర కొలుపు.

“నా దాకా మాట అత్తె చూడు నా దాకా మూట అత్తె సూడు
ఎవరి తోట పోయిన గాని ఎవరి పంట పోయిన గాని
నేను వచ్చేటి బాటల్లానమ్మ పోయేటి తొవ్వలనమ్మ
నిన్ను తీసుకపోయి దేవి !
ఏయ్ .., నిన్ను తీసుకపోయి లంజే ముండా ! “ కాలు గట్టిగా నెలకు తన్నిండు పంతులు.
“ మూడు తొవ్వల కలిసే కాడ నిన్ను అడ్డం పండబెట్టి “ మోకాళ్లపై కూసోని యాక్షన్ చేసి చూపిస్తుండు.
నీ ముక్కు మూడు చెవులు కోత్తనే .., ఏ ఏ ఏ .., “ కిష్టయ్య గొంతులో రాగం గట్టిగా ధ్వనిస్తుంది.
ఆ మాటకి అందరిలో దైర్యం కలిగింది.

“ఏ ఏ ఏ.., “ అంటూ పిల్లలు కోరస్ లాగా పాడుతున్నారు కొసకు సంబరంగా హాస్యంగా.
“నీ ముక్కు మూడు చెవులు కోసి నేను పోయేటి దిక్కున
ఆ తూర్పు రాజ్యాన తుంగ ఆడవులున్నాయి
దక్షిణాన గంగ మడుగులున్నాయి
పులులు తిరిగెటి ఆడవులల్లా
బర్లు బొర్లేటి మడుగులల్లా
పారేటి గంగల్లా పాడుబడ్డ బాయిల్లనమ్మా
నిన్ను పారేసిపోతానే! ఏ ఏ ఏ ..,
నువ్వు పాడైపోతవే నువ్వు దోడయి పోతవే
నిన్ను బంగారు మేడల్లా నిన్ను వీళ్ళు ఏలుకోరే
నీ పేరు మాసిపోతదే నీ గుడి గబ్బీలాల మేడ అయితదే
నిన్ను వీళ్ళు ఎత్తుకోరు కదనే !
నీకు సత్యమే ఉంటే నీకు ధర్మమే ఉంటే
వీళ్ళ బాయి కాడ కానీ వీళ్ళ చేను కాడిదే కానీ వీళ్ళ ఇంటి కాడ కానీ కట్టె పుల్ల పోయిన గాని..,
ఆ తీసుకపోయేటోళ్లు ఆ దోసుకపోయేటోల్లు ఆడోల్లు అయితే దేవి వాళ్ల మైలలు తీయాలే
వాళ్ళు మొగవాళ్లు అయితే దేవి వాళ్ళ ఇంట్ల సొచ్చి దేవి నడి బజార్లకి గుంజి దేవి వాడి కార్జేం పీకాలి వాడి దొబ్బలు పీకి తోరణములు కట్టవే మాయమ్మ !
దొంగలు అందరూ బోయి దొరలు అందరూ బోయి
కష్టాలు కడదొలగి – బహు బర్కతి గల్గి
పేద సాదా జనం మంచిగా బతకాలనే మాయవ్వా
నీలం పోచయ్య ఇంట్ల తల్లి పాలు పొంగినట్లు బుగ్గల నీరు పొంగినట్లు ఉండాలే
సబ్బండ జనాలకి ఆమ్ధాన్ తిండి దొరికి పన్నెండు బిగాలల్లా నీకు మళ్ళీ బంగారు పట్నమేయాలనే ..“
అలా కొలుపు పొద్దు గూకినాకా ఎనిమిది గంటలకి మొదలై ఒక్క రీతిగా రాత్రంతా నడుస్తునే ఉంది.

ఇంటి ముందు నెగడు నుండి నిప్కలు లేస్తున్నాయి.
పెండ్లి అయి ఇద్దరు చిన్న పిల్లలుండి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకి చదువుతున్ననీలం పోచయ్య పక్కింటి నీరజ మరియు జన్నారం లో డిగ్రీ చదువుతున్న ఎదురింటి స్వాతి అనే అమ్మాయి ఇద్దరు ఆ ఇంటి ముందే ఉన్న చిన్న పొయ్యి మీద పెద్దేవర ముందు పెట్టె బెల్లపు అప్పాలు, ముద్దగారెలు అందజేసి మిగిలిన పిండిని కూడా అప్పాలు చేసి కాలుస్తున్నారు. దానికి ఇద్దరు మొగొల్ల సహాకారం కూడా నడుస్తంది. నెగడు చుట్టూ పెద్దలతో పాటు , నలుగురైదుగురు యువకులు ఆ ఊరిలో , ఆ చుట్టూ పక్కల గతములో జరిగిన లొల్లులు ,కొట్లాటల గురించి పోరాటాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రములో దేశములో జరుగుతున్న విషయాల మీద వాదం నడుస్తున్నది వాళ్ళ మధ్య. కాల రీతుల గురించి కొందరు ఎవరికి వాళ్ళే కల్లు నిషాలో మాట్లాడుతున్నారు. సహజంగా మాట్లాడని చాలా విషయాలని ఇపుడు తాగినవాళ్ళు దైర్యoగా మాట్లాడుతున్నారు.

తాగకుండా ఉండి అందరి ముఖాలు చూస్తూ “అప్పటి నుండి నేను వింటున్నా.., మీ బాధ మీరు చెప్పేవన్ని కరక్టే కానీ, అసలు ముందుకు పడే తొవ్వ ఏoదనేది చూడాలి. మనమెన్ని మాట్లాడినా, ఇండ్లదిండ్లనే ఎంత చేసినా గాని డిల్లీలో రైతులు చేసిన పోరాటం మాదిరిగా రాజకీయ పోరాటాలలో మనం అంతా ట్రెనింగ్ కానిదే రైతు రైతు కూలీల కార్మికుల రాజ్యo రానిదే మనకి మన కష్టాలకి విముక్తి లేదు“ భూమయ్య.

పోచయ్య కొడుకు శేఖర్ మంచములో కూర్చుండి కంకి ఒలిచిపెడుతున్నట్లు అర్థమయ్యేలా చెప్తున్న భూమయ్య మామ మొఖములో దోబూచులాడుతున్న వెలుగును ఇష్టంగా చూస్తున్నాడు. అతనికేవో కొత్త విషయాలు , చిన్నతనం నుండే చదవాల్సి ఉండి మిస్ ఐన ఏదో కొత్త సబ్జెక్ట్ , కొత్త మార్గం భూమయ్య మాటల్లో కన్పిస్తుంది. అతను చెప్పిన మాటల్లో కొండపల్లి సీతారామయ్య “ వ్యవసాయక విప్లవం “ జన్నారం నుండే రాసిండు అనే మాట అతనిలో చాలా విషయాలు అధ్యయనం చేయాలనే , గత చరిత్ర చాలా తెలుసుకోవాలే అనే ఉత్సుకతని ప్రేరేపించింది. బయట కనపడుతున్న ప్రచారములో ఉన్న తప్పుడు విషయాలు, పద్దతుల కంటే ఒక సృజనాత్మకమైన సహచార్యం, ప్రపంచం భూమయ్య మామతో కలిసి చూడొచ్చనే నమ్మకం తనకి కల్గింది. నీరజ, స్వాతి కూడా పని ఆపి వీళ్ళ ముచ్చట్లే వింటున్నారు. “ తపాలపూర్ సంఘటన “ గురించి చెప్పగానే నీరజ విప్లవోద్యమం గురించి తను ప్రస్తుతం చదువుతున్న పోటీ పరీక్షల పుస్తకాల్లోని జ్ఞానాన్ని ఉత్సాహంగా పంచుకుంది. “గ్రామాలకు తరలండి”, ”రోడ్ టు రివల్యూషన్”, ”లక్సెటిపేట్ రైతుకూలీ మహాసభ” , ”జగిత్యాల జైత్రయాత్ర” అని ఆమె చెప్తుంటే అక్కడున్న వాళ్ళకి కూడా దాని బయటి లింక్ అంత పెద్దగా ఉందా అని తెలిసి ఆశ్చర్యపోయారు.

రైతుకూలి ఉద్యమాల నుండి ఎదిగి తన భార్యతో పాటు దళంగట్టి దళ కమాండరై ముప్పై సంవత్సరాలు అడవులలో పని చేసి, భార్య ఎన్‌కౌంటర్ అయి చనిపోయి – తాను పట్టుబడి ఐదేండ్లు జైలులో ఉండి బయటికి వచ్చిoడు భూమయ్య .

                                                         2    

అది 13 జులై 2022, వర్షాకాలం.
అప్పటికే గత వారం రోజులుగా విడువని తుఫాన్ వల్ల ఆ రోజు అర్ధ రాత్రి 12 గంటలకి కడెం ప్రాజెక్ట్ లోకి అధిక వరధ నీరు చేరుతుండడముతో “ అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువ ఉండి డ్యామ్ ఏ క్షణమైనా తెగే అవకాశం ఉంది” అని- ”లేదు ఆల్రెడీ తెగింది” అనే వార్తలు వచ్చినాయి. కడెం ప్రాజెక్ట్ దిగువన ఉన్న గోదావరి తీర ముంపు గ్రామాల ప్రజలు అప్పటికే పొద్దంతా ఊరి దగ్గరి దాకా చేరిన గోదావరి ప్రమాధ స్థితిని చూసి ఉన్నందున ఆ అర్ధరాత్రి చీకట్లో సగం నిధ్రలో ఆగమాగమైoడ్లు. రోటీగూడ సర్పంచ్ అరవై ఐదు ఏండ్ల మల్క లక్ష్మణ్ ఇంటింటికి తిరుగుతూ నిద్ర లేపి ట్రాక్టర్ లల్లో ఎత్తు ప్రాంతమైన గీతానగర్ కి పంపిస్తుండు. గొడ్లని బర్లని మేకలని గొర్లని కోళ్ళని ఎక్కడికక్కడ వదిలిపెట్టిండ్రు. లక్ష్మణ్ తహశీల్దార్ కి ఫోన్ చేసి “ గీతానగర్ కూడా మునిగితే మాత్రం మాకు బయటికి రావడానికి తొవ్వ లేదు. మీకు ఒర్రే దాటి మా దగ్గరికచ్చే మార్గం లేదు. భగవంతుడు దయతలిస్తే ఈ రాత్రి సరే. లేకుంటే మేము మీకు పాసిపోయినట్లే …” దు:ఖం ఆగక ఏడిసిండు ఫోనులోనే. మిగతా ఊర్లు కూడా ఎక్కడికక్కడ ఆ రాత్రికి రాత్రే దగ్గరలో ఉన్న స్కూల్స్ , ఫంక్షన్ హాల్స్ , గుడులు, చుట్టాల ఇండ్లు ఊర్లు దిక్కు పరిగెత్తి పోయి దిక్కు లేని పక్షులయినరు. అలా పోయిన కుటుంబాలలో జన్నారం మండలములో వెయ్యి కుటుంబాలు ఉంటాయి.

గోదావరి తీరాన ఉన్న ఆ మండల గ్రామాలలో తిమ్మాపూర్ కూడా ఒకటి . డ్యామ్ తెగలేదు కానీ మొత్తం గేట్లు తీసినా కానీ డ్యామ్ పై నుండి ప్రవాహం పోయినంత వరధ వచ్చింది. తెల్లారే సరికి ఇండ్లల్లోకి వరధ చేరిoది. ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే పంటలు మొత్తం కొట్టుకపోయి ఊరికి కొన్ని ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి. రోటిగూడ ఊరు మొత్తం మునిగిపోయింది. ధర్మారం గ్రామ గోండు గూడ గోండు లైతే దగ్గరలో ఉన్న గుట్ట పైకె పోయినారు. తెల్లారి కళ్ళ ముందే గూడెం అంతా మునిగిపోయింది.

అలా గోదావరి వరద నీటితో నష్టపోయిన కుటుంబాలలో నీలం పోచయ్య కుటుంబం ఒకటి.

పోచయ్య వయసు యాబై దగ్గరగా ఉంటది. వాళ్ల తాత రజాకార్ల కాలము (1946) లో జోరు వయసు మీదున్న మనిషి. రజాకార్లు దొరలను ఎదుర్కొన గుత్పలు పట్టుకొని తిరిగిన మనిషి. తెలంగాణ సాయుధ పోరాట ప్రభావo వల్ల ఆయన దున్నుకున్న ఐదేకరాల భూమికి కౌల్ధారి చట్టం కింద 1953 లో పట్టా వచ్చింది. వాళ్ళ నాయినలు గా భూమినే దున్నుకుని బ్రతికినారు. తెలంగాణలో తొలిసారిగా దేశవ్యాప్తంగా సంచాలనానికి కారణమైన 07.11.1976 న తిమ్మాపూర్ పక్కన ఊరు తపాలపూర్ గఢీ మీద విప్లవకారులు దాడి చేసి తపాలపూర్, తిమ్మాపూర్ లో దొరలని వారి అనుయాయులని కాల్చి నరికి చంపినపుడు పోచయ్య నాయిన జోరు వయసు మీదున్న మనిషి. రైతులందరితో పాటు రైతు కూలీ సంఘాలలో తిరిగిన మనిషి. రైతు కూలి సంఘాలల్లో చేరి ఊరు ఊరంతా అడవులని కొట్టి కొంత, బంజరు భూమిని కొంత దున్నుకున్నారు. దొరల నుండి తీసుకున్న సీలింగ్ భూమిని “ దున్నేవాడికి భూమి “ అంటూ లావని పట్టాల కింద భూమి లేనోళ్ళకి పంచి పట్టాలిచ్చినరు. మంచి మంచి భూమి అంతా దొర తన పేరిటా బంధువుల పేరిటా, తన దగ్గరోళ్ళ పేరిటా ఉంచుకొని , ఇంకా కొంచెం మళ్ళీ తన పేరిటా మార్చుకోవడం కోసం ‘38 ఈ’ పట్టాలు లాంటివి తన కింది పని వాళ్ళకి ఇప్పించిండు. దొర తెలివిగా తన పట్టా భూమిలో తవ్వుకున్న చెరువులనే సీలింగ్ భూమి కింద చూయించి అనామత్ గా లావని పట్టాలు దళితుల బీసీల పేరిట చేయించిండు. పేరుకే పట్టా , భూమి ఏమో నడి చెరువులో. ఇపుడు అదో పెద్ద లొల్లి .., అసలు పట్టాలే తప్పు చెరువు కబ్జా అని ఒక వర్గం , బాజాప్తా నలబై ఏండ్ల కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడేట్లా తప్పుడు అయితావి అని చెరువులో నీళ్ళు తగ్గినపుడు అయినకాడికి ఒక పంట తీసుకునే లావని పట్టేదార్లు. సరే ఆ కుట్ర ఎంత జరిగినా కానీ అడవులు ఊళ్ళు ఏకమై దొరకి వ్యతిరేకంగా పెద్ద గడబిడే జరిగింది అపుడు. అరెస్టులు జైళ్లు – దొరకనోళ్ళు తప్పించుకొని అడవిలో జేరిoడ్లు. లఢాయీ నడిపిండ్రు. తెలంగాణ యుద్ధ రంగమైపోయి ఆట పాట మాట బందు అయి నిర్భంధం పెరిగిన కాలములో ప్రత్యేక తెలంగాణ కోసం గడబిడ పెరిగి పెద్దదైనది. 2002 నాటికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకునే నాటికి పోచయ్య కూడా జోరు వయసు మీదున్న మనిషి. ఊరూరా మానవహారాలు , వంటా వార్పులంటూ పట్నం మందితో కలిసి తిరిగినడు. 2005 నుండి 2013 వరకి మిగిలిన సర్కారీ భూములపై కూడా అపుడు ఊళ్ళో భూమిలేని పేదలకి పట్టాలు వచ్చినాయి.

తాత తండ్రుల నుంచి మంది పెరిగి పంచుకోగా పోచయ్య వాటాకి వచ్చిన మూడెకరాల భూమిని వ్యవసాయములో గిట్టుబాటు లేక , ఎళ్లదీసుడు బహు కష్టమై బిడ్డ పెండ్లి నాటికి 2018 లో అమ్మి౦డు. దొరల దగ్గర సాదా బైనామ కింద తన తండ్రి కొన్న ఇంకో రెండు ఎకరాల భూమి పట్టా కాకుండా ఎటు పోతది అనుకున్నడు. తెలంగాణ వచ్చినంక, ధరణి వచ్చినంక ఆ భూమి కాస్త తిరిగి దొర మనుమల పేరిట ఎక్కి విడసిపెట్టాల్సిన స్థితి వచ్చింది. మళ్ళీ దొరలతో లొల్లి మొదలైంది. భూమి లేక గత నాలుగేoడ్లుగా పోచయ్య కౌలు రైతు అయిoడు. బ్రతుకుదెరువు కోసం మంచిర్యాల లో ఉండే ఒక డాక్టర్ వీరి ఊళ్ళో కొన్న ఆరు ఎకరాల భూమిని కౌలు కి చేస్తుండు. కానీ కౌలు రైతుకీ తెలంగాణాలో గుర్తింపు లేదు. దాదాపు ఊరిలో భూములు అన్నీ బయటోళ్ల చేతుల పడ్డాయి. ఊరు మొత్తం రాబందులు చీకి పడేసిన గొడ్డు బొక్కలగూడు లెక్క ఉన్నది. గ్రామాల సర్పంచ్ లు ఇటువంటి భూములు బయటి వాళ్ళకి అమ్మచూపడములో మంచి లాభసాటి పొందే దళారిలు అయినారు. గన్ని తీర్ల లొల్లులు అయినంక ఊరిలో రైతుల బలం తగ్గింది. భూముల ధరలు పెరిగినాయి. రైతు ఎవ్సము చేసి భూములు కొనే పరిస్థితి లేదు.

డెబ్బై ఏండ్ల కింద కౌలు కి చేసి పట్టాదారు అయిన తన తాతతో పోలిస్తే కనీసం తనకి పట్టా కాదు గదా సాగు చేస్తున్న భూమి మీద క్రాప్ లోనూ తీసుకోలేకపోవడం , పంట నష్ట పరిహారము కూడా తీసుకోలేని నోచుకోని స్థితికి పోచయ్య కాలం చేరింది. రికార్డ్ లో కాస్తుధారు పేరు కాలమ్ తొలగిపోయింది. ఈ ఏడాది వచ్చిన గోదావరి వరధలకి కౌలుకి తీసుకుని మళ్లు గట్టి వేసిన మిర్చి మరియు టమాటో పంట మొత్తం నీళ్ళల్లో కొట్టుకపోయింది. ఎండాకాలము మార్చిలో ఎండిపోకుంటా నీళ్ళ సౌకర్యం కోసం తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్ పైప్ లైన్ లు పత్తా లేకుండా వరధలో కొట్టుకుపోయినాయి. వాటికి రూపాయి పరిహారం దిక్కు లేదు. కౌలు డబ్బులు మాత్రం ఏడాది మొదాలే పట్టాదారు కి అప్పచెప్పిండు.

సగం ఊరు ఇండ్లు కూడా నీళ్ళల్లో మునిగిపోయినవి. కూలిపోయిన ఇండ్లు మాత్రమే లెక్క అని వాటికే పేరుకి ఐదో పదో రూపాయలు వచ్చినయి. నీళ్ళు నిల్చి వెళ్ళిపోయిన ఇండ్లకి పైసా రాలే. నీళ్ళు ఒక రోజే నిల్చినవి ఇండ్లల్లో. జీవో ప్రకారం రెండు రోజులు అనగా 48 గంటలు నీరు నిలిస్తేనే ఒక ఇంటికి 3800 రూపాయలు ఇచ్చే రూలు ఉంది అని జిల్లా కలెక్టర్ ఆ మాత్రం నష్టపరిహారం ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోలే.

పోచయ్య ఇంట్లోకి వరదలు వచ్చి నీళ్ళు నిండితే పెయి మీది బట్టల మీదనే కుటుంబం మొత్తం పక్క ఊరి స్కూల్ లో తలదాచుకున్నారు.

వరద నీళ్ళు వెళ్ళిపోయి ఊరు అంతా నీసు వాసన కొట్టింది. పునరావాస కేంద్రమైన పక్క ఊరి బడి నుండి ఊళ్ళోకి వస్తుంటే రోడ్ అంతా పాకురు పట్టి చాలా మంది జారిపడ్డారు. రెండో రోజు ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న టీవీ మంచాలు బియ్యం తో సహా అన్నీ వస్తువులు నాని ఖరాబ్ అయినాయి. కుటుంబాలు మొత్తం దిక్కులేని పక్షులవలే ఏడ్సుకుంటూ పాడైన సామానంత బయట వేసుకుంటూ గబ్బు బురద నిండి ఉన్న ఇండ్లని అంతా కడుక్కున్నారు. ఇండ్ల ల్లో, చెట్ల మీద ఎక్కడ లేని పాములు , విషపు పురుగులు తిరగవట్టినాయి. దిక్కులేని పక్షులయిన వాళ్ళ కోసం ఎమ్మెల్యే గొడవ చేస్తే కలెక్టర్ ఇంటికి పది కిలోల బియ్యం ఇప్పించింది. అంతకి మించి రూపాయి సాయం వరధ బాధితులకి అందలేదు. నానిన ఆ ఇండ్లు తర్వాత నెల రెండు నెలల రోజుల్లో కూలడం మొదలైనవి. కానీ అవి సహజంగా కూలిపోయిన ఇండ్ల కిందనే లెక్క. పంట నష్ట పరిహారం విషయానికి వస్తే “రైతు బంధు” కింద రైతు కి పంటకి ఎకరాన ఐదు వేలు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మళ్ళీ వేరే పంట నష్ట పరిహారం ఇచ్చేదీ లేదు అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడము జరిగింది. కనీసం వ్యక్తి వారీగా ఎంత పంట నష్టం జరిగినది అనే లెక్కలు కూడా వ్యవసాయ , రెవెన్యూ శాఖ అధికారులు రిపోర్ట్ పంపలేదు.
ఈ పరిస్థితులల్లో పోచయ్య ధు:ఖం చూడాలి. ఆ కుటుంబం బాధ, దీన స్థితి .., ఎదురు చూపులు ఎవరికి పట్టనివి.

                                                         3 

చిన్నదైనప్పటికి , గత పోరాటాల వల్ల ఆ ఊరు ,ఆ చుట్టుపక్కల చాలా చైతన్యవంతమైన ప్రజలు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ కూడా ఆ ఊరికి చెందినవాడే. “ ఊరు మనదిరా….“ అనీ నినదించిన గూడ అంజన్న అమ్మమ్మ ఊరు కూడా అదే. మరొకరు, అదే ఊరికి చెందిన దళితుడు చదువుకొని ఆ ఊరి నుండే బయటపడి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ అయినడు. ఏ తల్లి పేగు పొర్లినదో కానీ వరధ బాధితులని పరామర్శించడానికి, పరిశీలన చేయడానికి ఆ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ (ఎచ్చార్సీ ) గా మండలం లోని ఊరూరూ తిరగడం జరిగినది. ప్రతి గ్రామంలో ఒక చోట చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తే – విసిగిపోయిన, కోపంగా ఉన్న బాధిత ప్రజలని కుప్ప చేయలేక గ్రామ స్థాయి మండల అధికారుల తల ప్రాణము తోకకి వచ్చింది. ఇదంతా ఉత్త పంచాంగం తప్ప ఏ సహాయం జరగబోదు అనేది ప్రజల అనుభవం.

ఒక్కపుడు అన్నీ ఊళ్ళల్లో రైతు కూలి సంఘాలు ఉండేవి. దున్నేవాడిదే భూమి అని, కూలి రేట్లు పెంచమని , పాలేర్ల జీతాలు పెంచమని దొరల ఆగడాలు తగ్గించాలని ఏర్పడిన చిన్న సంఘమే పెద్దగా ఎదిగిoది. నలబై ఐదు ఏండ్ల కింద ఈ తిమ్మాపూర్ పక్క గ్రామమైన తపాలపూర్ లో దొర గఢీని బద్ధలు కొట్టే స్థాయికి ఎదిగింది. ఆ చైతన్యం ప్రస్తుతం దేశమంతా విస్తరించిపోయింది. ఆ చైతన్యానికి అడుగు బొడుగు దొరలు , గఢీలు ఖాళీ చేసి పట్నాలు పట్టిoడ్లు.

ఇపుడు తిరిగి ప్రభుత్వమే “ రైతు సమన్వయ సమితి “ల పేరిట ఊరూరా రైతు సమితుల ఏర్పరచి రైతులని సమన్వయ పరచి ప్రభుత్వ అనుకూల వ్యక్తులని ఆ సంఘాల అధ్యక్షులని చేసారు.

ఆ రోజు గ్రామములోని వరధ బాధితులని , రైతులని తిమ్మాపూర్ ఇండ్ల మధ్యలో ఉన్న “ రైతు వేదిక “ లో సమావేశం ఏర్పరిచి స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షులని పిలిపించి ఎచ్చార్సీ ఛైర్మన్ గారితో మాట్లాడిస్తున్నారు.

ఊరి రైతులు మంటర మంటరున్నారు. పోలీసులు ,అధికార్లు , ప్రజాప్రతినిధులు ఛైర్మన్ దగ్గరే ఉన్నారు.
బయట నుండి భూమయ్య మరి కొందరు యువకులు సడెన్ గా లొల్లి చేస్తూ మీటింగ్ వైపు దూసుకొచ్చి ఆటంకం చేయబోతే పోలీసులు అటు నుండి అటే బలవంతంగా గుంజుకపోతున్నరు.
“మేమంతా గంగ నీళ్ళచ్చి సకలం పోగొట్టుకుంటే – దొంగలు పడ్డ ఆర్నెల్లకు .., “ భూమయ్య నోరు ని ఒక పోలీసు బలంగా మూసిండు ..,
అనుభవం లేని ఆవేశం కల ఆ యువకులు పోలీసుల అత్యుత్సాహం చూసి బేలగా అయినారు.
పోచయ్య భార్య జయ భూమయ్యని చూసి కండ్లల్లా నీళ్ళు తెచ్చుకున్నది.
”ఏమన్నా అంటే ఆన్ని వదురుబోతోడు అంటారు గాని ఆడన్న దా౦డ్ల తప్పేముందుల్లా ..! “ చూసుకుంటా ఉండబుద్ది కాక బజార్ల నిల్చున్న ఒక పెద్దవ్వ మాట.

జబ్బలు పట్టి గుంజుకపోతున్నా కానీ భూమయ్య ప్రతిఘటనకి బజారులో దుమ్ము రేగుతూ లుంగి ఊడి ఆ దుబ్బలో పడిపోయింది. అలానే గుంజుకుపోతుండ్రు పోలీసులు. యువకులకి భూమయ్య చుట్టూ చేరాలో పోలీసులని ఆపాలో అర్థం కాక చుట్టూ తిరుగుతున్నారు. కుక్కలు ఒక్కసారిగా చెలరేగిపోయి ఏదో ఆపతి వచ్చినట్లు అష్ట దిక్పాలకుల వలె మొరుగుతున్నాయి. బయట నిలబడ్డ ఆడోల్లు కయ్యరకయ్యర మొత్తుకుంటూ తిడుతున్నారు. నీరజ కి ఎక్కడ లేని ఆవేశం ఉంది లోపల. ఆమెతో ఉన్న ఆమె చిన్న పిల్లలు ఆ స్థితిని భయానకoగా చూస్తున్నారు. పెద్ద వాళ్ళు దైర్యం చాలక మిన్నకున్నారు.

లోపలికి పోవడానికి ఇష్టపడని రైతులు కూలీలు పోలీసుల చుట్టూ మూగిండ్లు . సబ్ ఇన్స్పెక్టర్ మధ్యలో నిలబడి సుతిమెత్తని మాటలతో హెచ్చరిస్తున్నాడు. అతని ఉద్దేశ్యం ఈ లొల్లి పేపర్ లకి ఎక్కకూడదని. అతని చేతులు సన్నగా వణుకుతున్నాయి.

సమావేశములో ప్రసంగాలు ఏమి జరగనట్లే నడుస్తూ ఉన్నాయి. ఆ సమావేశం కి వచ్చిన వారికి కూడా ఏమి చెప్పాలో ముందే చెప్పి ఉంచడం జరిగినది.
ఎదురుగా ఖిన్నుడై కూర్చున్న పోచయ్య కను గుడ్లల్లో నీళ్ళు గుబగుబ బయటకి వస్తున్నాయి.
ఎచ్చార్సీ ఛైర్మన్ ఒక్కొక్కరిని లేపి అడిగినట్లే పొచయ్యని కూడా “ మీ ఊరికి అధికారులు వచ్చినారా?” అని ఇంకా ఏదేదో అడిగిoడు. ఆడిగిన ప్రతి దానికి పోచయ్య “ అవును “ అని తలూపాడు.

రజాకార్లతోని తలపడ్డ తాత, రైతు కూలి సంఘములో తిరిగిన నాయిన , తెలంగాణ కోసం పోచయ్య మందిల తిర్గిoడు. కానీ అతను తెలంగాణ వచ్చినంక సప్పగా చల్లారిపోయిండు. ప్రస్తుత రాజకీయాలు , ఆ మర్మం ఎరుక కావట్లేదు. ఐదెకురాల భూమి కాస్తా రెండు ఎకరాలైంది. దానికి పట్టాగా ఒక రూపం లేదు. మెడకు పడ్డ పాము తీర్గా అది బ్రతుకనియ్యదు , సావనియ్యదు. ఊరు దాటితే కదా .., దునియా కనపడేది.., భూమితోనే సావు బ్రతుకని నడుస్తుంది అతని జీవితం.

పది రోజులకే మళ్లి దైర్యం చేసి అప్పు తెచ్చి భూమిలో దున్ని మళ్ళీ మిర్చి బీరకాయ పత్తి వేసిండు. ఈ ఏడాది రోత వానలు వంద రోజులు విరామం ఇవ్వకుండా పడ్డాయి. ఈ సారి కూడా సరిగ్గా పంట చేతికి రాలే. అప్పు మీద అప్పు పోచయ్యకి మనసున పడుత లేదు. పోచయ్య ఆ రోజుల్లో తాను పది తన భార్య ఏడు దాకా చదువుకున్నారు. మంచి సంస్కారం గల ఇజ్జతిధారి మనుషులు. ఐటీఐ చేసి అప్రెంటీసు చేసిన తన కొడుకు ఎట్లయిన ఈ వ్యవసాయం నుండి బయట పడాలని “ డాడీ ! మీరు సదువుకున్న బాయిల కప్పలు ,ఈ ఊరు ఒక బాయి బొంద “ అనుకుంటూ ఇంట్ల నుంచి పట్నం పోతడు. మళ్ళా అక్కడ ఏమి నౌకరీ దొరకక ఊర్లోకి వస్తుండు. పల్లెకి పట్నానికీ కొడుకు ఆసు బొత్తాoడు. పెరుగుతున్న అప్పుల వల్ల తల్లితండ్రుల బాధ చూడలేక కొడుకు కూడా పనిలోనే పడిపోతుండు. మళ్ళీ రెండు నెలలకు చెంగో బిళ్ల అంటాడు. చదువుకున్న పిలగాడే కానీ తండ్రికి మించి పని చేస్తాడు. ఏ దురలవాట్లు లేవు. ఈ అవస్థ నుండి ఎలా బయటపడాలి అనే ఆలోచనల్లో ఎదురీతుతుండు.

పోచయ్య ఇంతకు ముందు ఎన్నడూ ఇంతలా బెదిరిపోలేదు. గట్టి గుండె దైర్యం కల మనిషి. పైగా రెక్కల కష్టం నమ్ముకొన్న మనిషి. కానీ ఈ మధ్య పిసపిస అవుతుండు. తనలో తానే మాట్లాడుకుంటుండు. సరిగ్గా రాత్రులు నిద్ర పోతలేడు. ఎప్పుడు లేనిది భార్య మీదికి ఉత్తగానే కోపానికి వస్తాoడు. అప్పులోళ్లకి అంతకి ముందు పంట మీద డబ్బులు ఇస్తాననే నమ్మకముతో చెప్పేవాడు. కానీ ఈసారి ఏదో అనామతుగానే వచ్చే పంట మీద ఇస్తానని బొంకడం తన నుంచి కావటం లేదు. పోయిన పంట నష్టం, మళ్ళీ విత్తనపు ఖర్చు నుండి తిరిగి మళ్ళీ పంట వచ్చే ఆశలు లేకపోవడముతో టెన్షన్ పడుతుండు లోలోపల. ‘ఆడవిల పొద్దు గూకినట్లున్నది‘ అని ఊరికనే చేనుకి ఇంటికి తిరుగుతుండు.

నాలుగు నెలల తర్వాత ఒక మంగళవారం కాసిన బీరకాయలు , సొరకాయలు పట్టుకొని మండల కేంద్రమైన జన్నారం కి పోయి గుత్తకి ఇయ్యలేక తానే కూసుoడి అమ్మి కొన్ని మిగిలిన కూరగాయలని పట్టుకొని తహశీల్దార్ ఆఫీస్ కి పోయిoడు.

తహశీల్దార్ ని కలిసి తన బాధ అంతా చెప్పుకొని “ ఏమైనా పంట నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉందా? “ అని ఆడిగిoడు. తహశీల్దార్ చాలా మెత్తగా మర్యాదగా మాట్లాడినప్పటికి “ ఏమి డబ్బులు రావు “ అనే విషయాన్ని మాత్రం కరాఖండిగా చెప్పిండు.
“మీ చేతుల లేనపుడు మీరైన ఏం చేస్తారు ? ‘”అని పోచయ్య ఇంటి బాట పట్టి౦డు.
తన యాబై ఏండ్ల జీవితములో ఎన్ని మార్పులు చూసిండు పోచయ్య. మందిలో పుట్టి మందిలో పెరిగినటువంటి మనిషి ఇపుడు ఒంటిగాడు అయిపోయిండు. తన భాధని సుట్టాలకి పక్కాలకి చెప్పుకుందామంటే ఎనుకటి రోజులు కావు.

మునుపటి సంఘాలు లేవు. మునుపటి ఎర్ర జెండా పార్టీలు లేవు. మునుపటి ప్రతిపక్ష పార్టీలు కావు. ప్రభుత్వాన్ని విమర్శించి నిలబడగలిగే మనుషులే లేరు. ఒక ప్రధాన పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తాడానే పేరున్న వ్యక్తిని మీరు అయిన గట్టిగా అడుగుతే ఏమయితది అని ఎవరో అడిగితే “ నేను మాట్లాడితే పట్టించుకునేటి వాళ్లు ఎవరు ? ఒక వేళ నేను ఫైట్ చేసి సాధించిన మీరు అందరూ పోయి పాలాభిషేకం చేస్తారు ప్రభుత్వానికే. దానికి నేనెందుకు కష్టపడాలే “ అని అన్నాడట. అతను కూడా ఇవ్వాలో రేపో అధికార పార్టీలోకి పోయి ఏదైనా పదవినో , పనులో చేయించుకునే ఆలోచనలో ఉన్నాడట . వాళ్ళు పోనీ మునుపటిలా అధికారులు లేరు. వాళ్ల చేతిలో ఏమి లేదు. వాళ్ళు ప్రజాసేవకులు కాకుండా ప్రభుత్వ సేవకులు అయినారు. పేపరోళ్ళు కూడా మునుపటిలా లేరు. జనం డైనోసారుళ్ళ ఒకరినొకరు కాల్చుక తింటుండ్రు . ఇది అంతా ఎవడి మాయనో పోచయ్య కి అర్థం కావట్లేదు. తన దగ్గరే కాదు మునుపటి తీర్గా ఊళ్ళల్లో ఎవ్వరి చేతిలో రూపాయి ఉంటలేదు. అప్పు రూపాయి పుడుతాలేదు . ప్రజల దగ్గర పైసలు మాయమై అందులో నుండి నిప్పుల మీద నీళ్ళు చల్లినట్లు ప్రజలు అడుగని ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి..

ఈ స్థితికి ఎవడు కారకుడో పోచయ్య కి ఇతమిద్ధంగా అర్థం అవుతలేదు. ఓ తరములో నిజాం రజాకార్లు, ఓ తరములో దొరలు , ఓ తరములో ఆంధ్రా వాళ్ళు .., కానీ ఇపుడు తన కష్టాలకి ఎవడు కారణం, ఇది ఎవడి మాయ అనేది తనకి తెలుస్తలేదు. తెలుస్తున్నా ఎవరితో కలువాలి , ఎవరిని అడుగాలే ? ఎవరిని అనాలే ? ఎవడిని దొరకబట్టి కొట్టాలో కూడా పోచయ్య కి తోస్త లేదు. దోపిడిధారుడు ఎవడైన తహశీలధార్ లెక్కనే తెలివిగా ఉన్నారు. అతని లెక్కనే లోపల గదిలో దాక్కున్నట్లు ఎవడి రక్షణలో ఎవడి జాగ్రత్తలో ఎవడి భయములో వారు ఉన్నారు.

పోచయ్యకున్న ఏకైక దైర్యం అతని భార్యనే. అర్ధరాత్రి పూట నిద్ర పట్టకుంటే ఆమెని లేపి తన బాధ అంతా చెప్పుకుంటుండు. భయమైతుంది అని ఆమెని పట్టుకొని ఏడుస్తుండు. ఆమెకి కూడా అంతకి మించిన ధు:ఖం ఉంది కానీ అతని కోసం దైర్యంగా ఉంటుంది.
“ఎన్ని కష్టాలు చూడలే మనం. ఎన్ని దాటి రాలే. గట్ల అదులుతరా ఎక్కడన్నా ? మనకి శాతనైనా కాడికి చేద్దాము . మిగిలింది దేవుని దయ ‘ అన్నది ఆమె.
దేవుడు అనగానే పోచయ్య లో ఏదో ఆలోచన మెదిలింది.
“నిజమేనే మనం దేవుణ్ణి చేసుకోవాలే. ఐదు ఏండ్లు దాటింది పెద్దేవరని కొలుసుకోక. అంతా దుమాలం లెక్క ఉన్నది ఇల్లంతా. చుట్టపోడు పక్కపొడు కూడా ఎవడు సహకారo చేస్తలేరు. కుడిదిల పడ్డ ఎలుక తీరుగా అయింది. వాళ్ల ధిష్టి కూడా బాగా అయింది. కాబట్టి ఏమైనా సరే ఖర్చులో ఖర్చు. ఒక పదివేలు తెచ్చి చిన్నపాటి గొర్రెపిల్లని తెచ్చి దేవరనే చేస్తా “ అని అన్నాడు పోచయ్య.
పోచయ్య భార్య కి కూడా ఈ ఆలోచన మంచిగానే అన్పించింది. ఉన్నవి లేనివి అన్నీ పోతాయి ఇంటి మీదికెళ్ళి అని ఆమె కూడా ఒప్పుకుంది.
పోచయ్య లో ఏదో కొత్త ఉత్సాహం వచ్చింది. ఒకప్పుడు తను పొలములో మందితో కలిసి నవ్వుకుంటూ పని చేసినట్లు వివిధ సంఘాలలో పార్టీలలో కలిసి పని చేసినంత సంబరం కలిగింది తనలో. అప్పు తెచ్చి చుట్టాలకి వాడపొoటి వాళ్ళకి చెప్పి పెద్దేవర కొలుపు కి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు.

                                                            4 

డుబ్బుల పంతులు పెద్దేవర కొలుపు అయిపోవడానికి వచ్చింది. రాత్రి పదకొండు దాటింది.
గొర్రె పిల్ల కూర లేట్ అయితదని తెప్పించిన తుకతుక ఉడుకుతున్న చికెన్ కూర వాసనకి చిన్న పిల్లల మనసంతా అటే కొట్టుకుంటుంది. అటు చలి , ఇటు లోపల ఆకలికి చేతులు గట్టిగా కట్టుకొని కూర్చున్నారు.
డుబ్బుల కిష్టయ్య మధ్య మధ్య కునికిపాట్లు పడుతుండు. ఉలిక్కిపడి లేచి పవ్వ వేసి తన బాణీలో తాను కొలుపు కొలుస్తున్నాడు.
ఇంట్లో అరుగు మీద కూసున్న పోచయ్య కి కొన్ని చిక్కుడు గుడాలు, ప్లాస్టిక్ గ్లాసులో మందు తెచ్చి ఇచ్చారు.
గొంతులో విస్కీ పడ్డంకా మెదడులో ఆలోచనలు తీవ్రమయ్యాయి.
తనే వెళ్ళి మరో పెగ్ తెచ్చుకొని కూర్చున్నాడు.
“ఈ డుబ్బు సప్పుడేoదో ? వీళ్ళందరూ రావడమేమిటో మొత్తానికి గుర్రమెక్కినట్లున్నది తీయ్ “ అనుకుంటూ రెండో పెగ్ తాగి బయటకు వచ్చి నెగడు దగ్గర మంచములో కూసున్నాడు.

పిల్లలు ఆడవాళ్ళు ఎక్కడ జాగా దొరికితే అక్కడ మలచుక పన్నారు.
మొగవాళ్లు ఇంకా తాగుతూనే ఉన్నారు. తెల్లకల్లు విస్కీ – ఎవరెవరో వాళ్లే వెళ్ళి తెచ్చుకుంటున్నారు.
అందులో ఇద్దరి మధ్య లొల్లి పుట్టింది. కొట్టుకునే మోపు అయింది.
సుగుణ బయటకి వచ్చి “ మా ఏడుపు మాకుంటే మీ ఏడుపు మీది. మమ్మల్ని ఈ వాడ మీద ఉండనిత్తరా వెళ్లగొడుతారా ? “ అనడముతో సద్దు మనిగిండ్రు.
సుగుణ పోచయ్యని చూసి “ తాగుతున్నావా? “ అని మూతి ముడుచుకొని మరిన్ని గుడాలు తెచ్చి ఇచ్చింది.
భూమయ్య నెగడు ముందు రాయి మీదికెళ్లి లేచి వచ్చి పోచయ్య పక్కన మంచములో కూర్చున్నాడు.
“బావా ! బాగా రంధిలో ఉన్నావు. “ భూమయ్య.
“ఔ బావా !నాకేం తోస్తలేదు. “ పోచయ్య.
“సరే బావా గట్లనే ఉంటది. మనమంతా గుంపు విడిచిన గొడ్ల లెక్క అయినాము. గిట్లా కాదు కానీ మళ్ళా మనమందరం కలుద్దాము. “ భూమయ్య పోచయ్య చెయ్యి చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఆ స్పర్శతో పదేండ్లు వెనక్కిపోయిన అనుభూతి పోచయ్యలో.
నెగడు దగ్గర కూర్చున్న శేఖర్ అతని ఇద్దరు మిత్రులు వచ్చి పోచయ్య మంచం దగ్గర గద్దె మీద కూర్చున్నారు.
“దున్నే వాడికి భూమి“ పోరాట ఘట్టాల నుండి ఇప్పటి పరిస్థితికి వచ్చిన రైతుల స్థితిగతులు, ఉద్వేగాల పునాది గురించి వివరిస్తున్నాడు భూమయ్య.
తరతరాలుగా మంచి బతుకు కోసం పోరాడుతున్న తమ కుటుంబం. వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు – భూమయ్య చెప్పిన ఆ పోరాట ఘట్టాలు – వివిధ రూపాల్లో కొనసాగుతున్న పోరాటాలు – ఊరి నుండి తెగదెంపులు చేసుకొని కార్మికుడిగా మారనున్న తను – పెద్దేవర , డుబ్బు శబ్ధం .., అంతా కలగాపులగముగా ఉన్నది శేఖర్ కి. శేఖర్ మిత్రులు కూడా భూమయ్యతో చర్చిస్తున్నారు.

“అల్లుడా ! ఇదంతా గందరగోళమే .., ఈ రాజ్యం మనది కాదు. మన దేశములో ఉన్న ఎక్కువ మంది పల్లె ప్రజలను , ముఖ్యంగా మా బావలాంటి పేద రైతులని కలుపుకపోనిదే ప్రజలు వారి రాజ్యాధికారం సాదించలేరు “ అన్నాడు భూమయ్య.
అందరికి చాయె చేసి పోస్తుంది నీరజ.

“కల్లు బింగి అంపితే పానం బోయినట్లు మీ మామ లెక్కనే నిమనిమాలు పోత్తివి పిల్లా! అదెపాయే ముసలోనికి ఒక్క సుక్క ఎక్కువ వడితే ఏమన్నా తప్పా దండుగా? “ నీరజ కి తాత వరుసయ్యే ఒక నడి వయసాయన వణుకుతూ మాట్లాడుతున్నట్లు కారెడ్డమాడుతుండు.
“ముసలోనివైతే అప్పుడు మా చూస్కుంటా …, వయసు మీదున్నపుడు వయసోడి పనులైతే చేయలేవు “ కొంటెగా నీరజ.

ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు కాంగా పొయ్యి ముందు పీట మీదనే కూర్చొనే నీరజ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి వాళ్ళకి తెలియని చాలా విషయాలు చెప్తుంది.
“శెబ్బాస్ బిడ్డా! మీరు ఇంకా చాలా పుస్తకాలు బేసిక్స్ నుండి చదవాలి. నువ్వు చదుతున్న పుస్తకాలతో పోలిస్తే పావుల మందం కాదు. నీ పరీక్ష అయిపోయినంక నాకు చెప్పు. నా దగ్గర మంచి పుస్తకాలు ఉన్నాయి ఇస్తాను. వాటిని మీరు తప్పక చదువాలి. అప్పుడే మన బ్రతుకైనా మనకి సరిగ్గా అర్థం అవుతాది. రేపు నువ్వు నౌకరీ కూడా సరిగ్గా చేస్తావు. మనకి బయటకు కన్పిస్తున్నది అంతా తలకిందుల ప్రపంచం ఈ టీ కప్పు లెక్క ( అంటూ కప్పు ని బొర్లేసిండు). మనం దానిని సరిగ్గా నిలబెట్టి చూడాలి. మనం అంతా మళ్ళీ మళ్ళీ కలుద్దాము“ అని ఆ ఇంటి ముందు నెగడు దగ్గరి వాళ్లందరిలో ఒక భరోసాని దగ్గరితనాన్ని ఏర్పర్చిండు భూమయ్య.

చలి పెరగడం వల్ల ఊరు అంతా శ్మశాన శాంతిలా గంభీరంగా ఉన్నది. ఆ అర్ధ రాత్రి పూట ఆ ఇంట డుబ్బుల కొలుపు ఒక ధీర్ఘ సామూహిక శోక గీతములా సాగుతుంది. పంతులు గొంతు రుద్ధమైపోతుంది. అందరి మొఖాలు ఉబ్బి మీదికచ్చినట్లు ఉన్నాయి. ఆడొల్లు అందరూ శెనార్తి శెనార్తి అని రెండు సేతుల పబ్బతి పట్టి మొక్కుతున్నారు. పోచయ్య బార్య జయ కండ్ల వెంబడి నీళ్ళు ధారలై పారుతున్నాయి. కూర్చొనే ఉండి బాణం లెక్క వంగి పోయి నెత్తి నేలకి ఆనించి మొక్కుతుంది పదేపదే . అందులో పోచయ్య చెల్లెలికి దేవుడచ్చింది. ఇంట్లో ఉన్న పెద్ద ముసలి వాళ్ళు ఇద్దరు ఉగ కొద్ది లేసి ఎగురుతున్నారు. దాదాపు అందరూ ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకోకున్నా గాని రౌండ్ గా అందరి వంచిన తలలు ఒక దగ్గరిగా చేరినయి. ఆడొల్ల తల వెంట్రుకలు కిందికి వేలాడుతున్నాయి. పంతులు మరియు దేవుడచ్చిన పోచయ్య చెల్లెలు ఇద్దరు కలిసి కొద్దిసేపు గావు కేకలతోని ఎగిరెగిరి దుoకినారు . ఆమెని పంతులు గట్టిగా పట్టుకోని శాంతింప చేసిండు. రెండు దెబ్బలు కూడా కొట్టి౦డు. ఆమె కోపముతో ధు:ఖంతో అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చిoడు. అదంతా చూసిన జయ కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి దేవుడస్తున్నట్లు “ గీ హ్హీ హీ “ అంటూ రెండు చేతులు కలిపి విరవబోయింది. వెంటనే భూమయ్య లోపలికి వచ్చి ” హెట్ …, నీకేమి దేవుడే ?” అని జయ వీపుల గట్టిగా కొట్టి ఆమెని గట్టిగా అలుముకొని ఓదార్చిండు. ”జయవ్వా ! జయవ్వా !” అంటూ పిలిచిండు. జయకి వచ్చే దేవుడు ఆగిపోయింది.

”ఏయ్ కిష్టయ్య ! ఏంది నీ దుఖాణం ?” అని కిష్టయ్య దిక్కు కోపంగా చూసిండు భూమయ్య.
చిన్న పిల్లలు ఒకల చూసుకుంటూ ఇంకొకరు భయముతో కూడిన నవ్వుని ఆపుకుంటున్నారు. పోచయ్య కళ్ళ నిండా నీళ్ళు నిండి ఉన్నాయి.
శ్రీకర్ ఇంకా ఇంటి వెనుకాల కూర్చొని ఫోనులోనే ఏదో ఆఫీసు రిపోర్ట్ పంపుతున్నాడు.

గొర్రె పిల్ల జెడ్తి ఇయ్యక చిన్న గోస కాలేదు. ఎవరేమీ మొక్కినా కానీ అది అర గంట దాటినా జెడ్తి ఇత్తలేదు. ఆ విషయం తెలిసి దాని కిటుకు తెలిసిన భూమన్న మొక్కినట్లు మొక్కి గొర్రెపిల్ల ముక్కుల గట్టిగా తెల్ల కళ్ళు నింపిండు. దెబ్బకి జెడ్తి ఇచ్చింది. పంతులు మూసుకున్న కండ్లు తెరిచిండు . గొర్రె పిల్ల మెడ తప్పించినారు. పెద్దేవరకి మొక్కు అందింది.

కొలుపు మంగళ హారతికి వచ్చింది. జయ , ఆమె బిడ్డ శృతి మనిషికో మంగల హారతి పాట పాడిండ్రు. పోచయ్య మామ నర్సింహ శతకం పద్యం పాడిండు. దేవుని కొలుపు అయిపోయింది. అడోళ్ళ సిగలు అన్నీ మళ్ళీ ముడుసుకున్నాయి.
చివరలో దేవుని కుండ అందరి నెత్తి మీద పెట్టి పట్నం వేసే బద్ధతో వీపు మీద కుంకుమ పసుపు నింపి ముద్ర కొట్టుడు పంతులు ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం మొదలైంది.
పోచయ్య మామతో మొదలు ఒక్కొక్కలు ముందుకొచ్చి పంతులు రెండు చేతులకి తమ రెండు చేతులు కలుపుతూ తాకిస్తూ శనార్తి చెప్పుకుంటూ ఆశీర్వాధo తీసుకుంటున్నారు.
పోచయ్య మామ ముందుకొచ్చి దేవుని పట్నం ముందు వంగి ”శెనార్తీ !” అని రెండు చేతులెత్తి మొక్కి౦డు.
పంతులు కూడా ”శెనార్తీ !” అని చెప్పి వీపు మీద పట్నం వేసే బద్ధతో కుంకుమ పసుపు నింపి చిన్నగా కొట్టిoడు.
ఆ తర్వాత దేవుని గురిగి (చిన్న కుండ ) ని నెత్తి మీద పెట్టి నేను చెప్పినట్టు అనమన్నాడు పంతులు .
”దేవుడా !”
”దేవుడా !” అతను అలాగే అనడం మొదలు పెట్టిoడు
”నేను నిన్ను ఎత్తుకున్నా”
“నేను నిన్ను ఎత్తుకున్నా “
”నువ్వు నన్ను ఎత్తుకున్నావు.”
”నువ్వు నన్ను ఎత్తుకున్నావు.”
”నా పిల్ల జెల్లా పాడి పంట సల్లగా ఉంటే “
”నా పిల్ల జెల్లా పాడి పంట సల్లగా ఉంటే “
”మల్లచ్చే ఐదేండ్లకి నిన్ను కొలుసుకుంటా “
”మల్లచ్చే ఐదేండ్లకి నిన్ను కొలుసుకుంటా “
”నా దేవుడు “
”నా దేవుడు “
”నా దేవుడు “
”నా దేవుడు “
”నా దేవుడు పో !” అని పంతులు ముసలాయన నెత్తి మీదికెళ్ళి దేవుని కుండ గుంజుకుని నుదుటన విభూది పెట్టి పంపించిండు.
అట్లా ఒకరి తర్వాత ఒకరు.
అట్లా అందరితో అనిపిస్తూ పంతులు చివరలో తానే అవకాశం తీసుకొని “నా దేవుడు పో ! “ అంటూ దేవుని కుండని తాను లాక్కుంటూ అందరినీ పంపించడం అనేది పోచయ్య మనసులో కళుక్కుమనిపిస్తుంది.
పోచయ్య వంతు వచ్చినకా కూడా తాను కూడా అంతే అయిండు . అతనిలో ఒక నిస్సత్తువ నీరసం ఆవహిస్తుంది. ఏదో దైర్యం లేని తనంతో పేదగా చూస్తుండు.
అయితే శేఖర్ మాత్రం మొండిగా చివరలో “ ఎహే ! నా దేవుడే పో ! “ అన్నాడు.
భూమయ్య ఈ తతంగమంతా చూస్తుండిపోయిండు.
అంతా అయిపోయాక ఉన్నదాంట్లో ఉప్పుతోని తొమ్మిది పప్పుతోని పది చాట్ల పోసి పంతులు కి పండ్లు కాయగూరలు ఉప్పు పప్పు చింతపండు మానేడు బియ్యం , పదిహేను వందల రూపాయలు ఇచ్చుకున్నారు.
అందరి నుండి శెనార్తులు స్వీకరించి తిరిగి శెనార్తి చెప్పుకుంటూ బయటకి నడిచిండు పంతులు.
వాకిట్ల మంట దగ్గర భూమయ్య దగ్గరగా వచ్చినంక పంతులు గతుక్కుమన్నడు.
“శెనార్తి భూమన్నా ! ఏదో పొట్ట తిప్పలకు జేరిపోతులాడిత్తున్న “ అన్నాడు.
ఉధ్వేగముతో ఉన్న అందరి ముఖాలు చూసి భూమయ్య ఏం మాట్లాడలేదు.
తనే లేచి ఇంటి వెనుక భాగములో జరుగుతున్న కోసిన గొర్రె పొతం చేసుడు మరియు వంటలకాడికి నడిచిండు.

                                        5 

ఇంటి ముందు తన టీవీఎస్ ఎక్సెల్ బండి మీద తన సామాను సంచి పెట్టుకునే ముందు ఇంటి ముందు ఉన్న గద్దెపై కూర్చొని సంచిలో అన్నింటినీ సర్దుకుంటున్నాడు డుబ్బుల కిష్టయ్య పంతులు. అతని ముఖం కొలుపు తాలూకు ఉద్వేగాలు లేకుండా తేటగా ఉన్నది.
ఇంతలో మెల్లిగా అక్కడికి వచ్చిoడు పోచయ్య.
దిగాలుగా పంతులు దగ్గరనే కూర్చున్నాడు.
పోచయ్య మొఖం చూస్తే తెలుస్తుంది పంతులుకి . అతనిలో అంతులేని ధు:ఖం దాగున్నదని.
కానీ దానిని పెకిలించి ఉట్టిగా బాధపెట్టడం మంచిది కాదని పంతులు అనుకున్నాడు.
“మీరేమన్న చెప్పుoడ్రయ్యా ! దేవుడైతే నా దేవుడే “ అని గుడ్లల్లో నీళ్ళు తెచ్చుకొని తల కిందికేసి అన్నాడు పోచయ్య .
పంతులుకి ఒక్కసారి ప్రాణామంత నీళ్లయినట్లు అన్పించింది.
సర్దుతున్న సంచిని అదే గద్దె మీద కొంచెము పక్కకి జరిపి౦డు .
”పటేలా !” అని పిలిచిండు.
పోచయ్య కుయిమనలేదు.
”ఓ పటేలా ! దేవుడు నీ దేవుడు కాకుంటే నా దేవుడైతడానయ్యా పటేలా !”
పోచయ్య తల కిందికే వంచి ఉంది.
”నా దేవుడెట్ల ఐతడయ్యా ?” మళ్ళీ పంతులు.
అంతే పోచయ్యలో ఆ మాట వినేసరికి ఎక్కడలేని బలం వచ్చింది.

“దేవుడు ఎక్కడుంటాడయ్యా ? ఎవడు కష్టపడుతాడో ,ఎవడు నలుగురికి అన్నం పెడుతాడో వాని దగ్గర ఉంటాడు దేవుడు . నేనేమన్నా బావని పంతులునా నిన్ను బొంకించి బోర్లేయ్యడానికి ? అరే సర్వం నీదేనయ్యా , నువ్వే సాక్షాత్తు ఆ దేవునివి, శంకర పరాత్పరుడివి . ఆ దేవునికింత నైవేద్యం వండి పెట్టాలంటే కూడా నీ పెండ్లాం పిల్లల రెక్కల కష్టం తో నువ్వు నాలుగు గింజలు పండిత్తెనే ఐత౦ది. అగో మనందరి కోసం ఇల్లు ఇడువాటం ఇడిసి – నలబై ఏండ్ల కింద పెండ్లాం , తను మనందరి కోసం తుపాకి పట్టి పోరాడిన భూమన్న సూడు. ఆ మహాతల్లి లఢాయిల ఒరిగిపోయింది. భీమన్న జెనికిండా బొందిల పానమున్నంతవరకు తిరుగుతలేడా? ఇటువంటోల్లు ఊరికొక్కరైనా ఉన్నారు. కలియుగములా కష్టపడేటోన్ని నష్టపెట్టినప్పుడు – దేవుడు కష్టపడేటోని పక్షాన ఉంటాడు.

నీ మనసు అయితే సెదర కొట్టుకోకు. నీ కట్టాలన్నీ తీరుతాయి. దానికి హరిహర బ్రహ్మాది దేవతలే పూనుకుంటారు.
మట్టిని పిసికి మట్టిలో బువ్వని తీసి మట్టిని తిని మట్టిని ఏరిగిన ఎవ్సాయాదారునికే అన్నం కరువైతే లోకం మీద అగ్గి పుట్టదా? లోకం మసై పోదూ? మన్నై పోదూ? కలియుగం జగ బుడ్డయిపోదూ?
ఈ లఢాయి ఆగిపోదు. మనిషికి జానెడు కడుపున్నంత కాలం . పొట్టగొట్టేటోడున్నంత కాలం లఢాయి ఆగదు. మనండ్ల నుంచే భూమన్నఅతగాని భార్య పుట్టలేదా ? ”
పోచయ్య గురించి పంతులు కి బాగా తెలుసు. ఆయన కష్టం గురించి ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితి కూడా పంతులు కి తెలుసు.
అందుకే పోచయ్య అలా బేలగా చూసే సరికి పంతులులో ఆవేదన పొంగింది.
లోపల భోజనాలు చేస్తున్నారు కొందరు.
పోచయ్య కుటుంబం అంతా బయటికి వచ్చింది.
పోచయ్య తల్లి వంగి ఉండే “ఏదున్నా మీ అసొ౦టోళ్ళే దైర్ణ౦ సెప్పాలే బా౦చెను “ అని రెండు సేతులతో మొక్కింది.
పంతులు ఉఢ్వేగభరితుడైండు . మామూలు మాటల్లో చెప్పే స్థాయి దాటిపోయి పంతులు మళ్ళీ పదం అందుకున్నాడు. తనకి ఆనందం వచ్చిన ఆవేశం వచ్చిన చెప్పే ప్రతి మాట పదం పాటగానే మారుతది .
“ ఇది పాలివాడు చేసిందా పగవాడు చేసిందా?
మంత్రకాడు చేసిందా కట్టుబోతలోడు చేసిందా?
ఇది దొంగల మాయనా ? ఇది దొరల మాయనా?
ఇది నరుల మాయనా? ఇది ‘ధరణి’ మాయనా ?”
పంతులు ఒక చేత లుంగి సింగులు పట్టుకొని ఇంకో చేత పట్నం బద్ధని ఊపుతూ ఇంటి ముందు వాకిట్లో అటు ఇటు నడుస్తూ చెప్తున్నాడు.
“ఇది ఎవడి మాయ పటేలా? “ అని పోచయ్య కళ్ళలోకి కోపంగా చూసిండు పంతులు.
పోచయ్య తల ఊపిండు.

“మరి నాడు ఎవడి మాయ ? మరి నేడు ఎవడి మాయ ?
పోచయ్య పటేల్ కష్టానికి కారణమెవడే మాయమ్మా !?”
పాట నుండి దిగి వచన౦ అందుకున్నాడు పంతులు.
కాళ్ళు నెర్రెదన్ని ఉద్వేగంగా చెప్తుండు.
“సప్త సముద్రాలు దాటి పది పర్వతాలు ఎక్కి ఘోర అరణ్యాలల్లో మహా వృక్షoబు చెట్టు తొర్రలోని పంజరాన రామ చిలుకలో ప్రాణం దాచుకుంటే మాయల ఫకీర్ గాన్ని దొరకబట్టి మటమాయం చేసి చంపలేదా?”
“ఏ చంపిర్రయ్య .., సంపకుంటే ఊకుంటరా మరి కడుపు కాలిన రోజు ?” పోచయ్య మామ .
“ధరణి మొత్తాన్ని చాపగా చుట్టి సముద్రములో పడేస్తానంటే ఆ ఘోర రాక్షసుడు హిరణ్యాక్షున్నిభగవంతుడు వరహావతారమెత్తి కొమ్ముతో పొడిసి సంపలేదా ?”

“జరిగిన ముచ్చటనేనయాయే .., అందులో ఏమన్నా అబద్దం ఉందా ?” పోచయ్య భార్య జయ.
“ మేం వచ్చేటి బాటల్లా మనం పోయేటి తొవ్వల వాళ్ళని తీసుకపోయి అరే వాళ్ళని తీసుకపోయి మూడు తొవ్వలు కలిసే కాడ అడ్డం నిలువు పండబెట్టి వాళ్ల ముక్కు మూడు చెవులు కోసినారె .., ఏ ఏ ఏ ..” పంతులు కోపం కొద్ది ఎగపోత్త౦డు.
“ కొయ్యలేదా ? నాడు అడ్డంగా పండబెట్టి కొయ్యలేదా ? తపాలపూర్ గడి నుండి దొరల గుంజి మూడు బజార్ల కాడ కత్తులు గొడ్డoడ్లతోని నరికి చంపలేదా ?”మళ్ళీ పోచయ్య మామనే.
నీరజ పోచయ్య మామ దిక్కు చూస్తుంది తనకి ఐతే ఆ సంఘటన మొత్తం తెలిసి ఉంటది అని.
పోచయ్య బార్య జయ దిక్కు తిరిగిoడు పంతులు.
“వాళ్ళ మొగవాళ్లని అయితే దేవి ! వాళ్ళ ఇంట్ల సొచ్చి దేవి ! నడి బజార్లకి గుంజి నరికి దేవి వాళ్ళ కార్జెo పీకి వాళ్ళ దొబ్బలు పీకి తోరణములు కట్టినారె మాయమ్మ !”
“మా కండ్ల ముందటి ముచ్చటనే అది. గీడనే ఈ తిమ్మాపురములోనే దొర దగ్గరి మనిషి మద్దతుదారుని పొడిసి చంపలేదా ? కార్యాలు దొబ్బలు బయటపడలేదా ? “ పోచయ్య తల్లి.

“వారి ముక్కు మూడు చెవులు కోసి నేను పోయేటి దిక్కునా ఆ తూర్పు రాజ్యాన తుంగ మడుగులున్నాయి
బర్లు బోర్లేటి మడుగులున్నాయమ్మా పారేటి గంగల్లా పాడుబడ్డ బాయిల్లనమ్మ
వాళ్ళని పారేసినారె .., ఏ ఏ ఏ ..,
వాళ్ళు పాడైపోయినారు వాళ్ళు దోడయిపోయినారు .
దొర పేరు మాసిపోయింది దొర ఇల్లు గబ్బీలాల మేడ అయిoదే
వాళ్ళని జనం ఎత్తుకోలేదే
జనం కోసం నిలబడ్డ వాళ్ళనే జనం దేవుళ్ళ లెక్క ఎత్తుకున్నారే” పంతులు సిగాలెత్తి౦డు.

“నిలబడరా మరి? ఇపుడు మనకు మనమే దేవుళ్ళo . మనకి మనమే నిలబడాలి. ఎనుకటి నుండి చుట్టూ పదూర్ల పెట్టున జరిగిన చరిత్ర మాకు తెలియనిదా, ఇపుడు జరిగేది తెలుస్త లేదా? మా పోచయ్యకి తెలియదా? గట్టిగా నిలబడి అడిగేటోడు లేక. దేనికైనా కాలం, వైపు కలిసి రావాలి. కథ ఎప్పటికీ ఒక తీరే నడువదు. “ పోచయ్య మామ సమాధాన పడ్డ మనిషి లెక్క శాంతిగా మాట్లాడుతున్నాడు.
పంతులు చెప్పి చెప్పి సొమ్మసిల్లి పడిపోయిండు.
మొఖం మీద నీళ్ళు చల్లితే కొద్ది సేపటి తర్వాత తెలివికి వచ్చిన పంతులు అందరికీ శెనార్థులు చెప్పి బయలెల్లి పోయిండు.
బయట పున్నమి వెన్నెల ట్యూబ్ లైట్ లెక్కనే వెలుగు పంచుతుంది.
భూమయ్య, శేఖర్ అతని ఇద్దరు మిత్రులు , నీరజ , స్వాతి నెగడు ముందు కూర్చున్నారు.
భూమయ్య లేచి గద్దె మీద కూర్చున్న తన బావ పోచయ్య పక్కనే కాసేపు నిశబ్ధంగా కూసున్నాడు.
మాటల్లో తను సాదాబైనామ కింద కొన్న భూమి రెండెకురాలు ధరణిలో దొర పేరు మీద వచ్చిన సంగతి చెప్పి ఏం చేయాలో తోచక తన కుటుంబం తల్లడమల్లడం అవుతున్న సంగతి చెప్పిండు పోచయ్య.

“ఇపుడు భూమి ఎవల కబ్జాలున్నదే ? “ భూమయ్య .
“దొర పేరు ఎక్కిన కాడి నుండి పడావుల ఉన్నది. కిరికిరి నడుత్తoది . “ పోచయ్య.
“దొరోడు మర్లబడ్డడా ? “
“మధ్యవర్తులు, పోలీసోళ్ళు అడ్డం పడుతుండ్రు. “
భూమయ్య లేచి పోచయ్య రెండు చేతులు పట్టుకొని –
“నువ్వేమి ఫికర్ పడకు బావా ! నీ భూమి ఎటు పోదు.ఈ వానాకాలం పంట దున్ని చూడు. నేను నీ భూమి మీదికచ్చి నిలబడుతా. ఎవడు భూమి మీదికత్తడో చూద్ధాము. అట్టిగనే ఉన్నమా .., అడ్డమత్తే అడ్డంగా నరకమా ? “
అందరు తలో ఆలోచనలో పడి కొంత దైర్యo , ఆశతో ఊపిరి పీల్చుకున్నారు గట్టిగా.

మార్చ్ 20, 2023 సోమవారం.
ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ రైతుల సమావేశం “ కిసాన్ మహా పంచాయతన్ “ జరుగనుంది. రైతుల , కౌలు రైతుల, రైతు కూలీల హక్కుల కోసం తిరిగి మొదలవనున్న ఈ పోరాటం భారతదేశ రాజకీయాలని ప్రభావితం చేయనున్నది.

                                                                 6 

మహారాష్ట్రలోని నాసిక్ నుండి మార్చ్ 12 తో ప్రారంభమైన వేలాది రైతులు ,అందులో ఆదివాసులు మహిళలు , కార్మికులు విధ్యార్థులు యువత అత్యధికంగా పాల్గొని చేసిన “ లాంగ్ మార్చ్” దేశవ్యాప్త కార్మిక కర్షక పోరాటాల ప్రయోగాలలో ప్రయత్నాలలో విజయవంతమై వారు చేసిన 14 డిమాండ్స్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు కిందనే మార్చ్ 19 న అన్ని డిమాండ్స్ ని పరిష్కరిస్తామని ఒప్పుకోవడముతో మహారాష్ట్ర రైతులు “ లాంగ్ మార్చ్ “ ని నిలిపివేసారు. ఐతే వారు మిగతా రైతు రైతు కూలీ కార్మికుల ప్రయోజనాల డిమాండ్ లతో పాటు 2004 సెప్టెంబర్ 1 నుండి రద్దయిన ప్రభుత్వ ఉద్యోగులకి “ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ “ పునరుద్ధరణ కూడా ఒకటిగా ఉండడం అనేది భారత దేశ ”వర్కింగ్ క్లాస్” ఏకీకరణకి రాబోయే మే డే సరికొత్త వర్కర్స్ డే గా నిలవబోతుందనే ఒక కొత్త ఆశని రేకెత్తించింది.

ఆ సోమవారం రోజున …
తపాలపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుండి జన్నారం మండల హెడ్ క్వార్టర్ కి పోయే రోడ్ అది. రైలు సొరంగం లోకి సొచ్చినట్లు , కార్మికుడు బొగ్గు బాయిలోకి దిగినట్లు ఉండే ముఖ ధ్వారం. దొర గఢీ లో ఉన్న వెనుకటి పులి తోలు లాంటి ముఖం దానిది. అది కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా.
కనుచూపు మేరకి ఏం ఆశ లేదు అనిపించేలా ఉంది ఆ పొద్దున పూట పొడి ఎండని చూస్తే.
అడవి నడుమ పెద్దగా వాహనాలు లేని జేరు గొడ్డు అటువంటి డాంబర్ రోడ్.
అడవి అంతా ఏ దిక్కు సక్కి లేక ఏడుస్తున్న సిప్పిరి వెంట్రుకల ముసలి లెక్క బొయ్యిమని సప్పుడు.
వచ్చే వానకాలపు జల్లులకి పడిపోదామని చూస్తున్న రోడ్ సైడు కి వంగి ఉన్నచేవచచ్చిన చెట్లు. ఆ కిందనే కుక్కల వలె ప్రయాణికుల పండ్ల లేదా తినే పధార్థాల పంపిణీ కోసం నాచుపెట్టుకొని చూస్తున్న అప్రకటిత అనధికార స్వయం నిర్వాసిత కోతుల గుంపు.

ఎంక్లోజర్ నడుమ రెహాబిలిటేషన్ సెంటర్ లో అననుకూల పరిస్థితుల్లో ఉంటూ రోడ్ దిక్కు కన్పిస్తున్న బలహీన బాధిత జబ్బుపడిన జింకలు దుప్పులు. ఆ వెనుకాలే టైగర్ రిజర్వ్ పేరిట అడవి నుండి పంపిస్తే మరో అడవిలోనే మాకు రెహాబిలిటేషన్ కల్పించాలనే పట్టుదలతో ఊర్లు విడిచిపెట్టకుండా గత పదేళ్లుగా ఉండి , టార్గెట్ చేయబడి వసతులకి వ్యవస్థకి దూరమై దిగివచ్చి ఎక్కడిచ్చిన సరే వెళ్తాము అని హై కోర్ట్ కి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్న అమలు కాక ఒంటరై బక్కచిక్కిన బెంగటిల్లిన దొంగపల్లి మల్యాల గ్రామాల ఆదివాసులు.

గాలికి ఎండి రాలిన టేకు ఆకులు గల్లర గల్లర దొర్లుతున్నాయి ప్రజా కళాకారుల కాలి గజ్జెల శబ్ధం వలే. ఆ ఆకులపై ఎక్కడైనా ఏ చిన్న బరువుపడినా పరపరమనే గట్టి గొడ్డలి మాటు లాంటి రంపపు సప్పుడు. తిండి తిప్పలు లేక ఎండిన డొక్కల బక్క చేతి బొక్కల వలే ఆకులు లేని కొమ్మల కట్టరకట్టర రాపిడి. ఏ ఆధరువు లేకుండా తొవ్వ పట్టి తిరుగుతున్న జనం లెక్క గూడు లేని పక్షుల వింత విరక్తి అరుపులు. పటపటమనే చెట్ల కదలికల మధ్యలో ఎవలో డప్పు వాయిస్తున్నట్లు పొయ్యి గొట్టం ఊదుతున్నట్లు విని వినపడనటువంటి లీలగా గాలి సంగీతం.

ఆకాశానంటుతున్నాయేమో అన్పించేలా ఉన్న టేకు వనాల మొదల్ల వెంట పైకి పాకుతూ రాలిపడుతూ వెల్తురు మసకల నడుమ కాండం చుట్టుమట్టి పొట్టు తీస్తు చెద పురుగులు చేస్తున్న తడిపొడి అలుపెరుగని పోరాటo అక్కడ సాగుతున్న ఒక అద్భుత సజీవ దృశ్య రూపం.

లోయలు కొండలు అటువంటి ఆకులు అలములపై , గట్టి మట్టి నేలపై పడుతూ లేస్తూ విషపురుగుల నడుమ బారులు కట్టి సాగుతున్న చీమల దండు, సమస్త విశ్వమంతా కలిసి ఒక ఆశయం కోసం ఏదో ఒక సామూహిక శ్రమసౌందర్య గీతం పాడుతున్నట్లుగా ఉంది.

జన్నారం ఊళ్ళోకి చొర్రoగనే హరితా రిసార్ట్ చుట్టు ముట్టినట్లే ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ,కొద్ది దూరములో తహశీల్ ఆఫీసు .
ఆ ఉదయo పూట ఈ మధ్యనే కొంచెం పొట్ట వస్తున్న ముప్పై ఏండ్ల పైన ఉండే ఎస్సై సతీష్ కుమార్ క్వార్టర్ లోనే పాత సోఫా లో కూర్చున్నాడు. నిన్న మధ్యాహ్నం ఏ పని ఉద్యోగం లేదని యువకుడి ఆత్మహత్య , అటు తర్వాత అర్ధరాత్రి గంజాయి అమ్ముతున్న ,తాగుతున్న యువకుల బ్యాచ్ ని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ల స్థితిని చూసి నిద్ర రాకపోతే తాగిన విస్కీ శరీరానికి పట్టక ముందే పొద్దున్నే తప్పక లేవాల్సి వచ్చినందుకు తనను తానే తిట్టుకుంటూ తల నొప్పితో కంతలు పట్టుకొని నలుసుకుంటూ తహశీల్దార్ కి ఫోన్ చేసిండు.

“సార్ నమస్తే ! నిన్న లోతొర్రె ఊరికి పోయినారా సార్ ! కొంచెం రిమోట్ ఏరియాస్ కి పోతే మాకు ముందుగా ఇంఫార్మేషన్ ఇవ్వండి . “
“ ఎందుకు సార్, ఎనీ ప్రాబ్లమ్ ? “ తమ సమస్యలకి ఏ తొవ్వ దొరకక పొద్దు అంతా కయ్యరమయ్యరమని మీద పడే జనాలని .., ఉపాధి లేక సంఘాల పేరిట పిర్యాధులు చేసి కాంప్రమైస్ చేసుకొని కాలం గడుపుకునే లీడర్లని , ఊ అంటే ఉసీళ్ళ పుట్ట లెక్క లేసే ఆదివాసులని తన తెలివితో మత్పరిస్తూ నౌకరీ సాగదీస్తుండు ఆ తహశీల్దార్ కిరణ్ కుమార్.

“రాత్రి ఉండమంటే వెంటనే పోతిరి. ఎవలు కూసున్న లేకున్నా మనమైతే అపుడపుడు సిట్టింగ్ చేయాలి సార్ కొన్ని ముచ్చట్లు అయిన డిస్కస్ చేయడానికి. ఏం లేదు రిక్రూట్మెంట్ కోసం బయటి నుండి వాళ్ళు వచ్చి పోతున్నట్లు సమాచారం ఉంది . అందుకే మన లోకల్ లీడర్స్ కి కూడా జాగ్రత్తలు చెప్పి ఉంచుతున్నాము. ”
“ వాళ్ళంటే ?”
“ ఇంకెవరు మావోలు “
“ అంత ఉందంటారా ఎస్సై గారు , మనమే డిక్లేర్ చేస్తిమి వాళ్ళు ఇక్కడ లేరని. ఇంకా బయటి నుండి వాళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయా ఇపుడు ? “ కొంచెం హాస్యంగా తహశీల్దార్ .
“ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలే ఆకురాలు కాలం సార్ . ఆడవంతా ఎండుటాకులతోని నిండి ఉన్నది. ఎల్గడి అంటుకోవాలంటే ప్రతిసారి ఎవలో బయటివాళ్ళే వచ్చి అగ్గి పెట్టాలనేమి లేదు. అడవి బాగా ఎండి ఉంటే మనకి తెలియకుండానే ఒక్కోసారి లోపల దానికదే కూడా అంటుకుంటది. రగులుకుంటది. అప్పుడు చల్లార్చుడు మన తరం కాదు“ ఎస్సై.

ఆ మాటలు విని తహశీల్దార్ మనసులో చిరాకు చెందాడు. నిరంతరం గుట్కా నములుతూ తుప్ప తుప్ప ఉమ్మే అతను ఆలోచనల్లో పడ్డాడు. ఇన్నాళ్ళూ గంభీరంగా ఉండే వాతావరణములో ఏదో మార్పు కనిపిస్తుంది. ఎక్కడొల్లు అక్కడ జనమంతా చెలరేగినట్లు ఉన్నారు. అంతా గజిబిజిగా కలగాపులగముగా ఉంది. పది రోజులుగా ఆదివాసీలు అందరూ హాస్టల్ తండా దగ్గరి అడవిలో పోచమ్మ దేవత పండుగ అయిపోయినంకా కూడా వందకి పైగా మకాం వేసి తిరిగి పోతలేరు. అది మా తాతల పట్టా భూమి అని అంటుండ్రు. మరో వైపు ఇండ్ల జాగల కోసమని జనమంతా కేసుల భయం లేకుండా సర్కారీ భూముల ఆక్రమణకి పాల్పడుతున్నారు. కేసులు పెడుతాము అంటే పెట్టినా సరే మేమైతే ఏ ఆధారం లేని పేదలం అని వారి ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు కేసు బుక్ కోసం. కార్ లో నుండి చూస్తుంటే ఎదురుగా ఒక యాబై మందే చేతుల్లో జెండాలతో ఒక కార్మిక సంఘం ఆధ్వర్యములో పాదయాత్రగా పోతున్నారు. అందులో ఎక్కువ మంది ఆడవాళ్లే. ఒక దిక్కు ఎవరో మైకులో పత్తి ధర పెంపుదల గురించి రైతుల ఛలో కలెక్టరేట్ కార్యక్రమం గురించి ప్రకటన చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష పత్రాలు లీక్ అయినాయని నిరుధ్యోగులు రాస్తారోకో చేస్తున్నారు గంట కింది నుండి. తహశీల్దార్ ఆ ట్రాఫిక్ లో ఆగిండు. ఆ వైపు నుండి మినిస్టర్ వెళ్ళే ప్రోగ్రాం ఉన్నందున పోలీసులు బలవంతంగా లేపడం కోసం లాఠీ జులుపిస్తే “ కొట్టు కొట్టు “ అని భయపడకుండా పారిపోకుండా దెబ్బలు పడుతూనే యువత పోలీసు లాఠీలకి జబ్బలు చూపించడం కొడుతున్న పోలీసు అధికారులలో భయం కల్గించింది. ఆ సమూహములోనే ముందు వరుసలో నిలబడి నీరజ చాలా ఆవేశంగా పోలీసులని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఆమె చేతిలోని మ్యాగజీన్ పుస్తకం స్వాతి పట్టుకుంది.

గత వానాకాలం తుఫాన్ వరధలకి మండలమంతా గోదావరి నీళ్ళతో నిండిపోయినట్లు ప్రస్తుతం మనుషులంతా వారి వారి ఊరిలో నుండి భూముల నుండి సంపద నుండి వెళ్లగొట్టబడి నిర్వాసితులై ఆకలితో దిక్కు లేక రోడెక్కినారేమో అన్పిస్తుంది వాళ్ళని చూస్తుంటే.

వాట్సాప్ గ్రూపులో మంచిర్యాలలో “సత్య శోధన “ ఫూలే నాటకం అని ఒక మెసేజ్ చూస్తూ రోడ్ పక్కకి చూసిండు తహశీల్దార్. ఒక పెద్ద పోస్టర్ గోడకి అంటిoచబడి ఉండి. అందులో “ గూడ అంజన్న యాదిలో .., ‘ఊరు మనదిరా !’ పోరు పాటల నీరాజనం .., భారీ బహిరంగ సభ , బెల్లంపల్లిలో అని ఉంది. కృష్ణ జిరాక్స్ సెంటర్ చౌరస్తా దగ్గర వంద మంది దేని కోసమో గుమికూడిండ్రు. వారి మధ్య శేఖర్ నిలబడి మాట్లాడుతుండు ఏదో విషయమై.

అప్పటికే “ గ్రామీణ పేదల సంఘం” అని ఒక గుంపు ఆఫీసు దగ్గర జమ అయిండ్రు. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగుల ముఖ్యంగా టీచర్ సంఘం వాళ్ళు పీఆర్సీ పెండింగ్ బకాయీలు, ప్రతి నెల మొదటి తారీకునే జీతాలు ఇవ్వాలనే డిమాండ్స్ తో రోజు మొత్తం నిరసన కార్యక్రమం తహసిల్ ఆఫీసు ముందే ఉన్నదట.

కార్ దిగి ఆఫీసు లోపలికి పోతున్న తహశీల్దార్ కి చెట్ల నుండి రాలిన ఎండుటాకులు ఆఫీసు ముందు దరఖాస్తులు పరచినట్లుగా ఉన్నాయి.
ఆఫీసు బయట గోడ మీద పోలీసులు అంటించిన పోస్టర్ ఉంది. దాని మీద “మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవండి – అభివృద్ధికి తోడ్పడండి … ” అని ఉంది. అందులో ఎనిమిది మంది ఫోటోలు, వారి వివరాలు రివార్డ్ , ఇద్దరివి ఫోటోలు లేక కేవలం డబ్బాలో పేర్లు రాసి ఉన్నాయి.
ఆఫీసులోకెళ్ళి తన ఛాంబర్ లో కూర్చున్న తహశీల్దార్ అంతా టెన్షన్ టెన్షన్ గా అంతు పొంతు లేని ఆలోచనల్లో మునిగిపోయిండు.

పుట్టిన ఊరు: కనగర్తి. ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. SRR డిగ్రీ కాలేజీ కరీంనగర్ లో బీ.కామ్ . చదివి కాకతీయ విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చేసారు.
సాహిత్యం పరిచయం: చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ పాటలు, పాఠశాల స్థాయిలో ఠాగోర్ జీవిత చరిత్ర(7వ తరగతి తెలుగు ఉపవాచకం), గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర(ఇంటర్ లో), డిగ్రీ చదివేటపుడు మాక్సిం గోర్కీ అమ్మ, నేను హిందువునెట్లయిత?, చలం సాహిత్యం.
రచనలు: 'ఒక మూల్నివాసీ గీతం' పేరుతో త్వరలో కవితా సంకలనం రానుంది. 'మహానీయుల జీవిత చరిత్ర'ల వ్యాసాలు (దినపత్రికల్లో). ప్రస్తుతపు కథ ఆరవది . మంచిర్యాల్ జిల్లా జన్నారం తహసీల్దార్ గా పనిచేస్తున్నారు.

 

2 thoughts on “ధరణి

  1. మంచి కథ
    ఇప్పటి కథ
    ఊరూరి కథ
    భూమి కథ

Leave a Reply