(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర – 2)
“దైవమిచ్చిన భార్య” చలం రెండో నవల. 1923లో రాశాడు. ఇప్పుడు ఆ నవలకి శత జయంతి సంవత్సరం. తన మొదటి నవలలో సరళ గ్రాంధికాన్ని ఉపయోగించిన చలం ఈ నవలలో మామూలు వాడుక భాషనే ఉపయోగించాడు. సాహిత్యంలో భాషని ప్రజాస్వామీకరించిన తొలి రచయితలలో చలం ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు. “దైవమిచ్చిన భార్య” చలం సాహిత్యంలో ఓ విశిష్ఠమైన స్థానం సంపాదిచుకున్న నవల. పిత్రుస్వామ్య సమాజ దాష్ఠీక స్వభావాన్ని పూర్తి స్థాయిలో చూపించిన నవల ఇది. చలం తన అన్ని రచనల్లో చూపించే భావ సంద్రత, పాత్రల అంతస్సంఘర్షణ, గొప్ప ఈస్తటిక్స్ తో కూడిన వాక్య విన్యాసం. అపరిమిత ఊహా శక్తి, వాస్తవాల్ని సాహిత్యంగా మలచగల కల్పనా చాతుర్యం ఇందులో కూడా పుష్కలంగా వున్నాయి.
కథ:
కథ మొత్తం రాధా (రాధాకృష్ణ) ఉత్తమ పురుషలో చెప్పడం జరిగింది. అతను, పద్మావతిల బాల్య స్నేహంతో నవల మొదలవుతుంది. రాధా తన బాల్యాన్ని ఎంతో హాయిగా, అల్లరిగా గడుపుతుంటాడు తన స్నేహితులతో కలిసి. వాళ్ల నాన్న ప్రభుత్వోద్యోగి. వారింటి పక్కనే కాలం చేసిన జమీందారు గారి బంగళా వుంటుంది. ఐతే ఆ కుటుంబం మద్రాసు పట్టణంలో పిల్లల చదువుల కోసం నివసిస్తూ, అప్పుడప్పుడూ సెలవుల కోసం ఈ ఊరు వస్తుంటారు. అలా వచ్చినప్పుడు రాధాకి పద్మావతితో, ఆమె ఇద్దరు అన్నలతో స్నేహం ఏర్పడుతుంది. పద్మావతి ఎంతో స్థైర్యమైన పిల్ల. తన మీద ఎవరి ఆధిపత్యాన్ని సహించదు. మగ పిల్లలతో సమానంగా దూకుడుని చూపిస్తుంటుంది. అప్పటి (వందేళ్ల క్రితం) ఆచారం ప్రకారం ఆ పసితనంలోనే పద్మావతికి న్యాయమూర్తి అనే పాతికేళ్ల ఆమె మేనమామకిచ్చి పెళ్లి చేస్తారు. అతను ఇంకా ఇంగ్లాండులో చదువుకుంటూ వుంటాడు. ఆ పెళ్లిని రాధా కూడా ఒక వేడుకగానే భావిస్తాడు. పెళ్లయ్యాక పద్మావతి కుటుంబం మద్రాసు వెళ్లిపోతారు.
లోయర్ సెకండరీ అనంతరం హయ్యర్ సెకండరీ చదువు కోసం రాధా ఆ ఊరు విడిచి ఏలూరు వెళ్లిన మూడు నెలల్లోనే కొత్త ఊరు, కొత్త స్కూలు, కొత్త స్నేహితుల హడవిడిలో పద్మావతి విషయం మరిచిపోతాడు. ఆ తరువాత ఏడేళ్లల్లో అతను మద్రాసు వెళ్లి బీఎ పూర్తి చేస్తాదు. చదువు తరువాత అతనికి ఏదైనా నౌకరీ చేయడం బానిసత్వంగా అనిపిస్తుంది. ఆ నాటి స్వాతంత్రోద్యమ కాలంలోని ఉడుకు రక్తపు యువకుల్లానే అతను తిలక్, గోఖలే, బిపిన్ చంద్ర పాల్ వంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకున్నాడు. సమాజానికి ఏదైనా చేయాలనుకుంటాడు. ఆ తరుణంలో పద్మావతి మళ్లీ తన కుటుంబంతో సహా వస్తుంది. యుక్త వయస్కురాలైన పద్మావతి అసాధారాణ సౌందర్యంతో, ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది. వారిద్ద్దరి మధ్య మళ్లీ ఒక గాఢమైన స్నేహం మొదలవుతుంది. ఒకరి పట్ల మరొకరికి అనురక్తి, ఆకర్షణ, ప్రేమ పెరుగుతుంటుంది. పద్మావతి మీద అతనికి విపరీతమైన మోహంతో సమానమైన గౌరవం ఏర్పడ్తుంది. ఆ సమయంలో వాళ్లిద్దరూ రోజూ కలిసి తమవైన అన్ని భావోద్వేగాల్ని పంచుకుంటారు.
దేశ సేవకి అంకితం కావాలనుకున్న రాధా పూనా వెళ్లి “సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ”లో చేరతాడు. (ఈ సొసైటీని 1905లో గోపాలకృష్ణ గోఖలే స్థాపించారు. నవలలోని ఈ సంఘటన నాటికి కాంగ్రెస్ ఇంకా బలపడలేదు. గాంధీగారు ఇంకా పిక్చర్లోకి రాలేదు) రెండేళ్లు అక్కడుండి తన తండ్రిగారి అనారోగ్యం కారణంగా తమ ఊరు వస్తాడు. అక్కడికి మళ్లీ పద్మావతి తన భర్త న్యాయమూర్తి తో సహా మొత్తం కుటుంబంతో వస్తుంది. పద్మావతి భర్త పట్ల చాలా శ్రద్ధాసక్తులతో కనిపిస్తుంది. న్యాయమూర్తి మద్రాసు వెళ్లాక వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. రాధా ఆమెని తెగించి తనతో రమ్మంటాడు. ప్రేమ సాహసాన్నిస్తుందనుకుంటాడతను. సంఘాన్ని ఎదిరిద్దామంటాడు. పద్మావతికి అతని పట్ల ప్రేమ వున్నా వైవాహిక బంధం విడిచి రానంటుంది. మొదట ప్రేమ వున్నా చీకటి గదుల్లోనూ, వంట ఇళ్లల్లోనూ ప్రేమ ఊపిరాడక చచ్చిపోతుందంటుంది. ఆమె తన భర్త న్యాయమూర్తితో కాపురానికి సిద్ధమైనందుకు రాధాకి కోపం వస్తుంది. అతను ఆమె పట్ల ఆగ్రహంతో, విరక్తి భావంతో, నిరాశలో వుండగా తండ్రి కుదిర్చిన పెళ్లి చేసుకొంటాడు. వెంటనే గోఖలేగారు అతన్ని ఇంగ్లాండుకి తీసుకెళ్లి పోతారు.
ఇంగ్లాండులో రాధా గోఖలేగారి నేతృత్వంలో దేశోపకారం కోసం పని చేస్తాడు. అక్కడ ఐదేళ్లు వుంటాడు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. తిరిగి ఇండియా వచ్చాక అతను మద్రాసులో మళ్లీ పద్మావతిని కలుస్తాడు. అతని భార్య శకుంతలని తీసుకొని మామగారు దిగుతాడు. తన కూతురిని కాపురానికి స్వీకరించమని ప్రాధేయపడతాడు. ఎలాగోలా రెండు నెలల వరకు సర్దుకోమని చెబుతాడు. పద్మావతికి అతనికి మళ్లీ పాత కథే మొదలవుతుంది. ఆమె భర్త న్యాయమూర్తి ఆమెని పూర్తిగా నమ్ముతాడు. అతను నిజానికి ఆమెని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆమె కోరిక మీద భౌతిక దూరం పాటిస్తుంటాడు. అతను వీరిని ఏ మాత్రం అనుమానించడు. రాధా ఆమెని ఎంతగానో బతిమిలాడతాడు తనతో వచ్చేయమని. కానీ ఆమె రాధా భార్యకి అన్యాయం జరుగుతుందని, న్యాయమూర్తికి అసాధారణ పరపతి వున్నదని, అతను హాని చేయగలడని చెప్పి రానంటుంది.
ఒక పక్క రాధా మామగారు తన కూతురిని కాపురానికి తీసుకోమని వత్తిడి తెస్తుండగా రాధా, పద్మావతిల ప్రేమ వ్యవహారం న్యాయపతి ముందు బట్టబయలైపోతుంది. రాధా వెనక్కి తగ్గకుండా ఆమె తనని ప్రేమిస్తున్నందున తనతో పంపమని న్యాయమూర్తితో ఘర్షణ పడతాడు. కానీ పద్మావతి అతనితో రావడానికి తిరస్కరిస్తుంది. మళ్లీ ఎడబాటు. మూడేళ్లు దేశాటన చేసి వచ్చిన అనంతరం భార్యతో కాపురం మొదలుపెట్టిన రాధా ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు. పద్మావతిని బలవంతంగా న్యాయమూర్తి దూర దేశాలు తీసుకెళ్లి పోతాడు. ఆమె మీద ఎన్నో ఆంక్షలు పెడతాడు. పద్మావతి కూడా ఇద్దరు పిల్లల తల్లి అవుతుంది.
ఒకసారి అనుకోకుండా మలబారు ప్రాంతంలో వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు. మాట్లాడుకుంటారు. విడిపోతారు. ఆ సంగతి న్యాయమూర్తికి తెలిసి రాధాని అరెస్టు చేయించడానికి ఏర్పాట్లు చేస్తాడు. రాధాని రక్షించడానికి ఆమె ప్రాణత్యాగం చేస్తుంది. “మనిద్దరం కలిసి ఆమెని చంపాము” అని న్యాయమూర్తి దుఃఖించడంతో నవల ముగుస్తుంది.
*
ప్రమిద కింద చీకటి పద్మావతి:
ప్రేమికులు వివాహం అనే బంధంలోకి వెళితే అదో భారంగా వుంటుందని, పెళ్లి అనేది ఇద్దరు స్త్రీ పురుషుల కలయికకి సమాజం ఆమోద ముద్ర వేయడం కోసమేనని, అందులో ప్రేమ శాశ్వతంగా ఉండే అవకాశం లేదని, ప్రేమ పోయినప్పుడు అదో బందీఖానా అని, ఆ ఉక్కపోతతనం దుర్భరమని, దాని నుండి బైటపడే అవకాశం లేనందున వివాహబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించి నిర్నిబంధమైన సహజీవనాన్ని కోరుకున్న చలం మొదటి నవల కథా నాయకురాలైన “శశిరేఖ” వాదనకి కొంత భిన్నంగా (విరుద్ధంగా కాదు) సంఘం, కుటుంబం కోసం ఎవరిని వివాహం చేసుకున్నా ప్రేమించిన వారితో వివాహం బైటనైనా ప్రేమని నిలుపుకోవచ్చని, అయితే వారితో సహజీవనం వైవాహిక జీవితానికి భిన్నంగా వుండదని, ఓ నిత్య సహజీవనంలో ప్రేమ బతకదని, ఒకరి కోసం మరొకరు పరితపించి, వేచి వుండి, విరహాన కలిసినప్పుడే ప్రేమ పరిఢవిల్లుతుందని, అటువంటి ప్రేమతోనే జీవితం పరిమళభరితమౌతుందని ఈ నవల కథా నాయకురాలైన పద్మావతి భావిస్తుంది.
తాను తప్ప రాధాకి వేరే జీవితం లేదనుకోవడం, అతను జీవితంలో మిగతా అన్నింటినీ వదులుకోవడం ఆమెకి ఇష్టం వుండదు. తాను ఎప్పటికీ ఎవ్వరిదానినీ కానంటుంది. ప్రేమ ఒక వ్యక్తి మీద మరొకరికి యాజమాన్య హకుల్ని దఖలు పరచదు కదా! ఆమె దృష్టిలో ప్రేమ వేరు, కలిసి జీవించడం వేరు. ప్రేమ లక్ష్యం సాహచర్యం కాదు. ప్రేమ జీవితానికి ఉత్తేజాన్నిచ్చేదే కానీ అదే జీవితం నడపలేదని ఆమె ఉద్దేశ్యం కావొచ్చు. ప్రేమ ఒక్కటే కాకుండా మనిషి సాధించాల్సింది చాలానే వుంటుందని, వ్యక్తి సామర్ధ్యం, తెలివితేటలు సమాజానికి ఉపయోగపడాలని జీవితంలో ఏదైనా గొప్ప స్థాయికి చేరాలని రాధాని ప్రోత్సహిస్తుంది. అతను ఐదేళ్లు ఇంగ్లాండులో వుండొచ్చి తిరిగి భారతదేశం వచ్చినప్పుడు అతనికి జరిగిన అభినందన సభకి హాజరై ఎంతో సంతోషపడుతుంది.
రాధా చిన్నప్పటి నుండి అనుకున్న విధంగానే తన కలలకు అనుగుణంగానే గొప్పవాడు కావాలని పద్మావతి అభిలషిస్తుంది. అతనిని ఎంతో మోటివేట్ చేస్తుంది. అసలు గొప్పతనమంటే ఏమిటో అద్భుతంగా చెబుతుంది. “వీధుల్లో పొయ్యే వాళ్ల పని చెరిపి, వాళ్లకి తనకే విశ్వాసం లేని విషయాలు ఉపన్యాసాలిచ్చి, ఒకసారి కాంఫరెన్సుతో ప్లాటుఫారం మీద కుర్చీలో తంటాలు పడి యిరికి పెద్ద గుంపు ముందు చేతులు ఎగరేస్తో నడిచి గొప్పవాణ్నీ, నాయకుణ్ని అయినావనుకోకూడదు. వాళ్లని ఏవి వుబ్బేస్తాయో ఆ సంగతులు, పూర్వదేశం, ఔన్నత్యం, యిట్లాంటి తుక్కు అంతా చెప్పి, చప్పట్లు కొట్టించుకోడం గొప్పతనం కాదు. వాళ్ల వూహలకు లోబడకుండా, నీ నిజమైన వుద్దేశ్యాల్లో నిన్ను వాళ్లు అనుసరించేట్లు చెయ్యాలి.” ఆ రకంగా సమాజసేవ, నాయకత్వంకి సంబంధించి మనుషులు అనుసరించే హిపోక్రసీకి దూరంగా నిజమైన నాయకత్వమంటే ఏమిటో చెబుతుంది.
అంతేకాదు సమాజ సేవకులకు వుండాల్సిన నిజాయితీ గురించి కూడా పద్మావతి గొప్పగా చెబుతుంది “వాగ్దత్తం చెయ్యి – యెన్నడూ ఈ సామాన్యపు దేశ సేవకులకుమల్లే, ప్రజలమల్లే తుక్కు కింద, ఏడుపు కింద, శవాకారం కిందా తయారు కానని, వెధవ బతుకు పాడు మొహాలు వేసుకొని, కళ్ల మీద పొరలు కమ్మి కుళ్లు నవ్వులు నవ్వుకుంటో, మర్యాదలో, గౌరవంలో, భయంలో, పిరికితనంలో, ధర్మావరణంలో, సనాతన ధర్మంలో, మత్తులో, కొంచెం కొవ్వెక్కి గుండ్రంగా తయారై, పిర్రలు బలిసి, అలా బతకనని వొట్టెయ్యి” అని పద్మావతి రాధాని అడుగుతుంది. “అదీ నా పద్మావతి. నాకు దైవమిచ్చిన పద్మావతి” అనుకుంటాడు రాధా. ఒక తెలివైన, ధృఢమైన తన ప్రియుడి మీద ఎంతో బలమైన సానుకూల ప్రభావం చూపగల వ్యక్తిత్వం పద్మావతిది. ప్రేమంటే స్వార్ధాన్ని పక్కన పెట్టే ఎన్నో అద్భుత గుణాల సంగమం అనిపిస్తుంది. ఆమె నుండి అతను తన తార్కిక జ్ఞానాన్ని విస్తృతం చేసుకుంటాడు.
పద్మావతి వ్యక్తిత్వాన్ని కొన్ని సంఘటనల ద్వారా బలంగా వ్యక్తం చేస్తాడు చలం. ఆమె తనదై వుంటే ఈ ప్రపంచంలో మరింకేం అక్కర్లేదనుకుంటానని రాధా అన్నప్పుడు “నా మీద ఎవరికీ అధికారం యివ్వను. యెవరి సొమ్మునూ అయిపోను. ఎవరి వస్తువునీ కాను. యెప్పుడూ పొద్దున్నా, సాయంత్రమూ ఒకరికీ కనబడుతూ, రాత్రంతా వాళ్లతో వుండి వాళ్లకి పాతదాన్నయి అసహ్యం అయిపోను. ఆఖరికి నీకు కూడా!” అని అంటుంది. ప్రేమ పట్ల ఆమెకొక నిర్దిష్ఠ దృక్పథం వుంటుంది. ప్రేమ మధురమైనదని, అది జీవితాన్ని ఎంతో వెలిగిస్తుందని, ఎదురు చూపులు కూడా ఎంతో ఇష్టకరమైనవని, లోకం మొత్తాన్ని తప్పించుకొని కలవడం గొప్పగా వుంటుందని అంటుంది. ప్రేమ గురించి ఎంత గొప్పగా అనుకున్నా ప్రేమ ఒక్కటే జీవితంగా ఆమె భావించదు. అందుకే “నా జీవనం నేను జీవిస్తా. నీ పని నువ్వు చేసుకో” అంటుంది. ప్రేమ కోసం సంఘాన్ని ఢీ కొట్టడం ఆమెకిష్టం లేదు. ప్రేమ కొరకే ఆరిస్టోక్రాటిక్ సౌకర్యాల్ని, హోదాని, వంశ కీర్తిని, మర్యాదల్ని కోల్పోడానికి ఒప్పుకోదు. ఆమె తన వర్గాన్ని, తన ప్రేమని ఒకదానికి మరోదాన్ని పోటీ పెట్టి ఒక దాని కోసం మరోదాన్ని త్యాగం చేయాలనుకోదు. తన హృదయం తాలూకు ఆవేశాన్ని, బుద్ధి తాలూకు విజ్ఞతని సమన్వయ పరుచుకుంటుంది. వాస్తవ జీవితం తాలూకు బలాన్ని తక్కువ అంచనా వేసి భవిష్యత్ కష్టాల్ని నిర్లక్ష్యం చేసే మనిషి కాదామె. ప్రేమలోని గాఢతని, జీవితంలోని అనివార్యతల్ని సమతూక దృష్టితో చూడగలదు పద్మావతి. విశ్రాంతి లేని గృహ బాధ్యతలు, రోజూ ఎదురుపడే ముఖాలతో ఉక్కపోత భావనలతో ఒకరినొకరు విమర్శించుకోవడం, తప్పు పట్టడం సాధారణమైపోయి ప్రేమలు విఫలమౌతాయని ఆమె భావిస్తుంది. సంఘం పట్ల, దాని ధర్మాల పట్ల, నీతుల పట్ల తుస్కార భావం వున్నప్పటికీ దాని శక్తిని తిరస్కరించదు. ఈ వాస్తవిక దృష్ఠి రాధాలో వుండదు.
ఎగరేసిన ప్రేమ జెండా రాధా:
చలం సృష్టించిన పురుష పాత్రల్లో దేశికాచారి (జీవితాదర్శం) తరువాత చెప్పదగ్గ ఉదాత్త పాత్ర రాధా. నిజాయితీకి పేరు పెట్టాల్సి వస్తే దానికి రాధాకృష్ణ అనే పేరు సరిగ్గా సరిపోతుంది. జీవితానికో అర్ధం వుండాలంటే గొప్ప పనులు చేయాలనే దృఢాభిప్రాయం వున్నవాడతను. అతను ఏమి చేసినా నిజాయితీగా చేస్తాడు. అతనేం చేసినా, మాట్లాడినా అది అతని అంతరంగం నుండే వస్తుంది. గాఢమైన ప్రేమికుడు. పద్మావతి మనశ్శరీరాలను ఏక కాలంలో సమాన స్థాయిలో ప్రేమించిన వాడు. ఎంతో ధైర్యవంతుడు కూడా. పరిస్థితులతోటి, వ్యక్తులతోటి ధైర్యంగా ఘర్షణపడగలవాడు. తమ వ్యవహారం ఆమె భర్త ముందు బైటపడగానే తొట్రుపడకుండా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పద్మావతిని తనతో పంపమని డిమాండ్ చేస్తాడు.
తొలి యవ్వన దశలో తాను ఒంటరినని, తన తండ్రికి తప్పితే మరెవ్వరికీ తన పట్ల ప్రేమ లేదన్న నిస్పృహలో వున్నప్పుడు తండ్రి చూపించిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఆ వెంటనే ఇంగ్లాండ్ వెళ్లిపోయి ఐదేళ్లు వుండిపోతాడు. తిరిగి ఇండియా వచ్చినప్పుడు తన గుమ్మం దగ్గరకు వచ్చిన భార్య పట్ల ప్రేమ లేనప్పటికీ దయతో వ్యవహరిస్తాడు. కొన్ని పరిణామాల అనంతరం ఆమెతో కాపురం చేస్తున్నప్పుడు ఆమెతో ఎంతో పారదర్శకంగా వుంటాడు. రాధాలోని ఈ మంచి లక్షణాలు ఆనాడే కాదు ఈనాటికీ ఆదర్శవంతమైనవే.
అతనికీ కొన్ని బలహీనతలుంటాయి. ఆవేశపరుడు. తనతో రానందుకు ఆమెని తప్పు పడతాడు. అభాండాలు వేస్తాడు. నిజానికి అతనిది న్యాయమూర్తి పట్ల జెలసీ. తన స్వంతం అవాల్సిన పద్మావతి న్యాయమూర్తి పరిధిలోకి వెళ్లిపోవడాన్ని అతను ఒప్పుకోలేక పోతాడు. పద్మావతి తననే ప్రేమిస్తున్నందున అతని బాధలో న్యాయముండొచ్చు కానీ ప్రేమించడం వేరు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి కోరుకోవడం వేరు. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో పాటు తాను పుట్టి పెరిగిన జమీందారీ దర్పం, సౌకర్యాలు, హోదాని పక్కన పెట్టలేనితనం, సంఘాన్ని ఎదిరించాలనే ఉత్సుకత లేకపోవడం ఆమెకున్న బలహీనతలు కాదు. అవి ఆమె తనకు తానై ఉద్దేశ్యపూర్వకంగా ఏర్పరుచుకున్న పరిమితులు. ఈ విషయాన్ని రాధా ఒప్పుకోడు. అతని దృష్ఠిలో ప్రేమ కోసం ఎంతకు తెగించినా తప్పు లేదు. తన ధోరణిలో తానుంటాడు. మొత్తమ్మీద చలం ఒక నిజాయితీ గల గొప్ప ప్రేమికుడిని సృష్ఠించాడని చెప్పొచ్చు.
కాలకూట పితృస్వామ్యం:
“మనిద్దరం కలిసి ఆమెని చంపాము” అని న్యాయమూర్తి బాధతో అంటాడు కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే పద్మావతి రాధాల ప్రేమ ఎప్పటికప్పుడు ముగిసినట్లే అనిపించి, పునరుద్ధరించబడిన ప్రతిసారీ ఇద్దరి భాగస్వామ్యం ఒకే స్థాయిలో వుంటుంది. తనతో వచ్చేయమని రాధా అడగటం, ఆమె రాననడంకి సంబంధించిన ఘర్షణ ద్వితీయ ప్రధాన్యాంశం. ఎప్పుడో బాల్యంలో పెళ్లై పోయినందువల్ల యుక్తం వచ్చాక, మనసు వికసించాక, గుండెలో ప్రేమ పుట్టాక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తన భవిష్యత్తు బాల్యంలోనే నిర్ధారించబడిందనే ఎరుక ఆమెకున్నది. వివాహమే కాదు, తన వర్గ పరిమితులు కూడా ఆమె ఎంతో ఒడుపుగా ఆకళింపు చేసుకుంటుంది. రాధా కూడా ఆమెని అన్నీ వదిలేసి తనతో వచ్చేయమని ప్రాధేయపడతాడు, అందుకామె నిరాకరించినందుకు ఆక్రోశంగా ఉత్తరాలు రాస్తాడే కానీ ఆమెని ఇబ్బంది పెట్టాలనుకోడు. ఎంతో ఘర్షణని అనుభవిస్తూ అతను తన జీవితంతో రాజీ పడతాడు. పద్మావతిని చంపింది భర్త రూపంలో అమలైన పితృస్వామ్యమే. పితృస్వామ్యం భార్య అనే ఒక మనిషిని పురుషుడు అనే మరో మనిషికి అధీనం చేస్తుంది. తండ్రి స్థానంలో వున్న పురుషుడి నుండి భర్త స్థానంలో వున్న పురుషుడికి హక్కుభుక్తం చేస్తుంది. ఆ హక్కుతోనే న్యాయమూర్తి పద్మావతి మీద మానసిక వత్తిడి, శారీరిక నిర్బంధం అమలు చేయగలిగాడు. చివరికి అవే ఆమె ప్రాణం తీసుకునేలా చేశాయి.
మరో ఉదాహరణ చెప్పాలంటే – రాధా మామగారు శకుంతలని తీసుకొచ్చి రాధా గుమ్మం దగ్గర వదిలి వెళ్లిపోతానంటాడు. కొంచెం సమయం ఇవ్వమని రాధా అడిగినప్పుడు “యెదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకోడమంత క్షోభ, నరకం ఇంక లోకంలో లేదు. ఎప్పుడేమి జరుగుతుందో అని గుండెల్లో బరువు. పగలు శాంతి లేదు. రాత్రి నిద్ర లేదు. శత్రువులకన్నా వొద్దు ఆ బాధ. యేమన్నా కొంచెం వున్నదో లేనిదో పొల్లు మాట విన్నారంటే మీకేం ‘అఖ్కర్లేదూ పొమ్మంటారు. యేమన్నా చేసుకోండి మీ భార్యని మీరు. మధ్య నాకెందుకంట ఈ భారం?” అంటాడు. ఈ వాక్యాలు పిత్రుస్వామ్య సమాజంలో స్త్రీ యొక్క వల్నరబిలిటీని తెలియచేస్తాయి. స్త్రీ తండ్రి చేత వదిలించుకోబడే, భర్త చేత భరించబడే భారమన్న మాట!
స్త్రీకి సహజంగా కలిగే సున్నితమైన సహజాతాల్ని, అనుభూతుల్ని, కోరుకునే అనుభవాల్ని కఠినమైన భారతీయ పురుష స్వామ్యం, దాని ప్రధాన వ్యవస్థ అయిన కుటుంబం, ఆ కుటుంబం పునాదుల్లో వున్న ధర్మం, నీతి ఇవన్నీ ఎంత శక్తిమంతంగా కాలరాస్తాయో ఈ నవల మనకి తెలియచేస్తుంది. వివాహేతర ప్రేమ అనే విషయంలో పద్మావతికి భర్త వైపు నుండి వచ్చినంత వత్తిడి రాధాకి తన భార్య వైపు నుండి రాదు. శకుంతలకి అన్నీ తెలిసినా గట్టిగా ఏదీ చెప్పలేకపోతుంది. ఒకే సమయంలో, ఒకే పరిస్థితిలో సమ బాధ్యులైన స్త్రీ పురుషులిద్దరిలో పురుషుడు జవాబుదారీతనం లేనట్లుగా వుండగలిగితే స్త్రీ మాత్రం నిర్బంధాన్ని, వత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాంట్రాస్టుని చలం గొప్పగా ఎస్టాబ్లిష్ చేశాడనిపించింది.
చిన్ననాటి స్నేహం గుబాళింపు:
రాధా పద్మావతిల మధ్య చిన్న నాటి స్నేహంలో పువ్వులోని అజ్ఞాత మకరందంలాంటి ఆకర్షణ వుంటుంది. చలం ఆ వయసు స్నేహాన్ని ఎంతో సహజంగా, హృద్యంగా వర్ణిస్తాడు. ఈ కథని ప్రధమ పురుష(ఫస్ట్ పర్సన్)లో చెప్పాడని అన్నాను కదా- అంటే రాధానే మొత్తం తన గతం గురించి వివరిస్తూ నవలని నడిపిస్తాడు. సాధారణంగా మరో రచయిత అయితే బాల్యాన్ని సంఘటనలుగా గుర్తు తెచ్చుకొని చెబుతున్నట్లుగా రాస్తాడు. కానీ చలం మాత్రం ఆ వయసు పిల్లల థాట్ ప్రాసెస్లోకి దూరి ఒక పది పన్నెండేళ్ల పిల్లవాడు ఎలా ఆలోచిస్తాడో, ఆ వయసులో ఎలా నేరేట్ చేస్తాడో అలానే ఆ చిన్న నాటి ఉద్వేగాల్ని గొప్పగా రాశాడు. ఒకచోట “ఈ పెద్దవాళ్లు ఎందుకో చీదరించుకుంటో, కోప్పడుతో, ఏడుస్తో బతుకుతారు? ఆకాశం, మబ్బులూ, పువ్వులూ, చిలకలూ, రైళ్లూ, నీళ్లూ ఇన్ని వుండగా ఈ పెద్దవాళ్లకి సంతోషం లేకపోవడమేమా అని సందేహం. కానీ దురదృష్టం. ఇన్ని అందమైన వస్తువుల్లోనూ బడీ, బెత్తం, మాష్టరు మొహం – ఈ మూడు వస్తువులు కూడా వున్నాయి” అని తన నిరసన వ్యక్తం చేస్తాడు.
రాధాది ఒక ప్రత్యేకమైన, బలమైన మనస్తత్వం అని అతని బాల్యంలో కొన్ని సంఘటనల ద్వారా చలం ఎస్టాబ్లిష్ చేస్తాడు. అతనికి చిన్నతనం నుండే తాను జీవితంలో గొప్పవాడు కావాలని బలమైన కోరిక వుంటుంది. తనని తాను ఓ వీరోచితమైన కథా నాయకుడిగా ఊహించుకుంటాడు. తాను అనుకున్నదాని కోసం ధైర్యం, తెగువ చూపించే మనస్తత్వాన్ని అతను చిన్ననాడే ఊహించి, కల్పించి చెప్పే కథల్లోనే మనకి చూపిస్తాడు. బహుశా దేవుడి మొక్కు కోసం పెంచి కొప్పుగా చుట్టిన తన జడ వంటి జుట్టుని పద్మావతికి నచ్చలేదని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కత్తిరించేసుకుంటాడు రాధా. పెరిగి పెద్దయ్యాక స్పష్ఠంగా ద్యోతకమయ్యే వ్యక్తిత్వ వికాసానికి బీజాలు బాల్యపు ఉద్వేగాల్లోనే పసిగట్టొచ్చని చలం రచనా శైలి మనకు తెలియచేస్తుంది.
సౌందర్యాధ్యాత్మికత:
చలం నిరీశ్వరవాది కాదు. అంతేకాదు చలానికి సౌందర్యం పట్ల, సౌందర్య ప్రేమ పట్ల ఒక ఆధ్యాత్మికమైన దృక్పథమేదో వున్నట్లనిపిస్తుంది. పద్మావతి మతాచారాల్ని, క్రతువుల్ని విమర్శిస్తుంటే “దేవుడున్నడనన్నా అనిపిస్తుందా నీకు?” అని రాధా అడుగుతాడు. అప్పుడు ఆమె “ఏదో వుంది చాలా అందమైంది. చాలా సంతోషంతో నింపేస్తుంది నన్ను. అంతే నాకు తెలిసింది. దానిని దేవుడనూ, యేమన్నా అను – అయితే వీళ్లు చేయమనే వాటికీ, ఆ దేవుడికీ ఏం సంబంధం…?” అని సమాధానమిస్తుంది. చలం దృష్ఠిలో దైవత్వమంటే అందమైనది, ఆనందకరమైనది, కరుణ రసార్ద్రమైనది, పాప పుణ్యాల ప్రసక్తి లేని తాత్వికమైనది, క్రతువుల ద్వారా, సంఘ నీతుల ద్వారా భయపెట్టనిది. చలం తనకున్న ప్రతి ప్రత్యామ్నాయ విలువల ప్రతిపాదనల్ని తన కథానాయకల ద్వారానే ప్రకటిస్తుంటాడు. చలం నాయకలు పాఠకుల కాలక్షేపం కోసం కథ నడిపించడానికి ఏర్పడరు. వాళ్లు ఆయన తాత్విక, ఆధ్యాత్మిక మానస పుత్రికలు!
శరీరాల్ని దాటి మనసులోకి ప్రయాణం:
చలం స్త్రీలో కేవలం శారీరిక సౌందర్యం చూడడనటానికి మరో ఉదాహరణగా అతను తన కథానాయికల్ని ఉన్నతంగా చూస్తూ వర్ణించే తీరులో చూడొచ్చు. పద్మావతి గురించి రాధా ఇలా అనుకుంటాడు “కళ్లు ఎక్కువ పెద్దవి కావు. కానీ ఆ కళ్ల తెల్ల గుడ్డులో నల్ల పాప మెరుపు సాయంత్రం వాన ఆకాశాన్ని కడిగిన తరువాత శుక్రుణ్ని చూస్తే తెలుస్తుంది. ఆ తెల్ల చుక్క మెరిసినంత కాంతిగా ఆ నల్ల చుక్కలు మెరిసేవి. కనురెప్పల్లో ఎంతో ఆకర్షణ వుండేది. అంత మధురమైనవీ, దయ కలిగినవీ కళ్లు నేనింతవరకు చూడలేదు. కనురెప్పలు వాలి వుండేవి. కిందకు చూస్తో వుంటే, చదువుతోంటే మూసుకున్నట్లే వుండేవి కళ్లు. హృదయంలో వుంది ఆ రూపం. ఇవన్నీ శాశ్వతంగా నన్ను ఆమె వాణ్ని చేసేశాయి. ఒట్టి శరీర అందం చూసి మోహించారనవచ్చు. అవును. ఆ శరీరంలోంచి, కళ్లల్లోంచీ, మాటలోంచీ చూశాను. ఆమె ఆత్మ ఔన్నత్యాన్ని.” హృదయం, శరీరం, పరిసర ప్రకృతి ఒక అవగాహనకి వచ్చి సమన్వయం చేసుకుంటూ అంతిమ ఐక్యతని సాధించినట్లుగా రాస్తాడు చలం. స్త్రీలో ప్రకృతిని చూస్తూ ఇంత తాదాత్మ్యంగానూ, పరవశంతోనూ ఎమోషనల్ అవడం ఒక్క చలానికే సాధ్యం.
ప్రేమలో ఆకర్షణతో పాటు వుండాల్సిన గౌరవం, హుందాతనం, ప్రవర్తనకి సంబంధించిన స్వచ్ఛత గురించి చలం ఎంతో హృద్యంగా ఇలా రాస్తాడు రాధాకృష్ణ మాటల ద్వారా- “మొదటినుంచీ ఇద్దరం సమానులమల్లే ప్రవర్తించాము. యింకా ఆమె నాకంటే అధికురాలు. నాకామె మీద యెక్కువైన గౌరవం. మెల్లిమెల్లిగా ప్రేమ సంపాదించడం, దొంగ చూపులూ, దొంగ మాటలూ ప్రయోగించడం, రెండోవారి అభిప్రాయమెల్లా వుందో కనుక్కోవడం, భయపడటం, సూచించడం, అనుమానించడం, ఆశలూ, నిరాశలూ, దొంగతనం, అబద్ధం, మెల్లిగా మనసు లాగడం, తప్పు అభిప్రాయాలు ప్రవేశపెట్టడం యివన్నీ మాలో ఎన్నడూ లేవు. మా ప్రేమ తప్ప యింకో ఆలోచన ఎన్నడూ నాకు తట్టనేలేదు. నేను బతకడం, గాలినీ యెండనీ అనుభవించడం ఎంత సహజమో పద్మావతిని ప్రేమించడం కూడా అంత సహజమే. ప్రేమగల స్నేహితులు అంతే…” వారిద్దరి మధ్య ప్రేమ ఈ విధంగానే అభివృద్ధి చెందుతుంది. నిజంగా ఎంత బాగుందో కదా!
*
సరిగ్గా వందేళ్ల క్రితం చలం రాసిన ఈ నవల ఈ నాటికీ తన రిలవెన్స్ ని కోల్పోలేదు. ఎందుకంటే ఆధునిక సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందిందే కానీ మానవీయంగా కాదు. నిజమైన అర్ధంలో స్త్రీ పురుష సమానత్వం సిద్ధించేంత వరకు ఈ నవల సమాజానికి అత్యవసరమే! అందుకే చదవండి. చదివించండి.