అనువాదం: రాజ్ కుమార్ పసెద్దుల
కుల ఆధారిత దోపిడీ భారతదేశ సామాజిక శ్రేణిని ప్రతిబింబిస్తుంది. అది ప్రవాస భారతీయుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
జూన్ నెలలో హిందూజా కుటుంబానికి చెందిన నలుగురికి జెనీవా లోని స్విస్ కోర్టు 4.5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వారంతా భారతీయ సంతతికి చెందిన స్విస్ దేశ పౌరులు. వారు భారతదేశం నుండి జెనీవాకు తీసుకువచ్చిన గృహ కార్మికులకు సగటు నెలవారీ జీతంలో 10% కంటే తక్కువ చెల్లించారని తేలింది. వారికి నెలకు 220 నుండి 400 స్విస్ ఫ్రాంక్‌లు మాత్రమే చెల్లించడం ద్వారా వారు శ్రమ దోపిడీకి పాల్పడినట్లు తేలింది.
ఆ కుటుంబం తక్కువ వేతనం ఇవ్వడమే కాకుండా కార్మికులకు ఎటువంటి సెలవులు ఇవ్వకుండా లేదా అదనపు పరిహారం చెల్లించకుండా రోజూ 18 గంటల పాటు షిఫ్టుల వారీగా పని చేయమని ఒత్తిడి చేసింది, మరియు వారి జీతాలను భారతీయ ఉద్యోగ మార్కెట్ ప్రమాణాలతో చెల్లించింది. గృహ కార్మికులకు ప్రతి మూడు నుండి ఆరు నెలలకు భారత కరెన్సీలో వేతనాలు చెల్లించింది. అదనంగా, స్విట్జర్లాండ్‌లోని ఇతర ప్రాంతాలకు కాకుండా జెనీవాలోనే వారి కదలికలను హిందూజా కుటుంబం పరిమితం చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత వారి పాస్‌పోర్ట్‌లను జప్తు చేసింది. స్వల్పకాలిక EU శెన్జెన్ వీసాలపై తీసుకురాబడిన ఈ కార్మికులకు చట్టపరమైన అధికారం లేదా అనుమతులు పొందే ప్రక్రియను కూడా దోషులు ప్రారంభించలేదు.
హిందుజా కుటుంబం తమ కార్మికుల కంటే తమ కుక్కల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుందని ప్రాసిక్యూటర్ వైవ్స్ బెర్టోసా వాదించారు. ఈ వార్త భారతీయ మీడియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ కేసు సాధారణమైనది కాదు. ఇది కులం, వర్గం, జెండర్ తో ముడిపడి ఉన్న విస్తృత దోపిడీ నమూనాను ప్రతిబింబిస్తుంది.
కుల-అణచివేతకు గురైన వారి శ్రమను ఈ నయా ఉదారవాద (నియో లిబరల్) వ్యవస్థ దోపిడీ చేస్తుంది. ఈ విధానం సంపన్న భారతీయులకు అందుబాటులో ఉన్న సులభమైన వలస అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అణగారిన కులాల నుండి మొదటి తరం చదువుకున్న వారిగా, ప్రవాస భారతీయులలోని భారతీయ మరియు దక్షిణాసియా మూలాలకు చెందిన వ్యక్తులకు సంబంధించిన ఇటువంటి దోపిడీ కేసులను ఈ మా వ్యాసం ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాము. అలాగే దాని వెనుక ఉన్న కారణాలను పరిశీలించి, రిషి సునక్, ప్రీతి పటేల్, సుయెల్లా బ్రేవర్‌మాన్, కమలా హారిస్ వంటి మితవాద రాజకీయ నాయకుల కార్మిక వ్యతిరేక రాజకీయ విధానాలకు గల సంబంధాలను వివరించాలనుకుంటున్నాము.
భారత సాంస్కృతిక కట్టుబాట్లు
భారతదేశంలో ఇంటి పనులను చేయడం కోసం ఎక్కువగా కుల-అణచివేతకు గురైన లేదా ఆదివాసీ (గిరిజన) నేపథ్యాల నుండి వచ్చిన మహిళలను తీసుకుంటారు. కాంట్రాక్టులు మరియు చెల్లింపుతో కూడిన అనారోగ్య లేదా ప్రసూతి సెలవు వంటి రక్షిత నిబంధనలు లేకుండా, ఈ అనధికారిక పని కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుంది. సమాజంలోని ఉన్నత స్థాయికి చెందిన కుటుంబాలు ఎక్కువగా ఈ అనధికారిక కార్మికుల శ్రమపై ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ, యజమానులు తమ గృహ కార్మికుల పట్ల వ్యవహరించే తీరు తరచుగా అణచివేతకు గురిచేస్తుంది. కార్మికులు వారు పనిచేసే ఇళ్లలోని ఫర్నిచర్‌పై కూర్చోవడానికి అనుమతించకపోవడం, వినియోగానికి ప్రత్యేక పాత్రలు ఇవ్వడం సాధారణంగా జరుగుతున్న ఆచారం. ఇక్కడ విడ్డూరమేమిటంటే, వాటిని శుభ్రంగా ఉంచే వారినే ఎక్కడ వారి పరిసరాలను ‘అశుద్ధం లేదా కలుషితం’ చేస్తారో అనే నెపంతో సంపన్నులు వారిని కొన్ని గేటెడ్ అపార్టుమెంట్లు లేదా కమ్యూనిటీలలో లిఫ్ట్‌లను ఉపయోగించడానికి కూడా అనుమతించరు. ప్రత్యేక ప్రవేశ ద్వారాల ద్వారా వారిని అనుమతిస్తారు. ఒక విధంగా, గేటెడ్ కమ్యూనిటీలు అణగారిన కుల కార్మికులను దూరంగా ఉంచుతూ అవొక ఆధునిక కుల అగ్రహారాలుగా ఏర్పడుతున్నాయి.
ఇటువంటి చర్యలు నిచ్చెన మెట్ల కుల సమాజంగా విభజించబడిన కుల క్రమం మూలాల నుండి వచ్చినవి. మొదటి మూడు స్థానాల్లో ఉన్న వ్యక్తులు అర్చక విధులు, రక్షణ, వ్యాపారం వంటి ‘స్వచ్ఛమైన’ పనిని చేయడానికి ఉద్దేశించబడ్డవారైతే, ఆ క్రింది స్థానంలో శూద్రులు మలినమైన అశుభ్రత గా ఉండే పనులు చేయడానికి ఉద్దేశించబడ్డవారు. ఈ కుల వ్యవస్థ వెలుపల ఉన్న వ్యక్తులు అంటరానివారు, చూడరానివారుగా పరిగణించబడ్డారు. కార్మికులు ఫర్నీచర్, పాత్రలు, ఎలివేటర్లను ఉపయోగించకుండా నిషేధించే ఆచారం ఆధునిక రోజుల్లో వ్యక్తమవుతున్న తీరే ఈ కులతత్వం.
శ్రమ మరియు శ్రామికుల యొక్క విభజన వలన ఆధిపత్య కులాలు అనుభవిస్తున్న సౌలభ్యం తరచుగా సవాలు చేయబడదు. దోపిడీ స్వభావం గల ఈ అలవాటు భారతదేశం, ఉపఖండంలోని విషయాలలో సహజ క్రమం వలె చూడబడుతుంది. ఆధిపత్య కులాల ప్రజలు శ్రమ దోపిడీ చేసేందుకు అర్హులని భావిస్తారు. అనేక సందర్భాల్లో, ఈ వ్యవస్థీకృత అణచివేత యొక్క స్వభావం కారణంగా ఈ ఆలోచనను కార్మికులే అంతర్గతంగా స్వీకరించారు.
ప్రస్తుతానికి ఈ దోపిడీని అంతం చేయాలని లేదా కనీస వేతనం, అనారోగ్య వేతనం, వారంవారీ తప్పనిసరి సెలవులు, ప్రసూతి వేతనం వంటి దిద్దుబాటు చర్యలను డిమాండ్ చేసే ప్రధాన సామాజిక లేదా రాజకీయ ఉద్యమాలు ఏవీ లేవు. కొన్ని ఇళ్లలో గృహ కార్మికులు ఉండటం సర్వసాధారణం, వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే . ఈ కార్మికులు తమకంటూ వ్యక్తిగత జీవితాలున్నాయనే విషయాన్ని కూడా మరిచిపోయి, తరచుగా తమ యజమానులతో పాటే నివసిస్తూ, నిరంతరం వారి కొరకు పని చేస్తూనే ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు తమ యజమానుల అవసరాలు తీర్చేందుకు నిత్యం పరిగెడుతుంటారు. ఈ అలవాటు యొక్క దోపిడీ స్వభావం గురించి కావాలనే పట్టించుకోనివ్వకుండా చేసి, వారి శ్రమతో ప్రయోజనం పొందే ప్రజల జీవితాలను చాలా సుఖమయం చేస్తుంది.
విదేశాల్లో ఉల్లంఘనలు
ఈ సౌకర్యాలకు అలవాటుపడిన వారు ఇతర దేశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు, వారి స్వంత శ్రమతో ఈ పనులను నిర్వహించడం చాలా ఇబ్బందికరమని వారు గ్రహిస్తారు. ప్రజలు సాధారణంగా తమ ఇంటి సహాయకులను ఎంతగా కోల్పోతారు అనే దాని గురించి అనేక సార్లు ఫిర్యాదు చేసిన దాఖలాలు మనం చాలానే చూస్తూ ఉంటాం . ఇది వారి పనివారి పట్ల వారికి ఉన్న అభిమానం వల్ల కాదు కేవలం శ్రమ దోపిడీ నుండి లభించే విశ్రాంతి కార్యకలాపాల నుండి వారు విశ్రాంతి, ప్రయోజనం పొందగలరు కాబట్టి. కొంత మంది దీనికే అలవాటుపడి తమ సిబ్బందిని వారు వెళ్లే దేశాలకు దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టారు. మనం చూసినట్లుగా, ఇది కొన్నిసార్లు స్థానిక చట్టాలకు లోబడి లొసుగులను ఉపయోగించుకోవడం ద్వారా లేదా మనం హిందుజా విషయంలో చూసినట్లుగా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం ద్వారా జరుగుతుంది.
భారతదేశంలోని గృహ కార్మికులను యూరప్, యుఎస్ వంటి ప్రగతిశీల శ్రామిక చట్టాలు కలిగి ఉన్న దేశాల లేబర్ మార్కెట్‌లకు తీసుకొనిపోయినట్లయితే వారి ఉపాధి, పని పరిస్థితులు అక్కడ చట్టవిరుద్ధంగా పరిగణించబడుతాయి. అక్కడ కఠినమైన ఉపాధి చట్టాలు, కనీస వేతనాలు, నియంత్రిత పని గంటలు, పెన్షన్‌లు మరియు అనారోగ్యం, ప్రసూతి వేతనాలను తప్పనిసరి చేస్తాయి. ఉద్యోగుల కోసం ఈ ప్రయోజనాలు తరచుగా ట్రేడ్ యూనియన్ల ద్వారా సామూహిక ఉద్యమాల ద్వారా పొందబడతాయి.
అయినప్పటికీ, స్థానిక కార్మికులకు అందుబాటులో ఉన్న కార్మికుల రక్షణల చుట్టూ ఒక మార్గాన్ని కనుగొంటూనే UKలో డొమెస్టిక్ వర్కర్ వీసా వంటి నిర్ధిష్ట నిర్బంధ వీసాలు ఉన్నాయి. ఇవి ప్రజలు తమ గృహ కార్మికులను విదేశాల నుండి తెచ్చుకోవడానికి అనుమతిస్తాయి. ఈ వీసాలపై కేవలం ఆరు నెలల పరిమితి ఉంటుంది, వీటిని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అంటే వారు తమ మాతృదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఈ వీసాలపైన వచ్చిన కార్మికులు తమ ఉద్యోగదారులను వదిలి కొత్త పని చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ నిబంధనల నేపథ్యంలో వారి పరిస్థితులు చేజారిపోతే వారికి చట్టపరమైన సహాయం అందడం కష్టం. కనీస వేతనం ఎగవేసే మరో మార్గం ఏమిటంటే, భోజనం, నివాసం అందించిన పక్షంలో తక్కువ వేతనం ఇవ్వవచ్చు. ఇంకా మనం దగ్గరగా గ్రహించినట్లు అయితే హిందూజాల శ్రమ దోపిడి మరియు కేలిఫోర్నియాలో లక్ష్మిరెడ్డి బాలిరెడ్డి మానవ అక్రమ రవాణా కేసులలో కూడా ఇదే ప్రధాన వాదనని ఉపయోగించారు.
కార్మిక ఉల్లంఘనలు, చౌక శ్రమ కోసం మానవ అక్రమ రవాణా పాశ్చాత్య మార్కెట్లో ఇంటి పనులకు మించి విస్తరించి, విస్తృత నియోలిబరల్ దోపిడీకి దోహదపడుతుంది. పేలవమైన కార్మిక చట్టాలు విదేశాలలో కార్మికుల ప్రయోజనాలను రక్షించడంలో విఫలమవుతున్నాయి. వివిధ అభద్రతల వల్ల, జ్ఞానం లేకపోవడం, ఇమ్మిగ్రేషన్ విరుద్ధ చట్టాల కారణంగా, చాలా మంది కార్మికులు విదేశాలలో చట్టపరమైన మద్దతును పొందరు, అందువల్ల వారి కార్మిక హక్కుల ఉల్లంఘనలను ఇది వేగవంతం చేస్తుంది. ఇది వారిని దోపిడీ చేయడానికి మార్గం సులువు చేస్తుంది. ఉదాహరణకు, శరవణ భవన్ వంటి గ్లోబల్ రెస్టారెంట్ చైన్ లు – చెన్నైలో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అనేక వేతన ఉల్లంఘన కేసులను ఎదుర్కొన్నాయి. కాలిఫోర్నియాలో 317 మంది ఉద్యోగులతో కనీస వేతనం చెల్లించనందుకు ఆ సమస్యను కోర్టు పరిష్కరించింది.
ఈ సమస్య కేవలం రెస్టారెంట్ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా ఆశలు చూపించే పెద్ద పెద్ద సంస్థలు కూడా కార్మికులను దోపిడీ చేస్తాయి. ఉదాహరణకు, షిప్‌బిల్డింగ్ కంపెనీ సిగ్నల్ ఇంటర్నేషనల్ భారతదేశానికి చెందిన కార్మికులకు ఉపాధి, గృహాలు, గ్రీన్ కార్డ్‌లు వంటి వాగ్దానాల ద్వారా కార్మికులను అక్రమ రవాణా చేసింది, ఉద్యోగ భద్రత లేకుండా రద్దీగా ఉండే పరిస్థితులలో జీవించమని వారిని బలవంతం చేసి, వారి పాస్‌పోర్ట్‌లను తమ ఆధీనంలో ఉంచుకుంది. దావా ప్రకారం U.S. చరిత్రలో ఈ కేసు అతిపెద్ద మానవ అక్రమ రవాణా ఘటనల్లో ఒకటిగా గుర్తించబడింది.
మత సంస్థలు కూడా పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా కేసుల్లో చిక్కుకున్నాయి. 2000 సంవత్సరానికి చెందిన ఒక ముఖ్యమైన కేసు. UKలోని వెంబ్లీలో ఆలయాన్ని నిర్మించే పనిలో ఉన్న నిర్మాణ సంస్థ శ్రీకోకు చెందిన భారతీయ మతపరమైన స్వచ్ఛంద సంస్థ శ్రీ వల్లభ్ నిధికి సంబంధించినది. ఇది రాజస్థాన్ నుండి కార్మికులను నియమించుకుంది. వారు జాతీయ కనీస వేతనం గంటకు £3.70కి (₹370) బదులుగా £ 0.30 పెన్స్ (₹30) చెల్లించారు, అనగా ఆ సమయంలో సగటు UK జీతం కంటే 90% తక్కువ.
దాదాపు 24 సంవత్సరాల తరువాత, ఈ స్థాయి దోపిడీ ముఖ్యంగా అణగారిన కులాలు మరియు అట్టడుగు వర్గాల వారిపై ఎలాంటి మార్పు లేకుండా ఉంది. అక్కడ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందనే భయం. కుల-ఆధిపత్య ప్రవాస భారతీయుల కమ్యూనిటీల శక్తివంతమైన లాబీయింగ్ కారణంగా తరచుగా ఈ కేసులను తీవ్రంగా పరిగణించరు. పైన పేర్కొన్న స్వచ్ఛంద సంస్థ అప్పటి UK హోమ్ ఆఫీస్ మంత్రి పాల్ బోటెంగ్‌తో ఉన్న సంబంధాలను ‘బానిస-కార్మికులను’ తీసుకురావడంలో ఇమ్మిగ్రేషన్ అడ్డంకులను అధిగమించడానికి ఉపయోగించుకోవడం జరిగింది. బహుశా ఎన్నికల ప్రయోజనాల కోసం దక్షిణాసియా-మూలం ఆధిపత్య కులాలు-వర్గాలు, విదేశీ ప్రభుత్వాల మధ్య సంబంధాలను ఈ విధానం హైలైట్ చేస్తుంది. ఇది న్యాయమైన వేతనాలను నిర్ధారించడానికి ఉద్దేశించిన చట్టాన్ని దాటవేసేందుకు వారిని అనుమతిస్తుంది.
మే 2021లో, హిందూ శాఖ అయిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS)పై వేసిన దావా, అమెరికా లోని హిందూ దేవాలయ నిర్మాణ స్థలంలో 15 ఏళ్లుగా అట్టడుగు కులాల కార్మికుల శ్రమ దోపిడీని బహిర్గతం చేసింది.
1990వ సంవత్సరంలో, లకిరెడ్డి బాలి రెడ్డి అనే సంపన్న రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుడు బర్కిలీలోని తన 1,000 అద్దె ఆస్తుల నుండి నెలకు $1 మిలియన్ సంపాదించి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో తన ప్రభావాన్ని కొనసాగిస్తోన్న వ్యక్తి, దళిత బాలికలను లైంగిక బానిసత్వం కోసం, బలవంతంగా పని చేయించడం కోసం వారిని అమెరికా కు అక్రమంగా రవాణా చేసి తీవ్ర దోపిడీకి పాల్పడ్డాడు.
స్వాతంత్య్రానికి పూర్వం నుండి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఈ దోపిడీ రెడ్డి, వెలమ, కమ్మ, ఇతర ఆధిపత్య కుల సమూహాలచే దోపిడీకి గురయిన వ్యవసాయ కార్మికుల చారిత్రక పద్ధతులకు అద్దం పట్టింది. బాలి రెడ్డి మూడు దశాబ్దాల క్రితం ఉత్తర అమెరికాలో పురాతన పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం అని పిలవబడే చోట నిరంతర కుల ఆధారిత అణచివేతను ఎత్తిచూపుతూ అనేక సంవత్సరాల తరువాత కూడా కుల గతిశీలతను ప్రభావితం చేసాడు.
ఈ దోపిడీ భారతదేశ కుల నిచ్చెనమెట్ల సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రవాస భారతీయుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ చర్యల వల్ల తీవ్ర పరిణామాలు ఉన్నప్పటికీ, ప్రధాన తెలుగు మీడియా బాలి రెడ్డి గురించి ఎటువంటి వివరణాత్మక నివేదికను వారి పత్రికలలో న్యూస్ రాయలేదు . ఈ కేసు కాలిఫోర్నియాలో మానవ అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో కూడా నొక్కిచెప్పింది, ఈ కేసు ఆధారంగా కాలిఫోర్నియా రాష్ట్రము 2005లో మానవ అక్రమ రవాణా వ్యతిరేక చట్టాన్ని ఆమోదించింది . ఏదేమైనా, బాలి రెడ్డి కుటుంబం బాధితులతో రాజీ కుదుర్చుకుంది. అందుకు ఫలితంగా, అతను శిక్ష అనుభవించాల్సినదానికంటే తక్కువ అనుభవించి కేవలం 8 సంవత్సరాలలోపే జైలు శిక్షను పొందాడు. ఈ కేసులో అతని కుటుంబం పాల్గొన్నప్పటికీ, వారిపై ఏ చర్యలు లేకుండా వారి వ్యాపార విస్తరణను కుటుంబీకులు కొనసాగించారు. కాలిఫోర్నియాలో వారి వ్యాపార ప్రభావాన్ని పటిష్టం చేసుకున్నారు . అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపాదిత రాజధాని అమరావతికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న అతని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల అతన్ని ఓ విజనరీ విద్యావేత్తగా ఆ ప్రాంత, అక్కడి విద్యను అభ్యసించే వారు కొనియాడుతున్నారు.
ప్రవాస భారతీయులలో మానవత్వం, సంఘీభావం లేకపోవడం
ప్రవాస భారతీయులలో ప్రముఖులలో మితవాద భావజాలం యొక్క పునరుజ్జీవనం ఈ మధ్య బాగా కనిపిస్తుంది. రిషి సునాక్, ప్రీతి పటేల్, సుయెల్లా బ్రావెర్మాన్ వంటి వాళ్ళు శ్రామిక వర్గం, ఇతర అట్టడుగు సమూహాలను లక్ష్యంగా చేసుకుని అమానవీయ రాజనీతిని మితవాదాన్ని ప్రచారం చేస్తున్నారు. UK లో ఈ మధ్య వీరు ద్వేషపూరిత ప్రసంగాలతో ఇస్లామోఫోబియా, వలసదారులు మరియు శరణార్థుల వ్యతిరేక భావనలు వ్వ్యక్త పరుస్తూ, శ్రామిక వ్యతిరేక చట్టాలకు మద్దతు పలుకుతున్నారు. వీటిలో ఈ మధ్య కాలంలో రద్దు చేయబడిన రువాండా పథకం కూడా ఉంది. వీరి వ్యవహారం కుల ప్రభావం గురించి తెలియని వ్యక్తులు, ఇలాంటి వలస నేపథ్యాలు ఉన్న వ్యక్తుల నుండి వచ్చిన విచిత్ర వైఖరి అని అనుకోవచ్చు. ఏదేమైనా, మీరు ఈ విషయాన్ని కుల-అవగాహన దృక్పథం నుండి చూసిన తర్వాత కార్మికవర్గానికి, అట్టడుగు వర్గాలకు మరియు ఆధిపత్య కులాల ప్రజలకు మధ్య ఈ సంఘీభావం లేకపోవడం ఆశ్చర్యం కలిగించదు, పైగా కుల నిచ్చెన మెట్ల సమాజంలో వారి పాత్ర చాలా సహజంగా అనిపిస్తుంది. ఇస్లామోఫోబియా యొక్క సాధారణ ప్రయోజనాల వల్ల మితవాద పార్టీలలో కూడా ఈ ప్రవాస భారతీయుల ప్రాముఖ్యత పెరుగుతుంది.
ప్రఖ్యాత సామాజిక కార్యకర్త డా|| ఆనంద్ తేల్తుంబ్డే తన రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకంలో భారతదేశంలో ముస్లింలు ప్రధానంగా పీడిత కులాల నుండి వచ్చినందున ఇస్లాం పట్ల ఆధిపత్య కులాలకు విరక్తి ఉంటుందని వివరించారు. అంతిమంగా, ఈ సవాళ్లను పరిష్కరించడం కోసం ప్రపంచ అవగాహన, అట్టడుగు వర్గాలలో సంఘీభావం, శ్రమ హక్కులను పరిరక్షించడానికి దక్షిణ ఆసియా లోపల మరియు వెలుపల కుల-ఆధారిత వివక్షను ఎదుర్కోవటానికి బలమైన చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేయాలి.
(Caste Beyond Borders: How Neoliberalism Accelerates Oppression by Indian Elites Overseas, The Wire, 25/Jul/2024)