కాకి కాకి కడవల కాకి
కడవను తెచ్చి గంగలొ ముంచి
గంగ నాకు నీళ్ళు ఇచ్చి
నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తె
ఆవు నాకు పాలు ఇచ్చె
పాలను తెచ్చి అవ్వకు ఇస్తె
అవ్వ నాకు జున్ను ఇచ్చె
జున్నును తెచ్చి పంతులుకు ఇస్తె
పంతులు నాకు చదువు చెప్తె
చదువును తెచ్చి మామకు ఇస్తె
మామ నాకు పిల్లనిచ్చె
పిల్ల పేరు మల్లె మొగ్గ
నా పేరు జమిందార్
చిన్నప్పుడు అమ్మ నాకు చెప్పిన పాట అబద్దమయిపోయింది! నా పేరు జమిందార్ కాదు! నేను జమిందార్‌ను కాలేదు! పిల్ల పేరు మల్లె మొగ్గే గాని మామ నాకు పిల్లని యివ్వలేదు?! చదువును తెచ్చి నేను మామకు యివ్వలేదు, యెందుకంటే పంతులు నాకు చదువు చెప్పలేదు?! ఔను, జున్నును తెచ్చి నేను పంతులుకు యివ్వలేదు, యెందుకంటే అవ్వ నాకు జున్ను యివ్వలేదు?! అవ్వకు నేను పాలు యివ్వలేదు, యెందుకంటే ఆవు నాకు పాలు యివ్వలేదు?! ఆవుకు నేను నీళ్ళు యివ్వలేదు, యెందుకంటే గంగా లేదు! నీళ్ళూ లేవు! గంగల ముంచిన కడవా లేదు! కాకీ లేదు! కాకి కాకి కడవల కాకీ లేదు?!
ఒక్క కాకీ కనపడదేమి? కాకులు యేమయిపోయాయి? ఎటు పోయాయి?
కాకీ కాకీ గువ్వల కాకి
కాకీ నాకూ ఈకా ఇచ్చె
ఈకా తెచ్చి దిబ్బకు ఇస్తె
దిబ్బా నాకూ ఎరువూ ఇచ్చె
ఎరువూ తెచ్చి చేలో వేస్తె
చేనూ నాకూ గడ్డీ ఇచ్చె
గడ్డీ తెచ్చీ ఆవుకు ఇస్తె
ఆవూ నాకూ పాలూ ఇచ్చె
పాలూ తెచ్చి పంతులుకిస్తె
పంతులు నాకు పాఠం చెప్పె
చిన్నప్పుడు నాన్న నాకు చెప్పిన పాట అబద్దమయిపోయింది! పాఠం లేదు! పంతులు లేడు! పాలూ లేవు! గడ్డిని మేసిన ఆవూ లేదు! ఎరువూ లేదు! దిబ్బాలేదు! ఈకా లేదు! అసలు కాకీ లేదు?!
ఒక్క కాకీ కనపడదేమి? కాకులు యేమయిపోయాయి? ఎటు పోయాయి?
కాకి ఒకటి నీళ్ళకు
కావ్ కావ్ అరిచెను
అడవి అంత తిరుగుతు
అలసి సొలసి పోయెను
కడవనొకటి చూసెను
కడవ మీద వాలెను
కడవలోన అడుగున
కొంచెం నీళ్ళు వుండెను
నోటితో రాళ్ళు తెచ్చి
కడవలో వేసెను
నీరు పైకి వచ్చెను
కడుపునిండ తాగెను
సంతోషముగ పోయెను
తోటి పిల్లలతో కూడి నేను తోట రాముణ్ణి కాలేదు?! కూని రాగం తియ్యలేదు?! ఖూనీ అయి కళ్ళు తేలేసిన కాకిని చూశాను! కళ్ళారా చూశాను!
కాకి నా కళ్ళముందే కాళ్ళు బిగించి రెక్కలు టపటపలాడించి తల నేలకు ఆనించి కొట్టుకొని చచ్చింది! చచ్చే ముందు కథ చెప్పింది! అది నేను చిన్నప్పటినుండి విన్న కథ కాదు! కన్న కథ కానే కాదు!
కాకమ్మ కథలు యెన్నో విన్నాను! కాని కాకులే కథలు చెప్పే కాలమొకటి వొచ్చింది!
కాకి కాకి కడవల కాకి- కడవను యెందుకు యివ్వలేదో చెప్పింది!
కాకీ కాకీ గువ్వల కాకి- యీకను యెందుకు యివ్వలేదో చెప్పింది!
‘కాకి ఒకటి నీళ్ళకు… కావ్ కావ్ అరిచెను’ అంటూ కాకి కథ చెప్పడం మొదలు పెట్టింది!
‘అడవి అంత తిరుగుతు… అలసి సొలసి పోయెను’ అన్నారు కథని యెరిగిన నా పిల్ల సావాసగాళ్ళు!
ఔనన్నట్టు తలాడించి చూసింది కాకి!
‘పాపం నీళ్ళు లేవా?’ అడిగారు పిల్లలు!
‘అడవే లేదు’ అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కాకి!
‘అడవిని అవతల దేశాలకి యిచ్చేశారుగా’ గుసగుసగా అంది మా వూరి పేదరాసి పెద్దమ్మ! ‘గట్టిగా మాట్లాడితే నోట్లో నాలుక పడిపోతుందా?’ అన్నాను! ‘నాలుక కాదు, శిరసు తెగి పడిపోతుంది’ కళ్ళింతింతలు చేసి గుట్టుగా చెప్పింది మా వూరి పేదరాసి పెద్దమ్మ!
అడవిలో యెండు కట్టె పుల్ల విరిసిన వాళ్ళని ఖైదు చేసి అడవిని అప్పనంగా అప్పగింతలిచ్చేయడమేమిటో మా పిల్లలకే కాదు, నాకూ బోధ పళ్ళేదు! అందునా అడవి గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఖైదయ్యిపోవడం నాకు యాదికొచ్చింది!
‘గొంతెండిపోయినా గుక్కెడు నీళ్ళు దొరకలేదు’ చెప్తోన్న కాకి గొంతు నిజంగానే తడారిపోతూ మాట పెగల్లేదు!
ఊళ్ళున్నాయి! నోళ్ళున్నాయి! చెరువులు మింగేశారు! బావులున్నాయి! కాని బావుల్లో నీళ్ళు లేవు! కాకి కళ్ళలో తప్ప!
‘కడవనొకటి చూసెను… కడవ మీద వాలెను’ పిల్లలు వొక్క గొంతై కాకికి పాటందించారు!
ఆర్పబోయిన కన్ను తెరచి చూసింది కాకి!
‘కడవలోన అడుగున… కొంచెం నీళ్ళు వుండెను’ పిల్లలు రాగయుక్తంగా పాడుతున్నారు!
కాకి కన్నార్పకుండా చూసి కొన్ని క్షణాలు మైమరచి అలాగే లయకు తగ్గట్టు తలాడించింది!
‘నోటితో రాళ్ళు తెచ్చి… కడవలో వేసెను’ పిల్లలు పోటీపడి పాడుతున్నారు!
కాకి తలూపడం మానేసింది!
‘నీరు పైకి వచ్చెను…’ పాటలో మాట పూర్తికాకముందే కాకికి కన్నీరు వుబికి వచ్చింది!
పిల్లలు మూగవాళ్ళయిపోయారు!
కాకి గొంతులో దోసెడు నీళ్ళు తెచ్చి పోసింది మా వూరి పేదరాసి పెద్దమ్మ!
కావ్ మంది కాకి! కాకి యేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమైంది! మేమంతా చెవులు రిక్కించాము!
‘పిల్లలకి పిడికెడు అన్నం పెట్టాలంటే నేను కావాలి… పెద్దలకు పిడచడు పిండం పెట్టాలంటే నేను కావాలి…’ కాకి గొంతు పూడుకుపోతోంది!
పిల్లలతో పాటు పెద్దవాళ్ళూ వచ్చి కాకి చుట్టూ గుమికూడారు తోటి కాకుల్లా! లోకులు పలుగాకుల్లా!
‘మేం బతకాలంటే నీళ్ళు కావాలి! ఆ నీళ్ళుగల చెరువులు కావాలి! చెట్టూ చేమా కావాలి! అన్నీ వుండే అడవి కావాలి!’
కాకిని కామ్రేడ్‌ని చూసినట్టు చూసి వెనక్కితగ్గారు పెద్దలు!
‘కాని… ఘనత వహించిన పెద్ద మారాజులు నీళ్ళిమ్మంటే రాళ్ళిచ్చారు! అందుకనే దొరికిన కడవల్ని మీకివ్వకుండా దాహానికి మేం రాళ్ళేసి నింపాం…’
ఆ మాటకు సాక్ష్యంగా పక్కనే రాళ్ళతో కడవ నిండిపోయి వుంది!
‘మా గోల కాకి గోల అయ్యింది, పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోలేదు…’ కాకి కూడబలుక్కున్నట్టు చెప్తోంది!
ఎందుకో కాకి కాకిలా కనిపించలేదు! అనిపించలేదు!
‘మా దాహం తీరలేదు, రేపు మీకూ దాహమేస్తే మా పూచీ లేదు…’ హెచ్చరికగా అన్నట్టు అంది కాకి!
‘విన్నవించుకోవాల్సిన వాళ్ళకి విన్నవించుకోలేదా?’ అన్నాను!
‘కాకులకి యేది మేలో మాకు తెలుసు. బావులకన్నా చెరువులకన్నా అడవులకన్నా కాకులకి కావాల్సినవి రాళ్ళే’
ఆ మాట యెవరిదో మాకర్థమయిపోయింది! ‘నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికే యీ రాళ్ళు’ కొందరు గొణుక్కున్నారు!
‘కాకుల మీద మాకెంతో ప్రేమ. గౌరవం. అందుకే కాకుల కోసం… కడవలు నింపడం కోసం… రాళ్ళని గులకరాళ్ళుగా మార్చే పథకాన్ని యెంతో ఆలోచించి ప్రవేశపెడుతున్నాం. ఇది కాకులకు నీళ్ళందించే కార్యక్రమం…’
ఆ మాట యెవరిదో కూడా అక్కడున్న అందరికీ అర్థమయిపోయింది!
‘బాయీ అవుర్ బెహరాన్… కాకులకి దాహం వేసినప్పుడల్లా గులకరాళ్ళని అందుబాటులో వుంచుతున్నాం…’ దూరంగా మాటలతో పాటు- ‘కడుపునిండ తాగెను… సంతోషముగ పోయెను’ పాడిన పాటే పాడగా లీలగా వినిపిస్తోంది!
కాకి నీళ్ళు తాగకుండానే గొంతు తడవకుండానే పోయింది!
కాకిలో యే కదలికా లేదు!
పిల్లలతో సహా అందరం మొద్దుబారినట్టు మొదలు నరికిన చెట్లలా వుండిపోయాం!
నాకు నల్లని కాకి యెందుకో తెల్లగా కనిపించింది!
కుండ నిండిన గులకరాళ్ళు తెల్లని అన్నంలా అగుపించింది!!
(రైతులందరికీ)
Great story. Liked it. Devi Prasad