ముగింపులేని తెగింపు వాక్యం ‘దుర్గాపురం రోడ్’

“We are in an abstract universe by design.”
― Anthony T. Hincks

ఈ వాక్యాలు సరిగ్గా అతుక్కుపోతాయీ కవిత్వ ప్రయాణంలో. దేశరాజు గారి కవిత్వం కోసం వేచి చూసే తన అభిమానుల్లో నేనూ ఒకణ్ణి. అప్పుడప్పుడూ రాసినా ఆ కాలానికి వున్న గ్యాప్ ను పూరిస్తూ తన కవితను వెలువరించడం తన ప్రత్యేకత. ఇరవై సంవత్సరాల తరువాత దుర్గాపురం రోడ్ పేరుతో తన చిత్రంతోనే కవర్ పేజీని అలంకరించడం ద్వారా తన కవిత్వానికి తన అనుభూతి సారమే ప్రామాణికం అని చెప్పకనే చెప్పినట్లుగా అర్థమయింది. ఒక ప్రత్యేకతతో కవిత్వాన్ని ఆవిష్కరించడమ్ అలవాటుగా గల కవిత్వ ప్రేమికుడు. తను వచ్చిన నేల ఉత్తరాంధ్ర నుండి తనకు బువ్వ పెట్టిన హైటెక్ సిటీ వరకు తన ప్రయాణ మజిలీయే తన కవిత్వం. ఉద్ధాన ఉద్యమ వారసత్వపు గంధకపు వాసన తన అక్షరాలకు ఒక ప్రత్యేక ఉనికినిస్తాయి. తనలోని భావ సంఘర్షణ వెనక వున్న సైద్ధాంతికతను తన ఆలోచనాధారలో కలగలుపుకుంటూ ఒక ప్రత్యేక శైలితో తన సంతకం లేకపోయినా ఇది దేశరాజు వాక్యం అని మనల్ని ఉలిక్కిపడేలా చేసేలా పరిణతి సాధించిన కవి. తన చుట్టు జరిగే ప్రతి సంఘటన తన జర్నలిస్ట్ చూపుతో ఎక్స్ రే తీసి దానిని కొంత వ్యంగ్యంతో చెప్పడం వలన తనకున్న వార్తాభిలాషలో వున్న కుతూహలం చదివించే గుణం కలుగ చేస్తుంది తన కవిత్వానికి. ఒక్కోసారి వస్తువును తను డామినేట్ చేస్తూ చెప్తున్నార అనిపిస్తుంది. కానీ అది కవి యొక్క ధర్మాగ్రహాన్ని వ్యక్తీకరించడంతో తన్ను తాను ఆ అదృశ్య చిత్రం నుండి వెలుపలికి వచ్చారా అనిపిస్తుంది. ఇది దేశరాజు గారిలొ నాకు నచ్చే లక్షణం. సామాజిక పరిణామాలు అన్నీ సామాన్యునికి వ్యతిరేకంగా జరుగుతూ తన కాళ్ళకింద నేల పెకలించబడడాన్ని గుర్తించే క్రమంలో కవి తన్ను తాను కవిత్వం ద్వారా తన పెనుగులాటను చెప్పగలగడం చూస్తాం తన కవిత్వంలో.

దిగంతాల లోతుల వరకూ
శరీరంలో పరుచుకున్న
విశాలమైన ఇనుప పాదాలు
వేడెక్కి కరిగిపోతున్న వేదన

ఇప్పుడు నాకు-
రెండు వక్షోజాల్లాంటి
రెండు ఆవేశాలు కావాలి

చుట్టూ కనిపిస్తున్న కొండలన్నీ చెట్లన్నీ
కాంక్రీటు నిర్మాణాలన్నీ
కుతకుతా ఉడికిపోతున్నట్టు-
ఒడ్లు రెండూ పోట్లాడుకుని
నీళ్ళతో నావని బాదుతున్నట్టు-

ఊగిపోతున్న ఒంటరి దుఃఖాన్ని
పంచుకునే
ఏకాంత సమూహం కావాలి నాకిప్పుడు. అంటారు కవి. ఇంత భావావేశాన్ని సంఘర్షణను ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లా చిత్రించి చెప్పడం తనకే సొంతం. ఇది ఇరవై ఏళ్ళ క్రితం రాసినదైనా ఆ తాజాదనం ఇప్పటికీ మనల్ని తీవ్రంగా కదిలిస్తుంది.

యుక్తవయసులో ఉన్నప్పుడు తీవ్ర భావజాలంతో రచనలను ప్రచురించి ఆ తరువత్తరువాత తామేదైతే వ్యతిరేకించారో ఆ పంచ కిందనే చేరి అప్పుడప్పుడూ గాండ్రించే కొంతమంది వ్యక్తుల స్వభావాన్ని తనదైన వ్యంగ్య చమత్కారంతో దేశరాజే చెప్పగలరు.

మీరు బిగించి, అమర్చిన పట్టాలపై
పరుగెడుతున్నంత సేపూ అంతా బాగానే వుంటుంది
దాని తోవ అది వెతుక్కునేసరికి
రైలు పట్టాలు తప్పిందంటాఋ

మీరు నిర్మించుకున్న మహా నిర్మాణాల
అట్టాడుగు పొరల నుంచీ…
మీరు తెరుచుకున్న కిటికీల చాటునుంచీ…
విశాల ప్రపంచానికి భాష్యం చెప్పగల విజ్నులు మీరు

దొరల పర్యటనను ధిక్కరిస్తూనే
డాలర్ తళుకులకు చూపు కోల్పోయి
శ్వేతసౌధం ముందు మోకరిల్ల గల ధీరులు మీరు

తెలిసో తెలియకో….
యవ్వనంలో తొక్కిన అడుసును….
అమెరికాలో కడుక్కోగల మేధావులు మీరు… (డెత్ నోట్)

తనున్న సిటీలైఫ్ లో వెంటాడే ఒంటరితనాన్ని అనేక కవితల్లో వ్యక్తం చేసేటప్పుడు తనను అప్పటికప్పుడు వెంటాడే వైరాగ్య భావమేదో క్రమంగా రూపుదిద్దుకుంటూ ఒక గుణాత్మకమైన మార్పును ఆశించెలా ఆవిష్కరించడం దేశరాజు గారి శైలి.

అరుపు వినబడుతుంది, కుక్క కనబడదు
ఒక్కసారి గుండె జల్లుమంటుంది
మనల్ని మనం వెతుక్కునేప్పుడు కూడా అంతే
ఒకరికొకరం కనబడం-

శ్రీకాకుల విప్లవాగ్నుల ఎర్రెర్రని జెండాలకు
లాల్ సలాం చెప్పడం
ఎన్ కౌంటర్లు బూటకమంటూ సంతకాలు చేయడం
-చాలా సులువు
మనం అగ్ని ప్రవేశం చేయడంకంటే.

***

ఒక కన్ను తెరిచా
కళ్ళలో చందమామ ఇంకా ఆశగా వెలుగుతూనే వుంది.
వాళ్ళు వెళ్ళిపోయారు, నిరాశగా. ( అర్థరాత్రికి అటువైపు ట్యాంక్ బండ్ పై ఒకసారి)

బుద్ధిజీవులుగా ప్రకటించుకుని భద్రమయ జీవితాలలో వుండి ఆవేశ పూరిత ప్రసంగాలు చేసే వారి పట్ల తన దైన శైలిలో విసిరిన వ్యంగ్యాస్త్రం ఈ కవితలో మనకు అనుభవమవుతుంది.

చాలా కవితలలో తన ఒంటరి ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా తన లోలోపలి తరగని జ్నాపకాలను పంచుకుంటారు కవి.

నాగావళి నీట్లో అనేకసార్లు నగ్నంగా మునిగినా
నిక్కర్లిప్పి దిగలేని
తొలి సిగ్గప్పుడు, ఆ పిల్ల నవ్విన నవ్వు
తళుక్కుమంది-
ఏదీ ఇప్పుడు –
ఇప్పుడు ప్రేమ ప్రైవేటీకరించబడింది… అనడం ద్వారా ఈనాటి ఆన్లైన్ ప్రేమలూ తద్వారా జరుగుతున్న సంఘర్షణలను స్పృశిస్తారు.

నగరం…. నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్ వంపులు దాటి
మురికి వాడలు దాటి, కొండలు దాటి, పొలాలు దాటి
రైలెల్లి పోతోంది… రైలెల్లి పోతోంది… పోతోంది.

అదిగో.. అదిగో… అక్కడ చూడు,
ఎగురుతున్న కాటన్ చున్నీ… ఆ పిల్ల
ఆశగా అదిగో, అదిగో.. ఆ పిల్లే.

నాకోసమేనా?
అనుమానంలేదు, నాకోసమే
దూకెయ్యాలి… దూకెయ్యాలి.. దూకె..

అంతే, దొరికినా దొరక్కపోయినా…
ప్రేమ కోసం గాయపడాల్సిందే. (దుర్గాపురం రోడ్).. ప్రేమకోసం తహతహ లాడే ఒక యువకుని గుండె చప్పుడు దేశరాజు. తనని ఇప్పటికీ ఇంత తాజాగా వుంచేది ఆ ప్రేమావేశమే. అది సమాజం పట్ల తనకున్న బాధ్యతను అయినా వ్యక్తిగత అనుభూతినైనా.

హక్కుల నేత పురుషోత్తం సార్ హత్యపై తనలో రగిలిన ఆగ్రహాన్ని కూడ సున్నితంగా చెప్పడం ఈ కవి ప్రత్యేకం.

వ్యక్తుల మీదైనా, ప్రజల మీదైనా మనసు పడ్డామా
బహుశా-
మోసపోవడానికి సిద్ధపడి వుండాలేమో

ఐస్ క్రీమ్లూ, అమెరికా, అష్టయిశ్వర్యాల మధ్య
లలితలలితంగా గారాలు పోయిన ఏంజిల్
అడవుల్లో మానులై, తీగలై….
చెట్ల బెరడుల్లా రాటుదేలుతూ మీరు
జనారణ్యంలో జనచరమై
జనం కోసం మాట్లాడుతూ అతను

ప్రపంచంలో లేనిదాన్ని కోరుకుంది కుముదిని
దాన్ని చట్టబద్ధంగా సాధించాలనుకున్నాడు పురుషోత్తం
సాయుధంగా పోరాడాలనుకున్నారు మీరు ఏడుగురు

భర్త పిలుపును కోరుతూ
మహానగరం నుంచి ఆమె ఒంటరిగా
ప్రపంచాన్ని పిలుస్తూ
తీగలపర్రు నుంచి సామూహికంగా మీరు
హక్కుల్నడుగుతూ
నడిబజార్లో కిరాతకంగా అతను

ప్రేమైనా, పోరాటమైనా
చివరఖరికి ఒరిగిపోవడైమే గమ్యమా? అని ప్రశ్నిస్తారు.

“I know who I was, I can tell you who I may have been, but I am, now, only in this line of words I write.”
― Ursula K. Le Guin

ఈ తాత్వికుని వాక్యాలు సరిగ్గా సరిపోలుతాయి దేశరాజుకి్. ప్రపంచ బ్యాంకు, గ్లోబలైజేషన్ పరిణామాలు మనిషి ఉనికిని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో, తద్వారా చిద్రమవుతున్న జీవితాలు రోజు రోజుకి బలపడుతున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల దాష్టీకం, ప్రశ్నించలేని సగటు మానవుని అవమానకర స్థితిని ఆఖరి సన్నివేశం కవితలో చెప్తారు.

కన్నీరు ఎండి, నెత్తురోడి
మాటలు కొరవడి,
చేష్టలుడిగిన నిస్సత్తువులోంచి
నువ్వొక ఆయుధాన్ని కలగంటావు
వాడు, ఎదురుగా వచ్చి కాల్చేసి
నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు
ఎందుకంటే, నిన్ను నక్సలైట్ అనో,
తీవ్రవాది అనో అనాల్సిన అవసరం
వాడికి, ఇప్పుడిక లేదు.

కవికి ఉద్యమం పట్ల అపారమైన నమ్మకముందన్న విషయాన్ని అలాగే మనుషులలో కొరవడుతున్న మానవత్వం పట్ల వున్న ఆవేదనను ఈ సంపుటిలో మనం అనుభూతించొచ్చు. రక్తమాంసాలు తీర్చిదిద్దిన ఉత్తరాంధ్రా పోరాట వారసత్వ పరిమళాన్ని వదులుకోని కవిగా చాలా కవితలలో కనిపిస్తారు. జాతీయ అంతర్జాతీయ సంఘటనల వెనక దాగిన అరాచక పెట్టుబడిదారీ కుట్రలను వారి కుయుక్తులను సూటిగానే చెప్పడం ద్వారా కవి యొక్క అంతరాత్మ మనకు కనిపిస్తుంది. ప్రజల పట్ల వారి అమాయకత్వం పట్ల తనకున్న ప్రేమను తెలియపరుస్తాయి చాలా కవితలు. భవిష్యత్ పట్ల అపార నమ్మకమున్న కవిగా ఇప్పటికిదే ముగింపుగా తనెక్కడా చెప్పక పోవడం దేశరాజు గారి ప్రత్యేకత.

అయినా, చందమామకేమవుతుంది?
మనం బిగించిన పిడికిలే
ఇరుకు గదిలో ప్రాణవాయువవుతుంది-
మనం చేసిన నినాదమే
జైలుగోడల మధ్య పలకరింతవుతుంది-
మనం నమ్ముకున్న అక్షరమే
మన ఆశలకు కొమ్ముకాసి,
కటకటాలను ఛేదిస్తుంది
బహుళ పంచమి జ్యోత్స్న భద్రంగా బయటికొస్తుంది
ఈ చీకటి రాజ్యంలో మళ్ళీ వెన్నెల విరగబూస్తుంది
అక్షరం చందమామై ప్రకాశిస్తుంది. (అక్షరం పలవరిస్తోంది- 26-6-2008)

ఈ కవితా చరణాలు పన్నెండేళ్ళ క్రితం రాసినవైనా నేడు జైలు నిర్బంధంలో వున్న కామ్రేడ్ వివి, సాయిబాబాల గురించే రాసినట్లుండడం కవి ప్రాసంగికతను తెలుపుతుంది.

ఈ కవితా సంపుటి మొత్తం చదివితే కవి ఎక్కడా తప్పిపోలేదు మన మధ్యే తిరుగాడుతూ ఎప్పటికప్పుడు తనను తాను పలవరిస్తూ మనల్ని పలకరిస్తూ వున్నాడని తప్పక తెలియ చేస్తుంది. ముగింపు లేని తన వాక్యం మనల్ని వెంటాడుతుంది.

“You need a body to preserve your soul, not a set of abstract principles.”
― Ahmed Mostafa

జ‌న‌నం: విజయనగరం జిల్లా పార్వతీపురం. విరసం స‌భ్యుడు. త‌న‌ను తాను వ్య‌క్తీక‌రించుకునే సాధ‌నంగా క‌విత్వం త‌న జీవితంలో భాగంగా మారింద‌ని న‌మ్మిన క‌వి. ఇప్పటివరకు 'వెన్నెలదారి', 'రెప్పల వంతెన', 'కాగుతున్న రుతువు' కవితా సంపుటాలు వచ్చాయి.

Leave a Reply