అమెరికాలోని జాతి వివక్ష కారణంగా నలిగిపోయిన జీవితాలెన్నో. 1999 లో వచ్చిన “ది హరికేన్” అనే సినిమా రూబిన్ కార్టర్ అనే ఒక బాక్సర్ జీవిత కథ ఆధారంగా తీసారు. ఈ సినిమాకు ఆధారం 1974లో వచ్చిన “The Sixteenth Round: From Number 1 Contender to 45472” అనే ఆత్మకథ, అలాగే 1991లో వచ్చిన Lazarus and the Hurricane : The Freeing of Rubin “The Hurricane” అనే మరో పుస్తకం. 1974 లో వచ్చిన పుస్తకాన్ని రూబిన్ కార్టర్ జైలులో రచిస్తే, 1991లో వచ్చిన పుస్తకాన్ని సాం చైటన్, టేర్రీ స్వింటనే అనే ఇద్దరు మిత్రులు రచించారు. ఈ సినిమాలో రూబిన్ పాత్ర పోషించింది డెంజిల్ వాషింగ్టన్ అనే అమెరికన్ నటుడు. హాలివుడ్ లో మంచి నటుడినా పేరు పొందిన ఈయన చాలా గొప్ప పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రూబిన్ పాత్రలో ఆయన జీవించారని చెప్పవచ్చు.
సినిమాలో కార్టర్ ఏ తప్పు చేయకుండా జైలు పాలవ్వడం, అతను జైలులో రాసిన పుస్తకాన్ని చదివిన ఒక యువకుడు అందులోని విషాదానికి కదిలిపోయి కార్టర్ విడుదలకు తన సంరక్షులతో పాటు కలిసి పనిచేయడం చూస్తాం. ఈ సినిమాలో నటించినందుకు డెంజిల్ వాషింగ్టన్ అకాడమీ అవార్డ్ కు నామినేషన్ పొందారు. ఈ సినిమాలో రెండు అంశాలను గమనించాలి. ఒకటి నల్ల జాతీయులు తరతరాలుగా అనుభవిస్తున్న వివక్ష, అలాగే ఒక పుస్తకం కలిగించే ఆలోచన. కత్తి కన్నా కలం గొప్పది అన్న వాక్యాన్ని స్వయంగా ఈ సినిమాలో అనుభవిస్తాం. అక్షరానికున్న బలం అర్ధం చేసుకుంటాం. అందుకే ఈ రెండు కోణాలు కలిసి చూపిన ఈ సినిమా చాలా మందికి చేరువ కాగలిగింది. ఈ రెండు అంశాలతో వచ్చిన రెండు పుస్తకాలు కూడా కథకు బలమైన స్క్రీన్ ప్లే రాసుకోవడానికి సహకరించాయి. ప్రజా ఉద్యమాలను పటిష్టం చేయడంలో సాహిత్యం పాత్రను కూడా స్పష్టంగా ప్రకటించిన సినిమా ఇది.
మిడిల్ వెయిట్ బాక్సర్ గా పేరు పొందిన రూబిన్ న్యూ జర్సీలోని పాటర్సన్లో ఒక బార్ లో జరిగిన మూడు హత్యలకు దోషిగా అరెస్టు చేయబడతాడు. అతని తప్పు కేవలం ఆ సమయంలో ఆ బార్ ముందు నుండి కారులో వెళుతూ ఉండడం. అతని నిర్దోషి అని పోలీసులకీ తెలుసు. అయితే ఆ బార్ లో అదే సమయంలో ఉన్న బెల్లో అనే ఒక వ్యక్తి కార్టర్, అతనితో ఉన్న ఆర్టిస్ అనే యువకులే హత్య చేసారని సాక్షం చెబుతాడు. ఇతను హత్యా జరిగిన సమయంలో బార్ లో ఉంటాడు. నేరస్తుడి కావచ్చని ఇతనిపై కూడా అనుమానం కలుగుతుంది పోలీసులకి. కాని ఇతను తెల్లవాడు. ఆ సమయంలో బార్ నుండి కారులో వెళ్తున్న కార్టర్ ఆర్టిస్ లను అనుమానంతో పోలీసులు అరెస్టు చేస్తే, వారే హంతకులని, తాను స్వయంగా వారిని బార్లో చూసానని కోర్టులో చెబుతాడు బెల్లో. తెల్లవాని మాటకు గౌరవానిచ్చి, కార్టర్ ను ఆర్టిస్ ను జైలుకి పంపిస్తుంది కోర్టు. కోర్టులో తాము నిర్దోషులమని, తన బాక్సింగ్ కెరీర్, సమాజంలో తన పేరు, పౌర హక్కుల కార్యకర్తగా తన పనిని గమనించి తనను నమ్మమని బ్రతిమాలుకుంటాడు కార్టర్. కాని అతని గోడు కోర్టు వినదు. ఒక నల్లవానిగా అతని విజయాలకు గౌరవానికి బదులు అసూయను ప్రదర్శిస్తుంది సమాజం.
సుమారు 20 సంవత్సరాలు జైలులో మగ్గిపోతాడు రూబిన్. అతనిలో కోపం, ఆవేశం, అసహాయత ఇవన్నీ ప్రపంచం పట్ల కసిగా మారతాయి. తాను దోషిని కానని ఎంత మొత్తుకున్నా జైలుపాలు చేసిన సమాజం పట్ల అతనిలో కోపంతో పాటు ,తాను నిర్దోషినని ఎవరైనా నమ్మాలనే కోరిక కూడా ఉంటుంది. జైలులో ఎవరికీ సహకరించని అతన్ని అందరూ అనుమానంగానే చూస్తారు. ఒంటరితనంతో నా అనే వారు లేని కార్టర్, తన జీవిత కథను పుస్తకంలా తీసుకువస్తాడు. అది పబ్లిష్ అవుతుంది.
కెనడా దేశస్తులు ముగ్గురు పౌర హక్కులపై పని చేస్తూ ఉంటారు. వీరికి లెస్రా మార్టిన్ అనే నల్లజాతీయ యువకుడి గురించి తెలుస్తుంది. ఎంతో తెలివి ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా పదేళ్ళ వయసు నుండే పని చేయడం వలన పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత కూడా లెస్రా చదవడం రాయడం రాకుండా ఉండిపోతాడు. అతని తెలివి తేటలు గమనించిన అ ముగ్గురు మిత్రులు, లెస్రా తల్లి తండ్రులను ఒప్పించి అతడిని తమతో తీసుకువెళ్లి చదువు నేర్పించడం మొదలెడతారు. అక్షరాలను నేర్చుకున్న లెస్రాకు పుస్తకాలను పరిచయం చేస్తారు వాళ్ళు. ఒక పుస్తకాల సెకెండ్ హాండ్ సేల్ కు మొదటి సారి వెళ్ళిన లెస్రా ఆ పుస్తకాల మధ్య కార్టర్ అత్మకథను ఏరుకుంటాడు. తనలాంటి ఒక నల్ల జాతీయుని కథ అని ఆ పుస్తకం చదవడం మొదలెట్టిన అతనికి, కార్టర్ పట్ల ఆలోచన మొదలవుతుంది. కార్టర్ నిర్దోషి అని నమ్మకం కలుగుతుంది, అతని స్థితి బాధ కలిగిస్తుంది. జైలులో ఉన్న కార్టర్ కు ఉత్తరం రాస్తాడు లెస్రా. తననెవ్వరూ పట్టించుకోని సమయంలో ఒక టీనేజర్ ఉత్తరం రాయడం, అదీ తన పుస్తకాన్ని చదవి తాను నిర్దోషినని నమ్మి తన స్నేహాన్ని కోరడం కార్టర్ ను కదిలిస్తుంది. లెస్రా ఉత్తరానికి జవాబు ఇస్తాడు కార్టర్. తరువాత అతన్నిజైలుకి వెళ్ళి కలుస్తాడు లెస్రా. తన సంరక్షకుల గురించి చెబుతాడు. వారి గురించి విని ఆశ్చర్యపోతాడు కార్టర్. తెల్ల జాతీయులు ఇలా ఒక నల్ల జాతీయిని ప్రతిభను గుర్తుంచి, అతని కోసం పనిచేయడం గురించి విని వారిని కలవాలనుకుంటాడు. కార్టర్ స్నేహం ప్రపంచాన్ని నిశితంగా చూసే దృష్టికి లెస్రాకు కలిగిస్తుంది. అతనికి సహాయంగా నిలుస్తారు ఆ ముగ్గురు సంరక్షకులు. తమ దేశం వదిలి కార్టర్ ఉన్న జైలుకి దగ్గరగా ఇల్లు తీసుకుని కార్టర్ కేసు మళ్ళి తెరిపిస్తారు వాళ్ళు.
1985లో అంటే కార్టర్ జైలు పాలైన 20 సంవత్సరాల తరువాత ఓపెన్ చేయబడిన ఈ కెస్ లో కేవలం నల్ల జాతీయుడయినందువలన అనుమానంతో కార్టర్ అరెస్టుకు గురి అయి అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడని కోర్టు అంగీకరిస్తుంది. అతన్ని విడుదల చేస్తుంది. సినిమా ఆఖరున కార్టర్ తన జీవిత సారాంశంగా చెప్పే ఒక వాక్యం గుర్తుంచుకోవలసినది. “ద్వేషం నన్ను జైలు పాలు చేస్తే, ప్రేమ నాకు స్వేచ్చను ప్రసాదించింది” అంటాడు అతను. చాలా లోతైన ఆలోచనకు బీజం వేస్తుంది ఈ వాక్యం. 1966 – 1985 మధ్యన జరిగిన ఈ కథ నేటికీ అమెరికాలో వివక్ష రూపంలో ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కోసం డెంజిల్ వాషింగ్టన్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకోవడమే కాకుండా రూబిన్ కార్టర్ అనుభవాలను అతన్ని కలిసి స్వయంగా తెలుసుకున్నారు. అందుకే ఆ పాత్రలో అంతలా అయన ఒదిగొపోయి నటించగలిగారు. కార్టర్ లోని దెబ్బ తిన్న ఆత్మాభిమానం, సమాజం పై కోపం కసి, అతనిలోని మంచితనం, ఇవన్నీ ఒకేసారి ఆ పాత్రలో డెంజిల్ చూపించగలగడం ఈ సినిమాకు, రూబిన్ పాత్రకు ఆయన చేసిన న్యాయం..
రూబిన్ కార్టర్ జీవితాన్ని తరువాత పరిశీలిస్తే తనలా అన్యాయంగా జైలు పాలైన వారికి అతను చేసిన సేవను ప్రశంసించకుండా ఉండలేం. బాక్సింగ్ లో దూసుకువెళుతున్న అతన్ని అభిమానులు “ది హరికేన్” అని ప్రేమగా పిలిచేవారు. అంతటి అభిమానాన్ని చూరగొన్న అతను కూడ కేవలం నల్ల జాతీయుడన్న ఒకే ఒక కారణంతో అన్యాయంగా జైలు పాలయి తన సర్వస్వాన్ని పోగొట్టూకున్నా, జైలు నుండి బైటికి వచ్చిన క్షణం నుండీ తన లాంటి వారి కోసం పని చేయాలని నిశ్చయించుకుని తన జీవితాన్ని ఆ దిశగా నడిపించుకున్నాడు. చిన్నప్పుడు ఒక వ్యక్తి పై కత్తి దూసి జువినైల్ హోమ్ లో కొంతకాలం గడిపాడు కార్టర్. అక్కడి నుండి తప్పించుకుని యు.ఎస్. ఆర్మీలో పని చేశారు ఆయన. ప్రాధమిక ట్రైనింగ్ పూర్తి చేసుకుని జర్మని వెళ్ళి అక్కడ సైన్యంలో బాక్సర్ గా శిక్షణ తీసుకోవడం మొదలెట్టారు. అయితే అతనిలోని కోపం, తన జాతికి సమాజంలో గౌరవం ఇవ్వని పరిస్థితుల పట్ల అసహనం కారణంగా, కోర్ట్రు మార్షల్ అయి సైన్యం నుండి పంపివేయ బడ్డారు.
తరువాత అతను ప్రొఫెషనల్ బాక్సర్ గా మారాడు. బాక్సింగ్ రింగ్ లో అతని ఉగ్రరూపం చూసి అభిమానులు అతనికిచ్చిన బిరుదు “హరికేన్” . ఆ సమయంలోనే ఒక మాచ్ లో అప్పటి ప్రపంచ చాంపియన్ నే ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతటి పేరు సంపాదించుకున్న సమయంలోనే అతను బార్ లో హత్యలకు అరెస్ట్ అవుతాడు. అతన్ని హంతకుడిగా గుర్తించిన వ్యక్తి ఆ బార్ లో సిగరెట్ల కోసం వెళ్ళి అక్కడ పడి ఉన్న శవాలను చూసి అదే అదునని కాష్ కౌంటర్లో డబ్బు తస్కరించి వస్తూ పోలీసుల కంటపడి తాను హంతకులు పారిపోతుంటే చూసానని బుకాయిస్తాడు. ఇద్దరు నల్ల జాతీయులు తమపై కాల్పులు జరిపి పారిపోయారని అప్పటికే గాయపడినవారు పోలీసులకు చెబుతారు. ఆ సమయంలో బార్ ముందు నుండి రెండు సార్లు కార్లో ప్రయాణించిన కార్టర్, అతని వెనుక ఉన్న నేర చరిత్ర ఇవన్నీ కార్టర్ ను దోషి అనుకోవడానికి దోహదపడ్డాయి. కార్టర్ కు అతని స్నేహితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తుంది కోర్టు.
చిన్నప్పటి నుండి ప్రతికూల పరిస్థుతులతో పోరాడుతూ, తనకి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం కావాలని తనలోని శక్తినంతా వెచ్చింఛి శ్రమ పడుతున్న కార్టర్ ఆ స్థితిలో కూడా రచయిత గా మారి తన నిర్ధోషత్వాన్ని, తన వేదనను సమాజం ముందు పెడతాడు. చివరకు ఆ పట్టుదలే అతని విడుదలకు కారణమవుతుంది.
సినిమాలో ఒక సీన్ ఉంటుంది. తనతో సానుభూతిగా వ్యవహరించే జైలు వార్డన్ ను కార్టర్ నేను నేరం చేసానని అనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి జవాబుగా అతను “నాకు తెలీదు ఏం అనుకావాలో” అని జవాబిస్తాడు. సినిమాలో కార్టర్ నిర్ధోషి అని బలమైన వాదనలు ఉండవు. అతని నేర చరిత్ర సినిమా ముందు భాగంలోనే దర్శకులు చూపిస్తారు. కాని ప్రేక్షకులు అర్ధం చేసుకోవలసింది కార్టర్, ఆర్టిస్ లపై నడిచిన కేసులో విచారణ సరిగ్గా జరగలేదన్న విషయం. సాక్షిగా కోర్టూలో నిలిచిన వ్యక్తే ఆ బార్ లో శవాలను చూసి తాను అదీ సరైన సమయం అని డబ్బు దొంగతనం చేసానని తరువాత ఒప్పుకుంటాడు. అతను వీరిని గుర్తుంచానని చెప్పినా, హత్యకు గురయిన వ్యక్తులు చనిపోయే ముందు వీరిని హంతకులుగా గుర్తించరు. కార్టర్ పూర్వ నేర చరిత్ర, అతను నల్ల జాతీయుడు అన్న నిజం మాత్రమే విచారణను వేగవంతం చేసి కార్టర్ కు శిష పడేలా ప్రభవితం చేసాయి అన్నది స్పష్టంగా అర్ధం చేసుకోవలసిన నిజం.
మన దేశంలో కూడా ఎన్నో సందర్భాలలో న్యాయ వ్యవస్థ ఇలాంటి తప్పిదాలను చేసింది, చేస్తూనే ఉంది. జైలులో అండర్ టయుల్స్ గా వచ్చిన వారిని గమనిస్తే నేర ప్రపంచంలో జన్మించారనో, గతంలో ఎదో నేరంతో వారికి సంబంధం ఉందనే కారణంతోనే కొన్ని సార్లు వీరిని వ్యవస్థ జైలు పాలు చేయడం గమనించవచ్చు. చిల్లర దొంగతనాలు గుడంబా వ్యాపారం, దొంగ సారా తయారు చేయడం ఇలాంటి కేసుల్లో ఒక సారి ఇరుక్కున్న వారు మళ్ళి మళ్ళి జైలుకు రావడం గమనించవచ్చు. వీరి పట్ల పూర్తి స్థాయి విచారణ చాలా సందర్భాలలో జరగదు. వీరు దిగువ వర్గానికి, కులాలకి చెందడం, ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉండడం కూడా వీరు జైలు పాలవడం వెనుక ఉండే కారణాలు.
ప్రపంచంలో అన్ని దేశాలలో, వివక్ష ఉన్న చోట న్యాయవ్యవస్థలో ఇలాంటి లోపాలు గమనిస్తాం. ఇటువంటి తప్పిదాలు జరగడం వలన ప్రజాతంత్రపు పాలన పట్ల నమ్మకం ప్రజలలో తగ్గుతుంది. న్యాయ విచారణలో వివక్ష పని చేయడం వలన జరిగే తప్పిదాలు న్యాయం పట్ల, సమసమాజం పట్ల ప్రజలలో నమ్మకాన్ని తగ్గిస్తాయి . ఇలాంటి తప్పులకు బలవుతున్న వ్యక్తులు సంఘ విద్రోహ చర్యలలో పాల్గొంటూ అవే తమ వ్యధలకు విముక్తి కలిగించే సాధనాలు అని నమ్మే స్థితికి చేరుకుంటారు.
కార్టర్ జీవితంలో అలా జరగకుండా అడ్డుపడింది లెస్రా మార్టిన్. ఇది కల్పిత పాత్ర కాదు. లెస్రా తరువాత లాయర్ గా రచయితగా, మోటీవేషనల్ స్పీకర్ గా చాలా మందికి సహయం చేయడం జరిగింది. ఇలాంటి లెస్రా మార్టిన్ ల అవసరం ప్రస్తుతం ప్రపంచం అంతా ఉంది. ద్వేషం చేయలేనిది ప్రేమ చేయగలుగుతుంది అన్న నిజాన్ని నమ్మడానికి కార్టర్ జీవితాన్ని చదవాలి. పుస్తకాలు చదవని వారికి ‘ది హరికేన్” అనే ఈ సినిమా తప్పకుండా చాలా విషయాల పట్ల అవగాహన కలిగించడంలో సహయపడుతుంది. “ది హరికేన్” ఎన్నో అవార్డులు గెలుచుకుంది, క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఇంగ్లీషు భాషలో వచ్చిన మంచి ఆత్మకథా చిత్రాలలో ఇది ఒకటి.