( అతడు అస్తవ్యస్థ వ్యవస్థపై గర్జించిన ధిక్కార గళం. ద్వంద్వ విలువలపై ప్రళయ గర్జన. ఎన్నికల హామీల వ్యూహాలతో ప్రజల్ని నిలువునా దగా చేస్తున్న రాజకీయ నాయకుల్ని నడిబజారుకీడ్చమన్న నగ్నగీతం. పాలకుల చీకటి బాగోతంపై అతడో ఎక్కుపెట్టిన నిరసన ప్రకటన. దేశంలోనే తొలిసారిగా రాజ్య ధిక్కార గొంతెత్తిన ఆధునిక తొలి దేశీయ కవి. ‘సౌందర్యపు స్వగతం’ నుంచి ఆవిర్భవించి ‘ఉదయించని ఉదయాలు వెలిగించిండు. ఈ వ్యవస్థ తాలూకు చీకటి విలువల్ని ‘కొయ్యగుర్రం’తో, అవకాశవాదమే జీవన విలువలుగా వంచిస్తున్న నకిలీ వ్యక్తిత్వాలపై ‘విలోమ కథలు’లో బయటపెట్టాడు. కుళ్లిన పాలక వ్యవస్థపై తిరగబడే కవిత్వాన్ని మండించాలంటున్న’నగ్నముని’తో ‘కొలిమి’ ముచ్చట… )
కొలిమి: హలో సర్…
నగ్నముని: నమస్కారం, రథం మొదలెట్టండి.
కొలిమి: మీ బాల్యం గురించి చెప్పండి.
నగ్నముని: మా నాన్న మానేపల్లి సంగమేశ్వర కవి, అమ్మ లక్ష్మీకాంతమ్మ. నేను మే 15, 1940లో తెనాలిలో పుట్టాను. అయితే నా బాల్యమంతా అమ్మమ్మగారి ఊరు బందరులోని చిలకపూడిలో ఎస్.ఎస్.ఎల్సీ వరకు అక్కడే గడిచింది.హైదరాబాద్‌లో కూడా చదువుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. రెండు తెలుగు ప్రాంతాల ప్రజల్లో పండగ వాతావరణం కనిపించింది. అపుడే హైదరాబాద్‌ను చూద్దామని వచ్చాను. మరోవైపు ఢిల్లీలోని సోవియట్ భూమి పత్రికలో పనిచేయడానికి అవకాశం లభించింది. సోవియట్ భూమి కమ్యూనిస్టు పత్రిక. మా నాన్న సంగమేశ్వరకవి గాంధేయవాది. ఇంటికి దూరంగా ఉండటం ఇష్టంలేక ఆ పత్రికలో చేరలేదు. మరోవైపు రెండు రాష్ట్రాలు కలవడం, అప్పటికే మా నాన్న కజిన్స్ నైజాం రాష్ట్రంలోని రైల్వే విభాగంలో ఉద్యోగులుగా పని చేసేవారు. వాళ్లు జనగామ, వరంగల్ ప్రాంతంలో రైల్వేశాఖ ఉద్యోగులుగా చేసేవారు. ఆంధ్రరాష్ట్రం నుంచి వస్తే హైదరాబాద్ కరెన్సీకి మార్పిడి చేసుకొనేవాళ్లం. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1,1956 ఏర్పాటైతే, నేను నవంబర్ 2న హైదరాబాద్‌కు వచ్చాను. మా చిన్నాన, పెద్దనాన్న వాళ్ల ఇంటికి వెళ్లాను. హైదరాబాద్‌లో నూతన రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు వీధుల్లో ఘనంగా కనిపించాయి. బందరులో ఉన్న ఓ పెద్దాయన అసెంబ్లీకి వెళ్లి చూడమన్నారు. అక్కడ తనకు తెలిసిన ఓ అధికారిని కలవమన్నారు. ఆయన్ను కలిశాను. అపుడు నాకు పద్దెనిమిదేళ్లు. ఒకరకంగా నగరానికి ఉద్యోగం కోసం వచ్చినట్లయింది. అసెంబ్లీలో ఉన్న ఓ ఉన్నతాధికారిని కలవగా ఆయన మాట్లాడుతూ… ఇక్కడ ఉద్యోగం చేస్తావా? అనడిగారు. 1957లో తత్కాలికంగా ఉద్యోగంలో చేరాను. ఓ ఏడాది తర్వాత 1958లో సర్వీసు కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో పాసయ్యాను. శాసన సభలో నియమించారు. అసెంబ్లీలో వివిధ హోదాల్లో నలభై ఏళ్లుగా పని చేశాను. అసెంబ్లీ రిపోర్టర్ ఉద్యోగంలో చేరి, అసెంబ్లీ చీఫ్ రిపోర్టర్ నుంచి అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ వరకు పనిచేశాను. ఉద్యోగంలో భాగంగా అసెంబ్లీ మధ్యలో కూర్చుని ఎమ్మెల్యేలు, మంత్రుల ఉపన్యాసాలు విని నివేదించడం నా విధినిర్వహణలో భాగంగా ఉండేది. దీంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు పర్యటించాను. అక్కడి పరిపాలన వ్యవహారాలతోపాటు, ప్రజల ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం కలిగింది.
కొలిమి: మీ రచనా వ్యాసంగం ఎలా మొదలయింది?
నగ్నముని : 1957లో అనుకుంటా. కొందరు మిత్రుల ఒత్తిడితో కవిత్వం రాశాను. నేనెప్పుడూ కవిని అవుదామని కవిత్వం రాయలేదు. అప్పట్లో జంటనగరాల వచన కవిత సదస్సు లు జరుగుతూ ఉండేవి. అపుడు మిత్రులు నన్నుకూడా వెళదామని సభకు ఒత్తిడి చేసి తీసుకువెళ్లేవారు. నా తొలి కవిత ‘సౌందర్యపు స్వగతం’ దాన్ని గోరాశాస్త్రి సంపాదకీయంలో నడుస్తున్న తెలుగు స్వతంత్ర పత్రికలో 1957 నవంబరులో ప్రచురించారు. ఎదురూ చూపును ఇతివృత్తంగా తీసుకొని రాసిన మొదటి కవిత. కొన్ని కథలు కూడా ఆ రోజుల్లో భారతి మాసపత్రికలో, గోల్కొండ పత్రికలో కూడా వచ్చినవి. ప్రారంభంలో ఎం.హెచ్.కేశవరావు అనే మామూలు పేరుతోనే రాసేవాడిని. గోపీచంద్ ఆల్ఇండియా రేడియోలో పనిచేస్తూనే ‘యువ’ పత్రికకు సంపాదకుడిగా ఆయన కవిత్వం కంటే కథలు పంపమని అడిగేవారు. నేను పంపేవాడిని.
కొలిమి: మీ రచనల గురించి చెప్పండి.
నగ్నముని: మొదటి కవితా సంపుటి 1962లో ‘ఉదయించని ఉదయాలు’ ప్రచురించాను. రెండో కవితా సంపుటి ‘తూర్పుగాలి’ వచ్చింది. అదేవిధంగా 1973లో పదమూడు కథలతో ‘నగ్నముని కథలు’ వెలువరించాను. రెండో సారి ఆరు కథలతో కూడిన సంపుటి ‘విలోమ కథలు’(1979) ఇందులో ఎమర్జెన్సీపై ఎక్కుపెట్టిన కథలు. సమాజంలో విలువలు విలోమమవుతున్నాయని, ప్రయోగాత్మకంగా, అధిక్షేప, నూతన శైలిలో రాశాను. నవంబరు, 1974లో ఏ.ఆర్ కృష్ణ గారి కోరిక మేరకు మాలపల్లి నవలను నాటకీకరించాను. సుమారుగా 110 చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. నిత్యం నాటకం ఒక ఉద్యమంలాగా కొనసాగాలనేది నా భావన, దానికి ఉదాహరణగా నిలిచింది. ఇదే మాలపల్లిని శ్రవ్య నాటకంగా రాయడంతో అకాశవాణిలో 1975లో ప్రసారమయింది. మరో నాటకం ‘ఇక్కడ కలలు అమ్మబడును’ నాటకాన్ని రాశాను. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించారు. ప్రేక్షక ప్రజానీకం నుంచి చక్కని స్పందన వచ్చింది. సినిమా రంగానికి ‘మరోచరిత్ర’, ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘త్రిశూలం’, ‘ఉదయం’ సినిమాకు మూలకథను అందించాను.‘కొయ్యగుర్రం’, ‘ప్రజాస్వామ్య కవిత’,‘జమ్మిచెట్టు’, ‘అద్వైత రాజ్యం’ దీర్ఘకవితలు ప్రచురించాను.
కొలిమి: మీ తొలి రచనపై ఎలాంటి స్పందన వచ్చింది?
నగ్నముని: 1962లో తొలి రచన ‘ఉదయించని ఉదయాలు’ 1957 నుంచి 1962 మధ్య కాలంలో రాసిన కవితలు. కె.వి.రమణారెడ్డి గారు గొప్పగా విశ్లేషణ చేస్తూ ‘యోజన’పత్రికలో సమీక్ష చేశారు. దానిమీద నీలకంఠ శాస్త్రి అనేతను ఓ లేఖ రాస్తూ ‘రమణారెడ్డి గారు మీ విశ్లేషణలో కవిని పొగుడుతూ రాశారని చెప్పాడు. కొత్తగా వస్తున్న కుర్రాళ్లను అంతగా పొగడాలా ? తెలుగులో ప్రతీ సందర్భాన్ని చెప్పడానికి కొన్ని పదాలుంటాయి కదా ? ఉదయించని ఉదయాలు ఏంటి? ఇట్లాంటివి ఎలా ప్రొత్సహిస్తారని ఆలేఖలో ప్రశ్నించారు. ఓ పదేళ్ల తర్వాత గుంటూరులో జరిగిన విరసం సభల సందర్భంలో కె.వి. రమణారెడ్డిగారు కలిసినపుడు, ఈ నీకంఠశాస్త్రి ఎవరని అడిగాను. ఆయన నాకు తెలియదన్నారు. నవ్వుతూ ఆ లేఖ రాసింది నేనేనని చెప్పడంతో నవ్వేశారాయన. తనను తాను విమర్శించుకుంటే ఎలా వుంటుందనే ఉద్దేశ్యంతో అలా లేఖ రాసినట్లు చెబితే, కె.వి.ఆర్ షాకయ్యారు.
కొలిమి: మీ సాహిత్య జీవితం ఎక్కడ మలుపు తిరిగింది?
నగ్నముని: 1963-64లో అసలు నేను ఏమి రాయాలనే సందేహం వచ్చింది. అప్పట్లో ‘నేనెక్కిన టాక్సినెంబర్’ అనే కవితకు మంచి పేరొచ్చింది. బ్రిటీష్ ఇండియాకు, ఇండియన్స్ ఇండియాకు పెద్దతేడా నాకు ఏమీ అనిపించలేదు. దేశ అభివృద్ధికి ఒక బ్లూప్రింట్ అంటూ లేకుండా పోయింది. ప్రజల్లోకి ఆరోజుల్లో కారణాలు పెద్దగా తెలిసేవి కాదు. నాలో చాలా నిరాశ, నిస్పృహలు నిండుకొని ఉన్నాయి. చుట్టూ సమాజం అ్లకల్లోంగా కనిపించేది. అవినీతి, అక్రమాలు జరుగుతున్న రోజులవి. రాసుకున్న రాజ్యాంగం అమలుకాని పరిస్థితులు. గాంధీజీ మాదిరిగానే గాంధేయవాదులు ఉంటారని అనుకునేవాడిని. నాయకులు మాత్రం భిన్నంగా కనిపించారు. దేశానికి ఒక విజన్ అంటూ లేకుండా పోయింది. సంక్షేమ పథకాలు పాలనలో భాగం కాదు. ఇదొక తత్కాలిక కార్యక్రమం మాత్రమే. పాలకుల పథకాలు కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నట్లుగా మారాయి. మనిషి జీవన విధానంలో లంచం ఒక భాగమైపోయింది. భారతీయ సమాజాన్నిఓపెన్ సొసైటీగా నిర్మించ లేకపోయింది. ప్రజాప్రతినిధులకు అన్నీ ఉంటాయి, కానీ ఏమీలేనట్లుగానే ధృవీకరణ పత్రాలిస్తారు. ఇదేంటి ? అబద్దమాడించే పాలన పరిస్థితులు కల్పించారనిపిస్తుంది.
కొలిమి : దిగంబర కవిత్వానికి నేపథ్యం?
నగ్నముని: తెలుగు సమాజాల్లో రచయితలకు రావాల్సినంత గౌరవం రాలేదు. దేశ ప్రజ జీవన విధానంలో కవిత్వం భాగంగాలేదు. విదేశీయులు వచ్చి వేమన అనే గొప్ప కవి ఉన్నాడని చెబితేగాని తెలియదు. రచన విధానానికి సరైన గుర్తింపు ఉండకపోయేది. ఈ పరిస్థితులను చూసి నాకు ఒళ్లు మండిపోయేది. పత్రికల్లో సినిమా తారలు, రాజకీయ నాయకుల బొమ్మలు, మాటలు తప్ప మరేం కనిపించేది కాదు. సాహిత్యానికి విలువనిచ్చేవారు కాదు. నేను తీవ్రమైన ఆగ్రహంతో దిగంబర కవిత్వాన్ని మొదలు పెట్టాను. మొత్తం దారితప్పిన రాజకీయ విలువలపై ఆగ్రహ కవిత్వోద్యమం ప్రారంభించాను.
కొలిమి: నగ్నముని పేరు వెనకున్న కథ ఏమిటి?
నగ్నముని: నగ్నముని అసలు పేరు మానేపల్లి హృషీకేశవ రావు. మా ఇంట్లో కానీ, బయట మిత్రులు కానీ రుషి అని పిలిచేవాళ్లు. నాపేరు హృషీ కావడం అందరూ రుషి అని పిలవడం ఈ పదం నుంచే ముని వచ్చాడు. దిగంబర ఉద్యమం కావడంతో ‘నగ్నముని’ అని నామకరణం చేసుకున్నాను. కొంతకాలానికి, ఆ పేరు మారుద్దామని ప్రయత్నం చేశాను. అయితే మిత్రులు, కవులు అదే పేరు కొనసాగించాలని గట్టిగా కోరారు. చివరకు నగ్నమునిగానే కొనసాగుతోంది.
కొలిమి: మీ ఆరుగురు దిగంబర కవులు ఎట్లా ఆవిర్భవించారు?
నగ్నముని: సమాజంలో సాహిత్యం పట్ల నిరాదరణ, వ్యవస్థలో నిర్లక్ష్యమైన పరిస్థితులు అన్నీ అసంతృప్తిని రగిలించాయి. ఏదో ఒకటి చేయానే ఆలోచన మనసులో నిరంతరం రగిలింది. సామాజిక వాస్తవ పరిస్థితులను రాయాలనే ఆగ్రహం రోజురోజుకూ పెరిగిపోయింది. అందుకనే కొత్తవారిని ఎంచుకొని నా ఉద్దేశ్యాలను చెప్పి ఉద్యమం ప్రారంభించాను. వారే నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న. పాత వాసన లేని కొత్తతరాన్ని ఎంపిక చేసుకున్నాను. కవిత్వ పుస్తకాల ప్రచురణ బాధ్యత కూడా నేనే చేపట్టాను. మూడు పుస్తకాలకు పేర్లు పెట్టి ప్రచురించాను. సామాన్యుడి కోసం చేసే రచను సామాన్యులే ఆవిష్కరించేలా చేశాను.
కొలిమి: దిగంబర కవిత్వం అంతా బూతులమయమే అనే విమర్శపై మీ కామెంట్?
నగ్నముని: కొందరు కవిత్వంలో బూతులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ వ్యవస్థపై ఉన్న ఆగ్రహాన్ని ప్రకటించే దశలో నిరసన కోసం ఆ పదాలు వాడాను. ఆ వ్యాఖ్యలను నేను పెద్దగా పట్టించుకోలేదు.
కొలిమి: మీ ధిక్కారం వల్ల ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
నగ్నముని: నా రచనల గురించి నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. నా రచనలను పోలీసుల చేత ఆంగ్లంలోకి అనువాదం చేయించుకొని పాలకులు చదువుకున్నారు. దేశంలోని ఆధునిక సాహిత్యంలో రాజ్యాన్ని ధిక్కరించిన తొలి రాజకీయ కవిని నేనే. అందుకనే ఎమర్జెన్సీ సమయంలో ఉద్యోగం నుంచి నన్ను డిస్మిస్ చేశారు. పద్దెనిమిది నెలలు ఉద్యోగం కోల్పోయి చాలా కష్టాలు అనుభవించాను. అయినా ఎక్కడా కుంగిపోలేదు. ఇదే సమయంలో ఏ.ఆర్ కృష్ణ కోరిక మేరకు ‘మాలపల్లి’ నవలను నాటకంగా రచించాను. కొయ్యగుర్రం కావ్యం 1977 చివరలో రాశాను. ఎమర్జెన్సీ సమయంలోనే ‘విలోమ కథలు’ రాశాను. ఆత్యయిక పరిస్థితి గురించి చిత్రించాను. అవయవాన్నీ నీవి కాదని చెప్పేవే ‘విలోమ కథలు’. ఇదే సంపుటిలో సిమెంటు సంతతి’ కథ ఇతర భాషల్లోకి అనువాదమయింది. ‘ఆకాశదేవర’ కథ కన్నడం, ఆంగ్ల భాషతో పాటు చాలా భాషల్లోకి అనువాదం పొందింది. తెలుగులో ఎమర్జెన్సీ మీద తగిన సాహిత్యం రాలేదు. ఒక కాలాన్ని సందర్భాన్ని సూచించే కావ్యం రాలేదు.
కొలిమి: విప్లవ రచయితల సంఘానికి ఎందుకు రాజీనామా చేశారు?
నగ్నముని: ఒకసారి దిగంబర కవిత్వం సభలో ఒక వ్యక్తి కవిత్వం బాగానే ఉంది, ఇపుడేం చేయాలని ప్రశ్నించాడు. అపుడు ఆలోచనలో పడ్డాను. దిగంబర కవిత్వానికి, విప్లవ రచయితల సంఘానికి పెద్దతేడా ఏమిలేదు. కవిత్వ భావనలు అంతా ఒక్కటే. విరసంలో నేను వ్యవస్థాపక సభ్యత్వం పొందాను. 1979 వరకు విరసంలో సభ్యుడిగా పనిచేశాను. విప్లవ రచయితల సంఘానికి దూరమేమీ కాలేదు. నా మద్దతు, సంఫీుభావం ఎప్పటికీ ఉంటాయి. ప్రజాస్వామ్యం మీద పరిశోధన చేయాలని రాజీనామా చేశాను. భారతదేశంలో నడుస్తున్నది కులస్వామ్యమా? ధనస్వామ్యమా ? మతస్వామ్యమా ? యివన్నీప్రజాస్వామ్యం పేర నడుస్తున్నాయి. అందుకే పరిశోధన అవసరం అనుకున్నాను. ‘ప్రజాస్వామ్య పరిశోధన కేంద్రం’ ఏర్పాటు చేసి ప్రముఖులు చాలా మందిచేత ఉపన్యాసాలు ఇప్పించాను.
కొలిమి: ఇప్పుడు సమాజానికి ఎట్లాంటి కవిత్వం అవసరమంటారు?
నగ్నముని: ప్రస్తుత రాజ్యాన్ని మార్చే విధంగా రచనలు రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాలు విభిన్న సంక్లిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం కవులు వ్యవస్థల మీద మాట్లాడటం లేదు. కవిత్వాన్ని ప్రచురించే పత్రికలు లేకుండా పోయాయి. కవిత్వం రాసే కవులు మాత్రం పెరిగారు. రాజకీయ నాయకులు అనుసరిస్తున్న విధానాల మీద రాయాల్సిన అవసరం చాలా వుంది.
కొలిమి: ప్రస్తుతం తెలుగు సాహిత్యం పరిస్థితి ఏమిటి?
నగ్నముని: తెలుగు సాహిత్య విశ్లేషణ సక్రమంగా లేకపోవడం విచారకరం. రచన కాలం, శైలీ, విషయ పరంగా విశ్లేషణలు రావాలి. రచనలు విషయ ప్రతిభ కంటే ప్రచారానికే ప్రాధాన్యత పెరిగింది. కవరేజీ కలవారే కవులుగా నిలబడుతున్నారు. ఆ కవరేజీ కూడా ‘కవర్’ ఆధారంగానే జరగడం విషాదం.
కొలిమి: సమకాలీన సాహిత్య విమర్శపై మీ అభిప్రాయం?
నగ్నముని: విమర్శ అనేది కవిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. దాంట్లో అకవిత్వం, కవిత్వం ఎంతపాళ్లని చెప్పాల్సింది విమర్శే కదా! ఐతే సరైన విమర్శ రాకపోవడానికి క్విడ్‌ప్రొకో ఉండటం కూడా ఒక కారణం. నీవు నా గురించి రాయి, నేను నీ గురించి రాస్తాను అన్నట్లుగా దిగజారిపోయింది. అయ్యా కొద్దిగా నా పుస్తకం గురించి రాయండని అడుక్కోవాల్సిన దుస్థితి. దిగంబర ఉద్యమ కవిత్వం మీద విమర్శలో ఏ భాష వాడినారు, కవిత్వం ఉందా ? లేదా ? అని రకరకాల వ్యాసాలు రాశారు. అసలు దిగంబర కవిత్వం తాత్విక సిద్దాంతం మీద సరిగ్గా విమర్శ రాలేదనిపిస్తోంది. భారత దేశంలోని పరిస్థితులపై, దిగంబర కవిత్వ మూల భావనను విశ్లేషణ ఇప్పటి వరకు రాలేదు. దీనికితోడు తెలుగులో సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు ఐదారు తప్ప ఇంకేమి లేవు. తమిళనాడు, కేరళ, కర్నాటక ప్రాంతాల్లో విస్తృతంగా సాహిత్య పత్రికలు ఉన్నవి. చాలా ఆశ్చర్యమనిపిస్తోంది. అక్కడ రచనకు పారితోషికం కూడా వుండటం విశేషం. రచయిత విడిగా రచనల మీద బతికే అవకాశం ఇక్కడ లేదు.
కొలిమి: సాహిత్యంలోకి రాజకీయాంశం మీరు తీసుకువచ్చారు, రాజకీయాంశం సాహిత్యంలో అవసరమా?
నగ్నముని: ఒక రాజకీయ, సామాజిక దృక్కోణంలో రచన మార్పుకు అంత:సారంగా పనిచేసే విధంగా రాయాలి. వ్యవస్థను మార్చే అన్ని అంశాలపై కవులు దృష్టి కేంద్రికరించాలి. పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకొని రాయాలి. ఇటీవల ఫేస్బుక్లో చిన్న కవితల రూపంలో చాలా మంచి కవిత్వం వస్తోంది. మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. సమాజ వ్యవస్థ విధ్వంసానికి మూల కారణమవుతున్న రాజకీయాల మీద సత్యాన్వేషణ చేస్తూ సృజన జరగాల్సిన అవసరం ఉంది. కుళ్లిపోయిన వ్యవస్థ మీద తిరగబడే సాహిత్య తాత్వికతను ప్రజలకు అందించాల్సిన బాధ్యత కవులకు ఉంది.
కొలిమి: నవతరం కవులకు మీరిచ్చే సందేశం?
నగ్నముని: సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలించి అవగాహన చేసుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై కవిత్వం రాయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలను సైతం అర్థం చేసుకొని సమగ్రంగా రాయాలి. వ్యవస్థలో ఎలాంటి మార్పు రావాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దిశానిర్దేశంగా సృజన చేయాల్సిన అవసరం ఉంది. రావాల్సిన మార్పు గురించి కవిత్వం రాయడానికి కృషి చేయాలి.
Excellent interview sir.Thank you
ధన్యవాదాలు సర్….
చాలా బాగుంది. ధన్యవాదాలు.
Thanking you sir…
ధన్యవాదాలు సార్….
To day nagnamuni. Is different person —no vision //no principles ///no doubt great writer
Buchi reddy gangula
ok, thanking you sir…