దళిత అస్తిత్వ వేదనా కవిత్వం

దళిత అస్తిత్వ వేదన దాని ఫలితమైన ఆత్మగౌరవ చేతన 1985 తరువాత తెలుగు సమాజ సాహిత్యాలలో గొప్ప చోదక శక్తులు. ఇనాక్ నిశ్శబ్దంగానే ఈ సామాజిక సంచలనాలకు కదిలిపోతూ తన స్పందనలకు సాహిత్య రూపం ఇస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఆయన వ్రాసిన కావ్యాలు ఆది ఆంధ్రుడు , కన్నీటి గొంతు , సర్పయాగం.

1

ఆది ఆంధ్రుడు చారిత్రక కావ్యం. ప్రతి జాతికి గర్వించదగిన ఒక చరిత్ర ఉంటుంది. జాతి అవమానాలకు గురవుతున్నప్పుడు, అధీనత పెరుగుతున్నపుడు ఆ బాధ నుండి బయటపడటానికి, జీవితం మీద తన అధికారాన్ని ప్రకటించటానికి కావలసిన ధైర్యం, ఉత్సాహం కూడదీసుకొనటానికి ప్రతిజాతీ ఉత్తేజకరమైన చారిత్రక సందర్భాలను, వ్యక్తులను ఆసరాగా తెచ్చుకొనటం సహజం. జాతీయోద్యమ కాలంలోనూ, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమకాలం లోనూ, అంతెందుకు మొన్నమొన్నటి తెలంగాణ ఉద్యమం లోనూ జరిగింది అదే. ఆ రకంగా దళిత ఆత్మగౌరవ ప్రకటనకు ఇనాక్ ఆంధ్రదేశ చరిత్ర నుండి భుజంగరాయుడు అనే వ్యక్తిని కథానాయకుడిగా చేసి ఆది ఆంధ్రుడు కావ్యం వ్రాసారు.

భుజంగ రాయుడు గురించి ఇనాక్ చిన్నప్పటి నుండి విన్న కథలు ఎన్నో . ఆదిఆంధ్రుడనీ, వీరుడనీ, అమరావతి రాజధానిగా పాలించిన సంస్థానాధీశుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి దగ్గర సేనాని అనీ , ఐదువందల మంది చెంచులను బంధించి తెచ్చి రాచకార్యాలలో నియోగించిన బలశాలి అని, సంస్థానానికి అటు గోల్కొండ సుల్తానుల నుండి , ఇటు ఈస్టిండియా కంపెనీ అధికారుల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించిన దక్షుడు అని, అంటరాని తనాన్ని రద్దుచేస్తూ శాసనం తీయించాడని, అన్ని వర్ణాల నుండి స్త్రీలను ఎంచుకొని అయిదు పెళ్లిళ్లు చేసుకొని బహు సంతానాన్ని పొందాడని, తొంభై ఏళ్ల వృద్ధాప్యంలో ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనటానికి ఉత్సాహం చూపాడనీ, సదా చెప్పులు ధరించి కాలివేలు కనబడకుండా నిండు పంచెకట్టుతో ఉండేవాడని , ఆత్మగౌరవంతో జీవించాడని, ఇలాంటివి భుజంగరాయడు గురించి చిన్నప్పటి నుండి ఆయన విన్న కథలు. చదువుకొంటే భుజంగరాయడు అంతటివాడవు అవుతావు అన్న తల్లి వాక్కు, తల్లి కథనాలు ఇనాక్ మనసులో భుజంగరాయడుని నాయకుడిగా ప్రతిష్టించాయి. 1990 లలో కావ్యం వ్రాయాలన్న తలపు కలిగి చరిత్రను శోధిస్తూ , ప్రచారంలో ఉన్న జానపద కథలతో సమన్వయించుకొంటూ 2008 నాటికి ‘ఆది ఆంధ్రుడు’ పద్యకావ్యం వ్రాసారు ఇనాక్.

ఈస్టిండియా కంపెనీ పాలన కాలం నాటి గెజిట్స్ , మెకంజీ కైఫీయతులు మొదలైన చారిత్రక వనరులను ఇనాక్ పరిశీలించారు. వాటిలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి ప్రస్తావన ఉంది కానీ భుజంగరాయడి గురించిన మాట లేదు. అవి పాక్షిక అసమగ్ర చరిత్రలు అని ఆయన అభిప్రాయం. అయినా చరిత్రలు ప్రభువులకు ఉంటాయి కానీ సైనికులకు, సైన్యాధిపతులకు వుండవు. అందులోనూ వాళ్ళు దళితులు అయినప్పుడు మరీ అసాధ్యం అని ఇనాక్ అవగాహన. జనం జ్ఞాపకాలలో ,హృదయాలలో , నాలుకలమీద నాయకుడై నర్తిస్తున్న భుజంగ రాయుడి చరిత్ర మూలం పట్టుకోవాలన్న పంతంతో అన్వేషణ సాగించిన ఇనాక్ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి కావ్య రచనకు సంబంధించిన ఒక నిర్దిష్ట రూపం సాక్షత్కరించింది కొడాలి లక్ష్మీనారాయణ వ్రాసిన’ శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు’ గ్రంధం చదివాకనే. వాసిరెడ్డి వంశస్థుడైన వెంకట సుబ్బదాసు వ్రాసిన వాసిరెడ్డి వంశ చరిత్ర ఆధారంగా కొడాలి లక్ష్మీనారాయణ ఆ పుస్తకం వ్రాసాడు కనుక అది నమ్మదగినది అని ఆయన భావించాడు. ఆ పుస్తకంలో భుజంగరాయడు గురించి మూడు సందర్భాలలో వచ్చిన ప్రస్తావనలు అతను హరిజనుడని, యోధాగ్రేసరుడని, సేనాధిపతి అని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చెంచుల సమస్యను పరిష్కరించాడని తెలియ చేస్తుండగా అవి తాను చిన్న నాటి నుండి విన్న కథలతో సంవదిస్తున్నాయి కనుక అవి ఆధారంగా అల్లిక పనికి ఒక రహదారి వేసుకొన్నారు ఇనాక్. ( కావ్యానికి కవి వ్రాసుకొన్న నేపధ్యం )

నూలు పోగు అంత లిఖిత చరిత్ర, నిత్య స్రోతస్విని వంటి మౌఖిక కథనాలు కలిపి తన కల్పనా శక్తిని జోడించి ఆదిఆంధ్రులు గర్వించదగిన భుజంగరాయడి చరిత్రను నిర్మిస్తూ ఇనాక్ వ్రాసిన పద్య కావ్యం ‘ఆదిఆంధ్రుడు’. 505 పద్యాలతో ఖండానికి ఒక శీర్షికతో 27 ఖండాలుగా ఉంది ఈ కావ్యం. మొదటి శీర్షిక ‘బాల్యం’ . ధరణి కోట నగరవర్ణనతో ప్రారంభం అవుతుంది. వాసిరెడ్డి వారి ఆస్థానరాజధాని అమరావతికి పూర్వ నామం ధరణికోట. ధరణికోట శాతవాహనుల రాజధాని. శాతవాహనులకాలం లోనే అక్కడ అమరావతీ స్థూప నిర్మాణం జరిగింది. గొప్ప చారిత్రక ప్రాధాన్యం గల ఆ ప్రాచీన స్థూపం మీద పూర్ణకుంభం దానం చేసిన ‘విధిక’ చర్మకారుడు. ఆదిఆంధ్రుడు. 18 వ శతాబ్ది ఆది ఆంధ్రుడు భుజంగరాయడిని నాయకుడుగా చేసిన కవి అతని జాతి చరిత్ర క్రీస్తు శకారంభం నాటిదని సూచించటానికి అమరావతి నగరపు ప్రాచీన నామాన్ని వాడుతూ కావ్యం పారంభించి ఉంటారు. నగరవర్ణన ప్రాచీన సంప్రదాయ కావ్య పద్ధతి. భుజంగరాయడి తండ్రి పేరు నాగన్న . ఒకప్పుడు వాళ్ళది సైనిక జాతి అని చెప్పటానికి తుప్పు పట్టిన కత్తి, డాలు దూలాన వెళ్ళాడుతున్నాయని గజ్జె కట్టి ఆడేకళాకారులని చెప్పటానికి దీపపు గూట్లో గజ్జెలు ఉన్నాయని , చదువుకొన్న జాతి అని చెప్పటానికి మచ్చు మీద చెదలు తినే తాటాకు గ్రంధాలు ఉన్నాయని చెప్పి పూర్వ వైభవం నశించిన జాతి మనిషిగా నాగన్న చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడని కథను ప్రారంభిస్తారు. కులవృత్తి నాశ్రయించి చీకూచింతలు లేని జీవనం జీవిస్తున్న అతనికి కడగొట్టుకొ డుకు భుజంగరాయడు. చదువు నేర్వటం, కత్తి పట్టటం బాల్యంలో నేర్చిన విద్యలు.

రెండవ శీర్షిక ‘చైతన్యము’ అన్ని విద్యలలో ప్రవీణుడైన భుజంగరాయడిని చూపిస్తుంది.
ఇతిహాస వాజ్మయ గతివారధిన్ నేయు నిలువీతల గజీత నేతగాడు
వేదశాస్త్ర పురాణ విపుల గీర్వాణంబు పుడిసి పుక్కిట బట్టు పడచువాడు
సంగీత గంగాతరంగ వేదికలపై మోటు పాటల పెద్దపీటవాడు
భరత నాట్యాచార్య శిరసావహింపంగ శివము చిందులు దొక్కు చిన్నవాడు
తప్పెటను కొట్టెనా గుండె దద్దరిల్లు
గజ్జె కట్టెనా భూమాత కాళ్ళనొత్తు
ఘంట మెత్తెనా బ్రహ్మాంఘ్రి కడియమిచ్చు
కత్తి తిప్పెనా పగతుర నెత్తి పగలు — ఇదీ ఇనాక్ నిర్మించిన భుజంగరాయడి వ్యక్తిత్వ శ్రేష్ఠత. అడవిలో వేదం చదువుతూ గొల్లవాండ్లకు , బ్రాహ్మణ యువకులకు మధ్య వచ్చిన తగాదాను తీర్చే ‘పరాక్రమ’ ప్రదర్శన మూడవ ఖండం. అది తెలిసి చింతపల్లి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు భుజంగరాయడిని ఆస్థానానికి తెమ్మని మనుషులను పంపటం, అతని ధిక్కారం తల్లిదండ్రుల కోరికను అనుసరించి కదన కవన జయకాంక్షతో సంస్థానికి వెళ్ళటానికి అంగీకరించటం నాలుగవ ఖండం( ఆశయం ). అయిదవ ఖండం రాజు ‘ఆశ్రయం’ పొందటం. బ్రాహ్మణ ధిక్కారం చేసినందుకు శిక్ష పడుతుంది అనుకొన్న జనం అతనికి రాజాస్థాన పదవి లభించిందని ఆశ్చర్య పడటం. ఆరవది ‘సౌందర్య’ఖండం . భుజంగరాయడి రూపం కట్టుబొట్టు , శౌర్యం, రాజుతో బలపడిన మైత్రి ఇందులో వర్ణితాలు.

ఏడవ ఖండం ‘సంస్కారము’. చెంచులు దొంగలై దారినపోయేవాళ్లను దోపిడీ చేస్తుంటే వాళ్ళ సమస్యను ‘ తినగలేకే కదా దొంగతనపు చేష్ట ?’ అన్న అవగాహనతో పరిష్కరించేపని రాజాజ్ఞ మేరకు నిర్వహించటం ఐదువందలమంది చెంచులను సమీకరించి సైన్యంలో భటులుగా నిలపటం. ఎనిమిదవ ఖండం ‘సాధనము’. దొంగతనం సమస్యలు లేక దేశం శాంతిగా ఉండటం, గుడులు, బావులు, చెరువులు తవ్వించటం, సంగీతసాహిత్య సభలు ,సంతోషాలు … భుజంగరాయడు సైన్యాధికారిగా పదోన్నతి పొందటం ఇందులో విషయం. తొమ్మిదవ ఖండం ‘లక్ష్యము’. భుజంగరాయడు గూడెం రావటం అతని గుణగణాల వర్ణన ,బంధువుల పలకరింపులు, పెళ్లి ప్రస్తావనలు, కొన్నికలలు ఉన్నాయని అవి వాస్తవం అయ్యేవరకు పెళ్ళాడనని అతను…నీకు చేసుకొంటామని మాట ఇచ్చిన పిల్ల మరదలు వుంది దానినేమి చేస్తావు అని తల్లిదండ్రులు నిలదీయటం, తనకు రత్నమాంబ ఇష్టమేనని కానీ లక్ష్యసాధనకు పదేళ్ల గడువు పెట్టుకున్నానని అంతవరకు ఆగితే ఆమెను పెళ్లాడుతానని అతను చెప్పటం, ఆమె అంగీకరించటం ఈ భాగంలో కథ. పదవ ఖండం ‘రక్షణము’. మంత్రి పాపయారాధ్యుడు భుజంగరాయడి మీద ఈర్ష్యబూని అవమానాలు చేయటానికి ప్రయత్నించి భంగపడటం.

పదకొండవ ఖండం ‘సందేహం’. ఇందులో వెంకటాద్రి నాయుడు సైన్యంతో శ్రీశైల యాత్ర బయలుదేరటం అతనివెంట ఉన్న కోయ, చెంచు సైనికులు స్వస్థానం చేరిన ఆనందంలో ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రాజుకు తన క్షేమం గురించి సందేహం కలగటం ఆయన ఆందోళనను మంత్రి మాటలు పెంచటం చూస్తాం. పన్నెండవ ఖండం నిర్మాణము లో భుజంగరాయడు రాజు ఆజ్ఞ మీద కోయరాజులను, చెంచులను, మహారాష్ట్ర యోధులను సింహ బలతేజులైన మాదిగలను వెంటపెట్టుకొని వెళ్లి నూటఎనిమిది గుడులు, కొలనులు నిర్మించి ఆయనను ఆనందపరచటం విషయం. అందుకు రాజు భుజంగరాయడిపట్ల తన ‘అభిమానం’ ప్రకటించటం పదమూడవ ఖండం. నిండు కొలువులో భుజంగ రాయడి పంచె ఎత్తించి ‘పరాభవిం’చాలనుకొన్న మంత్రి తానే భంగపడటం పదునాల్గవ ఖండం లో విషయం. పదిహేనవ ఖండం ‘ఆక్రందన’ లో ఘట్టం వెంకటాద్రినాయుడు సాహిత్య సభ, కావ్య సంగోష్టి .. భుజంగ రాయడు కావ్యం వ్రాసి గానం చేయటం. పదహారవ ఖండం ‘అనివార్యము’లో వాసిరెడ్డి వారి సంస్థానంలో దొంగతనాలు ప్రబలి, ప్రజల ఘోషలు మిన్నుముట్టటంతో సంప్రదాయ చోర సంతతి అంటూ చెంచుకోయల సైన్యాన్ని బంధించి తల తీసేయాలని రాజు అంటే భుజంగరాయడు అది న్యాయం కాదని నిరాకరించాడు. రాజు వారిని చంపటం అనివార్యం అంటూ భుజంగరాయడిని పదిరోజులు ధరణికోటలో ఉండమని పంపుతాడు. పదిహేడవ ఖండం కోయచెంచు సైనికుల ‘హననము’ తరువాత ‘విచారము’. రాయుడు లేకుండా ఉండలేని వెంకటాద్రి నాయుడు వెళ్లి రాయుడిని మళ్ళీ కొలువుకు కోటకు రమ్మని కోరటం.’ నియంత్రణము’ అనే ఖండంలో భుజంగరాయడి రాజకీయ వ్యవహార దక్షత. తరువాతి ఖండము ‘ప్రాసాదము’లో అమరావతిలో కోటనిర్మాణ దక్షత , సైన్య సమీకరణ దక్షత, ‘ ప్రాసన్న్యము’లో సైన్యంలోకి సమీకరించబడిన పంచముల ప్రత్యేకతల వర్ణన వున్నాయి.

ఇరవై రెండవ ఖండం గుళ్ళు కొలనులు మొదలైన ప్రదేశాలలో పంచముల ప్రవేశానికి అనుకూలంగా చేసిన ‘శాసనము’. తరువాత వెంకటాద్రి నాయుడు దత్త స్వీకారం. ఆతరువాత ‘ఉద్వాహం’ ఖండికలో భుజంగరాయడి వివాహాలు. తరువాత ‘సంతానం’. చివరి రెండు ఖండికలు భుజంగరాయడి ప్రతాప విజయ సంకీర్తన.
మొత్తం మీదసంస్థాన ప్రభువుగా వాసిరెడ్డి వెంకటాద్రి ( 1761- 1816 ) కాలపు చారిత్రక ఘటనల క్రమం సూత్రంగా ఆ నాటి అభ్యుదయాలకు అన్నిటికీ కర్తగా భుజంగరాయుడిని నిరూపిస్తూ అల్లిన కావ్య కదంబం ఆది ఆంధ్రుడు.

ఈ కావ్యంలో దళిత ఆత్మగౌరవ అంశాన్ని స్థాపించటానికి కవి చెప్పులను ఉపయోగించిన తీరు గమనించదగినది. భుజంగరాయుడి తండ్రి నాగన్న చెప్పులు కుట్టి జీవనం చేస్తాడు కనుక బాల భుజంగ రాయుడి నడకలు, ఆటలు అన్నీ వాటి మధ్యనే. ఆదీవాదీ కుట్టిన చెప్పులమీదనే పడి నిద్రపోయే శిశువు అతను. ఆలా నిద్రపోతున్న శిశువు కు ఎండతగలకుండా పాము పడగ పట్టిందని చెప్పి భుజంగరాయడి భావి ఉన్నతిని సూచిస్తాడు కవి. యువకుడై వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి ఆస్థాన ఉద్యోగి అయిన భుజంగరాయడు రోజు పంచెకట్టి, తల, మీసం దువ్వి ఎలా తయారై వెళతాడో చెప్పేటప్పుడు చెప్పులు వేసుకొనే పద్ధతిని ప్రత్యేకంగా వర్ణించాడు కవి.

“చేతులెత్తి చెప్పులు పూల సెజ్జ వోలె
తీసి కందోయి కంటించి తీవ్రభక్తి
పెరిగి తలమీద తాటించి పేర్మి మొక్కి
ముద్దులిడి భక్తితో పాదములకు తొడిగె” – ఇలా చెప్పటంలో చెప్పులను , చెప్పులు కుట్టే పనిని హీనం చేస్తూ సృష్టించబడిన వేల ఏళ్లనాటి అవమానకర సంస్కృతికి దీటైన జవాబు ఇయ్యాలన్న గాఢమైన కాంక్ష ప్రధానం. చెప్పులకు ఇయ్యబడిన హీనతను రద్దుచేస్తూ వాటికి పూజనీయ స్థాయిని కల్పించటం ఇందులో కనబడుతుంది. చెప్పులను పూలబుట్టతో పోల్చటం కళ్ళకద్దుకొనటం, నుదుటికి ఆనించి మొక్కటం , భక్తితో కాళ్లకు తొడుక్కొనటం ఇవన్నీ అందులో భాగాలే. రాజ సభలోకి వెళుతూ కూడా చెప్పులు విడువని అభిమానం అతనిది. మంత్రి పాపయారాధ్యుడు అది ఒక తప్పుగా ఎంచి ఫిర్యాదు చేసినప్పుడు భుజంగరాయడు తనకూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయని వాదం మొదలు పెడతాడు. మీరు ఎప్పుడూ జంధ్యం మెడలో ఎందుకు ధరిస్తారు అన్న ప్రశ్నతో జంధ్యానికి దీటుగా చెప్పులను నిలబెట్టే ప్రయత్నం మొదలుపెట్టి చెప్పులకు ‘ కులవృత్తి గర్వ మహిమ’, ‘శ్రమ శక్తి వెలుగు విలువ’అని అదైనా ఇదైనా పదార్ధ నిర్మితాలే అని నిర్ధారించాడు. ఒకటి నూలు మరొకటి తోలు అంతే. జంధ్యం కన్నా చెప్పుల విలువ తక్కువేమి అన్న చర్చ ప్రధానంగా ఇనాక్ ఒక కథ వ్రాసిన విషయం ఇక్కడ గుర్తుకు వస్తున్నది.

దళితుల వస్త్రధారణ పై కూడా అగ్రవర్ణ అధికార వ్యవస్థ పెత్తనం ఎప్పటినుండో కొనసాగుతున్నది. మోకాళ్ళపైకి బట్టకట్టు , పెద్దవాళ్ళు ఎదురైతే తలగుడ్డతీసి చేతపట్టుకొనటం ఇలాంటి పద్ధతులు అనూచానం గా అమలవుతున్నాయి. దాని మీద ధిక్కార ప్రకటన అన్నట్లుగా ఉంది భుజంగరాయుడి పంచెకట్టు పద్ధతి. ‘ సీల మండల దాకా జీరాడేట్లు’ కాలి గోటి ని కూడ కనుపించనీకుండా ‘ పంచె కట్టు పద్ధతిని అతడు అభ్యాసం చేసాడు. ఇది గిట్టని పాపయారాధ్యుడు అతనిచేత నిండు కొలువులో పంచె పైకెత్తించి పరాభవించాలని చూసాడు కానీ భుజంగరాయడు దానిని కూడా విజయవంతంగా తిప్పికొట్టటం చూస్తాం.

భుజంగరాయడు వీరుడు , శూరుడు , రాజనీతి దురంధరుడు .. సరే.. దళితుల నుండి ఒకడంతటివాడుగా ఎదగటం హర్షణీయమే . అయితే అతను ఎదిగి తన జాతికి చేసిన మేలు ఏమిటన్నది ప్రశ్న. గుడులు , గోపురాలు , కొలనులు, కోటలు మొదలైనవాటి నిర్మాణంలో మాదిగలను అనేకమందిని వినియోగించే అవకాశం పొందాడు. సైన్యాన్ని పెంచుకొనే అవకాశం అటు గోల్కొండరాజులకు , ఇటు కంపెనీ అధికారులకు అధీనుడై అధికారం నేర్పవలసిన వెంకటాద్రి నాయుడికి లేకపోవటం వల్ల ఈ నిర్మాణ కార్యక్రమంలోకి తీసుకొన్న కూలీలను ఆ పని ముగిశాక కోట సేవకులుగా క్రమం గా సైనికులుగా మార్చే వ్యూహం భుజంగరాయుడిది. ఆ విషయంలో వెంకటాద్రి నాయుడు మాదిగలు చెప్పిన మాట వింటారా ? ధర్మ పద్ధతిలో ఉంటారా? అని సందేహాలు వ్యక్తం చేస్తే ‘ప్రేమకు మారుపేరు’, ‘నీమము తప్పబోరు, పని నీతిని భార్యగ నేలు కొంద్రు’ అని చెప్పి మద్దతుగా నిలబడ్డాడు. “ శౌర్య సామ్రాజ్య పాలనా చక్రధరులు / మడమతిప్పని వీరసింహాలు వీరు / విమత రాజా కిరీటాల చెమటబట్ట / గుండె దడపెంచు వీరాగ్ని కొరివి వీరు”(379) అని వాళ్ళ శౌర్యాన్ని ఉగ్గడించాడు. “ దేశపు మూలవాసులు, విదేశ దరిద్రులకన్న వాసముల్ /లేశము కూడ లేదనక లెస్సగ నిత్రు” (383) అని అతి పురాతనకాలాల నుండి అందరికీ అన్నీ ఇచ్చి తమకేదీ మిగుల్చుకోని జాతిని అనుమానించవలసిన పనే లేదని ప్రకటిస్తాడు. ఇంగ్లీషు సైన్యంలోకి కూడా ప్రవేశించి పీష్వాలనులొంగదీయటంలో ప్రధానపాత్ర వహించి కోరేగాం స్థూపం శాశ్వత చిరునామా గా చరిత్రలో నిలిచిపోయిన దళిత సైనిక బలం బహుశా ఇనాక్ దృష్టిలో ఉండేవుంటుంది. అందువల్లనే వెంకటాద్రి నాయుడి సైన్యం లో దళితులను చేర్చటంలో , దానిని సమర్ధించు కొనటంలో భుజంగ రాయడు చొరవ చూపినట్లు ఇతివృత్తాన్ని మలచారు.

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కోసం భుజంగరాయడు గుడులు కట్టించాడు. కొలనులు కట్టించాడు. అమరావతిలో కోట కట్టించాడు. నిర్మాణం పనిలోకి కూలీలుగా తీసుకొన్నవాళ్లను సైనిక బలగంగా అభివృద్ధి చేసాడు. వీటన్నిటికీ సంతోషించిన నాయుడు భుజంగరాయుడికి ఏమి కావాలో అడగమన్నాడు. అప్పుడు ఆయన తన స్వంతానికి ఏమీ కోరుకోలేదు. ఏవి దళితులు నిర్మించారో వాటిలో తిరిగే అవకాశం పంచములకు ఉండాలని కోరాడు. ఒక దళితుడు అధికారంలో ఉంటె తన జాతి కోసం ఆ మాత్రమైనా చేసుకోవాలి అన్నది ఇనాక్ భావం. “…. జన నాథ కోటనిల దీప్తమొనర్చిరి మాదిగల్ శ్రమన్ / వినుడు, పునాదులన్నిలుప స్వేదము రక్తము నింపిరశ్రువుల్” (396)ప్రతి నిర్మాణపు పునాదిలో మాదిగల చెమట, రక్తం, కన్నీరు ఉన్నాయని చెప్పి ఆ నిర్మాణంలో వాళ్లకు ప్రవేశం ఎంత న్యాయ సంబద్ధమో సూచించాడు. “ తాము కట్టిన గుడిలోకి తరాల లేక /తాము త్రవ్విన కొలనులో త్రాగలేక /తామే హృదియైన కోటలో తావు లేక / మాదిగలు బాధపడ …” భవిష్యత్తు అనేదే లేకుండా పోతుందని హెచ్చరికను సన్నగా వినిపింప చేసాడు. దానికి రాజు అంగీకరించి మాదిగల దేవాలయప్రవేశానికి, కొలనులలో స్నానాది కార్యాలు నిర్వహించటానికి , కోటలోకి ప్రవేశించటానికి, అంటరాని తనం నుండి విముక్తమై సర్వసములుగా ప్రవర్తించటానికి తక్షణం శాసనం చేయించాడు. ఆరకంగా అస్పృశ్య సమస్య అడుగుబట్టటానికి తన జాతి హక్కుగా సమానత్వాన్ని అనుభవించటానికి భుజంగరాయడు దోహదకారి అయినట్లు ఒక ఆదర్శ స్థితిని కలగన్నాడు కవి.
అస్పృశ్యత , కులహీనత , కులాన్ని బట్టి విద్యాధికారం – ఇవి చిన్నప్పటి నుండి భుజంగరాయడు ధిక్కారానికి గురైనవే. అది ఎలా సాధ్యమైందో తెలియదు కానీ అతడు స్వయంగా వేదాధ్యయనం చేసాడు. వేదం చదివే గొంతు పేలిపోతుంది అని బ్రాహ్మణ యువకులు బెదిరిస్తే బెదరలేదు.
“వేదము చదివిన గొంతుల
నాదమరచి విను చెవుల ప్రహారము చేయం
గాదుర ! సీసము పోయగ
రాదుర! కాల పరిణామ రాజ్యము కనరా !” అని వేదం చదివే గొంతును, వినే చెవులను శిక్షించే కాలం కాదిది , కాలం మారింది అని నొక్కి చెప్పాడు. అప్పటికి అతను ఇంకా ఆస్థాన ఉద్యోగి కాలేదు. ఆస్థాన ఉద్యోగి అయి సైన్యనాయకుడై వెంకటాద్రి నాయకుడికి చేసిన అభ్యుదయాలకు ప్రతిగా అతను పంచములకు దేవాలయ ప్రవేశాది హక్కుల గురించి అడిగి చట్టబద్ధం చేయించాడు. రాజ్యం మారివుంటే ఇప్పుడిలా అడగవలసిన అవసరం లేదు. మరి మారకుండానే కాలపరిణామాలను గమనించమని ఎలా ఆనాడు బ్రాహ్మణ యువకులకు చెప్పగలిగాడు ? అంటే అప్పటికి అది అతని ఆకాంక్ష అనుకోవాలి. దానికి శాసన రూపం తన అధికారం వల్ల సంపాదించి పెట్టాడు అనుకోవాలి.

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి సాహిత్య సభలో చర్చలలో పాల్గొన్న భుజంగరాయడు మూడు నెలలలో ఒక కావ్యం వ్రాస్తానని సవాల్ చేసి వ్రాసి తెచ్చి వినిపించినట్లు ఒక ఘట్టం కల్పించబడింది ఈ కావ్యంలో. “కాలప్రయాణమ్ము” మామూలు కృతియనరాదు నిజముఅన్న రాజు ప్రశంసను బట్టి దాని పేరు కాలప్రయాణము అనుకోవచ్చు. కాలపరిణామం గురించిన అతని పూర్వభావనే కావ్యం అయిందా ?
“ఆంధ్రదేశాన మత తీవ్ర యాత్రరేగ
మనుజ హృదయాల దయమాలి మాడ్చి చనియె
పంచములు గుండెమంటల వంచన నది
నీదుట నిజమై త్వరగ గట్టెక్క గలరు “ అని రాజు అన్న మాటలు అవుననే సూచిస్తున్నాయి. పంచములు వంచనలు, అవమానాలు , అసమానతలు దాటి సంతోషించేరోజు కోసం కవి ఆకాంక్ష ఆ కావ్యంలో వ్యక్తమైందని అర్ధం. భుజంగరాయడు ఏది చేసినా ఆ గురి మీదనుండి దృష్టి మరలించలేదనటానికి ఆ ఆకాంక్ష శాసనమయ్యే పర్యంతం, వాస్తవానుభవం అయ్యే పర్యంతం పూనిక వహించటమే గుర్తు. ఆ తరువాతనే ఆయన పెళ్లి చేసుకొన్నాడు.

ఇప్పుడొకసారి వెనక్కు వెళ్లి రాజు ఆస్థాన ఉద్యోగిగా అతను గూడెం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అతని పెళ్లిప్రస్తావన తీసుకువచ్చిన సందర్భాన్ని పరిశీలించాలి.
“కొన్ని కలలు నన్ను వెన్నంటి తిరిగాడు
అన్ని వాస్తవమ్ములగుట వలతు
కోరి చేయుపనులు కూర్మి సాధింపంగ
భార్య యడ్డ మగుట పనికి రాదు” ( 142) అని అతను పెళ్లిని నిరాకరించాడు. పూనిన లక్ష్యం నెరవేరినప్పుడే పెళ్లి ఘడియ (148) అని నిక్కచ్చిగా చెప్పాడు. భుజంగరాయడు పూనిన ఆ లక్ష్యం మాదిగలకు సామాజిక గౌరవం సంపాదించి పెట్టటమే. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టటం, రాజు కోసం యుద్ధాలుచేసి విజయాలు సాధించటం, దొంగలను , దోపిడీ మూకలను లొంగదీయటం, గుడిగోపురాలు, కొలనులు, కోట నిర్మించటం ఇవన్నీ అతని లక్ష్యాలు అనలేము. అసలైన లక్ష్యం దళితులకు సమానహక్కులు. సాధికారత. అవి సాధించటానికి ఉపకరణాలు ఇవి. ఈ పనులతో రాజుకు దగ్గరివాడై , కృతజ్ఞతకు పాత్రుడై అదనుచూసి తన లక్ష్యం సత్య కావటానికి రాజు చేత శాసనం చేయించగలిగాడు. ఆ లక్ష్యం సాధించిన తరువాతే అన్న మాట ప్రకారం పెళ్లి చేసుకొన్నాడు.

చెంచులు, తదితర ఆదివాసులు మాలమాదిగలవలె కేవలం సామాజిక సంస్కృతి వల్లనే కాక రాజ్యవిస్తరణ కాంక్షతో తరచు దురాక్రమణలకు కూడా గురికావలసి వస్తుంటుంది. రాజ్యం తన భూభాగాలను విస్తరించినుకొనే క్రమంలో వాళ్ళను అక్కడినుండి తొలగించటానికి దారి దోపిడీ గాళ్లుగా చిత్రిస్తుంటుంది. ఈ కావ్యంలో కూడా అదే జరిగింది. చెంచులను వధించటమో , వెళ్లగొట్టటమో కాక సైన్యంలో కలుపుకోవాలని , సేవకు వినియోగించుకొనాలని భుజంగరాయడు అన్నాడు.

స్వస్థానాలనుండి దూరం చేసి తమలో కలుపుకొని కిందిస్థాయి సేవలకు వినియోగించటం అనేది పచ్చిక మైదానాలకోసం పశుపోషణ కాలంలో మొదలైన తొలి యుద్ధాలలోనే వుంది. భుజంగరాయడు ఆ పద్ధతిని అనుసరించాడన్నమాట. కానీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి చరిత్ర వాళ్ళను వధించినట్లు చెప్తున్నది. ఈ నాటి అవగాహనను , చైతన్యాన్నిబట్టి పీడనకు హింసకు గురయ్యే దళితులు తమ వలెనే లేదా తమ కంటే ఇంకా ఎక్కువగా పీడితులవుతున్న జాతులపట్ల మిత్రత్వం , సానుభూతి కలిగి ఉండాలి. ఐక్య సంఘటన కు సిద్ధంగా ఉండాలి. అందువల్ల చెంచులను చంపటంలో భుజంగరాయడి కర్తృత్వాన్ని పూర్తిగా పరిహరించి అదంతా వేంకటాద్రి నాయుడి చర్యగానే ఇతివృత్తాన్ని నడిపారు ఇనాక్ . ఈ విధంగా చరిత్రను, జానపద గాథలను సమన్వయము చేస్తూ కల్పనను జోడించి ఇనాక్ ఈ కావ్యం వ్రాసారు.

2.

కన్నీటి గొంతు ఎవరిది ? ఏమి వినిపిస్తుంది? అది శూర్పణఖ గొంతు. ఆమెకు కన్నీరు ఎందుకు ? రాముడిని వరించి పొందిన భంగపాటు వలన. గాయపడ్డవి లక్షణుడు కోసిన ముక్కు చెవులు మాత్రమే కాదు. ఆమె హృదయం కూడా. ఆ నొప్పి కలిగించిన దుఃఖం గొంతుకు ఎగదట్టిన తరుణాన ఆమె ఆలోచనల అభివ్యక్తులే కన్నీటి గొంతు కవితలు.

త్రేతాయుగం నాటిదిగా రామాయణం అత్యంత ప్రాచీన చరిత్రకలిగిన ఇతిహాసం అంటారు. పితృవాక్య పరిపాలన, సోదర వాక్య పాలన, ఏకపత్ని వ్రతం వంటి విలువలకు, ఒక ఆదర్శ నమూనాగా రామరాజ్య భావనకు ప్రచారం కల్పించిన రచనగా రామాయణం పవిత్ర గ్రంధంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది. వాల్మీకి రామాయణం నుండి విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం వరకు సంస్కృతం , తెలుగు భాషలలో వచ్చిన రామాయణాలు వాటితో పాటు మిగిలిన భారతదేశ భాషల లో వచ్చిన రామాయణాలను కూడా కలుపుకొంటే అవి అనేకం. అందువల్లనే రొమిల్లా థాపర్ రామాయణం చరిత్రలోని ఏ ఒక్క కాలానికీ పరిమితం కాదు రామాయణానికే ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని అంటుంది. పలు రామాయణ గాధలు ఉండటమే కాదు, ప్రతి రామాయణ కథ ఆయా ప్రదేశాలకూ .ఆయా కాలాలకు , అక్కడి ప్రజల భావజాలాలకు అనుగుణంగా అల్లబడింది అని అభిప్రాయపడింది. ( అనేక రామాయణాలు , అనువాదం ఫై. సత్యవతి , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 2018) సంప్రదాయ వాదుల నుండి, ఆధునిక భావజాల ప్రేరితుల వరకు సాహిత్య విమర్శకులను అందరినీ రామాయణానికి సంబంధించి వెంటాడిన సమస్యలలో శూర్పణఖ ముక్కుచెవులు కోయించటం, సీత అగ్నిప్రవేశం, నిండు గర్భిణి ని అడవిలో వదిలెయ్యటం , శంబూక వధ వంటివి ఉన్నాయి. ఎవరిదైన పద్ధతిలో వాళ్ళు వాటికి సమాధానాలు వెతికారు. సమర్దిస్తూనో, నిరసిస్తూనో వ్యాసాలూ వ్రాసారు. అదే సమయంలో విమర్శను సృజనాత్మక ప్రక్రియా రూపంలో ఆవిష్కరించటం కూడా విస్తృతంగానే జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరి ‘శంబూక వధ’, చలం ‘సీత అగ్నిప్రవేశం’, ముద్దుకృష్ణ ‘అశోకం’, నార్ల ‘సీత జోస్యం’ వంటి రచనలు ఆ కోవలోవే. ఆ మార్గంలోదే ఇనాక్ వ్రాసిన ‘కన్నీటి గొంతు’ కావ్యం.

ఆసక్తితో చదవటం మొదలుపెట్టి చదువులకాలంలో పరీక్షలకు , ఉద్యోగకాలంలో పాఠం చెప్పటానికి మళ్లీమళ్లీ రామాయణాన్నిచదువుకొన్న సుదీర్ఘ కాలం మీద తనను నీడలా వెన్నాడుతూ రామాయణ చరిత్రలో తనకు జరిగిన అన్యాయం, తన దుఃఖపు గోడు లోకానికి వినిపించమని కోరుతూ వచ్చిన శూర్పణఖ గొంతుకు తన మాటను ఇచ్చారు ఇనాక్ . శూర్పణఖ కవిని , ద్రావిడ బహుజన సోదరులను , లోకాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఉన్న డెబ్బై రెండు (72) ఖండికల సమాహారం ‘కన్నీటిగొంతు’. దేనికదే ప్రత్యేక ఖండిక. వాటి మధ్య కథా సూత్రం ఏమీలేదు. అన్నీ వచన కవితలు. వక్త మాత్రం ఒక్క శూర్పణఖ మాత్రమే. కవితా వస్తువు రాముడు , రావణుడు మొదలైనఐతిహాసిక వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాలు, తనకు జరిగిన అన్యాయం పట్ల ఆమె ఆక్రోశం. మొత్తంగా ద్రావిడజాతికి జరిగిన చారిత్రక ద్రోహం పట్ల నిరసన.

ఆర్య ద్రావిడ సంఘర్షణలకు , ఆధిపత్య రాజకీయాలకు సంబంధించిన అవగాహన ఈ కవితలకు నేపధ్యంగా పనిచేస్తుంటుంది. “ అన్నార్త ఆర్యులు విదేశీయులు అరాచకులు / సంపన్న ద్రావిడులు స్వదేశీయులు పాలకులు /భూపుత్రుల్ని అసురులని, తమను భూసురులని / సురుల్ని సృష్టించి స్వర్గస్థుల్ని చేశారు వాళ్ళు/ నేలపిల్లలైన ద్రావిడుల్ని రాక్షసులని, వానరులని/ తామే దైవ ప్రతినిధులమన్నారు యాచకార్యులు ..” అన్నది ‘అసలు’ వాస్తవమంటాడు కవి. “మన ఆస్తులు ధ్వంసించి/ నగరాలుభస్మీకరించి/ ఆయుధాల్ని దొంగలించి” ద్రావిడులను బానిసలను చేసుకొన్న ఆర్య జాతి దుర్మార్గాన్ని ఎండగట్టే ద్రావిడ జాతి ప్రతినిధిగా శూర్పణఖను ఈ కావ్యంలో చూస్తాం. అతి ప్రాచీన భారతీయ జాతి తన నేల నుండి పరాయీకరణ కు గురి అవుతున్నదన్న క్రోధం అన్ని కవితలలో పరుచుకొని ఉంటుంది.

ఆ క్రమంలోనే శూర్పణఖ తన అన్న రావణుడిని ద్రావిడజాతి ఔన్నత్యానికి , రాముడిని ఆర్యజాతి కుటిలనీతికి ప్రతినిధులుగా సంభావించి చెప్పటం కొన్ని కవితలలో కనబడుతుంది. అన్న , పూజ అన్న రెండు కవితలు రావణుడి లోని బాంధవ్యభావోద్ధతిని పలికేవే. అన్నకు చెల్లి అంటే ప్రేమ ఆమె కోరిన వరుడు రాముడిని ,ఆ రాముడిని ఒప్పించి చెల్లెలితో పెళ్ళిచేయాలనే ఆయన చేసిన ప్రయత్నం అంతా .. ఆ ప్రయత్నాన్ని సూచించే కవితలు అనేకం ఉన్నాయి. అన్న అందగాడు. భార్యావిధేయుడు. సేవకుడు. ‘ అన్నకు స్త్రీ దేవత/ భక్తి పూజ వినా అన్యాయం ఎరుగడు/ స్త్రీకి నిరంతర పూజారి “ ( పూజ ). “అన్నంటే మండే యజ్ఞకుండం కాదు /నిలువెల్లా పుష్పిస్తున్న పొదరిల్లు”(సేవ ) ఇలాంటి వ్యక్తీకరణలు చాలా కవితలలో కనబడతాయి. ఆ అన్నను పదితలల వికృతరూపుడుగా చిత్రించిన ఆర్య ధర్మం పట్ల ఆగ్రహం ‘పది తలలు’ కవితలో కనబడుతుంది. పది తలలు అంటే పదిమందిని ఓడించే పరాక్రమశాలి , అనేకులను తలదన్నే ఆలోచనాపరుడు అని వ్యాఖ్యానిస్తాడు కవి.

ఇక రాముడో… “ స్త్రీ హింసా శిఖరం రాముడు/ మానవత్వ అవమానం రాముడు /అన్ని అవగుణాల ప్రోవులైన/ ఆర్యుల అహంకార సృష్టి రాముడు “ అంటాడు కవి ‘బానిసలు’ కవితలో . స్త్రీలపట్ల అతని వైఖరి పట్ల విమర్శగానే ఉన్నాయి కన్నీటి గొంతు కవితలలో ఎక్కువభాగం. ఆర్యుల అహంకార సృష్టి అయిన రాముడి పాలన, ‘రామరాజ్యం’ ఎంత క్రూరమైనదో ఇందులో కొన్ని కవితలు స్పష్టంగానే చెప్పాయి. ఆర్యుల అరాచక ఖడ్గ ధార సృష్టించిన హంతకరాజ్యాన్ని , యాచకులై వచ్చి యాచననే రాజనీతి చేసి, యాచకులను దైవ ప్రతినిధులుగా చేసిన యాచకరాజ్యాన్ని, ద్రావిడ సంస్కృతిని విధ్వంసం చేసి, ఆ పునాదుల మీద లేచిన విధ్వంసక రాజ్యాన్ని రామరాజ్యం అని నెత్తికెత్తుకొనటం తగదన్న హితవు రామరాజ్యం కవితలో కనబడుతుంది. ‘రామరాజ్యమంటే / ఆర్యులకు కుర్చీ/ అనార్యులకు ధూళి’ అని ప్రారంభమయ్యే తేడా కవితలో రామరాజ్యమంటే దొంగల దోపిడీ అనీ, బ్రాహ్మణాధిక్యత అనీ, వర్ణవ్యవస్థ నిస్సిగ్గు నాట్యం అనీ బహుజనులకు బానిసత్వం, దళితుల దోపిడీ , స్త్రీల మాన ప్రాణ హాని అని హెచ్చరిస్తారు ఇనాక్.

ఇక ఈ కావ్యంలో అసలైన సమస్య వ్యక్తిగా, స్త్రీగా శూర్పణఖ కు ఎదురైన సమస్య. యవ్వన సహజమైన ఆకర్షణలు , వాంఛలు స్త్రీకి ఉండటాన్ని , వ్యక్తీకరించటాన్ని అంగీకరించలేని ఆర్య సంస్కృతి దాడికి గురైన శూర్పణఖ ఆక్రందన , ఆవేదన , వాదన బహు పార్శ్వాలనుండి వ్యక్తం చేసే కవితలు అనేకం ఉన్నాయి. వివిధ రామాయణాలలో శూర్పణఖ ఉదంతాన్ని పరిశీలించి పోలుస్తూ వ్యాసం వ్రాసిన క్యాతలీన్ ఎం. ఎర్న్డల్( అనేక ) శూర్పణఖ పట్ల మోహంలో పడ్డానని ఆమె దుస్థితి పట్ల సానుభూతి , ఆమె సూటిదనం పైన , స్వతంత్ర ప్రవృత్తి పట్ల ఆరాధనా భావం కలిగాయని ఏదైతే చెప్పిందో ఇనాక్ గారిది కూడా అదే స్థితి అనిపిస్తుంది కన్నీటిగొంతు చదువుతుంటే.

ఈ కవితలను ఒక క్రమంలో పరిశీలిస్తే కొన్ని ప్రత్యేకతలు మనకు అర్ధం అవుతాయి. అవి ఒకటి శూర్పణఖ శారీరక స్పృహ . శరీరమే మొదటి అస్తిత్వం. శూర్పణఖ లోని ఆ శారీరక అస్తిత్వ స్పృహ ను రకరకాలుగా ఆవిష్కరించటం చూస్తాం ఈ కవితలలో. వెన్నెల కవిత “ సూర్యకాంతితో మిలమిలలాడే నా శరీరం / సరోవరమై తరంగితమవుతూ ఉండేది” అని ప్రారంభం అవుతుంది. “వంట్లో మునుపెరుగని విద్యుత్తు / రక్తమై పోటెత్తుతూ ఉండేది” అనే నాలుగో భాగం యావనోద్రేకాల ఆనవాళ్ల సూచిక. గుండెలో చంద్రుడు ఉదయించటం, గొంతులో సరిగమలు పలకటం దాని పరిణామం. ఉన్నచోట ఉండలేని … అలల అలజడిలో కొట్టుకుపోయే స్థితి దాని ఫలితం. ఇలా కొట్టుకుపోతున్న తానూ నావను ఒడ్డున కట్టేయాలని తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి తలపెట్టారు. ఈడు జోడు అయినవాడు దొరకలేదు. నచ్చిన వాడిని వెతికి గాంధర్వ పద్ధతిని పెళ్లాడటానికి పెద్దలు అనుమతించారు ( వెదుకులాట ) విల్లమ్ములతో ఉన్న రాముడిని చూసి నల్లగా ఉన్నాడు కనుక ద్రావిడుడు అనుకొన్నది. ‘వాంఛాతనువు ఉర్రూతలు వూగుతుంటే’ కోరివెళ్లి భంగపడింది ( తాడు ) శూర్పణఖ రాముడి పట్ల కోరిక కలగటానికి అతడు ద్రావిడ పురుషుడు అనిపించటం ఒక్కటే కాదు కారణం. అతను పెళ్లికానివాడు అనిపించటం కూడా. భర్త భార్య పక్కన నడవటం సమానత్వం. వెనక నడిచాడంటే రక్షణకు అనుకోవచ్చు. కానీ రాముడు ముందు నడుస్తుంటే సీత వెనక నడుస్తున్నది. అది చూసి ఆమెకు అతడేమీ కాడని అనుకొన్నది. (భ్రమ )

రెండవది శూర్పణఖ పొందిన పరాభవం. అదేమిటి? ఏకపత్ని వ్రతుడిని అని చెప్పి రాముడు , నాకు అవసరం లేదని లక్షణుడు తిరస్కరించటమే కాదు తనను ఆటపట్టించారు. ఆదమరచిన వేళ ముక్కుచెవులు కోశారు. విరూపిని చేశారు. చంపితే బాధ ఒకసారే. వికృతం చేస్తే అది జీవితకాలపు బాధ. పెద్ద పరాభవం. వ్యక్తిత్వ హననం. ముక్కు, చెవులు, గోళ్లు, ముక్కుచెవులు, జవాబు వంటి కవితలలో ఆ బాధే వినబడుతుంది. తన శరీరం లోని ఆయా అవయవాల చక్కదనం తనకు ఎలా గర్వకారణమో , అవి నెపంగా తనవాళ్ల ఆప్యాయతా అనురాగాలు తాను ఎలా పొందిందో చెబుతూ తన అవయవాల సౌందర్యం తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చిన ఆ గతకాలపు గారాబాల జ్ఞాపకాలు తలచుకొంటూ వాటిని కోల్పోయిన వర్తమాన విషాదానికి నిస్పృహ చెందుతున్నట్లుగా ముగిసే ఆమె స్వగాతాలు ఈ కవితలు. ముద్దుగుమ్మలు కవితలో ముక్కు , చెవులు, వాటికి ధరించిన ఆభరణాల కదలికలతో ఆత్మవిశ్వాసంతో నడిచే సాటి స్త్రీల ఆమ్మల్లారా , అక్కల్లారా అని సంబోధిస్తూ శూర్పణఖ మాట్లడే మాటల్లో తాను కోల్పోయిన వాటి గురించిన బాధా స్రవంతి కదలాడుతూనే ఉంటుంది.
బలవంతంగా పంపవలసి వస్తే
తిట్టొచ్చు, నెట్టొచ్చు, కొట్టొచ్చు
కానీ ముక్కూ చెవులూ కోయటం ఏమిటి?
ఇదేం జననీతి , రాజనీతి ? ( మనిషి కాడు ) అన్నది శూర్పణఖ ప్రశ్న.
ముక్కుచెవులు లేని ఆమె ముఖం ఇప్పుడు ‘ దిగులు చీకటి ముట్టడించిన దుర్భరముఖం’( శిక్ష ) మరెవ్వరితోనూ తన వాంఛను వ్యక్తం చేయలేని , తీర్చుకోలేని స్థితిని కల్పించాక “ ఏ శుభకార్యం నా ముఖాన ఉదయించదు / ఏ సుఖ సంతోష నౌకలు ఇక్కడ తెరచాపలెత్తవు” అని అర్ధం అవుతున్నప్పుడు పగిలిన ఆమె గుండె చప్పుళ్ళు కవితలై మనలను వెన్నాడతాయి.

మూడవది రాముడి మీద కసి. అది అతను చేసిన అవమాన జన్యమే. ఆ కసి నుండే అతనిని నపుంసకుడు అని పదేపదే అంటుంది. ఒట్టు , ఏం వంటి కవితలు ఆ కోవలోవే. “ రాముడు ఏకపత్ని వ్రతుడు కాడు / ఏ పత్ని అక్కరలేనివాడు” (ఏకపత్ని ) అని కసి తీర్చుకొంటుంది.
రాముడా !
అందమైన నన్ను వికారిని చేశావు
నా ముఖం నేను చూచుకోలేక
చూపలేక దిగులుతో దుఃఖంతో
కన్నీటి కదలినై పోతానని భావింపకు!

నేను పుష్పఫలవనంలో ఉండలేను
సెలయేరులా ప్రవహింపలేను
కానీ, కొండలా బండలా బ్రతికి ఉండి
నీదుర్మార్గం ప్రకటిస్తాను
నీ దౌష్ట్యాగ్ని శిఖాజ్వాలలు చూపిస్తాను
నీ క్రూరబుద్ధి కుండ బద్దలు కొడతాను” ( ఇతవు ) అని ప్రతీకారేచ్ఛను ప్రకటిస్తుంది.
‘బలవంతుడి క్రూర చర్యకు/ బలహీనుడి ప్రతి చర్య / దెబ్బ కాకపోతే తిట్టే” ….. “నా శాపం దుఃఖాగ్ని శిఖా/ నా కోపం ఆబాల ఆర్తనాదం/ నా ఆవేదన మూలవాసి కన్నీటిగొంతు” ( బూతు ) ఇలాంటి అభివ్యక్తి తీవ్రత కల కవితలు చాలానే ఉన్నాయి.

ఆ క్రమంలో ఆమె సీతపట్ల సహానుభూతి ప్రకటిస్తుంది. రాముడు సీతను వెతుకుతూ రాలేదు / అతడికామె అక్కరలేదు (పతనం ) విజయరథం ఎక్కటం ఒక్కటే అతని లక్ష్యం అని అసలు రహస్యాన్ని బయట పెడుతుంది. శీలపరీక్షా నాటకం గుట్టు రట్టు చేసింది( అగ్గులాట ) “ రాముడి నటనానల జ్వాల సీతకు ఏం లెక్క / ఎర్రపూలమీద నడిచినట్లు / మందారమాలలు మెళ్ళో వేసుకొ న్నట్లు / మోదుగుపూలు చెట్టులా నడిచి” వచ్చి సీత రాముడి ముందు తలెత్తుకు నిలబడ్డ చిత్రాన్ని ఈ కవితలో చూస్తాం. ‘తెలుసు’, పుట్టిల్లు, చర్య కవితలు సీతకు చేసిన అపచారాల దృష్ట్యా రాముడి స్వభావ నిరూపణ.

నిజం, రామాయణం అన్న రెండు కవితలు మొత్తంగా రామాయణ విష సంస్కృతిని ఎండగడతాయి. ఆ రకంగా శూర్పణఖ ముఖంగా ఇనాక్ చెప్పిన ఈ కొత్త రామాయణం అనేక రామాయణాలకు అదనంగా చేరిన మరొక రామాయణం. ఆధునిక కాలానికి స్త్రీపురుషుల ప్రేమకు , లైంగికతకు, జాతులకు కులాలకు సంబంధించిన కొత్త భావజాలంతో అధికార రాజకీయాలపై చేసిన ఒక విమర్శ.


3

సర్పయాగం(2016) ఇరవై ఒక్క ( 21) కవితల సంపుటి. కులం ఈ కవితలకు కేంద్ర బిందువు. ‘నాలుగు పడగల హైందవనాగరాజు’ అని హిందూ వర్ణ వ్యవస్థను జాషువా నాలుగు తలల నాగు పాము గా అభివర్ణిస్తే ఇనాక్ ‘నాగుబాము’ కవితలో దానికి అయిదవపడగను చేర్చారు. అది పంచములను సూచిస్తుందనుకోవచ్చు. “అయిదు తలలు , శరీరాలు, తోకలు /సమాంతరంగా అతుక్కొనే ఉన్నాయి/ అవి విడిపోవటం , కలిసి ఉండటం/ సమయానుకూల చర్య” అని ప్రారం భించి మధ్యలో ‘చీకటి దాని జన్మ హక్కు / వెలుతురంటే బుసకొడుతుంది’ అని దాని స్వభా వాన్నిచెప్తాడు కవి. ఆర్యులతో పాటు వచ్చిన నాగుపాము విధ్వంసాన్ని నిలవరించి నిర్మూలిం చటానికి చరిత్ర పొడుగునా జరిగిన సంస్కరణ ప్రయత్నాలన్నీ విఫలమైన విషయాన్ని ప్రస్తావి స్తాడు. భరతం పట్టాల్సిన ప్రభుత్వాలు దానికి భజన చేస్తున్న విషయాన్ని చెప్పకుండా మానలేదు. దానిని చంపేవాడి కోసం కవి నిరీక్షణ ఇందులో ఉంది.

‘శాశ్వతంగా ఖైదీలు’ కవితలోనూ ఆ ఐదుతలల నాగుపాము గురించే కవి వేదన. ‘దానికి బువ్వపెట్టి నీళ్ళుపోసి రక్షించటానికి’ సృష్టించబడ్డ మనువు గురించి , ‘ స్వర్గ నరక మాయా జాలంలో’ మనుషులను తోలుబొమ్మలుగా చేస్తున్నవైనం గురించి ఆయన ఫిర్యాదు. మూడువేల ఏళ్ల క్రితం నిర్మాణమైన వర్ణవ్యవస్థ జైలులో శాశ్వత ఖైదీలుగా శిక్షకు గురవుతున్న మాలమాదిగల విముక్తి గురించిన తహతహ ఇందులో కనబడుతుంది.

“స్వాతంత్య్రం , స్వేచ్ఛ, సమానత్వం / రాజైనగంలో ఉన్నా , నాగుబాము దృష్టిలో లేవు” అంటూ ఆర్యుల్ని అందలాలెక్కించటం / అనార్యుల్ని అధః పాతాళంలోకి తొక్కటం దాని సిద్ధాంతం అని నిర్ధారిస్తాడు కవి. ( దాస్యం దాని సిద్ధాంతం ) హిందూమతమే జెండాగా, ఎజండాగా ఉన్న దేశ ప్రజాస్వామ్యాన్ని ఏవగించుకొన్నాడు. మతాతీత లౌకిక రాజ్యంలో రామరాజ్యం లక్ష్యం కావటం ఏమిటని తిరస్కరించాడు. ఈ పరిస్థితులను మార్చే నూత్నవిప్లవం గురించి కలగన్నాడు ( ఆ కాలం ఎంతో దూరంలో లేదు )

మూడురంగుల జెండా శూద్ర పంచముల స్థానమెక్కడా అన్నది కవి ప్రశ్న. “ నేల గిల్లుకొంటూ పడి ఉండవలసిన వాళ్ళ వర్ణం / నింగిలో రెపరెప లాడటం ఇష్టం లేదా ?/ నా వర్ణం జాతీయ పథకంలో లేదని / నేను జెండా వందనం చేయనంటే / దేశ ద్రోహమా “ అని తనవర్ణానికి స్థానం లేని జెండా తనకు ఎందుకు వందనీయం అవుతుంది అని ఒక సామాన్య లౌకిక దృష్టితో ధిక్కారప్రకటన చేస్తాడాయన. ‘విషప్పురుగు నాగుబాము పాలన’ నశించాలని ఆశిస్తాడు. పార్లమెంటు పాము పడగ నీడన ఉన్నదని కవి అవగాహన. అప్పుడు అంబేద్కర్ వ్రాసిందైనా సరే , ఆ రాజ్యాంగం మాలమాదిగలకు న్యాయం ఇయ్యలేదు అన్న స్పష్టత కూడా ఆయనకు ఉంది. (ప్రభాతమెప్పుడో ) కులం ప్రస్తావన లేకుండా ఒక్క కవిత కూడా లేదంటే అతిశయోక్తి కాదు కులాన్ని నాగుబాముగా రూపకం చేసిన కవి ఆ నాగుబాము నాశనం కోరుతున్నాడు. సర్పయాగం అందుకే సంభావించాడు.

సర్పయాగం మహాభారత ఇతిహాసం నుండి తెచ్చుకొన్న భావన. ఆదిపర్వంలో జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు పాము వల్ల మరణించాడు కనుక సర్ప యాగం చేస్తాడు. అందుకు అతనిని ప్రేపించినవాడు పాము వల్ల గురుకార్య నిర్వహణలో ఇబ్బంది పడిన ఉదంకుడు. ఈ సందర్భంగా పాముల వల్ల ఇడుములు పడిన రురుడు, గరుత్మంతుడు మొదలైన వాళ్ళ కథలు వస్తాయి. ఎక్కెడెక్కడ ఉన్న పాములను యజ్ఞకుండంలో ఆహుతి ఇయ్యటానికి ఆవాహన చేస్తూ పెద్ద ఎత్తున జరిగిన ఆ సర్పయాగం ఇక్కడ కవికి వర్ణ వ్యవస్థ అనే నాగు పామును చంపటానికి ఈ నాడు అవసరం అనిపించింది. ఇప్పుడు వర్ణవ్యవస్థ అనే సర్పాన్ని చంపే వాళ్ళు — అంటే ఆధునిక యుగ సర్పయాగాన్ని జరిపించేది మాలమాదిగలేనని కవి కంఠోక్తిగా చెప్పటం చూస్తాం . ( శివుళ్ళతో పెట్టుకోకండి )

ఈ సంపుటి లో మరొక ప్రత్యేకత అంబెద్కర్ ను సంబోధిస్తూ రాజ్యాంగ రచనలో ఆయన పాత్రను, ఎదురైన సవాళ్ళను, దళితుల గురించిన ఆయన ఆశలను , వాటి వాస్తవీకరణ పరిణామాలను , రిజర్వేషన్లను, మాలమాదిగ ఉపకులాల మధ్య వైరుధ్యాలను ప్రస్తావిస్తూ కవితలు వ్రాయటం. గాంధీని సంబోధిస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్రను ప్రశంసిస్తూ, ఆయన ఆదర్శాలకు, ఆశలకు దూరం జరిగిన జాతి తరఫున వేదన వ్యక్తం చేస్తూ కవిత్వం చాలానే వచ్చింది. అంబేద్కర్ ను సంబోధిస్తూ ఇనాక్ వ్రాసిన కవితలు దళిత రాజకీయాల చర్చకు మంచి ఒరవడి పెడుతున్నాయి.

మొత్తం మీద కవిగా ఇనాక్ కవిత్వం ఆర్ధిక సాంఘిక అసమానతలమీద, సవర్ణులకు దళితులకు మధ్యనే కాదు, దళితులలోని అంతర్గత అసమానతల మీద కూడా ఎక్కుపెట్టిన ఆయుధం అన్నది వాస్తవం.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply