మందితో కలిసి మెల్లిగా నడుస్తుంటే మన గురించి ఎవరూ మాట్లాడరు. కొంచెం పక్కకి తిరిగి పచ్చగా ఉందను కున్న మరో బాట ఎంచుకున్న మనిషి మీద తీర్పు చెప్పే హక్కు ప్రతి ఒక్కరూ అమాంతం అందిపుచ్చు కుంటారు. ఆ బాట ఎంచుకోవడానికి ఆ వ్యక్తికి మంద మధ్యన ఉన్న ఊపిరాడని తనమో, లేక మరో మార్గం పైన ఆసక్తో, మరి ఏదైనా ఇబ్బందో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. తమ తీర్పులను, ఆ వ్యక్తి పట్ల ద్వేషాన్ని పదిమందికి పంచటానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించి విజయం సాధిస్తారు కూడా. తమ నుంచి విడిపోయిన ఆ వ్యక్తి గురించి ఏమాత్రం సానుభూతి లేని వాతావరణాన్ని కల్పిస్తారు. ఆ వ్యక్తి సన్నిహితులకు కూడా ఆమెపై కోపాన్ని కలిగిస్తారు. దీనినే లోకరీతి అనడం చిరకాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు మనతో లేని ఆ వ్యక్తి తన బ్రతుకును కొంత సౌకర్యవంతంగా కొనసాగించు కోవాలని ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకోవడం మంచి లక్షణం. ఈ కథ రాయడానికి చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనలే కారణం ఇందులో కొంత wishful thinking ఉండవచ్చు కానీ మనుషుల ఆలోచనలలో ఒక తాత్వికత వచ్చినప్పుడు ఎన్నో అలజడులను ఆక్రోశాలను జీవితకాలం పట్టి పీడించే అసంతృప్తులను వదిలించుకుని కొంత నాణ్యమైన ఆలోచనలతో ఈతరం వ్యక్తులైనా ముందుకు సాగాలని నా ఆకాంక్ష. నిన్నటి బరువును వీపు మీద మోసుకుంటూ ఇవాల్టి బ్రతుకును కంపరం చేసుకోడం అవివేకం. మనం బ్రతకాలి ఇంకొకరిని బ్రతకనివ్వాలి. విశాలమైన విశ్లేషణతో మనుషుల పట్ల ప్రేమతో ఆలోచించాలి. ఈ కథలో దమయంతి కొడుకు ఈతరం యువత ఆలోచనలకు దారి దీపం.
(‘దమయంతి కూతురు’ కథ కింద చదవండి…)
దమయంతి కూతురు
ఆదివారం నాడు నా గదిలో ఉదయభానుడు ప్రవేశించకుండా గవాక్షపు తెర దించే ఉంచుతాను. కానీ ఆది, సోమ వారాల దిన భేదాలు లేకుండా ఆరింటికే లేచి పాత హిందీ పాటల నేపథ్యంలో కాఫీనీ, ఆంగ్ల, తెలుగు దినపత్రికలను, వాటి అనుబంధాలను ఆస్వాదిస్తూ వుండే స్నేహ, నా దీర్ఘ నిద్ర భరించ లేదు.
“ఇలా సోంబేరిలా పడుకున్నావంటే నిన్ను లేపేస్తా” అని ద్వంద్వార్దాల డైలాగులు విసురుతుంది. అంచేత నేను త్వరగానే లేచి బుద్ధిగా పళ్ళు తోముకుని వచ్చెసరికే ,”ఆవో హుజూర్ తుమ్ కో సితారోం మే లే చెలూమ్…” అంటూ కాఫీ మగ్గు పక్కన పెట్టింది. పెట్టి,” హుజూర్ ! ఆజ్ ఆప్కో కహా కహా లేచెలూమ్… ”అంటూండగానే నిశ్చల తటాకంలో రాయి విసిరినట్లు ఫోన్ మోగింది.
మా అత్తయ్య.
“నాకు నువ్వు పెళ్లి సంబందాలు చూడొద్దు అత్తయ్యా” అని చాలా కోపంగా నిష్కర్ష గా చెప్పినా అత్తయ్య ఊరుకోదు.
“సామర్లకోట నుంచీ సంతోష్ అనే కుర్రవాడి అమ్మా నాన్నలకి నీ ప్రొఫైల్ బాగా నచ్చింది. వాళ్ళతో మాట్లాడాను. ఆ అబ్బాయికి కూడా నచ్చింది. గురువారం వాళ్ళని తీస్కుని నీ దగ్గరకొస్తాను. సెలవు పెట్టి వుండు” అని హుకుం జారీ చేసింది. ఆదివారానికీ గురువారానికీ మధ్య చాలా దూరం వుంది కనుక ఏదో సాకు చెప్పేసి తప్పించుకుందాం అనుకున్నాను.
“బుర్ర మసాజ్ కోసం బ్యూటీషియన్ని రమ్మన్నాను తొమ్మిదిన్నరకి. అదయినాక, తిరుగుడు, తినుడు, కొనుడు, చర్చించుడు వగైరా వగైరా…” అంది నెచ్చెలి.
ఎక్కడెక్కడ షికారు చేద్దామ్, ఎక్కడ తిందాం, ఏం కొందాం? ఎవరెవరికి ఫోన్ చేద్దాం? అని జాబితా వేస్తూ వుండగా మళ్ళీ ఇంకొక రాయి.
“నేను మీతో మాట్లాడాలి, ఎప్పుడు, ఎక్కడ కుదురుతుందో చెప్పండి.” ఎవరో కాదు, నా ప్రొఫైల్ నచ్చిన సంతోష్ ఫ్రం సామర్లకోట.
నన్ను కలవద్దు, మాట్లాడొద్దు. నా ప్రొఫైల్ మీకు నచ్చితే సరిపోయిందా? మీది నాకు నచ్చక్కర్లేదా? అయినా గురువారం ఎటూ వుందిగా కొలువు, మధ్యన ఇప్పుడెందుకు?” అంటే –
“చాలా ముఖ్యమైన విషయం, పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్” అన్నాడు. “ఏయ్! రానివ్వమ్మా, కాసేపు వినోదం. ఇప్పుడే మన గృహానికే ఏతెంచ మను. తొందరగా తెల్చేద్దాం. మై హూ నా” అని స్నేహ సలహా ఇచ్చింది. “సరే” అని కందిరీగల తుట్టె కదిలించాను.
సంతోష్ ఫ్రం సామర్లకోట నా అంత చదువుకున్నాడు. నాలాగే మంచి ఉద్యోగంలో వున్నాడు. మంచి బట్టలు వేసుకుని “బ్రూట్” పరిమళం చల్లుకుని (మౌత్ వాష్ కూడా పుక్కిలించి), ఘుమ ఘుమ లాడుతూ వచ్చాడు, కొన్ని మర్యాద మాటలు, మన్ననలు అయ్యాక, వచ్చిన పని బయట పెట్టాడు.
దమయంతమ్మ నిజంగా చచ్చి పోయిందా, లేక వెళ్లిపోయిందా ? అనే గొప్ప సందేహం నిన్నరాత్రి అకస్మాతుగా వాళ్ళమ్మకి వచ్చిందట. ఆవిడ అప్పటినుంచీ ఒకటే సణుగుడట! నిజానికి అతను, “వెళ్లిపోయిందా?” అనలేదు. మా వూళ్ళో మా చుట్టాలు, పక్కాలు, ఇరుగుపొరుగులు, అంతగా చదువురాని వాళ్ళు, బ్రూట్ పరిమళాలు మౌత్ వాష్ లూ ఎరుగని వాళ్ళు, వాడేసి వాడేసి అరిగిపోయి కాలం చెల్లిన ఒక మాట అన్నాడు.
“సారీ సంతోష్! దమయంతమ్మ చనిపోయిందని చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టలేను. మీరు వాడారే ఇందాక ఒక మాట ! ఆపనే చేసింది, ఆ దమయంతమ్మ కూతురినే నేను. సరేనా? చెప్పండి మీ వాళ్లకి.” అన్నాను.
అతను చల్లుకొచ్చిన పరిమళం నా కడుపులో తిప్పుతోంది.
“ అబ్బే! అదేం లేదు. మా వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. మిమ్మల్ని గురించి ఆఫీస్ లో … అక్కడా చాలా బాగా చెప్పారని చెబుతాను…. ఊర్కే అడిగానంతే …”
“మరి నేను మిమ్మల్ని గురించి మీ ఆఫీస్ లో … అక్కడా అడగలేదు. అయినా ఎందుకొచ్చిన అనుగ్రహం ఇది. మనిద్దరికీ కుదరదు సంతోష్ గారూ . పెళ్లి చూపులొద్దని చెప్పండి. నేను మా అత్తయ్యకి చెప్పేస్తాను.” అని నమస్కారం పెట్టేసాను.
“మీ అత్తయ్యని ఇక్కడికి తెచ్చెయ్. గొడవుండదు. అక్కడ కూచుని ఊరికే సంబంధాలంటూ గోల పెట్టేస్తుంది” అంది స్నేహ.
“సరేలే, ఇప్పటికే ఆవిడ కొడుకూ కోడలూ ఆవిడేదో నాకు దోచి పెట్టేస్తోందని బాధ పడి పోతున్నారు. ఇక్కడికొస్తే ఆవిడ డబ్బు కోసం, బంగారం కోసం నేను తెచ్చుకున్నా నంటారు. అసలు ఆవిడే నన్ను తల్లి లేని పిల్ల అని చాటింపు వేసింది. నిజం చెప్పేస్తే పోదా? ఎందుకో గానీ ఆవిడని నొప్పించ లేను … పెంచింది కదా నన్ను.”
“అలాగని రోజుకో సంతోష్ వచ్చి నిన్ను ఏడిపిస్తే వూరుకుంటావా ఏం ? అదేం కుదరదు ” అంది స్నేహ .
సంతోష్ మాటలకి నాకేమీ ఏడుపు రాలేదు. ఇటువంటి వాటికి నా అశ్రువులు ఎప్పుడూ స్పందించవు. చిన్నప్పుడు చాలా ఏడ్చాను. బహుశా ఈ జీవితానికి సరిపడా … తరువాత ఏడుపు ఆపుకోడానికి చాలా కష్ట పడ్డాను. ఎంతో విలువైన ఉద్వేగాలు, స్పందనలు తప్ప మరేవీ కన్నీటికి అర్హం కావని తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంచేత , “మీ విలువ నిలబెట్టుకోమని” నా ప్రియమైన కన్నీటి మిత్రులను వేడుకున్నాను. ఇపుడిప్పుడే నామాట వింటున్నాయవి. అసలు దమయంతికి ఒక మచ్చ పెట్టడానికి, దాన్ని నాకు అంటించడానికి, మామీద అసహ్యమో, అనుగ్రహమో చూపించడానికి వీళ్ళెవరు?
స్నేహని దేవుడు కేవలం నాకోసమే సృష్టించినట్లు నా క్లాస్మేట్ అయింది. తరువాత నా కలీగ్ అయింది. కలిసి ఒక అపార్ట్ మెంట్ తీసుకొనడంతో నా ఫ్రెండ్ , ఫిలాసఫర్, గైడ్ అయింది. మా అన్నయ్య తరువాత తనే ఆత్మ బంధువు నాకు. ఆమె ఒక ఝరి. నా సుదీర్ఘ మౌనాన్ని కరిగించింది. ముడుచుకు పోయిన నన్ను సాఫు చేసింది. నవ్వడం నేర్పింది. నాకు పాడడం వచ్చని గుర్తు చేసింది. పుస్తకాలూ చదవడం అలవాటు చేసింది.
స్నేహ బ్యూటీషియన్ కి బుర్ర అప్పగించి కూర్చుంది. నేను కూడా కళ్ళు మూసుకుని కూర్చున్నాను. నా మనో యవనిక మీద నలుపు తెలుపు జీవన దృశ్యాలు.
సౌందర్య వాళ్ళింట్లో సంగీతం పాఠం అయిపోయి, ఇంటికి వచ్చిన ఆ అసుర సంధ్య వేళ, ఇంకా వరండాలో దీపం వెలగడం లేదు. ముసిరీ ముసరని చీకట్లో నాన్న కోపంగా పేము కుర్చీలో కూర్చుని వున్నాడు. ఆయన చేతిలో ఒక కాగితం వుంది. అన్నయ్య స్తంబానికి ఆనుకుని నిలబడి ఏడుస్తున్నాడు. ఏమైందో అమ్మని అడుగుదామని లోపలికి వెళ్లాను. లోపల గదులన్నీ చీకటి. వంటిల్లు చీకటి.
“అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్నా? ”అంటే చెప్పలేదు. కాగితాన్ని వీలైనన్ని ముక్కలు చేసి, కుప్పపోసి అగ్గిపుల్ల వెలిగించాడు. అన్నయ్య నన్ను కౌగలించుకుని ఏడిస్తే నేనూ ఏడ్చాను. అమ్మ ఎంతకీ రాలేదు. ఎవరూ అన్నం వండ లేదు. మేము ఏడ్చీ ఏడ్చీ పడుకున్నాము. తెల్లవారే సరికి వంటింట్లో అత్తయ్య వుంది. ఆవిడంటే నాకు ఇష్టం వుండదు.
“మా అమ్మ ఎక్కడకి వెళ్ళింది ?” అడిగాను.
“ఏట్లోకి” అంది ఆవిడ .
నన్ను స్కూల్ కి వెళ్ళమని నాన్న కోప్పడ్డారు. నాన్నంటే భయం కనుక వెళ్లాను. ఇంటికి వచ్చేసరికి అమ్మ వుంటే బావుండుననుకుంటూ వెళ్లాను. అట్లా రెండు,మూడు,నాలుగు రోజలు… ఊహూ అమ్మ రాలేదు. నాకు జ్వరం వచ్చింది. అమ్మ స్పర్శ కోసం తపించాను. నిద్రలో ఏడ్చాను. మందు బిళ్ళలిచ్చిన అత్తయ్య చేతిని విసిరి కొట్టాను. పదిరోజులకి జ్వరం తగ్గింది. దువ్వించుకోక అట్ట కట్టిన తల నిండా లుకలుక లాడుతూ పేలు. బాగా చీరుకు పోయే దువ్వెన తెచ్చి అత్తయ్య బరా బరా దువ్వింది. తలంతా మంట. అత్తయ్య అమ్మ గురించి చెడ్డ మాటలన్నీ మాట్లాడుతుంది. తిడుతుంది. కర్ర పుచ్చుకుని ఆవిడ నెత్తిమీద కొట్టి వెళ్ళగొడదామనిపించింది.
“మా ఇంట్లో నుంచీ వెళ్ళిపో” అని దువ్వెన లాక్కుని ఆవిడ చేతిమీద కసికొద్దీ గీరాను. ఎర్రటి చారలలోనుంచీ నెత్తురు వచ్చింది. ఆవిడ నన్ను కొడుతుందనుకున్నాను. నాన్నతో చెప్పి కొట్టిస్తుందనుకున్నాను. కానీ ఏమీ అనలేదు. కళ్ళు తుడుచుకుంటూ నన్ను దగ్గరకు తీసుకుని, “నన్ను వెళ్లిపొమ్మంటే పోతాను. కానీ నేను వెళ్ళిపోతే ఇంట్లో ఆడ దిక్కు కోసం మీనాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చే ఆవిడ నీకిలా తల దువ్వదు. పేలు చూడదు. నువ్వు కసిరి కొట్టినా బ్రతిమలాడి మందులు వెయ్యదు. నువ్వు పసిపిల్లవి నిండా పదేళ్ళు లేవు. నీకేమీ తెలియదు. ఒకటి మాత్రం నిజం. మీ అమ్మ ఇక రాదు. మిమ్మల్ని వొదిలేసి పోయింది. మీ నాన్న రమ్మంటేనే వచ్చాను నీకోసం” అంది. అత్తయ్య కొడుకూ కోడలూ ఎక్కడో దూరంగా వుంటారు. ఆవిడ ఒకత్తే విజయవాడలో వుంటుంది. వాళ్ళతో ఆవిడకు పడదని అనేది అమ్మ.
“అమ్మ నిజంగా రానే రాదా అన్నయ్యా?” అంటే అవునన్నాడు. నాకన్నా నాలుగేళ్ళు పెద్దైనా నన్నెంతో సముదాయించేవాడు. అన్నం తినక పొతే బ్రతిమిలాడేవాడు. నెలరోజుల తరువాత బట్టలు పుస్తకాలు సర్దుకుని హైదరాబాద్ లోని ఒక హాస్టల్ కి వెళ్లి పోయాడు. నాన్న అత్తయ్య పంపించేసారు. మగపిల్లవాడు బాగా చదవాలట. ఇక్కడుంటే చదవలేడట. అప్పుడు నాకెవరూ లేరని ఎంత ఏడ్చానో!
నేను స్కూల్ నుంచీ పరిగెత్తుకుంటూ వచ్చి గంపెడాశ తో సరాసరి వంటింట్లోకి పోతాను, అమ్మ వచ్చిందేమోనని. అమ్మ రాలేదు. ఏడుపొస్తుంది. అత్తయ్య ఇచ్చిన పాలు తాగ కుండా ఏడుస్తూ వెళ్ళిపోతాను. ముందు కోప్పడుతుంది తరువాత బ్రతిమి లాడుతుంది. కళ్ళలో నీళ్ళోస్తాయి ఆవిడకు కూడా. ఆవిడని ఏడిపిస్తే నాకు బాగున్నట్లు వుంటుంది. ఆవిడే అమ్మని వెళ్ళగొట్టిందని అప్పుడప్పుడూ అనుమానం వస్తుంది. ఆవిడ కళ్ళలో నీళ్ళు చూశాక బలవంతంగా పాలు తాగి వరండాలో కూర్చుంటాను.
“సంగీతానికి పోవే” అంటుంది అత్తయ్య .
సంగీతం వద్దు. సౌందర్య వాళ్ళమ్మ మంచిది కాదు. అమ్మని గురించి అత్తయ్య లాగే మాట్లాడుతుంది. ఆవిడ చెప్పే సంగీతం నాకిష్టం లేదిప్పుడు. స్కూల్లో షెటిల్ ఆడడం మానేశాను. క్వార్టర్లీ పరీక్షల్లో అన్ని సబ్జక్ట్ లూ తప్పాను. నాన్నతో మాట్లాడ్డం తక్కువే. అయినా ఇప్పుడాయన ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. ప్రోగ్రెస్ కార్డ్ చూసిన రోజు నన్ను పిలిచాడు. కూర్చోమన్నాడు, కోప్పడకుండా. బాగా చదువుకుంటే ఎంత మంచిదో చెప్పాడు. ఎంత చదువుకుంటే అంత చదివిస్తా నన్నాడు. అమ్మని మర్చిపొమ్మన్నాడు.
నేను ఆయన చెయ్యిపట్టుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాను. ఆయనకి కూడా ఏడుపు వచ్చినట్లు వుంది. అక్కడ నుంచీ లేచి వెళ్ళిపోయాడు. అత్తయ్య నావీపు నిమిరింది మంచి నీళ్ళు ఇచ్చింది. అయినా అమ్మని ఎలా మర్చిపోతాను?
అన్నం తినేసి బయటికి పరిగెత్తే తొందరలో మూతి సరిగ్గా కడుక్కోకుండా అమ్మ పమిట చెంగు కోసం వెతుక్కుంటాను. సౌందర్య ఇంటి నుంచి తెచ్చి గేటు పక్క పెట్టిన సెంటు మల్లె మొక్కకి మొదటి గుత్తి వస్తే గంతులేస్తూ గదిలోకిపోయి అమ్మను పిలుస్తాను. స్కూల్ కి వెళ్ళే షూస్ మాసిపోతే అమ్మ పాలిష్ పెడుతుందిలే అని వొదిలేస్తాను. టీచర్ తిట్టినప్పుడు గుర్తొస్తుంది అమ్మ లేదని. అప్పుడు ఏడవకుండా వుండ డానికి చాలా కష్ట పడతాను.
అన్నయ్య అచ్చంగా నా పేరుతోనే ఒక ఉత్తరం రాశాడు. అక్కడ బాగుందన్నాడు. మంచి స్నేహితులు దొరికారన్నాడు. అమ్మకోసం ఏడుస్తూ కూర్చోకుండా బాగా చదువుకోమన్నాడు. అప్పుడప్పుడూ ఉత్తరాలు రాస్తానన్నాడు.
ఒక రోజు మర్చిపోయి అత్తయ్య పమిట కొంగుకి మూతి తుడిచాను. ఆవిడ వెనక్కి తిరిగి నా బుగ్గ మీద చిటికె వేసి నవ్వింది. ఆ వేసవిలో నాన్నకి ట్రాన్స్ ఫర్ అయింది. అడిగి చేయించుకున్నాడని అత్తయ్య చెప్పింది. అక్కడ వాళ్లకి నన్ను తల్లిలేని పిల్ల అని చెప్పింది. అంటే మా అమ్మ చనిపోయిందని అర్థం అన్న మాట, బాగా కోపం వచ్చింది నాకు.
“మా అమ్మ చచ్చిపోలేదు మళ్ళీ వస్తుంది అట్లా చెప్పావంటే ఊరుకోను అని అత్తయ్యని తిట్టాను. అత్తయ్య నవ్వి ఊరుకుంది. అత్తయ్యకి నేనంటే జాలిట. జాలిపడే వాళ్ళంటే నాకిష్టం వుండదు. కొత్త స్కూల్ పిల్లలతో కూడా నాకు స్నేహం వద్దు. వాళ్ళు కూడా జాలి పడ్డారు. నాకు నచ్చలేదు. అసలు ఎవరి స్నేహమూ వద్దు. నేను బాగా చదువుకుని క్లాస్ లో ముందు వుండాలి అనుకున్నాను. అలవాటైపోయింది అమ్మలేకుండా ఉండడం. కానీ మర్చిపోలేను కదా అమ్మని. అద్దం చూసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది. నా వంకీల జుట్టూ నా కనుబొమ్మలూ నా ఒంటి రంగూ అన్నీ అమ్మవే కదా? అసలా రోజు నేను స్కూల్ కు వెళ్ళకుండా వుంటే అమ్మ వెళ్ళిపోయేది కాదేమో! గేట్లో నిలబడి చెయ్యి ఊపిన అమ్మ.
అత్తయ్యా, నేనూ, నాన్నా, కొత్త ఊరికీ, కొత్త మనుషులకీ, కొత్త స్కూల్ కీ అలవాటు పడుతుండగా నాన్న వారం రోజులు ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళబోతూ ఒక గొలుసూ ఒక జత గాజులూ (అమ్మవి) అత్తయ్యకి ఇచ్చి నాకోసం దాచమన్నాడు. అత్తయ్య ఎందుకో దిగులుగా కనిపించింది. ఊరినుంచీ నాన్నతో పాటు ఒకావిడ కూడా వచ్చింది, పెద్ద సూట్ కేసుతో.
ఆవిడని “అమ్మ అనుకో”మన్నాడు నాన్న . “చచ్చినా అనుకోను” అని మనసులో నిర్ణయించుకున్నాను. అత్తయ్య ఒక రోజు బట్టలు సర్దుకుంది.
”ఎక్కడికత్తయ్యా” అంటే “మా ఇంటికి” అంది. నేను ఆవిడని చుట్టుకుని నేనూ వస్తా అని ఏడ్చాను.
”స్కూల్ పోతుంది వద్దు” అన్నాడు నాన్న.
అమ్మకోసం, అత్తయ్య కోసం బెంగ పడి మళ్ళీ జ్వరం తెచ్చుకున్నాను. చచ్చి పోదామనిపించిది. అత్తయ్య వచ్చి నన్ను తీసుకు పోయింది. నేను ఆవిడకి అంటుకు పోయాను. అత్తయ్య అక్కడ నన్ను స్కూల్లో చేర్చింది. అన్నం తిని చెయ్యి తుడుచుకోడానికి తువ్వాలు అందుకో బోతే పమిటకొంగు చాపింది. కంచం తీసి సింక్ లో వెయ్యబోతే “నేను లేనా?” అంది. నా తలదువ్వడానికి మెత్తని దువ్వెన కొనుక్కొచ్చింది.
వారం వారం కుంకుడు కాయలతో తలంటు పోసింది. సిన్మాకి తీసుకెళ్లింది. తన పక్కలో పడుకో బెట్టుకుంది. అయినా నేను తలకి నూనె పెట్టాక తలంటికి అందకుండా అమ్మని తిప్పించినట్లు అత్తయ్యని ఇంటి చుట్టూ పరిగెత్తించలేను. అన్నానికి రమ్మంటే ఇప్పుడే వస్తా అంటూ బయటికి పారిపోలేను. పాలు తాగిన గ్లాసు కిటికీలో పడేసి అమ్మకి ఉత్తుత్తి కోపం తెప్పించినట్లు అత్తయ్యకి తెప్పించలేను. అత్తయ్యకి కోపం వస్తే మళ్ళీ నాన్న దగ్గరికీ, “అమ్మ అనుకోమన్న ఆవిడ” దగ్గరికీ పంపిస్తుందేమో అనిపించి ఆవిడ చెప్పినట్లు వింటాను. పీడకల వచ్చినప్పుడో ఉరుములొచ్చి నప్పుడో కరెంట్ పోయినప్పుడో ఆవిడ డొక్కలో దూరాలని దగ్గరగా జరగబోయి వెనక్కి తగ్గుతాను. ఆవిడే నన్ను దగ్గరకు లాక్కుంటుంది. అమ్మ అనుకోమని నాన్న తీసుకొచ్చిన ఆవిడ గుర్తొచ్చి అత్తయ్యకి మరింత దగ్గరగా జరుగుతాను. అమ్మ స్పర్శ లేకపోయినా అత్తయ్య స్పర్శ ఫరవాలేదని అనిపిస్తుంది.
“తల్లి లేని పిల్లని ఇంత బాగా ఎవరు చూస్తారమ్మా” అనేవాళ్ళు అందరూ. నిజమే కదా అనుకునేదాన్ని అత్తయ్యకి కోపం తెప్పించకూడదని అందరూ చెప్పేవాళ్ళు. నిజమే కదా మరి. స్కూల్ కి పంపిస్తుంది. అత్తయ్య మంచిదే! అయితే మాత్రం అమ్మని ఎప్పుడూ తిడుతూ వుంటుంది. అదే నాకు నచ్చదు. ఆ మాట అనకుండా అవతలకి పోవడం నేర్చుకున్నాను.
స్కర్ట్ వెనక అంటిన నెత్తురు మరక చూసుకుని భయపడి ఇంటికి పరిగెట్టుకు వచ్చి ఏడుస్తున్నప్పుడు, నవ్వేసి ఆ మరకేమిటో చెప్పి “నువ్వింక అలా చీటికీ మాటికీ ఏడవకూడదు. నువ్విప్పుడు పెద్ద దానివి. నా బంగారు తల్లివి” అని ఓదార్చి వేడుకలు చేసి కొత్త బట్టలు కొనిచ్చినా ఆమెలో మా అమ్మ కనపడలేదు నాకు. పరవాలేదు అత్తయ్య వుంది నాకు, అనిపించిందే గాని. నాకొక తమ్ముడూ ఒక చెల్లీ అని తీసుకోచ్చారప్పుడు నాన్నా, అమ్మ అనుకోమన్న ఆవిడా. ఆవిడని అమ్మా అనీ వాళ్ళని తమ్ముడూ చెల్లీ అని నేనెప్పటికీ అనుకోను అనేసుసకున్నాను. ఆవిడ నాకు కొత్త బట్టలు తెచ్చింది. తల నిమిరింది. ఆవిడ నాకు సవతి తల్లి. సవతి తల్లులకు మేము ఇష్టం వుండం అని చాలా మంది చెప్పారు. అత్తయ్యతో సహా. అందుకని ఆవిడ నాకు కొత్త బట్టలిచ్చినా తల నిమిరినా నాకు నచ్చలేదు.
** ** **
”మరొక్క సారి మీ గొంతులతో ఆమెను పిలవండి. పిల్లల గొంతులు తల్లిని కదిలిస్తాయి. ఇలా అనండి. అమ్మా నువ్వు లేకుండా మేముండలేము. ఈ సముద్ర తరంగాలు మమ్మల్ని భయ పెడుతున్నాయని చెప్పండి” అని తల్లి కోసం మరొక ప్రయత్నం చేయిస్తున్నాడు మెర్మెన్.
“మన సాగర గర్భ సామ్రాజ్యంలో స్వర్ణ సింహాసనం మీద మహారాణిలా కూర్చుని తన వొళ్లో చిన్నదాన్ని కూర్చోబెట్టుకుని తల దువ్వింది నిన్ననే కదా… అప్పుడే కదా చర్చి గంట మోగింది” అని తలపోసుకుంటున్నాడు.
అనూరాధ టీచర్ ఏ పాఠం చెప్పినా అందులో లీనమై పోతుంది. తనే మెర్మెన్ అయినట్లు, ఆ మానవ కాంత తననే వదిలేసి వెళ్ళినట్లు గద్గద స్వరంతో చెబుతుంది. తండ్రిని పిల్లలను వదిలి వెళ్ళిన ఆమెను గురించి మెర్మెన్ అనే మాటలు “Here came a mortal, but faithless was she” నేను వింటున్నాను నా చెంపలు తడిసి పోతున్నాయి. పాఠం చివరికొచ్చింది. ఆఖరి లైను “ There dwells a loved one, but cruel is she” టీచర్ చెబుతూ వుండగానే బెల్ మోగింది. నేను పుస్తకాలు పట్టుకుని ఒక్క అంగలో బయట పడి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను.
But cruel is she అవును But cruel is she. అత్తయ్యతో వచ్చేటప్పుడు తెచ్చుకున్న అమ్మ ఫోటోను కోపంగా నేలకేసి కొట్టాను. మళ్ళీ ఆ కాగితం తీసుకెళ్ళి ల్యామినేషన్ చేయించుకొచ్చాను. మళ్ళీ పగల గొట్టే వీలు లేకుండా. కానీ దాన్ని పెట్టె అడుగున పడేశాను. బాగా ఏడ్చాను. Cruel is she …. అన్నయ్య అంత నిబ్బరంగా ఎలా వుంటాడు? నేను ఆమెకోసం ఏడ్చాను. ఆమె నా నీడ. కాసేపు పొడవుగా, కాసేపు పొట్టిగా, కాసేపు అసలే లేనట్లుగా నన్ను వెంటాడే నీడ. ఆమె నా తల్లి. నన్ను తల్లిలేని పిల్లను చేసిన తల్లి. నా బాల్యాన్ని కన్నీటి సముద్రం చేసిన తల్లి. దమయంతమ్మ ఎక్కడికి వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో కొంచెం కొంచెం అర్థం అవుతున్నప్పుడు అన్నయ్యకి వ్రాసాను.
”అమ్మకు మన మీద కన్నా ఆ వ్యక్తి మీద ఎక్కువ ప్రేమా? మనని అసలు ప్రేమించలేదా? పోనీ మనని కూడా తీసుకు పోకూడదా?” అని.
అన్నయ్య ఇలా జవాబిచ్చాడు “అమ్మ అనుకోమన్న ఆవిడని చచ్చినా అనుకోనని చెప్పావుకదా, మరి నాన్న అనుకోమన్న ఆయనని నాన్న అనుకోగలవా? ఎక్కడున్నా మన మనిషి ఒకరే కదా? మరొక ఆలోచన పెట్టుకోక బాగా చదువుకో.”
“నా కాళ్ళకి చుట్టుకుని నువ్వు ఏడ్చిన రోజు నిన్ను తీసుకు వస్తూ ఇంత కాలం వుంచుకోగలననుకోలేదు. మనిద్దరం ఇట్లా అతుక్కు పోయాం. ఇంట్లో తిరిగే ఆడపిల్ల ఇంటికి ఎంత జీవమిస్తుందో నాకర్థమైంది. నిన్ను తెచ్చినందుకు నా మాట దక్కించి ఇంతదానివైనావు. వెళ్లి మీ నాన్నకి కనపడి ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఉద్యోగంలో చేరు. వాడు నీ తండ్రి. ఆ పిల్లలకేమైనా కొనుక్కు వెళ్ళు. ఆవిడకీ మీ నాన్నకీ బట్టలు…” అని నన్ను నాన్న దగ్గరకు పంపింది అత్తయ్య.
అప్పుడడిగాను ఆయన్ని మొదటిసారీ చివరిసారీ, “అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది నాన్నా! నువ్వేమైనా సరిగ్గా చూసుకోలేదా ?ఆమె రాసిపెట్టిన ఉత్తరం ఎందుకు చించేసావు? అదుంటే మాకూ తెలిసేది కదా?”
నా వయస్సు నాకు కాస్త ధైర్యం ఇస్తే, ఆయన వయస్సు ఆయన్ని కాస్త మెత్త బరిచి నట్లుంది. చుట్టూ చూసి నన్ను అమ్మ అనుకోమన్న ఆవిడ అక్కడ లేదని ఖాయ పరచుకుని “నేను భూలోకపు మనిషినమ్మా! ఆమె ఊర్ధ్వ లోకపు మనిషి. అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్ళిపోయింది. అంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు” అన్నాడు. అది వాస్తవమో, వ్యంగ్యమో అర్ధం కాలేదు.
ఆ ఊర్ధ్వ లోకపు మనిషి ఆమెను “ఆవో హుజూర్ తుంకో సితారోం మే లే చెలూమ్” అని నక్షత్ర వీధిలోకి నడిపించుకు పోయాడా? అక్కడైనా ఆమె తను కోరుకున్న ప్రేమ పొందిందా? ఎట్లా తెలుస్తుంది నాకు?
చదువుతున్న పుస్తకంలో లీనం కాలేనప్పుడు నిద్ర నాతో చెలగాట మాడేటప్పుడు సరిగ్గా అప్పుడే అట్లాంటిక్ తీరం నుంచీ అన్నయ్య పిలుస్తాడు. నాతో ఎప్పుడు మాట్లాడాలో వాడికే తెలుసు.
“విశేషాలేమిట్రా అమ్మడూ” అన్నాడు.
“నేను దమయంతి కూతుర్నయినప్పటికీ పెద్ద వాళ్ళని కన్విన్స్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఒకానొక సంతోష్ ఫ్రం సామర్లకోట… అఫ్ కోర్స్! నా ప్రవర్తన గురించి విచారించుకొచ్చాడనుకో!” చెప్పాను.
“ఇంకేం మరి! అనుగ్రహించాడు కదా? శుభం. నీ మొహాన పెళ్లిబొట్టు తోపాటు ఒక తల్లి మచ్చ కూడా పెట్టేసి ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడు. నువ్వు జీవితాంతం అతనికి కృతజ్ఞతా బధ్దురాలివై వుంటావు. ఎప్పుడైనా నీ చదువూ నీ తెలివీ నీ వుద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరి పడ్తే ఆ తల్లి మచ్చ ఒక పేపర్ వెయిట్ లాగా పని చేస్తుంది…” నవ్వాడు.
నేను మళ్ళీ మొదటికొచ్చాను. “అమ్మ మనని ఎలా మర్చిపోయిందన్నయ్యా?” అంటూ అడిగి కాస్త తత్వ బోధ చేయించుకోడం బాగుంటుంది నాకు. నా అరిగిపోయిన ప్రశ్న, వాడి ఎప్పటి జవాబు, నిబ్బరంతో నిండిన వాడి కంఠం…
“మర్చిపోయిందని ఎందుకనుకుంటావు? మనలాగే తనూ గుర్తు చేసుకుంటూ వుండొచ్చు కదా? తన జీవితాన్ని మలచుకునే హక్కు ఆవిడకు వున్నది కదా, అమ్మడూ. మనకోసం ఆమెకి అలవి మాలిన త్యాగాలు అంటగట్ట కూడదు కదా! ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మనని వదిలి వెళ్లిందో మనకి ఎప్పటికీ తెలీదు. ఆమె చెబితే తప్ప. ఇంక వదిలేయ్. ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో.”
“మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?”
“బహుశా మన దగ్గరే వుండి వుంటే ఆమె అనుభవించి వుండవలసిన క్షోభ మాటేమిటి?”
నా దగ్గర జవాబు లేదు. ఆమె దగ్గర ఏమి జవాబు వుందో!!
(ఆంధ్ర జ్యోతి, ఆదివారం సెప్టెంబర్ 2012)
40s age kabatti ee katha naaku artham ayinda? Enduko I am moved.