తెలంగాణ పల్లెల్లోకి తొవ్వచూపిన కవిత్వం

గమ్యానికొక మార్గం ఉండడం అంటే తెలిసిన దానిని కాపాడుకోవడమే మనం ఏది చూపినా, దేన్ని పట్టుకోగలిగినా అది తెలిసిన దాని ప్రతిరూపమే అవుతుంది. మనస్సనేది ఎప్పుడూ తెలిసిన దాన్నుండి తెలిసిన దానిలోకే పయనిస్తూ ఉంటుంది. మన ఆలోచన చేసే అసలైన పని కేవలం అనుభవాన్ని వ్యక్తపరచడమే. ఆలోచన అనేది ఎప్పుడూ ప్రతి అనుభవానికి అనుగుణంగా తనను తాను రూపొందించుకుంటూ, మార్పులు చేర్పులు చేసుకుంటూ రంగులు అద్దుకుంటుంది. అలాంటి అనుభవాలెన్నో ఈ దండకడియంలో నవ్వుతూ, ఏడుస్తూ, బుజ్జగిస్తూ, కోపగిస్తూ, ప్రశ్నిస్తూ, జవాబిస్తూ ఎంతో అందంగా అంతకుమించి సహజంగా ఒదిగిపోయాయి. అమ్మా, నాయన, అక్క, అవ్వ, బువ్వ, చెట్టు దాన్ని నరికే గొడ్డలి, పండుగ, పబ్బాలు, ఊరు, ఊరిలోని బంధాలు అన్నింటిని రికార్డ్ చేసి దండగుచ్చి దండకడియంలో కూర్చోబెట్టాడు. పల్లె జీవితాన్ని అనడం కన్నా తన జీవితాన్నే కవిత్వం చేసి మనకు అందించాడు కవి తగుళ్ల గోపాల్.

ఎవరైనా ముందునుండి వస్తారు కానీ, నేను వెనుక నుండి రావాలనుకుంటున్నాను.
ఎందుకంటే ముందునుండి వస్తే త్వరగా అయిపోద్దనే భయం. అందుకే చివరి కవిత “మట్టి ఊయల” అనే కవిత చివరలో…
“ఉన్నోడికైనా లేనోడికైనా
చివరి నిద్ర మాత్రము ఒక్కటే” అనే జీవిత సత్యాన్ని చూపించాడు. ఇందులో భార్యకు పసుపుకొమ్ము అనే కొత్త అర్థాన్నిచ్చాడు. పుట్టినపుడు ఉయ్యాలలో వేసినట్లుగానే చనిపోయినపుడు మట్టిలో కలుస్తాం అన్న “మట్టిఊయల”లో ఊగుతుంటాము అని కొత్త అభివ్యక్తి కనబడుతుంది.

వెలి అనేది ఒక అనైతిక చర్య. గ్రామాల్లో కుల పెద్దలు, డబ్బున్న పెద్దోళ్ళు వారి అహంకారానికి నిదర్శనంగా ‘వెలి’ని ఇంకా కొనసాగిస్తున్నారు. “వెలిమామిడి” అనే కవితలో ఊరి పెద్దల్నే కాకుండా సమాజంలో జరిగే అవినీతిని ఎదిరించిన తీరు నీతి మాలిన లోకం పై ఆవేశపడేలా చేస్తుంది
“అయ్యా ధర్మప్రభుల్లారా
నన్ను ఉరి తీసిన మీ చేతులతోనే
ఇంకా వాడల్లో రాజ్యమేలుతున్న
ఈ ఆకలిని కూడా ఉరితీయండి”
అంటూ ఈ కవితను ముగించాడు
ఈ ముగింపులో ఇంకో ప్రారంభం కనిపించింది.
కొన్ని మొదలెట్టడం లోనే అద్భుతాలను చూపిస్తాయి.
“బతుకు తలుసుకొని
తనివితీరా ఏడ్వడానికి
ఒక వాక్యం కావాలి “
‘అడవితులసి’ కవిత ఆరంభమే ఓ కావ్యానికి సరిపడ అర్థాన్నిచ్చింది. బతకడానికి డబ్బే ప్రధానం కాదు ప్రేమలు కూడా కావాలనే విషయాన్ని జీవితంలోని అనేక దృశ్యాలను చూపిస్తూ చెబుతాడు.
“మనిషి చెట్టు వేర్లు
ఇప్పుడు భూమిలో లేవు
మాట్లాడే యంత్రాల నడుమ
అందంగా వేళ్ళాడుతున్నాయి”

పెరిగిపోతున్న టెక్నాలజీకి మనిషి ఎడిక్ట్ అవుతున్నాడనే విషయాన్ని ‘మనిషిచెట్టు’లో అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా అందంగా, చాలా సున్నితంగ చెప్పాడు.

ఎవరికైనా కథ చెప్పేటప్పుడు అనగనగా అనే మొదలెడతారు… ఇక్కడ ‘అనంగనంగా’ అని అన్నాడు. నిజంగా ఈ ఒక్క పదం ఏ నోట విన్నా అతడు మహబూబ్ నగర్ మనిషే అని ఇట్టే గుర్తుపట్టేస్తారు.
“అనంగనంగా
ఒక మనిషి ఉండేటోడు
జింక తోలు కప్పుకున్నా
మనిషిలెక్క బతికేటోడంట”
ఒకప్పుడు జంతువుల తోలు కట్టుకొని బతికినా మనిషిలా జీవించేవాడని చెబుతూ ఇప్పుడు పట్టుబట్టలను కట్టుకున్నా మృగంలా బ్రతుకుతున్న మనుషుల తీరును వ్యంగ్యంగ చెప్పడం ఈ కవితలో కనబడుతుంది.
సెవెన్ వండర్స్ లాగా ‘ ఏడంత్రాల మల్లె’ కూడా ఓ అద్భుతమే అని చెప్పొచ్చు.

“అమడాల మర్కపిల్లలు” అనే మాట ఊర్లలో యాదవుల ఇళ్లలో తరుచూ వినిపించే మాట. అమడాల అంటే జంట అనీ, మర్క పిల్లలు అంటే ఆడపిల్లలని అర్థం.
“తిప్పగ మేసిన తల్లిమేక
బియ్యం కడిగిన నీళ్ళను
ఉరుకొచ్చి గటగటా తాగుతుంటే
డొక్కలెండిన నాయిన కడుపుకూడా నింతది”
అముడాల మర్క పిల్లలు కవితలో యాదవుల జీవనవిధానమంతా కనబడుతుంది. గొర్లకు మండతేవడం, మేక పిల్లలకు పేర్లుపెట్టుకొని పిలవడం మొదలైన ఎన్నో విషయాలను మళ్ళీ ఙ్ఞాపకంలోకి తెస్తాడు. బహుజన సంస్క్రతి గొప్పతనం అర్థమౌతుంది. మేకలు, గొర్లు నీళ్ళు తాగుతుంటే మన కడుపు నిండినట్లుగా సంతృప్తిపడే గొప్ప మానవీయగుణాన్ని పరిచయం చేస్తాడు కవి.
కాలం చేసిన గాయాలను తడమడం, మిత్రులు కోల్పోయిన వాటిని కవిత్వీకరించడం, ఒక కవిని చూసినా, రవిని చూసినా స్పందించడం ఈ కవికి అలవాటు.

ఇన్ని కవితల గురించి చెప్పుకున్నాక, పుస్తకానికి పెట్టిన దండకడియం గురించి చెప్పుకోకపోతే ఎలా?
“చెవిపోగును వీడని
సగం కాల్చిన కానుగాకు సుట్ట
బతుకుకు కొప్పెరవెట్టినట్టు గొంగడి
నిలువెడు గుంజంత మనిషని
నీ బొమ్మను ఎవరైనా మాటల్తో గీస్తుంటే
ఎట్లుంటడో ఒక్కసారైనా చూడాల్నని
పానమంతా తండ్లాడుతది”

ఇప్పుడు కుర్రకారు చెవికి పోగు పెడితే ఈడు పట్నం మనిషి, ఫ్యాషన్ అనుకుంటున్నాం కానీ, ఒకప్పుడు గీ ఫ్యాషన్ పల్లె నే అంటిపెట్టుకుని ఉండేది. అప్పట్లో చెవికి పోగు, నెత్తికి రుమాలు, చేతికి కడియం పల్లెటూరి మనిషిని పట్టించే ఆనవాళ్లు ఇవే…

“దండకడియం “లో మేకల కాసే తాత వాటికి పురుడు పోసే విధానంలో ప్రకృతికే పోశావని చెప్పి అబ్బురపరిచాడు.
గద భుజానేసుకుంటే భీముడని, బాణం పట్టుకుంటే రాముడని, మురళీ ధరిస్తే కృష్ణుడనీ చేసే పనిని పట్టి మనిషి అవతారం ఉండేదని చదివాము. కానీ, పల్లెటూర్లలో చాలామంది వారు చేసేపనికి సంబంధించిన పనిముట్టును భుజానేసుకుని తిరగడం అక్కడక్కడా చూస్తుంటాం. అదే వాళ్ళకు బ్రతుకుదెరువు. అలాగే ఇక్కడ కవి తండ్రి కట్టెలుగొట్టి కుటుంబాన్ని పోషించాడనే విషయం “నాన్నగొడ్డలి”లో మనకు తెలుస్తుంది.
“అందరూ నాన్న ఫొటోకు దండం పెడ్తుంటే
నేను మాత్రం గొడ్డలి పక్కన కూర్చున్న
నాన్న రూపం గొడ్డలిలో కన్పించేసరికి”

నాన్నగొడ్డలి కవితలో ఏడ్పించే వాక్యాలివి.
ఇలా చెప్పుకుంటూ పోతే
ప్రతి కవితలో కవి తన అనుభవాన్ని రంగరించి అందించాడు.
గల్లగురిగిలో చిల్లర పైసల ఆనందం,
నాయనమ్మ లేని దుఃఖం,
వానలో ఎండడం.. ఎండలో తడవడం,
గుంతగిన్నె తీర్చిన ఆకలి, చియ్యకూరల పాట, జొన్నరొట్టెల రుచి, ఎర్రమన్నుతట్ట
గంజి ఒంపడం, కడుపు నింపడం
ఒకటేమిటి ప్రతి పదాన్ని కవిత్వం చేసాడు. కవితలో ఏం చెప్పినా ఎంత చెప్పినా ముగింపు లోని గాఢత అనేది ఆ కవిత ప్రయోజనాన్ని తెలియజేస్తుంది
“అమ్మదీపం”కవితలో
“వత్తిచేసి నూనెబోసి
బతుకును వెలగించినందుకు కొడుకు
అమ్మ దీపాన్ని గాలికి పెట్టిపోయిండు “
మచ్చిక చేసుకుంటే జంతువులే చచ్చేంత ప్రేమను చూపిస్తాయి.
కనీ పెంచి ప్రయోజకుడిని చేస్తే ఆ కొడుకు తల్లిని వదిలి పోయాడు… అని ప్రతి కొడుక్కి తగిలేలా చక్కని ముగింపు ఇచ్చాడు.
దండ కడియం రాసిన కవికి ఇది రెండో పుస్తకమే అయినా తెలంగాణ మాండలికాలతో అలతి అలతి పద ప్రయోగాలు చేస్తూ అత్యంత సహజంగా మట్టి మనుషులకు సైతం అర్థమయ్యేలా అందంగా కవితలల్లాడు. ఇది చదివినపుడు మళ్లీ మనం ఊర్లలో తిరిగిన అనుభూతి కలుగుతుంది. తెలంగాణపల్లెల్లోకి తొవ్వ చూపుతుంది దండ కడియం. ఇలాగే మట్టి పరిమళాన్ని ఒడిసిపట్టి మరింత సాహిత్యాన్ని అందించాలని యువకవి తగుళ్ళ గోపాల్ కి మనసారా అభినందనలు.

రచయిత, సినీ డైరెక్టర్. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో ఎం. ఏ, ఎం. ఫిల్ చేసారు. సినిమా రచయితగా ఏడు సినిమాలకు కథ, మాటలు అందించారు. చెంబు చిన సత్యం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల అనాహత అనే కవితాసంపుటి తెచ్చారు.

2 thoughts on “తెలంగాణ పల్లెల్లోకి తొవ్వచూపిన కవిత్వం

  1. చక్కని సమీక్ష..గోపాల్ ని అతని కవిత్వాన్ని పట్టిచ్చింది.అభినందనలు..

Leave a Reply