తేనెకురిసే నాలుక

తేరిపార చూసే నా కళ్ళపై
మాయ తరంగాలు చిమ్మి
నన్ను గుడ్డివాడిని చేశావు
నా ఆశబోతు కడుపుకి
ఆకలి ముద్దలు కొన్ని విదిల్చి
నన్ను బిచ్చగాన్ని చేశావు
రిక్కించి వినే నా చెవులను
పచ్చి అబద్ధాల ప్రచారంతో హోరెత్తించి
నన్ను బధిరుణ్ణి చేశావు
నువ్వు కూడా మాలో ఒకడివేనని
ఈ నేల కోసమే నీ జీవితమని
నీ తేనెకురిసే నాలుకతో
సమ్మోహితున్ని చేస్తున్నపుడు
నా మెదడు కణాలన్నీ
నిర్నిద్రంగా దేశభక్తి జెండా ఊపుతూ
సుప్త చేతనావస్థలోకి జారుకున్నాయి
నీవు రొమ్ము విరుచుకుని
గుండె చీల్చుకుని
“పెద్ద బొమ్మ” చూపిస్తుంటే
నా చత్వారపు చూపులతో
వీరహనుమ విశ్వరూపమే
నీలో చూశాను
కానీ బొమ్మ వెనుక బొరుసుని
పసిగట్టలేకపోయాను
…బహుశా నాలాగే మరెందరో…!?
ఎవ్వరూ నోరుమెదపరేంటి?
నిజమైన దేశభక్తులెవరూ
పెదవి విప్పకుండా
నీ దేశభక్తి పేటెంట్తోనే
కట్టుబాట్లు కట్టుదిట్టం చేశావు కదా!
మహా దేశభక్తుడిగా నీ భారీ ఇమేజ్
ఓ గ్లోబల్ కటౌట్!
అంతెత్తు గ్లోకల్ విగ్రహాలను దాటి
రహస్య కోణాల్లోకి చూపు సారించడం
ఏ వేగులకైనా సాధ్యమా?
నీ ప్రజా ద్రోహానికి ఇక ఎదురులేదు
దేశాన్ని ఏక మొత్తంగా అమ్మేసుకో!
ప్రైవేటు ఆకాశాన్ని మా కొంపల్లో దూర్చి
మేం పోగుచేసుకున్న
చెమట చందమామల్ని మింగేసి
కారుమబ్బులతో మా వెన్నెల కోనల్ని కమ్మేసుకో!
ప్రతిరోజూ పతాక శీర్షికల్లో
దేశభక్తి జీవనదిలా ఉప్పొంగుతుండాలి
ఆ ప్రవాహంలో మీ మిత్రుల గూటికి
సంపద తరలింపు చల్లగా సాగిపోవాలి
తడవకొక తురుపుముక్క లాంటి
కొత్త ఆయుధాన్ని ప్రయోగించు
తూటాలాంటి నీ మాటని
చరిత్ర సమాదిపైకి వాటంగా ఎక్కుపెట్టు
గాడాంధకారాన్ని స్వేచ్ఛకు
రక్షణ కవచంగా పెట్టు
స్నిఫర్ డాగ్ బృందానికి ఉస్కో అని వేలుచూపి
దేశమంతా స్వైరవిహారం చేయించు
నాలుగు దిక్కుల్ని నీ అనుయాయులకు అమ్మేసి
దిక్కూ దివాణం లేనోళ్ళంతా
దేశభక్తితో చావండని పిలుపునివ్వు
తెరిచిన కళ్ళన్నీ వెలుగును దేవుకోవాలి
మూసిన కళ్ళన్నీ చీకటిలోనే ఈదుకోవాలి
నీ ఆత్రం చూసి
గిరాకీలేని వ్యాపారాలన్నీ గింజుకోవాలి
ఈ సారి పన్ను వడ్డింపుల్లో
బిచ్చమెత్తుకునేవాడి బొచ్చుగిన్నె కూడా గుంజుకోవాలి!

కవి, రచయిత. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో బడగాం అనే మారుమూల పల్లె వ్యవసాయ కుటుంబంలో. చదువు: M.A.(English), M.A.(Telugu), B.Sc., B.Ed. వృత్తి: ఉపాధ్యాయ వృత్తి. రచనలు: 1) వలస పక్షుల విడిది - తేలినీలాపురం (2005) 2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా...(నానీ సంపుటి) (2010). ఇంకా వివిధ పత్రికల్లో వందకు పైగా వచన కవితలు, కొన్ని సాహితీ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో అనుబంధం.

Leave a Reply