నేను ఆర్ఫియస్ (రాత్రి అంధకార దేవత) వేణువును. జ్వరపడిన ప్రపంచానికి నేను నిద్ర తెప్పిస్తాను. ఆయాసపడుతున్న నరక దేవాలయం భయంతో మరణించేలా చేస్తాను. నేను భూమికీ, ఆకాశానికీ విప్లవ సందేశం తెస్తాను. నేను సదా విద్రోహిని. నేను ఈ ప్రపంచానికతీతంగా శిరసు ఎత్తుతాను. చాల ఉన్నతంగా, ఒక్కణ్నే, స్థిరంగా.
- కాజీ నజ్రుల్ ఇస్లాం – ‘విద్రోహి’ 1922
ఓ, తిరుగుబాటు యువతా, జైలు ఇనుపద్వారాలు బద్దలుకొట్టండి. విధ్వంస దినం భేరీ మోగించండి. ప్రాచీ ద్వారం మీద విధ్వంసపతాక ఎగరేయండి. ఎవరు శాసకుడో, ఎవరు బానిసలో ఎవరు నిర్ణయిస్తారు. మీ శిక్షను ఎవరు నిర్ణయిస్తారు. జైలు చీకట్ల కటకటాలకు నిప్పంటించండి. స్వేచ్ఛా ఉత్సవం జరుపుకోండి.
- కాజీ నజ్రుల్ ఇస్లాం – ‘జైలు ద్వారాలు బద్దలు కొట్టండి’
భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో రెండవ ఐదుగురు 28 ఆగస్టు 2018న అరెస్టయినపుడు రోమిలా థాపర్తో పాటు ఐదుగురు ప్రముఖులు, ఈ కేసు శోధించడానికి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) వేయాలని, అందాకా అరెస్టయినవారికి బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను 2-1 మెజారిటీతో నిరాకరిస్తూ మా హౌజ్ అరెస్టుకు మరేదయినా సముచితమైన న్యాయావకాశాలు వెతుక్కొమ్మని రెండునెలల వ్యవధి యిచ్చినపుడు, ‘ఈ రెండు నెలలు ఇంటినుంచి కదలలేరు కదా మాకోసం ఏదైనా పుస్తకం రాయండి’ అని ఫోన్ మీద కోరింది గీతా (రామస్వామి – హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తరఫున.) అపుడామె నాలుగు ప్రత్యామ్నాయాలు సూచించింది. వాటిలో రెండే స్పష్టంగా గుర్తున్నాయి. సుభాష్ చంద్రబోస్ పై లేదా కాజీ నజ్రుల్ ఇస్లాంపై. నేను వెంటనే కాజీ నజ్రుల్ ఇస్లాం పై రాస్తానని ఒప్పుకున్నాను. పుస్తకంలో సగం ఆయన జీవితం – సాహిత్యం పై, మరో సగం ఆయన కవితల అనువాదాలు చేయమన్నది. ఆ తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె నాతో వేణు ద్వారానే సంభాషిస్తున్నది. వేణు ద్వారానే స్పైరల్రౌండు పుస్తకాలు, ఇంచుమించు వెయ్యిపేజీలు పంపింది. వేణు తన దగ్గర ఉన్న నజ్రుల్ రచనలు, నజ్రుల్పై రచనలు ఇచ్చాడు. ఆమె పంపినవాటిలో మొదటి మూడు నజ్రుల్ ఇంగ్లిషు కవితానువాదాలే. నాలుగవది మాత్రం పీటర్ కస్టర్స్ (1949-2015) తన స్వస్థలం నెదర్లాండ్లోని లేడెన్లో నజ్రుల్ ఇస్లాం జీవిత, సాహిత్య అధ్యయనం కోసం తానే నెలకొల్పుకున్న అధ్యయన కేంద్రం నుంచి వెలువడింది. అందులో ఇరవై కవితలు, కొన్ని వ్యాసాలు, కథలతో పాటు పీటర్ కస్టర్స్ బాంగ్లాదేశ్లో నజ్రుల్ ఇస్లాం గురించి చేసిన ప్రసంగాలు మొదలైనవి ఉన్నాయి.
అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన రెండునెలలతో పాటు, అప్పటికింకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యిచ్చిన మూడువారాలు కూడ హౌజ్ అరెస్టులో ఉన్నాను కానీ ‘జైలు ద్వారాలు బద్దలు కొట్టండి’ కవిత తప్ప అప్పటికి ఏ అనువాదం ప్రారంభించలేదు.
ఒక విద్రోహి కవిగా నజ్రుల్ ఇస్లాం గురించి ఎప్పుడు మొదటిసారి విన్నానో చెప్పలేను గానీ నక్సల్బరీతో పాటే అప్పటికి తూర్పు పాకిస్తాన్ గా ఉన్న బాంగ్లాలో కూడ ఆ ప్రభావంతో ఏర్పడిన ఎం.ఎల్. పార్టీ గురించి విన్నాను. ఆ పార్టీ బాంగ్లా విప్లవ సంప్రదాయానికి దోహదం చేసిన తొలి విప్లవ తత్వవేత్తలుగా మౌలానా భషానీ, కాజీ నజ్రుల్ ఇస్లాంలను గుర్తించడం విన్నాను.
1971లో బాంగ్లా జాతీయోద్యమాన్ని సృజన, విరసం తొలిదశలో (ముక్తిఫౌజ్ ప్రవేశం దాకా) సమర్థించినపుడు సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘నజ్రుల్ ఇస్లాం జీవితం-సాహిత్యం’ ఆధారంగా సృజనలో పరిచయం ప్రచురించాం. ఎన్.కె. సంపాదకత్వంలో వెలువడిన ‘బాంగ్లాదేశ్ ‘లో ‘మార్చింగ్ గీతం’ కవితానువాదం ప్రచురించాం.
నజ్రుల్ ఇస్లాం పై రాయడానికి ఒప్పుకోవడానికి ఆ నేపథ్యం ఉంది.
పూణే ఎరవాడ జైలుకు పోయాక కవిత్వానువాదం మొదలుపెట్టి, కరదీపికగా ఆమె ఇచ్చిన పీటర్ కస్టర్స్ నజ్రుల్పై ప్రసంగవ్యాసాలు చదివాక – కమ్యూనిస్టు విప్లవకారుని నుంచి, విప్లవధార అంతస్త్రోతస్వినిగానే ఉంటూ 1921 నుంచి 41 దాకా ఈ దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం పొందాలంటే కార్మికవర్గ రాజకీయ దృక్పథంతో పాటు హిందూ ముస్లిం మత సామరస్యం లక్ష్యాన్ని తీవ్రమైన వ్యగ్రతతో కాజీ నజ్రుల్ ఇస్లాం ఎంచుకున్నాడని అర్థమైంది.
ఆయనకన్నా ముందు ఈ అవసరాన్ని గాంధీ గుర్తించినా ఆయనకు కార్మిక వర్గదృక్పథం లేదు. ఆయన చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంతో పాటు ప్రపంచ రాజకీయాల్లో వచ్చిన ఒక కుదుపు వల్ల ‘ఖిలాఫత్’ ఉద్యమానికి మద్దతివ్వడంతో భారత స్వాతంత్రోద్యమంలో హిందూ ముస్లింలు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కాని గాంధీకి అప్పటికి సంపూర్ణ స్వాతంత్య్రం లక్ష్యంగా లేకపోవడం, సహాయ నిరాకరణకు అహింస అనే ఒక పరిమితి ఉండడం రెండూ నజ్రుల్ ఇస్లాంకు అసంతృప్తినే కలిగించాయి. 1926లో కృష్ణగర్లో గాంధీ పాల్గొన్న జాతీయ కాంగ్రెస్ సభలో నజ్రుల్ ‘కంధహారీ హెూషియార్’ (కర్ణధారీ జాగ్రత్త) కవిత ద్వారా అసంతృప్తినే చూపాడు.
నజ్రుల్ దేశస్వాతంత్ర్యం కోసం కలగని అందుకు సైనిక శిక్షణ పొందడానికి 18 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరి కరాచీ పోయాడు. అక్కడ కవిగా మారి, 1917 రష్యాలో బోల్షివిక్ విప్లవ ప్రభావంతో ఉద్యోగం వదిలి, ముజఫర్ అలీ ఆహ్వానంతో కలకత్తా వచ్చి అక్కడే పూర్తికాలం సాహిత్య రాజకీయోద్యమానికి అంకితమయ్యాడు. అప్పటికింకా పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీగానే పనిచేస్తున్న కమ్యూనిస్టుపార్టీలో సభ్యుడై ఆ పార్టీ కోసం ముజఫర్ అలీ స్థాపించిన ‘లంగల్’ పత్రికకు సంపాదకుడయ్యాడు. ఇప్పుడు అస్సాంలోని బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలు ఈసడింపుగా పిలిచే ‘మియా’ కవిత్వోద్యమం ఈ లంగల్(నాగలి)ని, లుంగీని తమ అస్తిత్వ చిహ్నాలుగా ఎంచుకుంది.
ఇంక ‘విద్రోహి’ కవితతో, ‘ధూమకేతు’ పత్రికతో నజ్రుల్ బాంగ్లా సాహిత్యాకాశంలోనే కాదు, రాజకీయ భూమికలో కూడ ఒక రాజీలేని ‘విద్రోహి’ సంప్రదాయానికి ప్రతీక అయ్యాడు.
నజ్రుల్ 5,6 ఏళ్ల వయసప్పుడే బ్రిటిష్పాలకులు 1905 బాంగ్లా విభజనకు పూనుకున్నారు. ఈ దేశప్రజలను, ప్రజల ఆయువుపట్టయిన రైతాంగాన్ని హిందూ ముస్లింలుగా చీల్చే కుట్రలో 1857లో చేసిన ఒక ప్రయత్నమే మళ్లీ బాంగ్లాలో చేసారు. మొదటి ప్రయత్నంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బహదూర్షి నాయకత్వంలో ఏర్పడిన విశాల ఐక్యసంఘటనను ఓడించి సంస్థానాలను, ఫ్యూడల్ శక్తులను తనకు తాబేదార్లుగా మార్చుకున్నారు గానీ, బ్రిటిషిండియా ఏర్పడి బాంగ్లా రైతాంగాన్ని హిందూ ముస్లింలుగా చీల్చాలన్న కుట్ర మాత్రం విఫలమైంది. దేశవిభజనలో అది సాధ్యమైనా, బాంగ్లా జాతీయభావన తూర్పు పాకిస్తాన్ ఏర్పడినా అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నది. అందుకు ముఖ్యకారణం ‘యుగంతర్’ కాలం నుంచి బాంగ్లాలో ఉన్న విప్లవ సంప్రదాయమే. అది తెభాగా, చిటగాంగ్ పోరాటాల్లో నిప్పురవ్వలు ఎగజిమ్మి నాయకత్వ వైఫల్యంతో అణగారిపోయినా మళ్లీ నక్సల్బరీతో స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. అందుకే తెలంగాణలో 1948లో సైనికజోక్యం వలె బాంగ్లాదేశ్ జాతివిముక్తి పోరాటాన్ని ‘ముక్తిఫౌజ్’ ప్రధానస్రవంతి (బూర్జువా) రాజకీయాల్లోకి మళ్లించింది పొరుగుదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ. అయితే ఈ కాలమంతా రవీంద్రుని ‘సోనార్ బంగ్లా’ వలెనే, నజ్రుల్ ఇస్లాం ‘విద్రోహి’ భావజాలం బాంగ్లా సాహిత్య, సాంస్కృతిక రంగాలపై తమ ప్రభావాన్ని కొనసాగించాయి. భౌతికంగా నజ్రుల్ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికన్నా ముందే మాట పడిపోయి, మతిస్థిమితం కోల్పోయిన స్థితిలోకి వెళ్లినప్పటికీ. ఈ కారణాల వలన నేను పీటర్ కస్టర్స్ నజ్రుల్ అధ్యయనాన్ని నా అనువాదానికి ప్రాతిపదిక చేసుకున్నాను. అందుకు మరికొన్ని ప్రత్యక్ష కారణాలు ఉన్నాయి.
1973లో పీటర్ కస్టర్స్ మొదటిసారి బాంగ్లాదేశ్లో రైతాంగ విప్లవ పోరాటాన్ని అధ్యయనం చేయడానికి వచ్చాడు. అప్పటికి ఇండియా, బంగ్లాదేశ్లలో రెండుచోట్లా నక్సల్బరీ ఉద్యమం సెట్బ్యాకు గురయినప్పటికీ ఆ ప్రభావంతో పునర్నిర్మాణమవుతూ, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అట్లా ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమంతో కూడ కనెక్ట్ అయి నాకు బూర్గుల ప్రదీప్ ద్వారా పరిచయమయ్యాడు. ఆరోజుల్లో ఆయన రాసిన తెభాగా పోరాటంలో మహిళల పాత్ర, ఇంగ్లిషు గ్రంథం ఎందరో విప్లవాభిమానులకు పఠనీయ గ్రంథమైంది. విప్లవోద్యమంతో సన్నిహితంగా ఉన్న సుమతి అనే హైదరాబాదీ మహిళ సాహచర్యాన్ని ఎంచుకోవడం వల్ల కూడ – ఆయన మా తరం విప్లవాభిమానుల స్నేహాన్ని చూరగొన్నాడు.
మళ్లీ ఆయన 2013లో బాంగ్లాదేశ్కు నజ్రుల్ ఇస్లాం గురించి మాట్లాడడానికి వచ్చినపుడు హైదరాబాదు కూడ వచ్చి నన్ను రెండవసారి, అదే ఆఖరిసారి కలిసాడు. అప్పటికాయన పూర్తిగా సూఫీ భావజాలం, సంస్కృతి, సాహిత్యం పై అధ్యయనం చేస్తున్నాడు. నజ్రుల్ ఇస్లాం మత సామరస్యం కోసం చేసిన కృషిని పీటర్ కస్టర్స్ సూఫీ దృక్పథంతో చూస్తూనే ఆయనలోని కార్మికవర్గ వర్గపోరాట మౌలిక దృక్పథాన్ని కూడ ఎత్తిపట్టాడు.
ఎరవాడ– తలోజా జైళ్లలోనే కాదు, నన్ను ఇప్పటికీ ఇంకా నజ్రుల్ ఇస్లాం వదలలేదు. లేదా అట్లా అప్పుడు హిందూ ముస్లిం ఘర్షణలు అనుకున్నవి, ఇపుడు ముస్లింలను ద్వేషభావంతో ఇతరులుగా చూసే బ్రాహ్మణీయ ఫాసిజం పాలకవర్గాల ఆచరణ అనుకోవడం మారింది.
అయితే హిందువులలో, ముస్లింల (మైనారిటీల)లో మతవిశ్వాసులైన సాధారణప్రజలు ఆమోదించి ఆశ్వాసాన్ని పొందే ఉత్తేజకరమైన, అనితరసాధ్యమైన మతసామరస్య భావాలు నజ్రుల్ కవిత్వం నిండా కనిపిస్తాయి. అంతకన్నా మించి, మతగ్రంథాలు, మతపీఠాధిపతుల (రెండువైపులా) ఆధిపత్యంతో పాటు అన్ని ఆధిపత్యాలను ధిక్కరించే పోరాటస్ఫూర్తిని ఆయన కవిత్వం కలిగిస్తుంది.
కరోనా కాలంలో నేను అనారోగ్యంతో నానావటి ఆసుపత్రిలో చేరినపుడు నేను తలోజా జైల్లో చేసిన అనువాదాలు అన్నీ జైల్లోనే ఉండిపోయాయి. అవి బయటకి రావడానికి కూడ చాలకాలం పట్టింది.
పూణే కోర్టునుంచే బయటికి పంపినవాటిలో కూడ 37 కవితానువాదాలు ఉన్న నోట్బుక్ చాలకాలం దాకా దొరుకలేదు.
బయటికి వచ్చాక ఇవన్నీ సమకూర్చుకోవడానికి చాలకాలం పట్టింది. 2022లో మళ్లీ ఒక నెలంతా జర్నలిస్టు మిత్రుడు రవి లేఖకుడుగా దాదాపు 80 కవితలు అనువదించాను. వాటిలో ఇపుడు కొన్ని ఈ సంకలనంలో చేరాయి. ఎరవాడ జైల్లో ఖురాన్ సంబంధమైన, ఇస్లామిక్, అరబిక్ సంప్రదాయాలకు చెందిన ప్రతీకలను వివరించి అర్థం చెప్పి సహకరించిన ఫైజల్, ఆసిఫ్ు బొంబాయి వరుస బాంబుపేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడి వాళ్లతో పాటు మేము ఫాసీఘాట్లో ఉండడం వల్ల సాధ్యమైంది. వాళ్లవి ఏ విశ్వాసాలయినా కావచ్చు కానీ వాళ్లు ఈ కేసులో బేగునా (నిర్దోషులు) అనే విషయం ముస్లిం సమాజానికి మాత్రమే కాదు, ప్రజాస్వామిక వాదులందరికీ తెలుసు. వారికి నా కృతజ్ఞతలు చేరే అవకాశం కూడ లేదు.
మత ప్రతీకల గురించి నా సందేహం రోనా దగ్గర వెలిబుచ్చితే ‘ఆయన నిలిచేది విద్రోహి(కవి)గా కదా’ అన్నాడు. ఇంక ఇంగ్లిషు అర్థాలు, అన్వయాలు మాత్రమే కాదు ఈ అనువాదకాలమంతా నాతో ఉండి నన్ను కాపాడిన వర్నన్, అరుణ్, ఆనంద్, స్టాన్స్వామి (వీరిలో మొదటిముగ్గురు నేను వదిలివచ్చిన నజ్రుల్ ఇస్లాం అనువాదాలు కూడ కాపాడారు) నా నుంచి కృతజ్ఞతలు ఆశించేవాళ్లు కాదు. అటువంటి సహాయమే బయట చేసిన నా కుటుంబసభ్యులు, విరసం రాము ఈ పుస్తకం విషయంలోనూ వెతకడం నుంచి, ఒక కొలిక్కి తేవడం వరకు చాల ఇబ్బందులు పడ్డారు. గీత ప్రతిపాదించినప్పటంత ఉత్సాహంతోనే ఇప్పుడీ పుస్తకాన్ని తీర్చిదిద్దడంలో ఒక భావోద్వేగానికి లోనవుతున్నది.
చివరికొక ఆవేదన వంటి ఫిర్యాదుతో నజ్రుల్ ఇస్లాంకు మన దేశ స్వాతంత్రోద్యమంలో దక్కవలసిన స్థానం గురించి ప్రస్తావిస్తాను. మతసామరస్యం కోసం ఆయన సాహిత్యం, సంగీతం, రాజకీయాల్లో చేసిన కృషి రవీంద్రుడికీ, గాంధీకీ తీసిపోనిది. మతసామరస్యం కోసం ఆయన ద్వేషం స్థానంలో ప్రేమను నిలపాలని ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఈ ప్రేమతత్వాన్ని స్థాపించడంలో రూమీ, హఫీజ్ ల నుంచి, కశ్మీరీ సూఫీ కవిత్వం నుంచి తనకన్నా ముందున్న బాంగ్లా సూఫీ కవుల దాకా అందరినీ ఆకళింపు చేసుకొని బాంగ్లా భక్తి ఉద్యమంలోని సారాన్నంతా గ్రహించి చివరకు వేణువు విరిగిపోయినా పాట ఆగకూడదనే సందేశంతో ఒక ప్రేమభావనతో తన వ్యక్తినే రద్దుచేసుకున్నాడు.
రాశిపరంగా చూసినా ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. ఆరువేల పాటలు రాసాడు. ఎచ్ఎంవి (హిజ్ మాస్టర్స్ వాయిస్) అనే సుప్రసిద్ధ గ్రామఫోన్ కంపెనీ ఆయన పాటలతో, సంగీతంతో దేశమంతా ప్రచారాన్ని, ప్రసిద్ధిని పొందింది. కాని ఇవ్వాళ మనకు రవీంద్ర సంగీతం కలకత్తా మెట్రో స్టేషన్లలో కూడ వినొస్తుంది కాని నజ్రుల్ ఇస్లాం ఎక్కడా వినిపించడు. మతసామరస్యం కోసం ఉన్మాదస్థితికి వెళ్లేంత వ్యగ్రతతో అన్ని సరిహద్దులను చెరిపేసేంత తీవ్రమైన సాంస్కృతిక కృషి చేసిన ఆయన గురించి మన మూడువేల సంవత్సరాల డిసెంటు సంప్రదాయం గురించి రాసిన అశోక్ బాజపేయి గ్రంథంలో చోటులేదు. రెండవ ప్రపంచ యుద్ధకాలపు చారిత్రక నవల ఉణుదుర్తి సుధాకర్ చెదిరిన పాదముద్రలు (2024 జూన్)లో మాత్రం కలకత్తా మహానగరంలో రవీంద్ర సంగీత్తో పాటు నజ్రల్ గీతి పాడేవారి ప్రస్తావన ఉంది. బాంగ్లా సాహిత్యం, సంస్కృతి మీద చాల పట్టు ఉన్న అమర్త్యసేన్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్లో గ్రంథమంతా రవీంద్రుని భావజాల ప్రభావాన్ని ప్రస్తావిస్తాడు గాని ఎక్కడా నజ్రుల్ ఇస్లాం పేరయినా పేర్కొన్నాడు కాదు.
ఆశ్చర్యంగా ఇవ్వాళ గోపాలకృష్ణ గాంధీ ఆగస్టు 15ను ఇండియా – పాకిస్థాన్ – పాకిస్తాన్లో తూర్పు పాకిస్తాన్, తూర్పు బాంగ్లాలను 1947, 71, మళ్లీ ఇప్పుడు బాంగ్లాదేశ్లో విద్యార్థుల ప్రజాస్వామిక ఉద్యమంల సందర్భంగా ప్రస్తావిస్తూ, ఈ ఉద్యమాల్లో ముస్లింలు నిర్వహించిన మత సామరస్య కృషి, దృష్టిని ప్రస్తావించాడు. అందులో మాత్రమే నజ్రుల్ ఇస్లాంకు స్థానమివ్వడం వల్ల, ఇంకెన్నో విషయాల్లో నాకు ఏకీభావం లేని ఈ వ్యాసాన్ని పేర్కొనాలనిపించింది. ‘ఆఫ్ ఫ్రీడమ్స్ గెయిన్డ్, లాస్ట్ అండ్ గెయిన్డ్ అగెయిన్’ లో ద్విజాతి సిద్ధాంతంలోనే ద్వేషానికి బీజాలు ఉన్నాయని చెప్తూ, ఇవి అవిభక్త ఇండియాలోనే నాటబడి దేశవిభజన కాలంలో ఎట్లా వ్యక్తమయ్యాయో ఆ చరిత్రలోకి వెళ్లి మొదటినుంచీ ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన హిందువులుగా పుట్టిన ప్రముఖ నాయకులు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్చంద్రబోస్ లని, ముస్లింలుగా పుట్టినవాళ్లలో ఖాన్ అబ్దుల్గఫార్ ఖాన్, ఎం.ఎ.అన్సారీ, మౌలానా అబుల్కలామ్ ఆజాద్ పాటు కాజీ నజ్రుల్ ఇస్లాం అని పేర్కొంటాడు. (హిందుస్తాన్ టైమ్స – ఆగస్ట్ 15, 2024)
తెలుగులో నజ్రుల్ ఇస్లాంను పరిచయం చేసిన మొదటిపుస్తకం ఇదే కాదని ఇటీవలనే రెండవ ముద్రణగా వెలువడిన ఆవంత్స సోమసుందర్ ‘కాజీ నజ్రుల్ ఇస్లాం’ అనే చిరుపొత్తం (నూరుపేజీలు చిన్నసైజులో) ద్వారా తెలిసింది. దాని ప్రథమ ముద్రణ 2001లోనే నజ్రుల్ ఇస్లాం శతజయంతి సందర్భంగా వెలువడిందట. బాంగ్లాలోనే నజ్రుల్ ఇస్లాంను చదివి ‘ఆ మహత్తర విప్లవకవి నజ్రుల్ ఇస్లాంను జీవితకాలమంతా స్తుతిస్తూ వారి కవితలను వినిపిస్తూ, ఆయన రాసిన కవితల్లాంటివే రాయాలని తలపోస్తూ జీవించిన మహనీయుడు పురిపండా అప్పలస్వామి’ అంటాడు. ఆ విప్లవ కవిత్వపు ఉప్పును ఆయన శ్రీశ్రీ, నారాయణ బాబు, రోణంకి ప్రభృతులకు అందించాడని, అది రహస్యమేమీ కాదని నారాయణబాబు నజ్రుల్ ప్రభావాన్ని బహిరంగంగానే ప్రకటించుకున్నాడని రాసాడు. ఆ విధంగా తెలుగు ఆధునిక కవిత్వానికి నజ్రుల్ బంధువయ్యాడంటాడు.
సాహిత్య విద్యార్ధిగా నాకీ విషయం తెలియకపోవడం లోపమే. అయితే శరత్ సాహిత్యం మొదట నేరుగా బాంగ్లా నుంచే తెలుగులోకి వచ్చి క్రమంగా శరత్ తెలుగువాడే అనుకునేంత ప్రభావం వేసినట్లు, నజ్రుల్ శబ్దసౌందర్యం, జలపాత సదృశ ఉరవడి, వేగం ఉన్న బాంగ్లా కవిత్వం పురిపండా అప్పలస్వామి గారే అనువాదం చేసి ఉంటే ఆధునిక తెలుగుకవిత్వం ఎట్లా ఉండేదో ఇప్పుడు ఊహకు వదిలేసే విషయమే.
వచనంకన్నా కూడ శ్రవణసంగీతంతో ఉత్తేజపరిచే నజ్రుల్ బాంగ్లా కవిత్వం ఇంగ్లిషు నుంచి తెలుగులో వచ్చినపుడు ఎంత మౌలికత కోల్పోతుందో ‘ప్రళయోల్లాస్’ వంటి కవితను అనువదించినపుడు నాకే అనిపించింది. అయినా ఒక సాహసం చేసాను. నజ్రుల్ నుంచి నేను నేర్చుకున్న విప్లవప్రేమ తత్వం నాలో ఎంత జీర్ణమైందో పాఠకులకు ఎంత అందివ్వగలుగుతున్నానో కాలానికి వదిలేస్తాను.
– వివి
15 ఆగస్టు 2024
పీటర్ కస్టర్కు
సిఎఎ ధిక్కార షహీన్ బాగ్ లకు
ఎంటిఖానక్కు
ప్రొ.ఎస్ ఎ ఆర్ జిలానీకి
సియాసత్ జహీర్ అలీఖాన్ కు
‘మొహబ్బతే కారవాన్’ నిర్వహించినందుకు
విద్వేషపూరిత ‘ఢిల్లీ రయట్స్’ కేసులో
ముద్దాయిలైన ముస్లిం రాజకీయ ఖైదీలకు
అరబిక్ నేర్చుకుంటున్న హనీబాబుకు
ఆర్టికల్ 370 రద్దుబాధిత కశ్మీరీలకు
రాజకీయ ఖైదీలకు
ఈ పోరాటాల్లో అమరులకు
బాంగ్లాదేశ్ 2024 ప్రజాస్వామిక పోరాటంలో అమరులైన
మౌలానా భషానీ, నజ్రుల్ ఇస్లాం వారసులకు
అంకితం
– వివి