చరిత్రలో అజ్ఞాత వీరులు వున్నట్లే సాహిత్య చరిత్రలో అజ్ఞాత వీరకవులు వుంటారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో రావెళ్ల వెంకట రామారావు అటువంటి అజ్ఞాత ఉద్యమకవి. నాలుగు శతాబ్దాల నుండి / “నవాబు సైతానులు / తెలంగాణ జనరక్తం / జలగల వలె పీల్చినారు” అని నిజాం నియంతృత్వ క్రూర పరిపాలనపై గళమెత్తిన సాయుధ కవి రావెళ్ల వెంకట రామారావు . వీరు ఖమ్మం జిల్లా గోకినేపల్లి గ్రామంలో 1929లో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలోంచి వచ్చిన మనిషి కాబట్టే తన ప్రాంతపు బ్రతుకుల్లోని దయనీయ దుస్థితిని బాల్యం నుంచే అనుభవించాడు. మాతృభాషలో చదువుకునే అవకాశం లేకపోయినా వీధిబడిలో సాహిత్య పరిభాషా పాండిత్యానికి పాదులు తవ్వుకున్నాడు. ఆ సాహిత్య పునాదుల స్ఫూర్తినుంచే తెలంగాణ అస్తిత్వానికి తొలి చిరునామా గీతమైన “కదనాన శత్రువుల/ కుత్తుకల నవలీల/ నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి / వీరులకు కాణాచిరా! తెలంగాణ / ధీరులకు మొగసాలరా!” అనే పాట ఉద్భ వించి౦ది.
తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కంటే ముందే ఈ పాట అనేక సభల్లో మార్మోగింది. తెలంగాణ ప్రాంత సాంస్కృతిక ఉద్యమాలకు, ఉద్యమ చైతన్యానికి, ఉద్యమకారుల పౌరుషానికి నిలువెత్తు అస్తిత్వ చిత్రం ఈ గేయం. స్వయంగా రావెళ్ల వారి ఉద్వేగ స్వరంనుచి వెలువడిన ఈ పాట ఆనాటి తరాన్ని ఒక ఉత్తేజ తీరంవైపు కదిలించింది. 1960లో ‘జీవనరాగం’ అనే ఖండకావ్యంలో ‘మాతృగీతిక’ శీర్షికతో వచ్చిన ఈ గేయం గొప్ప చారిత్రాత్మక బాధ్యతను భుజాన వేసుకుని పురుడు పోసుకుంది. నిజాం సైన్యాన్ని, రజాకార్లను ఎదురించిన పోరాట యోధుడు రావెళ్ల. తను నమ్మిన వామపక్ష సిద్ధాంతాన్ని కాపాడుకోవడానికి యూనియన్ సైన్యంతోనూ పోరాడిన సాహసి. అటువంటి రావెళ్ల వారు రాసిన ఈ ‘మాతృగీతిక’ సైతం తదనంతరం ఒక పోరాట గీతంగా రూపాంతరం చెందడం కాల మహిమగా చెప్పవచ్చు. హైద్రాబాద్ స్టేట్, ఆంధ్రరాష్ట్రాలు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించడం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లో తెలంగాణ ఆస్తిత్వం, తెలంగాణీయుడి ఆత్మగౌరవం ప్రశ్నార్ధకమైన వేళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పాల్వంచలో బీజం పడింది. సింగరేణి బొగ్గు గనుల్లో రాజుకున్న అగ్గి తెలంగాణమంతటా వ్యాపించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం రాజుకున్న అగ్గికి ఈ ‘మాతృగీతిక’ గీతం ఉద్యమ పరివ్యాప్త గాలులతో ఊపిరులూదింది. తెలంగాణ వీరత్వానికి, సాహస మనస్తత్వానికి, సాంస్కృతిక వైభవానికి, లలితకళా నైపుణ్యాల ప్రశస్తికి సాధికారకమైన ఆత్మాభిమానానికి ప్రతీక ఈ గీతం. ఒక్కసారి ఈ పాట అంతరంగపు లోతుల్ని స్పర్శిద్దాం.
‘కదనాన శత్రువుల’…. అనే పల్లవితో ఆరంభమయ్యే ఈ గీతం తెలంగాణ వీరత్వాన్ని ఘనంగా కీర్తిస్తుంది. రణరంగంలో శత్రువుల కంఠాలను అలవోకగా నరికేసిన బలవంతులున్న భూమి తెలంగాణ. వీరులకు మూలస్థానం, వీరయోధుల జన్మస్థానం. తెలంగాణ వీరత్వానికే ముఖచిత్రంగా వర్ణిస్తాడు. ‘అబలయని దేశమును’…. అనే చరణం కాకతీయ రాణి రుద్రమదేవి సాహస గాథను వినిపిస్తుంది. తెలంగాణ మహిళ అబల కాదు సబల అని నిరూపిస్తున్నాడు. స్త్రీలనే చులకనభావం చూపే పొరుగు రాజులకు శౌర్య పరాక్రమాలనే కాదు రాజ్యనిర్వహణలో సమర్ధతను చూపించాడు. తెలంగాణ మహిళల రాజనీతిజ్ఞతా, మేధో సామర్ధ్యాన్ని కవి ఎత్తి చూపుతున్నాడు. ఆధునిక కాలంలో వీరవనితలైన ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మల వారసత్వం కూడా ఈ చరణాల ద్వారా స్పురిస్తుంది.
తెలంగాణ ప్రాంతానికి కేవలం ఉద్యమం, పోరాట చరిత్రమే కాదు, దానికి సరితూగే అనేక విశిష్టా౦శాలు సమ్మిళితమై ఉన్నాయంటాడు కవి. తెలంగాణలో నెలకొన్న శిల్పకళావైభవం అద్భుతమైనదని కొనియాడుతాడు. ఊహాలలో కూడా. కలలోను సాధ్య౦కాని అసమాన శిల్పకళాప్రతిభ తెలంగాణ నేలమీద నిర్మితమై౦దని గర్వపడతాడు. వేయిస్తంభాల గుడి ఇందుకు ఉదాహరణగా నిలుపుతాడు. తెలంగాణ ఆలయాల గోడల మీద చెక్కిన లాలిత్యరేఖా విన్యాసాలు సజీవచిత్రాలుగా హృదయాలను మైమరపిస్తాయని రావెళ్ల వారు కీర్తిస్తారు. కవి ఒకటి రెండు నిరూపణలతోనే మొత్తం తెలంగాణలోవున్నశిల్పకళా నిర్మాణవైవిధ్యాన్ని కనులముందు కదిలిస్తాడు.
తెలంగాణ నేలకుడా బుద్ధుని ధర్మ బోధనలతో పునీతమైంది. కులం, వర్ణం, అని మానవులను విడదీసే కలహాలను నిర్మూలించే ఆదర్శమార్గంలో నడిచింది. ఇక్కడి బౌద్ధ చైత్యాలు తెలంగాణ సహనీయ జీవన చైతన్యాన్ని చాటిచెపుతున్నాయని తెలుపుతాడు కవి. తెలంగాణీయుడి ప్రేమ, కరుణ తత్వానికి గల మూలాలను తడుముతున్నాడు కవి.
రావెళ్ల వారు తెలుగుభాషా సాహిత్యాలను, లోతుగానే అధ్యయనం చేసినట్లుగా ఈ ‘మాతృగీతిక’ ను చదివితే అర్ధమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వైశిష్ట్యాన్ని ప్రశంసించడానికి ప్రాధాన్యమిచ్చారు. “శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతాలలో… నుండి కృషికుడై జీవించెరా తెలంగాణ ‘కృష్ణకవి’ పోతన్నరా” చరణాల వరకు కవి తెలంగాణ కవుల ప్రత్యేకతలను, సాహిత్యతాత్విక దృక్పథాలను కవితాత్మకంగా చెప్పారు. శివకవుల దేశీ కవితోద్యమం, కృష్ణమాచార్యుల వైష్ణవ భక్తితత్వం, బసవన్న శివతత్వసారం, ‘జాను తెనుగు’ లో రచించిన పాల్కురికి సోమన తన రచనల్లో స్థానీయ సంస్కృతి, సంప్రదాయాలను చిత్రించాడు. అచ్చమైన తెలంగాణ వాతావరణాన్ని నింపి తెలంగాణలో కొత్త బాటలు వేసిన పాల్కురికిని స్మరించుకుంటాడు కవి. చదువుల తల్లి, సారస్వతమూర్తి సరస్వతిమాత కన్నీటిని తుడిచి ఆదేవి వేదనను చల్లార్చిన కవి పోతనామాత్యుడు. అంతేకాదు తన కావ్యాన్ని ప్రభువుకు తాకట్టుపెట్టకుండా ధిక్కారాన్ని ప్రకటించిన హాలిక కవిని “కృష్ణకవి” పోతన్నరా’ అని సంభోధిస్తాడు. పాల్కురికి, పోతన్నల అస్తిత్వమే తెలంగాణ కవికి వారసత్వంగా అందిందనే సత్యాన్ని ఉద్యమకవి రావెళ్ల తలచుకోవడం ఔచిత్యవంతం.
తెలంగాణ ప్రాంతం మీద జరిగిన దాడులు, యుద్ధాలను గుర్తుచేసుకుంటూ రావెళ్ల గతకాలపు కన్నీటి చరిత్రను వ్యాఖ్యానిస్తాడు. ఢిల్లీనుంచి వచ్చిన మొగలుసైన్యం, స్థానిక నిజాం సేనలు, రజాకార్ల భయ౦కరమైన దాడులతో తెలంగాణలో ఏ విధంగా శిధిలమైపోయిందో ఈ గీతంలో చూపిస్తాడు. ముక్కలుగా చీలిన తెలంగాణ నేలలో, రక్తంతో తడిసి జీవకళ కోల్పోయిన తెలంగాణ నేలలో నవయుగోదయం ఏ విధంగా జరిగిందో వర్ణిస్తాడు. తమ దుష్ట పాలనతో చీకటి నింపిన రాజ్యాధికారులను కూలదోసి, బానిస సంకెళ్ళను తెగ్గొట్టిన ధర్మపోరాటాన్ని ఉత్తేజస్వరంతో ఎలుగెత్తి చాటుతాడు కవి. కేవలం తెలంగాణ నేల ఉద్యమ స్వభావాన్ని, తెలంగాణీయుడి పౌరుషాగ్నిని, తెలంగాణ సాహిత్య విశిష్టతను చెప్పడమేగాక కవి తెలంగాణ భౌగోళిక సంపదలను, వాటి అమూల్యతలను కొనియాడుతారు. అపారమైన ఖనిజ సంపద, పొంగిపారెడి నదులు, అరణ్యాలు, ధాన్యపు రాసులతో తెలంగాణ వెలకట్టలేని మాణిక్యాల రాశిగా వర్ణిస్తాడు. మొత్తంగా కవి తెలంగాణ చారిత్రక మూలాల్లోకి వెళ్ళి మనలో భావోద్వేగాల్ని రగిలిస్తాడు. గేయం రాసిన కాలం నాటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. రాబోయే పరిణామాలకు ఇది ఉద్యమగీతంగా మారుతుందనేది ఎవరూ ఊహించకపోవచ్చు.
రావెళ్ళ వెంకట రామారావు నిజాంపాలనకు వ్యతిరేకంగా బాల్యంలోనే ఆంధ్రమహాసభ కార్యక్రమాలాలో పాల్గొన్నాడు. బాలల సంఘంలోను, సాంస్కృతిక దళాలలోను వాలంటీరుగా పనిచేశాడు. తదననంతరం సాయుధ దళ కమాండర్ గా ఎదిగాడు. 1948లో యూనియన్ మిలిటరీ పరిపాలకులు రావెళ్లను అరెస్ట్ చేశారు. నాలుగు సంవత్సరాలు అనేక జైళ్ళలో కఠిన కారాగార జీవితం గడిపాడు. జైలులో పరిచయమైన సాహితీవేత్తల సాంగత్యంతో కవిత్వరచనపై గాఢమైన ఆసక్తి ఏర్పడింది. ఆ నేపథ్య౦ములో౦చే ‘మాతృగీతిక’ గేయం వెలువడింది. 1969 తొలిదశ ఉద్యమంలో ఈ గేయం లక్షలాది హృదయాల్లో ప్రతిధ్వనించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన ఉద్యమంలో ఈ పాట కొత్త ఆలోచనలను ప్రేరేపించింది. ఉద్యమ సభల్లో స్వాగతగీతంగా, సమరానికి సన్నద్ధం చేసే శంఖారావంగా మార్మోగింది. అప్పటినుండి విభిన్నదశల్లో కొనసాగిన తెలంగాణ ఉద్యమాలలో, వాదనల్లో, చర్చల్లో ‘కథనాన శత్రువుల కుత్తుకలను’…. అంటూ ఈ పాట కదం తొక్కింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ ఈ పాట గొప్పదనాన్ని గురించి నిత్యం వివరించేవారు. వారి స్ఫూర్తితోనే ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఈ పాటను వేలాది సభల్లో పాడి ఉద్యమానికి కొత్తశక్తిని అందించేవారు. ధూంధా౦ కార్యక్రమాల్లో భాగంగా ఎందరో గాయకులు ఈ పాటను పాడుతూ సభికుల్ని ఉద్యమోన్ముఖుల్ని చేసేవారు. తెలంగాణ ఉద్యమం తనకవసరమైన పాటను ముందే రావెళ్ల చేత రాయించుకుంది. ఎన్నో చారిత్రక విశేషాలను నింపుకున్న ఈ పాట తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తొలి జాతీయ గీతంగా వందనం చేయవలసిందే.
మాతృగీతిక (పూర్తి పాట)
కదనాన శత్రువుల
కుత్తుకల నవలీల
నుత్తరించిన బలో
న్మత్తు లేలిన భూమి
వీరులకు కాణాచిరా
తెలగాణ
ధీరులకు మొగసాలరా
అబలయని దేశమును
కబళింప తలపడిన
పర రాజులకు స్త్రీల
పటు శౌర్యమును జూపి
రాజ్య తంత్రము నడిపెరా
తెలగాణ
రాణి రుద్రమదేవిరా
కల్పనాతీతమౌ
కమనీయ శిల్పమును,
వేయి కంబాలలో
వెలయించి మించినది
అడుగడుగు శిల్పాలతో
తెలగాణ
అందాలు విరజిమ్మెరా
వర్ణ సహజత్వమున
వన లతల మఱపించు
లాలిత్యరేఖా – వి
లాసాల చిత్రణలు
ఆనాటి చిత్రాలూరా:
తెలగాణ
ఆలయపు కుడ్యాలురా:
కులవర్ణ సంకీర్ణ
కలహాల నిర్జించి
బోధిసత్వుని ధర్మ
బోధనల నేర్పించి
శ్రీగిరి చైత్యమ్మురా
తెలగాణ
చైతన్యమును చాటెరా
శ్రీవైష్ణవుల భక్తి
చిందు గీతాలలో
బసవన్న శివతత్వ
పారవశ్యములోన,
ఉర్రూత లూగిందిరా
తెలగాణ
వెల్లువై పొంగిందిరా
కవితలో విక్రాంతి
కాహళిని పూరించి ,
కమ్మ తెనుగున తేట
కావ్యాల విరచించె
పాల్కురికి ఆనాడేరా:
తెలగాణ
ప్రగతి బాటల దీర్చెరా:
భాషా వధూ నయన
బాష్పతతి నణగింప
రాజ సమ్మాన వై
రాగ్యమును ప్రకటించి,
కృషికుడై జీవించేరా:
తెలగాణ
“కృష్ణకవి” పోతన్నరా:
మత మౌడ్యమున మాన
వత్వమునే బలిగొన్న
మొగలు షాహీఫౌజు
ముష్కరాఘాతాల
శిథిలమై పోయిందిరా
తెలగాణ
జీవకళ కోల్పోయెరా
స్వాతంత్య్ర తొలిసమర
శత్రువులు, వంచకులు
నైజాము పాలకుల
కైజారు పోటులకు
ముక్కలుగ చీలిందిరా
తెలగాణ
రక్తమే చిందిందిరా
దాస్య నిగళఛ్చేద
ధర్మయజ్ఞములోన,
రాత్రించరుల నిశా –
రాజ్యపీఠము గూలె
నవ యుగోదయ మాయెరా
తెలగాణ
నవ మల్లియలు విరిసెరా
భూగర్భమున నిధులు,
పొంగి పారెడి నదులు,
శృంగార వన తతులు,
బంగారముల పంట
మన తల్లి తెలగాణరా
వెలలేని మాణిక్యముల రాశిరా