‘తురముఖం’ కార్మిక ఉద్యమంలో వచ్చిన పరిణామ క్రమానికి సంబంధించిన మలయాళం సినిమా అని చెబితే చాలా సింపుల్ గా చెప్పినట్లే. కేరళా చరిత్రలో విస్మృతికి గురి అయిన ఒక అధ్యాయం తురముఖం సినిమాగా వచ్చింది. ఒకానొక కాలంలో, ఒకానొక స్థలంలో -కొన్ని జీవితాలను ఒక నవలా క్రమంగా వర్ణించిన సినిమా ఇది. ఆ నాడు జరిగిన తిరుగుబాట్లను యథాతథంగా చూపటం ఈ సినిమాకు చారిత్రక కోణాన్ని ఇచ్చింది. అయితే ఆ చరిత్రను పూస గుచ్ఛటానికి కొన్ని కాల్పనిక పాత్రలను తీసుకుని కథకు రక్త మాంసాలు ఇవ్వటం వలన ఈ సినిమాను కాల్పనిక చారిత్రక ఇతివృత్తం అనవచ్చేమో.
ఈ సినిమా వాస్తవానికి కెఎం చిదంబరం 1968లో అదే పేరుతో రాసిన నాటకానికి సినిమాకరణ. ఈ సినిమాకరణ చేసింది ఎవరో కాదు. అతని కొడుకు గోపన్ చిందబరం. కెఎం చిదంబరం బతికి ఉండగా ఈ నాటకాన్ని ఆయన ప్రదర్శనించనివ్వలేదు. ఆయన మరణం తరువాత 2018లో ఈ నాటకాన్ని గోపన్ చిదంబరం ఆధ్వర్యంలో మట్టన్ చెరీలోని ఉరూ ఆర్ట్ థియేటర్ వాళ్లు ప్రదర్శించారు. మట్టన్ చెరీ ప్రాంతంలోనే జరిగిన పోరాట కథ ఇది. స్థానిక వ్యక్తులే ఈ నాటకంలో నటించారు. నాటకం ఎలా ఉందో తెలియదు కానీ, ఈ సినిమా కథ చాలా నెమ్మదిగా నడుస్తూ -ఒక్కో ఘటన, ఒక్కో ఎమోషన్, ఒక్కో పాత్ర, ఒక్కో సంభాషణ మనసులో స్థానం సంపాదించుకొంటాయి.
తురముఖం అంటే ‘రేవు’ అని అర్థం. పేరు చూసి కేరళలోని తివేండ్రంలో ‘విళింగమ్’ పోర్ట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సంబంధించిన సినిమా అని అనుకునే అవకాశం ఉంది. ఈ సినిమా కథాకాలం 1953. నిజానికి అంతకంటే ముందు నుండే 1930లో కొచ్చిన్ రేవు నిర్మాణం అయినప్పటి నుండే కథ ప్రారంభం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకంటే ముందు కేరళ మలబారు ప్రాంతంలో 1920లలో జరిగిన మోఫ్లా తిరుగుబాటు నుండే కథా మూలాలు ఉంటాయి. మూడు దశాబ్దాల కథను ఒక ధారగా, విసుగు పుట్టించనీయకుండా నడిపించటం చిన్న విషయం కాదు.
కొచ్చిన్ రేవు దగ్గర మట్టన్ చెరిలో నివాసాలు ఏర్పరచుకున్న కొన్ని ముస్లిం కుటుంబాల కథ ఇది. కొచ్చిన్ లో అప్పుడే కట్టిన రేవులో కూలీలుగా పని చేస్తుంటారు వాళ్లు. కొత్త కొత్త కుటుంబాలు పొట్ట చేతిన పట్టుకొని వారితో చేరుతుంటాయి. ఆ కుటుంబాలు మోఫ్లా తిరుగుబాటు తరువాత అక్కడకు వలస వచ్చాయని వాళ్ల సంభాషణల ద్వారా తెలుస్తుంది. ప్రసిద్ధ మోఫ్లా తిరుగుబాటు గురించి ఇక్కడ కొంత తెలియటం అవసరం.
కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన తిరుగుబాటు అది. దీన్ని మప్పిలా తిరుగుబాటు అని కూడా అంటారు. కులీన హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం భూస్వాములకు కొమ్ముకాసి అణచివేసింది. 5200 కిలోమీటర్ల దక్షిణ మలబారు పొడవునా, ఆరు నెలలు సాగిన ఈ పోరాటంలో బ్రిటిష్ సైన్యం చేతిలో 10000మంది దాకా ప్రజలు చనిపోయారు. దాదాపు 50000 మందిని నిర్బంధించారు. వారిలో 20000 మందిని అండమాన్ జైళ్లకు పంపించారు. 10000మంది అదృశ్యం అయ్యారు.
కౌలు రైతులకు, భూస్వాములకు మధ్య జరిగిన ఈ వైరుధ్యాన్ని తరువాత కాలంలో మతం రంగు పులిమారు. ముస్లిములతో బాటు అనేక ముస్లిమేతరులు ఈ తిరుగుబాటుకు మద్దతునిచ్చి నడిపించారు. రైతులు ముస్లిములుగా, భూస్వాములు నాయర్లు (నంభూతి బ్రాహ్మలు) గా ఉండటం కాకతాళీయమే. మొదటిగా ఈ పోరాటం భూస్వామ్య వ్యతిరేక పోరాటం. రెండో విషయం స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ వారి జోక్యంతో వారికి వ్యతిరేకంగా జరిగిన జాతీయ ఉద్యమంగానే పరిగణించాలి. తరువాత కాలంలో రైతులు ధ్వంసం చేసింది కూడా బ్రిటిష్ వ్యవస్థలనే. టెలిఫోన్ లైన్లనీ, పోలీస్ స్టేషన్లను, రైల్వే స్టేషన్లనీ, కోర్టులనీ, పోస్ట్ ఆఫీసులనే. జాతీయోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ఆ కాలంలో దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ కూడా ఈ ఉద్యమాన్ని అనేకానేక రైతు తిరుగుబాట్ల లాగానే సొంతం చేసుకోలేదు. 1971లో కేరళ ప్రభుత్వం ఈ తిరుగుబాటులో పాల్గొన్న వారిని స్వాతంత్ర్య సమర యోధులుగా గుర్తించింది.
ఆ తిరుగుబాటు ప్రాంతం నుండి వచ్చిన మైము కుటుంబంలో భార్య పార్తూ, కొడుకులు మౌదు, హంజా, ఇంకా కూతురు కచ్చి ఉంటారు. పిల్లలు ‘మొఫ్లా తిరుగుబాటు వర్ధిల్లాలి’ అని నినాదాలు ఇస్తూ ఆడుకుంటుంటే -భార్యాభర్తలు తమ మొఫ్లా గతాన్ని తలబోసుకొనే ఒక దృశ్యం ఉంటుంది. ‘కొంతమందిమి పారిపోయాము. కొంతమంది అండమాన్ వెళ్లారు. కొంతమంది స్వర్గానికి వెళ్లారు’ అంటుంది పార్తూ.
కానీ కష్టజీవులకు ఎక్కడికి వెళ్లినా బ్రతుకు పోరాటమే. ఆత్మాభిమానాన్ని, ఆవేశకావేశాలను చంపుకుంటేనే ఆ కుటుంబానికి నాలుగు వేళ్లు లోపలకి వెళ్లేది. కానీ అన్నివేళలా అది సాధ్యం కానీ పరిస్థితులు ఉంటాయి.
సినిమా ప్రారంభంలోనే ‘యజమానులు ఏవో విసురుతుంటే, ఏక వస్త్రంతో ఉన్న బడుగు ప్రజలు వాటి కోసం తన్నుకునే దృశ్యం’ ఒకటి వుంటుంది. వారిని అదుపు చేయటానికి వినోదం చూస్తున్న యజమానుల తరఫున వాళ్ల శరీరాల మీద కొరడాలు మోగించేవాళ్లు ఉంటారు. నాణాలు విసురుతున్నారేమో అనుకుంటాము. రేవులో పని పొందటానికి టోకెన్లు విసురుతున్నారని అర్థం అవుతుంది. పని తక్కువ, కార్మికులు ఎక్కువ ఉన్న ఆ కాలంలో అమానవీయమైన చప్పా వ్యవస్థ ఉండేది. చప్పా (టోకెన్) దొరికిన వాళ్లకే ఆ రోజు పని. ‘దీనికన్నా దొంగతనానికి పోవటం నయం’ అనే గొంతు కార్మికులలో నుండి వినబడుతుంది.
ఈ అవమానకర చప్పా వ్యవస్థ మార్పు కోసం, అందరికీ పని కావాలనే డిమాండ్స్ తో జరిగిన పోరాటాలు అక్కడ 20 సంవత్సరాల పైగా జరిగాయి. 1953లో జరిగిన కార్మిక సమ్మెలో ముగ్గురు కార్మికులు చనిపోయాక, వీరికి కొన్ని హక్కులు వచ్చాయి. ఆ క్రమాన్ని ఈ సినిమా వివరిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చాక యూనియన్లు పెట్టుకోవటానికి అనుమతి వచ్చాక కూడా చాలా కాలం ఆ యూనియన్లు యజమానులు చేతుల్లోనే వున్నాయి. యూనియన్లలో పట్టు సాధించటానికి ఒక పోరాటం, తమ డిమాండ్స్ సాధించుకోవటానికి ఒక పోరాటం -నిరంతరం పోరాటాల్లో మునిగి తేలే ఆకలి కళ్ల కార్మికులు కనిపిస్తారు ఈ సినిమా అంతా. పని దొరక్క వట్టి చేతులతో ఇంటికి వచ్చి -సగం ఇల్లు, సగం బహిరంగం అయిన గుడిసె వాకిట్లో కూలబడ్డ హంజా పాత్రను ఎన్నటికీ మరవలేము. ఆ ఇళ్లు కార్మికుల జీవితాలకు ఎక్కడా గోప్యత నివ్వలేవు. 1920 నుండి 1950ల మధ్య కార్మిక ప్రజల ఇళ్ల పరిసరాలు, తిండి తిప్పలు, వేషధారణలను జాగ్రత్తగా అధ్యయనం చేసి తీసారీ సినిమాను. మోకాళ్ల మీద కూర్చొని ఒక్కో బియ్యం గింజను ఏరుకొంటూ ముందుకు జరిగే పార్తూ బాధకరమైన శరీర కదలికలను చూపే ఒక్క దృశ్యం చాలు -ఈ సినిమాలో ప్రతి దృశ్యాన్ని ఎంత శ్రద్ధగా తీశారో అర్థం అవటానికి. ప్రేక్షకుల పట్ల గౌరవం ఉన్న వాళ్లు మాత్రమే అలా తీయగలరు.
అద్భుతమైన పాత్రలు ఉన్నాయి ఈ సినిమాలో. ఆయా పాత్రల సైకాలిజీని పట్టుకొని అందులో ఇమిడి పోయి నటించే నటులను ఎన్నుకొన్నారు. మైమూగా వేసిన జోజు జార్జి అంత శరీరం ఉన్నా, కళ్లతోనే నటించాడు. అతని ప్రతి ఎక్స్‌ప్రెషన్ దేనికదే ప్రత్యేకమైనది. భర్తకు దూరమైన ఒంటరితనాన్ని, కొడుకులను అదుపు చేయలేని అసహాయతను చాలా బాగా పలికించింది అతని భార్య పార్తూగా నటించిన పూర్ణిమా ఇంద్రజిత్. ఎంతో కష్టపడి పెళ్లి చేస్తే, సిఫిలిసిస్ వచ్చి ఇంటికి చేరిన కూతుర్ని చూసినపుడు ఆమె నటన గొప్పతనం చెప్పనలివి కాదు. మౌదుగా నటించిన నవీన్ పౌలేలో అసలైన నటుడిని ఈ సినిమా బయటకు తీసింది. పూర్తిగా నెగటివ్ పాత్ర అయినా ఏ మాత్రం రాజీ పడకుండా నటించాడు. స్త్రీ లోలత్వం, దొంగతనం, బాధ్యతా రాహిత్యం, పిరికితనం ఉన్న పాత్ర ఇది. అతని తమ్ముడు హంజాగా నటించిన అర్జున్ అశోక్ కు ఈ సినిమా ఒక మలుపు అవుతుంది. అందరికంటే ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నటి ఉమనిగా నటించిన నిమిష సజయన్. దుఃఖం, నిస్సహాయత, ప్రేమ, భయం -ప్రతి వ్యక్తీకరణ ఈమె ముఖంలో పున్నమి వెలుగులాగా కనిపిస్తాయి. నడుస్తున్నపుడు, కూర్చొన్నపుడు, ఆలోచిస్తున్నపుడు దర్శకుడు చెప్పిన కొన్ని మేనరిజాలను పట్టుకొని అతి శ్రద్దగా నటించింది. మౌదు దగ్గర చేరినపుడు ప్రేమతో, మొహంతో కైపెక్కిన కళ్లతో చూసే చూపు మర్చిపోలేనిది. నిమిష దర్శకుడి నటి. కాలేజ్ గర్ల్ గా ఇటీవల అనేక సినిమాల్లో నటించిన దర్శనా రాజేంద్రన్ ఈ సినిమాలో అమాయకురాలైన కచ్చిగా నటించింది.
సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన రాజీవ్ రవి చాలా మంచి సినిమాలు తీశాడు. అన్నాయుమ్ రసూలుమ్, నాన్ స్టీవ్ లోపెజ్, కమ్మట్టి పాలెం, కుట్టవుమ్ శిక్షావుమ్ సినిమాల తరువాత చాలా రోజులకు ఈ సినిమా తీశారు. మొదటి సినిమా ‘కమ్మట్టి పాలెం’ లో కొచ్చిన్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోయిన సమూహాల గురించి తీశాడు. వాళ్ల చేతిలో పావైన వినాయకన్ పాత్రలాంటిది ఈ సినిమాలో మౌదు పాత్ర. కమ్మట్టి పాలెం బాలన్ గా నటించిన మణికందన్ కు కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఉంది.
మలయాళంలో కార్మిక వర్గం మీద తీసిన సినిమాలు చాలా వచ్చాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా పటిష్టమైన దర్శకత్వ, స్క్రీన్ ప్లే ప్రతిభతో తీసిన సినిమా ‘తురముఖం.’ రెండు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ సినిమా ఏ మాత్రం నిరుత్సాహ పర్చలేదు.
ఈ సమీక్ష మేడే రోజు చదవడం ఒక గొప్ప సంతృప్తి నిచ్చింది. ఈ రోజే చూస్తే మరో పనైపోతుంది. కేరళ మాదిరి గానే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను మతం రంగులో పులిమి కలగాపులగం చేశారు అప్పటి ఈస్ట్ బెంగాల్ (నేటి బంగ్లాదేశ్), కశ్మీర్ లలో కూడా. చాలా విపులంగా చారిత్రక వివరణలతో వుంది మీ వ్యాసం. ధన్యవాదాలు. 👍🙏
మతం పేరుతో కులం పేరుతో శ్రమజీవులను విభజించడం గత నుండి జరుగుతున్నదే. దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఆర్థిక సమస్యలపై అందరిని సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది .ఈ రివ్యూ మనకు ఒక సినిమానే కాకుండా గత చరిత్ర కళ్ళ ముందు ఉంచుతుంది రచయిత్రికి కృతజ్ఞతలు.
Very good review Akka. I will waatch the movie.✊🏼
తప్పనిసరిగా ఈ సినిమా చూడాలనిపించేంత బాగా రాశారు. కథాంశాన్నీ, నేపథ్యాన్నీ వివరించటంతో పాటు చిత్రీకరణ, పాత్రధారుల అభినయ విశేషాల గురించి రాయటం బాగుంది.
Good review ma’am I feel like as a theater audien we are expecting more reviews and stories
అద్బుతమండీ మీ సమీక్ష 👏🙏
సమీక్ష వివరంగా చక్కగా రాసారు 👌thank you
సినిమా పై సమీక్ష చదివిన తర్వాత ఈ సినిమాను తప్పకుండా చూడాలి అనిపించింది.
చక్కని సమీక్ష ను ఇచ్చారు మేడం. తప్పక చూడాల్సిన సినిమా. సినిమా చూస్తే మరిన్ని విషయాలు అవగతం అవుతాయి. థాంక్యూ మేడం.
Good review madam. Their roles playing in our brain. Will watch the movie.
Thank you for introducing such a good film..
అద్భుతంగా ఉంది మీ సమీక్ష. సగం సినిమా చూసినట్టే ఉంది. మిగతా సగం చూడకుంటే ఏదో వెలితిగా వచ్చేట్టే ఉంది.