తీరు మారని మోడీ పాలన

భారతీయ జనతా పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టినా, దాని నిరంకుశ ధోరణిలో ఇసుమంతైనా మార్పు లేదు. ఈ దఫా మోడీ నాయకత్వంలో ఏర్పడింది ఎన్‌డిఎ మిశ్రమ ప్రభుత్వం గనక బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంకుశ, మతతత్వ కార్పొరేట్‌ ఎజెండాతో ముందుకు పోవడంలో తీవ్రమైన చిక్కులు ఎదుర్కోవలసి రావచ్చని కొన్ని వర్గాల అంచనాలు. ఆ అంచనాలు అతి అంచనాలే. బిజెపి మెజార్టీ లోక్‌సభలో 240 స్థానాలకే పరిమితమైంది గనక మోడీ మూడో దఫా పాలనలో ఆయనగానీ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలుగానీ అమలు చేయాలనుకున్న ఎజెండాలో కొన్నిటికి అదుపు చేయడం, నెమ్మదించడం జరగొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థను, లౌకిక సూత్రాలను మరింత దెబ్బ తీసి ఏకీకృత నియంతృత్వాన్ని మళ్లీ రుద్దే విధంగా రాజ్యాంగ మార్పులు చేయడం ఇప్పుడు సాధించడం కష్టమే కావచ్చు. అయితే ఆర్థిక రంగంలో మోడీ విధానాల పరంగానూ, వ్యవస్థలను దెబ్బ తీసి నిరంకుశత్వం పెంచే పోకడలలోనూ మోడీ ప్రభుత్వ వైఖరిలో గుణాత్మకమైన మార్పేమీ ఉండదు.

18వ లోక్‌సభకు సభాపతి, ఉప సభాపతి ఎన్నిక విషయంలో ఆ పార్టీ ఏకపక్ష వైఖరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. లోక్‌సభలో సభాపతిగా అధికార పక్ష సభ్యుడిని, ఉప సభాపతిగా ప్రతిపక్ష సభ్యుడిని నియమించుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. రాజ్యాంగంలోని 93వ అధికరణం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ”లోక్‌సభ తన సభ్యుల్లో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అదేరోజు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కూడా జరుగుతుంది” అని పేర్కొంది. తొలి లోక్‌సభ నుంచి 16వ లోక్‌సభ వరకూ ఈ రాజ్యాంగ నిర్దేశం అమలైంది. ప్రారంభంలో అధికార పక్ష సభ్యుల నుంచే స్పీకర్‌, డిప్యూటీ సీర్పకర్ల ఎన్నిక జరిగేది. 1969లో మేఘాలయకు చెందిన ప్రతిపక్ష సభ్యుడు గిల్బర్ట్‌ స్వేల్‌ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. అప్పటినుంచి పాలక పార్టీ నుంచి కాక వేరే పార్టీ సభ్యుడిని ఉప సభాపతిగా ఎన్నుకోవడం అనవాయితీగా వస్తోంది.

మోడీ రెండోసారి ప్రధాని అయిన తరువాత – అనేక ప్రజాస్వామిక విధానాలకు విస్మరించినట్టే – డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను అటుకెక్కించారు. అనేక అంశాలపై ప్రశ్నించి, ప్రస్తావించి, చర్చించాల్సిన పార్లమెంటును అధికార పక్ష బల ప్రయోగశాలగా మార్చేశారు. ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా సభనుంచి గెంటేసి, మందబలంతో ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే దుస్సాహన చర్యలకు పాల్పడ్డారు. ఈ నిరంకుశ నిర్వాకాలు నిరాటంకంగా కొనసాగించటానికి వీలుగా ఉప సభాపతి స్థానాన్ని భర్తీ చేయడం మానేశారు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షానికి కేటాయించే సాంప్రదాయం జనతా ప్రభుత్వం, నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల్లోనూ, వాజ్‌పేయి హయాంలోనూ, తరువాత యుపిఎ కాలంలోనూ కొనసాగింది. 2014లో మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడూ అన్నా డిఎంకెకు చెందిన తంబి దురై డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. 2019లో బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం సాధించాక డిప్యూటీ స్పీకర్‌ స్థానానికి చాప చుట్టేసింది. ప్రతిపక్షంలో మోడీ సర్కారు ఘర్షణాత్మక వైఖరి, పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల తృణీకరణ పార్లమెంటు సమావేశాల ప్రారంభంలోనే కనిపించింది.

గత ఐదు దశాబ్దాల సాంప్రదాయాన్ని పాటించాలనే ఇండియా బ్లాకు పార్టీలు పట్టుబట్టాయి. అయినా, మొండిగా వ్యవహరించటం మోడీ సర్కారుకే చెల్లింది. గడచిన పదేళ్ల నిరంకుశ ధోరణినే ఇప్పుడూ అనుసరించటం 2024 ప్రజల తీర్పును ఉల్లంఘించటమే! ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రాంతీయ పార్టీలు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. గడచిన పదేళ్లలో బిజెపితో ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోయినా అన్ని సందర్భాల్లోనూ వంత పాడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కూడా కమలాన్ని బలపర్చటం విచారకరం. శాసనసభలో తనకు 10 శాతం సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఘోషిస్తున్న ఆ పార్టీ లోక్‌సభలో అధికార పార్టీ కొమ్ము కాయడం ద్వంద్వ వైఖరి. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు నుంచి కూడా ఆ పార్టీ ఎలాంటి గుణపాఠమూ తీసుకున్నట్టు లేదు. ప్రతిపక్షం బలపడితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న వాస్తవాన్ని మరవరాదు. టిడిపి, జనసేన కూడా బిజెపికి మద్దతిచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి మచ్చ తెచ్చాయి. ఇప్పటికైనా బిజెపి డిప్యూటీ స్పీకర్‌ స్థానాన్ని ప్రతిపక్షానికి కేటాయించి, పార్లమెంటరీ సాంప్రదాయాన్ని గౌరవించాలి.

జూలై 1 నుంచి మూడు నేర స్మృతుల (కోడ్స్‌) అంతకు ముందున్న నేరస్మృతులు శిక్షాస్మృతుల స్థానంలో అమలులోకి రానున్నాయి. ఈ కొత్త కోడ్‌లోని అనేక నిబంధనలు పౌరుల ప్రజాస్వామిక హక్కులపై అనేక రకాలైన ఆంక్షలు పెంచబోతున్నాయి. పౌరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించడమే గాక…దేశద్రోహం వంటి నేరాలకు శిక్షించేందుకు కర్కోటకమైన అధికారాలు కట్టబెట్టనున్నాయి. అమిత్‌ షాను మళ్లీ హోంమంత్రిగా నియమించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సిబిఐ తదిత సంస్థలు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగించబోతున్నాయి. తమకు వ్యతిరేకమైన ఏ ఇతర వ్యక్తులను లేదా వ్యవస్థలను, తమ అవసరాల కోసం బెదిరించి లొంగదీసుకోవలసిన వారి విషయంలోనూ ఇదే జరగబోతుంది. గత ప్రభుత్వ పాలన ఆఖరి దశలో తీసుకొచ్చిన టెలికాం చట్టం, ఐ.టి చట్టం నిబంధనలు ఇప్పుడు అమలులోకి రానున్నాయి. టెలికాం చట్టం 2023 జనవరి 26న పాక్షికంగా నోటిపై అయ్యింది కూడా. బహిరంగ ఎమర్జెన్సీ సమయంలో ఏ విధంగానైతే ఏదైనా మెసేజ్‌ను ఇంటర్నెట్‌ ద్వారా చేరవేయకుండా నిరోధించవచ్చునో ఆ విధంగా అడ్డుకోవడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అవకాశమిస్తుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతి ఉంటే చాలు కేంద్ర సంస్థలు ఏ టెలికాం ప్రసారాన్నయినా అపేయడానికి నాలుగు కేంద్ర సంస్థలకు అధికారం ఇస్తుంది.

హిందూత్వ రాజకీయాల కొనసాగింపు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకునే దాడుల విషయంలోనూ ఎలాంటి విరామం ఉండబోదు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులలోనే ఈ విషయం స్పష్టమైంది. ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లిములను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు జరిగాయి. చత్తీస్‌గఢ్‌లో రాయపూర్‌ సమీపంలోని అరంగ్‌లో పశువుల రవాణాదారులైన ముగ్గురిని మూక చంపివేసింది. పశువుల వ్యాపారం చేయడమే వారి నేరమైంది. బిజెపి పాలత మధ్యప్రదేశ్‌ మాండ్ల జిల్లాలో తమ ఇంటి రిఫ్రిజిరేటర్లలో పశుమాంసం నిల్వ పెట్టుకున్నారనే ఆరోపణలతో పదకొండు మందిని అరెస్టు చేశారు. ఆ తదనంతరం స్థానిక యంత్రాంగం అక్రమంగా ఆక్ర మించారనే నెపంతో ఆ పదకొండు మంది వ్యక్తుల ఇళ్లను కూల్చివేసింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడున్‌లో సంఘ్‌ పరివార్‌ గూండాలు రెచ్చిపోయారు. మైనారిటీ తరగతికి చెందిన ప్రార్థనా మందిరం పైనా, నిర్వాహకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు గాయపడ్డారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మత ఘర్షణల్లో 51 మంది అరెస్టయ్యారు. మతపరమైన విభజనతో సమీకరణలు చేయడం, మైనార్టీలు లక్ష్యంగా దాడులు జరపడం హిందూత్వ శక్తుల జీవ ధాతు రాజకీయం. కేంద్ర ప్రభుత్వం వీటిని అడ్డుకోవడం, అదుపు చేయడం జరగదు.

సంకీర్ణమైనా సరళీకరణ విధానాలే :
కార్పొరేట్‌ హిందూత్వ కూటమి దాడి ఎన్నికల తరుణంలో బడా వాణిజ్య వర్గం నిర్ద్వంద్వంగా నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చింది. బిజెపికి మెజార్టీ రాలేదని వార్తలు రాగానే స్టాక్‌ మార్కెట్‌ వణికిపోయింది. అయితే మోడీ నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వ ఏర్పాటు గురించి ప్రకటన రాగానే ఒక్కసారిగా పైకి లేచి కూచుంది. మోడీ మూడో సర్కారు ఏర్పాటుతో కార్పొరేట్‌ అనుకూల నయా ఉదారవాద విధానాలు పూర్తి ఊపుగా కొనసాగబోతున్నాయనే సంకేతం వస్తున్నది. నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) వంటి ప్రైవేటీకరణ చర్యలు మరింతగా విచ్చుకుంటాయని భావించవచ్చు. ప్రభుత్వంలో మిత్రపక్ష భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జెడి(యు) వంటి వాటి స్వభావం రీత్యా కూడా ఈ ఆర్థిక విధానాలకు ఎలాంటి ప్రతిఘటన ఉండబోదని అర్థమవుతుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలే అమలవుతున్నాయి. ఎన్డీయేకు మద్దతు ఇస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు, జెడి(యు) అధినేత నితీశ్‌కుమార్‌ కూడా సరళీకరణ విధానాలను వ్యతిరేకించబోరు, వాటికి మద్దతిస్తారు. కార్పొరేట్‌ శక్తులకు సేవకుడిగా మోడీ వ్యవహరిస్తున్నారు.

కార్పొరేట్‌ హిందూత్వ కూటమి దాడి :
ఎన్నికల తరుణంలో బడా వాణిజ్య వర్గం నిర్ద్వంద్వంగా నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చింది. బిజెపికి మెజార్టీ రాలేదని వార్తలు రాగానే స్టాక్‌ మార్కెట్‌ వణికిపోయింది. అయితే మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు గురించి ప్రకటన రాగానే ఒక్కసారిగా పైకి లేచి కూచుంది. ఆర్థిక మంత్రిగా మళ్లీ నియమితమైన నిర్మలా సీతారామన్‌ తన తొలి ప్రకటనలోనే తదుపరి దఫా సంస్కరణలు తక్షణం చేపడతామని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో పొందుపరచవలసిన తమ కోరికల జాబితాతో బడా వాణిజ్య వర్గం ఆర్థిక మంత్రి దగ్గర మంతనాలు జరుపుతున్నది. మోడీ మూడో సర్కారు ఏర్పాటుతో కార్పొరేట్‌ అనుకూల నయా ఉదారవాద విధానాలు పూర్తి ఊపుగా కొనసాగబోతున్నాయనే సంకేతం వస్తున్నది. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) వంటి ప్రైవేటీకరణ చర్యలు మరింతగా విచ్చుకుంటాయని భావించవచ్చు. ప్రభుత్వంలో మిత్ర పక్ష భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జేడీ(యు) వంటి వాటి స్వభావం రీత్యా కూడా ఈ ఆర్థిక విధానాలకు ఎలాంటి ప్రతిఘటన ఉండబోదని అర్థమవుతున్నది.

అసమ్మతిని అణిచేస్తోన్న మోడీ సర్కార్‌ :
భారత్‌లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ఈ వారంలో సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో భారత్‌లో వాక్‌ స్వాతంత్య్రంపై పెన్ ఇంటర్నేషనల్‌ కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. అయితే వాటికి ప్రభుత్వ ప్రతినిధి బృందం సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. సమీక్ష సందర్భంగా పెన్ ఇంటర్నేషనల్‌ సంస్థ ఓ నివేదికను అందజేసింది. రచయితలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, ఇతర విమర్శకులను ఏకపక్షంగా అరెస్టులు చేయడ్‌, విచారణ జరపకుండా సుదీర్ఘ కాలం పాటు నిర్బంధించడం వంటి చర్యలతో చట్టపరంగా వేధిస్తున్నారని వివరించింది. శాంతియుతంగా తమ అభిప్రాయాలు తెలియజేసే వారిని అణగదొక్కేతందుకు ప్రభుత్వం న్యాయ వ్యవస్థను ఓ ఆయుధంగా వాడుకోవడం మితిమీరిందనీ ఆందోళన వ్యక్తం చేసింది. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ఐసిసిపిఆర్‌) లోని ఆర్టికల్‌ 19కి ఈ చర్యలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. ప్రభుత్వ విమర్శకులను అన్యాయంగా విచారించడానికి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (ఉపా) ప్రభుత్వం ఓ సాధనంగా వాడుకుంటోందని రచయితల సంఘం ఆరోపించింది. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్‌, కశ్మీరీ డాక్టర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌లను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సెనా అనుమతి ఇచ్చారు.ఈ కేసు 2010 నవంబర్‌ 27 నాటి అంటే 14 ఏళ్ల కిందటిది.

పౌరహక్కుల పరిరక్షణకు అప్రమత్తత అవసరం :
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించడంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు ప్రజాసంఘాలతో పాటు మీడియా కూడా ప్రధాన పాత్ర వహించాల్సి ఉంది. కాని మోడీ హయాంలో అది గోడీ ‘మీడియా (మోడీ బడిలో చేరిన మీడియా)గా మారింది. ఆ బంధనాల నుండి మీడియా సంస్థలు ఇప్పుడైనా బయటపడి స్వేచ్ఛగా వ్యవహరిస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే. మోడీ సర్కార్‌ ఈసారి నీట్‌ స్కామ్‌తో పాలన మొదలెట్టింది. పోయిన సారి పి.ఎం కేర్స్‌, ఎన్నికల బాండ్లు, గుత్త పెట్టుబడిదార్లకు కోటానుకోట్ల అప్పుల రద్దు వంటి అవినీతి స్కామ్‌లతో పాటు మానవ హక్కుల పట్ల కూడా మోడీ దుర్మార్గంగా వ్యవహరించారు. ఆ దుర్మార్గంలో ఒకటి బీమా కోరేగావ్‌ కేసు. ఆ కేసు విచారణ ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని స్థితి. వెనుకటికి టాడా చట్టాన్ని వ్యతిరేకించిన బిజెపి తన హయాంలో ఉపా చట్టం కింద బెయిల్‌కు కూడా అవకాశం లేకుండా సవరణ చేసింది.

లోక్‌సభలో పార్టీల బలాబలాలు మారిన స్థితిలోనైనా మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ కూటమి పార్లమెంట్‌లో, వెలుపలా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎంత బలంగా ముందుకొస్తుందో చూడాల్సిందే. జి-20 సమావేశాల నేపథ్యంలో యు.ఎన్‌ మానవ హక్కుల కౌన్సిల్‌తో భారత్‌ ఒక ఒప్పందానికి వచ్చింది. దేశంలో కుల వివక్షను తొలగిస్తామని, భావ ప్రకటనా స్వేచ్ఛకు గ్యారెంటీ ఇస్తామని, మతపరమైన మైనారిటీల హక్కుల్ని రక్షిస్తామని భారత ప్రభుత్వం ఒప్పుకొంది. విదేశీ విరాళాల చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, (ఉపా), దేశద్రోహ చట్టం, నేరపూరిత పరువు నష్టం చట్టం వంటి వాటిలో ప్రజాస్వామిక సవరణలు చేస్తామని అంగీకరించింది. కాని వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దేశంలోని బలమైన మీడియా మోడీకి బంటుగా మారింది. కనుక పౌరహక్కుల సంరక్షణలో అది తన బాధ్యత నిర్వహిస్తుందని ఇప్పట్లో ఆశించలేము. అభ్యుదయ మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు నేడు ముందుకొచ్చి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. కాంగ్రెస్‌తో సహా ‘ఇండియా’ బ్లాకులోని అన్ని పక్షాలు పౌరహక్కుల కోసం నేడు ఉద్యమాలను నిర్మించడానికి ముందుకు రావాలి.

ప్రజాస్వామ్యంపై మోడీ ప్రభుత్వ నిరంకుశ దాడులపై ప్రతిఘటన పెంపొందించడం మరింత ముఖ్యం. నయా ఉదారవాద విధానాలతో ప్రజల జీవనోపాధిపై సాగించే దాడులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, నిరసనలు పెంపొందించాలి. ఈ సందర్భంలోనే వామపక్షాల పాత్ర కీలకమవుతుంది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సమాఖ్యతత్వం కాపాడుకోవడం వంటి విషయాల్లో ఇండియా వేదిక, విశాల ప్రతిపక్ష ఐక్యత ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. ప్రజల దైనందిన పోరాటాలలో ప్రజలను సమీకరించడంలో ఇండియా కూటమి కీలక పాత్ర పోషించాలి, నయా ఉదారవాద విధానాలపై మొత్తం వ్యతిరేక ఉద్యమాలతో వీటిని అనుసంధానం చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రత్యామ్నాయ విధానాలను ఒక విశ్వాసనీయ వేదికగా రూపొందించాలి. వామపక్షాలతో ముడిపిన వివిధ ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వేదికలు అత్యంత విశాల ఐక్య కార్యాచరణను పెంపొందించాలి. హిందూత్వ కార్పొరేట్‌ కూటమికి వ్యతిరేకంగా ప్రతిఘటనను తీవ్రం చేయడానికి కొంత రాజకీయావరణం (జాగా) లభించిందనేది లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి తీసుకోదగిన ప్రధాన పాఠం.

ముగింపు :
మోడీ తన వైఫల్యాలను నిరాకరించే ధోరణి ప్రభుత్వం తప్పక కొనసాగిస్తుంది. నిరుద్యోగిత పెచ్చరిల్లిపోవడాన్ని, ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో బాగా పెరిగిపోతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించదు. కార్మికుల వేతనాలు, ఆదాయాలు స్తంభించిపోవడాన్ని ఒప్పుకోదు, దేశ జనాభాలో కింది స్థాయిలో ఉన్న 20 శాతం మంది కటిక పేదరికంలో కునారిల్లుతున్నారన్న కఠోర వాస్తవాన్ని గుర్తించదు. అసమానతలు పెరిగిపోవడాన్ని పట్టించుకోదు. మరి ఇటువంటి వైఖరితో ఉన్న మోడీ సర్కార్‌ ఆర్థిక విధానాలలో మౌలిక మార్పులకు పూనుకుంటుందలి? అలా ఆశించడమే అసంబద్ధం. మౌలిక సదుపాయాలు, బుల్లెట్‌ రైలు ఇత్యాది అడంబరపూర్వక ప్రాజెక్టులలో భారీ మదుపులను మోడీ సర్కార్‌ కొనసాగిస్తుంది. మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ వ్యయాల పెరుగుదల వల్ల ఆర్థిక లబ్ది సమకూరుతుంది, సందేహం లేదు. వృద్ధి రేటు స్వల్పస్థాయిలో ఉంది. అయితేనేం, ప్రభుత్వం అవిశ్వసనీయ గణాంకాలతో వృద్ధిరేటును ఘనంగా పెంచి చూపుతుంది. గత పది సంవత్సరాలుగా తాము అనుసరించిన పాలనా విధానాలు సమర్థనీయమైనవని, భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేవని ప్రధానమంత్రి దృఢంగా విశ్వసిస్తారు. అవే విధానాలు యథాతథంగా కొనసాగుతాయని పార్లమెంటులో ఆయన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక కేవలం అదే ప్రభుత్వానికే కాకుండా, అదే పాలనను సైతం ప్రజలు భరించడానికైన లేదా ప్రతిఘటించడానికైనా సిద్ధంగా ఉండాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

One thought on “తీరు మారని మోడీ పాలన

  1. శాసనసభలో 10 శాతం సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగవచ్చు.

    వి. కృష్ణ మోహన్
    జాతీయ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ)
    కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) 9182189533, 9440668281 హైదరాబాద్ kmdrdo@gmail.com

Leave a Reply