సాహిత్యంలో తిరోగమనం – పురోగమనం

రాహువు పట్టిన పట్టొక
సెకండు అఖండమైనా
లోక బాంధవుడు అసలే
లేకుండా పోతాడా…?

మూర్ఖుడు గడియారంలో
ముల్లుకదల నీకుంటే
ధరాగమనమంతటితో
తలకిందై పోతుందా?

కుటిలాత్ముల కూటమి కొక
తృటికాలం జయమొస్తే
విశ్వసృష్టి పరిణామం
విచ్ఛిన్నం అవుతుందా?

దనుజలోకమేకంగా
దారి కడ్డు నిలుచుంటే
నరజాతి ప్రస్థానం
పరిసమాప్తమవుతుందా?

1955 నడమంత్రపు ఆంధ్ర ఎన్నికలలో ఎన్ని కలలో! కన్న కలలకే కాకుండా కాలానిక్కూడా ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఎన్నికల ద్వారా మనం ఆశించే సమాజాన్ని, వ్యవస్థనీ నెలకొల్పవచ్చా, లేదా? ఇవన్నీ చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలు- అయితే విషయానికి పరిమతమవుదాం. ఆ ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సమయంలో సాహిత్య కళా సాంస్కృతిక రంగాలలో చెలరేగిన గాలిదూమారం- వీటి నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు, అవి సాహిత్యరంగాన్ని ఏయే మార్పులకు గురిచేసిందీ తెల్సుకుందాం.

ఒక మిత్రుడు “అభ్యుదయం అంటే ఏమిట”ని ప్రశ్నించారు. మన ప్రతి ప్రబంధం కూడా ‘అభ్యుదయ పరంపరాభివృద్ధిగా’ అని మొదలవుతుంది. అయితే ఆ అభ్యుదయం వేరు. అదేమిటంటే వర్ణాశ్రమధర్మాలు చక్కగా అమలు జరగడం. ఉదాహరణకు ‘మనుచరిత్ర’లో అరుణాస్పదపురాన్ని వర్ణిస్తున్నాడనుకోండి. అక్కడ ధర్మం నాలుగుపాదాల నడుస్తూంటుంది. వర్ణాశ్రమధర్మాలు నిరాటంకంగా అమలు జరుగుతూంటాయి. పుష్కలావికలు మాలలు కడుతూంటారు. వేశ్యలు వృత్తి చేసుకుంటూంటారు. ఎవరి పనులు వాళ్ళు బుద్దిగా చేసుకుంటారు. ఇది వాళ్ళ అభ్యుదయం! కాని అభ్యుదయ రచయితల అభ్యుదయం వేరు. కాని 1947 లో అరసం అధ్యక్షోపన్యాసమిస్తూ రాజమన్నార్ దీని ప్రత్యయాల్ని విడదీసి అభి+ఉదయం అంటే ఉదయించే దాన్ని ముందే చెప్పడం అన్నారు. అరసం లోటుపాట్లను నిన్న కె.వి.ఆర్ వివరించారు. అది విరసం కార్యదర్శిగా వుండిన కె.వి.ఆర్ ఊహించి చెప్పారా? లేక నిజంగా ఉన్నాయా అనేది మరో ప్రశ్న. దీనికి ఒక కొలబద్ద ఉంది మనకు. అదేమిటంటే “55 ఎన్నికల తర్వాత శ్రీశ్రీ ఒక పాట రాశారు.
ఏరి తల్లీ నిరుడు మురిసిన
ఇనప రచయితలు?

కృష్ణశాస్త్రపు టుష్ట్రపక్షి
దారి తప్పిన నారిబాబూ
ప్రైజు ఫైటరు పాపరాజూ
పలక రెంచేత?

ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం
పండితా నారాధ్యుడాడినం
వందకల్లల పందిపిల్లల
ఆంధ్రపత్రిక ఎక్కడమ్మా?

ఎక్కడమ్మా ఎలుక గొంతుక
పిలక శాస్త్రుల పనికి మాలిన
తలకు మించిన వెలకు తగ్గిన
రణగొణ ధ్వనులు?

ఏవి తల్లీ నిరుడు మురిసిన
హిమ సమూహములు?

అరసం నిర్మాణంలో ఏ లోట్లున్నాయని కె.వి.ఆర్. చెప్పారో దానికి యాసిడ్ టెస్ట్ ఇదే. దీనికి కొలబద్ద ’55 ఎన్నికలే. ఈ గేయంలో శ్రీశ్రీ పేర్కొన్న నారాయణబాబు, కృష్ణశాస్త్రి మొదలైన అరసం సభ్యులు చాలామంది ’55 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి వస్తుందని భయపడి ముసాయిదామీద సంతకం పెట్టారు. విశ్వనాథ సత్యనారాయణ, ఆలూరి బైరాగి, అక్కినేని, చక్రపాణి, నార్ల వగైరా ఎందరో కవులు, కళాకారులు వగైరా సంతకాలు పెట్టారు. కాళోజీ, తాపీ ధర్మారావు, గోపీచంద్, నార్ల చిరంజీవి లాంటివారు సంతకాలు పెట్టలేదు.

సంతకాలు పెట్టిన వాళ్ళందరు కూడా “కమ్యూనిస్టు ప్రభుత్వం రాగూడదు. ఇది సాహిత్యానికి, కళలకు ద్రోహం చేస్తుంది.” అనే గాలిలో కొట్టుకుపోయారు. అరసంలో చురుగ్గా పాల్గొనే ఆరుద్రకూడా దీనిలో సంతకం పెట్టాడు.

మార్క్సిజంలో కీలకమైన అంశం వర్గపోరాటం. ఎన్నికల ద్వారా వర్గ పోరాటం చేయడం రైటా, తప్పా అనేది వేరే ప్రశ్న. ’55లో ఎన్నికల ద్వారా వర్గపోరాటం జరిగిందే అనుకుందాం, దానిలో కలవారికి వత్తాసిచ్చారు చాలామంది ‘అభ్యుదయ’ రచయితలు. “పాలకవర్గానికి కొమ్ముకాచే పత్రికలు కమ్యూనిస్టు వ్యతిరేకతను ఉన్మాద స్థాయికి తీసుకువెళ్ళాయి. మేధావులచేత వ్యక్తి స్వాతంత్ర్య సంబంధమైన ప్రకటనలు ఇప్పించడమే గాక రచయితలను కూడగట్టి తామెందుకు కమ్యూనిస్టు వ్యతిరేకులయారో వ్యాసాలు రాయించారు”, కె.వి.ఆర్ మాటల్లో. ఈ క్రమంలోనే “మన సంప్రదాయములను, సంస్కృతిని, వ్యక్తి స్వాతంత్ర్యమును సంరక్షించుకొనుచు నూతన సమాజ నిర్మాణము సాగించ”వలెనంటూ పాలగుమ్మి పద్మరాజు, శ్రీరంగం నారాయణబాబు కార్యదర్శులుగా, అందరిచేత సంతకాలు పెట్టించి ఆంధ్రపత్రికలో ప్రకటించారు. ఆనాటి కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదంలో, భయంలో పడ్డ వాళ్ళంతా సంతకాలు చేశారు.

సంక్షోభం వచ్చినపుడు, పీడకులకు పీడితులకు వర్గపోరాటం జరిగినపుడు రచయిత ఎటువుంటాడు? “రచయితలారా, కళాకారులారా, మీరెటువైపు?” అని 1970లో శ్రీశ్రీ సన్మానసభలో రచయిత లెదుర్కొన్న సవాలునుండే విరసం పుట్టింది. అట్లా ’55 ఎన్నికలలో కూడా ఒక విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. కలవారి పల్లకి మోసేదెవరు? లేనివాళ్ళకు బాసటగా నిలిచేదెవరు? ఇది తేలిపోయింది.

’55 తర్వాత అరసాన్ని మళ్ళీ బతికిద్దామని , ఈనాటి కె.వి.ఆర్ కాదు, యువకుడుగావున్న ఆనాటి కె.వి.ఆర్. ఫిజికల్ గా కూడా ఎంత శ్రమపడ్డారో నాకు తెలుసు. ఒక పెద్ద ఓటమి తిన్న తర్వాత, మొత్తం ఆంధ్రదేశంలో కళాసాహిత్య సాంస్కృతిక రాజకీయ రంగాలు నైరాశ్యపు ఊబిలో కూరుకుపోయి వున్నపుడు, అరసాన్ని బతికిద్దామని ప్రయత్నం చేయడమే చాలా గొప్ప. అలా చేసిన వ్యక్తికి సిద్ధాంతంమీద చాలా గొప్ప విశ్వాసం వుండాలి. దీక్ష, పట్టుదల కావాలి.

1955 జూలై 30, 31లలో విజయవాడలో జరిగిన అరసం సభలో శ్రీశ్రీ అధ్యక్షోపన్యాసమిస్తూ “ఫౌల్ చేసి, గోల్ చేసి గెలిచిన ప్రతీపశక్తులు పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తున్నాయి. అయిదారేళ్లకు పూర్వం అరసం సభలో పువ్వులదండల్నివేయించుకొని పెళ్లి కొడుకుల్ని చేయించుకుని జయ జయధ్వానాల మధ్య ఊ క్షుద్ర ప్రయోజనాల మరుమరీచికల వెంటపడి ఉద్యమ విచ్ఛిత్తికి దారి తీస్తున్నారు”
అంటూ “ఇప్పుడు గోచరిస్తున్న నిర్లప్తత తాత్కాలికమే… మనం పురోగమించి తీరతాం” అన్నారు.

ఇదీ మనకు ‘55లో వున్నటువంటి నేపథ్యం. దీన్నుంచి సాహిత్యాన్ని పరిశీలించినపుడు మాత్రమే రాజకీయాలకు, సాహిత్యానికి వున్న పరస్పర సంబంధం అర్తమవుతుంది. వీటి చుట్టరికం యీనాటిది కాదు. ఆంధ్ర మహాభారత అవతరణ నాటినుంచీ కొనసాగుతూనే వుంది. రాజరాజనరేంద్రుని కోసమే కలం పట్టానన్న నన్నయ్య ఆ రాజు సూర్యవంశపురాజు అయివుంటే భారతం బదులు రామాయణమే తెనిగించి వుండేవాడు. అది ప్రభువుల రాజకీయం. మనది ప్రజా రాజకీయం.

ఈ ప్రజా రాజకీయ ఆధిపత్యాన్ని మనం కళారంగంమీద ఆమోదిస్తున్నాం. రాజకీయ రంగంలో పోరాటానికి చాలా కీలకమైన పాత్ర వుంటుంది అని మన కళా సాహిత్య సిద్ధాంతాలు చెప్తున్నాయి. రాజకీయ వుద్యమాలు, ప్రజా పోరాటం వున్నపుడే మంచి సాహిత్యం రావడానికి వీలుంది. వాటినుంచి వూపిరి పీల్పుకుని వుత్తేజం పొందిన సాహిత్యమే మంచి సాహిత్యం.

1955 తర్వాత వచ్చిన తెలుగు సాహిత్యం ఒక రకంగా గుంటపూలు పూసిందని చెప్పొచ్చు. రాజకీయంగా ఆనాటి ఓటమి ప్రభావం వుపరితల రంగాలపై ఎలా ప్రతిఫలించింది అనే కోణంలోంచి చూస్తేనే మనం 56-65ల మధ్య వచ్చిన సాహిత్యాన్ని బాగా మదింపు వేయగలం.

’55 తర్వాత సాహిత్యంలోకి పెట్టుబడి ప్రవేశించింది. మన సాహిత్యం మాస్ ప్రొడక్షన్ స్థాయికి చేరుకుంది. రైసుమిల్లులు, చెరుకుమిల్లులు, జనపనార మిల్లులు పనిచేసినట్లుగానే భారీ ముద్రణా యంత్రాలు కూడా వారం వారం, నెలనెలా ఎంతో కొంత రొడ్డపడవేస్తున్నాయి. అంటే యీ పరిణామం సరిగా ’55లోనే మొదలయిందని పంచాంగం లెక్కలు కట్టి నేను చెప్పడం లేదు. కాని ఈ ధోరణి పొడసూపిందప్పుడే. ’55కు ముందు సాహిత్యం వ్యాపార వస్తువు కాలేదు.

దీనికి ఒక ఉదాహరణ – విజయవాడలో బిసెంటు రోడు జంక్షన్ నుండి ఏలూరు రోడ్డు మీద నడుస్తుంటే అనేక ప్రచురణ సంస్థలు కనిపిస్తాయి. ఇవన్నీ ’55 తర్వాతే (ఎక్కువ భాగం) వెలిశాయి. ఇవాళ తెలుగు సాహిత్యాన్ని దాదాపు కంట్రోల్ చేసే సంస్థలు ఇవే. వీళ్లందరూ మాజీ కమ్యూనిస్టులే. – ‘విశాలాంధ్రనుండి బయటకొచ్చేసినవాళ్ళే!

రెండోది- ఇవాళ తెలుగు సినిమా రంగంలో వున్నవాళ్లు ఒకప్పుడు కమ్యూనిస్టు వుద్యమంలోనో, ప్రజా నాట్యమండలిలోనో చురుకుగా కృషి చేసినవాళ్లే. ఇంకో విచిత్రం ఏమంటే వ్యాపారాలు చేసుకోమని పార్టీ నాయకులు యువకులను ప్రోత్సహించారు. ఓటమి నిర్మాణాన్ని దెబ్బతీస్తే, ’56లో రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ మహాసభలో కృశ్చేవ్ నివేదిక మార్క్సిస్టు సిద్ధాంతాన్ని వేరుపురుగులా తొలిచేసింది.

మూడోది- సాహిత్య అకాడమీ స్థాపన. ప్రభుత్వం పడగనీడలో సాహిత్యం బతకడం కచ్చితంగా 1955 తర్వాతే మొదలయింది. ఒక పాశ్చాత్య విమర్శకుడన్నట్టు “సాహిత్యానికి సమాజానికి వుండే సంబంధాన్ని కమ్యూనిస్టులు పసిగట్టినట్లుగా కమ్యూనిస్టేతరులు గ్రహించలేరు. ఇలియట్ ను చర్చిల్ కల్సుకున్నాడో లేదో తెలియదుగానీ, గోర్కీని లెనిన్, స్టాలిన్లు ఎప్పుడూ కల్సుకునేవారు.” అలాగే రాజేశ్వర్రావుగారికి శ్రీశ్రీతో గాఢ సంబంధం వుండేది. సాహిత్యానికి సమాజంలో ఏ స్థానం వుందో కమ్యూనిస్టులు అర్థం చేసుకోబట్టే సమాజంలో మార్పులకు సాధనంగా సాహిత్యాన్ని కమ్యూనిస్టులు మలుచుకుంటారు. ఇంత అవగాహన ఇంతకుముందు కమ్యూనిస్టు వ్యతిరేకులకు లేదు. మనం వాళ్లనుంచి గుణపాఠాలు తీసుకున్నట్టే, వాళ్లూ మననుంచీ గుణపాఠాలు నేర్చుకున్నారు.

’55 ఎన్నికలకు ముందు తమ అధికారం జారిపోతుందేమోనని అందర్ని పోగుచేసి (ఇనప రచయితల్ని) ప్రకటనలిప్పించారే గాని ఆనాటికి నార్లకుగాని, చక్రపాణికిగాని, అక్కినేనికి గాని సాహిత్య కళా సంస్థ లేమీ లేవు. వీటి అవసరాన్ని గుర్తించి సాహిత్యంలో ప్రభుత్వం అదుపుకూడా ’55 తర్వాతే మొదలయింది. దీనికి ప్రజాతంత్రవాది కాళోజి నారాయణరావుగారు చాలా కరెక్టుగా రియాక్టయ్యారు. ప్రభుత్వ అదుపాజ్ఞల్లో సాహిత్యాన్నుంచాలనే ప్రయత్నాన్ని అందరికంటే గొప్పగా నిరసించారాయన. తన ‘అంధ పరదేశ అగాథమి’ కవితలో.

ఆకాశవీథి ఉన్మాద స్వామి
అంధ పరదేశ స్వామి తాగాధమి
రామకృష్ణ పట్టాభిరామ చైత్యం
రాష్ట్రేతర వేంకటేశ్వర మహాత్మ్యం

ఢిల్లీబాబు సంజీవుని తోడచార్
తెలిసి తెలియక తలుపులు తెరిచినారు
పూజపేరిట గట్టిరి మాటమ్మ గుడి
పూజారుల మజా హడావుడికి దడి

బియ్యం పప్పు ఉప్పు చింతపండు
ఇయ్యదియే ‘సాహిత్యం ‘ ఇక వండు
ఆర్థికమౌ సాహిత్యానికి దారి
సార్థకమౌ సాహిత్యం పరారి.

గూఢభాషలో రాశారు కాళోజి. దీని అర్ధం వివరంగా చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైద్రాబాదులో వుంటే, ‘ఆంధ్రప్రభ’ మద్రాసులో వుండేది. దాని ఎడిటర్ నార్ల, ఆనాటి విద్యామంత్రి పట్టాభి రామారావు. తమ కాపలాకు తమ నమ్మినబంటు నార్లతో ఫోనుమీద మాట్లాడి పేర్లు తీసుకొని సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారు. అందుకనే ‘రాస్ట్రేతర వేంకటేశ్వర మహాత్మ్యం’ అన్నారు. అంటే రాష్ట్రానికి వెలుపల వున్న నార్ల వెంకటేశ్వరరావు అని. సాహిత్యంలో ఎవరెవర్ని కలపాలి, ఎవరు మనవాళ్లు, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి – అవన్నీ పాలకవర్గ అవసరాల రీత్యా చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలు గలవాడు. నిజానికి అది ఫోనుమీద తయారైన లిస్టు. అరసం కార్యదర్శి చదలవాడ పిచ్చయ్య గురించి ‘ఆకాశవీథి ఉన్మాదస్వామి” అన్నారు -అంటే ఆకాశవీథి = చదలవాడ: ఉన్మాదస్వామి = పిచ్చయ్య, ఈయన్ని ప్రభుత్వం అకాడమీకి బాధ్యుడుగా తీసుకుంది.

‘ఢిల్లీ బాబు సంజీవుని తోడ చార్’. ఢిల్లీ బాబంటే ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్. సంజీవు అంటే సంజీవరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి. చార్ అంటే భీమసేన సచార్ ఆనాటి గవర్నరు. వీళ్లందరి కనుసన్నల్లో అంటే పూర్తిగా పాలకవర్గాల అవసరాల కోసం సాహిత్యం తమ అదుపాజ్ఞల్లో వుండాలని రచయితలందర్నీ తిప్పుకోవాలని, చేసిన గట్టి ప్రయత్నం.

ఆరుద్ర ఇవాళ ఏమైనప్పటికీ ఒక మంచి మాటన్నాడానాడు. (1955లో జరిగిన ఈ సంఘటన తెలుగు కవిత్వం మీద ఒక పరోక్ష ప్రభావాన్ని చూపెట్టింది. అప్పటి యువత రాజకీయ వైముఖ్యాన్ని అవలంబించింది. దీనికి అంతర్జాతీయ కారణాలు కూడా లేకపోలేదు. స్టాలిన్ హయాంలో జరిగిన కొన్ని అవకతవకల గురించి కృశ్చేవ్ చేసిన రహస్య కథనం వెల్లడి కావడంతో మేధావులలోనూ, యువకుల్లోనూ ఒక రకమైన రివిజనిజం ప్రారంభమైంది”. తిలక్ “పులిచంపిన లేడినెత్తురు” పులువుకోలేనన్నాడు. కుందుర్తి “ప్రజాస్వామ్యమే నిజమైన వందనం” అన్నాడు. నాకు “గంట స్తంభం చూపెట్టేకాలం తప్పనిపించింది” అన్నాడు. ఆరుద్ర 1972లో ‘మహతి’లో, తిలక్ గాని, కుందుర్తిగాని, ఆరుద్రగాని 55కు ముందున లేకపోయారు పైన వుదహరించిన కవితల్లోలాగ. 1953లో స్టాలిన్ మరణశయ్యమీద వున్నప్పుడు స్టాలినను “జీవించు జీవించు హే సూర్యబింబమా దయవుంచి జీవించు ధర మూలస్తంభమా” అని ఎంతో ఆవేశంతో, ఆవేదనతో, ప్రేమతో, అంతర్జాతీయ శ్రామికవర్గ నాయకునిగా గుర్తించి ఏ ఆరుద్రయితే స్టాలిన్ మీద గొప్ప కవిత రాశాడో, అదే అరుద్ర కృశ్చేవ్ రిపోర్టు తర్వాత “గంట స్తంభం చూపెట్టేకాలం తప్ప”ని పెద్ద తెలివి తెచ్చుకున్నవాడిలాగా రాశాడు. అంతటితో ఆగాడా? కేశవరావు (నగ్నముని) ‘ఉదయించని ఉదయాలు’కి ముందుమాట రాస్తూ (1962) “అభ్యుదయ కవుల ధర్మమా అని వర్గ చైతన్యం గురించి పాడితేనే తప్ప మిగతాది కవిత్వం కాదేమోనన్న అపోహ ఆంధ్రదేశంలో అనవసరంగా ఊపిరి పీలుస్తోంది. తిరుగుబాటుదార్లపైన కూడా తిరుగుబాటు అవసరం” అన్నాడు. ఈ మాటలు ఆరుద్ర ’61లో గనక అనగల్లాడు. ’67 తర్వాత ’70 ముందు అనలేదు. మళ్లా వుద్యమం తెలుగుదేశంలో తలెత్తింది. నక్సల్బరీ, శ్రీకాకుళం వచ్చాయి. విరసం పుట్టింది. తర్వాత ’72లో ప్లేటుమార్చి ఆత్మ విమర్శ చేసుకున్నాడు ఆరుద్ర ‘మహతి’లో.

’55 ముందు దాశరథి రాసిన పుస్తకాలు ‘అగ్నిధార’ (1949) ‘రుద్రవీణ (1950) ‘మహాంద్రోదయం (1956) పేర్లెంత బావున్నాయి! అదే దాశరథి ’55 తర్వాత మహాబోధి (69) దాశరథీ శతకం వగైరా చాలా పుస్తకాలు రాశాడు. ఎవరెస్టు శిఖరం మీదనుంచి సాంతం మురికి కాలవలో పడిపోయాడు. వెంగల్రావుతో కలిసి ఫోటో తీయించుకునేంత దిగజారాడు. అట్లాగే సి. నారాయణరెడ్డి ‘కర్పూర వసంతరాయులు’ లాంటివి రాశాడు. ’59, 60 ప్రాంతాల్లో పిఠాపురంలో సభలో మాట్లాడుతూ హోరు కవిత్వం కాదన్నాడు. అంటే కవిత్వంలో వివాదాలుండకూడదు. ప్రజా జీవితం ఉండకూడదు. లకుమాదేవిలు, విశ్వనాథనాయుళ్లు కావాలి. శ్రీశ్రీలాంటి వాళ్లందరిది ఇలాంటి కవిత్వం, కృష్ణశాస్త్రిది నిజమైన మంచి కవిత్వం అని అర్థమొచ్చేలా మాట్లాడాడు.

అరసం అప్పటికే పనిచేయగల స్థితి దాటింది. కాని అభ్యుదయ సాహిత్యోద్యమం పట్ల అభిమానం గల కొందరం ‘శృంగారాభ్యుదయ కవి సినారె అందుకో సవాల్’ అని ఒక కరపత్రం వేసి, ఆయనక్కూడా పంపాం. ‘నే నసలలా మాట్లాడలేదని’ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అది పచ్చి అబద్దం. ఇదే సినారె ’70 తర్వాత ‘తమ్మునితో నేనేకీభవించకపోయినా తమ్ముడి దమ్ముని మాత్రం మెచ్చుకుంటున్నాను’ అని నక్సలైట్లనుద్దేశించి రాయడమేగాక, పొగుడుతూ ఏదో గేయం రాశాడు. ఈ రకమైన మార్పులన్నింటికీ కారణాలు గ్రహించమని కోరుతున్నాను.

అరసంలో చాలాకాలం ఉన్న కొడవటిగంటి కుటుంబరావు గారు ’55 తర్వాత ముఖ్యంగా మూడు నవలలు రాశారు. ‘వారసత్వం’, ‘ఐశ్వర్యం’, ‘ఎండమావులు’. మిత్రులొకరు ‘మధ్యతరగతి జీవితాల గురించి కాదు రాయాల్సింది. శ్రామిక జీవితాల గురించి’ అన్నారు. దేన్ని గురించి రాసినా శ్రామిక వర్గం అవగాహనతో, మార్క్సిస్టు అవగాహనతో రాయాలి. జీవితంలో వ్యాపార విలువలు ప్రవేశించాయి. అన్నిటికన్నా మధ్య తరగతిలో అవి బాగా పాదుకోవడం మొదలయింది. దీన్ని చాలా బాగా పసిగట్టి గొప్పగా చిత్రించారీ నవలల్లో కొ.కు. మధ్య తరగతి కమర్షియల్ విలువలకు ఎలా లొంగిపోతుందో, వ్యాపారం విలువలనే తిరగతిలో పడి ఎలా నలిబిలి అవుతుందో, ఆ విలువలు మానవ సంబంధాల్లో ఉండే మార్దవాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తాయో నన్నది ఈనాడు గ్రహించడం తేలిక. కాని ఆ రోజుల్లో ఆ ధోరణిని పసికట్టడం, దాన్ని నవలగా రూపొందించడం కుటుంబరావుగారికే సాధ్యమయింది. ఆయన ‘ఐశ్వర్యం’ నవలలో ఒకతను తండ్రిని, అతని ఆస్తిని కాదని తనకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుని చిన్న ఉద్యోగం చేస్తూ క్రమబద్ధంగా (డిసిప్లిన్డ్) బతుకుతుంటాడు. అతని కూతురు ’55 తర్వాతి తరానికి చెందినది. జీవితంలో రెఫ్రిజిరేటర్లు, రేడియోలు, కార్లు, సుఖభోగాలు, వ్యాపార విలువలు, డబ్బులుంటే చాలు అన్నీ పొందవచ్చుననే ఆశలు పెరిగిపోయాయి. తండ్రి జీవిత విలువలకు ప్రాధాన్యమిచ్చి ధైర్యంగా నిలబడితే, కూతురు విలాసజీవితానికి లొంగిపోయి తాతగారి ఆస్తికోసం మోజుపడుతుంది, ఆఖరికి, కడసారిగా పుట్టిన చెల్లెలికి కూడా ఆస్తిలో భాగమిచ్చేందుకు ఇష్టపడదు. ఇలా మధ్యతరగతి వ్యాపార విలువలకు దాసోహమైపోయిందని ప్రతిభావంతంగా చిత్రించారు కొ.కు.
కమ్యూనిస్టు పార్టీని, ప్రజా నాట్యమండలిని వదిలి కాందిశీకుల్లాగా సినీ ప్రపంచం లోకి వెళ్లినవారు అక్కడ ఎదుర్కొనే కడగండ్లను ‘ఎండమావులు’లో కొ.కు. రాశారు.

ఇంకో విషయం. ’55 తర్వాత వచ్చిన డిటెక్టివ్ నవలల దుమారాన్ని గురించి చెప్పుకోవాలి. అందరూ రాసినవి ఒక ఎత్తు, అరసంలో చురుగ్గా పాల్గొన్న ఆరుద్ర రాసిన ‘ఆనకట్ట మీద హత్య’ ‘అహింసారౌడీ’ ‘ఆడదాని భార్య’ ‘అణాకొక బేడస్టాంపు’ వగైరాలన్నీ ఒక ఎత్తు. అదేమని అడిగితే ‘డిటెక్టివ్ నవలలు లక్షలమంది చదువుతారు. వాళ్లకి నా సందేశం అందించవద్దా?’ అని కుంటి సమాధానం చెప్పాడు. మన సాహితీ మిత్రుడొకరు ఆవేదనతో ఉత్తరం రాస్తే ‘మీ రియాక్షన్ కరక్టే, నేను మళ్లా నా ఆత్మను తిరిగేసి తొడుక్కుంటున్నాను…’ అని జవాబిచ్చాడు. దీన్ని బట్టి తెల్సుకోవచ్చు రాజకీయాల్లో వచ్చే మార్పులు సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో.

అరసం ఒక సంస్థగా యీ డిటెక్టివ్ ధోరణులను ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు గాని కుటుంబరావుగారు మాత్రం ‘డిటెక్టివ్ కేయాస్’, ‘టివి శంకరం’ పేర్లతో గొప్ప వ్యంగ్య రచనలు చేసి ఆ ధోరణిని చావుదెబ్బకొట్టారు.

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, భారతదేశంలో, ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమాలు దెబ్బతినడానికి రష్యాపార్టీ ఇరవైయవ మహాసభ పెద్ద మైలురాయి. దీన్ని గురించి వివరంగా తెల్సుకోడానికి ఒక్క ఉదాహరణ ఇస్తా. ’55లో ఆంధ్ర ఎన్నికలయే సమయానికి రష్యన్ నాయకులు బుల్గానిన్, కృశ్చేవ్ ఈ దేశం వచ్చారు. ఆంధ్రలో ఎక్కడా వాళ్లు కాలుమోపలేదు గాని, ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. ఆఖరి మీటింగు 55 నవంబర్ ప్రాంతంలో కలకత్తాలో జరిగింది. దానికి యాభై లక్షల మంది హాజరయ్యారు. ఒక బహిరంగ సభకి యాభై లక్షల మంది రావడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమని (’55 నాటికి) అందరూ అన్నారప్పుడు. ఎలా జరిగిందిది? అంతర్జాతీయ స్టాలిన్ కున్న పేరు ప్రఖ్యాతలు, కమ్యూనిజం పట్ల ఉన్న విశ్వాసం, అభిమానం ఇన్ని కారణాలవల్ల రష్యన్ నాయకులకు ఆ ఆదరణ లభించింది. అంతర్జాతీయ శ్రామికవర్గ ఐక్యత అంతటి ప్రధాన పాత్ర వహించింది. ఒక సిద్ధాంతానికి కట్టుబడి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని మన కంటి పాపలా చూసుకుంటున్నపుడు ఆ కమ్యూనిస్టు ఉద్యమనేతలుగా వారినలా గౌరవించడం సహజం. అది అలా ఉంచి, రష్యన్ నాయకుల రాక ’55 నవంబరులో జరగ్గా స్టాలిన్ మీద దాడి ’56 ఫిబ్రవరిలో 20వ కాంగ్రెస్లో జరిగింది. అప్పుడో కమ్యూనిస్టు అభిమాని ‘ఆ గాడిద కొడుకుల్ని (రష్యన్ నాయకులు) ఇప్పుడు రమ్మను, వాళ్ల ముఖం ఒక్కడు కూడా చూడడు’ అన్నాడు.

1957లో కేరళలో మొదటి కమ్యూనిస్టు మంత్రివర్గం ఏర్పడింది. ఆంధ్రలో నేలకూలిపోయిన ఆశలు మళ్లా కేరళలో కట్టడాలుగా లేచాయి. ఈనాడు ప్రజాస్వామ్యపు బాకాలుదే ఇందిరాగాంధీ గారే ఆనాటి ఆ ప్రభుత్వ పతనానికీ ఎక్కువ కారకురాలు (కాంగ్రెస్ అధ్యక్షురాలిగా). 1957లో కేరళలో పార్లమెంటరీ పద్ధతుల ద్వారా అధికారంలోకి రాగానే 1958 అమృతసర్ కాంగ్రెస్ లో భారత కమ్యూనిస్టు పార్టీ శాంతియుతంగా సోషలిజం స్థాపించగల అవకాశాలున్నాయని ఒక తీర్మానం చేసింది. కేరళలో ప్రభుత్వం రావడమేగాక, కృశ్చేవ్ 20వ మహాసభలో ప్రతిపాదించిన సిద్ధాంతం (శాంతిని కాపాడడం, యుద్ధాన్ని నివారించడం, పెట్టుబడిదారీ విధానాన్నుండి శాంతియుతంగా సోషలిజంలోకి పరివర్తన)లోని ‘శాంతియుతంగా పరివర్తన’ వాదం కూడా ఈ తీర్మానం మీద బాగా పనిచేసింది. తర్వాత మావో ఎక్కడో ‘శాంతియుతంగా పెట్టుబడిదారీ విధానంలో నుండి సోషలిజం వస్తుందో రాదో నాకు తెలియదు కాని, శాంతియుతంగా సోషలిజంలో నుంచి పెట్టుబడిదారీ విధానం రష్యాలో వచ్చింది’ అని చమత్కరించాడు.

ఇవన్నీ కూడా ఏరకంగా ఉపరితల విషయాల్ని ప్రభావితం చేశాయో తెల్సుకున్నాం. పై విషయాలకు తోడు, 1962లో చైనాకు మనకు వచ్చిన గట్టు తగాదా (బోదే తగువు) దీన్ని పాలకవర్గాలు, ముఖ్యంగా నెహ్రూ (‘ఎర్ర రోజా మొగ్గ దరహసించిన బుగ్గ’ అని ఆరుద్ర ఏ నెహ్రూని పొగుడుతూ గేయం రాశాడో ఆ నెహ్రూ) అపర చాణక్యునికంటె తెలివిగా వాడుకున్నాడు. ’59లో కేరళలో మంత్రివర్గాన్ని అన్యాయంగా బర్తరఫ్ చేసినందుకు రాజాజీ (కరుడు గట్టిన మితవాది) లాంటి వారి నుంచి కూడా కమ్యూనిస్టులకు గొప్ప సానుభూతి లభించింది. నంబూద్రిపాద్ గవర్నమెంటు రాజ్యాంగ బద్ధంగానే ఎంతో కొంత మేలుచేసింది. రాజకీయంగా తమకున్న అధికారాన్ని ఉపయోగించి దీన్ని రద్దు చేశారని చెప్పి, ఈ దేశంలోని మధ్యతరగతికి కమ్యూనిస్టు పార్టీ మీద వచ్చిన ఆదరాభిమానాలు పోగొట్టాలని చెప్పి నెహ్రూ చేసిన కుట్ర “ఇండియాపై చైనా దురాక్రమణ’. దురాక్రమణ యుద్దంగా దీన్ని చిత్రించి కవులచేత రాయించి అచ్చు వేశారు (‘విజయ గీతావళి’). పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని (కేరళలో) నమ్మినవాళ్లే చైనా బూచిని చూపెట్టేసరికి నెహ్రూ ఒడిలోకి జారుకున్నారు. ఏ కాళోజి అయితే కేరళ సంఘటనకు చలించి ‘గోల్కొండ’ పత్రికలో ‘పిచ్చికుక్క చావు’ అని గేయం రాశారో, అదే కాళోజీ చైనా దురాక్రమణ చేసిందనేసరికి జాతీయతాభావంతో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచార గేయం రాశారు. సాహిత్యం రాజకీయాలు విడివిడిగా ఉంటాయని అమాయకులనుకుంటారు గాని ప్రభువులనుకోరు. అపర చాణక్యుడు నెహ్రూకి ఆ రెండింటి సంబంధం బాగా తెలుసు. ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నెహ్రూ చేసిన అపకారం మరెవ్వరు చేసి ఉండరు. “నెహ్రూ విజయానికి కారణమేమిటో తెల్సా, ‘నెహ్రూ లేకపోతే మనదేశం మితవాదుల చేతుల్లోకి వెళ్లేద’ని లెఫ్టిస్టులు, లెఫ్టిస్టుల చేతుల్లోకి వెళ్లి ఉండేద”ని మితవాదులు అనుకుంటారు. అలా అందరిని బుట్టలో వేసుకోగల్గాడు” అన్నాడొక అనుభవజ్ఞుడు. నెహ్రూ తెలివితేటల్ని గురించి కాదు, అవి ఏ వర్గానికి ఉపయోగిస్తున్నాడనేది ముఖ్యం. చాణక్యుడి తెలివి అమోఘం. కాని అది రాజులకే ఉపయోగపడింది. అందుకే నెహ్రూ అపర చాణక్యుడని రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారు చాలా వ్యంగ్యంగా విశదీకరించారు. అలా ఆ కవిత్వంలో సంస్కరణవాదం. భావకవిత్వం చోటుచేసుకుంటున్న యీ సమయంలో మార్క్సిస్టు చైతన్యంతో సిద్ధాంతానికి నిబద్ధమై ’60 తర్వాత సి. విజయలక్ష్మి లాంటి కవులు తలెత్తారు. సి.వి. ‘విషాద భారతం’ (1955) ‘ప్రజల పట్ల ప్రేమతో, వ్యాపార విలువలపట్ల జుగుప్సతో రాసింది. అయితే ఆయన వీర భారతాన్నో విప్లవ భారతాన్నో చూడలేకపోవడానికి ఆనాటి ఇతరేతర వ్యతిరేక శక్తులు, సైద్ధాంతిక లోపం కారణాలు. అందువల్లనే ‘ఓటు జీవిత ప్రగతికి ప్రజాతంత్రానికి రాచబాట’ అన్నాడు. ‘కారుచీకటిలో కాంతిరేఖ’ కూడా ఆయన రాసిందే. ‘విషాద భారతానికి ప్రాణాగ్ని’ వెలిగించిన కె.వి.ఆర్. అంతకు ఆరేళ్ల ముందరే ‘అంగార వల్లరి’ రాశారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల జాతరలు మాత్రమే కాదు, పంచాయితీ ఎన్నికలు కూడా కమ్యూనిస్టు పార్టీ వర్గ స్వభావానికి తిలోదకాలిప్పించాయి.

ముదిగొండ శివప్రసాద్ లాంటి తిరోగామి రచయితలు తయారయారు. తెన్నేటి సూరి ఇలాంటి కవుల కవిత్వాన్ని ‘కాలండర్ కవిత్వం’ అన్నారు. తిరోగామి పాలక వర్గాలు తమ అవసరాల కోసం చేసే సంస్కరణ విధానాలకు వీళ్ల కవిత్వాన్ని వాడుకున్నాయి, ప్రోత్సహించాయి. కేశవరావు ‘ఉదయించని ఉదయాలు’లో భావకవితా ధోరణులు, తిరోగామి ధోరణులు కూడా ప్రతిఫలించాయి.

’65 ప్రాంతాల్లో వచ్చిన గజ్జెల మల్లారెడ్డిగారి ‘మల్లారెడ్డి గేయాలు’ లో వర్గ పోరాటానికంటే కూడా సంస్కరణ భావాలకే చోటెక్కువ. అయినా సమాజంలో పేరుకుపోయిన భక్తిమీద —

“తెలుగునాట భక్తి రసం
తెప్పలుగా పారుతోంది
డ్రైనేజి స్కీములేక
డేంజరుగా మారుతోంది” లాంటి గేయాలలో పురోగామి దృక్పథం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

తెలుగు కవులను, కవిత్వాన్ని తూర్పారబడుతూ ’59లో తెన్నేటి సూరి ‘సాహిత్య సమవాకారం’ అనే వ్యంగ్య నాటకం రాశారు (‘భారతి’). కొద్దిరోజుల తర్వాత ఈ ఇన్‌స్పిరేషన్స్ పురాణం సుబ్రహ్మణ్యశర్మ ‘విశాలాంధ్ర’ ఆదివారం సంచికలో ‘రెక్కవాలింది’ అనే కథ రాశారు. ఆనాటి తెలుగు సాహిత్యాన్ని రైలుబండితో పోల్చారు. ఒక పెట్టె నిండా అనువాదాలు, ఒక పెట్టెనిండా డిటెక్టివ్ నవలలు ఇలా సాగుతుంది బండి. కాసేపటికి బండి ఆగిపోతుంది. ఏమిటా అని అందరూ చూసేసరికి ‘శారద’ (తెనాలిలో హెటల్ సర్వర్ గా ఉంటూ తెలుగు నేర్చుకుని ‘మంచి – చెడూ’, ‘ఏది సత్యం’ లాంటి నవలలు రాశాడు) బండికిందపడి చచ్చిపోతాడు. ఆనాడు తెలుగు సాహిత్యంలో సృజనాత్మకత ఎలా లోపించిందో తెలుసుకోడానికి ఈ కథ బాగా పనికొస్తుంది.

ఈ దుస్థితి నుంచి తెలుగు సాహిత్యాన్ని బయటకు తీసుకొచ్చిన కీర్తి రావి శాస్త్రిగారికి దక్కుతుంది. నాలుగు గోడల మధ్య నుంచి కథను నాలుగు రోడ్ల కూడలిలోకి తీసుకొచ్చారాయన. 1961 లో వెలువడిన ‘సారా కథలు’ గొప్ప మలుపు. నిజమైన సాహిత్య విలువలతో ప్రజాజీవితాన్ని చక్కగా చిక్కగా చిత్రించినవి ‘సారా కథలు’. 1955 నుండి ’60 వరకు సాగిన తిరోగమన ధోరణిని వెనక్కి నెట్టేస్తూ ‘సారా కథలు’ తోపాటు కాళీపట్నం రామారావుగారి ‘యజ్ఞం’ కథలు వచ్చాయి.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాసిన ఆళ్వారు స్వామిగారు ‘ప్రజల మనిషి’, ‘గంగు’, మహీధర ‘ఓనమాలు’, ‘జైత్రయాత్ర’ నవలలన్నీ కూడా ఈ పదేళ్లలోనే వచ్చాయి. తెలుగు నవలకు మంచి రోజులొచ్చాయని సాహిత్యాభిమానులు మురిసిపోయారు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు నవలల్ని సుసంపన్నం చేసింది ఇలాంటి రాజకీయ నవలలే. జి.వి. కృష్ణారావుగారి ‘కీలు బొమ్మలు’, మహీధర రామమోహనరావుగారి ‘రథచక్రాలు’, శ్రీదేవిగారి ‘కాలాతీత వ్యక్తులు’ ఈ దశలో వచ్చినవే. గోపీచంద్ రాసిన ‘చీకటి గదులు’ చెప్పుకోదగ్గ నవల. యాభై ఏళ్ల తెలుగు సామాజిక చరిత్రని ఇందులో చిత్రించారు. ఈ రకంగా కథలు, నవలలు తిరోగమించిన కవులను కూడా తట్టిలేపాయి. కవిత్వానికి తిరోగమనం, వచనానికి పురోగమనం. తెలుగు సాహిత్య భవిష్యత్తు గురించి ’53లో ఆరుద్ర చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ‘రానున్న పదేళ్లలో తెలంగాణ సాహిత్య ప్రపంచానికి మార్గదర్శి అవుతుంది. తెలంగాణ నుండి భావి ఉద్యమాలు తలలెత్తుతాయి, ననలెత్తుతాయి. కోస్తా జిల్లాలు సుస్తీపడుతున్నాయి. రాయలసీమలో భావోదయం బాగా కలుగలేదు. తెలంగాణ ఆంధ్రకి నాయకత్వం వహించేట్లు కనబడుతుంది’ (దాశరథికి ఆరుద్ర రాసిన సాహిత్య లేఖలోని మాటలివి) అలాగే తెలంగాణలో ’64 తర్వాత కవితా ఉద్యమాలు తలలెత్తుతాయి. హైదరాబాదులోని అమరసాహితి ప్రచురించిన రాత్రి’ కవితా సంకలనం కమ్మిశెట్టి వెంకటేశ్వర్ రావు గారు ఏమని పలవరిస్తున్నారో వినండి

హృదయం మరణిస్తున్నది
స్వార్థం ద్రోహపు జిహ్వల సాచి రగులుతోంది
బీభత్సరవాల విశ్వవీణ మ్రోగుతోంది
తెలియని ఏ దెసకో కాలరథం సాగుతోంది
ఎప్పటిలాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు.

తెలుగు సాహిత్యానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన దిగంబర కవులు, పోరాట బాట వెంట నడచిన ‘తిరగబడు కవులు’ తెలంగాణ నుంచే వచ్చారు. తిరోగమనం తాత్కాలికమే. పురోగమనానిదే పైచేయి.

(విజయవాడ (1988 జనవరి) ‘సాహిత్య పాఠశాల’ ప్రసంగ వ్యాసం – సాహిత్య చరిత్ర : (1955-65))
పునర్ముద్రణ: మనలో మనం, సెప్టెంబర్ 1990

Leave a Reply