“నో”, “షట్ అప్”, “గెట్ అవుట్ ‘’ ఈ మూడు పదాలు టోనీ మారిసన్ ఒక ఇంటర్వ్యూ లో జర్నలిస్ట్ పదే, పదే జాతి వివక్ష గురించి అడిగిన ప్రశ్నల కి తన సమాధానాలుగా చెప్పింది. ఎంత సాధికారత తన సమాధానాల్లో? ఇది అహంకారం కాదు ఆత్మగౌరవం. ఈ మూడు పదాల అర్థం ఏంటంటే, తను ఏం చేయాలనుకుంటుందో అది మాత్రమే చేయడాన్ని, ఏమి మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడే హక్కుని సాధించింది అని! Yes! She is Toni Morrison -the proud black afro-american writer!
*నువ్వు ఏదైనా చదవాలని చాలా తపన పడ్డావు, అయితే అది ఇంకా రాయబడలేదనుకో.., ఖచ్చితంగా అది నువ్వు రాసి తీరాల్సిందే!
*నువ్వు ఆకాశంలోకి ఎగరాలనుకుంటే, ముందు నిన్ను కిందికి లాగి పడేసే చెత్తని, బరువుని వెంటనే వదిలించుకోవాల్సిందే.
*నిన్ను ప్రేమిస్తున్నా అనుకోకు. నేను ప్రేమలో పడలేదు… ప్రేమలో పెరిగాను.
*ఒకసారి చచ్చిపోయింది ఏదైనా జీవితంలోకి తిరిగి వస్తే, అది చాల గాయపరుస్తుంది.
*నా మొదటి నవలను ఎందుకు రాసానంటే, దాన్ని నేను చదవాలనుకున్నాను కాబట్టి.
*పేరు లేని వాటి నుంచి కలిగే భయం నుంచి భాష మాత్రమే మనల్ని రక్షిస్తుంది., భాష ఒక ధ్యానం లాంటిది.
*నీకు తగినట్లుగా మార్చుకోలేని ఈ ప్రపంచం ఎందుకు నీకు? – టోనీ మారిసన్.
అవును, మనకు తగినట్లుగా ప్రపంచాన్ని, కనీసం తమ చుట్టూ జాత్యాహంకారంతో విర్రవీగుతున్న అమెరికన్ సమాజాన్ని, దాన్ని భయంతో మౌనంగా భరిస్తున్న ఆఫ్రికన్-అమెరికన్ సమాజాన్ని మార్చుకోవాలని తన నల్ల జాతి ప్రజలని తన రచనల ద్వారా ఆగ్రహంతో ప్రశ్నించింది టోనీ మారిసన్. “మనిషికి సంబంధించింది మనదాక వచ్చే విశ్వసనీయ సమాచారాల్లో, అతి తక్కువ సమాచారం వర్ణానికి సంబంధించింది. అది ఎంత గొప్ప సమాచారం అంటే, అది కొంచెం కూడా మనిషి గురించి చెప్పదు” అంటుంది టోనీ మారిసన్. తన జాతి మనుషుల్ని అంధకారంలో, భ్రమలో ఉంచే ఈ వర్ణ వివక్ష మూలాల గురించి, దాని పునాదిగా తమ మీద శతాబ్దాలుగా అమలవుతున్న కుట్రా రాజకీయాలు, హింసా దౌర్జన్యాలకు గురించి తెలుసుకోవాలని, ప్రశ్నించాలని, పోరాడాలని, ప్రాణం కంటే ఆత్మ గౌరవం ముఖ్యమని, బానిసత్వంలో జీవన్మృతులుగా బతకడం కంటే చావడం మేలని, వాళ్ళ జాలి, సానుభూతి మనకు అవసరం లేదని, మన హక్కుల కోసం కన్నీళ్లు కార్చవద్దని, తిరగబడి పోరాడి సాధించాల్సిందే అని పిలుపునిచ్చింది టోనీ మారిసన్. ఆమె తన ప్రతి రచనలో జాత్యహంకారానికి, వివక్ష, దౌర్జన్యం, పీడనలను ధిక్కరించి నిలిచి పోరాడిన పాత్రలనే సృష్టించింది. తెల్ల జాతి పురుషుల చేతుల్లో తీవ్రమైన లైంగిక అత్యాచారాలకు, పరాభావాలకు, శ్రమ దోపిడీకి, మరణాలకు లోనైన తమ నల్ల జాతి స్త్రీల కన్నీళ్ళ అవమానాల కథలను అత్యంత వేదనతో తన సాహిత్యంలో లిఖించింది. జాతి వివక్ష ఎంత అమానవీయమైందో అసలు అది మానవ జాతి అభివృద్ధికి ఎంత ఆటంకమో అసలు అది దేనికీ పనికి రాదు అని ఎప్పుడైతో అర్థం అవుతుందో అది దానికదే అంతం అవుతుంది అని అంటుంది టోనీ మారిసన్. ఇంకా స్పష్టంగా ఇలా అంటారు టోనీ – “Race is the least reliable information you can have about someone. It’s real information, but it tells you next to nothing.”
టోనీ మారిసన్ నల్ల జాతి ప్రజలపై శతాబ్దాలుగా కొనసాగిన అణిచివేత రూపాల్ని తన రచనల్లో అత్యంత వాస్తవికంగా చిత్రించిన రచయిత్రి. నోబుల్ సాహిత్య పురస్కారాన్ని, పులిట్జర్ బహుమతిని అందుకున్న, ప్రపంచమంతా ఆరాధించిన తొలి నల్లజాతి రచయిత్రి. టోనీ రచయిత్రి మాత్రమే కాదు, మంచి వక్త, మేధావి, వ్యాసకర్త, కవయిత్రి, ప్రొఫెసర్, పిల్లల కథకురాలు, సంపాదకురాలు తన స్వంత ప్రచురణలు సంస్థ అయిన ‘బ్లాక్ బుక్స్’ కి యజమానురాలు. అణిచివేతకు గురవుతున్న తన ఆఫ్రికన్ జాతి గొంతుక. తెల్లజాతి పిల్లల మధ్య పెరుగుతూ, చదువుకుంటూ బాల్యమంతా వారి అవహేళనలు, అవమానాల మధ్య గడిపిన దుర్భరమైన అనుభవాల్లోంచి, తన పరిస్థితికి మూల కారణాల్ని సమాజంలో వెతుక్కోడమే కాదు, అప్పటి కాలంలో దొరికిన ఆఫ్రికన్ సాహిత్యంలో కూడా శోధించి., బాల్యం నుంచే నిరంతరం అధ్యయనం చేసింది. ఎంతో ఇష్టంగా టాల్ స్టాయ్, జేన్ ఆస్టిన్, ఆనా సాహిత్యం చదివేది. యూరోపియన్ సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసేది హై స్కూల్ వయసు నుంచే సాహితీ చర్చల్లో పాల్గొంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరించేది. అలాగే స్కూల్లోని నాటక లేక డ్రామా క్లబ్ లో సభ్యురాలిగా ఉంటూ చురుకుగా క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొనేది తన చుట్టుముట్టి ఉన్న అసమానవర్గ, వర్ణ వివక్ష సమాజాన్ని గమనిస్తూన్న టోనీ మారిసన్ కి తమ మీద అన్యాయంగా అమలవుతున్న తల్లకిందులుగా ఉన్న తెల్లవాడి న్యాయాలు, చట్టాలు తమ నల్ల జాతి పట్ల శ్వేతజాత్యాహంకారుల క్రౌర్యాలు, తమ పట్ల అమానవీయంగా ఉన్న నిర్దాక్షిణ్య ప్రపంచం ఎలా మారుతుంది అని తీవ్రంగా మదన పడేది. దానికి పరిష్కారంగా సాహిత్యాన్ని ఎన్నుకుంది. అప్పటిదాకా తెల్లజాతి రచయితలు రాసిన ఆఫ్రికన్ ప్రజల జీవితాలకు సంబంధించిన సాహిత్యంలో ని అవాస్తవాలను, మోసాన్ని తిప్పి కొడుతూ అసలు, సిసలైన నల్లజాతి జీవితాల కడగండ్ల వాస్తవిక సాహిత్యాన్ని రాసి ప్రపంచ సాహిత్య వేదికమీద అత్యంత ధైర్య సాహసాలతో నిలబెట్టింది. అంతే కాదు గుర్తింపుకి నోచుకోని ఇతర తన సమకాలీన ఆఫ్రో-అమెరికన్ రచయితల రచనలు ప్రపంచానికి బాధ్యతగా పరిచయం చేసింది. నల్ల జాతి మీది వివక్షను తీవ్ర స్వరంతో తన అంతిమ శ్వాస వరకు వినిపించిన బలమైన గొంతుక టోనీ మారిసన్. అమెరికన్ సాహిత్య ప్రపంచం పైన ఆఫ్రో-అమెరికన్ రచయితలు అనితరసాధ్యమైన ముద్ర వేసారు. ఒక గొప్ప చారిత్రాత్మకమైన కూర్పు చేకూర్చారు ఆఫ్రికన్ సాహిత్యానికి. దాన్ని మరింత హిమవన్నగ శిఖరానికి చేర్చిన రచయిత్రి టోనీ మారిసన్.
టోనీ మారిసన్ అసలు పేరు ‘క్లోయీ ఆర్డెలియా వోఫోర్డ్’.. అయితే ఇది తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆమె మతం మారాక తన పేరు ఆంథోనీ గా మార్చబడింది. ఆంథోని లోని టోనీని తన పేరు గా మార్చుకున్నది. పెళ్లి అయ్యాక భర్త పేరు మారిసన్ చివరి పేరుగా మారింది. టోనీ 1931 లో ఒహాయో రాష్ట్రంలోని లొరేన్ నగరంలో రామాహ్ విల్లిస్, జార్జ్ వోఫోర్డ్ లకు జన్మించింది. తల్లి రామాహ్ విల్లిస్ అలబామాలోని గ్రీన్విల్ లో జన్మించి తరువాత బాల్యంలోనే కుటుంబంతో దక్షిణ అమెరికాకి వలస వచ్చింది. టోనీ తండ్రి జార్జ్, జార్జియా లోని కార్టర్స్విల్ లో పెరిగాడు. జార్జ్ వోఫోర్డ్ కి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతని వీధిలో వ్యాపారం చేసుకునే ఇధ్ధరు నల్లజాతి వ్యాపారస్తులని తెల్ల జాతి మూక ఒకటి క్రూరంగా నరికి చంపేసింది. “నాన్న ఆ నల్లజాతి వ్యాపారస్తుల శవాలనుకూడా తను చూడలేదు అని మాతో అబద్ధం చెప్పాడు కానీ నాన్న వాళ్ళ మృత దేహాలను చూసాడు ఎంతగా గాయపడ్డాడంటే చాల కాలం దాన్ని మర్చిపోలేక పోయాడు” అని టోనీ తన జ్ఞాపకాల్లో రాసుకుంటుంది ఆ తరువాతే జార్జ్ కుటుంబంతో వర్ణ వివక్ష కొద్దిగా తక్కువ ఉన్న, ఎన్నో రాష్ట్రాల బీద ప్రజల వలసల రాష్ట్రం, పని కూడా దొరికే ఒహాయో రాష్ట్రానికి వలస వెళ్ళిపోయాడు. నిజానికి టోనీ ముప్పై ఆరు సంవత్సరాల అమ్మమ్మ తన కూతుళ్ళ మీద తెల్లవారి లైంగిక అత్యాచారాలు జరగకూడదు అనే ఆలోచనతో ఏడుగురు ఆడ పిల్లలందరినీ తీసుకొని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలస వచ్చేసింది. టోనీ లొరేన్ లొనే పుట్టింది. నలుగురు పిల్లల మధ్య దుర్భరమైన దారిద్ర్యం లో ఏ సౌకర్యాలు లేని మురికివాడల్లో మెక్సికన్స్, ఇటాలియన్స్, ఇతర ఆఫ్రో-అమెరికెన్ల మధ్య పెరిగారు టోనీ ఆమె అక్కచెల్లెళ్ళు. టోనీ తల్లి పిల్లలకోసం, టోనీ చదువు కోసం చాల ఉద్యోగాలు చేసింది. టోనికి అమ్మ, అమ్మమ్మ ఆదర్శం. టోనీ అమ్మ ఆఫ్రికన్ మెధడిస్ట్ చర్చిలో సభ్యురాలిగా ఉండేది. టోనీ తన పన్నెండవ ఏట బాప్టిజం తీసుకొని, కాథలిక్ గా మారి, క్లోయీ ఆర్డీలియా నుంచి ఆంథోనీ గా మారింది. అదే ఆమె ముద్దు పేరైన టోనీ గా మారింది.
టోనీ తాత బానిసత్వంలోనే పుట్టి, బానిసత్వంలోనే పెరిగి, జీవితమంతా బానిసత్వం చేస్తూనే మరణించాడు. అమెరికా దక్షిణాది రాష్ట్రాల నుంచి క్రూరమైన జాతి వివక్షని, హింసని తప్పించుకోవడానికి 1900లలో జార్జ్ కుటుంబం ఉత్తరాది ఒహాయో రాష్ట్రం లోని లొరేన్ అనే చిన్న పట్నానికి వలస వచ్చాక, జార్జ్ ఒఫ్ఫోర్డ్ షిప్ వెల్డర్ గా పని మొదలు పెట్టాడు. టోనీ తండ్రి కుటుంబ పోషణకు, పిల్లల చదువుల కోసం ఏకకాలంలో మూడు ఉద్యోగాలు పదిహేడు సంవత్సరాలు చేసాడు. లొరేన్ మరీ పెద్దది కాని చిన్న పట్నం. వేలసంఖ్యలో ఇక్కడ కి వలసవచ్చిన బీద మెక్సికన్లు, ఆఫ్రికన్-అమెరికన్లు, యూరోపియన్లు కలిసి జీవించేవాళ్ళు. వాళ్ళందరిదీ ఒకటే వర్గం. అది శ్రామిక వర్గం. టోనీ తండ్రి జార్జ్ స్టీల్ వెల్డింగ్ పని, కార్ వాషింగ్, లేబర్ పని లాంటి పనులు రోజులో ఒకదాని తరువాత ఒకటి చేస్తూనే ఉండేవాడు. ఆ పనులు ఎక్కడ దొరికితే అక్కడికి ఇంటిని మారుస్తూ ఉండేవాడు. బీద కార్మక వర్గానికి చెందిన టోనీ తన తల్లిదండ్రులు తమను పోషించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చాలా సునిశితంగా గమనించింది. టోనీ మారిసన్ చిన్నతనంలో, ఇంటి బాడుగ కట్టలేదన్న కోపంతో, ఇంటి యజమాని ఇంటికి నిప్పు పెట్టేస్తే ఇంటిల్లిపాదీ ఆ అగ్నిప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారో తన ఆనుభవాల్లో చెబుతుంది టోనీ. తండ్రిలో నిరంతరం తమ నల్లవారి పైన దాష్టీకం దౌర్జన్యాలు చేస్తున్న తెల్లవారిపైన తీవ్రమైన నిరసన, ఆగ్రహముండేది. ఆయన వ్యక్తిత్వ ప్రభావం టోనీ పై బాగా పడింది. ఆ మురికి వాడల్లో స్త్రీల పైన జరిగే లైంగిక అత్యాచారాలు, అదీ తెల్లవాళ్ళు నల్ల జాతి స్త్రీల పైన చేసే లైంగిక అత్యాచారాలు చూసి టోనీ చాల కలవర పడేది.
టోనీ తండ్రి తన కూతుళ్ళను చాల జాగ్రత్తగా కాపాడుకునేవాడు. అతనికి తెల్లవారి దాష్టీకాలు తగ్గుతాయన్న నమ్మకం ఉండేది కాదు కానీ, టోనీ తల్లి రమాహ్ కి మాత్రం ఎప్పటికైనా తమకి మంచిరోజులు వస్తాయన్న ఆశావాహ దృక్పథం ఉండేది. భక్తితో చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసేది. టోనీ తండ్రి జార్జి తన కూతుళ్ళతో వెకిలి వేషాలు వేసే తెల్లవాళ్లను అసలు వదిలేవాడు కాదు. ఒకసారి తన కూతుళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన ఒక తెల్ల జాతి పురుషుణ్ణి మేడ పైన నుంచి కిందికి తోసేసి, అతని పైన సైకిల్ ని ఎక్కించి తొక్కి పడేసి, అతన్ని భయభ్రాంతుణ్ణి చేసాడు. భయంతో, బానిసత్వంలో బతికే నల్ల జాతి ప్రజలకు జార్జ్ చేసిన ఈ తిరుగుబాటు సంఘటన గొప్ప ప్రేరణగా నిలిచింది. ఈ సంఘటన, తండ్రి లోని తెగింపు, చులకన భావంతో నల్లజాతి స్త్రీల మీద, తెల్లవాళ్ళు చేసే లైంగిక అత్యాచారాలను భరించాల్సిన అవసరం లేదని తండ్రి జార్జ్ ఇచ్చిన సందేశం టోనీ మారిసన్ జీవితం మీద గొప్ప ప్రభావాన్ని వేసింది. తండ్రి ఆగ్రహం వెనకున్న అప్పటి సామాజిక అసమానతలను అర్థం చేసుకోడానికి ఆ సంఘటన బాగా ఉపయోగ పడింది. నల్లజాతి స్త్రీల మీద విచ్చలవిడిగా లైంగిక అకృత్యాలు చేసే అధికారం, తెల్ల జాతి పురుషులకు ఇచ్చిన జాత్యాహంకార మూలాలను బాగా అర్థం చేసుకున్నది టోనీ మారిసన్. ఈ బాల్య అనుభవాల్లోంచి, తన స్వీయ జీవితానుభవాల్లోంచి, చుట్టూ నల్లజాతి ప్రజల మీద జరుగుతున్న అమానుషత్వాల్లోంచే ఆమె తన సాహిత్య వస్తువుల్ని ఎంచుకొని ఎంతో ఆర్ధ్రంగా, వేదనతో, ఆగ్రహంగా రచనలు చేసింది.
ఇద్దరు కొడుకులతో టోనీ తల్లితో టోనీ
నలుగురి సంతానంలో టోనీ రెండవది. టోనీ తన కుటుంబంలో బాల్యం నుంచీ నల్ల జాతి వారి జానపద కథలు దెయ్యాల కథలు, పాటలు వింటూ పెరిగింది. ఆఫ్రికన్ జాతి సంస్కృతీ సంప్రదాయాల పట్ల టోనీ ఎనలేని ప్రేమని పెంచుకుంది ముఖ్యంగా మౌఖిక సాహిత్యం లో కథలు, పాటలు, ప్రత్యేకించి భాష పట్ల ఆమె అంతులేని మక్కువ పెంచుకున్నది. ఆమెనే కాదు టోనీ ఇంట్లో తల్లిదండ్రులు, ఇతర పెద్ద వాళ్ళతో పాటు, చిన్న పిల్లలు కూడా కథలు చెప్పుకునే వారు. పగలంతా పనులు చేసి, ఆరు బయట వెన్నెల రాత్రుళ్లలో పెద్ద వాళ్ళు చెప్పే జానపద కథల్ని చిన్నపిల్లలు మైమరిచిపోతూ వింటూ, తమ స్వంత ఊహా లోకాల్లో ఆ అద్భుతమైన జానపద కథల దృశ్యాల్ని చూసేవాళ్ళు. ఈ అద్భుతమైన వాతావరణమే టోనీ మారిసన్ ను తన రచనల్లో నల్లజాతీయుల మౌఖిక సంప్రదాయాలను, సాంస్కృతిక వారసత్వాన్నీ, విస్తృతినీ రాసేలా చేసింది. తన కథనా శైలి కూడా మిగతా అమెరికన్ రచయతలకంటే భిన్నంగా నూతన పద్ధతిలో ఉండేది, ఎవరినీ అనుకరించలేదు. టోనీ మారిసన్ కి నోబుల్ పురస్కారాన్ని అందచేస్తున్న సందర్భంలో, “టోనీ మారిసన్ కి తన కాలం కంటే చాలా ముందుకు ప్రయాణించగల ఉహాశక్తి స్వంతం కాబట్టే ఆమె అత్యద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించగలిగింది” అని స్వీడిష్ అకాడమీ అభిప్రాయపడింది. అందుకే టోనీ మారిసన్ ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత్రిగా గుర్తింపు పొందింది.
బాల్యం నుంచీ తను చదివిన లొరేన్ హై స్కూల్ వరకు వర్ణ వివక్షను చూసిన టోనీ, 1949 లో ఉన్నత విద్య కోసం వాఁషింగ్టన్ డీసీ లోని అత్యంత చారిత్రాత్మకమైన నల్ల జాతీయుల విశ్వవిద్యాలయం ఐన హావర్డ్ లో చేరిన తరువాత వర్ణ వివక్ష విశ్వరూపాన్ని చూసి విభ్రమకి లోనయ్యింది. నల్ల జాతీయుల పట్ల తెల్ల జాతీయులు అడుగడుగునా పాటించే అంటరానితనం ఆమెని విచలితురాలిని చేసింది. వాషింగ్టన్ లో నల్లవాళ్ళ కోసం హోటళ్లు, బస్సులు, దుకాణాలు అన్నీ విడి, విడిగా ఉండడం చూసి వర్ణ వివక్ష తాలూకు క్రూర వికృత స్వభావాన్ని టోనీ అర్థం చేసుకుంది. హావర్డ్ యూనివర్సిటీలో 1953 లో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ తీసుకుని, 1955లో కార్నెల్ విశ్వవిద్యాలయం లో ఎమ్మె పీజీ చేసింది. ఆమె మాస్టర్స్ ధీసీస్ కి వర్జీనియా వూల్ఫ్, విలియం ఫాక్నర్ ల రచనలలో అంటరానితనానికి లోనైన వారి పట్ల వివక్షాపూరిత ప్రవర్తనల రూపాలు “ట్రీట్మెంట్ అఫ్ ఎలియనేటెడ్” (Treatment of Alienated) అనే అంశం మీద పరిశోధనా పత్రాన్ని తయారు చేసింది. తరువాత 1955-1957 వరకు హూస్టన్ లోని టెక్సాస్ సథరన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేసింది. హావర్డ్ యూనివర్సిటీలో ఏడు సంవత్సరాలు ఆంగ్ల భాషా బోధన చేసింది. అక్కడే ఆమెకి జమైకన్ ఆర్కిటెక్ట్, కోలీగ్ హావర్డ్ ప్రొఫెసర్ అయిన ‘హారల్డ్ మారిసన్’ పరిచయం అయ్యాడు. 1958లో వీరి వివాహం అయ్యింది. మొదటి సంతానం తరువాత రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు, భర్తతో విభేదాలు వచ్చి టోనీ 1964 లో విడాకులు తీసుకున్నది.
తరువాత, న్యూ యార్క్ లోని ‘రాన్డమ్’ ప్రచురణ సంస్థలో అమెరికన్ సాహిత్య చరిత్రలోనే మొట్టమొదటి నల్ల జాతి మహిళా సంపాదకురాలిగా సాహిత్య పేజీలో తన కెరీర్ ప్రారంభించింది. పత్రికల్లో నల్లజాతీయుల మీద అమలవుతున్న వివక్షలను, నల్ల జాతి సాహిత్యకారుల సాహిత్యాన్ని విరివిగా ప్రచురించడం మొదలుపెట్టింది. అంతే కాదు, తాను ఎడిటర్ గా ఉన్న సమయంలోనే “కాంటెంపరరీ ఆఫ్రికన్ లిటరేచర్” అనే నల్ల జాతీయుల రచనల సంపుటిని ముద్రించింది. ఆ సంపుటిలో “వోలె సో యంకా, చినువా అచుబె, సౌత్ ఆఫ్రికన్ నాటక రచయిత అథాల్ ఫ్లగార్డ్ లాంటి ప్రఖ్యాత ఆఫ్రికన్ రచయితల సాహిత్యం ఉంది. టోనీ మారిసన్ రాన్డమ్ హౌస్ ప్రచురణ సంస్థ సంపాదకురాలిగా అప్పటి తరపు కొత్త ఆఫ్రో-అమెరికన్ రచయతలను వెలుగులోకి తెచ్చింది. వాళ్ళల్లో, కవి, నవలాకారుడైన టోనీ కేడ్ బాంబరా, రాడికల్ ఏక్టివిస్ట్ ఏంజెలా డేవిస్, బ్లాక్ పాంథర్ –హుయీ న్యూటన్, నవలాకారుడు గేయిల్ జోన్స్ ఉన్నారు. గేయిల్ జోన్స్ రచనలను మొదట టోనీయే గుర్తించి ప్రచురించింది. 1975 లో ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ చాంఫియన్ అయిన మొహమ్మద్ అలీ ఆత్మకథ “ద గ్రేటెస్ట్- మై ఓన్ స్టోరీ” ని ప్రచురించింది. అలాగే, 1968 లో న్యూ యార్క్ సిటీ సబ్ వే లో ట్రాన్సిట్ ఆఫీసర్ చేత కాల్చి చంపబడ్డ కవి, నవలాకారుడు అయిన హెన్రీ డుమాస్ సాహిత్యాన్ని ప్రచురించింది. 1974 లో యునైటెడ్ స్టేట్స్ లో 1920 నుంచీ అమలులో ఉన్న నల్ల జాతి బానిసత్వాన్ని సాహితీకరించిన కథలు, వ్యాసాలు, డాక్యుమెంట్లు, నిజనిర్ధారణ పత్రాలు, ఫొటోగ్రాఫ్స్ కలిపి తెచ్చిన ‘బ్లాక్ బుక్’ సంకలనానికి సంపాదకత్వం చేసింది. రాన్డమ్ హౌస్ ప్రచురణ సంస్థ మొదట ఈ పుస్తకాన్ని తేవడానికి సందేహించినా మంచి సమీక్షలు వచ్చి ప్రజాదరణ పొందింది. ఆల్విన్ బీమ్ లాంటి సంపాదకులు టోనీ మారిసన్ పనిని పొగడ్తలతో ముంచెత్తారు. 1970 ల నుంచీ 1980ల వరకూ టోనీ మారిసన్ తన స్వంత రచనలు విస్తృతంగా చేయడం మొదలు పెట్టింది.
టోనీ మారిసన్ ప్రతిభకు వచ్చిన పురస్కారాలు –
టోనీ మారిసన్ ప్రతిభకు లెక్కలేనన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు లభించాయి.
*1975- ఒహాయాన బుక్ అవార్డ్- సుల నవలకు
*1977-నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు -సాంగ్ ఆఫ్ సొలొమాన్ నవల
*అమెరికన్ అకాడెమీ అండ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డు
*1987-1988-రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ బుక్ అవార్డు
*1988-హెల్మెరిచ్ అవార్డు
*1988-అమెరికన్ బుక్ అవార్డు -బిలవెడ్ నవల
*1988-ఎనిస్ఫీల్డ్- వూల్ఫ్ అవార్డు -బిలవెడ్ నవలలో టోనీ చర్చించిన జాతి, వర్ణ వివక్ష సంబంధాలు
*1988-పులిట్జర్ ప్రైజ్ -బిలవెడ్ నవల
*1988-ఫ్రెడే రిక్ జి మెల్చేర్ బుక్ అవార్డు
*1988-ఓహియాన కెరీర్ మెడల్ -విద్య,సాహిత్యం,హ్యూమానిటీస్ లో టోనీ మారిసన్ అందించిన సేవలకు
*1988-హానరరీ డాక్టర్ ఆఫ్ లాస్ -యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
*1989-హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ -హార్వర్డ్ యూనివర్సిటీ
*1993-నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్
*1993-కోఅమ్మాన్డెర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ -పారిస్
*1994-కండోర్సెట్ మెడల్ -పారిస్
*1994-రెజియం జూలిప్రైజ్ ఫర్ లిటరేచర్
*1996-జెఫ్ఫర్సన్ లెక్చర్
*1996-నేషనల్ బుక్ ఫౌండేషన్స్ మెడల్ ఆఫ్ డిస్టింగ్యుషేడ్ కెఎంట్రిబ్యూషన్ తో అమెరికన్ లెటర్స్
*1997-హానరరీ డాక్టరేట్ ఆఫ్ హ్యూమెన్లెటర్స్ ఫ్రొం గుస్టావస్ అడాలఫస్ కాలేజ్
*2000-నేషనల్ హ్యుమానిటీస్ మెడల్
*2002-100 గ్రేటెస్ట్ ఆఫ్రికన్-అమెరికెన్స్,లిస్ట్ బై మోలేఫి కేటే అసంటే
*2005-గోల్డెన్ ప్లేట్ అవార్డు అఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ అచీవ్మెంట్
*2005-హానారారీ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ ఫ్రొం యూనివర్సిటీ ఆఫ్ ఆక్సఫర్డ్
*2008-న్యూ జెర్సీ హాల్ ఆఫ్ ఫెమ్ ఇండక్ట్
*2009-నార్మన్ మైలర్ ప్రైజ్ -లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు
*2010-ఆఫీసర్ డే లా లెజియన్ డిహానర్
*2010-ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ మెడల్ ఫర్ డిస్టింగ్యుషేడ్ కంట్రిబ్యూషన్స్ టు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ -పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ
*2011- లైబ్రరీ ఆఫ్ కాంగ్రేస్ క్రియేటివ్ అచీవమెంట్ అవార్డు
*2011-హానెరరీ డాక్టరేట్-రటీజర్స్ యూనివర్సిటీ / యూనివర్సిటీ ఆఫ్ జెనీవా /2013-ప్రిన్స్ టెన్ యూనివర్సిటీ
*2012-ప్రెసిడెన్ షియల్ అవార్డు ఆఫ్ ఫ్రీడమ్
*2013-పెన్ ఓక్లాండ్ -జోసెఫీన్ మెయిల్స్ లిటరరీ అవార్డు -హోమ్ నవల
*2016-పెన్ /సాల్ బెల్లౌ అవార్డు ఫర్ అచీవమెంట్ ఫర్ అమెరికన్ ఫిక్షన్
*2016-చార్లెస్ ఎలియట్ నార్టన్ ప్రొఫెసర్ షిప్ అవార్డు ఇన్ పోయెట్రీ
*2018-ది థామస్ జెఫ్ఈసం మెడల్ -అమెరికన్ ఫిలసోఫికల్ సొసైటీ
*ప్రతిపాదనలు –2008 -గ్రామీ అవార్డు -బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ ఫర్ చిల్డ్రన్
టోనీ మారిసన్ రచనలు–నవలలు – ద బ్లూఎస్ట్ ఐ, సుల, సాంగ్ ఆఫ్ సొలొమాన్, టార్ బేబీ, బిలవెడ్, జాజ్, పేరడైజ్, లవ్, ఏ మెర్సీ, హోమ్, గాడ్ హెల్ప్ ది చైల్డ్. నాటకం -1) డ్రీమింగ్ ఎమ్మెట్, 2) డేసడోమోన. టోనీ మారిసన్ నవలల్లో ట్రైయాలజి గా బిలవెడ్, జాజ్, పేరడైజ్ నవలలు పేరు పొందాయి. ఇతర ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి.
బాల సాహిత్యం- 1) ది బిగ్ బాక్స్ 2) ది బుక్ అఫ్ మీన్ పీపుల్ 3)రిమెంబర్ ;ది జర్నీ తో స్కూల్ ఇంటిగ్రేషన్ 4) హు హేస్ గాట్ ది గేమ్? ది ఆంట్ ఆర్ గ్రాస్ హాపర్? ది లయన్ ఆర్ మౌస్? పాపీ ఆర్ ది స్నేక్? (ఈ బాల సాహిత్యానికి గ్రామీ అవార్డు కోసం టోనీ పేరు 2008 లో ప్రతిపాదించబడింది) 5) పీని బటర్ ఫడ్జ్ 6) లిటిల్ క్లౌడ్ అండ్ లేడీ విండ్ 7) ప్లీస్ లూయిస్
టోనీమారిసన్ కథలు–1) రేసిటాటిఫ్ కథాసంకలనం -1983 2) స్వీట్ నెస్ -2015-ది న్యూ యార్కర్
టోనీ మారిసన్ కవితలు: టోనీ మారిసన్ మంచి కవయిత్రి కూడా. ఆమె రాసిన చాల కవితలు ప్రసిద్ధి పొందాయి వాటిలో పేరు పొందిన కవితలు 1) ఈవ్ రిమెంబరింగ్ 2) ద పర్ఫెక్ట్ ఈజ్ ఆఫ్ గ్రైన్ 3) సమ్ వన్ లీన్స్ నియర్ 4) ఇట్ కమ్స్ అన్ ఆడర్న్డ్ 5) ఐ యామ్ నాట్ సీవర్తి. ఈ ఐదు పద్యాలు కారా వాకర్ సంపాదకత్వంలో, ‘రైన్ మేకర్ ఎడిషన్స్’ లో 2006 లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మోడరన్ లెటర్స్ (IIML) సహకారంతో ప్రచురించబడ్డాయి ఈ కవితల్లో టోనీ మారిసన్ బానిసత్వంలో మగ్గుతున్న నల్లజాతి స్రీలు భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూనే చావుని క్షణ క్షణం గొప్ప శక్తి, ఆత్మవిశ్వాసాలతో ఎలా ఎదురుకొంటూ ఉంటారో రాస్తుంది. ఈ కవితల్లో తనను తాను కూడా ఒక నల్ల జాతి స్త్రీనన్న స్పష్టమైన ఎరుకతో ఆవిష్కరించుకొంటుంది.
లిబ్రేటో– సంగీత నృత్య నాటకం– మార్గరేట్ గార్నెర్.
నాన్–ఫిక్షన్– వీటితో పాటు టోనీ మారిసం నాన్-ఫిక్షన్ రచనలు చాలా చేసింది.
మారిసన్, టోనీ, గుడ్నెస్ అండ్ లిటరరీ ఇమాజినే షన్, రేసింగ్ జస్టీస్, ఎన్-జెండరింగ్ పవర్, రిలీజియస్ విషన్,ప్లేయింగ్ ఇన్ ది డార్క్, బర్త్ ఆఫ్ నేషన్ హుడ్-కో-ఎడిటర్, రిమెంబెర్, వాట్ మూవ్స్ ఎట్ ది మార్జిన్,బర్న్ దిస్ బుక్ -ఎడిటర్, ది ఆరిజిన్ ఆఫ్ అదర్స్, ది సోర్స్ ఆఫ్ సెల్ఫ్ రిగార్డ్
వ్యాసాలు – పరిచయం -మార్క్ ట్వైన్,అడ్వెంచర్స్ ఆఫ్ హక్కెల్బరీ ఫిన్.
టోనీ మారిసన్ మీద డాక్యుమెంటరీ ఫిలిమ్స్. మార్గరెట్ బసబీ ఇంటర్వ్యూ, ఇమాజిన్ టోనీ మారిసన్ రిమెంబెర్స్ ఫిలిం-బీబీ సి, ది ఫారినర్స్ హోమ్, ది పీసెస్ ఐ యామ్.
సినిమాగా వచ్చిన టోనీ సాహిత్యం –1998 లో టోనీ మారిసన్ కి నోబుల్ ప్రైజ్ సంపాదించిన ‘బిలవెడ్’ నవల “ది ఓప్రాహ్ ఎఫెక్ట్” అనే సినిమాగా వచ్చింది.
“బిలవెడ్” (Beloved) నవల – టోనీ మారిసన్ కి నోబుల్ పురస్కారం అందించిన నవల ఇది. న్యూ యార్క్ టైమ్స్ పత్రిక గత 25 సంవత్సరాలుగా వచ్చిన నవలల్లో ఉత్తమ నవలలుగా బిలవెడ్ నవలను ప్రకటించింది. ఈ నవలకు ముందు అత్తా మీద “అరవై మిల్లియన్లకు పైగా” అని ఉంటుంది ఇది బానిస జీవితాల్లో బాలి అయిపోయిన నల్లజాతి ప్రజల సంఖ్య. ఈ నవల పీడిత నల్లజాతి ప్రజల ఆత్మ గౌరవానికి పరాకాష్టగా శిఖరాయమానంగా నిలుస్తుంది. క్రూరమైన వర్ణ వివక్షకు బలైపోయిన నల్లజాతి జనం బానిసత్వం నుంచి విముక్తి పొందడం కోసం చేసే పోరాట రూపాలు మనల్ని దిగ్భ్రమకి లోను చేస్తాయి. చదువుతున్నంత సేపూ కన్నీరుమున్నీరు చేస్తాయి. 1976 లో అలెక్స్ హేలీ రాసిన రూట్స్ నవల గుర్తుకు వస్తుంది. 16, 17డవ శతాబ్దంలో యూరప్, అమెరికా వాళ్ళు పారిశ్రామిక విప్లవం సాధించిన తరువాత వేరే దేశాల ఆఫ్రికన్ ప్రజలని బానిసత్వంతో ఎలా వేధించారో రూట్స్ నవలలో మొత్తం ఏడుతరాల బానిస జీవితాలను చిత్రిస్తాడు అలెక్స్ హెలీ. అమాయకులైన ఆఫ్రికన్లను చీకటి ఖండం ఆఫ్రికా నుంచి అమెరికాకి బానిసలుగా వ్యాపారం కోసం అక్రమంగా తరలించబడ్డ అభాగ్య జీవుల కథ ఈ రూట్స్ నవల. తమదైన సంస్కృతీ సంప్రదాయాల మధ్య ఆకు పచ్చని ఆఫ్రికన్ పల్లెల్లో ఆనందంగా జీవిస్తున్న ఆఫ్రికన్లను జంతువులకు వేసినట్లు వలవేసి పట్టి బంధించి, గాలి కూడా ఆడని ఓడలలోని చీకటి కొట్టాల్లో రోజుల తరబడి సంకెళ్లతో కట్టేసి, తమ దేశానికి అక్రమ రవాణా చేస్తూ, సంతల్లో, వీధుల్లో నిలబెట్టి కోళ్లను అమ్మినట్లు వేలం వేస్తే అలా అమ్ముడు పోయి తరాలుగా బానిస జీవితాలు గడిపిన ఏడు తారాల ఆఫ్రికన్ బానిసల కథలను చదువుతాము. అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక బానిసత్వం నిర్ములించబడినాక కుంటా ముని మనుమడు అలెక్స్ హెలీ తన ముత్తాత పుట్టిన ఆఫ్రికాకి వెళ్లి ముల్లాలు శోధించి రాస్తాడు రూట్స్ నవల. ఇందులో కుంటా కింటే అనే ఆఫ్రికా యువకుణ్ణి అమెరికా వాసులు కిడ్నాప్ చేసి, బానిసల వేలం పాటలో అమ్మేస్తారు. ఆ దుర్భరమైన కుంటా బానిస జీవితం, కొడుకు జాడ తెలీని కుంట తల్లిదండ్రుల వేదన, కుంటా కూతురు, ఆమె సంతానం, మళ్ళా మనవళ్లకు, మనవరాళ్లకు పుట్టిన సంతానం అంతా అనుభవించిన బానిసత్వం మరోవైపు బానిసత్వం విముక్తికోసం ఆఫ్రికన్ ప్రజలు చేస్తున్న పోరాటాలు దయనీయంగా ఉంటూ మనల్ని కన్నీటితో కదిలించి వేస్తాయి.
ఆ బానిస జీవితాల్ని, శ్వేతా జాతీయులతో వాళ్ళు చేసిన పోరాటాలని,ఆ క్రమంలో అనుభవించిన భయంకరమైన ఊహకు కూడా అందని హింసా దౌర్జన్యాలను, బలిదానాలు, హత్యలను, అవధులు లేని శ్రమ దోపీడీలను, బానిసలుగా ఆఫ్రో-అమెరికన్ స్రీలు అనుభవించిన క్రూరమైన లైంగిక హింసలని టోనీ మారిసన్ తన సాహిత్యంలో పొందుపరిచింది. 19 దవ శతాబ్దంలో బానిసత్వంలో మగ్గిపోయే “మార్గరేట్ గార్నర్” అనే ఒక నల్ల జాతి బానిస స్త్రీ తన బానిస సంకెళ్లను తెంపుకోవడానికి యజమాని నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నమే బిలవెడ్ నవలలో టోనీ మారిసన్ రాసింది. మార్గరేట్ పూర్వీకులు అంతా బానిసలే వాళ్ళ పిల్లలు కూడా బానిసలే. బానిసలుగా బతకడం కంటే తన పిల్లలు చనిపోవడమే ఉన్నతమైంది అని భావించి, పిల్లల మీద అనంతమైన ప్రేమ ఉన్న మార్గరేట్ కేవలం ప్రేమ కారణంగా పిల్లలని చంపే ప్రయత్నం చేస్తుంది. అందులో ఒక పాపా చనిపోతుంది. మార్గరేట్ జైలుకి వెళ్తుంది. ఆమె తన బిడ్డను చంపినందుకు ఏ మాత్రమూ పశ్చాత్తాప పడదు. తనలా తన పిల్లలు బానిస జీవితాల్లో మగ్గి పోకూడదు అని చంపినట్లు చెబుతుంది. బిలవెడ్ నవలలో సెతా కూడా ఇదే చెబుతుంది. సెతా ఒక బానిస ఆమె తన యజమాని ఇంట్లో భయానకమైన హింసలు పరాభావాలు ఎదుర్కొంటుంది. అమానుషంగా లైంగిక అత్యాచారాలకు గురి అవుతుంది. తెగించి కెంటకీ నుంచి సిన్సినాటీ పారిపోయినప్పుడు సెతా నిండు గర్భిణి. వళ్లంతా యజమాని కొట్టిన గాయాల మచ్చలే. వీపు మీద ఆ మచ్చలు ఒక చెట్టు ఆకారంలో ఉంటాయి. పారిపోయిన సేతా తన అత్త, పిల్లలతో కలిసి ఉన్నప్పుడు యజమాని వెతికి పట్టుకొని ఆమెను బంధించే ప్రయత్నం చేస్తాడు తన బలగంతో. అక్కడ ఒక గదిలో దాక్కుంటుంది. యజమానికి తిరిగి పట్టుబడినాక తన రెండేళ్ళ పసిబిడ్డ బానిసత్వం లో బతకకూడదని ఆ పసి పాపను గొంతు కోసి చంపేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచిన తీరు అత్యంత భీభత్సమైనప్పటికీ పాఠకుడి మనసులో ఆ తల్లి చేసిన పని పట్ల సానుభూతిని కలిగిస్తుంది. తన రెండేళ్ల బిడ్డని పీక కోసి చంపేసాక, ఇద్దరు పెద్ద పిల్లలను పారతో మోదేస్తుంది. యజమానికి వాళ్ళు రక్తపు మడుగులో కనపడతారు. ఇంకా ప్రాణాలతో గిల గిలా కొట్టుకుంటుంటారు. ఇంకో పసిబిడ్డ తల్లి పాలు తాగుతూంటుంది. ఆమెని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరుస్తారు. అక్కడ ఆమె ప్రశాంతంగా, స్థిరమైన మనసుతో కనపడడం మొత్తం ప్రపంచాన్ని, న్యాయస్థానాన్ని, అబాలిషనిస్టులను నివ్వెర పరుస్తుంది. తన పిల్లలకు తన బానిసత్వాన్ని వారసత్వంగా ఇవ్వకూడదనే చంపేసాను అంటుంది సెతా కోర్టులో చాలా స్పష్టంగా. కానీ బిడ్డని చంపినందుకు ఆ తల్లి చాలా వేదనకు గురి అవుతుంది.
తల్లి ‘బేబీ సగ్స్’ ను బానిసత్వం నుంచి విడిపించడానికి యజమానికి డబ్బు కట్టి ఆమెని విముక్తి చేస్తాడు సెతా భర్త. అలా తల్లి కోసం విముక్తిని కొంటాడు. పారిపోయి వచ్చిన సెతా అత్త తో కలిసి బతుకుతూ ఉంటుంది అనేక సంవత్సరాలుగా. బానిస బతుకు బతికిన బేబీ సగ్స్ దేహం గాయాలతో ఛిద్రం అవుతుంది. బయటి చర్మమే కాదు శరీరం లోపలి సర్వాంగాలు ఛిద్రమవుతాయి. బేబీ సగ్స్ గురించి టోనీ మారిసన్ రాసిన వాక్యాలు చదువుతుంటే నొప్పితో గుండె మెలి తిరుగుతుంది. “బానిసల దేహం ఎలా ఉంటుంది? సుదీర్ఘమైన బానిస బతుకు ఆమె కాళ్ళని, చేతులని, కళ్ళని, చెవులని, వీపుని, తలని, మూత్రపిండాలని, గర్భసంచినీ, నోటిని చివరాఖరుకు నాలుకని కూడా ఛిద్రం చేసేసింది. ఆమెకు ఇప్పుడు మిగిలింది హృదయం ఒక్కటే. దానితోనే ఆమె పనిలోకి బయలుదేరింది” రచయిత్రి కూడా ఎంత దుఃఖాన్ని, నొప్పిని అనుచుకుంటూ రాసిందో కదా అనిపిస్తుంది. ఇక సెతా తన కూతురు శవాన్ని పాతిపెట్టి దాని మీద “బిలవెడ్” అని ఆ పాపాయి పేరు రాయిస్తుంది. ఇరవై ఏళ్ల తరువాత సెతా జీవితంలోకి ఇరవై ఏళ్ల బిలవెడ్ అనే అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ్నుంచి మేజిక్ రియలిజం టెక్నిక్ లో నడిపిస్తుంది టోనీ మారిసన్.
బిలవెడ్ ని చనిపోయిన తన బిడ్డ అనే అనుకుంటుంది. అసలా పాత్ర ఉందా లేక అదంతా సెతా ఊహనా., బిడ్డను చంపేసిన పశ్చాత్తాప భావన సెతా లో ఇటువంటి భ్రమాత్మక మానసిక స్థాయికి, లేనిది ఉన్నట్లుగా ఉహించే, చూసే, వినే మానసిక స్థితికి గురి చేస్తుందా అదంతా పాఠకుడికే వదిలేశారు టోనీ. ఇక బిలవెడ్ వచ్చాక సెత జీవితం అతలాకుతలం అయిపోతుంది. అప్పటికే చాన్నాళ్ల క్రితం ఒక కొడుకు ఆమెని విడిచి పెట్టి పారిపోతాడు. భర్త కూడా ఉండడు. ఆమెని ఇష్టపడ్డ వ్యక్తి తిరిగి వచ్చి ఆమెతో కలిసి ఉంటూ ఉంటాడు. బిలవెడ్ వీరిద్దరి మధ్య తగాదాలు పెడుతుంది. సెతా తన స్వంత బిడ్డనే చంపేసింది అనే వాస్తవం అతనికి తెలిసేలా చేసి అతను మళ్లీ సెతాని విడిచి వెళ్లిపోయేలా చేస్తుంది. చాల మంది విమర్శకులు సెతా మానసిక స్థితిని “షీజోఫ్ఫ్రీనియా” అనే మానసిక రుగ్మత అని కొట్టి పడేసారు కానీ వాళ్ళు కాదు ఇక్కడ సెతా మానసిక స్థిని నిర్వచించాల్సింది. ఇక్కడ రచయత్రికి అలా కాదు ఆమె బహుశా కోల్పోయిన తన బిడ్డని బలంగా కోరుకునివుంటుంది లేదా తెల్ల జాతీయుల దుర్మార్గాన్ని బట్ట బయలు చేయాలనుకుంది తన తరువాతి తరం వాళ్ళతో. టోనీ మీద చిన్నప్పుడు తన తాత ముత్తాతలు వెన్నెల రాత్రుళ్లలో వినిపించిన పురాగాథల ప్రభావం బాగా ఉంది. ఆమె బాల్యంలో విన్న మౌఖిక జానపద, దెయ్యాల, ఆత్మల కథలు ఆమెని చాలా కాలం వెన్నాడాయి. ఆ కథలలో లాగా ఆమె చనిపోయిన మనుషులను తిరిగి బంధాలు చావని, మరువలేని బంధువుల జీవితాల్లోకి తిరిగి పుట్టించి, విడిపోయిన వారిని కలపాలనుకుని సమాధిలోంచి బిలవెడ్ ని బతికించి, తిరిగి సెతా జీవితం లోకి తీసుకొచ్చింది. మనుషుల్ని తమ లోపల నుంచి విడదీయలేని తనం, పేగుబంధాన్ని విడిగా చూడలేనితనం నుంచే ఈ శైలీ ప్రక్రియని ఎన్నుకుంది. అందుకనే టోనీ మాంత్రిక వాస్తవిక వాదాన్ని ఎన్నుకుంది. ఇక్కడ మార్గరేట్ గార్నర్ నిజ జీవిత గాథనే టోనీ మారిసన్ “బిలవెడ్” నవలగా మలిచింది. 1987లో ఈ నవల వచ్చింది ఈ నవల ఆఫ్రికన్ సాహిత్య ప్రపంచంలో టోనీ మారిసన్ ని అత్యంత ఎత్తులకి తీసుకువెళ్లింది. అంతే కాదు, ఆమెను ఆఫ్రో-అమెరికెన్ ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఈ నవల ప్రపంచ సాహిత్యం లో ఒక క్లాసిక్ గా మిగిలిపోయి టోనీ మారిసన్ కు ఒకేసారి నోబెల్ & పులిట్జర్ పురస్కారాలను తెచ్చి పెట్టింది.
టోనీ మారిసన్ బిలవెడ్ నవల– కాళీ పట్నం రామారావు “యజ్ఞం” కథల మధ్య సారూప్యత:
టోనీ బిలవెడ్ నవలను 1987 లో రాసింది. 1966 లో భారత దేశంలో తెలుగు సాహిత్య రంగం నుంచి దాదాపు బిలవెడ్ కథా వస్తువుతో కాళీపట్నం రామారావు గారు “యజ్ఞం” కథ రాశారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది యజ్ఞం కథ. రెండూ కూడా అత్యంత సృజనాత్మకత తో భీభత్సమైన జీవన వాస్తవికతను కథా, నవల రూపంలో పాఠకుల ముందు ఉంచి జీవన సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. అమెరికాలో తన బిడ్డకి బానిసత్వాన్ని వారసత్వంగా ఇవ్వకూడదు అని కథా నాయకి రెండేళ్ల పసి బిడ్డని గొంతు కోసి చంపేసి, ఇద్దరు పెద్ద బిడ్డలను పారతో మోది చంపే ప్రయత్నం చేస్తుంది. భారత దేశంలోని నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అడుగున ఉన్న శ్రామిక కులాల రైతులు ఆధిపత్య కులాల భూస్వాముల ఇళ్లల్లో, వారి పొలాల్లో తరతరాలుగా వెట్టి అంటే బానిసత్వం చేస్తూ నలిగి పోతుంటారు. యజ్ఞం కథలో సుందర పాలెం అనే వూళ్ళో అప్పల్నాయుడు అనే రైతు, వ్యాపారస్థుడు గోపన్న వద్ద డబ్బు తీసుకుంటూ వ్యవసాయం చేస్తుంటాడు. గోపన్నకు తన పంట అమ్మడం కూడా చేస్తుంటాడు. కాల క్రమేణా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులకు తట్టుకోలేక అప్పలనాయుడి వ్యవసాయం క్షీణించి పోతుంది. గోపన్న తన అప్పు తీర్చమంటాడు లేదా మిగిలిన భూమి రాసియ్య మంటాడు. పంచాయతీలో శ్రీరాములు నాయుడు కూడా గోపన్న అప్పు తీర్చమంటాడు. తాను తరువాత కావలిస్తే, అప్పల నాయుడికి సాయం చేస్తాను అంటాడు. అప్పల నాయుడి అహం దెబ్బ తిని తను భూమి అమ్మి అప్పు తీరుస్తాను అంటాడు. కానీ కొడుకు సీతా రాముడు భూమి అమ్మడానికి వీలు లేదు, కష్టపడి అప్పు తీర్చుదామంటాడు. కానీ అప్పలనాయుడు భూమి పత్రాలమీద కొడుకు, మనవాళ్లు సంతకాలు తీసుకుంటాడు. తండ్రి తరువాత తాను, తరువాత తన కొడుకు బానిసత్వంలో మగ్గిపోవడం భరించలేని సీతారాముడు ఇంటికెళ్లి తన కొడుకుని నరికి పారేసి గోతం సంచిలో శవాన్ని మోసుకుని పంచాయితీ పెద్దల ముందు పడేస్తాడు. సరిగ్గా టోనీ మారిసన్ బిలవెడ్ నవలలో కూడా ఇదే ముగింపు చూస్తాము. రెండు చోట్ల కూడా బానిసత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాట రూపాలను, భిన్న దేశాల మధ్య భిన్నమైన పోరాటాలు, ఉద్యమాలు ఉన్నా ఒకే రూపంలో చూపిస్తారు. భారత దేశంలో నక్సల్బరీ ప్రభావం తెలుగు రాష్ట్రాలమీద అప్పుడప్పుడే పడుతున్న కాలం అది. అయినా గాని కారా మాష్టారు ఆ విప్లవోద్యమ పోరాట స్ఫూర్తిని అందుకోకుండా తాత్కాలిక పరిష్కారాన్ని, ఒక మనిషిని మాత్రమే చంపి వారసత్వంగా వచ్చిన బానిసత్వాన్ని తన ఒకడి కుటుంబం మేరకు పరిష్కరించాలనుకుంటాడు.
‘ది బ్లూఎస్ట్ ఐ’ (The Bluest Eye) నవల – టోనీ మారిసన్ ఇద్దరు పిల్లలు హెరల్డ్ ఫోర్డ్, స్లేడ్ మారిసన్ పుట్టాక కొంత కాలానికి భర్త హెరల్డ్ మారిసన్ తో సరిపడక విడాకులు తీసుకుంటుంది. తన విఫల వైవాహిక జీవితపు జ్ఞాపకాలని మరిచి పోవడానికి, టోనీ ఒక రచయితల బృందం లో చేరుతుంది. వాళ్ళు ఒక కథ రాయమంటే హడావుడిగా ఒక కథ రాస్తుంది. దాని పేరే “ది బ్లూఎస్ట్ ఐ” అంటే, “నీలి రంగు కన్ను” అని అర్థం. తరువాత ఆ కథనే నవలగా మార్చి రాసింది. తెల్ల వారి సౌందర్య ప్రమాణాల ప్రకారం రంగు, రూపం లేని నల్లజాతి స్త్రీల ఆత్మనూన్యతల, తద్వారా వారిలో చెలరేగే మానసిక రుగ్మతల పర్యవసానాలు వలన వారి జీవితాల్లో నిండిన విధ్వంసం ఈ నవల సారాంశం. టోనీ తన చిన్ననాటి స్నేహితురాలి అనుభవం, ఆమె తనలో నల్ల చర్మపు రంగు, తమ నల్లజాతి స్త్రీలకు లేని తెల్లజాతి వారికి మాత్రమే ఉండే నీలికళ్లకు సంబంధించి కలిగించిన ఆలోచనలు, తద్వారా కలిగిన అలజడి ఆధారంగా రాసింది. దేవుడి ఉనికి పైన తనకు తన స్నేహితురాలికి తరచు చర్చలు వాదోపవాదాలు జరుగుతూ తను దేవుడున్నాడని అంటే, తన స్నేహితురాలు మాత్రం దేవుడు లేడని, ఉంటే తనకిలా నల్ల చర్మపు రంగుని ఇవ్వడని అలాగే తనకెంతో ఇష్టమైన తెల్లవాళ్ళకుండే నీలి రంగు కళ్ళు ఎంత కోరుకున్నా, ప్రార్థించినా ఇవ్వలేదని అందుకే తనకు దేవుడు లేడని అనేది. ఇదే వస్తువుని టోనీ తన ‘ది బ్లూఎస్ట్ ఐ’ నవలలో తీసుకుంది.
14 సంవత్సరాల “పెకోలా” అనే నల్ల జాతి అమ్మాయి తన నల్లని రూపాన్ని తానే తెల్లవాళ్ళ కంటే ఎక్కువగా అసహ్యించుకుంటుంది. తన నల్లని రంగు, చింపిరి జుట్టు, లేసులు కట్టుకోవడానికి కూడా వీలుకాని పాత బూట్లు, వంటికి సరిగ్గా అమరని, చాలీ చాలని బట్టలతో బడికి వెళ్లే తనని పిల్లలంతా చీదరగా, హేళనగా చూస్తూ నవ్వుతున్నారని తనని తాను అసహ్యించుకుంటూ, ఆందోళన చెందుతూ విపరీతమైన ఆత్మ నూన్యత అనే అపసవ్య మానసిక స్థితిలోకి వెళ్ళిపోతుంది పెకోల. అదే సమయంలో బానిసత్వంలోంచి, అణిచివేతల్లోంచి అదే ఆత్మ నూన్యతలోకి, మానసిక వ్యాధికి గురి అయిన పెకోలా తండ్రి చేత పెకోలా లైంగిక అత్యాచారానికి గురి అవుతుంది. ఇక్కడ ఒక పక్క వర్ణ వివక్షని, మరోపక్క దానివల్ల తీవ్రమైన మానసిక రుగ్మతకు గురి అవుతూ తమ స్వంత జాతి స్త్రీలపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శించే నల్లజాతి పురుషుల వాస్తవ పాత్రలని పురుష కోణంలో సాహిత్యంలోకి తేవడానికి రచయిత్రి చాల జాగ్రత్త వహించింది. మానసిక రుగ్మతతో సంబంధం లేకుండా కూడా లైంగిక వికృతత్వాలతో, పురుషాధిపత్య భావనతో తమ నల్లజాతి స్త్రీల పైన నల్ల జాతి పురుషులు లైంగిక, భౌతిక హింస నెరపడాన్ని టోనీ నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది. పెకోలా అనుభవించే మానసిక వేదనని టోనీ చాలా ఆర్ద్రంగా రాసింది. పెకోలా లాంటి మానసిక స్థితిలో చాలామంది నల్లజాతి అమ్మాయిలు, స్రీలు ఉన్నారని, పెకోలా వారి అందరికి ప్రతిబింబమని, అలానే అణిచివేత వల్ల తీవ్ర మానసిక సంతులనం కోల్పోయిన స్థితిలో పెకోలా తండ్రి లాంటి పురుషులు ఉన్నారని రాసింది. అలాగని కూతురి పైనే లైంగిక అత్యాచారం చేసిన పెకోల తండ్రిని తీవ్రంగా విమర్శిస్తుంది.
ఒక పక్క జాతి వివక్ష, మరోపక్క శ్వేతజాతి పురుషుల చేత లైంగిక అత్యాచారాలు, అదే సమయంలో తమ కుటుంబాల్లో తమ భర్తలతో భౌతిక హింసని నల్లజాతి స్రీలు ఎదుర్కోవడాన్ని టోనీ స్త్రీల దృష్టి కోణం నుంచి బ్యాలెన్సుడ్ గా రాయ గలిగింది. ఒక పక్క ఆధిపత్య కులాల పురుషులతో లైంగిక అత్యాచారాలకు, తమ స్వంత కులంలో పురుషుల పురుషాధిపత్యానికి బలి అవుతున్న అచ్చంగా భారత దేశ కుల సమాజంలో అట్టడుగు కులాలకు చెందిన దళిత స్త్రీల లాగ, అమెరికాలో ఆఫ్రికన్ నల్ల జాతి స్త్రీలు శ్వేత జాతీయుల నుంచి జాతి వివక్షను, దాడులను, లైంగిక వేధింపులను ఎదుర్కొంటూనే అదే సమయంలో నల్లజాతి పురుషుల నుంచి పురుషాధిక్యతను ఎదుర్కోవడాన్ని టోనీ మారిసన్ అత్యంత ప్రతిభావంతంగా తన సాహిత్యంలో సృజించ గలిగింది. తెల్లజాతి ప్రజల తెల్ల రంగు కొలతల్లో అందాన్ని నిర్వచించే ఆధిపత్య శ్వేతజాతి సమాజంలో తమ నల్ల రంగుని పోల్చుకుని నూన్యత చెందే నల్లజాతి స్త్రీల ఆత్మ నూన్యతని, అది సృష్టించిన సాంస్కృతిక వికృతత్వాన్ని తన “ది బ్లూఎస్ట్ ఐ” నవలలో పొరలు పొరలుగా ఛేదించే ప్రయత్నం చేసింది. పదకొండేళ్ల పెకోలా అమాయకత్వంలో, మొత్తం అమెరికా లోని వర్ణ వివక్ష, జాత్యహంకారం ఎలా కనిపిస్తున్నాయో విశ్లేషిస్తుంది. ఆడపిల్లగా పుట్టటం, నల్లగా ఉండడం, చిన్న పిల్లగా ఉండడం ఈ మూడు అంశాలు అమెరికాలో ఉన్న ఒక ఆఫ్రికన్ అమ్మాయికి ఎట్లా శాపంగా మారిందో చెప్తుంది. ఇది కేవలం నల్ల జాతి స్రీలు తెల్లజాతి స్త్రీ, పురుషుల తో మాత్రమే కాదు చాలా సార్లు నల్ల జాతి స్త్రీలు, తమ నల్ల జాతి పురుషుల చేత కూడా రంగు, అందం విషయాల్లో తెల్ల జాతి పురుషుల్లాగా వ్యవహరించడం, అలాగే నల్ల జాతి స్రీలు కూడా ఆ తెల్లజాతి ఈస్థటిక్స్ మాయాజాలం లోపడి, తోటి నల్ల జాతి స్త్రీలను అవహేళన చేయడం అనే సున్నితమైన, దిగ్భ్రమ కలిగించే అంశాలను సాంస్కృతిక పర్వర్షన్స్ గా అభివర్ణిస్తుంది టోనీ ఈ నవలలో.
కొద్ది తెలుపు ఛాయలో ఉండే పెకోలా స్వంత తల్లి పాలిన్ కూడా ఆమెను అసహ్యంగా ఉన్నావని చీదరించుకున్నప్పుడల్లా గోధుమ రంగు కళ్ళు నీలి రంగులోకి మారితే అన్నా తనలోకి కొంత శ్వేత జాతీయుల అందం వస్తుందేమో అని ఆ నీలి కళ్ళు పొందడం ఎలానో తెలీక అమాయకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ సమాజంలో నీలి రంగు కళ్ళు ఉండడాన్ని వైట్ బ్యూటీ గా పరిగణిస్తారు. నిజానికి పాలిన్ కూడా కూతురు పెకోలా లాగే తెలుపు రంగుతో ఉండడానికి గాఢంగా ఇష్టపడుతూ, నలుపుని అసహ్యించుకుంటూ, పెరిగింది బాల్యమంత. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె తాను ఒక్కతే తెల్లవాళ్ళు నటించిన ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళేది. ఆ పాత్రల్లో తనని ఉహించుకునేది కలల్లో తెలిపోయేది. అది అలుసుగా తీసుకున్న తెల్లవాడొకడు ఆమెను రేప్ చేస్తాడు. అయినా సరే పాలిన్ అతన్ని కానీ, ఇతర తెల్ల వాళ్ళని కానీ,తెల్ల రంగుని కానీ వారు తమపట్ల ప్రదర్శించే వివక్ష అవమానాలను కానీ ఎవగించుకోకపొగా వారిని ఇంకా ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది. తెల్ల జాతి ప్రజలు రంగుకు-జాతికి, రంగుకు- సౌందర్యానికి సంబంధించిన తమవైన ప్రమాణాలను, కొలతలను ఎలా నల్లజాతి ప్రజల మస్తిష్కాల్లో, అంతః చేతనల్లో బలంగా నాటుతారంటే నల్లజాతివాళ్ళు వారి స్వీయ చేతనను, రంగుని, అస్తిత్వాన్ని ఏవగించుకునేంత, తమ స్వంత నల్ల జాతి వాళ్లనే నల్ల రంగు మూలంగా తృణీకరించేంతగా ఈ పరాయీకరణ జరిగిపోతుంది. పాలిన్ తన తాగుబోతు భర్తను అసహ్యించుకుంటుంది. నల్ల రంగు కూతుర్లను, తన నల్ల రంగుని అసహ్యించుకుంటుంది కానీ విచిత్రంగా ఆమె తమలో తమ నల్లరంగు పట్ల, రూపం పట్ల విముఖత పెంచిన తెల్ల జాతీయుల పట్ల ఆరాధన ఉంటుంది. తను పనిచేసే శ్వేత జాతీయుల కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకుంటుంది. ఈ విచిత్రమైన మానసిక వైరుధ్యాలను, అసహ్యించుకునే వారినే ఆరాధించడమనే లక్షణం తమను తాము ప్రతికూల పరిస్థితుల్లోంచి రక్షించుకోవడం కోసం అంతః చేతన మనసులోంచి మొదలైన ఒక డిఫెన్స్ మెకానిజం అని అర్థం చేసుకోవచ్చు.
పాలిన్ పెళ్ళికి ముందు ఒక తెల్లజాతీయుడు ఆమెను బలాత్కరిస్తాడు. ఇక పెకోలా తండ్రి చోలీ బాల్యంనుంచే తల్లిదండ్రులకు దూరంగా ప్రేమ రాహిత్యంలో అత్త దగ్గర అనాథలగా పెరుగుతాడు. కన్న తండ్రి అతను ఎందుకూ పనికిరాని వాడని వదిలేస్తే అత్త దగ్గర పెరుగుతాడు. అతను తన తండ్రిని ఒక వైఫల్యం చెందిన మనిషిగా భావిస్తాడు. టీనేజీ లో చోలీ మీద తెల్ల జాతి పురుషుడు లైంగిక అత్యాచారం చేస్తాడు. తండ్రిని వెతుక్కుంటూ వెళ్లి నేనే నీ కొడుకుని అని సంతోషంగా చెప్పిన చోలీని చూసి సంతోష పడని తండ్రి “ ఆ బిచ్ కి డబ్బులు అందుతాయి అని చెప్పు” అని అరుస్తాడు. కొడుకుని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తాడు. గాయపడ్డ చోలీ అక్కడ్నించి అలుపెరుగకుండా పరిగెత్తి పారిపోతాడు. దుర్భర దారిద్య్రం, బాల్యంలో జరిగిన లైంగిక అత్యాచారపు జ్ఞాపకాల గాయాలు, జాతి వివక్ష, ప్రేమరాహిత్యం అతన్ని పశువుని చేస్తుంది. భార్య పిల్లలను హింసించి వారికీ దూరం అవుతాడు. పాలిన్ తన తెల్ల జాతి యజమానుల, వారి పిల్లల సేవలో ఉన్నప్పుడు ఇంట్లో వంటరితనంలో, తాగి పిచ్చెక్కి ఉన్న చోలీ అంట్లు తోముతున్న చిన్నారి పెకోలాని రేప్ చేస్తాడు. తన తండ్రి తిరస్కారం, తెల్లవాడు తన మీద జరిపిన లైంగిక అత్యాచారం చోలీ తన కన్న బిడ్డ మీద చేస్తాడు. రెండోసారి రేప్ చేసిన తర్వాత చిన్నారి పెకోలా గర్భవతి అవుతుంది. చోలీ భయంతో పారిపోతాడు. పెకోలా అక్కలు క్లాడియా, ఫ్రీదా బంతి విత్తనాలు నాటి, అవి మొలకెత్తి పెరిగి పుష్పించే సమయానికి పెకోలా గర్భం పెరిగి బిడ్డ పుడుతుందని అనుకుంటారు అమాయకంగా. వాళ్లకి ఆ గర్భం ఎలా, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. పెకోలా కు అబార్షన్ అవుతుంది.
పెకోలాకి రెండోసారి రేప్ జరిగే ముందు ఆమె, తెల్ల జాతి రచయితలు డెక్ & జాన్ రాసిన కథలు చదువుతూ వారికున్న నీలికళ్ల ఆలాపనల్లో తేలి పోతుంటుంది. ఇలా తెల్ల వాళ్ళ కథల్ని ఆమె చదవడం, అమెరికన్ సమాజపు సౌందర్య ప్రమానాల్లో కొట్టుకు పోవడం అనేది ఆమెకి తన కన్న తండ్రి ద్వారా జరిగిన రేప్ కంటే కూడా ఘోరమైందని రచయిత్రి ఉద్దేశ్యం. చివరికి పెకోలా తల్లి పాలిన్ తో వెళ్ళిపోతుంది. ఆమెను రచయిత్రి చివరగా ఒక చెత్త డబ్బా దగ్గర ఆ చెత్తలో దేనికోసమొ వేళ్ళతో కెలుకుతూ వెతుకుతున్నట్లు చూపిస్తుంది ప్రతీకాత్మకంగా. అప్పటి జాతి వివక్షలతో కూడిన నిర్దాక్షిణ్యమైన అమెరికన్ చెత్త సమాజములో మానవత్వాన్ని, ప్రేమని నల్లరంగు పట్ల అంగీకారాన్ని వెతుకుతుందా లేక ఎప్పటిలాగే నీలి కళ్ళ కోసం వెతుకుతున్నదా? అసలు పెకోలా చెత్త డబ్బా దగ్గర ఎందుకుంది? వాళ్ళమ్మ పాలిన్ ఏమైంది? ఎప్పటిలాగే తన బాల్యపు తెల్ల రంగు అబ్సెషన్లలో తను హౌస్ కీపర్ గా పనిచేసే తెల్లవాళ్ళ తెల్ల పిల్లను ప్రాణపదంగా, స్వంతపిల్లలను అనాథలను చేసి మరీ పెంచుతూనే ముసలిది అయిపోతుందా పాలిన్? జీర్ణించుకోలేని కఠిన వాస్తవం ఏంటంటే, తన తండ్రి తనని రేప్ చేసాడని పెకోలా చెప్పినప్పుడు కూడా పాలిన్ పెద్దగా పట్టించుకోదు, కనీసం బిడ్డ గాయానికి దగ్గర తీసుకొని ఓదార్చదు. భర్త మీద ఆగ్రహంతో ఊగిపోదు, ప్రశ్నించదు. ఇంకోసారి తెల్ల యజమాని ఇంట్లో వాళ్ళ పాప కి చేసిన వేడి చెర్రీ పండ్ల పుడ్డింగ్ అక్కడే ఉన్న చిన్నారి పెకోలా మీద పడ్డప్పుడు కూడా తల్లి అయిన పాలిన్ బిడ్డ కి అయిన గాయాన్ని పట్టించుకోదు. మంటకి తట్టుకోలేక ఏడుస్తున్న బిడ్డ గాయానికి మందు కూడా రాయకుండా యజమాని తెల్ల పాపని తీసుకొని నీకు కొత్తగా చెర్రీ పండ్ల పుడ్డింగ్ చేసి పెడతా బేబీ అంటూ ఆ పాపని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆమెకి తన స్వంత ఇల్లు, పిల్లల కంటే కూడా ధనవంతులైన తన తెల్ల జాతి యజమాని కుటుంబమంటేనే ప్రేమ ఉంటుంది. ఇల్లు వదిలి ఎక్కువ కాలం వాళ్ళ సేవలోనే గడుపుతుంది.
నవలంతా పాఠకుడు పాత్రల స్వంత గాయాలను, కన్నీళ్లను, నిరుత్సాహాలను మోసుకుంటూ, బాధపడుతూ నడుస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో పాత్రల క్లిష్టమైన మానసిక రుగ్మతలను అర్థం చేస్కునే క్రమంలో తీవ్రమైన వ్యధ కలుగుతుంది. నవలంతా డిప్రెస్డ్, దిస్టర్బ్డ్ పాత్రలతో నడిచినా రచయత్రి పక్కింటి మాక్ టీర్ పాత్ర, క్లాడియస్, ఫ్రీదా పెకోలా అక్కల పాత్రలను వివక్షని ఎదిరించే వాళ్లుగా మలుస్తుంది. స్కూల్లో పిల్లలు ఆమె నల్ల రంగుని హేళన చూసినప్పుడల్లా ఎదిరిస్తూ చెల్లికి తోడుగా ఉంటారు ఈ అక్క చెల్లెళ్ళు. వీళ్లు వర్ణ వివక్షని ఎదిరిస్తూ, ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళ పాత్రల ద్వారా జాతి వివక్షను ఎదిరించి నిలబడాలన్న సందేశాన్ని రచయిత్రి ఇస్తుంది. కానీ పెకోల మాత్రం వైట్ బ్యూటీ ని నిర్ధారించే నీలికళ్ల కోసం కలలు కంటూ అవాస్తవిక ఊహా ప్రపంచంలో ఉండిపోతుంది. దారుణమైన విషయం ఏమిటంటే పెకోలా మీద ఒక్క ఆమె తండ్రి చోలీ మాత్రమే కాదు, నీలి కళ్ళు ఉన్న నల్ల పిల్లిని చూపిస్తూ పక్కింటి టీనేజీ పిల్లవాడు కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తాడు. కానీ పెకోలా దృష్టి మాత్రం నీలికళ్ల నల్ల పిల్లిమీదే ఉంటుంది ఆ నీలి కళ్ళ లాలసలో, తెల్ల పిల్లవాడు తన నల్ల దేహం మీద చేసిన దౌష్ట్యాన్ని పట్టించుకోదు. రచయిత్రి ఈ అమాయకత్వపు పాపం ఎవరిది, రంగు ప్రధానంగా వివక్షని ప్రదర్శించే, సౌందర్య ప్రమాణాలను నిర్ధారించే అమెరికన్ రాజ్యానిది కాదా అని ఆవేదన చెందుతుంది. ఈ నవల రాసిన సామాజిక, చారిత్రిక సందర్భ కాలంలో అమెరికాలో అంటే 1940 -1970 మధ్య అంతా యుద్ధ పూర్వ, యుద్ధానంతర కాలం, అనేక సామజిక మార్పులు శర వేగంగా జరుగుతున్న కాలం, దానితో పాటు స్త్రీవాద భావజాల ప్రభావం బాగా ఉన్న కాలం అది.
తర తరాలుగా అణిచివేతకు, అత్యాచారాలకు గురి అవుతున్న అట్టడుగు ప్రజలైన ఆఫ్రో -అమెరికన్లు, స్త్రీలు, అమెరికన్ రాజ్యం, తెల్ల జాతి ప్రజలు శతాబ్దాలుగా చేస్తున్న దాష్టీకాలకు ఎదురు తిరిగి హక్కుల కోసం ప్రశ్నించిన కాలం. అబ్రహం లింకన్ బానిసత్వాన్ని రద్దు చేస్తూ చట్టాన్ని తెచ్చిన ప్రగతిశీల కాలం. అంతేనా అలెక్స్ హెలీ మొదలు టోనీ మారిసన్ వరకు తమ జాతి మీద జరిగిన అన్యాయాలను తమ స్వంత అనుభవాలతో సహా సాహితీకరిస్తూ గర్జిస్తున్న కాలం. అందుకే టోనీ ఈ నవలా కాలంగా, ఈ అన్నీ మార్పులు ప్రతిబింబించే 1940 – 1970 కాలాన్ని తీసుకుని రాసింది. జాతి, వర్ణ, లింగ వివక్షలు మనుషుల మానసిక స్థితుల్ని ఎట్లా అసహజంగా మార్చిపడేస్తాయో ఈ నవల ద్వారా విశ్లేషించింది రచయిత్రి.
(రెండో భాగం వచ్చే సంచికలో…)
గొప్ప రచయితను పరిచయం చేసారు.. టోని సాహిత్యాన్ని మా పిల్లలకు పరిచయం చేస్తాను. తెలుగు అనువాదాలు ఏమైనా ఉన్నాయా.. భారతి గారూ.. తప్పకుండా చదవాల్సిన సాహిత్యం. టోని మారిసన్ కు 🙏. Thank you so much.
థాంక్స్ వనజ గారు .,తెలుగులో లేదు నేనే అనువాదం చేయాలన్న ఆలోచనలో ఉన్నాను.పబ్లిషర్స్ కి permision కోసం లెటర్ రాసాను
చాలా గొప్ప రచయిత్రి టోనీ మారిసన్
Great experience reading this .moving.many congratulations for bringing out in Telugu.