జ్వాలలాగా బ‌తికిన‌వాడు

చెరబండరాజు బతికింది కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే. అయితేనేం ఆ కొద్ది జీవితమూ ఆయన భగభగమండే జ్వాలలాగా జీవించాడు. ఇక నాకు రేపు లేదు రాయాల్సింది ఈరోజే రాయాలన్నఅక్షరకాంక్షతో, ఉద్యమావసరాలే ప్రయోజనంగా రాశాడు.

పదునైన రచనలతో తెలుగు సాహిత్యానికి కొత్త దృష్టిని ఇచ్చాడు. పరిగెత్తించాడు. చిన్న చిన్న పదాలతో, లయబద్దమైన పదాల అమరికతో కరుణని, ఆవేశాన్ని, క్రోధాన్ని, ప్రేమని ప్రకటించాడు. ఆయన సృష్టించిన సాహిత్యం అనితర సాధ్యం. అపూర్వం. కవితలు, పాటలు, నాటికలు, నాటకాలు, కథలు, నవలలు — ఏ సాహిత్య ప్రక్రియనూ వదలకుండా రాశారు. ‘ఈ దేశ ప్రజలే నా కవితా వస్తువులు’ అని ప్రకటించిన చెరబండరాజు స్పృశించిన అన్నిసాహిత్య ప్రక్రియల్లోనూ వస్తువులు ప్రజలే.

ప్రజలు అంటే ‘అలగా జనం’.
గంజినీళ్ళు కూడా సరిగ్గా దొరకని వాళ్ళు.
జీవిక లేని వాళ్ళు. లేదా, సరైన జీవిక లేని వాళ్ళు.
అసలు కంటే వడ్డీ తడిసిమోపై మొయ్యలేని భారాన్ని మోస్తున్న వాళ్ళు.
మోసపోయేవారు. తన్నులు తినేవారు.
భుజమ్మీది బస్తాలోవున్నది కొడుకు శవమని తెలీక నడిచిన తండ్రులు.
అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తన్నవాళ్ళు.
వాళ్ళు, చెరబండరాజు సాహిత్యవస్తువులు.

కొడవటిగంటి కుటుంబరావుగారన్నట్టు సాహిత్యం, సాహిత్యానికి పుట్టిన పువ్వు కాదు. సాహిత్యం జీవితంలోంచి పుట్టాలి. అందుకే చెరబండరాజుకి వస్తువులు రక్తమాంసాలున్న ప్రజలు. అందుకే ఆయన చనిపోయి ముప్పైఏడేళ్లవుతున్నా ఆయన కథల్లోని, నవలల్లోని, నాటకాల్లోని, కవితల్లోని మనుషులు మనకి తెలిసిన వాళ్ళలా అనిపిస్తారు. మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటాయి దృశ్యాలు కథల్లో, నవలల్లో.

‘చెర’గా పిలుచుకునే చెరబండరాజు (అసలుపేరు బద్దం భాస్కరరెడ్డి) 1944లో పుట్టి 1982, జులై 2న మరణించారు. అర్ధాయుష్షుతోనే చనిపోయినా, జీవితం పట్ల, ప్రజల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల ఆయన చూపిన ప్రేమ అద్భుతమైనది. పాతపద్ధతిలో కవిత్వం రాశాడు. కుళ్లిపోయిన సమాజాన్ని చూసి కోపంతో రగిలిపోయిన దిగంబరకవితోద్యమంలో భాగస్వామి అయ్యాడు. సమాజానికి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ సరిపోలేదని, అంతకంటే ఇంకా ఎక్కువ ఏదో చేస్తే తప్ప పెనునిద్దర వదలదని అర్ధమైంది చెరకి.

ఆ పెనునిద్దర వదిలించి, కుళ్లిపోయిన మహావృక్షాన్నికూకటివేళ్లతో పెకలించే హామీ చెరబండరాజుకి నక్సల్బరీలో కనిపించింది. నక్సల్బరీలో అంటుకున్న కార్చిచ్చు తూర్పుకనుమలకు చేరుకొని ప్రభుత్వాలను, పాలకులను వణికించిన మహత్తర ఉద్యమం సెట్ బ్యాక్ కి గురైంది. కానీ ఎలాటి వనరులూలేని, మద్దతులేని ప్రజల్లో గొప్ప ఆశను, ధైర్యాన్ని సృష్టించిన ఆ ఉద్యమాన్ని పునర్మించడానికి, ఆ హామీని మళ్ళీ తెచ్చుకోడానికి జరిగిన ప్రయత్నాల్లో భాగంగా పుట్టిన విప్లవ రచయితల సంఘం నిర్మాణంలో భాగమయ్యాడు చెర.

మెదడుకి మూడుసార్లు సర్జరీలయినా, నిత్య నిర్బంధం ఎదుర్కొన్నా, నెలలకు నెలలు జైళ్లలో పెట్టినా వ్యక్తిగత ఒడిదుడుకులు ఆయన సాహిత్యసృష్టిని ఎన్నడూ ఆపలేదు. ఒకటి రెండు తరాల్ని ఉత్తేజితుల్ని చేసిన ఎన్నో పాటలు, కవితలు తెలుగునాట ఊరూరా గోడల మీద నినాదాలయ్యాయి. లక్షలమంది ప్రజల్ని విప్లవోద్యమోన్ముఖుల్ని చేసింది.

ఎన్నో కవితలు, పాటలు, రెండు నాటకాలు, నాలుగు నాటికలు, నాలుగు నవలలు, కథలు – జీవితం పట్ల, ఉద్యమం పట్ల, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన రచయిత ఎంత కృషి చెయ్యాలో, చెయ్యవచ్చో నిరూపించాడు.

‘గంజినీళ్ళు’ నాటకంలో ఒక పాత్రతో అనిపిస్తాడు చెర — “ఉద్యమం కోసం ఈరోజు ఏం చేశాం,” అని తరచి చూసుకోవాలని. బహుశా, అలాటి లక్ష్యమేదో పెట్టుకుని విప్లవోద్యమ భావజాలాన్ని ప్రచారం చెయ్యడానికి తన జీవితంలోని ప్రతి క్షణాన్ని వృథా చేయకుండా ఉపయోగించుకున్నాడు.

ముఖ్యంగా తన జీవితంలో ఆరోగ్యపరంగా అత్యంత క్లిష్టమైన దశలో ఆయన సృష్టించిన సాహిత్యం, కలిగించిన ప్రేరణ అసామాన్యమైనది. అనుసరణీయమైనది.

***

చెరబండరాజు జీవితం, సాహిత్య కృషి యువ సాహిత్యకారులకు మార్గ సూచీ. వాళ్ళు చెర సమగ్ర సాహిత్యాన్ని చదవాలి. ఇప్పటికే ఆయన కవితలు, పాటలూ విరసం ‘ఈ తరానికి చెరబండరాజు చిరునామా’ పేరుతో పుస్తకాన్ని వేసింది. ఆ పాటలు, కవితలు తెలుగు సమాజంలో, ముఖ్యంగా తెలంగాణాలో చాలామందికి నోటికి వస్తాయి. ఆ పాటల్లోని, కవితల్లోని పంక్తులు నినాదాలుగా…

విప్లవాల యుగం మనది
విప్లవిస్తే జయం మనదే…

చెరసాలలు ఉరికొయ్యలు
వెలుగును బంధించలేవు…

ముంజేతిని
ఖండించిన
నా పిడికిటి
కట్టి వదల

ఈ చీకటి
కుంపటారి
ప్రభాతాలు
పరిమళించు

— ఇలాటి పంక్తులు తెలుగు ప్రజలకు, సాహిత్యాభిమానులకు సుపరిచితం. చెర సాహిత్యంలోని ఈ భాగం గురించి తెలిసినంతగా మిగతా భాగం గురించి తెలియదు చాలా మందికి. ఆయన నాటికలు, నాటకాలు, నవలలు, కథలకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎనభైల్లో, తొంబైల్లో చెర రాసిన నాటకాలు వీధుల్లో, రోడ్ల మీద, ఫ్యాక్టరీల లోపల, బయట, మీటింగుల్లో ప్రదర్శనలు వేశారు. ముఖ్యంగా ఇప్పటి తరానికి ఆయన సాహిత్యంలోని ఈ పార్శ్వం పరిచయం లేదు.

నాటికలు, నాటకాలు:

చెర రెండు నాటకాలు, నాలుగు నాటికలు రాశారు. వీటి ప్రధాన ఇతివృత్తం — గ్రామాల్లో విస్తరిస్తున్న విప్లవోద్యమం, అది ప్రజల ఆకాంక్షలను ఎలా ఒడిసి పట్టుకున్నది, దుర్భరమైన జీవితాన్నించి బయటపడెయ్యడానికి ఉద్యమం ఇచ్చిన ధైర్యం, భూస్వాముల దాష్టీకాలు. రాజ్యహింస, గృహహింస, ఎన్నికల ప్రజాస్వామ్యంలోని డొల్లతనం కూడా నాటకాల్లో కనిపిస్తాయి.

ఈ ప్రక్రియలో చెర సాధించిన విజయమేమిటంటే — ఈ నాటకాల్ని ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు వేసుకునే సౌలభ్యం ఇవ్వడం. తక్కువ పాత్రలతో, బోరుకొట్టని సంభాషణలతో కథని పరుగెత్తించడం. అవాస్తవమని అనిపించని, అసహజమనిపించని దృశ్యాలు, పాత్రలు మన కళ్ళముందు కదులుతాయి.

ఈ నాటకాల నుంచి యువరచయితలు నేర్చుకోవాల్సింది ఎంతో వున్నది. మన చుట్టుపక్కల జరుగుతున్న, మనం చాలా మామూలు అనుకుంటున్న సంఘటనలను, విషయాలను, సంక్లిష్టతలను, ఘర్షణలను ఎప్పటికప్పుడు గ్రహించి సాహిత్యంలోకి తీసుకు రావాలి. రాయకుండా ఉండడానికి ఏదో ఒక వంకని చూపించకుండా ప్రజలపట్ల బాధ్యతతో వ్యవహరించాలని, రాయగలిగినంత రాయాలని చెర జీవితం మనకి చెప్తుంది.

కొ.కు. అంటారు, ప్రతి కొత్త తరమూ తన సొంత సాహిత్యాన్ని సృష్టించుకోవాల్సిందేనని. కానీ అందుకోసం వాళ్ళు గత తరం సాహిత్యకారులు చేసిన యుద్ధాల్ని అధ్యయనం చెయ్యాలి. వాళ్ళ జీవితమూ, సాహిత్యాలనుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుని, పరిహారం చెయ్యాల్సినదాన్ని పరిహరించుకోవాలి.

గ్రామాలు మేల్కొంటున్నాయి:

‘గ్రామాలు మేల్కొంటున్నాయి’ నాటకం మూడు అంకాలలో ఉంటుంది. ఈ నాటకాన్ని చెర రాసింది జులై 1974లో. విప్లవోద్యమానికి వున్న సబ్జెక్టివ్ కండిషన్ల గురించి, అలాటి సందర్భంలో అణచివేతకు గురవుతున్నవారికి సరైన ప్రాపంచిక దృక్పథం ఇస్తే ఒక పల్లె ఎలా చైతన్యవంతమవగలదు అని చెప్పే కథ ఇది.

ఇన్ని వందల కథల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత చూస్తే ఇప్పుడు ‘ఏముంది ఈ కథలో’ అనిపించవచ్చు. కానీ ఈ నాటకానికి నేపథ్యం ఏమిటో గుర్తించోకోవాలి.

ఈ దేశంలో విప్లవోద్యమపు ఆశ చిగురించడం, సెట్ బ్యాక్ కు గురవడం — అంతా జరిగి అప్పటికి ఇంకా ఆరేడేళ్లే అవుతోంది. నక్సల్బరీ phenomenon తాలూకు విస్తృతి అర్ధం చేసుకోవడం, అది మళ్ళీ ఎలా రూపుదిద్దుకోబోతుంది, అందుకు ఈ నేల మీద వున్న సబ్జెక్టివ్ కండీషన్లేమిటి అని అర్ధం చేసుకోవడం, పట్టుకోవడం, దాన్ని నమ్మి రాయడం — అది కూడా కేవలం ముప్పై ఏళ్ల వయసులో రాయడం విశేషం.

ఒక గ్రామంలో జరిగిన భూస్వామి ఆగడాలు, ఆ భూస్వామికి దోపిడీలో అండగా నిలబడ్డ ఒక తైనాతీ — మరోపక్క, ఈ వ్యవస్థీకృతమైన హింసను ఇంకెంతకాలం తట్టుకోవాల్సిన అవసరం అని భావించే కొత్త తరం. విప్లవోద్యమం ఇచ్చిన కొత్త చూపుతో హింసా రూపాలను అర్ధం చేస్తుకుంటున్న కొండడిని అమృతరావు, గోపాలరెడ్డి కలిసి హత్య చేసి గోనెలో దాచేస్తారు. కొండడి తండ్రికి మాయమాటలు చెప్పి కొడుకు శవమున్న బస్తాని తండ్రితోనే దూరంగా పడేయిస్తారు. ప్రజలు ఈ అన్యాయాన్ని ఎలా అర్ధంచేసుకున్నారో, ఎలా తిరగబడి ఒక చిన్న విజయాన్ని సాధించుకున్నారో చెప్పే నాటకం యిది.

కొండడిని హింసించే సందర్భంలో గోపాలరెడ్డి అంటాడు అమృతరావుతో — “ఎందుకు వెనకాడుతున్నావు? ఆ గాంధీగారు ఇంకా నీ రక్తంలో బతికివున్నట్టుంది.”

జవాబు ఇస్తాడు అమృతరావు. “కొరడా చేతిలోకి తీసుకున్నపుడు లేని గాంధీ, కొట్టేటప్పుడు ఎలా వస్తాడయ్యా,” అని.

ప్రజాస్వామ్యంకాని ప్రజాస్వామ్యం గురించి చెరబండరాజుకి స్పష్టత వున్నది. కొరడాలు, లాఠీలు, తుపాకీలు, అన్యాయమైన చట్టాలు కలిగివున్నపుడు గుర్తుకురాని గాంధీ (అహింస) లేదా రాజ్యాంగం వాటిని వాడినప్పుడు గుర్తుకువస్తాడా ప్రభుత్వానికి?

సాహిత్యానికి ప్రయోజనం ఉండాలన్న స్కూల్ కి చెందినవాడు చెర. అందుకే, ఈ నాటకం ముగింపులో ఒక చిన్న పాట పంక్తి రాస్తాడు.

కనిపించే — ప్రతివస్తువు
మా కష్టం — ఫలమేనని
ఆక్రమించి — పోరుతాం
అనుభవించి — తీరతాం

ఇందులో శ్రమదోపిడీ గురించి, alienation గురించి, అది ఎవరికి చెందాలో వాళ్లకి చెందితీరాలి — అన్న భావజాల ప్రచారం వున్నది.

గంజినీళ్ళు:

ఇది చెరకి చాలా ఇష్టమైన నాటకం. ఈ నాటకం ఇతివృత్తం కూడా మొలకెత్తుతున్న విప్లవోద్యమం ప్రభావాన్ని పట్టుకోవడం. గ్రామాలల్లో ప్రజల సమస్యలని పట్టించుకుని, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, దోపిడీకి, బూటకపు ఎన్నికల ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో భాగస్వాముల్ని చెయ్యడం. కాయకష్టం చేసుకునే కుటుంబం, పిడికెడు ముద్ద సరే, గంజినీళ్లకు కూడా అల్లల్లాడే పేద కుటుంబం గురించిన కథ ఇది.

దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పు తీసుకుంటే, మిత్తి బరువు పెద్దదై వడ్డీవ్యాపారి బారిన పడ్డప్పుడు వస్తాడు కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళు వద్దంటున్నా అప్పు తీర్చేస్తాడు.

“దేశం బాధల్లో వుంది,” అంటాడు.

దేశం బాధల్లో వున్నదీ అని అంటే దాని అర్ధం ఏమిటంటే, “వచ్చే ఎన్నికల్లో మా పార్టీ పరిస్థితి ఘోరంగా వుంది,” అని.

అప్పటికే ఉద్యమ నాయకుడి పరిచయంతో ఎవరి నినాదాల వెనక ఎవరి ప్రయోజనాలున్నాయో అర్ధం అవుతున్నాయి కాబట్టి వీరయ్య నిలదీస్తాడు – “దోషం మనుషులల్ల వుందా? ఖానూన్ల వుందా? ఎక్కడుంది బాబూ. సెమటోడ్చినా గంజితాగుతున్నం. తప్పు మాదా? జీతమిచ్చే దొరదా,” అని ప్రశ్నిస్తాడు.

నువ్వు ఎన్నికలొస్తున్నాయి కాబట్టి వోట్లకోసం వచ్చేవు. ఈ ఎన్నికలు బూటకం. ఎన్ని ఎన్నికలు జరిగినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందుకు మా బతుకులు నానాటికీ దిగజారుతున్నాయని అడుగుతాడు. భూ సంస్కరణల డొల్లతనాన్ని చెప్తాడు. “మన ఊళ్ళ ఒక్క ఎకరా గూడ సీలింగ్ కిందకి ఎందుకు రాలేద”ని ప్రశ్నించే స్థాయికి గంజిలేనివాళ్ళు చేరుకుంటారు.

గొడవలు జరగ్గానే ఆ ప్రాంతాలను ‘కల్లోల ప్రాంతాలుగా’ ప్రకటించి నిర్బంధాన్ని విపరీతంగా పెంచుతుంది ప్రభుత్వం. అన్యాయాన్ని నిలదీస్తే, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అది కల్లోల ప్రాంతం ఎందుకవుతుందని ప్రశ్నిస్తాడు చెరబండరాజు.

“కల్లోలం ఎవరికి,” అని ప్రశ్నిస్తాడు ఈనాటకంలో ఒక పాత్రద్వారా.

నిర్బంధాన్నీ, సంక్షోభాన్నీ ఎదుర్కొని గంజినీళ్ళకు కూడా గతిలేని వాళ్ళు ఉద్యమానికి సిద్ధమవడం ఈ రచన ఇతివృత్తం.

ఈ రెండు నాటకాలు కాక చెర మరో నాలుగు నాటికలు – ‘పల్లె పిలుద్తోంది’, ‘వెన్నెల్లో మంటలు’, ‘సంఘర్షణ’, ‘టెంపరరీ లేబర్’ కూడా రాశారు.

***

తెలుగు సాహిత్యంలో నాకు అత్యంత ఇష్టమైన కవి చెరబండరాజైతే, అత్యంత ఇష్టమైన రచయత రావిశాస్త్రి.

రావిశాస్త్రి గారు తన ‘రావి శాస్త్రీయం’ (ఆయన రచనల్లో ముఖ్యమైన రచనల్లో ఒకటి) పుస్తకాన్ని చెరబండరాజుకి అంకితం ఇచ్చారు.

“వీరుడూ, విప్లవకవీ, సచ్ఛరితుడూ అయినా చెరబండరాజు గారు తను మంటల్లో నిలబడి కూడా మందహాసం చేస్తూ ఉండేవారు. కాని, ఇతరులకి ఏపాటి ఎర్రని ఎండ తగిలినా కూడా భగభగ బాధపడేవారు. వారి అమర స్మృతికి ఈ రావి శాస్త్రీయం అంకితం.”

చెరబండరాజుకి నివాళి.

రచయిత, జర్నలిస్టు.

Leave a Reply