జ్ఞానాందకవి కావ్య మార్గం

కావ్యం అంటే ఏకాంశ వ్యగ్రత కల కథా ప్రధానమైన రచన. జ్ఞానానంద కవి కావ్యరచన 1950 లో మొదలైంది. ఆయన కావ్యాలకు తొలి కథానాయకులు జాతీయోద్యమ నాయకులు. ఒకరు ఆయనకు మాహా ఆరాధనీయుడు గాంధీ. మరొకరు అయ్యదేవర కాళేశ్వరరావు. ఒకరు జాతీయనాయకుడు మరొకరు దేశబంధు బిరుదునందుకొన్న ఆంధ్ర నాయకుడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొన్ని నెలలలకే గాంధీ హత్యచేయబడ్డాడు.(30 జనవరి 1948) ఆయన అమరత్వం కలిగించిన దుఃఖం నుండి జ్ఞానాందకవి గాంధీ కావ్యం వ్రాసాడు (1950 ) గాంధి (అమరగీత) అనే పేరుతో పేర్కొనబడిన ఈ కావ్యం  అయ్యదేవర కాళేశ్వరరావు కు అంకితం ఇయ్యబడింది. ఇదిప్పుడు అలభ్యం.  రెండవ కావ్యం దేశబంధు అయ్యదేవర కాళేశ్వరరావు.  1957  లో ప్రచురితం. ఆ తరువాతి కాలంలో ఆయన వ్రాసిన కావ్యాలు పర్జన్యం(రెండు భగాలు) , గోల్కొండ, విజయాభిషేకం , ఆమ్రపాలి. 

దేశబంధు అయ్యదేవర కాళేశ్వరరావు కావ్య ప్రయత్నాన్ని జాషువా అభినందించి ఆశీస్సులు ఇచ్చాడు.  ప్రచురణకు ద్రవ్య సహాయం చేసిన కొలిశెట్టి హనుమయ్య గుప్త గుణగణాలను  అయిదు పద్యాలలో వర్ణించి కావ్యరచనకు ఉపక్రమించాడు కవి. వంశము, బాల్యము , విద్యాభ్యాసము, ఉద్యోగము , బిఎల్ చదువుకు పయనం, తల్లి ఆశీస్సు, గుంటూరు ప్రాక్టీస్, విజయవాడ నివాసము, వివాహము, విజయవాడలో, ప్లీడరీ వృత్తి, గాంధీ ఆంధ్ర యానము, కలకత్తా కాంగ్రెస్, లాయరు వృత్తి విసర్జనము, శాసనసభారంగములో, కమ్యూనిస్టుల సహవాసము, క్విట్టిండియా నినాదము, కాళేశ్వరరావుగారి అభయము, బొంబాయి ఆగస్టు విప్లవం, స్వాతంత్య్ర సుప్రభాతము, భాషాసేవ, ద్వితీయ విశాలాంధ్ర మహాసభ, మెమోరాండాము-ఎన్నికలు, శాసనసభాధిపతిత్వము, ఉపసంహారము మొత్తం 25 శీర్షికలతో  348 పద్యాలలో  కావ్య వస్తువు విస్తరించబడింది. 

అయ్యదేవర కాళేశ్వరరావు 1881జనవరి 22 న కృష్ణాజిల్లా నందిగామలో పుట్టాడు. 1962 ఫిబ్రవరి 26 న మరణించాడు. దేశబంధు అయ్యదేవర కాళేశ్వరరావు  కావ్య ప్రచురణ  1957   కనుక విశాలాంధ్ర నిర్మాణంలో ఆయన పాత్రను చెప్పటంతో ముగిసింది. అయ్యదేవర కాళేశ్వరరావు నవ్యాంధ్రము పేరుతో వ్రాసుకొన్న జీవిత కథ 1959 లో కానీ అచ్చు కాలేదు. కావ్య వస్తువైన కాళేశ్వరరావు జీవిత విశేషాల సేకరణ ఎలా చేసాడో కవి చెప్పలేదు.  కావ్యం కనుక తారీఖులు , సంవత్సరాలు ఉండవుకానీ కొన్ని చారిత్రక ఘటనల ప్రస్తావన వల్ల కాలాన్నిఊహించవచ్చు.  కాళేశ్వరరరావు వివాహ ప్రస్తావన ఈ కావ్యంలో ఉంది. అది జరిగింది 1894 లో.   ఆ సంవత్సరం జూన్ లోనే  ఆయన హైస్కూల్ చదువు కోసం  బందరు వెళ్ళాడు. మూడవఫారం లో చేరిన ఆయన బిఎ పూర్తయ్యేవరకు  నోబుల్ కళాశాలలోనే  కొనసాగాడు. ఆ చదువుల కాలం ఎనిమిదేళ్లు అని కావ్యంలో చెప్పబడింది. దానినిబట్టి 1902 నాటికి ఆయన చదువు పూర్తయినట్లు.  

 విద్యాభ్యాస కాలంలో   కాళేశ్వరరావు జీవితం   కీలకమైన మలుపు తీసుకున్నట్లుగా కావ్యకథ నిర్మాణం జరిగింది.   స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి ఆయనను ఆవేశించిన కాలం ఇది. దానిని కవి రకరకాలుగా వర్ణించాడు. రూసో, వాల్టేర్ ప్రభావాలు ఫ్రెంచ్ విప్లవం నుండి  పొందిన  నూతన అంతర్జాతీయ దృష్టి,  రమేష్ చంద్రదత్తు, నౌరోజీ, గాంధీజీ, లాలా లజపతిరాయ్ మొదలైన దేశ నాయకులనుండి పొందిన జాతీయ స్ఫూర్తి, రాజరామమోహన్ రాయ్ , వివేకానందుడు, వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం వంటి సంస్కర్తల నుండి పొందిన సామాజిక దృష్టి , కొమర్రాజు లక్ష్మణ రావు , ముట్నూరి కృష్ణారావు వంటి వాళ్ళ స్నేహంలో పొందిన సంస్కారం ఆయనను మహోన్నత వ్యక్తిగా మలిచాయని కవి అంటాడు.

 “ ఇది నా దేశము నన్ను గన్నయది నా యిష్టంబు నా దేశసం 

    పద  నా హక్కు బరాయి భూపతుల కే మాత్రంబు తావింత లే 

    దు  దయాధర్మ ఝరీ తరంగములలో  దోగాడు నా తల్లి యా 

  పద బోకార్చెద  స్వేచ్ఛకై తనువు నిస్వార్ధాన నర్పించెదన్” (45)  అని కృత నిశ్చయానికి రావటంలో ఆ వ్యక్తిత్వమే పని చేసింది. 

తాను చదివిన నోబుల్ కళాశాలలోనే రెండేళ్లు అధ్యాపకవృత్తిలో గడిపి  చెన్నపట్నంలో బిఎల్ చదువుకు వెళ్ళాడు కాళేశ్వరరావు. ఆయన లా చదివిన కాలం 1904, 1905.  ఆకాలంలో వీరేశలింగం పంతులుతో పరిచయం, తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి స్నేహం ఆయనకు లభించాయి.  కాళేశ్వరరావు గుంటూరు లో ప్రాక్టీస్ ప్రారంభించినట్లు, తరువాత విజయవాడకు మారినట్లు కావ్యం చెప్తున్నది. కాళేశ్వరరావు స్వీయ జీవిత కథనం 1906 లో విజయవాడలో లాయరుగా ప్రవేశించటాన్ని గురించి మాత్రమే చెప్పింది. అయితే ఆయన గుంటూరులో ప్రాక్టీస్ ప్రారంభించలేదు కానీ గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఉన్నకొండావెంకటప్పయ్య పంతులు యందు ఉన్న గౌరవంతో, పూజ్యభావంతో మూడు నెలలపాటు ఆయన ఆఫీసులో లాయర్ పని నేర్చుకొన్నాడు. ఆయనతో పాటు వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నాడు. నిజానికి ఆయన మద్రాస్ లో లా విద్యార్థిగా ఉన్న కాలంలోనే వందేమాతర ఉద్యమ ప్రభావానికి లోనై కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకొని పనిచేసాడు.  కావ్యంలో దాని ప్రస్తావన లేదు. కావ్యంలో విజయవాడకు నివాసం మార్చాక  కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొన్నట్లుగా  చెప్పబడింది. 

కలకత్తా కాంగ్రెస్ విషయం కూడా ఇందులో ప్రస్తావించబడింది. అది 1920 సెప్టెంబర్ 4 న మొదలైంది. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా కాళేశ్వరరావు ఆ సభలకు హాజరయ్యాడు. అప్పటికే గాంధీ పిలుపును అనుసరించి  దౌర్జన్య రహిత సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా మద్రాస్ శాసనసభ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొన్నాడు. లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ఆ నాటి కాంగ్రెస్ మహాసభను, అందులో దౌర్జన్య రహిత సహాయనిరాకరణ ప్రతిపాదన    అధిక సంఖ్యాకుల సమ్మతి పొంది  గాంధీ నాయకత్వాన్ని స్థిరపరచటాన్ని కవి గొప్ప ఉత్సాహంతో   వర్ణించాడు.1906 లో బెజవాడలో లాయరుగా చేరిన కాళేశ్వరరావు  మహాత్మగాంధీ పిలుపు మేరకు సహాయనిరాకరణోద్యమంలో భాగంగా 1921 మార్చ్ 21న లాయర్ వృత్తిని త్యజించాడు. ప్రాక్టీస్ ప్రారంభం, వృత్తిని వదిలివేయడం రెండూ ఈ కావ్యంలో ప్రస్తావించబడ్డాయి. సహాయనిరాకరణ ఉద్యమ వ్యాప్తికి కాళేశ్వరరావు పని చేసిన తీరు కూడా ఇందులో వర్ణితమైంది.  

1921 మార్చ్ 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. గాంధీ, నెహ్రు, పటేల్, చిత్తరంజన్ దాస్,  లజపతిరాయ్ మొదలైన జాతీయనాయకులందరు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశాలు ముగిసిన తరువాత కొండావెంకటప్పయ్య వెంట రాగా వారం రోజులు గాంధీ ఆంధ్రదేశంలో పర్యటించాడు. బహుశా ఈ పర్యటనే ఈ కావ్యంలో ‘గాంధీ ఆంధ్ర యానము’ గా వర్ణించబడింది.    

  అయ్యదేవర కాళేశ్వరరావు జాతీయోద్యమ కార్యకలాపాలలో భాగమై కడలూరు జైలులో కొన్నాళ్ళు, ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని రాయవెల్లూరు జైలులో కొన్నాళ్ళు ఉన్నవిషయం ఈ కావ్యంలో ప్రస్తుతించబడింది. రాయవెల్లూరు జైలులో ఆయనకు  కమ్యూనిస్టులతో పరిచయం కలిగింది కానీ సఖ్యత సమకూడలేదన్న విషయం ఈ కావ్యంలో నమోదు అయింది. క్విట్  ఇండియా ఉద్యమం గురించి గాంధీ పనుపున మీరాబెన్ వచ్చి కాళేశ్వరునితో సంప్రదించినట్లు కావ్యంలోఉన్నది. 1942 ఆగస్టు 8 న బొంబాయిలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశం లో తీర్మానించబడిన  క్విట్ ఇండియా  ఉద్యమం ఆగస్టు విప్లవం గా ప్రసిద్ధి. అందులో  పాల్గొని కాళేశ్వరరావు జైలుకు వెళ్ళాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. విశాలాంధ్ర ఏర్పాటు  విషయంలో కాళేశ్వరరావు చేసిన కృషిని , ఆసందర్భంలో జరిగిన సభలను , చర్చలను ,  వాటిలో భాగస్వాములైన ఆ నాటి జాతీయోద్యమ నాయకులను, తెలంగాణ పెద్దమనుషులను పేర్లతో ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వర్ణించి ఈ కావ్యాన్ని ముగించాడు కవి.   

అయ్యదేవర కాళేశ్వర రావు అనగానే  జాతీయోద్యమ రాజకీయాలలో క్రియాశీలక భాగస్వామి అన్నది లోకవిదితం. అదేసమయం లో ఆయన ఒక ఆచరణాత్మక సంస్కరణ వాది. అలాగే అయన ఒక భాషా సాంస్కృతిక కార్యకర్త కూడా. అందులో భాగంగానే రచయిత కూడా అయ్యాడు. విద్యార్థిగా , అధ్యాపకుడిగా బందరులో ఉన్న కాలంలో సంఘసంస్కరణ సంబంధ సంవాదాల ప్రభావం కాళేశ్వరరావు మీద బాగా పడింది. మారుతున్న కాలం తో పాటు  బ్రాహ్మణ ఆబ్రాహ్మణ తేడాలేకుండా కలిసి తినటం,రజస్వలా వివాహాలు , వితంతువివాహాలు  జరగవలసినవే అని కొత్తభావాలు పరివ్యాప్తి చెందుతున్న కాలం అది. వితంతు వివాహాలకు, రజస్వల వివాహాలకు, అంతః శాఖా  వివాహాలకు, అస్పృశ్యతా నివారణకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం  తదనుగుణంగా ఆచరణ రూపాలను ఎంచుకొని  అనుసరించటం జరుగుతుండేది. స్త్రీవిద్య కొంతవరకు సామాజిక ఆమోదాన్ని పొందింది అనటానికి  స్త్రీలు సంఘాలు పెట్టుకొనటం, పత్రికలు పెట్టటం,  రచనలు చేయటం నిదర్శనాలు. ఈ క్రమంలోనే  కాంగ్రెస్ రాజకీయ సభలతో పాటు సాంఘిక సభలు కూడా నిర్వహిస్తుండేది.  ఈ నేపథ్యంలో అయ్యదేవర కాళేశ్వరరావు పంచమాభ్యుదయానికి,  స్త్రీ జనాభ్యుదయానికి చేసిన కృషిని జ్ఞానానంద కవి  ప్రత్యేక శ్రద్ధతో ఈ కావ్య ఇతివృత్తంలో భాగం చేసాడు. 

1906లో విజయవాడలో లాయరుగా ప్రాక్టీస్ ప్రారంభించినప్పటి నుండే కాళేశ్వరరావు అస్పృశ్యతనివారణకు పనిచేయటం మొదలు పెట్టాడు. ఇంట్లో పనికి పంచములను నియమించు కొన్నాడు. పంచములకొరకు పాఠశాల నడిపాడు. గ్రంధాలయోద్యమానికి అనుబంధంగా హరిజను లకు రాత్రి పాఠశాల ఏర్పాటు చేయటంలో చొరవ చూపాడు.బ్రాహ్మడైనా ‘ఆదిమాంధ్ర జాతిని ఆదరించాడని, పంచములకు బడులు పెట్టాడని’ ( 82,83) జ్ఞానానందకవి ఈ విషయాన్ని తన కావ్యంలో నమోదు చేసాడు.  ‘ నిమ్నజాతుల కనంత స్నేహ బాంధవుడై’  మెలిగాడని, ‘కూటికి గోత్రానికి దిక్కులేని అస్పృశ్య జాతికి చేయూత ఇచ్చాడ’ని, ‘హరిజనులన్న ప్రేమయు, సమాదరణయుత  గౌరవాభిమానములు’   చూపాడని ‘భూరి దయామృత సోముడ’ని, ‘మహితా త్ముడని’, ‘తన సమత్వపు గుణధనము నిరూపింప కులహీనులకు దొడ్డనిలయమొసగినాడ’ ని జ్ఞానాందకవి కాళేశ్వరరావును ప్రస్తుతించాడు. ఈ క్రమంలో  సంప్రదాయ వర్గం  కాళేశ్వరరావును ఆక్షేపిస్తూ బహిష్కరణ బెదిరింపులు చేయటాన్ని కవి  నిరసిస్తూ వ్రాసాడు.  

“విద్దెల్ నేర్వని యాదిమాంధ్రులకు నే వీసంబు ప్రేమంబు తో 

మద్దత్తిచ్చిన జాలు బాగుపడి సంపాదింత్రు విజ్ఞానపున్ 

బద్దెన్నిల్చి యశస్సు మానవుల క బ్రమౌ విధానమ్మిదే  

యుద్దేశంబని బెజ్జవాడ సభయందూహించి రీ జ్ఞానులున్”(121)  అని కవి ప్రస్తావించిన బెజవాడ సభ అయ్యదేవర కాళేశ్వరరావు చొరవతో గూడూరు రామచంద్రరావు వేమూరి రాంజీ రావు మొదలైన సంస్కర్తలు , రాయుడు గంగయ్య , చుండ్రు వెంకయ్య , నూతక్కి వెంకటేశ్వర్లు మొదలైన హరిజన నాయకులు కలిసి 1917 నవంబర్ లో నిర్వహించిన ప్రథమ పంచమ ఆంధ్ర మహాసభ. ఈ సభకు అధ్యక్షత వహించటానికి హైదరాబాద్ నుండి భాగ్యరెడ్డి వర్మ వచ్చాడు. ఈ మహాసభ ఘట్టం మాలపల్లి నవల ఇతివృత్తంలో భాగం అయింది కూడా. 

“రాజకీయాల నాదిమాంధ్ర ప్రసక్తి

 జొనిపినం గాని స్వాతంత్య్రమునకు  దారి 

లేదు” (169) అని స్పష్టం చేసిన ద్రష్ట అని కూడా కాళేశ్వరరావు గురించి పేర్కొన్నాడు కవి.  

“పంచముల నాదరించు , ద 

యాంచిత  భాసురుడు కాళికాహ్వయుడన బో 

షించి తయారొనరించియు 

బంచాము నొకనిని బ్రసిద్ధపదవికి దెచ్చెన్” “ (215) అని కవి చెప్పినది   వేముల కూర్మయ్య విషయమే కావాలి. కూర్మయ్యను తన ఇంట ఉంచుకొని చదివించి , కాశీ కి పంపించి ఎఫ్ ఎ, బిఎ , ఎల్ ఎల్ బి చెప్పించి ఆ తరువాత రాజకీయాలలోకి ప్రవేశ పెట్టాడు కాళేశ్వరరావు. 

కాళేశ్వరరావు శాసన సభ సభ్యుడుగా హరిజనులకు  దేవాలయ పూజారులుగా హక్కును కల్పించటానికి చొరవ చూపాడు.

ఇక స్త్రీల విషయంలో వితంతు పునర్వివాహా వాదుల వైపు ఆయన నిలబడిన విషయం కూడా ఈ కావ్యంలో ప్రస్తావించబడింది.(92) తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా హక్కు ఉందని, పురుషులకువలెనే స్త్రీలకు కూడా విద్యావసరమని, సాంఘిక ఆర్ధిక విషయాలలో స్త్రీలు పురుషులతో సమాన భాగస్తులేనని, స్త్రీకి స్వేచ్ఛ కావాలని, పురుషులకు భార్య బతికి ఉండగా మరొక పెళ్లి పెద్ద తప్పు అని కాళేశ్వరరావు శాసన సభలలో వాదించి గెలిచి మహిళల మెప్పుపొందాడని, వరకట్న నిషేధ చట్టం తెచ్చాడని కవి ప్రస్తావించాడు. ఆ రకంగా ఇది సమకాలీన సాంఘిక రాజకీయ చరిత్ర కావ్యం అయింది. 

పర్జన్యము రెండుభాగాల కావ్యం. 1959 లో మొదటి భాగం, రెండవభాగం ఆ తరువాత పదేళ్లకు 1969 లో ప్రచురించబడ్డాయి. మొదటిభాగాన్ని  అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి రెండవభాగాన్ని  త్రిపురనేని వెంకటేశ్వరరావు కు అంకితం ఇచ్చాడు. కృతి భర్తలైన సంజీవరెడ్డి ని 15 పద్యాలలో , త్రిపురనేని వెంకటేశ్వరరావు ని 59 పద్యాలలో వర్ణించాడు. పర్జన్యము  మానవసమాజంలోని అవకతవకలను, అసమానతలను, అన్యాయాలను పరమేశ్వరునికి నివేదించటం గా సాగుతుంది. “ మానవత్వము నాలో మనుటవలన / జీవచైతన్య శక్తి పుంజీభవించి / నన్ను మేల్కొల్ప నేడు విపన్నజాతి తరపున నొసంగు విజ్ఞప్తి దయను వినుము” అని మొదటి భాగాన్ని ప్రారంభించిన కవి “తొలివిజ్ఞప్తిని స్వీకరించి భగవంతుడేడు సంవత్సర/ మ్ముల పాటేమియు చెప్పలేదని మనమ్మున్ శోక దావాగ్ని కీ /లలు వ్రేల్చన్…”  రెండవభాగాన్ని ప్రారంభించాడు. మొదటి విజ్ఞప్తి తరువాత ఏడేళ్లకు రెండవ విజ్ఞప్తి చెప్పుకొంటున్నాడంటే రెండవ భాగం 1966 లో వ్రాయబడినట్లు. ప్రచురణ కు మరో మూడేళ్లు పట్టింది. జాషువా వ్రాసిన గబ్బిలం కావ్య నమూనాలో ప్రారంభించిన ఈ కావ్యానికి ఆ బిగువు మాత్రం రాలేదు. అదీకాక కావ్యానికి ఉండే వస్త్వైక్యత అంటూ ఇందులో ఏమీలేదు. ఏ పద్యానికి ఆ పద్యం విడివిడిగా ఏదో  ఒక విషయాన్ని చెప్పేదే. ఈ పద్యాలలో పదేపదే ఆయన చెప్పిన విషయాలు ఏమిటి? 

విపన్న జాతి తరఫున మాట్లాడుతున్నానని అన్నాడు కదా కవి..! ఆ విపన్న జాతిలో కవికి ముందుగా కనబడేవాళ్లు కవులు. వాళ్ళు పేద కవులు, కావ్యాలను అంకితం తీసుకొన్నవాళ్ళు సరైన గౌరవదారాలు, ధన సహాయం చేయకపోవటం వలన ఖేదపడేవాళ్లు.  గారవము సున్న అయి, గొప్పవారి ఆశ్రయం లేక   పుస్తక ఆవిష్కరణ సభలైనా జరుపుకోలేని వాళ్ళు. ఆ రకంగా  కవులకు ధన ప్రయోజనాలు, సత్కారాలు జరగటం లేదని కవి  వాపోతాడు.  

విపన్న జాతిలో తిండిలేని కార్మికులు, కర్షకులు, కూలీలు, కూడూగుడ్డా గతిలేని దరిద్రమూర్తులు,  క్షుత్పీడవల్ల భిక్షాపాత్ర చేబూనినవాళ్లు, శ్రమ ఫలితాలు దక్కని వాళ్ళు ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొని చితికి పోయిన బతుకులవాళ్ళు, గాంధీ వారసులు, దేశసేవకు ఏ గుర్తింపూ, గౌరవమూ లేక బాధపడేవాళ్లు కూడా ఆ విపన్న జాతిలో వాళ్లే. 

అస్పృశ్య జాతుల ఘోష, మాలమాదిగలమధ్య  పెరుగుతున్న ఈర్ష్యలు, కుల విభేదాలు,   మతాల కుమ్ములాటలు ఈ దేశాన్ని పీడిస్తున్న సమస్యలు అని కొన్నిటిని గుర్తించి చెప్పాడు. 

ఈ సమస్యలకు, అనర్ధాలకు కారణం పెరుగుతున్న స్వార్ధం,ధన వ్యామోహం. అధికారకాంక్ష.అధికారాలు చేపట్టి అఘాయిత్యాలు చేసేవాళ్ళు, కరుణలేని మనుషుల కాఠిన్యం, వర్ణవిభేదా జాడ్యాన్నిప్రేరేపించే పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల రక్తమాంసాలు పీల్చి శరీరం పెంచుకొనేవాళ్ళు, పేదజనులను హింసించే నాయకులు, ప్రజాద్రవ్యాన్ని భక్షించేవాళ్ళు, లంచాల జలగలు, దొంగలెక్కలు రాసేవాళ్ళు, పదవులకోసం వెంపర్లాడేవాళ్లు, అధికారదుర్మదం తలకెక్కినవాళ్లు, పేదలకు అన్యాయం చేసి మేడలు మిద్దెలు కట్టేవాళ్లు తరచు ప్రస్తావించబడ్డారు. ఇది అనేకులు  విపన్నులు కావటానికి కారకులైన శక్తులవైపు వేలు చూపిస్తున్నట్లుగా ఉంది. 

అయితే ఇవి కూడా వస్తు ప్రత్యేకతను బట్టి ఒకచోట వరుసగా చెప్పబడలేదు. ఒకే విషయం అనేకచోట్ల చెప్పబడటం, ముందు పద్యంతో గానీ, తరువాతి పద్యంతో గానీ దానికి ఏ సంబంధం లేకపోవటం కవిత్వంలో భావధార కు అవరోధంఅవుతాయి. అందువల్ల ఇది కావ్యం కాదు. మిగిలిన ఖండకావ్యాల వంటిదే అవుతుంది. సమస్యలను అన్నిటినీ భగవంతుడికి ఏకరువు పెట్టి నువ్వే వాళ్ళను రక్షించు, వీళ్ళను శిక్షించు అంటూ భారమంతా దేవుడి మీదేవేయటం మానవ సామాజిక ప్రతిక్రియను విస్మరించటమే అవుతుంది. మనిషిలో క్రియాశీల చలన లక్షణాన్ని ఉద్దీపింప చేయలేని సాహిత్య స్థాయి ఏమిటన్నది ప్రశ్న. 

                  ———————————————————-

                                                                                      ( ఇంకావుంది)    

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply