ఇంటర్మీడియెట్ చదువుల కాలం నుండే కవిత్వంతో జట్టుగట్టిన గట్టు రాధిక తొలి కవితా సంపుటి “ఆమె తప్పి పోయింది” 2018 లో వచ్చింది. అయితే ఇందులో కవితలన్నీ 2017, 2018 సంవత్సరాలలో వ్రాసినవే. 17 లో వ్రాసినవి పదకొండు కాగా మిగిలిన ముప్పయి ఏడూ 18 లో వ్రాసినవి. వాటికి కొనసాగింపుగా ఈ అయిదేళ్ళ కాలం మీద వ్రాసిన కవితలతో ఇప్పుడు “కొత్తపొద్దు కోసం” సంపుటిని ప్రచురిస్తున్నది. ముందుమాట వ్రాయమని నన్నూ ఇందులో భాగం చేస్తున్నది. స్త్రీల కవిత్వంతో కరచాలనం, వారి భావుకసీమల విహారం ఎప్పుడూ కొత్త అనుభవాన్ని ఇచ్చేవే.
“ఉదయాలన్నీ చీకట్లతో ఉరేసుకొంటాంటె నీ తోడు లేని నేను ఎంత ఒంటరిదాన్నై పోయానో అర్ధమైంది”
‘మళ్లీ నా లోకి’ కవిత లో ఒక భాగం ఇది.
ఎవరి తోడు లేకపోవటం వలన ఆ ఒంటరి తనం అన్నది ప్రశ్న.
“నువ్వొక అక్షరమే అనుకున్నాను
కానీ
నా ఆకలివని
ఆరాటానివని
ఆవేశానివని
ఆనందానివని
స్నేహానివని
ప్రేమవని
ఓదార్పువని
నా భావోద్వేగాలన్నిటిని ఆరబోసే
అందమైన సింగిడివని తెలిసొచ్చాక నిన్నెలా మళ్ళీ నాలోకి రమ్మనకుండ ఉండగలను !?”
అన్న తరువాతి భాగం పూర్తయ్యేసరికి కవిత్వం తోడులేకపోవటమే కవి ఒంటరి దుఃఖ కారణం అన్నది పాఠకులకు అవగతమవుతుంది. ‘నిన్నెలా మళ్ళీ నాలోకి రమ్మనకుండ ఉండగలను’ అన్న చివరి పాదం మళ్ళీ మళ్ళీ చదివితే ఒక చరిత్ర హోరు వినబడుతుంది అందులో. మళ్ళీ రమ్మని పిలవకుండా ఉండలేను అనటంలో ఒకప్పుడెప్పుడో కవిత్వం ఆమెలో ఆవాసం ఏర్పరచుకొన్నది, ఎందుచేతనో.. ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయింది…అన్న సమాచారం మనకు అందుతుంది.అది వెళ్లి పోయినప్పుడు తెలియలేదు అది తనకు ఎంత ముఖ్యమైనదో… వెళ్ళిపోయాక కాలం గడిచేకొద్దీ కవిత్వమే అస్తిత్వం అని అర్ధమైన మానసిక ఉద్వేగస్థితి నా ఆకలివని, ఆరాటానివని మొదలై కొనసాగే చిన్ని చిన్ని కవితా పాదాలు . ‘ నా భావోద్వేగాలన్నిటిని ఆరబోసే/ అందమైన సింగిడివని తెలిసొచ్చాక’ అన్న రెండు పొడుగు పాదాలతో కలిసి పుట్టించిన విద్యుత్తులో సూచితం.
కవిత్వం ఒకప్పుడు తనలో వున్నది అసలెందుకు వెళ్ళిపోయింది అన్నది ప్రశ్న. ఈ సమస్య తరచు స్త్రీలకు ఎదురయ్యేది. స్త్రీ జీవితం చదువుకు, వ్రాతకు, భావాల వ్యక్తీకరణ స్వేఛ్ఛకు పరాయీకరించి, ఇంటికి, మగవాడి సౌఖ్యానికి, పిల్లలను కనీ పెంచటానికి పరిమితం చేసిన మనుధర్మ సామాజిక సంస్కృతిలో స్త్రీల దగ్గరకు కవిత్వం రానే రాదు. వచ్చినా ఆ నిర్దేశిత జీవిత సూత్రాలే స్త్రీల జీవితంలో కవిత్వరచనాసక్తులకు ఉరితాళ్ళవుతాయి. ఆ పరిస్థితులలో స్త్రీల జీవితంలో భావుకతకు, కవిత్వానికి చోటు లేకుండా పోతుంది. ఆ ఖాళీ కలిగించే బాధను గుర్తించటం జరిగితే దానిని పూరించటానికి పునః ప్రయత్నాలు మొదలవుతాయి. ‘నిన్నెలా మళ్ళీ నాలోకి రమ్మనకుండా ఉండగలను’ అన్న ప్రశ్నార్థక ముగింపు వాక్యం లో కవిగా తిరిగి జన్మించటానికి స్త్రీ సంసిద్ధ అవుతున్న దృశ్యం కనబడుతుంది. ఈ కవిత చదువుతుంటే ఎనభై ఏళ్ళ క్రితం అంటే 1943 లో అరసం ఆవిర్భావ కార్యవర్గంలో సభ్యురాలైన చైతన్యం నుండి వట్టికొండ విశాలాక్షి పురుషుల నిషేధాలను దాటి కవిత్వాన్ని స్త్రీల వద్దకు వచ్చి చేరమని పిలుస్తూ వ్రాసిన ‘స్వాగతం’ కవిత గుర్తుకువచ్చింది.
ఏ కవికైనా అమ్మ, నాన్న కవిత్వ వస్తువు కావటం అతిసహజం. గట్టు రాధిక కవితలలో కూడా అది చూస్తాం. తల్లి ఊహ తెలియని వయసులోనే పోయింది. గారాబంగా పెంచిన తండ్రి కూడా మరణించాడు. అన్నలు, తల్లీ తండ్రీ అయి ప్రేమను పంచారు. ఇది కవయిత్రి వాస్తవానుభవం. దుఃఖ జ్ఞాపకం. అవే పరిసరి విధాలుగా వివిధ కవితలలో వ్యక్తమయ్యాయి. అమ్మ గురించి ఒకటి (ఎంకటవ్వ శిన్నబిడ్డ) నాన్న గురించి మూడూ( గోడమీద ఫ్రేము నాయిన, నడిచే పాఠం,నల్లకూర) ఇద్దరినీ కలుపుకొని ఒకటీ( వాళ్ళ ముద్దులు) కవితలు వ్రాసిందంటే ఆమెను వెన్నాడే అనుభవ గాఢతను ఊహించవచ్చు. తండ్రిని ఆహారపు ఇష్టం నుండి గుర్తుచేసుకొనే కవిత నల్లకూర. తల్లిని అలా గుర్తుచేసుకొనటానికి ఆమె ముఖమూ తెలియదు. ఇష్టాలే తెలియవు. ఇంటిల్లిపాది రుచులు తనవిగా చేసుకొనే బతికిన స్త్రీల సొంత రుచులే ఎవరికీ తెలియకుండా పోయే కుటుంబ వ్యవస్థలో చనిపోయిన తల్లి రుచుల సంగతి అసలే తెలియదు. ఎల్లిపాయతొక్కు కవిత కూడా ఆహారపు అభిరుచికి సంబంధించిందే. అక్కడ అది బాల్యానికి చెందిన మధురమైన జ్ఞాపకం. రెండింటిలోనూ ఆ కూర, ఆ తొక్కు చేసే పద్ధతి, చేసిన అక్క కూడా భాగమే. ఇక అన్నలు ఆమెకు అత్యంత ఆప్తులు.” నువ్వెంగిలి చేసిన అమ్మ గర్భంలో/ నేను కూడా ప్రాణం పోసుకున్నందుకేమో/ అమ్మను మరిపించే ప్రేమను నాలోకి/జీవనదివై ఒంపుతూనే ఉంటావు” అంటుంది ‘ఎంగిలి’ అనే కవితలో.
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో పిల్లలకైనా, పెద్దలకైనా కలిగే చిన్నచిన్న కోరికలు, వాటిని తీర్చుకొనటానికి పడే ఆరాటం, అవకాశాలు కలిసివస్తే కోరికలు తీరటం, లేకపోతే నిరాశా నిస్పృహలకు లోనుకావడం లోకంలో ఉన్నదే. ఈ ఆశా నిరాశల సయ్యాటలోని సంవేదన తరచు కథావస్తువు అవుతుంటుంది. అయితే గట్టు రాధిక దానిని వస్తువుగా స్వీకరించి కవితలు వ్రాసింది. ‘పట్టగొలుసులు’ కవితలో ఎండా కాలం సెలవుల్లో సోడాలమ్మి వచ్చిన డబ్బుతో అన్న చెల్లి ఆశపడిన వెండి పట్టగొలుసులు కొనిచ్చిన కథ ఉంది. పట్టు లంగ కవితలో చెల్లి ఆశ తీర్చాలని మనసున్నా మార్గం దొరకని అన్న ఉన్నాడు. ఆశతీరని లోటు జీవితమంతా మోసే చెల్లి ఉంది. ముత్యం ముక్కుపుల్ల కవితలో శరీర బాధను సహించి, కలువబోయి కూడబెట్టిన కూలి డబ్బుతో ముక్కుపుల్ల కొని ముక్కును అలంకరించుకొని మురిసిన అక్క వుంది. పాత్రలు, ప్రయత్నాలు, సాఫల్య వైఫల్యాలకథనం ఉన్నాయి కనుక ఇవి కథా కవితలు. మొత్తంగా ఈ కవితలు తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు సందడిసందడిగా తిరుగాడే కుటుంబ దృశ్యాలను కళ్ళ ముందు నిలుపుతాయి. ఇవి ఆడపిల్ల పుట్టింటి దృశ్యాలు.
పెళ్ళయ్యాక భర్త, పిల్లలు ఆమె జీవితాన్ని ఆక్రమిస్తారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతారు. వాళ్ళవాళ్ళ వృత్తి వ్యాపారాల మీద ఎక్కడెక్కడికో వెళ్లి స్థిరపడతారు. వాళ్ళ అవసరాలు చూసుకొంటూ అనుక్షణం తీరని పనులలో ఉండే తల్లులకు పిల్లలు ఇలా రెక్కలొచ్చి వెళ్ళిపోవటం సర్వం శూన్యమైన స్థితిని అనుభవం చేస్తుంది. ఆ శూన్యత వస్తువుగా రాధిక వ్రాసిన కవితలు రెండు ఉన్నాయి. అవి ‘ఈ పిడికెడు గుండెలో’, ‘ఇంకా పనితీరుతలేదనుకుంటే…’ గుండె శరీరంలో కీలకమైన కేంద్రం. రక్త ప్రసరణ వ్యవస్థను నియంత్రించేది, నిర్వహించేది అదే. ఆ గుండె గదులలో పెట్టుకొని పెంచి పెద్ద చేసిన పిల్లలు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి ఉండిపోయే అతిధులు అయినప్పటి దిగులును “అర్రలు రెండు గెస్ట్ హౌస్ లుగ మారిపోయినయి” అనటంలో పలికించింది కవయిత్రి. “ఆ రెండర్రలు / మీ రాకతో నిండినప్పుడు /మనసంతా గాలిపడవై ఎగిరి పోతుంటది /మీ పోకడతో ఖాళయినప్పుడు /నీళ్ళపడవై మునిగి పోతుంటుంది” అన్న పాదాలు ఆ వేదనా తీవ్రతను గాఢంగా వ్యక్తీకరిస్తాయి. అయితే ఇలాంటి వేదన తల్లులదేనా? తండ్రులకు ఉండదా? “ఇంకా పనితీరుతలేదని యాష్ట పడ్డ రోజులు”, “ఏం పనిజెయ్యాల్నో తోసక గడియ గడియ గండమయ్యే రోజులు” తల్లులవేనా? తండ్రులకు అలాంటి స్థితి ఎందుకుండదు? తల్లులకు ఇంటి నాలుగు గోడల మధ్య జీవితం తప్ప సామాజిక జీవితం లేకపోవటం వల్లనా ఈ శూన్యత? మగవాడి జీవితం నిండా వ్యాపించిన సామాజిక వ్యావృత్తులు, ఆడవాళ్ళకు వలెనె పిల్లలనే జీవిత సర్వస్వంగా బోధించని సంస్కృతి కల్పించిన వెసులుబాటు దిగుళ్ళను వాళ్లకు అంటకుండా చేస్తున్నాయా? మన సాహిత్య సంస్కృతులలో మాతృత్వ మహనీయత, పెయిన్ లోని ఫ్లెషర్ వర్ణించబడినంతగా, కీర్తించబడినంతగా పితృత్వ మహనీయత అసలెందుకు ప్రస్తావనకే రాకుండా పోయింది? వంటి ప్రశ్నలు అనేకం కలిగాయి ఈ కవితలు చదువుతుంటే, ఇక్కడ ఆగి ఆలోచించటం ప్రారంభిస్తే కవులకు కొత్త సాహిత్య వస్తువు లభించవచ్చు.
ఒక స్త్రీగా కవి స్త్రీ జీవితాన్నికవితా వస్తువు చేయటం సహజం. విమల వంటిల్లు కవిత వచ్చాక ఈ ముప్పయి మూడేళ్ళ కాలం మీద చాలామంది. కవయిత్రులకు వంటిల్లు కవితా వస్తువయింది. రాధిక ‘ఆగ్నేయపుఅర్ర’ కవితకు వస్తువు అదే. వాస్తు ప్రకారం వంటిల్లు ఆగ్నేయంలో ఉండాలంటారు, ఆగ్నేయపు దిక్కున ఉన్న గది కనుక అది ఆగ్నేయపు అర్ర. ఈ కవితలో రాధిక వంటఇంటిని బిడ్డగా సంభావిస్తుంది. ఒకసారి గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డ. అది తల్లిని నిద్రపోనీయదు. మరొకసారి చంకనెక్కే చింపిరి జుట్టు పిల్ల. దువ్వి చక్కబెట్టే పని చెప్తుంది. ఇంకోసారి తల్లి జాడలేకపోతే ఆగమాగమయ్యే పిల్ల. నాలుగు చరణాలు పూర్తయ్యేసరికి బిడ్డల పని వలెనె వంటింటి పని కూడా స్త్రీకి అంత అనివార్యమైనది అన్న భావం అయిదవ చరణపు ఎత్తుగడతో స్ఫురిస్తుంది. ” ఇంటోడు లొల్లి జేసినప్పుడల్ల / అవ్వోలె కొంగుతో ఏడుపంత తూడుస్తది” అదీ అయిదవ చరణపు ప్రారంభం. ఇంటోడు లొల్లి చేయటం అంటే భార్య ను సాధించటం, అవమానించటం, మానసికంగా హింసించటం, కొట్టటం ఏమైనా కావచ్చు. తన మాటకు, వాదనకు అవకాశం లేని ఏక పక్ష దాడిలో నిస్సహాయ దుఃఖిత ఆమె. సవాలక్ష పరిమితుల మధ్య ఏడవవలసిన బ్రతుకులు ఆడవాళ్ళవి. నట్టింట్లో ఏడిస్తే దరిద్రం. ఆడవాళ్లు మరి ఎక్కడ ఏడవాలి? అంటే వంటిళ్లలోనే. ఏడ్చుకొని తుడ్చుకుని మళ్ళీ సంసారవలయంలో పరిభ్రమించాల్సిందే. అందుకనే కవయిత్రి వంటింటిని కొంగుతో బిడ్డ కళ్ళు తుడిచే తల్లి లా కొత్త రూపంలో చూసింది. చూపింది. “నేను పుట్టకముందే దీన్ని / నా పేరు మీద రాసిచ్చినందుకో ఏమో గని, నా నవ్వులను, ఏడుపులను మోసుకుంట / మనసును నిమ్మలం చేస్తుంటది” అన్న ముగింపు చరణం వంటింటిని స్త్రీల నవ్వులకు, ఏడుపులకు ఏకైక ఊరట స్థానంగా చెప్పటంతో ఇంటికి దీపమైన ఇల్లాలు ఇంటి లోనే ఉపాంతీకరించ బడటాన్నిసూచిస్తున్నది.అంతేకాదు. ఆడవాళ్ళ ఆస్తిగా వంటింటిని రాసిచ్చిన సమాజం వాళ్ళను ఉత్పత్తికి పరాయీకరించి సేవలకు పరిమితం చేసిన కుట్ర వైపు వేలు చూపిస్తుంది. అదే సమయంలో నీకేం తెల్వదు అని అమ్మను తక్కువ చేసి చెప్పే నాన్నకు సమధానంగా ఇంట్లో, ఇంటి కోసం అమ్మ చేసే అన్ని పనులను -అవి చదువుతో, వృత్తి ఉద్యోగాలతో సంబంధం లేనివే ఆయినా – ఆమె సామర్ధ్యానికి, నైపుణ్యాలకు నిదర్శనంగా కీర్తిస్తూ ‘ఆల్ ఇన్ వన్’ కవిత వ్రాయటం పితృస్వామిక మాయ ప్రభావమే అనుకోవాలి. ‘అలసిన మనసు’, ‘ఆంక్షల కత్తెర’ పితృస్వామ్యపు బహురూపాల కింద నలిగి అలసిన మహిళలల వేసటనే కాదు, రెక్క విదిల్చి పైకెగిరే ఉత్సాహాశక్తి ప్రదర్శకాలు కూడా కావటం గమనించవచ్చు. భావోద్వేగాలతో పాటు భావజాల స్పష్టత కూడా కవిత్వం పదును పెంచుతాయి. ఆమె కోసమే, పుట్టుకతోనే వచ్చిన అందాలను, అలంకారాలను అతనేసిన మూడు ముడులతో ముడివేయటాన్ని నిరసిస్తూ వితంతువు గురించి ‘నో ఎంట్రీ’ కవిత వ్రాసిన రాధిక “ముత్తైదువులా కనిపించే నా ఊరిప్పుడు / బొట్టు లేనిదానిలా కనబడతాంది” (ఊరు పిలుస్తోంది) వంటి ఉపమానాలు వాడటంలోని ఔచిత్యం గురించి ఆలోచించవలసి వుంది.
గ్రామీణ నగర జీవిత వైరుధ్యాల సంక్లిష్టతను పట్టుకొనటానికి కవులు చేసే ప్రయత్నాలు తరచు గ్రామం మీద ప్రేమగా, నగరం మీద నిరసనగా వ్యక్తం అవుతుంటాయి. ‘నగరం పునాదులకింద’ కవిత విధ్వంస గ్రామాలు పునాదులుగా నగరాభివృద్ధి జరిగినట్లు చెప్తుంది. వాస్తవానికి అది అంత నిర్దుష్టంగా ఉంటుందా? మార్కెట్ ఆధారిత ఆర్ధిక నిర్మాణం నగరాభివృద్ధికి మూలం కాదా? అది ఘనీభవించిన గ్రామీణ వ్యవస్థలో చలనానికి కారణం కాలేదా? కొత్త జీవన రంగాలను సృష్టించలేదా? కుల లింగ అసమానతలను కొంతవరకైనా తగ్గించలేదా? ఇలాంటి ప్రశ్నలతో తరచి చూసినప్పుడు గ్రామీణ నగర వైరుధ్యాలకు సంబంధించిన గతానుగతిక ఆలోచనా ధోరణిని సవరించు కొనటానికి వీలవుతుంది. పల్లెల్లో జీవనం గడవక బతుకుతెరువు మార్గాలు వెతుక్కొంటూ పట్నాలకు వెళ్లిన వాళ్ళ స్వగతాల వంటి కవితలు రెండున్నాయి. ‘వలస కూలీ’ కరోనా కాలంలో స్వగ్రామాలకు ప్రయాణం చేసిన కూలీలకు ప్రతినిధి. గత్యంతరం లేని ప్రయాణమది. “నాకోసం ఎదురు చూసే అరడుగుల నేలకోసం/ మొఖం మీదేసుకొనె పిడికెడు మట్టికోసం” అన్న ముగింపు వాక్యాలు మృత్యు సూచకాలు. ‘ఊరు పిలుస్తోంది’ కూలికోసం పట్టణానికి వచ్చిన వాడి పల్లె దిగులు.పల్లెల నుండి పట్టణాలకు జనాన్ని తరుముతున్న ప్రభుత్వ రాజకీయార్ధిక నిర్మాణాలు, విధానాలు అర్ధమయ్యే కొద్దీ ఇలాంటి కవితలు మరింత సారవంతం అవుతాయి. సమకాలపు అత్యాచార ఘటనలు, రైతుల, నిరుద్యోగుల, నిరాశపరుల ఆత్మహత్యలు, కరోనా కాలపు సమస్యలు మొదలైనవి రాధిక కవితా ప్రిజం లో ప్రతిఫలించాయి.
అసమానతలు, మత విద్వేషాలు లేని ‘కొత్తపొద్దు కోసం’ రాధిక చేస్తున్న కవితా యాత్ర లో సహచరులమవుదాం రండి.
అభినందనలతో …
(కాత్యాయనీ విద్మహే
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక)