రైతు నాయకుడు రాకేష్ తికాయత్ కంట తడి పెడుతున్న వీడియో దృశ్యం కొద్ది నిముషాల వ్యవధి లోనే పట్టాలు తప్పుతున్న రైతు వుద్యమాన్ని తిరిగి పట్టాలు యెక్కించింది. యెట్టి పరిస్థితి లోనూ మడమ తిప్పే ప్రసక్తి లేదు. లేదు. ప్రభుత్వం నీళ్ళు కరెంటు ఆపించేసినా సరే యిక్కడి నుంచి కదిలేది లేదు. రైతు సోదరులు వూర్ల నించి వచ్చి యిస్తే తప్ప పచ్చి మంచి నీళ్ళు ముట్టను అని ప్రకటించిన కొద్ది గంటలలోపే వేల సంఖ్యలో రైతులు ఆయన వున్న చోటికి రావటం మొదలు పెట్టారు. చెదురుతున్న వుద్యమం మలుపు తిరిగి బలం పుంజుకుంది.
అయితే మర్నాడు జరిగిన మహా పంచాయతీ లో రాకేష్ తికాయత్ చేసిన మరొక చిన్న యింద్రజాలం వుంది. దాన్ని గురించి యెవరో సానుభూతి పరులు తప్ప యెక్కువ గా రాయ లేదు. రైతు వుద్యమాలను వ్యతిరేకిస్తున్న వారితో స్నేహ సంబంధాలు నెరపేది లేదు అని ప్రతిజ్ఞ చేసి – వొక లోటాలో గంగ నీరు తీసుకుని అందులో చిటికెడు వుప్పు కలిపేశారు. యిది శతాబ్దాల నుంచి వస్తున్న వొక ప్రక్రియ. నీళ్లలో కలిసి పోయిన వుప్పులాగా యింక వుప్పు రాతిని విడదీసి చూడలేము. వ్యక్తి సంకల్పం సంఘటిత సమూహ సంకల్పం లో కలిసి పోయింది. “లోటా నూన్” అనే ఈ ప్రతిన పూనే ప్రక్రియ వొక మనిషి తన స్వంత వ్యక్తిత్వాన్ని సంఘ జీవనానికి వదులుకోవడం అనేది యెంతో బలమైన సంకేతం.
తికాయత్ నీ… రైతు వుద్యమాలనీ మనం వొప్పుకోవచ్చు. వాటితో విభేదించ వచ్చు. మనిషి రకరకాల ఆధిపత్యాలకి లొంగిపోయి తనని తాను చెరిపేసుకోవచ్చు. కానీ ఒక మనిషి బుద్ధితో మనసుతో ఆలోచించి అనుభవించి స్వప్నించి సమాజ చలనతత్వంలో భాగం అయి పోవటం యెంత వుదాత్తమైన విషయం… ఆ యెరుక నించి షహీదా ‘జాజిపూల పరిమళం’ కథలని చూస్తే యీ కధల్లో వొక అద్భుతం కనిపిస్తుంది. ఆమె స్వప్నిస్తున్నట్టి ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ పోతున్న క్రమంలో వచ్చిన కథలు యివి. ఆ స్వప్నిస్తోన్న ప్రపంచం పట్ల సానుభూతి వున్న వాళ్లకి యీ కధారచయిత్రి తోటి మమేకం అవ్వటం చాల సహజంగా జరిగిపోతుంది.
సాహసవంతమైన ప్రయాణాలు చేస్తూ రాసిన కథలని మనం అనేక దశాబ్దాలుగా చదువుకొంటూనే వున్నాం. ఆ కథలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. వుత్సాహపరుస్తాయి. సముద్రయానాలు… పర్వాతారోహణలు… యిలా బోలెడు కథలు. యే విపత్తు లేని జీవితం కొందరికి విసుగ్గా వుంటుంది. భద్రజీవితంలో అంతా మునగదీసుకొని జీవిస్తూ వుంటే యే వెలుగులకీ దారి చూపని జీవితజ్ఞానం మరికొందరికి అసంతృప్తిని, అశాంతిని కలిగిస్తుంది. స్పష్టమైన రాజకీయ దృక్పధం వున్న వారు ప్రజాజీవితంలో వో ఆరోగ్యవంతమైన అభివృద్ధిని ఆకాంక్షించేటప్పుడు యెవరి అంతరంగానికి చేరువుగా వున్న రాజకీయ మార్గాన్ని వారు యెంచుకొంటారు. ఆ దారుల్లో యెంతటి ప్రమాదం వున్నా వారి మనసు వజ్ర సంకల్పంతో ఆ రాజకీయ ఆచరణ వైపు కొనసాగుతూ వుంటుంది. ఆయా రాజకీయ దృక్పథాలతో యేకీభావం వున్నా లేకపోయినా యీ సాహసి ప్రయాణిస్తూ అందించిన అనుభవాలు యీ కథల్లో పరిసరాల్ని మర్చిపోయి వుద్వేగానికిలోనవుతూ కనురెప్ప వెయ్యకుండా యీ జీవితాలని చూస్తాం.
యెక్కడి నుంచీ యీ జాజిపూల పరిమళం… అడివి కావొచ్చు… మైదానమూ కావొచ్చు… యెటువంటిదీ పరిమళం… రేయింబవళ్ళు మనుష్యుల జీవితాల్లో సమానమైన అభివృద్ధిని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ… జాజిపూల పరిమళంలాంటి మానవ జీవితాలని స్వప్నిస్తూ కలల సాకారపు సాహసి షహీదా గారు.
జాజిపూల పరిమళం కథా సంకలనం 2015 లో వచ్చింది. యిందులో ముప్పై మూడు కధలున్నాయి. దాదాపు యేబై యేళ్ళ జీవితానునుభవాలని షహీదా గారు వర్గపోరాటంలో స్త్రీల దృష్టి కోణం నుంచి దాదాపు అన్ని కథలని ఫస్ట్ పర్సన్ లో రాసారు.
రచయిత్రి తను తిరుగాడిన ప్రాంతాల్లో తను వివిధ సందర్భాల్లో నిత్యం చూసే వివక్ష… దోపిడీ… అసమానతలని పెంచి పోషించే మనుష్యల జీవితాలని చూసినప్పుడు రాసిన కథలున్నాయి. తన నుంచి తనని వెతుక్కుంటూ చేసిన ప్రయాణంలో ఆమె గమనింపులోకి వచ్చిన దాదాపు అన్ని అసమానతలని కథలుగా అందించారు. టీనేజ్ నుంచి వృద్దాప్యం వరకూ స్త్రీలు యెదురుక్కొనే సమస్యలని గుర్తించి రాయటమే కాకుండా వాటిని యెదుర్కొనే పద్ధతి… ఆ పరిస్థితిని మార్చాల్సిన అవసరాన్ని చెయ్యాల్సిన యుద్ధాన్ని ఆ యా కథల్లో వున్నాయి.
అలానే తనదైన నిర్దిష్టమైన రాజకీయ ఆవరణలోకి చేసిన ప్రయాణం… అక్కడి అనుభవాలని ఆమె కథలుగా మలిచారు. ఆ కథల్లో కొన్ని కథల గురించి…
“పనికి (రాని) సగం” కథలో అన్నింటా పైకి వచ్చిన ముకుందరామారావు… అరవైయేళ్ళు నిండినప్పటికి తమ్ముళ్ళని… తన పిల్లలని అందరినీ చదివించి… అందరి బాగోగులూ పట్టించుకొంటూ గొప్ప ప్రయోజకులు అయిన ముకుందరామారావుగారి షష్టి పూర్తి చేస్తున్నప్పుడు అతని భార్య పార్వతి గారు మనసులో అగ్నిపర్వతమే బద్దలవుతుంది. “నా సుఖదుక్కాలల్లో ఆయనకూ సగభాగం ఉంటుందా?” అని అడుగుతూ ముకుందరామారావుగారు జీవితంలో చేస్తోన్న అన్ని పనులకు సంసారంలో బాధలు వారికి చుట్టుకోకుండా తను యెలా దడిలా నిలబడిందో చెపుతారు. సంసారమే జీవితం అని స్త్రీలకి చెప్పిన తరంలో స్త్రీలకి విడిగా తమకంటూ వొక జీవితం వుండాలని… వుంచుకోవాలని చెప్పినవాళ్ళేరి… మన దేశంలోని యెంతో మంది స్త్రీల జీవితం యిలా పనికి రాని అర్ధ భాగస్వామ్యంగా సాగిపోతుంటాయి. ఆ వేదన స్త్రీలందరికీ అర్ధమవుతుంది.
“మీకు కూతుళ్ళు పుడితే మాత్రం వాళ్ళను నాలాగా కానివ్వద్దమ్మా- నాకే సన్మానాలూ వద్దు – వాటిని నేనెప్పుడూ ఆశించలేదు. నిజంగా నేను కోరుకునేది ఇదే. ఎప్పుడో ముసలితనంలో ఇంత కాలం నేనేం చేశాను అని ఎవ్వరూ నాలాగ బాధ పడద్దనేనమ్మా నా కోరిక’’ అని పార్వతమ్మ గారు యెంతో కన్సర్న్ గా చెపుతారు.
యీ కథ చదివిన తరువాత పురుషులు పనికిరాని సగంగా స్త్రీలని తయ్యారు చేసే మనసుని అదుపులోకి తెచ్చుకొని కాస్తైనా మారితే… అలా పనికి రాని సగంగా అవ్వటాన్ని స్త్రీలూ తిరస్కరించాలనే సంకల్పం చెప్పుకోగలిగే ధైర్యాన్నిస్తుంది.
“అజిత నేను” కథలో మనుష్యుల ఆలోచనల్లో తమ రాజకీయ ధృక్ పధం యెంచుకునే దారుల మీద జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు వాటి పరిణామాలు మానవ జీవితంలో అభివృద్ధిని… అనిచివేతని… వివక్షతని యిలా అనేక విషయాలని నిర్దేసిస్తాయి. ముఖ్యంగా స్త్రీల జీవితాలలో కొనసాగే అమానవీయ హింసకి పునాది అక్కడ వుంటుంది.
యిటువంటి పరిస్థిల్లో మనం యెటు నిలబడతాం. మన రాజకీయ కార్యాచరణ యేoటి… అజిత యిటువంటి పరిస్థితులు చుట్టుముట్టి వున్నప్పుడు వుద్యమ సానుభూతి పరురాలైన అజితకి… అదీ స్పష్టమైన రాజకీయ దృక్ పధమున్న అజితకి తన ఆచరణకి నడవాల్సిన మార్గమేదో స్పష్టంగా తెలుసు. అయితే ఆమెని వ్యతిరేకించే ఆమె తమ్ముడు శీను. శీను పెద్దనాన్న కూతురు అజిత. వాళ్ళిద్దరూ ఆగస్ట్ లోనే పుట్టారు. శీను కంటే అజిత వొక యేడాది నాలుగు రోజుల పెద్ద. అజిత –నేనూ అంటూ తమతమ జీవితాలు యెలా నడుస్తున్నాయో శీనూ యిలా అజిత- నేనూ- 1972; అజిత- నేనూ- 1976; అజిత- నేను- 1981; అజిత- నేను- 1985; అజిత- నేను 1986; అజిత-నేను 1990; అజిత-నేను 1999; అజిత-నేను 2008 అంటూ ఆయా సంత్సరాలలో జరిగిన విషయాలని చెపుతారు. వర్తమానంలో నిలబడి చూస్తే యిన్నేళ్ళు అతను యెoచుకొన్న దారి అతన్ని వూబిలోకి యెలా కూరేసిందో అతనికి అనుభవంలోకి వస్తుంది. అతని జీవితం యెప్పుడు చికాకుల పాలైనా అతనికి అండగా నిలిచే అజితని చూస్తూ అతను అనుకుంటాడు – “ఒక మనిషికి తోటి మనిషి పట్ల ఉండాల్సిన విధానమేదో తన దగ్గర పుష్కలంగా ఉందేమో. అది నాకెప్పుడూ పట్టుబడలేదు’’ అని. యెంతో జీవితం గడిచేక శీనూకి కలిగిన యెరుక.
జీవితంలో కార్పరేట్ సంస్కృతిని అందుకోవాలని ఆ వూబిలో కూరుకుపోయిన వాళ్ళు యెందరో… స్పష్టమైన రాజకీయ ధృక్ పధం వున్న వాళ్ళు తమని తాము యెక్కడ నిలబడాలో అక్కడ నిలబడి కార్పరేట్ సంస్కృతి మీద గట్టి పోరాటమే చేసారు అజితలా.
అజిత తమ్ముడితో “ గతంలో పుస్తకాలు చదవమని ఇస్తే ఇంట్లో ఏదో మూలాన పడేసేవాడివి. ఇప్పుడు బాగా అర్ధమవుతుండవచ్చు ఇది, వీలుచూసుకొని చదువు’’ అని ‘ఒక దళారి పాశ్చాత్తాపం’ పుస్తకం యిస్తారు.
“మొదలు” కథలో యెన్నో యేళ్ళ తరువాత మాధవి చైతన్య యింటికి వస్తారు. చాల కాలం తరువాత కలిసిన అక్కని చూసి చైతన్య వుద్వేగానికి లోనవుతాడు. ఆ యింట్లో శేఖరన్న పుష్పక్క ఫోటోని చూసినప్పుడు యెన్నో పనులని నిశ్శబ్దంగా చేసే పుష్పక్క గురించి ఆలోచిస్తూ “చరిత్రలో వీరందరి పాత్రను ఎలాగు నమోదు చేయడం? మనకు తెలియని మన చరిత్రగా మారిపోతాయా పట్టణోద్యమాలు?” అనుకోవటం చూసినప్పుడు… చైతన్య తన జీవితాన్ని మాధవితో కలబోసుకుంటూ “కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినందుకు నేను నాన్నని ఎప్పటికీ క్షమించలేను” అంటూ చైతు అన్నప్పుడు అతను తండ్రి రాజకీయ ఆచరణ వల్ల పడిన యిబ్బంది అతని మనసులో చేదుగా బాధిస్తుండటం గమనించి ఆమె “నాన్న తరం వాళ్ళు ఆ మాటకొస్తే మానవజాతి చరిత్రలోనే ఒక్కో తరమూ పోరాటాలు చేయకపోతే మనకసలు ఈ జీవితం వుండేదేనా అని ఆలోచించావా?” అని మాధవి అంటారు. చాల యేళ్ళ క్రితం నగరంలో వుద్యమం యెలా వుండేదో యీ కథలో కాస్త తెలుస్తుంది. ఆ గాయాలని చూస్తూ పెరిగిన చైతన్యలాంటి పిల్లలు తమ జీవితాల్ని ఆ వైపు కాకుండా పెళ్ళి చేసుకొని వ్యక్తిగా తమ యెదుగుదల మీదే చూపు నిలుపుకుంటారు.
“జ్ఞాపిక” కథలో నగీషీలతో వున్నవో బుల్లి చెక్క పెట్టెతో నర్మదకి వున్న అనుబంధం… జ్ఞాపకాలు యెంత బలమైనవంటే అనారోగ్యంతో హాస్పిటల్ మంచం మీద వున్నా అందులోని వున్న వంద రూపాయిలని ఖర్చు చెయ్యనివ్వరు. తన స్నేహితురాలు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన బహుమతి ఆ బుల్లిపెట్టె. నర్మద జైలు నుంచి విడుదలయి ‘లోపలకి’ వెళ్ళినప్పుడు అందులో తమ యింట్లో పనిచేసే లక్ష్మి యిచ్చిన వంద రూపాయిలని పెట్టి నర్మదకి ఆమె తల్లి యిస్తారు. యెప్పుడూ యే వస్తువులు దాచుకోని నర్మద… వస్తువులని దాచుకోవటం బరువుగా ఫీలయ్యే నర్మదా యీ పెట్టెలోని వందరూపాయిలను అంత విలువైనవిగా భావించటం చూసి అవి యెవరి జ్ఞాపకంగా దాచుకుందో తెలుసుకోవాలనే కుతూహలం శంకర్ లో.
ఆమె చెపుతారు… “లక్ష్మితో నాకు అనుబంధం వల్ల అని కాదు. అది ఎలానూ వుండేదే. ఎంతో మందితో ఎన్నో అనుబంధాలు… మనసు నిండిపోయేలా…” అని ఆమె అంటారు. “లక్ష్మితో మా కుటుంబానికుండిన సంబంధం మానసికంగా ఎటువంటిదైనా ఆర్ధికంగా, సామాజికంగా, కులపరంగా చూసినప్పుడు ఎప్పుడూ మేం ఇచ్చేవాళ్ళం, తను పుచ్చుకునేది అన్నట్లుగానే వుండింది, కదా? తను అధికారంగా ఏది అడిగి తీసుకున్నా, మేం ఇష్టంగా ఏదిచ్చినా దాని హద్దులు ఎంటనేది ఎవరం, ఎప్పుడూ మరిచింది లేదు. నేను పార్టీలో చేరాకే ఇది తలకిందులయ్యింది. జీవితంలో మొదటిసారి తను ఇచ్చేదీ, నేను పుచ్చుకునేదాన్నీ అయ్యాను… – పార్టీ తమదే, పేదవాళ్ళదే, తమకోసమే అని ఎంత నమ్మకం, విశ్వాసం లేకపోతే…” అని ఆమె అంటున్నప్పుడు శంకర్ కి ఆమె చెక్కపెట్టెను తన ‘చిత్రకారిణి వేళ్ళ’తో గట్టిగా పట్టుకోవటం చూస్తోన్న శంకర్ కి “నాకు కానీ పార్టీకి గానీ జ్ఞాపికగానో, జ్ఞానంగానో వుండాల్సిoది ఇది కదా” అన్నట్లు అనిపిస్తుంది. ఆ భావోద్విగ్నత నిండిన జ్ఞాపకాలు వారిని నడిపించే వూపిరి దారుల “జ్ఞాపిక”.
“చదువు” కథలో నల్లమలలో దళంకి చదువు చెప్పడానికి వెళ్ళిన టీచర్ గారి అనుభవాలని యెంతో నేర్పుతో, హృద్యంగా చిత్రించారు. దళాల్లో వున్న వారికి చదవు చెప్పడానికి వెళ్ళిన టీచెర్ గారిని అక్కడ వున్న కామ్రేడ్స్ యెంతో ఆత్మీయతతో చూసుకుంటారు. ఓ ఆకస్మిక దాడి జరిగినప్పుడు వారు ఆమెని తమందరి ప్రాణాల కంటే ఆమెని కాపాడటటమే అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి ఆచరిస్తారు. తమ దగ్గరకి వచ్చిన వాళ్ళ పట్ల వారంతా చూపించిన బాధ్యతని చూసినప్పుడు వీరందరిలో అదనంగా ఆత్మీయత బాధ్యత కమిట్మెంట్ కి సంబంధించిన విలువైన నర్వ్ యేదో వీరి స్వభావంలోనే అల్లుకుపోయిందనిపించింది. ఆహారాన్ని… పనిని… జీవితాన్ని వ్యక్తి కేంద్రంగా కాకుండా సమిష్టిగా కలిసి జీవించటాన్ని వొక వున్నతమైన విలువుగా దళమంతా ఐక్యహృదయంతో యెలా తమలో నింపుకున్నారో యీ కథ పట్టియిస్తుంది. యీ నిర్మాణానికి వెలుపల విద్యార్ధులకి పాఠాలు చెప్పే టీచర్ గారు యిక్కడ దళంలో వారి మనస్తత్వాలని గమనిస్తారు. అక్కడి వాతావరణం… పని… తోటి సభ్యుల అనుభవాల నుంచే వారు యెన్నో విషయాలు వారిలో యిమిడిపోవటం చూస్తూ… “అందరికంటే పెద్దదైన సుగుణా, అందరిల్లోకి చిన్నవాడైన సురేష్ ఒకేలా ఎలా ఆలోచించారు? వాళ్ళ జీవితంలో సంస్కృతిలోనే ఏదో…” అనుకున్న టీచర్ గారు “ఇవన్నీ కూచోబెట్టి నేర్పేవి కావు. అది వీళ్ళ వాతావరణంలోనే ఉంది. ఎవరు చెప్పకుండానే నేర్పేదేదో ఉంది. తమ స్కూల్లో అక్షరాలు దిద్దించి, పాఠాలు వల్లె వేయించేలాంటి “విద్య’’ కాదిది. ఇంకోరకంగా విద్య, రోజువారీ జీవితంలో ఒకరి నుంచి మరొకరు అప్రయత్నంగానే నేర్చుకొనే విద్య. విద్య కూడా కాదు, ఇదో సంస్కృతి…” అనుకొంటారు.
కొత్తగా ఏంటో కనుక్కున్నట్టుగా ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. స్కూల్ అయ్యాక గబగబా వచ్చి డైరీని తెరిచింది. విద్యార్ధులు అని వున్న కాగితం తీసి ‘విద్యార్ధులు- నా టీచెర్లు’ అని రాసింది. పేజీలు తిప్పి టీచెర్ అని వున్న దగ్గర ‘టీచెర్ – విద్యార్ధి’ అని రాసింది. టీచర్ గా వెళ్లి విద్యార్ధి కావటం… నిత్య విద్యార్ధులమే యీ ప్రపంచపు నిరంతర అనుభావల ముందు.
“పుత్రికోత్సాహం” కథలో భవానీ సాగర్ల కుమార్తె మానస. తల్లితండ్రులు సమిష్టి జీవితం కోసం పోరాడేవారు. మానస బయటి ప్రపంచంలో సాగర్ మేనత్త కూతురు లలిత దగ్గర యేడాది పాపాయిగా వున్నప్పటి నుంచి పెరుగుతుంటుంది. తల్లితండ్రుల ఆచరణ వల్ల చర్చల కారణంగా లభించిన స్వల్ప వెసులుబాటు వల్ల మానసను భవాని, సాగర్ కలుస్తారు. దాదాపు పదహారేళ్ళ తరువాత తమ పాపాయిని కలుస్తారు. మానసని కలిసినప్పుడు…
“ఎంత ఎదిగిపోయింది, చిన్నారి పసిపాపగా ఎన్ని ముద్దులు మూటగట్టేది మానస. తనని వదలడానికి ఎంత ఘర్షణపడింది తను!… పాప కోసం తన పార్టీ బాధ్యతల్ని వదిలే ప్రసక్తి లేదు, తనలా జీవించలేదు ఒక క్షణం కూడా. అలాగని ఈ మమతని మరవడమూ తనవల్ల కాదు’’… అని భవానీ…
“పదహారు సంవత్సరాల ఎడబాటు… చెట్టంత నాన్నని వుండి కూడా నాన్న ప్రేమకు దూరమై పెరిగింది బుజ్జితల్లి…’’ అని సాగర్…
అందరి తల్లితండ్రులకి వుండే సహజసిద్ధమైన వుద్విగ్నతకి వాళ్ళిద్దరూ లోనవుతారు. యెంతటి నలుగులాట. యెంత పెనుగులాట. చదువుతుంటే గుండెల్లో నొప్పి సన్నని ముల్లేదో దిగుతున్నట్టు. మానస జీవితంలో తన తల్లితండ్రులని అర్ధం చేసుకొనేoత మెచ్యూరిటీని అందించే పరిస్థితులు లేవు. భవానీ సాగర్, మానసలు ప్రపంచంలోనే అన్ని బంధాలకి అనుభంధాలకి అత్యంత దగ్గర సంబంధం అయిన అమ్మా నాన్న కూతురు రక్తసంబంధం అయినప్పటికీ యీ రెండు ప్రపంచాలని కలిపి వుంచగలిగే వొకానొక త్రెడ్ ని అల్లుకోలేకపోవటంతో తల్లితండ్రులని అర్ధం చేసుకునే మానసికస్థితి మానసకి వుండదు. తాము బలంగా నమ్మిన సుదీర్ఘమైన ప్రజావిముక్తిలో కొనసాగేవారి చూపు ప్రేమా… ఆస్తి… తన… అనే వ్యక్తిగాతాన్ని దాటి సమూహపు సమిష్టి బాగోగుల వైపు చూపు నిలుస్తుంది. యీ అవగాహన మానసకి అందించే పరిస్థితులూ వుండవు ఆమె చుట్టూ. అలానే ఆమె కూడా స్వయంగా తన అంతరంగాన చెలరేగుతున్న వాటిని అర్ధం చేసుకోడానికి అవసరమైన మానసిక ప్రయాణం వైపూ చూసే మానసిక స్థితి లేదు.
వాళ్ళిద్దరూ మానసతో ఆమె చదువు గురించి… ఆమె జీవితంలో యేమి కావాలనుకుంటుందో యిలాంటి విషయాలు మాటాడినప్పుడు బయట ప్రపంచంలో టీనేజర్స్ ముందు యెన్నెన్ని కెరీర్ ఆప్షన్స్ వుంటాయో… యేది చూసినప్పుడు అదే అవ్వాలనిపించటం… యేవి యెంచుకోవాలో తెలియనితనంని గమనిస్తారు. అలానే మానసలో తోటివారితో స్నేహంగా ఉండే మనసుని గుర్తుపడతారు.
సాగర్ భవానితో తన కూతురు ‘’ఒకే సమయంలో చాలా దగ్గరగా, మళ్ళీ దూరంగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ కలవగల్గితేనో, లేక ఉత్తరాలైనా రాయగల్గితేనో తప్ప ఆ దగ్గరతనం గాఢమవ్వదేమో అనిపిస్తుంది. మనకా అవకాశం ఎలాగూ లేదు. కానీ మనం కన్న పాప ఇంత ఎదిగింది అని చూసుకోవడం మాత్రం ఇంకే విషయంలోనూ కలగని చిత్రమైన ఒక ఆనందాన్ని ఇచ్చింది, ఆ ఉల్లాసం ఇంకా లోపల గెంతులేస్తున్నట్లే వుంది. తను సమాజానికుపయోగపడేలా కనీసంగా మారకపోతే మాత్రం ఇది పోతుందనీ అనిపిస్తుంది…” అంటారు సాగర్.
అత్యంత ప్రేమాస్పదులైన తన తల్లితండ్రుల ఆశయాలని అర్ధం చేసుకోవాలంటే మానస తనని తాను తెలుసుకోడానికి సంసిద్ధురాలైతే అప్పుడే ఆమె తన జీవితాన్ని సమాజానికి వుపయోగపడేట్టు మలుచుకునే అవకాశం వుంటుంది. అలాంటి అవకాశం క్షణక్షణం మారిపోతోన్న యీ వస్తుమయ ప్రపంచంలో ఆమె తనని తాను గుర్తుపడుతుందా… యేమో…
సాగర్ గారికి హృదయంలో “పుత్రికోత్సాహన్ని” పొంగిపొర్లించిన పుత్రిక యెవరు… ఆ పుత్రిక యెలా పెరిగింది… పిల్లలకి తల్లితండ్రులు పరిచయం చేసే ప్రపంచం… వారి యెదుగుదలలో చుట్టూ పరిసరాల ప్రభావం… పోషించే పాత్రపైనే యెoచుకొన్న దారులూ… నడిచే జీవితం వుంటుంది… ఆ దారే తల్లితండ్రులకి కొన్నిసార్లు సంతోషాన్ని దిగుల్ని కలిగించవచ్చు. మనుష్యులు తమ లోపలి ప్రపంచానికి బయట ప్రపంచానికి బలమైన వారధిని నిర్మించటం యెలా… యిలా యీ కథ మన ముందు అనేక ఆలోచనల్ని పరుస్తుంది.
“జాజిపూల పరిమళం” కథలో ఉమని హిమబిందుగారు “ఇంత చిన్న వయస్సులో ఎందుకింత కఠినంగా మాటాడుతున్నావు? ఏం అతను మళ్ళీ ఆలోచించుకోవచ్చు కదా, మళ్ళీ పని చేయవచ్చు కదా లేదా బయట వుంటూ మీతోనే కొనసాగచ్చు కదా, ఉద్యామాన్ని వదిలాడు అనగానే అంత మాట అంటున్నావు? మనుష్యులు మారరా? మారకున్నా అంతా చెడే వుంటుందా? ఎందుకు మనుష్యులు మీరూహించుకున్నట్లే వుండాలనుకుంటారు మీ కమ్యూనిస్టులు?” అని అడుగుతారు.
వొక్కో సారి పరిస్థితులు మనుష్యుల్లోని మానవీయతని సమూలంగా మాయం చేస్తాయి… వాటి పర్యవసానాలు మనసుని మెలిపెడుతూనే వుంటాయి. అలాంటప్పుడు జాజిపూల పరిమళం కూడా వెగటుని కలిగిస్తుంది. యెప్పుడైతే అనుభవాలు మనిషిలో ధైర్యవంతమైన మానవీయత పరిమళిస్తుందో అప్పుడు జాజిపూల పరిమళం మనిషై పరిమళిస్తుంది… అలాంటి పరిమళo వెల్లివిరియాలనే ఆకాంక్ష యీ జాజిపూల పరిమళం.
నమ్మిన రాజకీయ జీవితపు ఆచరణలోంచి వచ్చిన యీ కథల్ని చదువుతుంటే మానవీయ సమసమాజం కోసం ఆకాంక్షించే వో జాజిపూల హృదయ పరిమళం యీ అక్షరాలు. ఆలోచనలకి ఆచరణకి యే మాత్రం తేడా లేకుండా ప్రజానుభవం నుంచి వచ్చిన యీ కథలు మన ముందు మనకి తెలిసిన మన చుట్టూ వున్న గత జీవితాన్ని… వర్తమానాన్ని తరచి చూస్కుంటుంటే కుతూహలంతో మన నేత్రాలు విచ్చుకుంటాయి. ఆశ్చర్యంతో మరింత పెద్దవవుతాయి చూపులు. యీ కథలు చదవటం… మన జ్ఞానానికి వున్న లోటుని పూర్చుకోవటం… మళ్ళీ మళ్ళీ చదవటం జ్ఞానానుభవం.
జ్ఞానానుభవాన్ని పదునుపెట్టుకోవాలంటే మనం నిలబడిన నేల యేదైనా కావొచ్చు… నిర్భయంగా నిక్కచ్చిగా మనుష్యులకి మేలు చెయ్యని అభివృద్ధిని ప్రశ్నించటమే… అప్పుడే భూమిక యేదైనా మనుష్యలని ప్రేమగా… బాధ్యతగా కమ్ముకునేది మానవీయ జాజిపూలపరిమళమే…
చాలా బావుంది
Thank you Annaa.