నూనూగు మీసాల జగిత్యాల యువకుల ఆలోచనల్లోంచి 1973 లో ఆవిర్భవించిన సాహితీ మిత్ర దీప్తి చిరు కవితా, కథా సంకలనాలతో పాటు ఓ చిరస్మరణీయ కవిని కూడా కన్నది. అతడే అలిశెట్టి ప్రభాకర్. చమురు తగ్గి ఆ సంస్థ క్రమంగా కొడికట్టినా జ్వలితాక్షరాల కలాన్ని మాత్రం కాపాడుకుంది. ఆ బాటలో ఎదుగుతూ ఎగదోస్తూ కల్లోలిత జగిత్యాల మట్టి మహత్తును తన కవితలకద్ది, తెలుగు నేలపై వెదజల్లి ఆ వేడి చల్లారకుండా చూడమని అగ్నిగోళంలా మండుతూ అంతర్థానమైన కవి అలిశెట్టి. జనవరి 12 , 1954 నాడు పుట్టి నడీడునైనా చూడకుండా జనవరి 12 ననే 39 ఏళ్ల వయసులో మరణించిన ప్రభాకర్ వ్యక్తిగా, కవిగా సగం రాసిన, సగం తెల్ల కాగితాల పుస్తకంలా ఎంతో వెలితిని మిగిల్చి వెళ్ళిపోయాడు.
వ్యక్తిగా ప్రభాకర్ చాలా చురుకైనవాడు. ధైర్యశాలి, స్నేహశీలి, హాస్యప్రియుడు. ఆయనలోని ధీరత్వం, చెడును నిలదీసే గుణం, విలువల కట్టుబాటు అన్ని కలగలిసి ఆయన మూర్తిమత్వానికి విలక్షణమైన వన్నె తెచ్చాయి. . బక్కపలచని శరీరమైనా అది భయమెరుగనిది. మనిషిని హోదాల కోణంలో తూకమేసి అవసరానికి మాట, మర్యాద మార్చడం, నటించడం ఆయనకు పరమ అసహ్యాలు. మనిషిలోని మంచిని, శ్రమని, గుణగణాలను గౌరవించడం ఆయనకిష్టం. ఈ లక్షణాల వల్ల కవిగా నిలబడక ముందు నుంచే ఆయనకు స్థానిక యువజనుల మధ్య ఓ ప్రత్యేక గుర్తింపు వ్యక్తిత్వపరంగా ఏర్పడింది. కవిత్వంలోనూ ఇవే లక్షణాలు ప్రస్ఫుటమై అక్షరాల్లోనూ తానే కనబడతాడు. ప్రభాకర్ వ్యక్తిగా కవిగా వేరు కాదు. అక్షరాల్లో తనను తాను చిత్రించుకున్నాడు. కవిగా గుర్తింపు కోసమో, నలుగురి మెప్పు కోసమో ఎన్నడూ తాపత్రయపడక, తన తల్లడింపును దింపేసుకోవడానికే కవిత్వాన్ని ఆశ్రయించాడు. వ్యక్తిగా ఎంతటి స్నేహశీలియో అదే రీతిలో కవిత్వం ద్వారా కూడా పాఠకుల గుండెలను తాకాడు. ఆయన అక్షరాలకు పలకరింపు తెలుసు. సాధారణ పాఠకుడిని సైతం పెనవేసుకొనిపోతాయి. ఈ కవిని చూడాలి కలవాలి కరచాలనం చేయాలి అనే ఆసక్తిని అవి కల్పిస్తాయి. అమెరికా తెలుగువాళ్లలోని సాహిత్యాభిలాషులు సెలవులపై ఇంటికి వచ్చినపుడు హైదరాబాద్ లో అలిశెట్టి ప్రభాకర్ ను కలవడం వారి ఎజెండాలో ఒక అంశంగా ఉండేదని ‘కౌముది’ కిరణ్ ప్రభ అన్నారు. అక్కడ కూడా అలిశెట్టి సంస్మరణ సభలు జరుగుతుంటాయి.
శ్రామిక పక్షాన నిలిచే ఆయన కవిత్వానికి జగిత్యాల జైత్రయాత్ర సైద్ధాంతిక పునాదినిచ్చింది. అప్పటి నుండి తన అక్షరాల సాలును ఈ త్యాగాల పోరుకు జోడించాడు. ‘చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం/ చరిత్రకు చెమటబొట్టే ఆధారం/ చరిత్రకు ఆకలే ప్రేరణ’ అని గళమెత్తాడు. తుపాకీ మొన మీద జగిత్యాల ఉన్న రోజుల్లో సైతం ‘కొమ్మ ఉండీ ఊగని/ కొలిముండీ మండని/ జీవితలెందుకని’ తెగువతో ప్రశ్నించాడు. ‘పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలమూ కుంచె రెండూ ఉంటాయ్’ అని ప్రకటించి మాటకు కట్టుబడి బతికాడు.
ప్రభాకర్ దృష్టిలో కవిత్వం ప్రతిభా ప్రదర్శనో, పాండిత్య ప్రకర్షణో కాదు. అదో భావజాల వాహకం, యుద్ధ సన్నాహం. ఎప్పుడైతే ఆయన తన అక్షరం ఉద్యమానికి ఉత్ప్రేరకం అనుకున్నాడో అప్పుడే ఆయనలో ఓ తాపసి జనించాడు. ఈ గమనంలో కష్టాలు కంటకాల్లా తగులుతాయని తెలిసినా, ఈ ప్రయాణంలో అలసి సొలసి ఎక్కడ రాలిపోయినా బతుకు పోరులో భాగమే అనుకున్నాడు. కాలక్రమంగా ఆయన ఆస్తి, ఆరోగ్యం తరిగిపోగా కవిత్వం దేదీప్యమానమైంది. ఆ క్రమంలో అత్యంత స్పష్టత, పారదర్శకతలతో దేశ రాజకీయాల్ని నగ్నంగా నిలబెట్టాడు.
‘స్వయంగా శవాలే/ రాబందుల వద్దకి నడిచొస్తుంటే/ అంతకంతకూ పెరుగుతున్న అజ్ఞాన పర్వతం/ చిన్న బ్యాలెట్ పెట్టెలో ఇమిడి పొతే/ మళ్లీ కోటీశ్వరుడి పుట్టలోంచి/ బుస కొట్టేదే ఈ దేశపు ప్రజాస్వామ్యం’ అనే పంక్తులు నేటి దేశ రాజకీయ పరిస్థితులకు మరింత సరిపోతాయి.
తన ఇరువై ఏండ్ల కవితా ప్రస్థానంలో ఎన్నడూ ఎక్కడా తన వ్యక్తిగత జీవన ప్రస్తావన తేని ప్రభాకర్ తన మరణానికి 6 నెలల ముందు విడుదల చేసిన ‘సిటీలైఫ్’ సంపుటిలో ముందుమాటగా తన ఎలిజీని తానే రాసుకున్నాడు. చావువేలు పట్టుకొని వెళుతున్న మనిషి చివరిమాటగా ఛిద్రమైన తన జీవితాన్ని ఇందులో చిత్రించాడు.
‘నానాటికి దరిద్రమనే ఊబిలో దిగబడి, బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరకు హృదయం విప్పి నన్ను నాలుగు మాటలు చెప్పుకోనివ్వండి.
ఒకప్పుడు పచ్చగా బతికినవాణ్ణి…ఇప్పుడు పత్రహరితం కోల్పోయి పిచ్చిమొక్కలా.. అస్థిపంజరంలా.. మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవడం పరిపాటైంది.
నాలోని అరాచకం, క్రమశిక్షణారాహిత్యం వల్ల ఆరునెలల్లో అవలీలగా నయం చేసుకోవలసిన వ్యాధి అంచెలంచెలుగా ఎదిగి రెండు ఊపిరితిత్తులను పాడు చేసింది. ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది. పుట్టినగడ్డ నుండి ఇక్కడికి రావడమే పొరపాటైంది.’
ఇలా ఏ మాత్రం దాపరికం లేకుండా బయటపెట్టిన తన హృదయఘోషలో తప్పొప్పుల ప్రస్తావన ఉంది. నడమంత్రాన ముగియబోతున్న తన జీవితానికి తానూ ఒక కారణమేనని ప్రకటించుకున్నాడు. ఈ పదాల్లో నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నాయి.
నిజానికి ప్రభాకర్ లో ఆరోగ్యం పట్ల అవసరమైనంత నిర్లక్ష్యంతో పాటు ఆకాశమంత ఆత్మాభిమానం కూడా ఉంది. మరోవైపు నీడలా నిలువెత్తు నిబద్దత, పట్టు సడలని పట్టింపుల వల్ల సినిమావాళ్లు ఇంటికొచ్చి అడిగినా రాయను పొమ్మన్నాడు. ఇప్పటికే రాసినవి వాడుకుంటామన్నా కుదురదన్నాడు. ‘ఎర్రని తేలు కుట్టిన మంటలాంటిది ఆకలి’ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు గాని గీసుకున్న గీత దాటలేదు. ఎంత దగ్గరివారినుంచైనా సహాయం తీసుకొనేవాడు కాదు. ప్రభాకర్ తో కలిసి ఓసారి బజారుకెళ్ళినపుడు ఆయన కిలో బియ్యం కొంటున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నోరు తెరిచి నేను పది కిలోలు కొంటాను అంటే ఆయన మళ్లీ జీవితంలో నా ముఖం చూడడేమోనన్న భయం మాట పెగలనీయలేదు. ఆయన నిర్ణయాలు ఎంత నిర్దయగా ఉంటాయో స్వయంగా చూసిన అనుభవం నాది. ఈ సందర్బంగా ప్రముఖ కవి ఎన్. గోపి గారికి క్షమాపణలతో ఆయన నాతో పంచుకొన్న ఒక విషయాన్ని బహిర్గతం చేస్తాను. గోపి గారు గురువుగా భావించే ప్రసిద్ధ కవి.. ప్రభాకర్ కవిత్వాన్ని మెచ్చుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి రూ. 5000 /- సహాయం చేయాలనుకున్నాడు. పిలిస్తే వచ్చి తీసుకుంటాడో లేదో నీవే ఆయన ఇంటికెళ్లి ఇచ్చేయ్ అని డబ్బు సార్ చేతిలో పెట్టాడు. అప్పుడు గోపి, ప్రభాకర్ రాంనగర్ లోనే ఉండేవారు. అయినా ప్రభాకర్ ఖచ్చితంగా వద్దేవద్దంటే అంతే సంగతులు. దానికి ఓ మార్గంగా గోపి గారు జయధీర్ తిరుమలరావును ప్రభాకర్ ఇంటికి తోడు రమ్మన్నారు. తిరుమలరావుకు ప్రభాకర్ దగ్గర చొరవ, స్నేహం ఎక్కువ. ప్రభాకర్ డబ్బు తీసుకోవడానికి నిరాకరించినా ‘తీసుకోలేదంటే పెద్దాయన మనసు నొచ్చుకుంటుందని’ తిరుమలరావు బలవంతంగా జేబులో కుక్కాడట. అలా తీసుకోక తప్పలేదు. ప్రభాకర్ జీవితం ‘రెవల్యూషనరీ రొమాంటిసిజం’ అంటారు గోపి. ఈ వాక్యం నిజంగానే ప్రభాకర్ కు సరిపోతుంది. కఠిన పర్యవసానాలను ఇష్టంగా భరించడమే కదా ఏ ప్రేమైనా.
చాలామంది నన్నడిగే ప్రశ్న ప్రభాకర్ కుటుంబం ఎలా ఉందని. ఇప్పటికైతే సమాధానమిది. ప్రభాకర్ భార్య భాగ్యం ఒప్పంద ఉద్యోగం తెలుగు యూనివర్సిటీలో ఇంకో నాలుగేళ్లు ఉండొచ్చు. ఇద్దరు కొడుకుల్లో పెద్దోడు సంగ్రామ్ సంగీతం మాస్టారు. చిన్నోడు సంకేత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం. తల్లికి చేదోడుగా ఉంటున్నారు. ఈ మధ్యనే ఉప్పల్ శివారులో ఓ ఇంటి నిర్మాణం చేపట్టారు. ‘ఒకప్పుడు పచ్చగా బతికిన వాణ్ణి..’ అని బాధగా రాసుకున్న ప్రభాకర్ యొక్క కుటుంబం మళ్లీ చిగురిస్తోంది. దశాబ్దాలపాటు దుఃఖం, విషాదాల్ని ఈదిన కుటుంబం ఒడ్డున పడుతోంది.
చివరగా ఓ మాట. ఈ మధ్య నేను ఓ బంధువు చావు పలకరింపుకు వెళ్ళినపుడు వారింట్లో ప్రభాకర్ కవితా సంపుటి ఉంది. హృద్రోగంతో మరణించిన ఆ బంధువు మరణాన్ని ఎదుర్కొనే గుండె దిటువుకోసం చివరి రోజుల్లో ప్రభాకర్ కవిత్వాన్ని పక్కలో పెట్టుకొని అప్పుడప్పుడు తిరిగేసేవాడట. ప్రభాకర్ అక్షరాల్లోంచి వచ్చి ఆయన తల నిమిరేవాడన్నమాట. అందుకే అలిశెట్టి ప్రభాకర్ వ్యక్తిగా, కవిగా చిరంజీవి. జగిత్యాల జ్వాల వెలుగుతూనే ఉంటుంది.