గత వారం తెలుగు పత్రికల్లో, సామాజిక మధ్యమాలలో రెండు పరస్పర విరుద్ధమైన వార్తలు చదివాను. ఒకటి “జగన్మోహనం” గురించి, రెండవది జ”గన్” పోలీసు పాలన గురించి.
మొదటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇళ్ళు కట్టించే పథకంలో భాగంగా కాకినాడకు దగ్గరలో ఉన్న నేమం అనే గ్రామంలో 103 ఎకరాలలో లేఅవుట్ వేసి ఆ కాలనీకి “జగన్మోహనపురం” అని పేరు పెట్టారు. ఆ కాలనీ పేరుతోనే ఇళ్ళ పట్టాలు కూడా సిద్ధం చేశారని వార్త. ఇక రెండొవది, ప్రజల హక్కులు, ప్రజాస్వామిక విలువల కోసం పని చేస్తున్న తొమ్మిది మంది (ఇప్పటి వరకు) ప్రజా ఉద్యమకారులను ఎత్తుకెళ్ళి దొంగ కేసుల్లో ఇరికించి జైళ్ళలో నిర్బంధించడం. ఈ రెండింటిని కేవలం సాధారణమైన విడివిడి అంశాలుగా కాకుండా ఆ రెండింటికి అంతసూత్రంగా ఉండే సంబంధం, వాటి వెనుక వుండే రాజకీయాలను, అవి మొత్తంగా సమాజాన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తాయో చూడాల్సివుంది.
ఒక నిరంకుశ, దుర్మార్గ పాలకున్ని ఓడించడానికి రాష్ట్రం నాలుగు మూలలు తిరిగి తాను ప్రజల కోసమే, వాళ్ళ కష్టాలు తెలుసు కోవడం కోసమే ఊరు, వాడా తిరుగుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. అది ప్రజలు నమ్మి ఆయనకు అధికారం చేతికిచ్చారు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి కావడం కావచ్చు, తనను గతం నుండి వేటాడుతున్న ఆర్థికనేరాల నిందితుడనే ముద్రను తొలిగించుకునే ప్రయత్నం కావచ్చు, లేదా తన పార్టీ బేస్ ను సుస్థిరం చేసుకోవడం కోసం కావచ్చు; ఏదిఏమైనా కొన్ని జనాకర్షక పథకాలు ప్రవేశ పెట్టడం మూలంగా తాను మునుపటి పాలకూడి కంటే కొంత మెరుగనే నమ్మకాన్ని కలిగించాడు. అయితే మనం జగన్మోహన్ రెడ్డిని ఎవరితో పోల్చడం మూలంగా మెరుగుగా కనిపిస్తున్నాడనే విషయం మరిచిపోవద్దు. అంతేకాదు, తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ఏవిధంగా వ్యక్తిగతీకరణ (personalization) చేసుకుంటున్నాడో కూడా చూడాలి. అన్నింటికి మించి అభివృద్ధి పేరిట జరుపతలపెడుతున్న విధ్వంసం గురించి ఆలోచించాలి.
నిజానికి బూర్జువా రాజాకీయాలలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ విగ్రహాలను తామే ప్రతిష్టాపన చేయించుకుని వాటికి పూజలు చేయడానికి ప్రజలను పురికొల్పడం, మభ్యపెట్టడం కొత్తేమీ కాదు. అయితే ప్రతిరోజు “ప్రజాస్వామ్యం,” “రాజ్యాంగస్ఫూర్తి” అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజకీయ నాయకులకు కాని, వాళ్ళ చేతి పత్రికలకు కాని ఇవేవి పెద్ద సమస్యాత్మక అంశాలుగా కనిపించడం లేదు. అధికారంలో ఉన్న ప్రతి నాయకుడు ఆ నేలకు తానే చివరి అధిపతిని అన్నట్లుగా వ్యవహరించడం, ప్రజలను తమ గుప్పెట్లో ఉంచుకోవడం కోసం కొన్ని తాత్కాలిక జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టడం మూలంగా ప్రజలు కూడా “వాళ్ళు ఇచ్చే వాళ్ళు, మనం పుచ్చుకునే వాళ్ళం” అనే అవగాహనకు నెట్టబడ్డారు.
ఉదారవాద ప్రజాస్వామ్యంలో కొందరు అధికారంలో ఉండి అందరిని పాలించడం అనేది రెండు సమాన ప్రజా సమూహాల మధ్య కుదుర్చుకునే ఒక సామాజిక ఒప్పందానికి (social contract) లోబడి జరుగవలిసి ఉంటుంది. ఆ సమూహాలు (పాలకులు, ప్రజలు) రెండూ సమానం అనే భావన లేకపోతే ఆ సామాజిక ఒప్పందానికి, ప్రజాస్వామ్యానికి విలువేలేదు. కాని ఈ విషయాన్ని పాలకులు, ప్రజలు పూర్తిగా మరిచిపోయినట్లే వున్నారు. వాస్తవానికి మన సమాజంలో ఆ అవగాహన ఉండాలని కోరుకోవడం “గొంతమ్మ కోరికే” అవుతుంది. ఎందుకంటే అటువంటి ప్రజాస్వామిక భావన భారత సమాజంలో, రాజకీయాలలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా జరగడం లేదు.
ఏమిటా సామాజిక ఒప్పందం? ప్రజలు (పౌరులు) తమ ఇష్టానుసారంగా, విచ్చలవిడి స్వేచ్ఛను కలిగివుంటే, ఎవరికివారుగా స్వీయపాలన (self governance) చేసుకుంటే అది సమాజంలో అరాచక పరిస్థితులను అమలులోకి తెస్తుంది. కాబట్టి పౌరులు తమ స్వేచ్ఛను కొంత (ఇష్టంగానో, బలవంతంగానో) వదులుకుని మెజారిటీ ప్రజలచే ఎన్నుకోబడిన కొంత మంది ప్రతినిధులకు తమను పాలించే అధికారం కట్టబెడుతారు. దానికి ప్రతిఫలంగా పాలకులు లేదా రాజ్యం పౌరులకు హక్కులను గ్యారెంటీ చేస్తూ మొత్తంగా సమాజాంలో అన్ని రకాల (సామాజిక, రాజకీయ, ఆర్థిక) భద్రతలను కల్పించాల్సి ఉంటుంది. దాని కోసమే ఒక రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. అంతేకాని పాలకుడంటే రాజు కాదు, అతను/ఆమె చేసే పాలన, అభివృద్ది ప్రజలకు పెట్టే భిక్ష అంతకన్నా కాదు.
అయితే ఈ సామాజిక ఒప్పందంలో పాలకులుగా వుండే వాళ్ళు కొన్ని ఆధిపత్య కులాలకు, వర్గాలకు, లింగాలకు చెందిన వాళ్ళే ఉండటం మూలంగా తరతరాలుగా అధికారం, సంపద, వనరులు, అదనపు సౌకర్యాలు వాళ్ళకే పరిమితం అయ్యాయి. దీని మూలంగా ప్రజాస్వామ్యం అనేది పాలక వర్గాల, కులాల దయాదాక్షిణ్యాల భిక్షగా మారిపోయింది.
అయితే మారుతున్న సామాజిక పరిస్థితులు, దశాబ్ధాలుగా పౌర, ప్రజాస్వామిక ఉద్యమాలు చేస్తున్న పోరాటాల ఫలితంగా పాలకులు పూర్తి నిరంకుశంగా ఉండలేని స్థితి కూడా ఒకటి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో పాలకులు ఒక చేతిలో ప్రజాస్వామిక జపమాలను, మరో చేతిలో అధికార దండాన్ని పట్టుకు తిరుగడం సాధారణమయ్యింది. ఒకవైపు తమ జపమాలతో ప్రజలను మభ్యపెడుతూ, మరోవైపు ప్రజల హక్కుల గురించి తమను ప్రశ్నించే అన్ని ప్రజాస్వామిక గొంతులపై తమ పోలీసు దండాన్ని ఉపయోగించడం ఈ తరం పాలకుల కొత్త ఫార్ములాగా మారింది. ఈ విద్యలో తెలుగు నేల మీద వున్న ఇద్దరు పాలకులు ఆరితేరివున్నారు.
మొత్తంగా ఈ పాలకులు అధికార జనరంజకవాదాన్ని (authoritarian populism) తమ సిద్ధాంతంగా, ఆచరణగా చేసుకున్నారు. ఇందులో తమ కుల, వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా పాలన సాగిస్తూ దానికి ప్రజల సమ్మతిని కూడగట్టడానికి (ideological conditioning) తమ చేతుల్లో వుండే అన్ని సాధనాలను ఉపయోగిస్తూ, తమను ప్రశ్నించే అన్ని ప్రజాస్వామిక శక్తులపై హింసను, దౌర్జన్యాన్ని కొనసాగించడం ఒక పద్ధతిగా ఎంచుకున్నారు. ఈ పద్దతిలో ప్రజలు వేరు, ప్రజాస్వామిక గొంతుకలు వేరు అనే ఒక విభజన రేఖను గీసే పనికూడా చేస్తున్నారు. పాలకులు వండి వడ్డిస్తున్న ఆ భ్రమల్లో ప్రజలే కాదు, కొందరు మేధావులు అనుకునే వాళ్ళు కూడా పడే ప్రమాదం వుంది. ఎందుకంటే వాళ్ళు పాలకుడి చేతులో వున్న జపమాలను చూసి మభ్యపడుతున్నారే తప్ప, మరో చేతిలో వున్న దండాన్ని చూడటం లేదు.
జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ “రాజకీయ ప్రతిపక్షాలను తొక్కేశాం, ప్రజలకు కొన్ని జనాకర్షణ పథకాలు పంపిణీ చేస్తున్నాం ఇక మాకు ఎన్నికల రాజకీయాలలో తిరుగులేదు” అనే నమ్మకంతో వుండొచ్చు. ఆ నమ్మకంతోనే తాము కొనసాగిస్తున్న అప్రజాస్వామిక, విధ్వంసక అభివృద్ధిని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కసారైనా చరిత్రలోకి తొంగి చూడటం మరిచిపోతున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలో నిరంకుశ పాలకులు వచ్చారు, పోయారు. కాని ప్రజా ఉద్యమాలు త్యాగపూరితంగా నిర్మించిన ప్రజాస్వామిక విలువలు, న్యాయ భావనలు మాత్రం నిలిచే వున్నాయి. శాశ్వతంగా నిలిచిపోయేది ప్రజల పక్షాన నిలిబడే విలువలే కాని, ప్రజల గొంతుకల మీద పెట్టే కత్తులు కాదు. అనివార్యంగా, అవసరంగా ప్రజాస్వామిక ఉద్యమాలు తమ ధిక్కారాన్ని నిరంతరం తీవ్ర నిర్బంధంలో సహితం వినిపిస్తూనే వుంటాయి. పాలకులను ప్రజా బోనులో నిలబెడుతూనే వుంటాయి.
జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే తాము రాజ్యాంగం పునాదిగా అంగీకరించిన సామాజిక ఒప్పందాన్ని గౌరవించి తమకు అధికారం కట్టబెట్టిన ప్రజల హక్కులను కాలరాయకుండా వాటిని పునరుద్ధరించడం కేవలం ఒక విలువ మాత్రమే కాదు, బాధ్యత కూడా. అలా చేయకుండా ఈ రోజు మీరు ప్రజాస్వామిక విలువలను చంపివేస్తే రేపు కేవలం ఆధిపత్యమే విలువగా కల్గిన హిందుత్వ ఫాసిస్టు మిమ్ముల నిర్వీర్యం చేయ సిద్దపడినప్పుడు మీకు మద్దతుగా ఏ గొంతులు మిగులవు. కనీసం మీ మనుగడ కోసమైనా పౌర, ప్రజాస్వామ్య విలువలను కాలరాయకండి. కనీసం మీ దగ్గరి చరిత్రనైనా తడిమి చూసుకోండి. ప్రజల బలమేంటో అర్థమవుతుంది.
ప్రజాసంఘాల మీద అమలవుతున్న నిర్బంధం మా సమస్య కాదులే అనుకునే ప్రజలు, ఆలోచనాపరులు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే పాలక వర్గాల హింస వ్యవస్థీకృతమైనదని, అది ప్రత్యక్షంగా అందరి జీవితాలలోకి, అనుభవాలలోకి రావడానికి ఎంతో కాలం పట్టదని. అన్నింటిని మించి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయే జాతి భవిష్యత్తును అంధకారమే చేస్తుందని, భావి తరాలకు భరోసా ఇవ్వలేని నిర్జీవిగా మిగిలిపోతుందని.