చెర స్మరణ

ఆదివారం, జూలై 03, 2022
మెయిన్‌ హాలు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌
విప్లవ రచయితల సంఘం 52వ ఆవిర్భావ సభ

చెరబండరాజు సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ

సాహిత్యంపై చెరిగిపోని ధిక్కార సంతకం చేసిన కామ్రేడ్‌ చెరబండరాజు 40వ వర్ధంతి ఏడాది ఇది. ధిక్కార కలాలకు, గళాలకు ఇదే అదునుగా పదును పెడుతున్న కాలం మరోసారి చెరను స్మరించుకునేందుకు సిద్ధమైంది. గతంలో ఒకసారి పునర్ముద్రించిన చెరబండరాజు పుస్తకాలు ఎప్పుడో అయిపోయాయి. ఆయన సమగ్ర సాహిత్యాన్ని తిరిగి ప్రచురించి విప్లవ రచయితల సంఘం 52వ ఆవిర్భావ సభలో ఆవిష్కరిస్తున్నాం. కనీసం ఐదేళ్లుగా చెర సాహిత్యం కావాలని అడిగేవారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీల విద్యార్థులు, సినిమా సహా వేర్వేరు కళాత్మక రంగాల్లో పనిచేస్తున్న యువత అడుగుతోంది. ‘ఈ దేశం కళ్లు మీరే.. కాళ్లు మీరే’నని ఏ యువతరం గురించి చెర గొంతెత్తారో ఆ తరం ప్రతిసారీ ఆయన సాహిత్యాన్ని చదువుతోంది. సాహిత్యం, కళాత్మక ప్రక్రియల్లో ఆయన ప్రాసంగికతను అపూర్వరీతిలో యువత ఇప్పుడు చర్చలోకి తీసుకొస్తోంది. తెలంగాణ తన సాంస్కృతిక మూలాలను, ప్రాంతీయ ప్రతీకలను అన్వేషించి, ప్రతిష్ఠించుకునే క్రమంలో పునరుత్తేజం అందిస్తున్న కవి చెర. పాలితుల ఆసక్తులకు భిన్నంగా బహుశా చెరబండరాజు, అలిశెట్టి ప్రభాకర్‌ వంటి ప్రభావశీల వ్యక్తులపై కొత్త అంచనాలకు ఈ తరం సిద్ధమవుతున్నది. నాగరికతా విలువలను, ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తున్న ఫాసిస్టు సన్నివేశాన్ని ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మహిళ, ముస్లిం సమూహాలు గట్టిగా ఎదుర్కొంటున్నాయి. ఈ సామాజిక పునాదుల నుంచి వచ్చిన యువత మీద చెరబండరాజు వ్యక్తిత్వ, సాహిత్య ఆచరణ, పోరాట ప్రభావాలు కొత్త వెలుగులను ప్రసరిస్తున్నాయి. అకడమిక్‌ పరిశోధనల కంటే విముక్తి పోరాట చైతన్యంతో సాగే అన్వేషణకు చెర పాటలు సాంస్కృతిక తెరచాపల్లా దారి చూపుతాయి.


దిగంబర కవి, విరసం వ్యవస్థాపకుల్లో ఒకరు, 27 ఏళ్లకే విరసం కార్యదర్శి, మూడుసార్లు జైలు నిర్బంధం, మరో మూడుసార్లు బ్రెయిన్‌ ట్యూమర్‌కు ఆపరేషన్లు! ఇంతాచేసి చెరబండరాజు జీవించింది 38 ఏళ్లే. ఎవరు జీవించేను మూడు యాభైలు అని శ్రీశ్రీ అన్నారు. కానీ, ఒక యాభై కూడా చెర జీవించలేదు. అందులోనూ యవ్వనకాలమంతా జైళ్లు, ఆస్పత్రిలోనే హరించుకుపోయాయి. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో బతికించడానికి డాక్టర్లు చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమై 1982 జూలై రెండో తేదీన చెరబండరాజు అమరుడయ్యాడు. కాదు.. ఆయనను ప్రభుత్వం అనే పిచ్చికుక్క హత్యచేసిందని శ్రీశ్రీ అన్నాడు. శ్రీశ్రీ, శివసాగర్‌, చెర తెలుగు కవిత్వంలో ప్రజాకర్షక, విప్లవోత్తేజ కవులుగా సాహిత్య చరిత్రలో నమోదయ్యారు.

విరసం కవులు నినాదాలు రాసి కవిత్వంగా దబాయిస్తున్నారనే ఆరోపణ వినిపించిన రోజుల్లో కవిత్వ ప్రయోజనాలు నెరవేరేలా, శిల్ప ప్రమాణాలకు నిలబడేలా చెర కవిత్వం రాసి పోరాట ప్రజలకు నినాదాలుగా అందించాడు. ఒక తరం యువకులు శివసాగర్‌, చెర, వరవరరావు కవిత, పాటలను గోడలపైనే చదువుకున్నారు. అయితే..శ్రీశ్రీ తర్వాత ఎక్కువగా కోట్‌ అయిన కవిత్వం మాత్రం చెరదే. సరళం, సూటిదనం,

ఉద్దీపనలు కలిగించే పదాలతో ఆయన పాటలు యువకుల పెదాలపై కవాతులు చేసేవి. ఆర్‌ఎస్‌యు, ఆర్‌వైఎల్‌, పిడిఎస్‌యు సభల్లో ప్రాణాలన్నీ గొంతులోకి తెచ్చుకుని పాడితే ఒక గర్జన ప్రకంపించేది. నాగళ్లు, కొడవళ్లు యూనివర్సిటీలను నడిపించిన నక్సల్బరీ కాలం సృష్టించిన రాడికల్‌ భావాల బలం ఆయన గొంతుకలో ప్రస్ఫుటించేది. తొణకని చెర వ్యక్తిత్వగుణం కూడా దీనికి తోడవడంతో విప్లవ కవితకు, పాటకు అమేయమైన ప్రభావం వచ్చింది. అయితే..రాజకీయాలను నిరాకరించే శుద్ధ సాహిత్య ధోరణి సహజంగానే చెర సాహిత్యంపై పెదవి విరిచింది. కళ్ల ముందు మార్పును చూడలేని, యువకుల ఆకాంక్షలను చేరదీసుకోవడానికి చేతులు రాని నిలువనీటి దుర్గంధమీ ధోరణి. విప్లవ సాహిత్యోద్యమం ఈ ధోరణితో తలపడుతూ వచ్చింది. వర్గపోరాటాన్ని విప్లవ భావజాలాన్ని కొనసాగించింది. విప్లవ సృజన, భావాల చేవ, వాటి చారిత్రక విలువ పదే పదే రాటుదేలుతూ వచ్చాయి. ఇంకో వైపు నుంచి కూడా విప్లవ సాహిత్యంపై వ్యతిరేకుల విమర్శను చెరబండరాజు ఎదుర్కొన్నారు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ఆయన ప్రయత్నపూర్వకంగా రచనలు చేశారు. నవలలు, కథలు, నాటికలు, నాటకాలు, ఏకాంకికలు సృష్టించారు. సాహిత్యంలో రాజకీయాలు వద్దనే వాదనను ఓడిరచడానికి చెరబండరాజు వంటి తొలితరం విప్లవ సాహిత్యకారులు పూనికతో పని చేశారు. అయినా కాలం తిరస్కరించిన భావనలు, నాగరికత విసర్జించిన ధోరణులు, అకాడమీ, పురస్కార వాదాలు తిరిగి తిరగబెడుతూనే ఉంటాయి. విశ్వవిపణిలో అంగాంగాన్నే కాదు. ఆత్మలనూ అమ్ముకుంటుంటాయి. రాజుల సంస్కృతిని ప్రజల సంస్కృతిగా రుద్దుతుంటాయి. ఆగస్టు 15 ద్రోహాన్ని అమృత మహోత్సవంగా చాటింపు వేస్తుంటాయి. వాటితో పడే ఘర్షణే విప్లవ రచనను, కళాత్మక ఆచరణలను రాటుతేలుస్తాయి. ప్రత్యామ్నాయ వాదనలకు, సిద్ధాంత భావనలకు విస్తృతిని పెంచుతాయి. గతంలో దృష్టి పడని కొత్త ఆవరణలను మన ఆచరణల పరిధిలోకి తెచ్చి నిలుపుతాయి.


పీడిత కులాల, మహిళల, యువతరాల పోరాట ఆకాంక్షలను యాభై ఏళ్ల కింద చెర తన కవిత్వంలో ఆవిష్కరించాడు. వర్గపోరాట చైతన్యంతో విప్లవోద్యమ భవితవ్యాన్ని తొలి రోజుల్లోనే కలగన్నాడు. ఆయన కోరుకున్న విప్లవోద్యమం అనేక సంక్షోభాల మధ్యనే ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఇంకో పక్క అగ్రకులతత్వం, హిందుత్వం, పితృస్వామ్యం వికృత క్రీడలు ఆడుతున్న తరుణం కూడా ఇదే. ఈ సంఘర్షణామయ వర్తమానంలో చెరను మళ్లీ చదువుకుందాం. ఆయన పాటలు పాడుకుందాం. అందరికీ ఇదే ఆహ్వానం.

జూలై 03, ఆదివారం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌
ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ ప్రారంభ ప్రసంగం : రాము, సిటీ యూనిట్‌ కన్వీనర్‌

మొదటి సెషన్‌ : ఉదయం 10.30 గంటలకు
అధ్యక్షత : అరసవిల్లి కృష్ణ 
‘చెర సాహిత్య సర్వస్వం’ ఆవిష్కరణ
ఆవిష్కర్తలు : కృష్ణాబాయి, రత్నమాల, చెంచయ్య   

ఉదయం 11.00 గంటలకు
అంశం : చెర జీవితం – వ్యక్తిత్వం
వక్త : అల్లం రాజయ్య

ఉదయం 12.00 గంటలకు
అధ్యక్షత : సి ఎస్‌ ఆర్‌ ప్రసాద్‌
అంశం : చెర జ్ఞాపకాలు-ప్రభావాలు
వక్తలు : నగ్నముని, యాకూబ్‌,
ఎన్‌. వేణుగోపాల్‌, రుక్మిణి, భూపాల్‌

(మధ్యాహ్నం 1.30 – 2.30 భోజన విరామం)

మధ్యాహ్నం 2.30 గంటలకు
అంశం : మా చెర ఏతం పట్టిన
మందిపాట ఉరవడిలో..
అధ్యక్షత : తంగెళ్ల సుదర్శన్

మధ్యాహ్నం  3.30 గంటలకు
అధ్యక్షత : ఉజ్వల్‌
అంశం : చెర రాజకీయ దృక్పథం 
వక్త : రివేరా
అంశం :  చెర సమకాలీనత-విప్లవోద్యమం
వక్త : పాణి
ప్రజా కళామండలి, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. 

Leave a Reply