చీలికే మన బలహీనత

అమరుల త్యాగాల్ని ఎలుగెత్తి చాటిన ఆరున్నర శృతి నాగన్న పాట. కాయకష్టం చేసి కష్టఫలితం ఎంచిన పాలబుగ్గల నాగయ్య పశుల గాసిన మొనగాడు. తోడైపోయిన కర్రతో ఎర్రజెండానెత్తిపట్టి, పోరాటాల పాటనెక్కుపెట్టిండు. ఎమర్జెన్సీ చీకటిలో వెలిగిన ఈ చైతన్యం ‘అన్న అమరుడురా… మన రామనర్సయ్య’ అంటూ గోదావరి లోయను కన్నీరు పెట్టించింది. ‘ఎర్రపూల వనంలోన పువ్వు రాలిందో’ అంటూ నగాదారిలో నడిచిన నాగన్న ‘కాచనపల్లి అడవితల్లి గుండెపగిలి ఏడ్చినాదో’ అంటూ గుండె పగిలేలా ఏడుస్తూ అమరత్వాన్ని గుండెలకు హత్తుకున్న గాయకుడు. పేద కొంపలకు నిప్పు పెడుతున్న సారాని నిరసిస్తూ ‘ఎన్నడు కొట్టని నామొగుడమ్మో నేనేమి చేద్దు’ అంటూ ఆడబిడ్డల కష్టాన్ని పాడి జనం కళ్లు తెరిపించిండు. ‘గుడిసె గుడిసె గుడిసె నడుమ పొడిచెనట చందమామ’ అంటూ చీకటి కాలంలో ఆశలు వెలిగిస్తూ పల్లెపల్లెకూ తిరిగిన నాగన్న ఆ గుడిసెలోనే బతికిండు. పాట, మాట, ఆచరణ వేర్వేరుగా లేని ఒక జీవితం నాగన్న. అవకాశాలెన్నొచ్చినా ప్రజల కోసమే పాడి, విప్లవాన్నే స్వప్నించిన కవి గాయకుడు ఆయన. ఎంతోమంది సహచరులు దారితప్పినా, ఆగిపోయినా, వెనుకడుగేసినా తాను మాత్రం నమ్మిన విప్లవం కోసం పాడుతూనే పోతున్నడు. ‘జీవితం ఒడిదుడుకుల ప్రయాణం. విప్లవం గెలుపోటముల ప్రస్థానం. అంతిమ విజయం ప్రజలదే’ అన్న విశ్వాసంతో విప్లవాన్నే ఆశించి ఉద్యమాలే ఆలపిస్తున్నడు. ‘నువ్వు ఎత్తిన జెండా విడువబోము ఎల్లన్న’ అని పాడినట్లే ఎత్తిన జెండా దించకుండా అరుణ పతాకకు జై కొడుతున్నడు అరుణోదయ నాగన్న. ‘కాలాన్ని బట్టి మారాలె… కానీ కట్టు తప్పొద్దు’ అంటున్న జనం పాటతో ” కొలిమి” ఇంటర్వ్యూ.

ఎప్పుడు మొదలుపెట్టిన్నో గుర్తులేదు. కానీ, చిన్నప్పటి నుంచే మా ఊరు రాజారం (తిరుమలాయ పాలెం మండలం, ఖమ్మం జిల్లా)లో పాడుతూ ఉండేది. ఊళ్లలో భిక్షాటన చేస్తూ తిరిగే జానపదులు పాడే అన్ని రకాల పాటలూ పాడేది. బైండ్ల పాటలు, భాగవతాలు కూడా పాడేది. ఏ రాగం నా చెవిల పడ్డా నా నోటిగుంట పలికేది.

పంటచేలే ప్రదర్శన వేదికలు:

మా నాన్న (పరకాల పాపయ్య) కల్లుగీత కార్మికుడు. ఇద్దరం అన్నదమ్ములం. నేను పెద్దోడిని. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకుండె. నాకు కొద్దిగ వయసు రాంగనే నాలుగు మేకలు కొన్నడు. వాటిని కాయడానికి తోలిండు. కొంత కాలం వ్యవసాయ కూలీ పనులకు పోయిన. ఊళ్లో కూలి పనులు లేనపుడు వలపోయేది. వరినాట్లు, వరి కోతలప్పుడు కృష్ణాజిల్లా, నల్లగొండ జిల్లాలకు వలస పోయినం. వ్యవసాయ పనుల్లో ఉన్నపుడు అందరూ అడిగి పాటలు పాడించుకునేది. వాళ్లు పాడమన్నా, పాడమనకున్నా నా తీరుగ నేను పాడుతనే పని చేసేది.

పశులుగాసిన మొనగాడినే:

పదహారేండ్ల వయసొచ్చినంక మా ఊరి రైతు సామ జానకయ్య దగ్గర పాలేరుగా ఉన్న. నాకు ఏడాదికి ఒక పందుం (పందుం అంటే నాలుగు బస్తాలు) జీతం. ఆ వయసులో పొద్దునే లేచి పోయేది. పరగడుపునే బండ చాకిరీ చేయాలె. గొడ్లకాడ పెండ తీసి, ఊడ్చి కసువులెత్తేది. పనులన్నీ అయినంక ఇంటికి వచ్చి ముఖం కడుక్కుని రెండు ముద్దలు తినేది. మల్లొచ్చి అరక కట్టాలె. మాపటి అరక కడితే పొద్దుగూకే ముందు అరక ఇడిసేది. రాత్రి తొమ్మిది దాకా ఎడ్లను మేపేది. అయిదారు మైళ్లు నడిచి ఇంటికి చేరి, తినే సరికి అర్థరాత్రి అయ్యేది. మళ్లా తెల్లవారుజామునే పనికి పోవాల్సిందే. అరక కట్టని రోజుల్లో గొడ్లు మేపడానికి తోలుకపోయేది. వ్యవసాయంలో ఎదగొర్రు తోలడం తప్ప అన్ని పనులు చేసిన.

యజమాని నేర్పిన కార్మిక పోరాటం:

జానకయ్య తర్వాత మద్ది రామిరెడ్డి దగ్గర పాలేరుగా చేరిన. రామిరెడ్డి అన్న లింగారెడ్డి కమ్యూనిస్టులకు సానుభూతిపరుడు. కమ్యునిస్టు భావాల వల్ల రామిరెడ్డి బాగానే చూసుకునేటోడు. హైదరాబాద్ లో ఉన్నత విద్య చదివిన వాళ్లంతా మా ఊళ్లో కమ్యునిస్టు పార్టీని నడిపేది. మా నాన్న కమ్యూనిస్టుల వైపు ఉన్నడు. తెలంగాణ ఉద్యమానికి మా ఊరి కమ్యునిస్టులు అనుకూలంగా ఉండేటోళ్లు. ఆ ఉద్యమ విషయాలు చర్చించుకోవడం, నక్సల్బరీ, శ్రీకాకుళం గురించి వింటూ ఉండేది. పాలేరుగా జీతం చేస్తూనే పార్టీ మీటింగులు, ర్యాలీలకు పోయిన. అట్ల రామిరెడ్డి ఇంట్లో పాలేరుగా ఉన్నప్పుడు ఎంఎల్ పార్టీ పార్టీ పరిచయం అయింది.

కల్లుగీసి.. కూలి చేసి..

కొంత వయసొచ్చిన తర్వాత గీత వృత్తిలోకి వచ్చిన. ఇరవై తాళ్లు గీసేటోడిని. ఏడాదంతా తాళ్లు గీసే పని ఉండదు. పని లేనప్పుడు వ్యవసాయ కూలీ పనులకు పోయేది. అట్ల అప్పుడప్పుడూ కందాళ నర్సింహారెడ్డి దగ్గర కూడా కూలి పనులకు పోయిన. ఆయన హైదరాబాద్లో చదివిండు. అక్కడ విద్యార్థి రాజకీయాల ప్రభావంతో కమ్యునిస్టుగా మారిండు. ఆయన మా ఊరి కమ్యునిస్టు పార్టీ నాయకుల్లో ముఖ్యుడు. ఆయన ప్రభావంతో పార్టీ రాజకీయాలకు ఇంకా దగ్గరైన.

పల్లె ఒడిలో పాటల బడి:

మా ఊరి కమ్యునిస్టులు వయోజన విద్య కోసం ఆదర్శ యువజన మండలి ఆధ్వర్యంలో రాత్రి బడి పెట్టినరు. దానిని శ్రీపాద వెంకటేశ్వర్లు నిర్వహించేది. అందులో శ్రీపాద శ్రీహరి కూడా పాఠాలు చెప్పేటోడు. శ్రీహరి నాకు బాగా పరిచయం. పాలేరుగా పని చేయక ముందు మా ఊరి బడిలో ఒకటో తరగతి చదివిన తర్వాత మా పక్క ఊరు నర్సింహాపురం బడిలో రెండో తరగతి చదవడానికి పోయిన. అప్పుడు చేలల్లో నడిచి బడికి పోయేది. ఊరి పిలగాళ్లంతా ఒక జట్టుగా బయలెల్లిపోయేది. శ్రీహరి నాకంటే పెద్దవాడు. చదువులో సీనియర్. శ్రీహరి తమ్ముడు, నేను, రామాంజరెడ్డి ఒకే కచ్చురం (ఒకే ఈడు).

అంతరాల్లేని ఆప్యాయత:

శ్రీహరి చాలా ఆప్యాయంగా మాట్లేడేవాడు. నేను ఆయన్ని ‘మామా’ అని పిలిచేది. ఆయన ‘అల్లుడూ’ అనేది. మా నాన్నని ‘బావా’ అని పిలిచేటోడు. ఆ రోజుల్లో ఊళ్లలో ఇంత కుల బేధాలు లేవు. వ్యవసాయపనుల్లో ఉండే రైతులు, కూలీలు అందరూ వరుస పెట్టుకుని పిలుచుకునేది. రెడ్డి, వెలమ రైతుల్ని మాత్రమే పిలవకపోయేది. పెండ్లి, పేరంటాలకు పిలుచుకోవడం లేదు కానీ, ప్రేమగా వరుసలు పెట్టి పిలుచుకునేది. చేలో పని చేయని భూస్వాములను ఇట్ల పిలిచేది కాదు. ఆ పరిచయంతో రాత్రి చదువుకోడానికి శ్రీహరి వాళ్లింటికి పోయేది. వాళ్లింటికీ మా ఇంటికీ పది ఇళ్ల దూరం.

నేను పాలేరుగా పని చేస్తున్నా చదువు మీద ధ్యాస ఉంది. రెండో తరగతి పుస్తకాలను గూట్లో దాచిపెట్టుకున్న. ఆ పుస్తకాలను ఖాళీగా ఉన్నప్పుడల్లా మళ్లీ మళ్లీ చదివేవాడిని. ఆ తర్వాత పార్టీ పుస్తకాలు, పత్రికలు చదివే అవకాశం వచ్చింది. ఊళ్లో రాత్రి బడి పెట్టారు. అక్కడ పాఠాలు చెప్పే శ్రీహరిలాంటి వాళ్లతో పరిచయం వల్ల మళ్లీ చదవాలనే ఆశతో రాత్రి బడికి పోయిన. అప్పుడు శ్రీహరి అజ్ఞాతంలో ఉంటూ విద్యార్థి ఉద్యమ నిర్మాణం చేస్తున్నడు. ఆ వయోజన విద్య నన్ను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసింది.

చీకటి రోజుల్లో చైతన్య గీతం :

ఎమర్జెన్సీ రోజుల్లో నేను మొదటిసారిగా విప్లవగీతం విన్న. అది ఆగస్టు నెల. మా ఊళ్లో నాట్లు వేస్తున్నరు. ఆ నిర్బంధ కాలంలో కూడా నిర్భయంగా ప్రజల్ని కూడగట్టేందుకు పీడీఎస్ యూ వాళ్లు పనిచేస్తున్నరు. పీడీఎస్ యూ విద్యార్థులు కూలి రేట్లు పెంచాలని పాటలు పాడుతున్నరు. అప్పుడు అంబిక ‘పల్లెటూరి కూలి రైతా.. నీ పిల్లజల్లా సల్లంగున్నారా’ పాట పాడింది. ఉద్యమ పాటలు వినడం అదే మొదటిసారి. 1976లో ఎండాకాలంలో పార్టీ ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ జరిగింది. అందులో ‘తుఫాన్, ఎర్రగడ్డ’ నాటకాలు వేసిండ్రు. శ్రీహరి, పి. ప్రసాద్ (పీపీ), మధుసూదన్ రెడ్డి, శ్రీహరి తమ్ముడు రవీంద్రబాబు, సామా రామిరెడ్డి పాత్రధారులుగా ఉన్నరు. నేనప్పుడు విప్లవ గీతాల ప్రేక్షకుడిని మాత్రమే. ఆ నాటకంలో ”సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో” పాట, ”పొదలపొదల గట్ల నడుమ” పాటలు పాడారు. అవి వినడం కూడా అదే మొదటిసారి. సభలకు పోవడం, కళాకారులు పాడే పాటలు వింటుంటే వాళ్లలా పాడాలని అనుకున్న.

https://youtu.be/lVcuEXd7kXg

ప్రభవించిన విప్లవ గీతం :

రాత్రి బడిలో చదువుతోపాటు పాఠాలు, నాటకాలు కూడా నేర్పేది. బడి ప్రారంభంలో అప్పుడప్పుడూ నాతో పాటలు పాడించేది. ఆ బళ్లో.. కామ్రేడ్ రామనర్సయ్యకు కొరియర్ గా పనిచేసే మధుసూదన్ రెడ్డి పాటలు, డ్యాన్సులు నేర్పేవాడు. విద్యార్థి ఉద్యమాల ప్రభావంతో జనాన్ని ఎడ్యుకేట్ చేయాలనే తపనతో పార్టీలో పనిచేస్తున్నడు. ఆయన పెద్ద గాయకుడు కాకున్నా ట్యూన్ చెప్పేటోడు. గూడ అంజయ్య రాసిన ”ఊరుమనదిరా”, ”ఏరువాక వచ్చెరన్న ఎవరింట్లో ఉందువన్న”, ”అయ్యజేసిన అప్పుకింద”, ”బువ్వ లేని జీతగాడా”, ”కమ్యునిస్టు కిష్టాగౌడ్ కామ్రేడ్ భూమయ్య” అనే పాటలు నేర్పిండు. తనే మాకు ‘హే నగరే నగారే”, ”రావోయి రావోయి లంబాడోళ్లన్న” అనే పాఠలకు డ్యాన్సులు నేర్పిండు. క్యాసెట్లు, టేప్ రికార్డర్ లేదు. నేను పాటలు పాడుతుంటే మిగతా కళాకారులు డ్యాన్స్ వేసేవాళ్లు. ఆ తర్వాత కాలంలో అరుణోదయలో ఆ రెండు డ్యాన్సులు ఎంతో ఫేమస్. రాత్రి బడికి వచ్చేటోళ్లంతా పార్టీ వాళ్లు కాదు. అందుకని చదువు మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టేది. ఆ తర్వాతే పాటలు, డ్యాన్సులు.

స్ఫూర్తినిచ్చిన అరుణ తార.. శ్రీపాద శ్రీహరి

ఎమర్జెన్సీ రోజుల్లో కామ్రేడ్ రామనర్సయ్యతోపాటు శ్రీహరి కూడా పట్టుబడిండు. ఇద్దరినీ 3 నవంబరు 1976 న పోలీసులు కాల్చి చంపినరు. అప్పటికే పార్టీ మీద బాగా అభిమానం ఉండేది. శ్రీహరి మరణం నాకు స్ఫూర్తినిచ్చింది. శ్రీహరి మరణం నాటికి నాకు పెండ్లయి ఓ వారం రోజులైంది. శ్రీహరి స్థూప నిర్మాణం కోసం పునాదులు తీసిన. రాళ్లు, ఇటుకలు మోసి, మాలు అందించిన. ఇరవై రోజులు పనిచేసి ఆయన స్థూప నిర్మాణం చేసినం. ఆ రోజుల్లో.. ‘ఎందుకు శ్రీహరిని కాల్చి చంపిండ్రు.? ఆయన ఎందుకు ప్రాణ త్యాగం చేసిండు?’ అనే ప్రశ్న నన్ను బాగా ఆలోచనలో పడేసింది. శ్రీహరి మరణం ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనకు ప్రేరేపించింది.

ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత రాజకీయ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు. మా ఊళ్లో బహిరంగ సభ పెట్టినం. ఆ సభలో పీపీ రాసిన నాటకం ప్రదర్శించినం. ఆ సభలో కామ్రేడ్ కాశీపతి ప్రసంగించిండు. అమరులకు నివాళులు అర్పిస్తూ ఊరేగింపులు తీసినం. ఆ ఏడాది పిండిప్రోలులో సీపీఐ ఎంల్ (చండ్రపుల్లారెడ్డి గ్రూప్) పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించింది. నేనప్పుడు కుట్టుమిషన్ నేర్చుకుంటున్న. కుట్టు మిషన్ నేర్చుకోవడానికని ఇంట్లో అబద్దం చెప్పి క్లాసులకు పోయిన. ఆ రాజకీయ తరగతుల్లోనే పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకున్న. పార్టీ సాంస్కృతిక రంగంలో పని చేయమని చెప్పింది.

ఆయుధమైన పాటను

ఎమర్జెన్సీ తర్వాత విద్యార్థి ఉద్యమ పునర్నిర్మాణం జరుగుతున్నది. 1978లో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలో ‘భూమి బాగోతం’ నాటకం ప్రదర్శించాలనుకున్నం. తిరుమలాయపాలెంల బుచ్చిరాయమ్మ స్మారక మందిరంలో పదిహేను రోజులు వర్క్ షాప్ జరిగింది. ఆ సందర్భంలోనే అరుణోదయ రామారావుతో కలిసి పనిచేయడం మొదలైంది. తను శిక్షణ ఇచ్చిండు. ఆ నాటకానికి నేను నేపథ్య గాయకుడిని. అంతకుముందు వేదికలపై పాడిన. కానీ ఇది మాత్రం ఒక సాంస్కృతిక దళంలో భాగమైన సందర్భం. అలా మొదలైన ప్రయాణంలో సాంస్కృతిక దళ నాయకుడిగా ఎదిగిన. ఆ నాటకాన్ని రాష్ర్టమంతా తిరిగి పాతిక ప్రదర్శనలు ఇచ్చినం. విప్లవ సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం కోసం ఒంగోలులో 1980లో రాష్ట్ర మహాసభ జరిగింది. నేనూ ఆ కార్యవర్గంలో ఒక సభ్యుడిగా ఎన్నికైన.

రాష్ర్ట మహాసభలకు ముందు ఖమ్మం జిల్లాలోని ముకుందాపురంలో అరుణోదయ నిర్మాణ సభ జరిగింది. ఆ సభలో కానూరి తాత నన్ను చూసిండు. ఒంగోలు మహాసభల తర్వాత బుర్రకథ నేర్పిస్తానని హన్మకొండకు పిలిపించిండు. నాతోపాటు లక్ష్మీ, దాస్ (ఎర్రగడ్డ, ఖమ్మం జిల్లా) అనే మరో కళాకారుడు కామ్రేడ్ కానూరి గారి ఇంటికి పోయినం. హన్మకొండలోని కుమార్పల్లిలోని వాళ్లింట్లోనే ఉండి ”రామనర్సయ్య బుర్రకథ” నేర్చుకున్నం. మహబూబాబాద్లోని గాంధీ పార్కులో మేడే (1 మే 1981)న తొలి బుర్రకథ ప్రదర్శన ఇచ్చిన. ముందు పాట, తర్వాత భూమి భాగోతం నాటకానికి నేపథ్య గానం, తర్వాత రామనర్సయ్య బుర్రకత. ఈ మూడే నన్ను సాంస్కృతిక కళాకారుడిగా ప్రజలకు పరిచయం చేసినయి.

అన్నం పెట్టాలంటే భయపడే రోజులు

ఎమర్జెన్సీ తర్వాత రోజుల్లో కొన్ని ఊళ్లలో జనం ఆదరించడానికి భయపడేవాళ్లు. పార్టీకి ఆదరణ ఉండే గ్రామాల్లో ఇబ్బంది ఉండేది కాదు. పీడీఎస్యూ సభలు, కూలి రేట్లు, సారా వ్యతిరేక ప్రచారం కోసం పోతే పార్టీ లేని ఊళ్లలో తిండికి ఇబ్బంది పడిన సందర్భాలు కోకొల్లలు.

ఉద్యమం ఇచ్చిన బిడ్డలు

అజయ్ పుట్టక ముందు మాకు ముగ్గురు బిడ్డలున్నరు. సృజన, నూతన, అరుణ వాళ్ల పేర్లు. కన్న బిడ్డలు కాకున్నా మాకు ఉద్యమం ఇచ్చిన బిడ్డలు. ముగ్గుర్ని మేం పెంచినం. సృజన అయిదేళ్లప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది. రాయల వీరయ్యగారి బిడ్డ నూతన మా దగ్గర ఉంది. ఈ ముగ్గురికీ కానూరి తాతగారు రాసిన ”జనగానం” బుర్రకథ నేర్పించినం. సృజన ”జజ్జనకరె జనారె” పాటకు డ్యాన్స్ చాలా బాగా వేసేది. అయిదేళ్ల వయసులోనే ఆమె పీడీఎస్యూ వేదికలపై ప్రదర్శనలిచ్చేది. ఖమ్మంలో చిన్న గదిలో అద్దెకు ఉంటూ వాళ్లను సాదినం. మా లక్ష్మి కన్న తల్లిలాగే వాళ్లకు స్నానం చేయించి, అన్నం వండిపెట్టేది. నేను వాళ్లకు పాటలు, బుర్రకథ, డ్యాన్స్ నేర్పినం. కొంతకాలం పెంచిన తర్వాత వాళ్లు అమ్మానాన్నల దగ్గరకు పంపినం.

సహచరి లక్ష్మితో అరుణోదయ నాగన్న

బిడ్డని భుజానేసుకుని తిరిగినం

సారా వ్యతిరేక ఉద్యమంలో ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుంటే పోలీసులు వెంబడించేది. వాళ్లను తప్పించుకుంటూ చీకట్లో గ్రామాలు తిరిగినం. తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాల్లో తిరుగుతుంటే పోలీసులు జీప్ వేసుకుని మా దళాన్ని వెంబడించేది. మా సాంస్కృతిక దళంలో నేను, లక్ష్మి, యశ్పాల్, సుబ్బారావు, ఇంకొంతమంది కళాకారులు ఉండేది. అప్పుడు మా అబ్బాయి పసివాడు. వాడిని భుజాన వేసుకుని ఒక ఊరి నుంచి ఒక ఊరికి చీకట్లో చేల మధ్య ప్రయాణం చేసేది. ఓసారి ఒరం మీద నడుస్తూ కాలు జారిపడితే, భుజం మీద ఉన్న బిడ్డ జారి కిందపడ్డడు. పోలీసు జీపు వెలుతురు చూసి రోడ్డు పక్కన కందకాల్లో దాక్కునేది. మా జాడ తెలిసి పోలీసులు ఊళ్లల్లనే ఉంటే మేం ఊళ్లోకి పోకుండా చేలల్లో, చిన్న గుట్టల మీద ఉండేది. చలి, ఆకలిని భరిస్తూ నిద్రలేకుండా తిరిగినం. ఇరవై రోజులకు నా ఆరోగ్యం పాడైపోయింది. ఖమ్మంలో దవాఖానలో చేర్చిండ్రు.

ఆమె నిలబడి.. నన్ను నిలబెట్టింది

1978 నుంచి ఇద్దరం పూర్తికాలం కార్యకర్తలుగా పార్టీలోకి వచ్చినం. హెచ్ఆర్కే రాసిన ‘తునికి చేను గట్టుకాడ చెట్టుపుట్ట కొట్టేటోడ’ పాటని మొదటగా నేర్చుకుంది. మణుగూరు దగ్గర సీతారాంపురంలో జరిగిన ఓ సభలో పాడింది. మాదాల నారాయణ స్వామి ఆ పాట విని ‘బాగా పాడుతున్నావమ్మా’ అని మెచ్చుకున్నడు. ఆ తర్వాత కాలంలో అనేక ఉద్యమ గీతాలు నేర్చుకుని పాడింది. తనకు నేను కొంత నేర్పాను. తాతగారు నేర్పిండ్రు. తను సొంతంగా ఇంకొంత నేర్చుకుంది. గాయనిగా, బుర్రకథ కళాకారిణిగానే కాదు ‘ఓ చిన్నదాన.. నా చిన్నదాన’ పాటకు నాతో కలిసి డ్యాన్స్ చేసింది. ఆమె నాతో నిలబడింది కాబట్టే నేను ఉద్యమంలో నిలబడిన. ఉద్యమాల్లో పరువళ్లుతొక్కిన నా పాటను నిలబెట్టిన చైతన్యం లక్ష్మక్క. ఆమె నాతోపాటు పూర్తికాలం కార్యకర్తగా ఉండటానికి సిద్ధం కాబట్టే నేను ఉద్యమాల్లో నిలబడగలిగిన. 1987 తర్వాత రైతుకూలీ సంఘం బాధ్యతలు చూడాలని పార్టీ చెప్పింది. అయిదేళ్లు ఆ బాధ్యతలు చూసిన. నా సహచరి లక్ష్మికి మహిళా సంఘం బాధ్యతలు అప్పగించిండ్రు.

ఈ ప్రస్తానంలో నాకు ఆరుగురు గురువులున్నరు. కందాళ నర్సింహారెడ్డి రాజకీయ గురువైతే, రాజకీయ నిర్మాణం చేయడం ఎలాగో నేర్పిన మార్గదర్శి దివాకర్. సాంస్కృతిక ప్రదర్శనల్లో కానూరి నాకు స్ఫూర్తి. నాపై రామారావు ప్రభావం ఉంది. సాహిత్యంలో నా ప్రయత్నం, ప్రయాణం చాలా చిన్నది. ఆ చిన్న ప్రయాణాన్ని నడిపించిన గురువు జీవన్ సార్, నమ్ము సార్.

సినిమా పాటైనా ప్రజల కోసమే

సినిమాల్లో, రేడియోల్లో పాడాలన్న ఆలోచనే లేదు. ఉద్యమ పాటలే పాడాలన్నది నా కోరిక. సారా వ్యతిరేక ఉద్యమంలో నేను ఒక పాట రాసి, పాడిన. అది ఆర్. నారాయణమూర్తి ఎక్కడో విన్నడట. తను తీస్తున్న దండోరా సినిమాలో నాతో పాడించాలనుకున్నడు. నా కోసం వందేమాతరం శ్రీనివాస్ ను పంపించిండు. తను పాడటానికి రమ్మంటే పార్టీని అడిగి చెబుతానని చెప్పిన. ఆర్. నారాయణ మూర్తిగారే నేరుగా మాదాల నారాయణ స్వామికి ఫోన్ చేసి ‘స్టూడియో బుక్ చేసుకున్నాను. నాగన్నని పంపించండి’ అని రిక్వెస్ట్ చేసిండు. పెద్దాయన చెప్పడంతో మద్రాస్ పోయి ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మ’ పాట పాడాను. ఆ పాట ఆనాటి ఉద్యమంలో బాగా పాపులర్ అయింది. నేను సినిమా అవకాశాల కోసం ఆ తర్వాత ట్రై చేయలేదు. మళ్లీ విద్యుత్ ఉద్యమం అంత ఉదృతంగా వచ్చింది. అప్పుడు నారాయణ మూర్తి గారు మళ్లీ పిలిచారు. చలో అసెంబ్లీ సినిమాలో కోసం ‘ఆగదు ఆగదు ఆగదు.. ఈ ఆకలిపోరు ఆగదు’ అనే పాటను పాడించిండు.

సినిమా, టీవీ, రేడియలో పాడితే అవకాశాలొస్తయి. డబ్బులొస్తయి. కానీ నాకు ఆ కోరిక లేదు. ప్రజల కోసమే పాడాలనే నిబద్దతతో ఉన్న. అట్లని బయటి అవకాశాలు కాదనలే. కొమురం భీమ్ మీద ఒక ఆల్బమ్ కోసం ‘అమరుడా కొముర బీమ్.. నిన్నెట్ల మరుతుమురా’ అనే పాట పాడిన. సూరత్ వలస బతుకులు, వర్ణ వివక్ష, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఆల్బమ్స కోసం పైసా అడక్కుండా పాటపాడిన.

తడికెల గుడిసెలో పన్నెండేళ్లు..

మాకంటూ ఓ ఊరు లేదు. అరుణోదయ మా ఇంటి పేరు. పార్టీ మా చిరునామా. మా అబ్బాయి అజయ్ కూడా కళాకారుడే. బాగా పాడేవాడు. విద్యార్థి ఉద్యమాల్లోచురుగ్గా పనిచేసిండు. వయసు పైబడ్డది. కొడుకు పెద్దోడయిండు. మాకంటూ ఓ ఆధారం లేదన్న ఆలోచనతో లక్ష్మీ పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా చేయలేనని తప్పుకుంది. ఏదో ఒకటి చేయాలని (ఖమ్మంలో) మమతా మెడికల్ కాలేజీ దగ్గర గొల్లగూడెం దారిలో బడ్డీ కొట్టు పెట్టింది. ఎక్కడ షాపు పెట్టాలన్నా లక్షలు కావాలె. కిరాయి వేలల్లో కట్టాలె. చేతిలో డబ్బులేదు. అందుకే ఖర్చు తక్కువని రోడ్డు పక్కన ఓ చిన్న తడికెల గుడిసె వేసుకుని కొట్టు నడిపింది. ముగ్గురం ఒక్క గదిలోనే ఉన్నం. కొన్నాళ్లకు దానికి దగ్గర్లోనే కాలువ గట్టుపై పేదలంతా గుడిసెలేసిన్రు. మేము ఒక చిన్న గది కట్టుకున్నం. లక్ష రూపాయలు ఖర్చయింది. అది కూల్చేసినరు. మొదలు కట్టుకున్న తడికెల గుడిసెలోనే ఉండిపోయినం. ఆ గుడిసెలో ఉన్నప్పుడే మా కొడుక్కి పెండ్లి చేసినం. అందరం ఒక్క గదిలోనే ఉన్నం. తెలంగాణ వచ్చినంక మేముండే దిక్కే టీఆర్ఎస్ ప్లీనం జరిగింది. దానికి కేసీఆర్ వస్తున్నడని రోడ్డుపక్కన గుడిసె పీకేయాలన్నరు. చేసేది లేక పన్నెండేళ్ల తర్వాత ఆ గుడిసె పీకి, సామాన్లన్నీ మోసుకుని ఇంకోచోట తలదాచుకున్నం. ఇట్ల ఎంతకాలమని తిప్పలు పడతమని ఖమ్మానికి పది కిలోమీటర్ల దూరంలో చిన్న జాగా కొన్నం. లక్ష్మీ, అజయ్ సంపాదించిన పైసలతో చిన్న ఇల్లు కట్టుకున్నం.

రాజకీయ వైఫల్యమే

నేటితరంలో కవులు, రచయితలు ఉన్నరు. కానీ వాళ్లలో చైతన్యం కొరవడి ప్రజల పాటలు రావట్లేదు. పాత తరం కవులు ఈతరాన్ని ఆకట్టుకునే పాటలు రాయలేకపోతున్నరు. ఉద్యమాల వెనుకపట్టు కూడా కారణమే. నేను కవిని, రచయితని కాదు. కానీ ఉద్యమాల ఉదృతిలో నేనూ ఎన్నో పాటలు రాసిన. అది ఉద్యాల స్ఫూర్తి వల్లనే సాధ్యమైంది. రాగంతో పాటు భావం తన్నుకుని వచ్చేది. విద్యుత్ ఉద్యమంలో పది పాటలు రాసిన. తెలంగాణ ఉద్యమంలోనూ అట్లనే రాసిన. ఇప్పటి వరకు వందకు పైనే పాటలు రాసిన. ఈ తరం గాయకుల్లో ప్రజల కోసం పాడాలనే కమిట్మెంట్ లేదు. కవులు, రచయితలను కదిలించేంత బలమైన ఉద్యమాలు రావాలె. ఇది రాజకీయాల వైఫల్యం. కళాకారులది కాదు.

నా కొడుకు నా మాట మీరిండు

మా అబ్బాయి చాలా ఏళ్లు మా ప్రభావంతో ప్రజా కళాకారుడిగా నన్ను అనుసరించిండు. తెలంగాణ ఉద్యమంలో నాలుగేళ్లు కష్టపడ్డడు. ఆయన మీద నా ప్రభావమే కాదు సమాజ ప్రభావమూ ఉంటుంది. తన ఆలోచనలు మారినయి. సాంస్కృతిక సారథిలో చేరొద్దని చెప్పిన. నా మాటమీరి పోయిండు.

కలిసుంటే?…

చీలికలు విప్లవోద్యమానికి నష్టం. ఇన్ని చీలకల వల్ల నష్టపోయినం. ఆనాటి కమ్యునిస్టు పార్టీ నుంచి ఇవాల్టి విప్లవ పార్టీల వరకు అందరూ నిజాయితీగా పనిచేసివాళ్లే. ప్రజలకోసం పనిచేయాలని వచ్చినవాళ్లే. ఈ చీలికలు స్వార్థం కాదు. కారణం చైతన్యం లేదని కాదు. ఎవరికివాళ్లు మా అభిప్రాయాలు గొప్ప అనుకుంటున్నరు. ఈ చీలికల మూలంగా విప్లవాన్ని ఆశించి వచ్చినవాళ్లను నిరాశపరిచినయి. జీవితాన్నంతా ఇచ్చినా ఏమీ సాధించలేకపోయామే అనే బాధ మిగిల్చినయి. రాకపోయేదేమో. కానీ, కలిసుంటే ఆ దిశలో పయనం చేస్తూ ఉండేవాళ్లం. ఇంకా కొత్త వాళ్లు రావడానికి, ఉద్యమంలో ఉన్నోళ్లు నిలబడటానికి భరోసా ఉండేది. ఈ చీలికలు చూసి ఎంతోమంది వెనుకడుగేసిండ్రు.

డొల్లతనాన్ని సరిచేసుకోవాలె

కాలంతోపాటు కొంతమంది ఉద్యమ సహచరుల మనసు మారుతుంది. అందుకే పోతున్నరు. పోవడానికి కారణాలుంటయి. ఆ కారణాలు అట్లనే ఉంటే ఎందుకొస్తరు? కొంత మందికిఈ ఆదర్శాలే అవసరం లేదు. వాళ్లకు రావాలనే ఆలోచనే రాదు. నేటి ఉద్యమం, రాజకీయాలు కొత్త తరాన్ని ఆకర్షించేంత ఉదృతంగా లేవు. ఈ స్తబ్దత ఎప్పుడూ ఉండదు. ఇది దీర్ఘకాల ఉద్యమం. ఒడిదుడుకులు ఉంటయి. నిరుత్సాహపడకూడదు. నోరు నవ్వుతుంటే నొసలు ఎక్కరించినట్లుగా విప్లవ పార్టీల మీద ఎంత అభిమానం చాటుకున్నా ఇందులో డొల్లతనం ఉందనే నిజాన్ని అంగీకరిస్త. దానిని మనం సరిచేసుకోవాలె. ఎప్పుడూ ఇట్లుండదు. తప్పకుండా మంచి రోజులొస్తయి.

9 thoughts on “చీలికే మన బలహీనత

  1. నాగన్న పాటంటే చాలా ఇష్టం. మొన్న రామారావు మీద పాడినపాట తో ఆ ఇష్టం. మరింత పెరిగింది.

  2. మామా… నువ్వు, అజయ్ బావా, లక్ష్మీ అత్త కలిసి పార్టీకి అందించిన సేవ చాలా గొప్పది. నువ్వు రాసిన రచనలు, పాడిన పాటలు మానవాళికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని చెప్పడానికి నేనొంతో గర్వపడుతున్నాను…

  3. మంచిగుంది . దాపరికాలు.కల్పనలు లేవు .నాగన్న లాల్ సలాం జై భీమ్

  4. ఉత్తేజకరమైన పరిచయం. అభిప్రాయాలను సూటిగా చెప్పారు. అనుభవాలను పంచుకోవడం బాగుంది.

  5. విప్లవోద్యమానికి నివాళి వ్యాసం బాగుంది.

  6. నాగన్న, నాగన్న లాంటి వాళ్ళ పాటలతో పాటు అనుభవాలు, ఆలోచనలు రికార్డు కావలసివుంది. డొల్ల తనం నుండి బయటపడడానికి అవి చాలా అవసరం.. నాగన్నకు అభినందనలు..

  7. చీలీకలలో ఎక్కువగా కనిపిస్తున్నది ఆధిపత్యం, స్వార్థపర చింతన

Leave a Reply