ఎహే పో…
ఎల్లయ్య మల్లయ్య
ముచ్చట కాదువయా
ఏక్ నెంబర్ తెలంగాణ
దునియా రికార్డు బ్రేకులు
చూడుర్రీ.!
1
భాగ్యనగురం
బంగారు తున్క
వానగొడితే
దవాఖాన మునక!
2
తల తల మెరిసే
సడుగులు
సారీ… అడుగడుగున
ఉంటయి మడుగులు.!
3
హుస్సేను సాగరం
మల్లె పువ్వు లెక్క
మూసి నదిల
ఈత గొట్టుడు పక్కా!
4
స్కైవేలు హైవేలు
ఆకాశమెత్తు టవర్లు
లండన్ గిండన్
తల దన్నే వండర్లు.!
5
టి.యస్. పి.సి
టి..హబ్ లు
అశోక్ నగర్ లో
నిరుద్యోగ క్లబ్ లు!
****
ఊరుకోండ్రివయ
గివి ఉల్లెక్కల
ముచ్చట్లు కాదు
మన ఏలుబడిల
ఎలుగులు…!
…………
అయిదుగురన్నల తలుసుకొని…!
నిన్ననే కాల్ మాట్లాడిన
కాలం బాగలేదు
పానాలు పయిలం
రాఖీ పండుగకు
రావద్దని
సాటి మోర మొత్తుకున్న.
పాణాలు పాడుగాను
ఉంటే ఉన్నయి
లేకుంటే మన్నయి పోని
ఉన్నొక్క అన్నకు
రాఖీటు కట్టకుంట
పానమెట్ల ఆగుతదిరా
అయ్యా అన్నది.
అయిదుగురు అన్నదమ్ముల్లో
పోయిన నలుగురిని
యాజ్జేసుకుంది.
వట వట కన్నీళ్లు దీస్తూ
అరికీసు ఇనకుండా
ఇగో ఇట్ల రాఖీటు
పట్టుకొని రానే అచ్చింది.
గీమె నేను రాసిన
“మేనత్త నియ్యతి” కథలో
కథానాయిక
ఈమె కండ్లల్ల
కన్నీటి కుండలుంటయి
ఈమె మనసులో
ఎన్నపూస ఉండలుంటయి
ఈమె పెయ్యినిండా
చెమట చెలిమెలుంటయి.
ఉండేది రేకుల షెడ్డు
రెక్కాడితేనే డొక్కలకు
బుక్కెడు బువ్వ పెల్ల.
బతుకు పట్ల
ఇసుమంత కూడ రందిలేని
గుండెలో మొండి ధైర్యం గల్లది.
అవసరాలేమైనా ఉన్నయా
అని అడిగిన ప్రతి సారి
నువ్వు సల్లగుండు సాలు
అదే మాకు పది వేలు
అంటూ చేతులు
చిటిక లిరుసుకొని
చెంపలు నిమిరింది.
సంటి పిలగానప్పుడు
నిన్ను మోత్తే
సంక కాయ గాసిందని
సూపెట్టింది
ఇప్పుడు సారు వయితివని
మురిసి పోయింది.
తొవ్వకరుసు కని నూరంటే
నూరు రూపాయలే తీసుకుంది.
సాగ దోలుతుంటే
తాప తాపకు పైలం పైల మని
పది సార్లు చెప్పుకుంట
సల్లగుంటే
మల్లచ్చేటి కత్తనని
అన్న(మా నాన్న) బెట్టిన
రైక బట్ట చెయి సంచిల
పెట్టుకొని
సాగి పోయింది
నియ్యతి గల్ల సాలక్క
నా మేనత్త!
చురకలు కావవి నిప్పు కణికలు
Thank you Anna