ఆమధ్య రాబిన్ శర్మ అనే ఒక పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాసిన పుస్తకం ఒకటి చదివాను. అది ఇంగ్లీషులోను, తెలుగులోనూ కూడా బెస్ట్ సెల్లర్ అని తెలిసింది. ఆ పుస్తకం చదువుతున్నప్పుడూ, ఇంకా ఈ వేళ అత్యధికంగా అమ్ముడవుతున్న అటువంటివే మరికొన్ని పుస్తకాలు చదివినప్పుడు నాకు చాలామాట్లు చలంగారి మాటలు గుర్తొచ్చాయి. ఈ రచయితలంతా ఈనాటి నాగరిక జీవనం వల్ల కలుగుతున్న అశాంతికి నివారణోపాయాలుగా చెప్తున్న అనేక విషయాల గురించి చలంగారు ఏనాడో ఇంకా ఎంతో లోతుగా, ఎంతో కథాత్మకంగా, సౌందర్యాత్మకంగా చెప్పడం గుర్తొచ్చింది.
ఇప్పటికీ చలం అవసరం ఉందా ? అని ప్రశ్నిస్తే ఇప్పుడే ఎక్కువగా ఉందేమో అనిపించింది ఆ పుస్తకాలు చదివినప్పుడు.
చలం తన సాహిత్యం ద్వారా నిర్జీవంగా సాగే సామాన్య జీవితాన్ని జీవవంతం చేసే కొత్త మార్గాలు అన్వేషించాడు. ఈనాటి నాగరిక మానవుడు కూడా అన్వేషిస్తున్నాడు. కానీ ఈ రెండు మార్గాల మధ్య అంతరాన్ని గురించి కూడా కొంచెం చెప్పుకుందాం.
జీవితాన్ని నవవనం చేసే మార్గాలుగా చలం స్వచ్ఛత, రసికత అనే రెండు సగాలను కనుగొన్నాడు. ‘రసికత’ అన్న పదాన్ని ఆయన మనం వ్యవహరిస్తున్న సంకుచితార్థంలో వాడలేదు. స్పందన, భావుకత కలగలిసిన ఒక మానసిక స్థితినే రసికత అన్నాడు.
లోకంలోని సౌందర్యాన్నే కాక సుఖదు:ఖాలన్నింటినీ లోపలకు తీసుకోగల సంస్కారాన్ని ఇచ్చే ఒక సదవస్థగా దాన్ని గుర్తించాడు.
అయితే ఈ స్వచ్ఛత, రసికతల వల్ల ‘ఇన్ స్టంట్’ గా ఆనందం కలిగి తీరుతుందని ఆయన హామీ ఏమీ ఇవ్వలేదు. కానీ ఇవి అలవరచుకుంటే మాత్రం ఒక అవ్యక్తమైన ఆనందం ఎవరికి వారికే అనుభవం అవుతుందని, కాబట్టి ఆ ప్రయత్న సాధన చెయ్యమనీ కోరాడు.
చలం కోరిన స్వచ్ఛత గురించి అనాది కాలం నుంచి కవులూ, ప్రవక్తలూ చెప్తూనే ఉన్నారు. చలం ఆ స్వచ్ఛత సంపాదించే మార్గం గురించి తన వేల పేజీల సాహిత్యమంతటా చెప్పినదాన్ని ఒక్కమాటలో పెడితే ఇలా ఉంటుంది.
స్వేచ్ఛగా ఆలోచిస్తూ, బాధ్యతగా ప్రవర్తించు’ అని.
కానీ ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవిగా పైకి కనిపించడం వల్ల చలం ఈనాటికీ ఎందరికో అర్థం కాకుండా ఉండిపోయాడు.
స్వేచ్ఛ వల్ల భయరాహిత్యం వస్తుంది.
భయరాహిత్యం స్వచ్ఛతను కలిగిస్తుంది.
అలా ఈ స్వేచ్ఛ అన్న మాటను ఎంతో బాధ్యతగా వాడుతూ, వివరిస్తూ వచ్చాడు.
చాలా మొదట్లో ఆయన రాసిన ‘స్త్రీ’ పుస్తకంలో స్వేచ్ఛ రెండు రకాలని ఒకటి బయటి స్వేచ్ఛ, రెండోది లోపలి స్వేచ్ఛ అనీ విడదీశాడు.
ఎవరి అధికారాల కిందా, పెత్తనాల కిందా అణగారిపోయి ఉండకుండా స్వతంత్రంగా ఉండగలగడం బయటి స్వేచ్ఛ అని, దీనికి ఆర్థిక భద్రత ఎంతో అవసరమని చెప్పాడు.
స్వార్థాహంకారాలు, ఈర్ష్యాద్వేషాల్లాంటి విషయాలతోను, రకరకాల భయాందోళనలతోను నిండిపోయిన మనసును వాటి నుంచి విముక్తం చేసే స్వేచ్ఛ లోపలి స్వేచ్ఛ.
ఇవ్వాళ ప్రపంచం బయటి స్వేచ్ఛను సంపాదించుకుని దానినే విజయం సాధించడంగా భావించుకుంటున్న తరుణంలో కోల్పోయిన మానసిక స్వేచ్ఛ ప్రజలను మానసిక, శారీరక రోగగ్రస్తుల్ని చేస్తోంది.
దానికి సాక్ష్యంగా పుట్టుకొస్తున్న కొత్త తరహా మానసిక వైద్య విధానం, వైద్య నిపుణులు, మనుషుల ఈ జబ్బులన్నింటికీ మందులు కనిపెట్టలేని తరుణం వచ్చేసింది.
చివరకు చలంగారు చెప్పిన లోపలి స్వేచ్ఛ వేపు ఈ వైద్య విజ్ఞానమంతా ప్రయాణం మొదలుపెట్టింది. చలం ఆ లోపలి స్వేచ్ఛ కోసం తనతో తాను పోరాడాలన్నాడు. ఆ స్వేచ్ఛ వల్ల సుఖమూ, శాంతీ, ఆత్మ వైశాల్యమూ కలగాలట. ఎంతో లోతయిన మాటలు.
అవినీతిలో అశాంతి ఉంది. మనిషి ఎప్పటికైనా ఆ అశాంతి నుంచి బయటపడాలని చూస్తాడు. పడలేకపోతే రోగగ్రస్తుడవుతాడు. కాబట్టి వ్యక్తి తనకు తానే సాక్షిగా, అంటే ఆత్మసాక్షిగా తన నీతిని తానే నిర్ణయించుకున్ననాడు సమాజంలో ఇంత అవినీతి ఉండదంటాడు చలం.
కాబట్టి సర్వరోగాల విముక్తి స్వేచ్ఛగా ఆలోచించడంలో ఉందని ఆయన చెప్పిన మాటల్ని పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం ఇది.
దీన్నే మనం స్వచ్ఛంగా బతకడంగా గ్రహించవచ్చు.
దీనికి ఎలాంటి విద్య కావాలో కూడా ఆయన చెప్తాడు. ‘ప్రతి జీవికి కొంత శక్తి ఉంది. కొంతకాలం ఉంది. ఈ శక్తిని, కాలాన్ని ఆనందంలోకి మార్చుకునే తెలివితేటలు లేవు’. ఆ విధంగా మార్చుకోగల తెలివిని ఇవ్వాలి విద్య అంటున్నాడు.
కానీ మన నాగరిక సమాజం పై మాటల్లో ‘ఆనందం’ అన్నచోట ‘ధనం’ అనే పదాన్ని ఉపయోగిస్తోంది.
ధనం, ఆనందానికి ఎలా పర్యాయపదం అవుతుంది?
చలం చెప్పిన రెండో సూత్రం రసికత. ‘సౌందర్యానికి అంధులు కావడం కన్న, సౌందర్యం మామూలయిపోవడం కన్న మృత్యువు లేదు’ అంటూ సౌందర్యాన్ని జీవితాన్ని జీవింపజేసే శక్తిగా చెప్పాడు.
‘తెల్లారితే పిడకలూ, మళ్ళూ, అధికారాలు, అలుకులూ, ఇవన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, సంతోషం, ఉత్సాహం ఎప్పుడు కలుగుతుంది ఈ మానవులకి’ అని ప్రశ్నించాడు.
ప్రతి నిత్యమూ ఉదయించడం వల్ల సూర్యుడంతటి మహాద్భుతం కూడా ఈ ప్రజలకి మామూలయిపోయిందని ప్రజల అరాసిక్యతకు చింతిస్తాడు.
‘ఆవేళ’ జనం పిడకలూ, మడులూ మధ్య మునిగిపోతే, ‘ఈవేళ’ జనం పోటీ, గుర్తింపు తాపత్రయాల్లో మునిగిపోయారు.
వెన్నెలనీ, సూర్యోదయాన్నీ చూసే వ్యవధే లేదు. ఇక మనో వ్యవధి ఎక్కడ? వ్యవధి దొరికినా మనో వ్యవధి దొరకాలి. ఆ ‘మనో వ్యవధి’ అన్న పదాన్ని ఎంత లోతుగా వాడేడో చూడండి.
ఎక్కడో ఏదో మిస్ అయిపోతామేమోనన్న ఆరాటంతో తీసే పరుగుల జీవనంలో రసికత అన్న పదం ఎప్పుడో జారిపోయింది. ఆ సంగతి గ్రహించిన కొందరు ధనంతో కొనుక్కోవచ్చని భ్రమ పడుతున్నారు.
మనో వ్యవధి సంపాదించడానికి ధనం అవసరం లేదని, మళ్ళీ మనకి రాబిన్ శర్మలు చెప్పాల్సి వస్తోంది.
ఇక స్త్రీల గురించి చలం చెప్పిన స్వేచ్ఛ కేవలం లైగింకస్వేచ్ఛే అని పాఠకలోకం అపార్ధం చేసుకుంది. ఆయన చెప్పిన లైంగిక స్వేచ్ఛ కూడా స్వయం నిబద్ధత కలిగినది.అది కొందరికే అర్ధమైంది
కానీ స్త్రీ వాదులైన రచయితలు స్పష్టంగానే చెప్పారు. స్త్రీ తనను గురించి తాను ఆలోచించుకోవాలన్నారు. తమ శరీరం గురించి, మనసు, గురించి, హృదయం గురించీ చలం చెప్పిన మాటలను మరింత విస్తృతం గా చర్చించారు. శరీరఆరోగ్యానికి తొలిప్రాధాన్యత నివ్వాలని, సౌందర్యం కోసం పాటుపడవద్దనీ చెప్పారు. ఇవి తొలితరం స్త్రీవాద రచయిత్రుల మాటలు. లైంగిక స్వేఛ్చ తాలూకు స్వయం నిబద్ధత కూడా వారు సరిగానే నిర్వచించారు.
ఇక తర్వాత ప్రపంచీకరణ గాలులు వీచడం మొదలైంది. సౌందర్యం కూడా వ్యాపార వస్తువయింది. యువతులూ వారి తల్లులూ కూడా ఈ మాయలో పడ్డారు. తొలితరం రచయిత్రుల దీన్ని పసిగట్టి హెచ్చరించారు.
ఇరవైఏళ్లు గడిచాయి. బ్యూటీ కాన్షస్ కాస్తా బ్యూటీ మేనియా గా మారిపోయింది. శరీరవ్యాయామం పట్లకూడా చైతన్యం పెరగకపోలేదు కానీఈ అందం పిచ్తి ముందు దాని శాతం చాలా తక్కువ. అందంగా ఉండాలనే ఆలోచన తప్పకాదు. కానీ అది పిచ్చిగా మారి వందరకాల వెయ్యితలల వేస్తోంది.
చలం స్త్రీలకు స్వేచ్ఛ కావాలన్నది ఇందుకోసం కాదు.
చలం తన స్త్రీ పుస్తకానికి రాసిన ముందుమాట లో ఇలా రాస్తాడు.
“ఓసారి ఓ అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. ఇంట్లో తనను కష్టపెడుతున్నారనీ స్వతంత్రమార్గం చూపమనీ అడిగింది. ఇంతలో తండ్రి వెతుక్కుంటూ వచ్చాడు. తండ్రీ కూతురూ ముఖాముఖి మాటాడుకున్నారు. షరతులేమిటంటే
కుంకం బొట్టు బదులు చాగుబొట్టు పెట్చుకోనివ్వాలనీ. పాత కడియాలబదులు పాంజేబులు, చేయించాలనీ. ఆమె బానిసత్వమంతా ఈ రెండింటి కీ స్వేచ్ఛ లేకపోవడమే.” ఈ మాటలు 1952 లో రాసినవి.
అరవై ఏళ్ల తర్వాత స్వేచ్ఛ సంపాదించుకున్న స్త్రీ బ్యూటీపార్లర్ల దగ్గర బందీ ఐపోయింది. ఆమె దుస్తులు జుట్టు అలంకరణా అంతా ఆమె ఇష్టమే. మరొకరి ప్రమేయం ఉండకూడదు (అది మతం గానీ రాజ్యం గానీ) కానీ ఆస్వేచ్ఛ వెనక విజ్ఞత వివేకమూ ఉన్నాయా?, స్వేచ్ఛపేరుతో ఆమె ప్రమాదకరమైన సంకెళ్ళతో బందీ అవుతోందేమో?
అందుకే తనకాలం లోనే స్వేచ్ఛ యొక్కఅసలైన అర్ధాన్ని గ్రహించని నవీన స్త్రీ గురించి ఇలా రాశాడు.
“అత్త అధికారం నుంచీ భర్త అధీనం నుంచీతప్పించుకున్న నవీన స్త్రీ సంఘగౌరవానికీ, ఫాషన్స్ కీ బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కిందనుంచుని లోకాన్ని ధిక్కరించే ఇల్లాలు ఈనాడు సంఘ గౌరవం పేర, ఉద్యోగం పేర, ఫాషన్ పేర వెయ్యిమందికి దాస్యం చేస్తోంది.”
ఇవన్నీ ఇవాళ కూడా మరీమరీ గుర్తుచేసికోవలసిన మాటలు.
స్త్రీల హక్కులకోసం జీవితమంతా పోరాటం చేసిన చలం స్త్రీలు నిర్లక్ష్యం చేస్తున్న బాధ్యతల గురించి చింతించాడు. సంఘగౌరవం అంటే కుహనా గౌరవం అని దానికి తలవంచవద్దని ఆయన ఉద్దేశం.
ఇంకా విలువైన మాటలు ఇలా అన్నాడు. “అధికారాలనుంచి తప్పించుకున్న వాళ్లు ఆ స్వాతంత్య్రాన్ని ఇతరుల స్వతంత్రానికి అడ్డుపడి అధికారం చలాయించడానికో, లేక తమ దేహాన్ని లేటెస్ట్ ఫాషన్ ప్రకారం అలంకరించుకోడానికో తప్ప సూర్యోదయాన్ని చూసి హర్షించడానికి వినియోగించడం లేదు. ఇదివరకు అరుగు మీద కూచుని కూరలూ పచ్చళ్లూ మాట్లాడే ఇల్లాలు ఈనాడు లేటెస్ట్ సినిమా స్కాండల్స్ చర్చించడానికీ, తమ మిత్రులశీలాన్ని పరీక్షించడానికీ సంభాషిస్తున్నారు. “
ఈ చలంగారి మాటలు ఇవాళ మళ్లీ గుర్తుచేసికోవలసిన అవసరం ఉంది.
ఇవాళ చాలా రంగాల్లో కొందరు స్త్రీలు పరిణతి చెందినప్పటికీ చాలా మందికి స్వేచ్ఛ విలువ తెలియడం లేదు. విద్యలు డబ్బు సంపాదించడం లోని మెళకువలే తప్ప వ్యక్తిత్వనిర్మాణ రీతులు నేర్పడం లేదు.
స్త్రీలు స్వేచ్ఛ విలువ తెలుసుకునే లోపే ప్రపంచీకరణ విస్తరించిన వేల చేతులతో మానవతావిలువలను విధ్వంసం చేసేస్తోంది. ఈ పొగకి స్త్రీపురుషులిద్దరూ సమానంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అన్ని విలువలూ మాసిపోతున్నాయి.స్త్రీలకు బయటి ప్రపంచం లో భద్రత కరువైపోతోంది.
ఇప్పడు వేల కంఠాలతో అసలైన స్వేచ్ఛ గురించి మాటాడవలసి ఉంది. సింపుల్ గా బతకడం లో ఉన్న ఆనందాన్ని గురించి చెప్పవలసిఉంది. ఇవన్నీ చలం చెప్పేడు.
రాచమల్ల రామచంద్రారెడ్డి చలంగురించి చెప్తూ చలం చేసినపని అసత్యాలను ఖండిచడం అన్నాడు. అందువల్ల చలం ఈ అసత్యాల సమాజానికి ఎప్పటికీ అవసరమే
అందుకే మళ్ళీ ఒకసారి చలంగారి ఊహలు, ఆలోచనలు కలగలిసిన మ్యూజింగ్స్ గుర్తు చేసుకుందాం. ఒకటికి పదిసార్లు మననం చేసుకుందాం. స్వచ్ఛంగా, సుందరంగా జీవిద్దాం.
మీరు,రాసింది, నూటికి, నూరు పాళ్ళు నిజం, మేడం!చలంగారు, గురించి మీరు రాసిన,వ్యాసం, నాకుబాగా నచ్చింది, ధన్యవాదాలు మేడం💐👌!
చాలా చక్కటి వ్యాసం మేడం ,అవసరమయిన వ్యాసం అయిన వందేళ్ళు ముందుగా ఉన్నారు.
చాలా బాగున్నది మేడం…
మల్లె పూలన్నిటినీ ఒకచోట పోసినట్లు ఉందిమీ వ్యాసం.. హృదయాన్ని refresh చేస్తోంది.మీరు చెప్పినట్లు చలంగారి మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండాలి మననం చేసుకుంటూ ఉండాలి జడివానలా లోపల పేరుకున్న మురికినంతనీ కడిగి పారేస్తాయి..మనోవికాసం హృదయం నైర్మల్యం అవసరమున్నన్నాళ్ళు చలంగారి అవసరం ఉంటూనే ఉంటుంది కాకపోతే మీలా…మీరే విడమర్చి చెప్తూ ఉండాలి ..