చండ్ర నిప్పుల పాట… ఎర్ర ఉపాళి

అతడో అగ్గి బరాట. పల్లె పాటల ఊట. ప్రజా పోరు పాట. జనం పాటల ప్రభంజనం. ధిక్కార గీతం. వెలివాడల పుట్టిన వెలుగురేఖ. కూటికి లేకున్నా నియతి తప్పని నిఖార్సయిన మట్టి మనిషి. ఆకలి మంటలంటే ఏందో చిన్ననాడే తెలిసింది. బతుకే ఓ పోరాటమని అర్థం చేసుకున్నడు. ఆటలాడే వయసులోనే పశువులతో సోపతయింది. అడ్డెడు ఒడ్లకు జీతమున్నడు. పాటలే ప్రపంచంగా బతికిండు. ఆత్మగౌరవం కోసం చివరిదాకా తపించిండు. బతుకును మార్చే పోరు దారిలో పాటనే ఆయుధంగా చేసుకున్నడు. రాత్రి బడిలో నేర్చుకున్న అక్షరాలే పల్లె పల్లెనా పాటల ప్రవాహమైనయ్. గుండె గాయాల గోసను కైగట్టి పాడిండు. లందల్ల ఉదయించే నిప్పుల పాట అతడు. అతడే ఎర్ర ఉపాళి. బుద్ధుని శిష్యడు ఉపాళి. మనుషులంతా సమానమేనన్న భావనతో తన పేరును ఉపాళిగా మార్చుకున్నడు. అంతరాల్లేని సమాజం కోసం కలలుగన్నడు ఉపాళి.

ఆ పాట… పూర్వపు నల్లగొండ జిల్లా ఆలేరు మండలం రాఘవాపురంలో ఉదయించింది. తల్లిదండ్రులు ఎర్ర సుక్కమ్మ, సిద్ధయ్య. ఉపాళి అసలు పేరు ఉప్పలయ్య. పుట్టిన ఊరిలో చిందు బాగోతాల పాటలు అతనిలో లయను నింపినయి. అల్లిక నేర్పినయి. రాత్రిపూట చూసిన బాగోతాల బాణీలకు పాటలల్లుకుని పరవశించేటోడు. మొఖానికి బూడిద పూసుకొని, తుమ్మకాయల గజ్జెలు కట్టుకొని దోస్తులతో చిందేసేది. తన తల్లితో కలసి కూలి పనికిపోయినపుడు అంతరంగంలో పాటల ఊటేదో ఊరింది. నాట్లేసే కాడ, కోత కోసే కాడ కూలి తల్లుల పాటలు విని తను కూడా పాటలల్లాలని కలలుగన్నడు. పల్లె తల్లుల పదాలనే పాటలల్లుకున్నడు. ఒకరోజు ఆ ఊరి ప్రధానోపాధ్యాయుడు పోతుగంటి నర్సింహారెడ్డి అతని పాటల్ని విన్నడు. చదువేమీ లేకుండానే ఇంత అద్భుతంగా కైగడుతున్నడని ఆశ్చర్యపోయిండు. రాత్రిపూట అక్షరాలు నేర్పిండు. ఆ అక్షరాలే ఉపాళి గొంతులో జలపాతమైంది. ప్రవాహమైంది. రాత్రి బడిలో పెద్ద బాలశిక్ష చదివిండు. బుడ్డెడు ఒడ్లకు జీతముండి, దొద్దెడు ఎడ్లకు సోపతయిన గుండె గోసల్ని కైగట్టి పాడిండు. ఆకలి, అవమానాలను కన్నీటి పాటలుగా మీటిండు. ఎన్ని కష్టాలెదురైనా పాటను వదల్లేదు.

పేదరికం నా ఇంటి పునాదులు
దరిద్రం నా ఇంటి అలంకరణలు
దౌర్భాగ్యం నా ఇంటి సౌభాగ్యాలు
కష్టాలు కన్నీళ్లు నాకున్న సిరి సంపదలు
కష్టాల కడలి సామ్రాజ్యానికి నేను సామ్రాట్టును
కళతో భవిష్యత్ కు వారధి నిర్మించుకున్న మహారాజుని
ఈ లోకానికి సేవచేసే కులంలో పుట్టినోన్ని
కటిక పేదనైనా కాకి బలగం గలిగినవాణ్ని
పల్లవులతో ప్రాణం నిలుపుకుంటున్నోన్ని
బతుకు పాటనై దరువేస్తున్నవాణ్ని
కూలిటి లేక తిప్పలేగాని
నా గుణం సక్కని జన బలమున్నంక నాకేం తక్కువ? నాకేం తక్కువ?…. అంటూ గుండె గుండెనూ తడిమిండు ఉపాలి. కులాల పుట్టుపూర్వోత్తరాల్ని అధ్యయనం చేసిండు. చరిత్ర చదువుకున్నడు. దోపిడీని అర్ధం చేసుకున్నడు. మనుషులంతా సమానమయ్యే రోజు కోసం కలలెన్నో కన్నడు. విముక్తి దారి కోసం ఎన్నెన్నో అన్వేషణలు.

మాదిగ దండోరా ఉద్యమానికి తన పాటలతో ఊపిరిలూదిండు ఉపాళి. తెలంగాణ ధూం ధాంలో పల్లె పల్లెనూ పలకరించిండు. తాను పుట్టిన రాఘవాపురం నుంచి తెలంగాణ అంతటా ఉపాలి పాట వినని పల్లె లేదు. అతని అడుగు తాకని నేల లేదు. ఈ నెల 10న తీవ్ర అనారోగ్యంతో ఊపిరొదిలిండు. అతడిప్పుడు లేకున్నా అతడు రాజేసిన నిప్పుల పాట అవని అంతటా రాజుకుంటది. లందల్ల నుంచి తొలి పొద్దయి ఎదురొచ్చే పాట ఎర్ర ఉపాళి.

ఎర్ర ఉపాళి కవిత

నేను… నేనే… నిజాన్ని
మాదిగ యిజాన్ని
నిశబ్దాల అవనిలోన
శబ్దం పుట్టించినోన్ని
శతాబ్దాలుగా శ్రమకు
శ్రీకారం చుట్టినోన్ని
జంబూద్వీపమేలి కీర్తిని
అంబరాన చాటినోన్ని

మాదిగోన్ని మహా ఆదివాన్ని
ఆదిగోన్ని మహా ఆదివాన్ని
ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని

అవమానాల నుండి
ఎన్నో అగ్ని గుండాలను దిగమింగుతున్నోన్ని
ఆది అంతం నేనే అన్నా
సృష్టికి మహాది మూలపురుషుడు
అది జాంబవుని వారసత్వాన్ని

నేనే… నేను నేనే…
పంచభూతాల ప్రాణదీపాన్ని
నవనాడుల నాభీ కేంద్రాన్ని
ప్రకృతి విరబూసిన పరిమళాన్ని
ఎట్టి మనుషుల మట్టిరూపాన్ని

వస్తున్నా వస్తున్నా
సుడిగాలినై లేస్తున్నా
సునామీలా ఈ వ్యవస్థను చుట్టుముడుతా
బ్రాహ్మణ మనువాదాన్ని
ఈ మట్టిలోనే పాతర పెడతా

చెప్పు నిజమని నిజమే చెప్పు
చరిత్రను తిరగరాసిందే చెప్పు
చరిత్రను తిరగరాసేదే చెప్పు
నిజమని నిజమే చెప్పు

మది మదిలో మమత నింపి
ఎదవీణలు మీటినోన్ని
పదపదముల పల్లవించి
జనపదంగ మారినోన్ని
చీకటి గర్భాల చీల్చి
చిరుదివ్వై వెలిగినోన్ని

మాదిగోన్ని మహా ఆదివాన్ని
ఆదిలోన ఈదేశాన్నేలినోన్ని
ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని

చచ్చిన జంతువు నుండి
చర్మాన్ని ఒలిసినోన్ని
ఒలిసిన చర్మం నుండి
నాదం పలికించినోన్ని
చిరునామా ఏదంటే
కాళ్ళ చెప్పు చూపినోన్ని

మాదిగోన్ని మహా ఆదివాన్ని
ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని

ఇంటింట ప్రతి మనిషి
మైల బట్టలుతికెటోన్ని
పెరిగే నెత్తీ సవరం
గడ్డాలు చేసేటోన్ని
గొర్లు మేకలను పెంచి
గొంగళ్లను నేసినోన్ని

ఆదిగోన్ని మహా ఆదివాన్ని
ఆదిలోన ఈ దేశానేలినోన్ని

మోట బొక్కెన తొండమై
పంటకు ప్రాణం పోసెటోన్ని
ఉత్పత్తి సాధనలో
అడుగడుగున సాగినోన్ని
సకల వృత్తిపనివారికి
సారధినై నడిచినోన్ని

మాదిగోన్ని మహా ఆదివాన్ని
ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని

సాంస్కృతిక రంగానికి
సాగుతున్న ఉద్యమాన్ని
మరుగుపడ్డ మా జనాచరిత్ర
తిరగరాసెటోన్ని

ఎవడన్నా ఏమన్నా
నన్నెవరేమనుకున్నా
ఇరుగుపొరుగు నా వారేనని
ఇష్టపడే మనిషిని

ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని
ఆదిలోన ఈ దేశాన్నేలినోన్ని

మళ్ళీ మా రోజులే
మళ్ళీ మా రోజులే
వస్తాయని నమ్మెటోన్ని
వస్తాయని నమ్మెటోన్ని

One thought on “చండ్ర నిప్పుల పాట… ఎర్ర ఉపాళి

Leave a Reply