‘జైలు అంటే ప్రాధమికంగా స్థలాన్ని కుదించి, కాలాన్ని పొడిగించడం. జైలులో బందీలైన వాళ్లకి ఈ రెండు విషయాలూ అనుభవంలోకి వస్తాయి. విశ్వాంతరాళంలో మనిషి స్థితిని ప్రతిబింబించే ఈ సంబంధం.. సాహిత్య సృజనకు తోడ్పడే మంత్రసానియైంది. జైలు మన నైరూప్య భావాలని తొలగించదు. అందుకు భిన్నంగా ఆ నైరూప్య భావాల ఆచ్చాదనలని తొలగించి స్పష్టంగా వ్యక్తీకరిస్తుంది. జైలు అంటే, మన అధిభౌతిక భావాలనీ, నైతిక, చారిత్రిక అవగాహనలనీ, ఇంకా అనేక అంశాలనీ మన నైతిక ప్రవర్తనా సరళిలోకి సంగ్రహ రూపంలో అనువదించుకోవడమే.’
– జోసెఫ్ బ్రాడ్స్కీ
గ్వాంటానమో బే ప్రాంతంలోని నౌకా స్థావరంలో ఒక సైనిక నిర్బంధ శిబిరాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 9, 2001 దాడి తర్వాత అధ్యక్షుడు జార్జ్ బుష్ టెర్రరిజంపై యుద్ధం పేరిట తీసుకున్న చర్యలలో ఇదొకటి. ఎటువంటి నేరారోపణలు, విచారణ లేకుండా ఖైదీలని నిరవధికంగా నిర్బంధించడం, ఖైదీలని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేయడం వంటి పద్ధతులకు గ్వాంటానమో కారాగారం పేరుపొందింది. అనుమానితుల పేరిట దేశదేశాల నుంచి ఖైదీలని అక్కడికి అక్రమంగా తరలించి, హింసించారు. 779 మందిని అక్కడ నిర్బంధించారు. 9 మంది అక్కడ నిర్బంధంలోనే చనిపోయారు. జనవరి 2002లో కారాగారంలోకి ఖైదీలని తరలించిన తర్వాత కనీసం 41 ఆత్మహత్యా ప్రయత్నాలు జరిగేయని అధికారులు అంగీకరించారు. ఖైదీల తరపున వాదించే న్యాయవాదుల కధనం ప్రకారం ఆ సంఖ్య అంతకుమించే ఉంటుంది.
ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, యెమెన్, పాకిస్తాన్, అల్జీరియా దేశస్తులతో సహా 50 జాతులకు చెందిన ‘అనుమానితులని’ అక్కడ నిర్బంధించారు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం లో వీళ్ళని కహీదీలుగా పట్టుకున్నామని అమెరికా ప్రభుత్వం చెబుతున్నా, ఇందులో 80 సాతంకి పైగా ఖైదీలని అమెరికన్ సైన్యం బంధించలేదనీ, అమెరికా ప్రభుత్వం ప్రకటించిన బహుమతులకి ఆశపడిన కొందరు వాళ్ళని పట్టుకుని సైన్యానికి అప్పగించారని నివేదికలు తెలియజేస్తున్నాయి. అల్ ఖైదా సంస్థతో నిజమైన సంబంధాలు ఉన్న వాళ్ళు ఇందులో రెండు డజన్లకి మించరని న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూన్ 2004లో పేర్కొన్నది. ఖైదీలుగా నిర్బంధించిన వారిలో దాదాపు 17-22 మంది 18 ఏళ్ళ లోపు పిల్లలు.
అమెరికా రాజకీయ పాత్రికేయుడు మైఖేల్ రాట్నర్ మాటలలో చెప్పాలంటే,
మన సమాజంలో అస్తవ్యస్తమైన పరిస్థితులకి గ్వాంటానమో ఒక ప్రతీక. వివిధ ప్రపంచ దేశాలనుండి ఎత్తుకొచ్చిన పురుషులు, పిల్లలని నిర్బంధించి ఉంచిన క్రూరమైన కారాగృహాల సమాహారమే గ్వాంటానమో. ఇందులో చాలామంది ఎలాంటి నేరమూ చేయలేదనీ, అమెరికా సమాజపు భద్రతకు వీళ్ళనుండి ఎలాంటి ముప్పు లేదనీ మేం భావిస్తున్నాం. అమెరికా ప్రభుత్వం వీళ్ళని ఊహకి అందనంత అమానవీయమైన పరిస్థితులలో నిర్బంధించి, నిరంతర నేర విచారణ అమలుజరుపుతున్నది. వీళ్ళపైన ఎలాటి నేరారోపణలు లేవు, న్యాయవాదుల సహాయం లేదు, ఎటువంటి న్యాయ విచారణ హక్కులూ లేవు, ఎప్పుడు విడుదలవుతారో తెలియదు. అసలు విడుదలౌతారో లేదో కూడా తెలియదు…
సాధారణ అమెరికన్లు కారాగారం అని ఊహించే దానికి గ్వాంటానమో ఏంటో భిన్నమైనది. అది 21 వ శతాబ్దపు పెంటగాన్ ప్రయోగం. వాస్తవంలో 1949 జెనీవా ఒడంబడిక ఇలాంటివాటిని నిషేధించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్లు అమలుజరిపిన విధానాలను పోలిఉన్న ప్రయోగం. అందుకే వాటిని జెనీవా ఒప్పందంలో నిషేధించారు. అది ఒక నిర్బంధ విచారణా శిబిరం (ఇంటరాగేషన్ క్యాంప్). అలాంటి నిర్బంధ విచారణా శిబిరాల ఏర్పాటు చట్ట వ్యతిరేకమైనది.’ (గ్వాంటానమో, వాట్ ది వరల్డ్ షుడ్ నో పుస్తకం, 2004 నుండి).
అమెరికాలోనూ, ప్రపంచ వ్యాపితంగా వచ్చిన నిరసన నేపథ్యంలో వీరిలో ఎక్కువమందిని వారివారి దేశాలకు పంపించారు. అయితే ఇప్పటికీ అక్కడ 40మంది నిర్బంధంలోనే ఉన్నారు.
గ్వాంటానమో ఖైదీల నిర్బంధంపై 2006 లో ది రోడ్ టు గ్వాంటానమో డాక్యుమెంటరీ చిత్రం విడుదలైంది. ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్ లో చూడవచ్చు. ఖైదీలలో ఒకరైన సామి అల్ హజ్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన ప్రిజనర్ 345 డాక్యుమెంటరీని కూడా యూట్యూబ్ లో చూడవచ్చు. ఆఫ్రికాలోని మారిటానియా దేశస్తుడు మహ్మద్ అల్ సలాహి 2002 నుంచి 2016 వరకు 14 సంవత్సరాలపాటు బందీగా ఉన్నాడు. తన జ్ఞాపకాలతో రాసిన గ్వాంటానమో డైరీ ఆధారంగా తీసిన సినిమా ది మారిటానియన్ ఈ ఏడాదే విడుడలయ్యింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో వుంది.
శిక్షా స్మృతీ, నేర విచారణా, శిక్షలని అమలు జరిపే పద్ధతులూ ఒక రకంగా మానవ నాగరికత అభివృద్ధికి అద్దం పడతాయి. ఆస్తి సంబంధాలు, మతం, సంస్కృతీ, రాజకీయాలు, ఇతర సామాజిక అంశాల ముద్రని, ఆధిపత్య వ్యవస్థని వీటిలో స్పష్టంగా గమనించవచ్చు. ఎటువంటి నేరారోపణలు లేకుండా సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచి శారీరకంగా, మానసికంగా హింసించి, ఆరోపణలకు గురైన వ్యక్తులకు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే కనీస హక్కులని సంపూర్ణంగా నిరాకరించే విధానాలు వర్తమాన పరిస్థితుల తిరోగమనానికి నిదర్శనాలు. అయితే, ఒంటరి చీకటి కొట్లనీ, నిర్బంధ కారాగారాల హింసకి ప్రతిఘటనని మనం దేశదేశాల చరిత్ర పొడవునా చూడవచ్చు. జులై 14, 1789 న బాస్టిల్ జైలుని బద్దలుగొట్టడం ఫ్రెంచి విప్లవంలో ఒక ఉజ్వల ఘట్టం. బాస్టిల్ జైలుని ఆ తర్వాత కూల్చేశారు. స్వేచ్ఛకి సంకేతంగా బాస్టిల్ జైలు తాళంచెవిని ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కి బహుకరించారు. ఇప్పటికీ మౌంట్ వెర్నన్ లో దాన్ని ప్రదర్శిస్తారు. గ్వాంటానమో కారాగారం ఆ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనది.
ముందే చెప్పుకున్నట్లు, జైలు నిర్బంధం అంటే కదలికల్ని కట్టివేసి, కదిలే, నడిచే స్థలాన్ని కుంచించి, దుర్భరమైన కాలాన్ని మరింత పొడిగించడమే. అయితే, చరిత్ర పొడవునా మనుషులు దీన్ని ధిక్కరించారు. ఈ ధిక్కారానికి మానవ సృజన ఆలంబనగా నిలబడింది. ఆ సృజనలో భాగమే గ్వాంటానమో బందీల కవితలు.
అమానవీయమైన గ్వాంటానమో నిర్బంధ శిబిరంలో కొందరు ఖైదీలు తమని తాము నిలబెట్టుకోవడానికి ఎంచుకున్న సాధనం కవిత్వం. ఇందులో అత్యధిక భాగం కవులు, రచయితలు కారు. సాహిత్య వాస్తు, శిల్పాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు కాదు. ఊపిరి చుట్టూ ఉరితాడై అల్లుకున్న నిరాశామయ పరిస్థితులలో, దుర్భరమైన చిత్రహింసలు, అవమానాలమధ్య తమని తాము మనుషులుగా ప్రకటించుకున్న నిట్టూర్పులే ఈ కవిత్వం. ఖైదీల కవితలలో కొన్ని 2007 లో పొయెమ్స్ ఫ్రమ్ గ్వాంటానమో, ది డిటెయినీస్ స్పీక్ పేరుతో పుస్తకంగా వచ్చేయి. అందులోనుండి నలుగురి కవితలని ఇక చదవండి.
కడలి గీతం
-ఇబ్రహీం అల్ రుబాయిష్
సముద్రమా, మా వాళ్ళు అందరూ క్షేమంగానే ఉన్నారా?
విశ్వాస హీనుల సంకెళ్ళే లేకుంటే ఈదుకుంటూ
మావాళ్ళని చేరుకునే వాడిని, చేరలేకుంటే నీ అలల కౌగిలిలో కన్ను మూసేవాడిని
విషాదం, నిర్బంధం, వేదన, అన్యాయం పరుచుకున్న సముద్రతీరాలు
సహనాన్ని పరీక్షించే నీ విద్వేషం
మృత్యువుని తలపించే నీ స్మశాన ప్రశాంతత,
వింత గొలిపే అలల తుళ్ళింత
వెన్నుపోటు విద్రోహం పొంచివుండే నిశ్శబ్దం
నావికుల్ని బలితీసుకునే నీ నిశ్చలత్వం
దిక్సూచిని మింగేసే కెరటాలు
మంద గంభీరంగా, మౌనంగా, అలక్ష్యంగా, అంతలోనే క్రోధంతో యెగసి పడే నీ అలలు
సముద్రమా నువ్వు సమాధులని మోసే నిలువెత్తు స్మశానానివి
సుడిగాలి రెచ్చగొడితే వుప్పొంగే అలలు
గాలి అణచివేస్తే కదలని నీ కెరటాలు
సముద్రమా మా సంకెళ్ళు నిన్ను బాధిస్తాయా?
విధిలేకనే మేము రోజూ వస్తూపోతూ వుంటాం
మా నేరమేమిటో నీకు తెలుసా?
మమ్మల్ని చుట్టుముట్టిన యీ విషాదం నీకు అర్ధమౌతుందా?
సముద్రమా, బందీలుగా వున్న మమ్మల్ని కవ్విస్తావు
శత్రువుతో కుమ్మక్కై కాపలా కాస్తావు
జరుగుతున్న నేరాల్ని బండరాళ్ళు తెలపవా?
ఓటమి కథల్ని క్యూబా చెప్పడంలేదా?
మా పక్కనే వున్న మూడేళ్ళలో నువ్వు సంపాదించిందేమిటి?
సముద్రపై తేలియాడే కవిత్వం పడవలు, మండేగుండెల లోలోపల రగిలే జ్వాలలు
కవి అక్షరాలే మా శక్తి
కవిత్వమే మా బాధాతప్త హృదయాలకి సాంత్వన
(ఇబ్రహీం అల్ రుబాయిష్ పాకిస్తాన్ లో వుపాధ్యాయుడిగా పనిచేసేవాడు. కిరాయి మూకలు తనని పట్టుకుని మిత్రదేశాల సైనికులకి అప్పగించేయి. ఇతరులని ద్వేషించడం రుబాయిష్ కి యిష్టముండదు. నిర్బంధించే నాటికి తనకి మూడు నెలల పాప. విడుదలయ్యేనాటికి ఆ పాపకి ఐదేళ్లు. ‘నీవల్ల ప్రమాదం వుందని మేము భావించేంతకాలం నువ్వు నిర్బంధంలోనే వుండాల్సివుంటుంది. ప్రమాదం లేదనుకుంటే విడుదల చేస్తాం. నిన్ను యెందుకు విడుదల చేయాలో చెప్పమ’ని సైనికాధికారులు విచారణలో అడిగారు. ఆ ప్రశ్నకి రుబాయిష్ జవాబు యిదీ – ‘అంతర్జాతీయ న్యాయస్థానాల్లో నేరం ఋజువయ్యేదాక యెవరినైనా నిరపరాధిగా పరిగణిస్తారు. మీ దగ్గర మాత్రమే నిరపరాధిగా ఋజువయ్యేదాక మమ్మల్ని నేరస్తులుగా యెందుకు చూస్తున్నారు?’ 2001లో గ్వాంటానమో జైలు నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత డిసెంబరు 2006 లో తనని సౌదీ అరేబియాకు తరలించారు. ఆ తర్వాత అక్కడ నిర్బంధం నుంచి తప్పించుకున్నాడని, ఏప్రిల్ 2015 లో యెమెన్ దేశంలో అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయాడని ప్రకటించారు. ఈ ‘కడలి గీతం’ కవితకి గుర్తింపు వచ్చింది. అమెరికా యూనివర్సిటీ ఆఫ్ అయోవా లో పాఠ్యాంశంగా చేర్చారు. 2013లో కేరళ కాలికట్ యూనివర్సిటీ బిఏ విద్యార్ధులకి ఈ కవితని పాఠ్యాంశంగా చేర్చి, టెర్రరిస్టు అనే మిషతో తొలగించారు.)
మా నాన్నకి
-అబ్దుల్లా థని ఫారిస్ అనాజీ
దూరదేశపు కారాగారంలో రెండేళ్ళు
కళ్ళకి సుర్మా దిద్దుకొని రెండేళ్ళు
లేలేత వూదా రంగు ప్రత్తి మొలకలని
గొర్రెపిల్లలు కడుపారా మేసే పొలాల మధ్య
నివసించే మా కుటుంబ సభ్యులకి
మనసు సందేశాలు పంపుతూ దొర్లిపోయిన రెండేళ్ళు
ఫ్లైజ్, నేనెలా బతికే వాడినో
మన యింటికి వచ్చేవాళ్ళకి చెప్పు
బాధతో ఘూర్ణిల్లే నా హృదయపు గొంతుక వింటే
నీ వూహలెలా సుడులు తిరుగుతాయో నాకు తెలుసు
బుమైర్ కి శాంతి శుభాకాంక్షలు తెలియజేయి
నా తండ్రి బుమైర్ నుదుటిపై ముద్దు పెట్టుకో
పొత్తిళ్ళలో పసికందుకి దూరమైన తండ్రిలా
విధి మమ్ముల్ని విడదీసింది
నాన్నా యిది వొక అన్యాయపు బందిఖానా
కరగని కొండలని సైతం జాలితో కన్నీరు పెట్టించే అన్యాయాలు
నేను యే నేరమూ యెరగను, యే పొరపాటూ చేయలేదు
వంపులు తిరిగిన వాడి పంజాలు వుండే నన్ను
గొర్రెని అమ్మినట్టు అమ్మేశారు
సత్యం తప్పితే నాకెవ్వరూ తోడులేరు
తప్పు వొప్పుకోమని చెబుతున్నారు వాళ్ళు, నేను మాత్రం యే తప్పూ చేయలేదు
నేను చేసిందంతా నిజాయితీగా చేసిందే, దేనికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు
ఈ బోనులోనుంచి బయటపడి సుఖంగా బతకడానికి
నిజాయితీని వదులుకోమని ప్రలోభపెట్టారు
దేవుడి మీద వొట్టు, నన్ను సంకెళ్ళలో బంధించినా
అరబ్బులందరూ తమ విశ్వాసాన్ని అమ్ముకున్నా, నేను మాత్రం అమ్ముడుపోను
నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయిన రోజున తెలియడంకోసం
నేను రాస్తున్న మాటలివి
దేవుడా, సృష్టిని నడిపించి కొనసాగించే వాడా
అఖండ, స్వయం శక్తి సంపన్నుడా
ఆనంద దాయకా
ఆరాధ్య దైవమా
వేదనతో కుమిలే హృదయానికి వూరటనివ్వు
బందిఖానా సంకెళ్ళనుంచి బంధ ముక్తుడిని చేయి
(ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సహాయ కార్యకర్తగా పనిచేస్తున్న అబ్దుల్లా థాని ఫారిస్ అనాజీ అమెరికా బాంబు దాడిలో తన రెండు కాళ్ళనీ కోల్పోయాడు. మొదట వొక కాలు తొలగించాక మంచంలో కోలుకుంటూవున్న సమయంలో తనని పట్టుకుని అమెరికన్ బలగాలకి అప్పగించారు. అమెరికా బలగాల అధీనంలో వుండగా రెండో కాలునీ తీసేశారు. 2002 నుంచి తాను గ్వాంటానమో జైలులో బందీగా వున్నాడు. తనకి సరియైన వైద్య సదుపాయం అందలేదు.అప్పుడప్పుడు వొక టేపుతో అంటించిన కృత్రిమ కాళ్ళ సహాయంతో నడవాలని బలవంత పెట్టారు. అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ నవంబరు 2008 లో విడుదల చేసిన జాబితా ప్రకారం తనని సెప్టెంబరు 2007 లో స్వదేశమైన సౌదీ అరేబియాకు పంపించివేశారు.)
సంకెళ్లు వేసిన అవమానం
-సామి అల్ హజ్
చెట్ల కొమ్మల్లో పావురాలు కువకువలాడుతుంటే
చెక్కిళ్ళపై జాలువారే కన్నీళ్లు
గోరువంక పాటలమధ్య
కన్నకొడుక్కి పంపే సందేశం
మహ్మద్, నేనిప్పుడు బందీని, బాధితుణ్ణి
అల్లాహ్ తప్ప కష్టాల్లో నాకెవ్వరూ తోడులేరు
ప్రపంచాన్ని యధేచ్చగా శాసించే నేతలు
నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు
నాదేసస్తులపై నేను గూఢచారిగా పనిచేయలట
అది మంచి పనేనట
డబ్బులూ, భూమీ యిస్తారట
ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛనిస్తారట
ప్రలోభాల మెరుపులతో
మిరుమిట్లు గొలిపే ఆకాశం
అయితే వాళ్ళ బహుమతి
కోరల్లో విషం నిండిన దుష్ట సర్పం
స్వేచ్ఛకీ, భావ ప్రకటనకీ
వాళ్ళు విగ్రహాలనీ, భవంతులనీ కట్టేశారు, మంచిదే
అయితే న్యాయం అంటే
భవంతులూ, కట్టడాలూ కాదని నేను చెప్పేశాను
ఓ అమెరికా దేశమా
నువ్వు అనాధల మూపుల మీద స్వారీ చేస్తున్నావు
అనుక్షణం వాళ్ళని భయపెడుతున్నావు
బుష్, జాగ్రత్త
నువ్వు అహంకారం మూర్తీభవించిన అబద్ధాలకోరువని
అందరూ గుర్తించారు
నా కష్టాలూ, బాధలూ అల్లాహ్ కే అంకితం
ఇంటి మీద బెంగతో, బాధలతో వేగిపోతున్నాను
మహ్మద్, నన్ను మర్చిపోవద్దు
భగవంతుడికి కట్టుబడిన మీ నాన్న ఆశయాలని సమర్ధించు
నన్ను సంకెళ్ళతో బంధించి, అవమానించారు
ఇంకా నేను గీతాలు యెలా రాయగలను?
సంకెళ్ళ మధ్య, ముసిరిన చీకట్ల మధ్య
కన్నీళ్ళ మధ్య
కవిత్వమెలా రాయగలను?
వేదనతో కనలి
ఆవేశంతో యెగసి పడే
సముద్రం నా హృదయం
నేనిప్పుడు బందీని
నేరాలు మాత్రం నన్ను బంధించిన వాళ్ళవే
భయం నన్ను శాసిస్తోంది
భగవంతుడా, నాకొడుకు మహ్మద్ ని చూపించు
భగవంతుడా, న్యాయాన్నే గెలిపించు
(సామి అల్ హజ్ సూడాన్ దేశపు జర్నలిస్టు. 2001 లో అల్ జజీరా టివి కోసం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కవర్ చేస్తుండగా పట్టుకుని అరెస్టు చేసి తన పాస్ పోర్టునీ, విలేఖరి కార్డునీ గుంజుకున్నారు. 2002 జనవరిలో అమెరికా సైన్యానికి అప్పగించారు. బగ్రంవిమాన స్థావరం లోను, కాందహార్ లోనూ హింసించి, జూన్ నెలలో గ్వాంటానమో జైలుకి తరలించారు. చెచెన్ తిరుగుబాటుదారులకి డబ్బు అందజేసే కొరియర్ గానూ, అల్ ఖైదా తీవ్రవాదుల మద్దతుదారుగానూ పనిచేస్తున్నాడని అమెరికా సైన్యం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలకి యెలాంటి ఆధారాలనీ చూపించలేదు. మే 2008 లో తనని స్వదేశమైన సూడాన్ కి పంపించివేశారు. ప్రస్తుతం మళ్ళీ అల్ జజీరా వార్తా సంస్థలో పనిచేస్తున్నాడు. మే 2008 లో తనని స్వదేశమైన సూడాన్ కి పంపించివేశారు. ప్రస్తుతం మళ్ళీ అల్ జజీరా వార్తా సంస్థలో పనిచేస్తున్నాడు. విడుదలైన తర్వాత ఖైదీ 345 (ప్రిజనర్ 345) అనే పుస్తకం రాసాడు. అదే పేరుతో, తన గురించి ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు.)
ఔనా నిజమేనా?
-ఒసామా అబూ కబీర్
వాన వెలిశాక పచ్చిక మళ్ళీ మొలకెత్తడం నిజమేనా?
వసంత ఋతు ఆగమనంతో పూలు విరబూయడం నిజమేనా?
వలస పోయిన పక్షులు తిరిగి గూటికి చేరడం నిజమేనా?
సాలమన్ చేపలు నదీ ప్రవాహంలో తిరిగి యీదులాడడం నిజమేనా?
నిజమే, యివన్నీ నిజాలే. ఇవన్నీ అద్భుతాలు.
అయితే గ్వాంటానమో బె జైలు నుంచి యేదో వొక రోజు మేము విడుదలవడం కూడా నిజమేనా?
ఏదో వొక రోజు మేము ఇంటికి చేరడం నిజమేనా?
నేను కలల్లో తేలుతున్నాను. ఇంటిగురించి కలగంటున్నాను.
రక్తం పంచుకున్న పిల్లలతో,
భార్యతో, నన్ను ప్రేమించే వాళ్ళతో
సుతిమెత్తని మనసున్న నా తల్లిదండ్రులతో
కలిసుండాలని, యీ పంజరంలోంచి బయట పడాలని కలలుగంటున్నాను
న్యాయమూర్తీ, మీకిది అసలు వినబడుతోందా?
మేము అమాయకులం, యే నేరమూ చేయకనే యిక్కడ బందిఖానాలో మగ్గుతున్నాం
విడుదల చేయండి, మమ్మల్ని విడుదల చేయండి
న్యాయం, జాలి లోకంలో యెక్కడన్నా మిగిలి వుంటే మమ్మల్ని విడదల చేయండి
(ఒసామా అబూ కబీర్ జోర్డాన్ దేశస్తుడు. అమ్మాన్ నగర మునిపాలిటీలో నీళ్ళ ట్యాంకు డ్రైవరు. ఇస్లామిక్ మాట ప్రచార సంస్థ జమాత్ అల్ తబ్లిఘి తరపున ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేస్తుండగా, తాలిబన్ వ్యతిరేక బలగాలు పట్టుకుని అమెరికన్ సైన్యానికి అప్పగించేయి. తన చేతికి వున్న కాసియో గడియారాన్ని నిర్బంధానికి వొక కారణంగా చూపుతున్నారు. అల్ ఖైదా వాళ్లకి యీ గడియారాలు యిష్టమట. ఎందుకంటే యివి బాంబులు పేల్చడానికి అనువుగా వుంటాయట. ఈ సాకుతో కబీర్ గ్వాంటానమో జైలులో వున్నాడు. నవంబరు 2007లో తనని స్వదేశమైన జోర్దాన్ కి పంపించి ఆ తర్వాత విడుదల చేశారు.)
గ్వాంటానమో కవితలు
-మార్క్ ఫాల్కోఫ్
అనువాదం: సుధా కిరణ్
(మార్క్ ఫాల్కొఫ్ నార్తరన్ ఇలినాయ్ యూనివర్సిటీ లా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్. 17 మంది గ్వాంటానమో ఖైదీల తరపున న్యాయవాదిగా పనిచేస్తున్నారు)
2004 సంవత్సరాంతంలో అద్నాన్ ఫర్హాన్ అబ్దుల్ లతీఫ్ తరపున నేను వొక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసాను. ఫిర్యాదు దాఖలు చేసిన కొద్ది కాలానికి నేను అతన్ని మొదటి సారి కలుసుకున్నాను. మేమొక ఇంటర్వ్యూ సెల్ లో కూర్చున్నాము. నిజానికి అది గ్వాంటానమో క్యాంప్ ఎకో లో సర్దుబాటు చేసిన వొక స్టోరేజి కంటెయినరు. టేబులుకి అటువైపున తను. చేతులు కట్టుకొని, తల నేలకి వేళ్ళాడేసుకుని కూర్చున్నాడు. చేతులకి వేసివున్న బేడీలని గార్డులు తొలగించారు. అయితే కాళ్ళు కదిలించినపుడల్లా యినుప గొలుసుల సవ్వడి గదిలో ప్రతిధ్వనిస్తున్నది. ఆ గొలుసులని నేల మీద వొక మేకుకి కట్టివుంచారు. గది బయట గార్డులు. గదిలోపల వొక మూలకి వీడియో కెమెరా.
లతీఫ్ యెమెన్ దేశీయుడు. సన్నటి, కురచ మనిషి. బవిరి గడ్డం. మూడేళ్ళుగా జైలులో వుంటున్నాడు. విమానంలో తనని క్యూబా (గ్వాంటానమో)కి తరలించేటప్పుడు కళ్ళకి కనిపించకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టారు. చెవులు వినిపించకుండా మూసేశారు. జైలులోకి చేరినాక వాటిని తొలగించకుండానే, కాళ్ళకీ, చేతులకీ బేడీలు వేశారు. సైనికులు తనని కొట్టారు, కాళ్ళతో తన్నారు. ఆ దెబ్బలకి గూడ కీలు తొలగిపోయింది. మొదట్లో తలపై తుపాకీ గురిపెట్టి ప్రశ్నించారు. ఎక్స్ రే క్యాంపులోపల బోనులో కొన్ని వారాల పాటు బంధించారు. ఎలాంటి నీడలేకుండా, ఉష్ణమండలపు మండుటెండలో, ఇసుక, సన్నటి గులక రాళ్ళతో చాచి కొట్టే వదగాడ్పులకి తనని ఆ బోనులో అలాగే వదిలేశారు. తాగే నీళ్ళకోసం వొక బకెట్టు, మలమూత్రాదుల కోసం మరొక బకెట్టు, ఇవే తనకి కల్పించిన సదుపాయాలు.
‘ఇదొక నరక ప్రాయమైన దీవియ’ని లతీఫ్ చెప్పాడు. మధ్యాహ్న భోజనం దాచుకోవడం లాంటి చిన్న చిన్న నియమాలని వుల్లంఘించినా వొంటరి వాసపు శిక్షలు వేస్తారు. ఎలాంటి సదుపాయాలూ వుండవు. పరుపు గానీ, ప్యాంటు గానీ యివ్వరు.
‘ప్యాంటు వూడదీసి పొట్టి నిక్కర్లతో వుండేలా చేస్తారు. ప్రార్ధన చేయకుండా వుండడానికే అలా వుంచుతారు. అనాచ్ఛాదిత దేహంతో ప్రార్ధన చేయడం తప్పు గనుక మమ్మల్ని అవమానించడానికే వాళ్ళలా చేస్తార’ని లతీఫ్ చెప్పాడు. తను నారింజ రంగు చొక్కా, కాటన్ ప్యాంటు తొడుక్కొని, పాలిపోయి బలహీనంగా అగుపించాడు. 28 సంవత్సరాలే అయినా అంతకు మించిన వయస్సున్న వాడిలా కనిపిస్తాడు. 1994లో తలకి తగిలిన దెబ్బలకి పాకిస్తాన్ లో చికిత్స పొందుతుండగా పాకిస్తానీ బలగాలు తనని బంధించేయి. 5000 డాలర్లకి తనని అమెరికా అధికారులకి అప్పగించారు. గ్వాంటానమో జైలులో తన ఆరోగ్యం క్షీణిస్తూ వుంది.
ఎప్పటికీ విడుదల కాననే నిరాశలో లతీఫ్ నాకూ, గ్వాంటానమో ఖైదీల తరపున వాదించే యితర న్యాయవాడులకూ, అనేక వుత్తరాలలో కవితలు రాసి పంపించేవాడు. అందులో చాలావాటిని గ్వాంటానమో అధికారులు బయటికి రానివ్వడంలేదు. కానీ ‘నిరాహారదీక్ష’ అనే కవితని మాత్రం అనుమతించారు. అందులో పంక్తులివీ,
వాళ్ళు చిత్రహింసల్లో నిపుణులు
బాధించడంలో, అలసిపోయేలా వేధించడంలో ప్రవీణులు
అవమానించడంలో, తూలనాడడంలో నేర్పరులు
ఈ చిత్రహింసల నుంచి మమ్మల్ని
కాపాడే ప్రపంచమెక్కడ ?
అగ్ని కీలల నుండి, విషాదం నుండి
మమ్మల్ని కాపాడే లోకమెక్కడ ?
నిరాహార దీక్షలకి దిగిన వాళ్ళని
కాపాడే వాళ్ళు యెవ్వరు?
మిగిలిన లతీఫ్ కవితలని చదివే అవకాశాన్ని సైన్యం మనకి యివ్వడం లేదు.
గ్వాంటానమో బోనులో బందీలు రాసిన 22 కవితల సంపుటమే ఈ ‘గ్వాంటానమో కవితలు’ పుస్తకం. ఎన్నో ఇబ్బందులని అధిగామించి ఆగస్టు 2007లో ఈ సంపుటం విడుదలైంది. ఇందులో 17 మంది కవుల కవితలున్నాయి. ఈ కవులతో సహా, క్యాంపులో వున్న అందరూ ముస్లింలు. 17 మందిలో ఆరుగురిని విడుదల చేసి వారి, వారి దేశాలకి పంపించేశారు. అయితే అత్యధికులు ఇంకా, లతీఫ్ లాగే, అమెరికాలోకెల్లా ‘కట్టుదిట్టమైన భద్రతా యేర్పాట్లున్న’ జైలులో, ఆరు సంవత్సరాలుగా కఠోరమైన పరిస్థితులలో బందీలుగా మగ్గుతున్నారు. తమతో పాటు బందీలుగా వున్న అతి కొద్దిమందికి తప్ప యింకెవరికీ అందుతాయనే ఆశ లేకుండా రాసిన కవితలివి. నేనూ, నా సహచరులు అందరమూ ఈ బందీల తరపున స్వచ్చందంగా వాదించే న్యాయవాదులం. ఎఫ్ బి ఐ నుంచి ‘రహస్య’ స్థాయి అనుమతులు సంపాదించిన తర్వాత, 2004 నవంబరులో మేము మొట్టమొదటి సారిగా గ్వాంటానమో జైలుని సందర్శించాము. మేము వాదించబూనుకున్న మా క్లయింట్ల గురించి అప్పటికి మాకేమీ తెలియదు. ‘మన సైన్యంతో యుద్ధంలో తలపడగా యుద్ధరంగంలో బందీలుగా పట్టుకున్నామ’ని బుష్ ప్రభుత్వం యిప్పటికీ అసత్య ప్రచారానికి పాల్పడుతూ వుండడమే యిందుకు కారణం. (అధికారికమైన సైనిక డాక్యుమెంట్లని బట్టి చూసినా వీళ్ళలో 8% మంది పైననే ‘అల్ ఖైదా’ ఆరోపణలున్నాయి. వీళ్ళలో 5% మంది మాత్రమే అమెరికా సైనిక బలగాలు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధరంగంలో పట్టుకున్నాయి).
ఆ పర్యటనలో మా క్లయింట్లు తెలిపిన విషయాలు మాకు దిగ్భ్రాంతి కలిగించేయి. మూడు సంవత్సరాలుగా వాళ్ళని పూర్తి వొంటరితనంలో నిర్బంధించేరు. నిరవధికంగా విచారణ సాగించే సమయంలో, పదే, పదే యిబ్బందికరమైన భంగిమల్లో నిలపడం, నిద్రలేమికి గురి చేయడం, చెవులు చిల్లులు పడే సంగీతాన్ని వినిపించడం, విపరీతమైన ఎండకీ, చలికీ వదిలేయడం లాంటి చర్యలకి పాల్పడ్డారు. మహిళా అధికారులు బందీలపైన ఋతుస్రావాన్ని పోలిన ద్రవాన్ని బందీల ఛాతీలపై పులిమేవారు. లైంగికంగా అవమానించేవాళ్ళు. ముస్లిం విస్వాసాలకి కట్టుబడిన వాళ్లకి యిదెంతో అవమానకరమైనదని తెలిసి చేసిన పనులే యివి. బందీలకి కనీస వైద్యసడుపాయాలని కూడా కల్పించలేదు. వాళ్ళని శారీరకంగా, మానసికంగా వేధించారు. పూర్తి వొంటరితనానికి లోనుచేశారు. చిత్రహింసలకి పేరుపొందిన దేశాల జైళ్ళకి పంపుతామని బెదిరించారు. తుపాకీ గురిపెట్టి బెదిరించారు. మాట్లాడకపోతే కుటుంబాలని సర్వనాశనం చేస్తామని బెదిరించారు. ఇస్లాంకి కీలక మూలాధారాలు ఐదింటిలో వొకటైన రోజువారీ ప్రార్ధనలని సైతం చేసుకోనివ్వలేదు. అమెరికన్ సైనికులు ఉద్దేశ్యపూర్వకంగా ఖురాన్ కి చేస్తున్న అపచారాలని బలవంతంగా చూపించారు.
‘ఇక విడుదల అవుతాననే ఆశ నాకు లేద’ని వొకసారి లతీఫ్ నాతో అన్నాడు. ‘ఇమ్మీడియేట్ రియాక్షన్’ బలగాలు తనని మూడు రోజుల క్రితం వేధించాయని చెప్పాడు. నిలువెల్లా సాయుధులైన అరడజనుమంది సైనికుల బృందం లాఠీలతో, రక్షా కవచాలతో లోపాలకి వచ్చి సెల్ లో నుంచి తనని బయటికి యీడ్చారు. తలుపు సందులోంచి మధ్యాహ్న భోజనం అందించే సమయంలో నేల మీద గీసిన వొక గీతని దాటడమే తాను చేసిన నేరం.
‘ఘర్షణలని అదుపు చేసే సైనిక బృందం హఠాత్తుగా వచ్చి పడింది. సెల్లులో వున్న మాకెవ్వరికీ వాళ్ళు ఎందుకొచ్చారో తెలియదు. నేనున్న సెల్ కిటికీ తప్ప మిగతా అందరి సెల్ కిటికీలను మూసేశారు. అల్లరి మూకలని అదుపు చేసేందుకు వాడే పెద్ద పెప్పర్ స్ప్రే క్యాన్ ని వొక మహిళా సిపాయి తీసుకొచ్చింది. వాళ్ళు నాగురించే వచ్చారని నాకప్పుడు అర్ధమయింది. ఆమె స్ప్రే ని నాపై చల్లింది. నేను ఊపిరి పీల్చలేకపోయాను. పరుపుని తలమీద కప్పుకున్నాను. చచ్చి పోయాననే అనుకున్నాను. వాళ్ళు తలుపులు తెరిచారు. పక్కలో పడివున్న నన్ను వాళ్ళు తన్నుతూ పోయారు. తలని టాయిలెట్లో పెట్టారు. స్ట్రెచర్ పై పడవేసి తీసుకెళ్ళారు.’
నేను మూడోసారి గ్వాంటానమోకి వెళ్ళినపుడు తానూ గత నెల రోజులుగా నిరశన దీక్షలో వున్నానని లతీఫ్ చెప్పాడు (సైన్యం దీన్ని ‘స్వచ్ఛంద నిరశన’ అని పిలుస్తుంది. ప్రస్తుతం లతీఫ్ ఆరు నెలలుగా నిరశన దీక్షలోనే వున్నాడు). రోజుకి రెండుసార్లు గార్డులు లతీఫ్ కాళ్ళు, చేతులని వొక ప్రత్యేకమైన కుర్చీకి కట్టివేసి, తల కదలకుండా పట్టుకుని, బలవంతాన ద్రవాహారాన్ని ఎక్కిస్తూవున్నారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలని ప్రత్యక్షంగా వుల్లంఘించడమే. ఈ చర్యతో ‘గొంతులోంచి కత్తి దించినట్లుంటుంద’ని లతీఫ్ అంటాడు.
మొదట్లో మేం యేమీ చేయలేకపోయేవాళ్ళం. మా క్లయింట్లు చెప్పే విషయాలన్నీ దేశ భద్రతకి ముప్పు అనే అంశం పరిధిలోకి వస్తాయి గనుక అధికారులు పెంటగన్ హక్కుల సమీక్షా సంఘం అనుమతి లేకుండా దేనినీ బయటికి వెల్లడించే వీలు లేదనే వాళ్ళు. మొదట్లో, సైనికుల దురాగతాలు, ఆగడాలకి సాక్ష్యాలు వెలుగులోకి రాకుండా చూసేందుకు ఈ సంఘం తన అధికారాలని ఉపయోగించేది. మిలిటరీ అవసరాల రీత్యా విచారణా పద్ధతులని రహస్యంగా ఉంచాలనే సాకుతో, మాకు తెరిగి అప్పగించిన నోట్సు పై ‘రహస్యం’ ముద్ర వేయడంతో, దేన్నీ వెలుగులోకి తెచ్చే వీలుండేది కాదు. వీటిపై కేసు దాఖలు చేస్తామని చెప్పిన తర్వాత, పెంటగన్ అధికారులు ’రహస్యాల’ని వర్గీకరించే తమ విధానాలని మార్చుకున్నారు.
గ్వాంటానమో కవితల ముద్రణపై పెంటగన్ అధికారుల ప్రతిస్పందన ఊహించిన విధంగానే వుంది. జూన్ మాసాంతంలో, రక్షణ శాఖ ప్రతినిధి జె డి గోర్డన్ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో వొక వ్యాసం రాశాడు. ‘గ్వాంటానమో బే జైలు లోని ఖైదీలు, తమ రాతలని కవిత్వమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ రాతల శైలిని బట్టి చూస్తే, అది కళ కోసం కాదనిపిస్తోంది. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యంపై తమ యుద్ధంలో వీటిని వొక సాధనంగా వాడుకొనే ప్రయత్నం చేసారనిపిస్తోంద’ని గోర్డన్ రాశాడు. అప్పటికి గోర్డన్ ఈ కవితలని చదవనేలేదు.
పెంటగన్ ఆందోళన న్యాయమైనదే. ఖైదీలపైన గ్వాంటానమో ఎంత తీవ్ర ప్రభావాన్ని వేసిందో యీ కవితలు తెలుపుతున్నాయి. ఎలాంటి ఆరోపణలూ, విచారణా లేకుండా, కనీసం జెనీవా వొప్పందంలో అంగీకరించిన ప్రాధమికమైన రక్షణలు లేకుండా, ఐదు సంవత్సరాలకి పైగా అమెరికా ప్రభుత్వం నిర్బంధించిన మనుషులకి ఈ కవితలు వొక గొంతుకనిచ్చాయి. ఈ ఖైదీలకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు. కుటుంబ సభ్యుల దగ్గరనుంచి అప్పుడప్పుడు అనుమతించే వుత్తరాలలో వర్తమాన సంఘటనల ప్రస్తావన లేకుండా తొలగిస్తారు. న్యాయవాదులు తమ కేసుతో ‘ప్రత్యక్ష సంబంధం’ లేని వ్యక్తిగతమైన విషయాలని గానీ, యితర విషయాలని గానీ ఖైదీలకి తెలపగూడదు. ఈ పరిస్థితులలో చాలా మంది ఖైదీలు ఆత్మహత్యా ప్రయత్నం చేసారు. చనిపోవడానికి, ఉరి, మందులు దాచుకొని ఆ తర్వాత వాటిని అధిక మోతాదులో మింగడం, మణికట్టు కోసుకోవడం లాంటి ప్రయత్నాలు చేశారు. సైన్యం ఈ ఆత్మహత్యా యత్నాలన్నిటినీ, ఆర్వెల్ తరహాలో ‘కుట్ర పూరితంగా తమని తాము గాయ పరుచుకునే’ ఘటనలుగా అభివర్ణించింది.
గ్వాంటానమో జైలులో, చాలామంది తమని తాము నిలబెట్టుకోవడానికీ, తమ బాధలని గుర్తు పెట్టుకోవడానికీ, సృజనాత్మక కృషి ద్వారా తమ మానవీయతని నిలబెట్టుకోవడానికీ కవిత్వాన్ని యెంచుకున్నారు. ఈ కవితలు రాయడానికి వాళ్ళు యెన్నో ఆటంకాలని యెదుర్కొవాల్సి వచ్చింది. మొదటి సంవత్సరం ఖైదీలకి కలం, కాగితాలివ్వలేదు. అయినా కొంతమంది తమకి మధ్యాహ్నం, రాత్రి భోజనాలతో వచ్చే స్టైరోఫోం కప్పుల మీద చిన్న చిన్న కవితలు రాశారు. రాసేందుకు కలాలు లేక అందుకు గులక రాళ్ళనీ, టూత్ పేస్టునీ వాడారు. కప్ కవితలని సెల్ నుంచి సెల్ కి బట్వాడా చేసుకున్నారు. రోజూ వాడి పారేయాల్సినవి కావడంతో అంతిమంగా యీ కవితలని కూడా చెత్తబుట్ట పాల్జేయాల్సి వచ్చేది.
దాదాపు సంవత్సరం గడిచాక, ఖైదీలకి కలం, కాగితాల నివ్వడంతో కవితలని దాచుకునే వీలు కలిగింది. నేను మొదటిసారిగా చూసింది అబ్దుల్ సలాం అబ్దుల్ రహ్మాన్ అల హేలా రాసిన కవితలని. అతను సనా నగరానికి చెందిన యెమెన్ దేశ వ్యాపారి. చాలా కాలం పాటు వొంటరిగా బంధించిన సమయంలో అరబిక్ భాషలో రాసిన కవిత అది. నిరంకుశంగా నిర్బంధించిన అన్యాయానికి వ్యతిరేకంగా రాసిన కవిత అది. అది తన మత విశ్వాసంతో వూరట పొందే గీతం కూడా. ఆ తర్వాత కొద్దిరోజులకే నాకు లతీఫ్ రాసిన ‘చావు కేక’ అన్న కవిత గురించి తెలిసింది. ఈ రెండు కవితలనీ, అధికారులు ‘రహస్యం’గా వర్గీకరించారు. ఇతర న్యాయవాదులతో చర్చించే సరికి జైలు జైలంతా వర్ధమాన కవులతో నిండిపోయిందని తేలింది.
ఖైదీలు తాము రాసిన కవితలని తమ న్యాయవాదులకి అందించే లోగా గ్వాంటానమో సైనికాధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని నాశనం చేశారు. దీనికి తోడు అందుబాటులో వున్న అనేక కవితల ప్రచురణకి పెంటగన్ అనుమతినివ్వడం లేదు. ఈ కవితల ‘రూపమూ, సారమూ’ దేశ భద్రతకి ప్రమాదకరమైనవనే పేరుతో వాటిని వెలుగులోకి రానీయడంలేదు. జైలు క్యాంపు నుంచి యీ కవితల ద్వారా ఖైదీలు రహస్య సందేశాలు పంపే ప్రమాదం వుందట.
అయితే పరిశీలనకోసం మేము సమర్పించిన కవితలని రహస్యాలుగా పరిగణించలేరు. మేము యీ కవితలతో వొక పుస్తకం అచ్చు వేద్దామనుకుంటున్న సంగతి పెంటగన్ అధికారులకి తెలియగానే సెన్సార్ యంత్రాంగం అంతా కదిలింది. సైన్యం వందలాది కవితలని తొక్కిపట్టింది. బహుశా అవి యెప్పటికీ వెలుగులోకి రావు. అంతేకాదు, ప్రచురణకి అనుమతించిన కవితలలో చాలాభాగం యింగ్లీషు అనువాదాలు మాత్రమే. అరబిక్, పష్తో మూల భాషలలో ఆ కవితలు మరింత ప్రమాదకరమైనవని పెంటగన్ అధికారులు భావిస్తున్నారు. క్లయింట్ల నుంచి మాకు వచ్చే వుత్తరాలని చదివి అనువాదం చేసేందుకై ప్రత్యేక ఆమోదం పొందిన భాషావేత్తలని మాత్రమే అనుమతిస్తారు. అందుకని ఈ కవితల అనువాదంలో నిపుణుల సహాయం తీసుకునే అవకాశం మాకు లేదు.
ఇలాంటి మరెన్నో ఆటంకాలని యెదుర్కుని యిప్పుడు 22 కవితలు అచ్చులోకి వస్తున్నాయి. ఇప్పుడు గ్వాంటానమో ఖైదీల గొంతుల్ని మీరు వినగలుగుతున్నారు. ఖైదీలకి న్యాయమైన, స్వేచ్చాయుత విచారణ అవకాశాల్ని కల్పించడంలో కోర్టులు నత్తనడక నడుస్తున్నాయి. జెనీవా వొప్పందంలోని హక్కులని ఖైదీలకి వర్తిమ్పజేయాలా వద్దా అని రాజకీయవేత్తలు కీచులాడుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో ఖైదీల మాటలే యిప్పుడు చర్చలో భాగామౌతున్నాయి. ఈ కవితలైనా జాతి ఆత్మని తట్టిలేపుతాయేమో.
లోలోపల రగుల్కొనే జ్వాల
ఎరియల్ డార్ఫ్ మన్
అనువాదం: సుధా కిరణ్
(ఎరియల్ డార్ఫ్ మన్ చిలీ దేశపు ప్రసిద్ధ రచయిత. ‘మిస్సింగ్’ పేరుతో తెలుగులో వెలువడ్డ ‘విడోస్’ నవల ద్వారా తెలుగు పాఠకులకి సుపరిచితులు)
ముప్ఫై ఐదేళ్ళ క్రితం, నేను ప్రవాసంలో వున్న రోజులవి. నా దేశం, చిలీ, నియంతృత్వంలో నలిగిపోతున్న రోజులు. నియంత పినోషే తొత్తులైన రహస్య పోలీసుల చేతిలో చిక్కి, శాంటియాగో చీకటి కొట్లలో అంతులేని చిత్రహింసలని అనుభవించిన వొక మహిళని నేనప్పుడు కలుసుకున్నాను.
ఆమె నాకు పారిస్ నగరంలో కలిసింది. కఠోరమైన ఆ చీకటి రోజులలో కవిత్వమే తనని నిలబెట్టిందని ఆమె చెప్పింది. ఒక కవి పంపిన కవితలని తానూ బందీగా వున్న సమయంలో పదే పదే చదువుకునేదట. తన శరీరాన్ని వొక వస్తువుగా, మాంసఖండంగా చూసే దుర్మార్గులకి భిన్నంగా, తనని వొక మనిషిగా నిలబెట్టుకోవడానికి ఆ కవిత్వమే ఆమెకి వొక సాధనంగా వుపయోగపడింది. కవిత్వం, జైలర్లు స్పృశించ లేని, చెరిపి వేయలేని కవిత్వం, కాసిని మాటలు, క్షణ భంగురమైన, అస్థిరమైన పురా స్మృతి వచనాలు – యివే తనని నిలబెట్టేయి. అంతులేని వేదన, అవమానాల నుండి తనకి రక్షణగా నిలిచేయి.
గ్వాంటానమో ఖైదీల కవితలు చదవడం మొదలుపెట్టగానే నాకు ఆమె మాటలు గుర్తుకొచ్చేయి. ఇది సిగ్గు పడాల్సిన విషయం, అదే సమయంలో వొక అద్భుతమైన విషయం కూడా.
సిగ్గు పడాల్సిన విషయం. ఎందుకంటే, ప్రజాస్వామిక దేశమని భావించే అమెరికా సైతం, చిలీ యింకా అనేక దేశాల నియంతృత్వ పాలనలో మాదిరిగానే బందీలని అంతే అమానుషంగా హింసిస్తోంది. సిగ్గు పడాల్సిన విషయం. ఎందుకంటే, స్వేచ్చా స్ఫూర్తి ప్రదాయినిగా ప్రకటించుకునే అమెరికా తన ‘శత్రు సైనికులని’ చిత్రహింసలకి గురిచేస్తోంది. నేరానికి పాల్పడ్డారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుషులందరికీ అందరికీ వుండే కనీస మానవ హక్కులని సైతం కల్పించ నిరాకరిస్తోంది. సిగ్గు పడాల్సిన విషయం. ఎందుకంటే, న్యాయానికి ఆదర్శంగా, ప్రపంచమంతా అసూయ పడి, అనుకరించే నమూనాగా చెప్పుకునే అమెరికా, ఈ బందీలని నిరవధికంగా బంధించి వుంచింది. ఎలాంటి ఆరోపణలూ మోపకుండా, యెలాంటి విచారణా జరపకుండానే, బందీలు బయటి ప్రపంచంతో, తమ కుటుంబ సభ్యులతో వుత్తర ప్రత్యుత్తరాలు నెరపకుండా నిరోధించింది. ‘టెర్రరిస్టు’లతో తమకి సంబంధాలున్నాయన్న బలవంతపు ‘వొప్పుకోలు’ ప్రకటనల కోసం బందీల మానవీయతనీ, మత విశ్వాసాలనీ అగౌరవ పరిచింది.
ఇది వొక అద్భుతమైన విషయం కూడా. ఆ చిలీ మహిళలానే, దుర్భరమైన, అత్యంత హీనమైన పరిస్థితులలో బందీలుగా వున్న యీ ఖైదీలు కూడా, తమ మీద అమలవుతున్న హింసకి జవాబుగా కవిత్వాన్నే యెంచుకున్నారు. మన మానవ జాతికి యింతకంటే ఆశావహమైన విష్యం యింకొకటి వుంటుందా?
తమ చీకటి రాత్రులని గొంతెత్తి పాడే పదాలకోసం కొట్టుకులాడుతున్నపుడు, వాటిని దేవుడు తప్ప మనుషులు యెవరైనా వింటారని గానీ, విని పట్టించుకుంటారని గానీ నమ్మకం లేని పరిస్థితులలో యీ ఖైదీలు వున్నారని గుర్తుంచుకోండి. వాళ్ళు వీటిని అచ్చువేయడం కోసం రాయలేదు. బయటి ప్రపంచం మాట అటుంచితే, కనీసం తమ తోటి ఖైదీలకి సైతం యీ కవితలు అందుతాయనే ఆశ లేదు. కొన్ని కవితలలోని సౌందర్యం మనని వెంటాడుతుంది. మరికొన్ని అంత గొప్పవిగా కనిపించవు. కొందరు దాదాపు ఛాందసవాద మిలిటెంట్లనిపిస్తే, మరికొందరు తమ ప్రశాంత గృహ వాతావరణాన్నీ, దూరమైన తల్లిదండ్రులనీ, పిల్లలనీ మాత్రమే తలుచుకునే వాళ్ళుగా కనిపిస్తారు. బందీలుగా పట్టుబడక ముందే కవులుగా వున్నవాళ్ళు కొందరైతే, అత్యధికులు తమ జీవితాలనుండీ, కుటుంబాల నుండీ, తామెరిగిన పరిసరాలనుండి దూరమయ్యాక మాత్రమే, శబ్ద సౌందర్యాన్నీ, శక్తినీ మొట్టమొదటి సారి గుర్తించినట్లు కనిపిస్తుంది. కొందరు దేవుణ్ణి నమ్మితే, మరికొందరు సూర్యోదయాన్ని నమ్ముతున్నారు. మరికొందరికే, యిక దేనిమీదా నమ్మకం మిగిలి లేదు. అయితే, రచన రూపంలో తమ వేదన వ్యక్తీకరణ అన్నది నిరాసకి వ్యతిరేకంగా తమని తాము నిలబెట్టుకునే సాధనమనీ, తమ ధిక్కార మానవీయతకి నిదర్శనమనీ అందరికీ అర్ధమైనట్లు అనిపిస్తుంది.
ఇందులో వీళ్ళు, ‘లిఖిత వచనం’ పవిత్రమైనదనీ, ప్రవక్త ప్రవచనాలకి రూపమిచ్చిన అక్షరాలు దైవత్వానికే దర్పణమనీ నమ్మే తమ ముస్లిం మతం నుండి స్ఫూర్తిని పొందారు. కవులని ఆరాధించే సాంస్కృతిక వాతావరణంలో పుట్టిపెరిగిన తమ సంప్రదాయం కూడా గ్వాంటానమో ఖైదీలకి తోడ్పడింది.
అయితే అంతకు మించిన విషయం మరొకటుందని కూడా నాకు అనిపిస్తోంది. చిలీలో చిత్రహింసలకి గురైన ఆ మహిళనీ, అనేకానేక చీకటి కొట్లలో మగ్గుతున్న యితర బందీలనీ అందరినీ కలిపే సూత్రమది. చరిత్ర ప్రారంభం నుండీ, దుర్భర నిర్లక్ష్యానికి ప్రతిస్పందనగా, గాయపడిన తమ ఆత్మ గొరవాన్ని కాపాడుకోవడం కోసం పూనుకోవడంలోని యేకసూత్రతయే యిలాంటి బందీలందరినీ కలుపుతుంది.
గ్వాంటానమో జైలునుంచి వెలువడుతోన్న యీ కవితలకి అసలు మూలం అత్యంత సరళమైన, పురాతనమైన వుచ్ఛ్వాస, నిశ్వాసాల అంకగణితంలోనే వుందని నేననుకుంటున్నాను.
జీవితానికీ, భాషకీ, కవిత్వానికీ అన్నింటికీ మూలాలు తొలిశ్వాసలోనే వున్నాయి. మనమూ, మన లోలోపలి ఆత్మా, అదే తొలిసారి అన్నట్టు పీల్చి వదిలే శ్వాసలో, మనల్ని చనిపోకుండా నిలబెట్టే శ్వాసలో, అనుక్షణ వుచ్ఛ్వాస, నిశ్వాసాలలో మనల్ని సజీవంగా నిలిపే జీవ క్రియలోనే వాటికి మూలాలు వున్నాయి.
‘లిఖిత వచనం’ అన్నది యీ శ్వాసని శాశ్వతంగా, సురక్షితంగా నిలబెట్టాలనే ప్రయత్నం తప్ప మరేమీ కాదు. రాతిపై చెక్కినా, కాగితంపై రాసినా, తెరపై గీసినా ఆ జీవన లయ మననీ, మన శ్వాసనీ దాటి నిలవాలని, వొంటరి తనపు సంకెళ్ళని తెంచాలని, క్షణ భంగురమైన దేహాన్ని దాటి జీవజలంతో యితరుల హృదయాలని హత్తుకోవాలని చేసే ప్రయత్నమే అది.
ఊపిరి లోపలి పీల్చితే వుచ్ఛ్వాస, వదిలితే నిశ్వాసం.
ఈ బందీలు తమ జైలర్లతో పంచుకున్నదీ, తమని శత్రువుగా మాత్రమే చూసి, భయపడి, బంధించిన వాళ్ళతో పంచుకుందీ కవిత్వమే.
ఒకే గాలిని పీల్చే మనుషులు తమతో పాటు వొకే కవిత్వాన్ని శ్వాసించాలనీ, దేహాల మధ్య, సంస్కృతుల మధ్య, యుద్ధం చేస్తున్న ప్రత్యర్ధి పక్షాల మధ్య అంతరాల్ని పూడ్చాలని యిస్తోన్న పిలుపే కవిత్వం.
ఎ బందీలని ఇంతగా హింసించిన అమెరికా దేశపు నడిబొడ్డున, అమెరికా న్యాయవాదుల పరిరక్షణలో, అమెరికా ముద్రణాలయంలో, అమెరికన్ ముద్రణా సంపాదకత్వంలో కవితలు వెలువడడంలో లోతైన, బహుశా వైరుధ్య భరితమైన ప్రాధాన్యత యీ పిలుపులోనే వుంది.
ఈ ఖైదీలని గురించి ఆలోచించండి. దగ్గరలో అలల హోరు వినిపిస్తున్నా, సముద్రాన్ని చూడలేని, తాకలేని పరిస్థితుల్లో వీళ్ళు యీ కవితలని శ్వాసిస్తున్నారు. వీళ్ళ గురించి ఆలోచించండి. సుదూరంలోని శత్రువుల ముందు వీళ్ళు యీ విషాదాగ్ని గీతాల రూపంలో నిలిచారు. తమ మాటలని వినమనీ, తమ అస్తిత్వపు లోలోపల రాగుల్కొంటున్న జ్వాలల్ని గుర్తించమనీ మనల్ని అడుగుతున్నారు. ఈ కవితల్ని చదవడం అనే చిన్న పనితో, వొక ‘కాన్సంట్రేషన్ క్యాంపు’ బోను లోపల మొదలైన వాళ్ళ ప్రయాణాన్ని పూర్తీ చేయడానికి మనం సహాయ పడవచ్చు. మనం పట్టించుకుంటే, స్పందిస్తే, బహుశా వొక రోజు, బహుశా అతి త్వరలో, యీ కవితలే కాదు, వాటిని రాసిన చేతులు, పెదవులు, శ్వాస కుహరాలు కూడా ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించగలుగుతాయి.
ఆరోజు వచ్చేదాకా, వాళ్ళు వుండేది అపఖ్యాతి పాలైన గ్వాంటానమో బే జైలులో కాదు.. వొంటరి తనానికీ, మృత్యువుకీ వ్యతిరేకంగా రాసిన చేదు పాటలే వాళ్ళ నిజ నివాసం…
వ్యాసం బాగుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోగలిగాను.