“ఈరోజే ఫస్ట్ వర్కింగ్ డే! మర్చిపోయావా?”
ఎవరో నీ చెవి దగ్గరగా వచ్చి బిగ్గరగా చెప్పినట్టు వినిపిస్తుంది. ఘాడనిద్రలోంచి ఒక్కసారిగా మేల్కొన్నట్టు నువ్వు కళ్లు తెరుస్తావ్. రిస్టువాచీలో సమయం తొమ్మిది గంటలు కావడానికి సరిగ్గా పదినిముషాలు. సెల్ఫోన్ కోసం నీ కుడి చేయి వెదుకుతుంది. కొన్ని సెకన్ల తర్వాత ఫోన్ చేతికి అందుతుంది. షిఫ్టుకు లేటవుతుందన్న తొందర. ఎడమచేతికి కాస్త దూరంలో హేండ్బాగ్. దాన్నందుకుని బ్యాగులోకి ఆత్రంగా చూస్తావ్. ఐడీ కార్డు ఉందో లేదో. వెదుకుతున్న నీ కళ్లలో ఆందోళన. అంతలోనే సంతోషం. అపురూపమైన వస్తువేదో పట్టుకున్నట్టు దాన్నోసారి చేతుల్లోకి తీసుకుని ప్రేమగా తాకుతావ్.
చిందరవందరగా కిందపడ్డ వస్తువుల్లో నీకు కావాల్సినవన్నీ బ్యాగులో వేసుకుంటావ్. అక్కడినుంచి తొందరగా బయటపడాలన్నట్లు నీ పాదాలు హడావిడిగా కదులుతాయి. నేలంతా చితికి పోయిన గాజుముక్కలు… వాటి మీదుగా అడుగులు వేస్తూ డోర్ వైపు నడుస్తావ్. నీ ఫుట్వేర్ ఆ గాజుపెంకుల మీద పడ్డప్పుడు వచ్చే శబ్ధం ఆ గదిలో వికృతంగా ప్రతిధ్వనిస్తుంది. నువ్వు బయటికి వెళ్లగానే ఎవరో భళ్లున వేసినట్టుగా ఆ గదితలుపు మూసుకుపోతుంది.
నీ అడుగులు హాస్పిటల్ వైపు వడివడిగా పడుతుంటాయి.
అది నీ ఫస్ట్ వర్కింగ్ డే! నైట్ డ్యూటీ. చాలా సంతోషంగా ఉంటావ్. ఎవరూ ఏ పనీ చెప్పకపోవడంతో డాక్టర్స్ రూములో ఎక్స్ట్రాగా ఉన్న పేషెంట్ కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ గడుపుతావ్. ఎమర్జెన్సీ కేసుల గురించి సిస్టర్లు అదే షిఫ్టులో ఉన్న మరో డ్యూటీ డాక్టరుతోనే మాట్లాడడం వింతగా గమనిస్తావ్. అయినా నీకు అవన్నీ పట్టించుకోవాలనిపించదు.
ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో సమయమే తెలియలేదా రాత్రి. నిముషాల్లో తెల్లారినట్టుగా వింత భావన.
“ఇంకెంత. జస్ట్ టెన్ మినిట్స్…అంతే! షిఫ్టు పూర్తవుతుంది.” వాచీ చూస్తూ స్వగతంలో అనుకుంటావ్.
“రిలీవర్ రాకుండా వెళ్లకూడదు. డాక్టర్ నుంచి ఏ సమాచారమూ లేకపోతే షిఫ్టు కంటిన్యూ చేయాలి.” ఇంటర్య్వూలో హెచ్చార్ మానేజర్ మాటలు చెవుల్లో మంత్రాల్లా వినిపిస్తాయి.
‘రాకపోతే బాగుండు.!’ డే షిఫ్టు కొనసాగించడానికి ఉవ్విళ్లూరతావ్.
మరో పదినిముషాలు గడుస్తాయి.
“గుడ్ మార్నింగ్ డాక్టర్” నర్సింగ్ స్టేషన్లో సిస్టర్ల మాటలు వినిపిస్తాయి నవ్వులతో కలగలిపినట్టుగా. తప్పదన్నట్లుగా సీట్లోంచి లేచి అయిష్టంగా బయటికొస్తావ్.
“మార్నింగ్ డాక్టర్” నువ్వూ విష్ చేస్తావ్. సిస్టర్స్ నుంచి అప్డేట్ తీసుకోవడంలో బిజీగా అతను.
ఫ్రంట్ ఆఫీసు చేరుకుంటావ్. చూపుడువేలు బయోమెట్రిక్ మెషీన్ పై ఉంచుతావ్.
“అటెండెన్స్ నోటెడ్…” షిఫ్టు లాగౌట్ సమయం మేషీన్లోరిజష్టరవుతుంది.
రిసెఫ్షనిస్ట్ ఒక్కనిముషం దానివైపు వింతగా చూసి యధావిధిగా కాల్స్ అటెండ్ చేయడంలో పడుతుంది.
“మార్నింగ్ మిస్…” నవ్వుతూ గ్రీట్ చేస్తావ్.
రిసెఫ్షనిస్టు నుంచి సమాధానం ఉండదు. ఏంటో వీళ్ల పద్ధతి అన్నట్టుగా భుజాలెగరేసి అక్కడినుంచి బయటపడతావ్.
సిటీ బస్సులో కూర్చుంటావ్.
కాలేజీ రోజులు గుర్తొస్తాయి. టికెట్టు లేకుండా చేసిన జర్నీలు. రూపాయి ఖర్చుపెట్టడం ఇష్టంలేక నాలుగు బస్సులు మారే అల్లరి చేష్టలు. తాజాగా కళ్లముందు కదుల్తాయి. పెదవులపై దాచేయబోతున్న దరహాసమేదో మెరుస్తూ నీ కళ్లలో.
‘టికెట్టు కొనాల్సిందే. నేనిప్పుడో రెప్యూటెడ్ హాస్పిటల్లో డాక్టర్ని.’ అనుకుంటావ్ గర్వంగా. కండెక్టరు దగ్గరకు వెళ్లి స్టాప్ పేరు చెప్పి డబ్బులివ్వబోతావ్.
అతను వినిపించుకోనట్టుగా మరోచివరికి కదులుతాడు.
ఇంతలో… స్టాపొస్తుంది. దిగబోతూ బ్యానెట్ పై టికెట్ డబ్బులు ఉంచుతావ్.
నీ అడుగులు ఇంటివైపు పడుతుంటాయి. క్షణాలు భారంగా దొర్లుతాయి. గమనం మందగిస్తుంది. శరీరం బరువెక్కుతుంది. అలసట నిన్ను ఆవహిస్తుంది. మెల్లగా ఇల్లు చేరతావ్.
అక్కడ, ఎటుచూసినా శ్మశాన నిశ్శబ్ధం. ఇంటిలోని వారంతా విసిరేసినట్టుగా చెల్లాచెదురుగా కనిపిస్తారు. వాతావరణం బ్లాకండ్ వైటుకు షిఫ్టయినట్టుగా ఫీలౌతావ్. నీలో ఏదో అసంతృప్తి. పిచ్చిగా గదులన్నీ కలియదిరుగుతావ్.
లివింగ్ రూం టీవీలోంచి వస్తున్న మాటలు… వాషింగ్ మెషీన్ శబ్ధం… వెట్ గ్రైండర్ నాయిస్… అన్నీ చాలా స్లో మోషన్లో చెవుల్లోకి దూసుకెళ్తున్న భావన. సబ్ కాన్షియస్లో అంతులేని మౌనం.
ఆకలిగా అనిపించదు. ఈపాటికి టిఫిన్ తినమని అడగాలే? నీకు ఆకలి లేదని వాళ్లకు అర్థమైందా? మంచం మీద వాలిపోతావ్. కళ్లు అలసటగా మూతలు పడుతుంటాయి.
అప్పుడే, సరిగ్గా అప్పుడే గుర్తొస్తాయి. గుచ్చుకున్నట్టుగా ఆ చూపులు. ఎవరివా కళ్లు? నీవేనా? నిన్ను పోలిన వేరొకరివా? పిశాచాల్లా కళ్లముందే కదలాడే ఏవేవో దృశ్యాలు…
గతంలోంచి నువ్వు ప్రస్తుతానికి వచ్చి నిన్ను నీతోపాటూ మళ్లీ గతంలోకి తీసుకెళ్తున్నట్లు… నువ్వు మరోసారి నడిచిన దారుల్లో ప్రయాణిస్తావ్. గతకాలపు భయానక సమయాల్లో, నీలో దుర్బలత్వాన్ని నింపిన బలహీన క్షణాల్లో మరోసారి నువ్వు జీవిస్తావ్.
‘గాడీ ఇత్నా దూర్ క్యూలేకే ఆయా…” చిరాగ్గా కాబ్ డోర్ క్లోజ్ చేస్తూ… అసంకల్పితంగా ఆ కళ్లను చూస్తావ్.
కొలనులో ఒంటరిగా నీరుతాగుతున్న లేడిని చూసినప్పుడు పులి కళ్లలో కదలాడే భావమేదో వాటిలో కనిపిస్తుంటుంది. నీ కళ్లలో బెరుకు. అసంకల్పిత చర్యలా.
అప్పుడు గుర్తొస్తుంది నీకు. అది నీ టైం ఫ్రేంలో సెట్టయ్యే సమయం కాదని. ఫ్రెండింట్లో జరిగిన ఫంక్షన్‌లో చీకటిపడేదాకా ఉన్నందుకు నిన్ను నువ్వే నిందించుకుంటావ్. అంత రాత్రిపూట బయటికి వచ్చేప్పుడు పార్టీవేర్ నుంచి రెగ్యులర్ వేర్ కి మారాలన్న కాన్షియస్నెస్ లేనందుకు నీలో నువ్వే విరుచుకుపడతావ్.
“ఇప్పుడే దిగేస్తే. మరోక్యాబ్ దొరుకుతుందో లేదో” నీలో ఆందోళన. అనవసరంగా డ్రైవరుతో దురుసుగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడతావ్.
“కొంచెం దగ్గరగా ఆపి ఉండొచ్చు కదా భయ్యా…!” అసహనం స్థానంలో అభ్యర్థన. నువ్వు నీ తప్పేమీ లేకుండానే తగ్గుతావ్.!
‘అన్న’ హోదా ఇస్తూ నువ్వు సెక్యూర్గా ఫీలవ్వాలనుకుంటున్నావని ఆ తోడేలుకు తెలుస్తుంది. వాడు నవ్వుతూ స్టీరంగ్ వైపు తిరుగుతాడు. ఫ్రంట్ మిర్రర్ లో కనిపిస్తున్న నీ కళ్లనే తారాడుతున్నట్టు ఆ చూపులు. బూచిలా.
మాటలు విన్నట్టే. స్పందించడు. వాడి మౌనం నిన్ను మరింత భయపెడుతుంది. కారు నడుపుతున్నట్టే. చూపులు నీవైపే. కంపరంగా. గొంగళిపురుగేదో స్లోమోషన్లో పాకినట్టు.
కొద్దిసేపటి తర్వాత, అదే ఫ్రంట్ మిర్రర్లోంచి వాడిని గమనిస్తావ్. వద్దనుకుంటూనే. హత్య చేయబోయే ఒకే ఒక్క సెకను ముందు హంతకుడి కళ్లలో కదలాడే భావమేదో కనిపిస్తుంది ఆ కళ్లలో నీకు. తెలియని గుబులు. చూపులు మరల్చుతావ్. అయినా నిన్ను వదిలిపెట్టని డేగ కళ్లు. ఏం చేయాలో అర్థంకాదు. చీకటి. నీ చుట్టూ. నీలో. పేరుకుపోతూ. ఫోన్ స్క్రీన్‌లో తలదూరుస్తావ్. చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలిస్తావ్. అయినా మనసు కుదుటపడదు.!
సిట్యువేషన్ కంట్రోల్లోకి తేవాలన్న పిచ్చి ఊహ.!
“కుచ్ బాత్ కర్నా హై క్యా…” ఎందుకొచ్చిన కష్టాలు అనుకుని మర్యాదగానే అడుగుతావ్.
సమాధానం రాదు.
నీ స్వరంలో అణకువ. వాడి పురుషాధిక్యత రెట్టింపవుతుంది. కారు వేగం పెరుగుతుంది. ‘ఇంకోసారి ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే కార్లోంచి దూకేయ్యాలి. లేదు లేదు చున్నీతో వాళ్ల గొంతు నులిమెయ్యాలి’ కసిగా అనుకుంటూ వాడి కదలికలనే గమనిస్తావ్.
నీ చూపుల్లో ‘వాడి’ వాడిని తాకినట్టుగా. ఆ కళ్లు రోడ్డునే చూస్తుంటాయి. నీ వేడి నిట్టూర్పు నీలో భారాన్ని ఆవిరిగా మార్చలేకపోతుంది. ఫోన్ వాల్యూం పెరుగుతుంది. చెవిలో పాటల హోరు. నీ తల వెనక్కి వాలడం… వాడి కుడిచెయ్యి సెంట్రల్ లాక్ సిస్టంపైకి వెళ్లడం ఒకేసారి జరుగుతుంది.
“క్లిక్” నాలుగు డోర్లూ ఆటోలాక్ అవుతాయి. నీకు వినిపించదు. తల ఎడమవైపుకు వంచి మూసి వున్న విండో గ్లాసెస్ నుంచి రోడ్డువైపు చూస్తుంటావ్. సరిగ్గా అప్పుడే ఆ కళ్లు తారసపడ్డాయి. ఇంత రాత్రి వేళలో ఎవరై ఉంటారు? విండో దగ్గరగా కళ్లు ఉంచి క్లియర్గా చూడాలని ప్రయత్నిస్తావ్.
ఆ కళ్లలో ఏవో భావాలు. కారుతో పాటూ కదులుతున్నట్టుగా ఆ కళ్లు నీ వెనుకే వస్తుంటాయి. క్షణం తర్వాత తెలుస్తుంది అవి నీ కళ్లేనని. కారు గ్లాస్ విండోలోంచి నిన్ను వెంబడిస్తున్నది నీ కళ్ల రిఫ్లెక్షన్ అని.
వాటిలో ఇంకా జీవిస్తున్న భయం నిన్ను వణికిస్తుంది.
ఇదేమీ పట్టనట్లుగా కారు మరింత స్పీడందుకుంటుంది. నీ మనోవేగం దాన్ని ఎప్పుడో దాటేస్తుంది. రకరకాల ఆలోచనలు. ఉక్కిరిబిక్కిరి చేస్తూ. మెదడులోంచి సజీవంగా వెలుపలికి వచ్చి నీ చుట్టూ మూగినట్టుగా.
కొంతసేపటి తర్వాత కారు నెమ్మదిస్తుంది. సముద్రంలాంటి ట్రాఫిక్ని అది మెల్లగా ఈదుతుంటుంది. నువ్వు బయటికి చూస్తావ్.
బస్సు షెల్టర్. చివరగా ఓ మూలన నిలుచున్న అమ్మాయి. ఆమె కళ్లు దీనంగా నీ వైపే చూస్తున్నట్టుగా. గబగబా ఆ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తావ్. పాడుబడినట్టుగా ఉన్న బస్సుషెల్టర్ అది. రేకులు విరిగి, సిమెంటు చప్టాలు కూలిపోయి దీనస్థితిలో ఉంది.
ట్రాఫిక్ క్లియరవుతూ కారు ముందుకు పరిగెడుతూ ఉంటుంది. కళ్లముందునుంచి
ఆ అమ్మాయిని వెనక్కు నెట్టేస్తూ.
విండో డౌన్ చేసి ఆమెను చూడాలని ప్రయత్నిస్తావ్. అది కదలనంటూ మొరాయిస్తుంది. ముందుకు వెళుతూ నువ్వు. కనుమరుగవుతూ ఆమె.!
ఎన్నో వాహనాలు. కొన్ని ఆగుతూ… కొన్ని మెల్లగా కదులుతూ… ఎందరో మనుషులు…నడుస్తూ… నవ్వుతూ… వీళ్లలో ఏ ఒక్కరూ ఆమెను చూడరే! ఆ కళ్లను గమనించరే! ఏమైనా సాయం కావాలేమో అని అడగరే!
నిజమే! అలా అడగాల్సిన స్పృహ వాళ్లకు కలగదేమో. ‘కళ్లు మాట్లాడతాయి. తిడతాయి. కొడతాయి. తాగుతాయి. తూలుతాయి’ అంటూ రొమాంటిక్ కమర్షియల్ సినిమాల్లో హీరో చెప్పే డైలాగులను గుడ్లప్పగించి చూడడమే తెలిసిన మనకు అవే కళ్లు నిస్సహాయంగా సాయంకోసం అర్థిస్తూ ఉంటాయని తెలీదేమో. బహుశా, చీకటి సమయాల్లో ఎవరూ ఆ యాంగిల్లో ఆలోచించరేమో. ఆ సబ్జెక్టుకు సేలబిలిటీనే లేదేమో!
నీ ఆలోచనలు బద్దలు చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి ఉన్నట్టుండి గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వు నీ చెవుల్లో అతి భయంకరంగా మారుమ్రోగుతుంది. చటుక్కున ఇయర్ఫోన్స్ లాగేస్తావ్. చుట్టూ నిశ్శబ్దం. ఆ అమ్మాయి, మరిక కనిపించనంత దూరంలో! మరి ఆ నవ్వు ఎక్కడినుంచి వినిపించినట్టు?
‘తన కళ్లలోని బాధను ఎవరూ అర్థం చేసుకోలేరనే వేదన ఆ నవ్వులో ఉందా?’
సమాధానంతో సంభందం లేనట్టుగా కారు స్పీడందుకుంటుంది. నీ చూపుల్లో ఆ అమ్మాయి కళ్లు చిక్కుకుని నీ వెంటే ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
తెలీని భయమేదో నీలో ప్రవేశిస్తుంది. విడదీయడానికి వీలుకానట్లుగా అది నీలో పూర్తిగా నిండి గడ్డకట్టుకుపోతుంది. ఆందోళనగా తలవిదిలిస్తావ్. బిత్తరపోతూ నలువైపులా చూస్తావ్. చుట్టూ ఉన్న పరిసరాలు శరవేగంగా మారుతుంటాయి. అదేదో హార్రర్ మూవీల్లో చూపించినట్టుగా.
కలానిజమా? అర్థం కాదు. ఏ కాలమో తెలీదు. చుట్టూ బూడిద వర్ణం.! పగలో రాత్రో గుర్తుపట్టలేం!. తడి పొడి వాతావరణాలన్న తేడా ఉండదు. బస్టాప్లోనో, రైల్వేస్టేషన్లోనో, షాపింగ్ కాంప్లెక్సు బయటో, ఐమాక్సు, సినీమాక్సుల జిలుగు వెలుగుల్లోనో ఇక్కడో, అక్కడో, ఎక్కడో ఓ చోట… హోలోగ్రామ్ లో బొమ్మలానువ్వు. నీ వెంటే ఆ కళ్లు. వెంటాడుతున్నట్టుగా.
డెజా వూ.. కాలంతో పాటూ క్షణకాలం నడుస్తావ్. మళ్లీ ఏదో మర్చిపోయినట్టు లిప్తపాటులో వెనక్కి పరుగెడతావ్. ఎప్పుడో ఎక్కడో ఇలాంటి కళ్లే చూసాననుకుంటావ్. ఆ కళ్లే మళ్లీ కనిపించినట్టుగా. తిరోగమనంలోనో… పురోగమనంలోనో… నడుస్తున్నప్పుడో, నిలబడినప్పుడో… చూసావో… చూడలేదో…అసలు ఇంకెప్పుడూ చూడబోవో… వింత భ్రమ.! ఉన్నట్టుండి నీ ఆలోచనలు సీతాకోకచిలుకల్లా ఎగిరిపోతాయి. చుట్టూరా ఉన్న పరిసరాలు పలుకరిస్తాయి. నువ్వున్నది ప్రస్తుతమని తెలుస్తుంది.
“అసలు కళ్లలోని భావాలను గ్రహించడమెలా?” ఇంటర్నెట్‌లో చూస్తావ్. పుస్తకాల్లో వెదకుతావ్. అంతులేని సమాచారం. అతుకులబొంతలా. నీలో ఏదో అసంతృప్తి.!
సెర్చ్ ఇంజన్లలో దొరకని పేజీలేవో ఆ కళ్లలో నిక్షిప్తమైనట్టు. ఆన్లైన్ డిక్షనరీల్లో పొందుపరచని పదాల సమూహమేదో వాటిలో దాగినట్టు. ఎలా ఆ భావాలను డీకోడ్ చేయడం? సైన్సునో, టెక్నాలజీనో చదివినంత తేలికకాదని నీకు తెలిసేసరికల్లా…
దూరంగా ఎక్కడో తుప్పల్లోనో… మురికి కాల్వ పక్కనో… చెత్తకుప్పల్లోనో… ఆ దేహం… అప్పటికే నీలి రంగును సంతరించుకుని ఉంటుంది. కమిలిన గాయాలు, గాట్లు… ఎండిన కన్నీటి చారలతో చెక్కిళ్లు. ఈ జన్మకిది చాలన్నట్టుగా… ఆ కళ్లు నీలాల నింగి వైపు అలాగే చూస్తుంటాయి. రెప్పలపై చేయుంచారెవరో… జరిగిన ఘోరానికి సాక్ష్యంలా గుచ్చుకుంటున్న వాటిని మూసివేయడం ఎవరివల్లా కాలేదు. ఎప్పటికీ తెల్లారని కాళరాత్రిని లోకానికి చూపుతున్న ఆ కళ్లలో ఇంకా ఏదో చెప్పాలనే ఆశ, తనను తాను కాపాడుకోలేకపోయాననే ఆవేదన. నిర్జీవమైన ఆ కళ్లలో సజీవంగా కనిపిస్తూ.
నువ్వు విస్మయంగా ఆ కళ్లలోకి చూస్తావ్. కొన్ని వందలరెట్ల అయస్కాంత బలంతో ఆ కళ్లు నీ కళ్లను లాగేసుకున్నట్టుగా వింత అనుభూతి. ఆ కళ్లు ఇప్పుడు నీవి.! వాటిలో ఇప్పటికీ పచ్చిగా కనిపిస్తున్న బాధంతా నీ మెదడుకు చేరిపోతుంటుంది. ఎవరో గబాల్న లాక్కెళ్లినట్టు నువ్వు అక్కడి వాతావరణంలోకి షిఫ్టవుతావ్. అక్కడి గాలిలో మారుమ్రోగుతున్న ఆక్రందనలు భీకరంగా నీ చెవులను తాకుతాయి. సజీవంగా ఉన్నప్పుడు ఆ శరీరం అనుభవించిన బాధలన్నీ ఆ కళ్ల ద్వారా ఇప్పుడు నగ్నంగా నీ కళ్లముందు పరుచుకున్నట్టనిపిస్తుంది.
లోకోమోటివ్ . గంటకు 120 మైళ్ల వేగంతో వస్తుంటుంది. అది ధడేలున మీదనుంచి దూసుకుపోయినట్టుగా నువ్వు కదిలిపోతావ్.
నీలో ఉలికిపాటు. చుట్టూ చూస్తావ్. తెల్లని వెలుగు. నిన్ను వెలివేస్తున్నట్టుగా. నీకు తగిలీతగలకుండా చుట్టూరా వ్యాపించి ఉంటుంది. పరిసరాల్లో ఏదోలోటు. ఇదీ అని నిర్థిష్టంగా చెప్పలేని వెలితి. ఎప్పటికీ భర్తీ చేయడం వీలు కాని ఖాళీ.
విడదీయరాని బాధ ఏదో నిన్ను పెనవేసుకుపోయినట్టుగా విలవిలలాడతావ్. “ఏం చేస్తే దీన్నుంచి బయటపడగలవు.” అనుకుంటావ్ ఆవేదనగా.
మస్తిష్కం నుంచి ఎటువంటి సంకేతాలూ రావు. నిశ్శబ్థం. బద్దలుకొట్టడానికి వీలుకాని శ్మశాన నిశ్శబ్థం.
“ఎందుకిలా?” మెదడు సమాధానమివ్వలేనట్టు మౌనంగా ఉంటుంది. మెడుల్లా ఆబ్లోంగటా నెమ్మదిగా గడ్డకడుతున్నట్టు నీ శరీరానికి అతి స్పష్టంగా తెలుస్తుంటుంది.
“ఇంతకీ నేను బతికే ఉన్నానా? ఉంటే, నేను నేనుగానే ఉన్నానా?” వినకూడనిదేదో విన్నట్టు నీ శరీరం భయంతో జలదరిస్తుంది.
బీప్… బీప్… న్యూస్ అలెర్ట్… గట్టిగా చెవులు చిల్లులు పడేలా వినిపిస్తుంది. కలత నిద్రలో లేచినట్టుగా నువ్వు తలవిదిలిస్తావ్. క్షణకాలం పాటూ నీ కళ్లు స్క్రీన్ పై నిలుస్తాయి. కనిపిస్తున్న పదాలను ఫోకస్ చేయడానికన్నట్లు.
ఏదో అస్సాల్ట్ న్యూస్… వద్దనుకుంటూనే చదువుతావ్. కూడదంటూనే విజువల్స్ చూస్తావ్. బ్లర్ చేయని ఆ కళ్లు పచ్చి పుండులా మనసును కెలుకుతాయి.
ఇవేనా నిన్ను వెంటాడుతున్నది. ఈ కళ్లు… ఫలానా రోజెప్పుడో కనిపించిన గ్రీన్ చుడీదార్ అమ్మాయి కళ్లలాగే ఉన్నాయే.! అదెలా సాధ్యం.? అంటే ఆ కళ్లు అప్పుడు నిజంగానే నీకు కనిపించాయా?
సమాధానం రాని ప్రశ్నలు.
అయోమయంగా లివింగ్ రూంకెళ్తావ్. అక్కడా టీవీలో అదే న్యూస్. కుర్చీలో కూర్చుంటావ్. ఎవరైనా మాట్లాడితే బాగుండు. చుట్టూ చూస్తావ్. అందరి చూపూ సీరియస్ గా టీవీ పైనే.
… క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు…
ఫ్రామ్ట్ అవుతున్న న్యూస్ కి ఎక్స్ప్రెషన్ జతచేసి కళ్లు కొంచెం పెద్దవిగానూ మరోసారి చిన్నవిగానూ చేసి వార్తకు సరిపోయే ఫీల్ జోడిస్తూ తల అటూఇటూ తిప్పుతూ చదువుతోంది న్యూస్ రీడర్.
“వాడేనా లేక మరొకడా.?” మరింత పరీక్షగా చూస్తావ్.
“లేదు. వీడు ‘వాడు’ కాదు. కానీ ఆ ఈవిల్ ఐస్… అచ్చు అలాగే ఉన్నాయేంటి?” మళ్లీ ఆ కళ్లల్లోకి చూడాలంటే భయం! తెలియకుండానే వణికిపోతావ్. నీ శరీరం క్రమంగా మంచుముద్దలా మారిపోతూ. గుండెలమీద బరువు పెరుగుతూ. ఉక్కిరిబిక్కిరి.
గొంతు పిడచగట్టుకు పోతుంది. గబగబా ఫ్రిడ్జు దగ్గరికెళ్తావ్. డోర్ లాగుతావ్. అది ఎంతకీ ఓపెన్ కాదు. మళ్లీ ప్రయత్నిస్తావ్. నో యూజ్!
“ఒక్కపూట తిండితినకపోతే ఇంత నిస్సత్తువా?” నీలో చిరాకు.
రిపీటెడ్ గా వినిపించే న్యూస్ చెవుల్లో సూదులు దింపుతున్నట్లుగా. ఏం చేస్తున్నావో తెలియనట్టు టీవీ వైపు నడుస్తావ్. స్క్రీన్ కి దగ్గరగా మొహం పెట్టి చూస్తావ్. పిచ్చెక్కినట్టుగా.
అవే విజువల్స్… విత్ ఎఫెక్ట్స్ తో పదే పదే తీరిగ్గా ఓపిగ్గా తెరపై కదుల్తుంటాయి.
ఉన్నట్టుండి ఏదో గుర్తొస్తుంది.
ఆ రోజు లైబ్రరీ వర్కు పూర్తయ్యే సరికి సాయంత్రమవుతుంది. ఎందుకనో ఆటోలో వెళ్లాలనిపించదు. నడిస్తే అరగంటలో ఇళ్లు చేరుకోగలవ్. నడిచే ఓపిక లేదు. నాన్నకు ఫోన్ చేసి తోడురమ్మని అడుగుదామనుకుంటావ్. ఫోన్లో బ్యాలెన్స్ లేదు.
తెలిసిన ఏరియా. ఎప్పడూ నడిచే నేల. నీ ఆశలూఆశయాలూ అక్కడి గాలిలో ఇంకా తేలుతున్నట్టే. వేసే ప్రతి అడుగూ ధైర్యాన్ని నింపుతున్నట్టే. అంతా బాగానే ఉన్నట్టే. బస్టాపులో నిల్చుంటావ్ రోజూలాగే. అతి మామూలుగా. నిర్భయంగా! కొన్ని కళ్లు గమనిస్తుంటాయి. ఏదో ప్రమాదం అక్కడి గాలిలో అంతర్లీనంగా వ్యాపిస్తూ ఉంటుంది.
నువ్వు అదేమీ పట్టించుకోవ్. నీ చూపంతా కొద్ది దూరంలో కనిపిస్తున్న హాస్పిటల్ మల్టీస్టోరీ బిల్డింగ్ పైనే. ఇంకో ఆర్నెళ్లలో కోర్సు పూర్తిచేసుకుని అదే హాస్పిటల్లో డ్యూటీ డాక్టరుగా జాయినవ్వాలన్న ఆశలే నీ కళ్లలో! రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టినట్టుగా సూర్యుడు వద్దనుకుంటూనే అస్తమిస్తాడు. అవేమీ తెలియని నీకు ఆ దృశ్యం అతి మధురంగా కనిపిస్తుంది.
సెకన్లలో వెలుగు మాయమవుతుంది. చీకట్లు ముసురుకుంటాయి. స్వచ్ఛమైన గాలిని నాలుకలు చాపుతూ కలుషితం చేసే నల్లటి విషవాయువులా చుట్టూ నలుపు రంగు అలుముకుంటుంది. జనం పలుచబడతారు. అప్పటివరకూ నిన్నే గమనిస్తున్న ఆ కళ్లు నెమ్మదిగా క్రూరంగా మారతాయి. ఆ మసకవెలుతురులో ఆ కళ్లలోని చీకటికోణాలు నిలువెత్తురూపం సంతరించుకుంటాయి.
రోజూ చూసేవారే అపరిచితులవుతారు. తెలిసిన వారే పరాయివాళ్లవుతారు. ఆ ప్రాంతం… ఆ పరిసరాలు నిన్ను మర్చిపోతాయా క్షణంలో. సాడిస్టు సవితి తల్లిలా.! ఎటూ చూసినా నల్లని చీకటి. ఇవేమీ తెలియని నువ్వు ఎప్పటిలా మామూలుగానే ఉంటావ్. నీ కళ్లలో భవిష్యత్ కలలు. క్షణాల్లో అంతా తారుమారవబోతోంది. జరుగబోయే దారుణాన్ని ఎలా ఆపాలో తెలియక నేలతల్లి కుమిలిపోతుంది. అక్కడి గాలి ఊపిరిబిగబట్టి అంతా గమనిస్తోంది.
“ఏమ్మా ఫోన్ ఎత్తవెందుకు?” టూవీలర్ పై కూర్చుని నాన్న స్వరం మందలించింది.
తర్వాత ఏమైంది? గుర్తు రాదు. ఎంత ప్రయత్నించినా. అసలు నాన్న వచ్చారా.? లేక అదంతా నీ భ్రమా? మరోసారి అపనమ్మకం.
మరిక ఆలోచించలేనట్టుగా కళ్లుమూసుకుంటావ్. తలంతా భారంగా. వేయిటన్నుల బరువు మోపినట్టుగా.
క్రైం న్యూస్లో మరొక వార్త.
“వారం రోజుల తర్వాత కనిపించిన మృతదేహం… వీడిన మిస్టరీ…” థిక్ బోల్డ్ కాపిటల్స్ లో చదివినట్టుగా హెడ్లైన్లు వినిపిస్తాయ్.
అమ్మాయి ఫోటో చూపిస్తున్నారు. ఆమె ఆకుపచ్చరంగు చుడీ దార్లో ఉంది. నువ్వు విస్తుపోయి చూస్తావ్.
నీ కళ్లను నువ్వే నమ్మలేనట్టు. ఆ కళ్లని మళ్లీ చూడాలన్నట్టుగా మరింత దగ్గరగా వెళ్తావ్. టీవీ స్క్రీన్ పై నీకు మరో కళ్లు కనిపిస్తాయి. అవి నీవే!
అదే భయం… అదే భీతి. ఆ కళ్లలో. నీ కళ్లలో. ఇదెలా సాధ్యం.! ఆశ్చర్యంతో నీ కళ్లు పెద్దవవుతాయి. ఏం చూస్తున్నావో అర్థంకానట్టుగా నువ్వు కళ్లు నులుపుతావ్.!
“డిఎన్ఎ రిపోర్టు వచ్చింది. మన పాప కాదు. అసలు అది ఎక్కడుందో. ఉందో లేదో. ఏమైపోయిందో. డాక్టరు సీట్లో కూర్చుని దర్జాగా ఉండాల్సిన పిల్ల. ఎన్ని కలలు కంది. పగలనక రాత్రనకా కంట్లో వత్తులు వేసుకుని చదివింది. నా తల్లిని… ఎక్కడని వెదకాలి. ఎలా తీసుకురావాలి…” పొడారిన గొంతుతో బలహీనంగా అంటున్న నాన్న మాటలు ఏదో లోయలో నుంచి వచ్చినట్టుగా.
నువ్వు నాన్నవైపే అయోమయంగా చూస్తావ్.
“మూడు రోజుల కిందట ఫోన్ సిగ్నల్ అక్కడే చివరిసారిగా పనిచేసిందని అంటున్నారు. మరి అక్కడినుంచి అమ్మాయిని ఎవరు తీస్కెళ్లారు. కొత్త చట్టం తెచ్చిన తర్వాత చాలా మందిని పట్టుకుంటున్నారు. మన బిడ్డను పొట్టనపెట్టుకున్న వాడికి ఏ చట్టాలూ వర్తించవా?” ఆవేశంగా అమ్మ.
“మనమ్మాయి క్యారెక్టరే మంచిది కాదంటున్నారు. అయినా ‘కుక్క’ను కాల్చినట్టు కాల్చిపారేయడానికి వాడేమైనా కాబ్ డ్రైవరో… రిక్షావాడో… ఆటోవాడో…కూలీవాడో కాదు కదా. మొన్ననే పదిమంది ఆఫీసుకొచ్చి బెదిరించారు. మనకు ఇంకో ఆడపిల్ల ఉందన్న విషయం నాకు మళ్లీ గుర్తు తెచ్చారు. పోయిన దానికోసం ఉన్నదాన్నీ పోగొట్టుకోలేం కదా.” కుమిలిపోతూ నాన్న.
దగ్గరగా వెళ్లి నాన్న మొహంలోకి చూస్తావ్. చిన్నప్పటి గుర్తులేవో అస్పష్టంగా. వేలుపట్టి నడిపిస్తూ… సైకిల్ తొక్కడం నేర్పిస్తూ… జ్ఞాపకాలన్నీ కళ్లెదురే బూడిదలా మారి చిన్న చిన్న ధూళి కణాలుగా గాల్లో కలిసిపోయినట్టు…
పోస్టాఫీసులో క్లర్కుగా పనిచేసే తండ్రి నీ చదువుకోసం తలనిండా అప్పల ఊబిలో కూరుకున్నప్పడూ ఇంత బాధ పడలేదు.
నీకు ఏదో అర్థమయ్యీకానట్లుగా అనిపిస్తుంది.
మూడు రోజుల కిందట నువ్వు ఆనందంగా ఇంటర్వ్యూకు వెళ్లడం… గత రాత్రినుంచీ నువ్వు నీ ఉనికి నిలుపుకోవడానికి పిచ్చెక్కినట్టుగా ప్రయత్నించడం… నైట్ షిఫ్టు డాక్టర్ నిన్ను పట్టించుకోకపోవడం… ఫ్రంట్ ఆఫీసు రిసెప్షనిస్టు అయోమయపు చూపులు… కండక్టరు టికెట్టు ఇవ్వకపోవడం… ఇంట్లో నిశ్శబ్దం… కర్వ్డ్ మిర్రర్ లోంచి చూసినట్టుగా. నీ కళ్లముందే కదులుతూ.
క్యాబ్ డ్రైవర్లను చూసి, బస్టాపుల్లో జులాయిలను చూసి నువ్వు భయపడ్డావ్. తెల్లటి దుస్తుల్లో నిర్మలంగా నవ్వే మనిషుల్లోనూ మృగాలు దాగుంటారని ఊహించలేకపోయావ్. విషయం తెలుసుకునే సరికే, కల చెదిరిపోయింది. ఆశలన్నీ పేకమేడల్లా కుప్పకూలాయి. నువ్వు మాత్రం చిదిమేసిన కలలోనే బంధీగా.
నీ దృష్టి నాన్న వెనుకగా గోడపై నిలువెత్తుగా ఉన్న నీ ఫోటోపై పడింది. రెప్పవేయడం మర్చిపోయినట్టుగా నువ్వు అలా చూస్తూనే ఉన్నావ్. క్రమంగా నీ చూపు ఫోటో అద్దంపై కేంద్రీకృతమైంది. దానిపై అస్పష్టంగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని నువ్ చూశావ్. స్థాణువులా. నీ చూపుని నువ్వే నమ్మలేనట్టుగా.
ఒంటినిండా ఎండిన రక్తపు మరకలు… కమిలిన గాయాలు… చిందరవందరగా మారిన జుట్టు… భీకరంగా పొడుచుకొచ్చిన కనుగుడ్లు… చిట్లిపోయిన పెదాలు… చిరుగులతో…. పీలికలైన ఆకుపచ్చని రంగు చుడీదార్!!! ముచ్చటగా ఉండే నీ రూపు ముక్కలైపోయింది. నిన్ను నువ్వే పోల్చుకోలేనంతగా… నీవెలా ఉండేదానివో నీకే అస్సలు గుర్తురానంతగా…
ఈ రోజుకు సరిగ్గా మూడు రోజుల ముందు. ఆ రోజు శుక్రవారం…
“ఇక మీరెవ్వరూ కష్టపడక్కర్లేదు. చెల్లిని నేనే చదివిస్తాను. నాకు జాబొచ్చింది. పెద్ద హాస్పిటల్ తెలుసా. పాపులర్ పొలిటీషియన్ ది. ఆయనే ఇంటర్వ్యూ చేసారు. చాలా కష్టపడి పైకొచ్చారట. నన్ను కూడా చాలా మెచ్చుతున్నారు. కన్ఫర్మేషన్ లెటర్ కూడా ఈరోజే ఇస్తారట! ఇంకో గంట ఆగమన్నారు”
“మబ్బుగా ఉంది కదమ్మా. వర్షం వచ్చేలా ఉంది. నాన్నకూడా ఇంట్లో లేరు. అదేదో రేపు తీసుకోవచ్చుగా. ఇంటికొచ్చెయ్”
“నీ కన్నీ భయాలే అమ్మా. ఆయన చిల్లర మనిషికాదు. ఫలానా ఏరియా లీడర్.”
హాస్పిటల్ ముందు నిలబడి మాట్లాడుతుండగానే ఏదో మెసేజ్. అప్పాయింట్మెంట్ లెటర్ ఈరోజే కావాలంటే ఇంకో గంట ఆగాలన్న సందేశమది.
“ఇదిగో అప్పుడే మెసేజ్ చేసారు. ఇంకా పదినిముషాలుంది. చూసావా ఎంత పంక్చువాలిటీనో. ఇలా వెళ్లి అలా లెటర్ తీసుకుని అరగంటలో వచ్చేస్తా…” అలవోగ్గా అబద్ధమాడేస్తావ్.
ఫోన్ కట్టేసి చుట్టూ చూస్తావ్.
అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. సన్నటి చినుకులు మొదలయ్యాయి. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో ఉన్న నీకు ఆ వాతావరణం ప్రతిబంధకంగా కనిపించలేదు. అడ్మిన్ సెక్షన్‌కు వెళ్లావ్. హెచ్చార్ మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తిచేసింది. ఎకౌంట్స్ అమ్మాయి నీవేలి ముద్రలు మెషీన్లో ఫీడ్ చేసింది.
“సీ యూ ఆన్ మన్డే” అందంగా నవ్వుతూ ఆఫీస్ నుంచి బయల్దేరారు వారిరువురూ. ఆ వైపే చూస్తూ ఉండిపోయావ్ నువ్వు. అడ్మినిస్ట్రేషన్ భవంతి నెమ్మదిగా పలుచబడుతోంది.
గంట తర్వాత…
లోపలికి రావాలంటూ మరో మెసేజీ. నువ్వు లేచి నిల్చుంటావ్! కెరీర్ ఆశలను కళ్లలో వెలిగించుకుని ముందుకు నడుస్తావ్!
ఫోన్ రింగవుతుంది. ఇంటినుంచి.
లిఫ్టు చేసేంతలో దాని గొంతు నొక్కేస్తూ సిగ్నల్ జామర్ ఆనవుతుంది. అవేమీ తెలీని నువ్వు ఆనందంగా ఛైర్మన్ ఛాంబర్ దిశగా అడుగులేస్తావ్.
ఇర్రివర్సబుల్ నైట్!!! తెలుస్తూనే ఉంటుంది. దాన్ని ఎలాగైనా మార్చాలని శతవిధాలా ప్రయత్నిస్తావ్! పోరాడతావ్! సహజాతంగా వచ్చే ప్రతిఘటననూ అసహజంగా భావించి హిసించే క్రూరమృగంతో. ఆ చీకట్లో… ఒళ్లంతా కళ్లు చేసుకుని… అందని సాయంకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉంటావ్!!! చెంపల తడి ఆరకుండా నీ కళ్లు వర్షిస్తూనే ఉంటాయి. ప్రాణాలతో ఉన్నందుకో… జీవశ్చవంలా మారినందుకో… నెమ్మదిగా నీ దేహం మొద్దుబారుతుంటుంది. మెదడు ఓటమినంగీకరించదు. పోరాడమని నిర్విరామంగా సంకేతాలు పంపుతూనే ఉంటుంది. అప్పటికే చల్లబడ్డ నీ శరీరం పూర్తిగా చలనాన్ని కోల్పోతుంది. కళ్లముందు చీకట్లు కమ్ముకుంటాయి. ఎవరో బలవంతంగా వలిచేస్తున్నట్టుగా నీ ప్రాణాలు దేహం నుంచి వేరవుతాయి. తల పక్కకు వాలిపోతుంది. నీ చూపు మాత్రం కొద్ది దూరంలో పడిన పింక్ కలర్ అప్పాయింట్ మెంట్ లెటర్ మీద నిలిచిపోతుంది.
** **