జూన్ 14, 2017 నడి రేయి. సమయం రాత్రి ఒంటిగంట కావస్తోంది. పశ్చిమ లండన్ లోని నార్త్ కెన్సింగ్టన్ ప్రాంతంలో 24 అంతస్తుల భవనం, గ్రెన్‌ఫెల్ టవర్ కి నిప్పంటుకుంది. నాలుగో అంతస్తులోని ఒక అపార్ట్మెంట్ లో రిఫ్రిజిరేటర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పు అంటుకుని, మంటలు చెలరేగాయి. మంటలు శరవేగంగా మిగతా అంతస్తులన్నిటికీ ఎగబాకేయి. అపార్టుమెంట్లలో నివాసముంటున్న 72 మంది ఆ అగ్ని ప్రమాదంలో 72 మంది చనిపోయారు, 70 మందికి గాయాలు అయ్యాయి. 223 మంది ప్రాణాలతో తప్పించుకోగలిగేరు.
అందంగా కనిపించేందుకు భవనం పైన అల్యూమినియం మెరుగుపూత (క్లాడింగ్) ఏర్పాటు, అందులో భాగంగా ఉపయోగించిన సామగ్రియే మంటలు అంత వేగంగా, దీర్ఘంగా కొనసాగడానికి దోహదం చేసిందని తేలింది. మానతలని అదుపులోకి తేవడానికి 250 మంది అగ్నిమాపక సిబ్బంది, 45 అగ్నిమాపక యంత్రాలు 60 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది.
1988లో జరిగిన పైపర్ ఆల్ఫా ప్రమాదం తర్వాత, లండన్ నగరంలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదమే గ్రెన్‌ఫెల్ టవర్ దుర్ఘటన. దీనిని, కేవలం ఒక ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనగా చూడకూడదనీ, సుదీర్ఘకాలంగా వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు వరుసగా అనుసరిస్తూ వచ్చిన ‘పొదుపు చర్యల (ఆస్టెరిటీ)’ పర్యవసానంగా చూడాలనీ చాలామంది భావించారు. అగ్నిప్రమాదం సంభవిస్తే, అందులోని అందరూ ఒకే సారి తప్పించుకోవాల్సిన అవసరం లేదనే ఆలోచనతో రూపొందించిన భవనం అది. మంటలు అంతగా విస్తరించే అవకాశం లేకుండా రూపొందించారు. అయితే, ఆ తర్వాత భవనానికి మెరుగులు దిద్దే కార్యక్రమంలో భాగంగా వినియోగించిన సామగ్రి భవనం మొత్తానికి మంటలు అంటుకునేలా దారితీసింది. ఇందులో, ఉపయోగించిన సామగ్రిని మునుపెన్నడూ అగ్నిప్రమాదాలలో పరీక్షించి చూడలేదు. ఖర్చు తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో ప్రమాదానికి దారితీసిన నాసిరకం సామగ్రిని ఉపయోగించారు. భవనంలో అగ్ని ప్రమాదాలను నివారించే భద్రతా ఏర్పాట్ల గురించి ఎలాంటి పరిశీలనలు జరపలేదు. మంటలను ఆర్పే నీటి స్ప్రింక్లర్లు గానీ, అలారం వ్యవస్థగానీ ఏదీ పనిచేయలేదు. ఈ నిర్లక్ష్యం గ్రెన్‌ఫెల్ భవనానికి పరిమితమైనది కాదు. అగ్నిమాపక భద్రతా సిబ్బంది, యంత్రాలు, రక్షణ యంత్రాంగం అన్నీ ప్రభుత్వ పొదుపు చర్యల ప్రభావానికి గురయ్యాయి. కార్మికులు, వినియోగదారులకు చట్టబద్ధంగా రక్షణ, భద్రత కల్పించే ప్రభుత్వ విధానాలు వ్యాపార వర్గాలకి ఒక పెద్ద గుదిబండగా తయారయ్యాయని ప్రభుత్వ అధినేతలు బాహాటంగా వ్యాఖ్యానించారు.
ఈ దుర్ఘటన ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన చర్చకు దారితీసింది. వ్యవస్థీకృత హింసలో భాగంగా ఈ ప్రమాదం జరిగిన తీరుని సామాజిక శాస్త్రవేత్తలు విక్కీ కూపర్, డేవిడ్ వైట్ లు విశ్లేషించి వివరించారు (గ్రెన్‌ఫెల్ , ప్రభుత్వ పొదుపు చర్యలు, వ్యవస్థీకృత హింస వ్యాసం. ఈ రచయితలే రాసిన ది వయొలెన్స్ ఆఫ్ ఆస్టెరిటీ అనే పుస్తకం ఈ వ్యవస్థీకృత హింసా రూపాలని కళ్ళకు కడుతుంది).
గ్రెన్‌ఫెల్ దుర్ఘటన సమాజాన్ని కదిలించింది. ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన చర్చని రేకెత్తించింది. 2021 జూన్ 23 తేదీన ప్రసిద్ధ నైజీరియన్ రచయితా, కవీ బెన్ ఓక్రి ఈ ఘటనపై రాసిన ఒక దీర్ఘ కవితని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ‘పేదవాళ్ళు ఎలా చనిపోతారో చూడాలంటే, గ్రెన్‌ఫెల్ భవనాన్ని చూడండ’ని బెన్ ఓక్రి రాశారు.
బెన్ ఓక్రి కవిత అనువాదాన్ని ఇప్పుడు చదవండి,
గ్రెన్‌ఫెల్ టవర్, జూన్, 2017
-బెన్ ఓక్రి
అది ఆకాశంలో కాలిపోయిన ఒక అగ్గిపెట్టె
ఆకాశంలో తగలబడి, పొడవుగా, నల్లగా మసిబారి పోయిందది
చిగురించి పూలుపూసిన చెట్ల మొదళ్ళ మధ్య
జేగురు రంగు చర్చి గోపురాలకు అవతల
మీకు కనిపిస్తుందది
బతికి బట్టకట్టిన జనాల కన్నీళ్ళలో
ప్రాణాలు నిలబెట్టుకున్న జనాల క్రోధంలో
మంటలలో కాలిబూడిదైపోయిన వాళ్ళకోసం
మంటలకి తాళలేక పైనుంచి దూకి చనిపోయిన వాళ్ళ కోసం
అతికించిన పోస్టర్లలో
మీరు దాన్ని చూశారు
మెరుగుపూతలు తగలబడుతూ
ఎగసే మంటలు కిటికీలని కమ్ముకుంటున్న టెలివిజన్ దృశ్యాలలో
పైకప్పు నుంచి మంటలు విరజిమ్ముతున్న పత్రికల చిత్రాలలో
మీరు దాన్ని చూశారు
వీధులలో హోరెత్తే మాటలలో
న్యాయంకోసం ఎలుగెత్తే నినాదాలలో
పానశాలలలో, వీధులలో, నేలమాళిగలలో, అద్దెగదులలో
విలపించే స్త్రీల రోదనలో, వీధులలో తిరుగాడే అనాథల మౌన ఆక్రందనలలో
మీరు దాన్ని విన్నారు
ఊపిరి సలపకుండా కమ్ముకున్న నల్లని పొగల మృత్యు పరిష్వంగంలో
పెనుగులాడే ఆత్మ లు భయపెట్టే రాత్రులలో
నిద్రపట్టక జలదరించే మీ పసిపాపల భయంలో
ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే దగ్దమై చనిపోయే దేశంలో
పేదవాళ్ల జీవితానికి విలువే లేదా?
చనిపోయిన వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించే మీ కలలలో
మీరు దాన్ని చూశారు
మీ కళ్ళతో మీరు కళ్లారా చూశాక
కనిపించే ఈ దృశ్యాలకి ఇక అర్ధమేమీ ఉండబోదు
ఆకాశంలో నిటారుగా, పొడవుగా, నల్లగా మసిబారిపోయిన ఆ భవనాన్ని మీరు చూశారు
కాలిపోయిన దాని కిటికీలనీ, మాడి మసయిపోయిన అంతస్తులనీ మీరు లెక్క పెడతారు
భవనంపై సగం కాలిపోయిన రోగిష్టి పసుపుపచ్చ పైపూతని మీరు చూస్తారు
అది భయపెట్టే పీడకలలలో మాత్రమే కనిపించే దృశ్యం
సుందర సురుచిర సీమలో
నగరంలోకి తరలి వచ్చిన యుద్ధ క్షేత్రం
కరాళ రాత్రి పీడకలలాంటి దృశ్యాన్ని కళ్ళారా చూశాక
పట్టపగలు కాళరాత్రిగా మారిపోతుంది,
ప్రపంచమే తల్లకిందులుగా కనిపిస్తుంది
బ్రతికివున్న మనుషులు చనిపోయారు
నేలమీద నడయాడిన మనుషులు ఇప్పుడు భూమికే దూరమయ్యారు
పేదవాళ్లు ఎలా చనిపోతారో చూడాలంటే మీరు గ్రెన్‌ఫెల్ భవనాన్ని చూడండి
తగలబడిన ఆ భవనాన్ని చూశాకైనా ప్రపంచాన్ని మార్చే ఒక స్వప్నాన్ని వికసించనివ్వండి
అక్కడి జనాలు దాన్ని స్మశానం అన్నారు
మనకాలంలో బయటికి కనిపించని అంతః స్రవంతి అది
డబ్బున్నవాళ్ళకి ఓట్లు వేస్తే వాళ్ళైనా మమ్మల్ని కాపాడతారని పేదవాళ్ళు నమ్మారు
పత్రికలలో రాసేదంతా నిజమని నమ్మారు
భయపడుతూనే చెప్పింది విన్నారు వాళ్ళు
వాళ్ళు ఒంటి గదులలో, పిల్లల భవిష్యత్తు గురించి కలలుగనే పేదజనాలు
మీరూ, నేనే అసలు పేదవాళ్ళం
మీ పూలతోటలలో
మీ పుస్తకాల గదులలో కూర్చుని
దూరం నుంచి కనిపించే మరో భవిష్యత్తుని చూస్తుంటారు మీరు
కొన్నికొన్ని సార్లు జాతి ఆత్మని తట్టిలేపడానికి
రహస్యంగా సిగ్గుతో తలదించుకునే ఒక దృశ్యం కావాలి
ఇదిగో ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయి
గదిలో నిద్రపోతూనో, తప్పించుకోవాలని పరుగెత్తుతూ మెట్ల మీదనో
మంటలలో చిక్కుకుని కాలిపోయిన వాళ్ళు
ఎందుకు చనిపోతున్నారో వాళ్లకి తెలియదు
ఎట్లా ద్రోహం చేసి చంపారో వాళ్లకు తెలియదు
మంటలలో చిక్కుకుని కాలిన క్షణాన చనిపోలేదు వాళ్ళు
వాళ్ళ చావు అంతకు ముందే ఎప్పుడో జరిగిపోయింది
వాళ్ళ జీవితాలని పట్టించుకోని మనుషుల మనసులలో
వాళ్ళ చావు ఎప్పుడో జరిగిపోయింది
లాభాల వేటలో వాళ్ళ చావు వుంది
చట్టాల చేతిలో వాళ్ళ చావు వుంది
డబ్బులు పొదుపులో , లాభాల సంపాదనలో
వాళ్ళ బతుకులు బలైపోయాయి
బ్రతికివున్న మనుషులు చనిపోయారు
నేలమీద నడయాడిన మనుషులు ఇప్పుడు భూమికే దూరమయ్యారు
పేదవాళ్లు ఎలా చనిపోతారో చూడాలంటే మీరు గ్రెన్‌ఫెల్ భవనాన్ని చూడండి
తగలబడిన ఆ భవనాన్ని చూశాకైనా ప్రపంచాన్ని మార్చే ఒక స్వప్నాన్ని వికసించనివ్వండి
వాళ్ళు ఆ భవనం వికృతంగా, అసహ్యంగా ఉందన్నారు
చుట్టూ అందమైన మనుషులు, అందమైన భవనాల మధ్య
వికృతమైన భవంతి వుంటే, వాటి విలువ తగ్గిపోతుందన్నారు
భవంతికి పైపూత మెరుగులు కోసం పది లక్షలు ఖర్చుచేశారు
ఆ మెరుగులు పైపూతని ఎక్కడైనా పరీక్షించి చూశారా?
అగ్ని ప్రమాదాలలో దాన్ని ఎప్పుడైనా పరీక్షించి చూశారా ?
ఎలాంటి పరీక్షలూ జరపకుండానే, పైపూత వేశారు
ఆ భవనం అందంగా మెరిసిపోయింది
ఇరవై నాలుగు అంతస్తుల భవనం అది
మంటలు ఆర్పే నీటిజల్లుల పరికరాలు ఒక్కటంటే ఒక్కటి పనిచేయలేదు
ఇరవై నాలుగు అంతస్తులలో
అగ్నిప్రమాదాన్ని సూచించే అగ్నిప్రమాద ఘంటికలు ఏవీ పనిచేయలేదు
ఇరవై నాలుగు అంతస్తులలు
అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునే అత్యవసర ద్వారాలు అసలే లేవు
ఉన్నదల్లా దిగుడుబావి మెట్లు
అగికీలల నాలుకలు చాచిన మృత్యు గహ్వరం
ఇదీ మనకాలం కథ
బయటనుంచి అందంగా కనిపించేట్లు చూడు
లోపల అది ఒక మృత్యు కుహరం
డొల్లతనానికి మెరుగులు దిద్దు
శూన్యాన్ని సంగీతంగా విన్పించు
వాళ్ళు చూసేదంతా అదే
ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం,
అందంగా ధ్వనించేలా చూడడం
అసలు రూపం ఎలాంటిదో పట్టించుకోరు
మీరు నిజంగా చూస్తే దాని అసలు రూపం మీకు కనిపిస్తుంది
మీరు నిజంగా వింటే మీకది వినిపిస్తుంది
పైపై మెరుగుపూతల కింద అసలు ఏముందో మీరు చూడాల్సి ఉంటుంది
ప్రతీదానికీ పైపై మెరుగుల పూతలు
ఆర్ధిక విషయాలకి మెరుగు పూటలు
ఆలోచనలకి ఆకర్షణీయమైన పైపూతలు
అన్నీ పైకి అందంగానే కనిపిస్తాయి
లోలోపల వాటికి సారం లేదు, హృదయం లేదు, వున్నదంతా పైపై మెరుగులు
వాళ్ళు మాట్లాడతారు, ఆ మాటలు వట్టి డొల్లమాటలు
చర్యలు తీసుకున్నట్లు నటిస్తారు, అవి శుష్క చర్యలు
తగలబడిపోయింది భవనం దగ్గరికి వచ్చి నిలబడతారు,
వాళ్ళ హృదయం అక్కడ ఉండదు
బ్రతికివున్న మనుషులు చనిపోయారు
నేలమీద నడయాడిన మనుషులు ఇప్పుడు భూమికే దూరమయ్యారు
పేదవాళ్లు ఎలా చనిపోతారో చూడాలంటే మీరు గ్రెన్‌ఫెల్ భవనాన్ని చూడండి
తగలబడిన ఆ భవనాన్ని చూశాకైనా ప్రపంచాన్ని మార్చే ఒక స్వప్నాన్ని వికసించనివ్వండి
మన గొంతులు ఇక్కడ చనిపోయినవాళ్ళ కోసం మాట్లాడాలి
చనిపోయిన వాళ్ళకోసం మాట్లాడుదాం
చనిపోయిన వాళ్ళకోసం మాట్లాడుదాం
గోడలమీద అతికించిన చనిపోయినవాళ్ళ చిత్రాలు చూడండి
పేదరికం ఒక రంగు, పేదరికం ఒక జాతి
ముస్లింలు, క్రిస్టియన్లు
తెల్లవాళ్లు, నల్లవాళ్ళు, మిశ్రమ వర్ణాల మనుషులు
యువతీ యువకులు, వృద్ధులు, అందమైన మనుషులు, మధ్యవయస్కులు
అందంగా అలంకరించుకుని భవిష్యత్తు కలలు కంటున్న అమ్మాయిలు
అందరూ వున్నారక్కడ
అడుగో, మనవలు, మనవరాళ్ళతో నిలబడిన ముసలిమనిషి
ప్రపంచాన్ని చూడకముందే మంటలలో చనిపోయిన
మూడేళ్ళ పసిపాప అమయా టుకు అదిగో అక్కడే వుంది
పేరు సంపాదించాలనో, సంతోషాన్ని అందుకోవాలనో, బాగా చదువుకోవాలనో, ప్రేమించాలనో
కలలుగన్న మనుషులు
అదిగో ఆ మంటలలో మాడిపోయిన మనుషుల పేర్లు అవిగవిగో
అదిగో ఇద్దరు ఇటలీ మనుషులు, అందమైన మనుషులు, యవ్వనం తొణికిసలాడుతున్న మనుషులు
మంటలు చుట్టుముట్టినప్పుడు స్నేహితులతో ఫోన్ మాట్లాడుతున్నారు
లాభాల పొగ వాళ్ళ గొంతుల్ని శాశ్వతంగా నులిమివేసింది
అదిగదిగో, చావునుంచి ఎలాగైనా తప్పించాలని
కన్నబిడ్డని పైనుంచి విసిరివేసిన కన్నతల్లి
అదిగో, అక్కడ కిటికీలనుంచి కిందికి దూకి చనిపోయిన వాళ్ళు
మీరు అక్కడే ఉండండని చెబితే
తగలబడుతున్న గదులలో సహాయం కోసం ఎదురు చూస్తూ చనిపోయిన మనుషులు
మంటలో కాలిపోతూ ఇరవైయవ అంతస్తు నుంచి
కిందికి దూకిన చిన్నారి చిట్టితల్లి అదిగో
ఇంకా వివరాలు కావాలా?
బ్రతికివున్న మనుషులు చనిపోయారు
నేలమీద నడయాడిన మనుషులు ఇప్పుడు భూమికే దూరమయ్యారు
పేదవాళ్లు ఎలా చనిపోతారో చూడాలంటే మీరు గ్రెన్‌ఫెల్ భవనాన్ని చూడండి
తగలబడిన ఆ భవనాన్ని చూశాకైనా ప్రపంచాన్ని మార్చే ఒక స్వప్నాన్ని వికసించనివ్వండి
వాళ్ళు మాటలలో చెప్పే దానికీ, ఆచరణలో జరిగేదానికీ మధ్య
ఎప్పుడూ ఒక వ్యత్యాసం
అధికారిక మృతుల సంఖ్య ముప్ఫయి దగ్గరే నిలిచిపోయింది
నిజం బంగారంకంటే విలువైనదైపోయింది
చీకటిలో బయటికి మోసుకొచ్చిన శవాలు
చీకటిలోనే మిగిలిపోయిన శవాలు
నల్లటి చీకటి పొగలో సమాధి అయిన శవాలు
బ్రతికివున్న మనుషులు చనిపోయారు
మీ విందు విలాసాల మధ్య, టెన్నిస్ ఆటల మధ్య వీలుచేసుకుని
గ్రెన్‌ఫెల్ భవనాన్ని చూడడానికి వెళతారా
అక్కడ మీకు సగం కాలి, పొగచూరిన కంకాళంలా నిలబడిన భవనం కనిపిస్తుంది
వింతగా, ఇతర భవనాలకు హెచ్చరిక లాగా మిగిలివుందది
విషాదాన్ని నింపుకున్న భారమైన గాలి మిమ్మల్ని పలకరిస్తుందక్కడ
ఆడవాళ్ళు అకస్మాత్తుగా విలపిస్తూవుంటారు
పిల్లలు దీనంగా అటూ ఇటూ తిరుగుతూవుంటారు
మగవాళ్ళు రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటూ కనిపిస్తారు
జనాలు ఆ భయంగొలిపే భవనాన్ని తదేకంగా చూస్తూనే వుంటారు
పచ్చని ఆకుల చెట్లు మీకు కనిపిస్తాయి
చావు వాసన పోగొట్టేందుకు
వెలిగించిన అగరుబత్తీల వాసన మిమ్మల్ని కమ్ముకుంటుంది
పుష్పగుచ్ఛాలు కనిపిస్తాయి
గోడలకు అంటించిన కాగితాలపై అక్షరాలు కన్నీళ్ళు కారుస్తాయి
మృతుల ఆత్మశాంతికోసం వెలిగించిన కొవ్వొత్తులు కరుగుతూఉంటాయి
సామూహిక సహకారం అంటే ఏమిటో మీకిక్కడ అర్ధం తెలుస్తుంది
ఆహారాన్ని పంచుకుంటారు, బాధలని పంచుకుంటారు
ప్రతిచోటా స్వచ్ఛంద సేవకులు కనిపిస్తారు
గాలిలో పూల పరిమళంతో పాటు
శవాలు కాలిన కమురువాసన కమ్ముకుంటుంది
పేదవాళ్లు ఎలా చనిపోతారో చూడాలంటే మీరు గ్రెన్‌ఫెల్ భవనాన్ని చూడండి
మీకు చేతనయితే ఈ వివరాలని అర్ధం చేసుకోండి
సత్యాన్ని చంపలేని చోట స్ఫూర్తి జీవిస్తుంది
అబద్ధపు మెరుగుల పైపూత కోసం పది లక్షలు వెచ్చించారు
పైపూతకి నిప్పంటుకున్న మంటలలో
వందలమంది తమ సర్వస్వాన్నీ కోల్పోయారు
దేశం దేశమే తన ఆలోచనల్ని మార్చుకోవాల్సిన సందర్భమిది
ఒక చిత్రం జీవితాన్ని అందిస్తుంది
ఇంకొక చిత్రం ప్రాణాల్ని హరిస్తుంది
రాజకీయ పథకాల వెనక రాతిగుండె కనిపిస్తుంది
ధనవంతుల వైభోగం కోసం పేదవాళ్ళు ప్రాణాలు కోల్పోతారు
పాఠశాలలు, గ్రంధాలయాలు నిధులు కరువై, కనుమరుగైపోతాయి
ఒక వింత కాలం దాపురిస్తూవుంది
చెవులుండీ వినిపించుకొని అధికారం అందలమెక్కిన వేళ
మృత్యువు ఖడ్గమై వేలాడుతూ వుంది
తగలబడిన ఆ భవనాన్ని చూశాకైనా ప్రపంచాన్ని మార్చే ఒక స్వప్నాన్ని వికసించనివ్వండి
(అనువాదం: సుధా కిరణ్)
బెన్ ఓక్రి ఈ కవితను చదువుతున్న వీడియో :
చాలా శక్తివంతమైన, హృదయాలను కదిలించే కవిత. అనువాదం చాలా బాగా చేసారు. అభినందనలు కిరణ్