గోమయము!

                                                                        

సర్రున జారాడు.

జారడమంటే మామూలు జారడం కాదు, జారుడు బల్లమీంచి జారినట్టు జారిపడ్డాడు. అయితే వొక కాలు ముందుకీ మరొక కాలు వెనక్కీ అయ్యింది. వెల్లకిలా పడ్డాడు. అదీ తారు రోడ్డుమీద.

పడుతూనే ‘అమ్మా’ అని అరిచాడు.

చూసినవాళ్ళు ‘అయ్యో’ అన్నారు. 

నడ్డి విరిగినట్టే వుంది. నొప్పికి నడ్డిమీద చెయ్యివుంచి కళ్ళుమూసి మాట పెగలనట్టు భారంగా ‘అమ్మా’ అని ముక్కులుతున్నాడు.

రోడ్డున్న పోతున్నవాళ్ళూ రోడ్డుకి యిటూ అటూ దుకాణాల దగ్గర వున్నవాళ్ళూ పరుగున వచ్చి పడిన వాడిని లేపబోయారు. అతను చెయ్యి అందిస్తే లేచేలా లేడు. అమాంతం అటు యిద్దరూ యిటు యిద్దరూ పట్టుకొని బలంగా లేపితే, అదే సమయంలో కాళ్ళని వొకడు సరిచేస్తే అప్పుడు ఆసరాతో నిలబడ్డాడు. ఊతమిచ్చి రోడ్డు పక్కకు అతణ్ణి నడిపించారు. అక్కడున్న బెంచీమీద కూర్చోబెట్టారు.

కళ్ళముందు దబ్బున పడినా యించీ కూడా కదలకుండా దూరంగా నిలబడి చూస్తున్న కొందరు ‘తాగి పడివుంటాడు’ అని సందేహిస్తూ సరిపెట్టుకున్నారు, తాము అలాగే నిలబడి వుండడాన్ని పరోక్షంగా సమర్ధించుకుంటూ.

పడడంతో పరిగెత్తుకుంటూ వచ్చినవాళ్ళలో కొందరు అతనికి వుపచర్యలు చేస్తూ వుంటే, ఖాళీగా వున్న మరికొందరికి కొన్ని రకాల అనుమానాలు కలిగాయి. ‘బీపీ వుందా?’ ‘చెక్కర వుందా?’ ‘గ్లూకోజ్ డౌన్ అయ్యిందేమో?’ అని వొక్కొక్కరూ వొక్కో డాక్టరై అడిగారు.

పడ్డవాడు తలడ్డంగా వూపుతూ మూలిగాడు.

మూలిగిన ముఖమ్మీద నీళ్ళు చల్లారు. కొన్ని నీళ్ళు గొంతులో పోశారు. ‘ఎండకు కళ్ళుతిరిగినట్టున్నాయి,’ అని యెవరో కనిపెట్టినట్టుగా అనేసరికి మరెవరో బాటిల్‌తో నీళ్ళు తెచ్చి యేకంగా నెత్తిమీద పోసి బట్టలు కూడా తడిపేశారు.

నడిచి నడిచి పడిపోవడానికి అతనేం పసిపిల్లాడు కాదు. పరిగెత్తి పడిపోయాడా అంటే అదీ కాదు. పోనీ, యెవరైనా తోసేశారా అంటే అదీ కాదు. మరెందుకు పడిపోయాడు? డిటెక్టివ్‌లా ఆలోచించాడు వొకడు. జాగిలమై వాసన పసిగట్టకుండా వుండలేకపోయాడు. ముక్కును ముందుకు పెట్టి యెగ పీల్చాడు. అనుమానం తీరలేదు. చుట్టూ చూశాడు. ట్రాఫిక్ పోలీసులకు రాత్రిపూట చెక్ చేయడమే తెలుసు, పగలు మద్యం తీసుకోకూడదని రూలేమీ లేదుకదా? వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకు వెళ్ళి ట్రాఫిక్ పోలీసుని లాక్కొచ్చాడు. పడ్డవాడి నోట్లో బ్రీత్ అనలైజర్ కుక్కి పెట్టి వూదమన్నాడు. రొప్పుతూ ‘వుష్’ అన్నాడు పడ్డవాడు. సరిగ్గా వూదమన్నాడు డిటెక్టివ్ కాని డిటెక్టివ్. ‘అతనేం వెహికల్ నడపడం లేదు కదా?, నడిచి వస్తున్నాడు కదా?’ పోలీసు సమర్ధించడం చూస్తే తాగినట్టు నిర్ధారణ చేసేసినట్టుగావుంది.

‘వెహికల్ నడపకపోయినా వెహికల్ కింద పడితే?’ లాజిక్ లాగి యేదయితేనేం మొత్తానికి పడ్డవాడిని పరీక్షకు నిలబెట్టారు.

ఆశించిందేదో బ్రీత్ అనలైజర్ చూపించలేదు. సరిగ్గా పనిచేస్తోందో లేదో అన్నట్టు అనలైజర్‌ని నోట్లోంచి తీసి విదిలించి దులిపి మళ్ళీ నోట్లో పెట్టి వూదమన్నాడు డిటెక్టివ్ కాని డిటెక్టివ్. పోలీసు వుద్యోగం తను చేసేస్తున్నాడు, భాద్యతగల పౌరుడుగా. ఓపిక లేక ‘వుఫ్ వుఫ్’ అని పడ్డవాడు వూదుతుంటే, సరిగ్గా వూదమని అసహనంగా అన్నాడు. ఓపిక తెచ్చుకొని వూదాడు. మొత్తానికి తాగలేదు అని తేలింది.

ఈ తంతుని నడిపినవాడికీ వాడికి సహకరించిన వాళ్ళకీ యేదో తెలియని అవమానంగా వుంది. అందుకే మళ్ళీ ముక్కు ముందుకి పెట్టి వొకటికి నాలుగు సార్లు గాలిని పీల్చి వదిలాడు డిటెక్టివ్ కాని డిటెక్టివ్. అప్పుడు అతనికే కాదు, చుట్టు పక్కల వున్నవాళ్ళకి కూడా ఆ వాసన తగిలింది.

అది పేడ వాసన.

గుమికూడిన వాళ్ళు ముక్కులు చిట్లించారు. పడ్డవాడు నొప్పులకు ‘అమ్మా’ అని వగరుస్తూ కాళ్ళు తిన్నగా చాపాడు. అప్పుడు చూశారు. అది యెడమ కాలు. పాదం దగ్గర గోధుమ ఆకుపచ్చ రంగుల కలబోతలో ముంచి తీసినట్టు పేడ అంటుకొని వుంది.

‘పేడకుప్ప మీద అడుగు వేసి పడినట్టున్నాడు’ అని ఆఖరుకు తేల్చేశారు. చూసుకోవద్దా- అని యెవరో అంటున్నారు. ఎవరో పట్టేసిన మక్క దగ్గర రుద్దుతున్నారు. పడ్డవాడు లేచి నిలబడబోయి నడుం దగ్గర కరాల్ మనడంతో మళ్ళీ కూర్చుండిపోయాడు. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది గమనించిన వొకావిడ తన బ్యాగులోంచి బామ్ తీసి అక్కడ సున్నితంగా అప్లయ్ చేసింది. గట్టిగా రుద్దమని వొకరు. రుద్దకూడదని వొకరు. వాదులాడు కుంటున్నారు. ‘నువ్వు ఎమ్బీబియస్సు చదివావు మరి’ అంటే ‘నువ్వో ఎమ్బీబియస్సు ఎఫ్ఫార్పీయస్ చదివావులే పేద్ద’ అని గుద్దులేసుకోవడానికి సిద్ధపడిపోయారు. ఇంతలో యుద్ధానికి శంఖారావంలా అంబారావం వినిపించింది.

అంతా తలలు తిప్పి చూశారు.

ఆవు ‘అంబా’ అని మళ్ళీ అరిచింది. 

రోడ్డు మధ్యలో ఆవు నిల్చొని వుంది. దూరంగా వున్న ఆ ఆవుని చూశారు. దగ్గరగా వున్న యీ పేడని చూశారు. పేడ గొబ్బెమ్మలా వేసినట్టుగా ముద్దగా లేదు. కడి తొక్కినట్టూ ఆనవాళ్ళు కనిపించాయి. సాక్ష్యంగా పడ్డవాడి కాలూ వుంది. అన్నీ వొకదానికి వొకటి కనెక్ట్ అయ్యాయి. ఏమి జరిగిందో అంతా సులువుగానే వూహించారు. అయితే యేమి జరుగనుందో పడ్డవాడు మాత్రం వూహించలేకపోయాడు.

ఒక్క క్షణం నిశ్శబ్దం. మరుక్షణం రణరంగం.

అప్పటికే ఆవు దగ్గరికీ పేడ దగ్గరికీ పేడని మట్టిన మనిషిదగ్గరకీ కొందరు ప్రదక్షిణలు చేసినట్టు పరుగుపరుగున తిరిగారు.

ఏ మక్క అయితే నొప్పని చెయ్యి వేసుకు పట్టుకున్నాడో ఆ మక్కమీద వొక్క తాపు తన్నారెవరో. పడ్డవాడు బెంచీమీంచి దబ్బున కిందపడ్డాడు. పడ్డవాణ్ని లేపారు కొందరు, యేమయిందో అర్థం కానట్టు చూశారు. లేచి నిల్చున్న మనిషి ముడ్డి మీద మళ్ళీ వొక తాపు తన్నారు. ముందుకి పడ్డాడు. ముందు పల్లు విరిగినట్టు రక్తం. మరెవరో దవడమీద బలంగా గుద్దారు.

‘ఎందుకు అతణ్ణి కొడుతున్నారు?’ యెవరో అడిగారు.

‘కొట్టాలా? కొట్టి చంపాలా?’ అని మరొకరు చెపుతుండగా ‘యిక్కడే గొయ్యితీసి పాతెయ్యాలి, యీ నా కొడుకుని,” అని యింకొకరు భుజమ్మీద గుద్దారు. “అన్నా, యీ లంజొడుక్కి కళ్ళు దెంగాయా? చూడన్నా… అది కూడా యెడమకాలితో తొక్కాడు…” యింకొకరు మీదమీదకు వెళితే మరెవరో ఆపారు. ‘ఏమయింది?’ అనుమానం తీరని మనిషి మళ్ళీ అడిగాడు.

‘లక్ష్మీదేవిని తొక్కుతాడా యీ బాడకావ్… ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం వుంటుందని తెలీదా?’ అని ఆవేశంతో రొప్పుతూ వున్నారొకరు. ‘ఆడేం పాలు తాగే పిల్లోడా? పెద్ద మనిషే కదా?’ నిలదీసి అడుగుతున్నారు మరొకరు.

‘గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిస్తథైవ చ గవాం పంచ పవిత్రాణి,’ అని గొణుక్కుంటున్నట్టు మంత్రాలు చదువుతున్నాడు పంతులు, అందరి నమస్కారాలు అందుకుంటూ. ‘గోమయే వసతే లక్ష్మి… గోమయే వసతే లక్ష్మి…’ అనుకుంటూ లెంపలు వేసుకుంటున్నాడు.

పేడని అదీ ఆవు పేడని తొక్కి అదీ యెడమ కాలితో తొక్కి పడ్డవాణ్ణి తొక్కేశారు జనం.

రోడ్డుమీద పోస్టర్లు తింటూ చిరుక్కుంటున్న ఆవు వెనుకన చేరి గోమయాన్ని నుదిటన తిలకంగా ధరిస్తున్నారు భక్తులు.  

ఈ సంఘటనని ‘రాజ్యమాత గోమాతకు పట్టాభిషేకం’గా శ్లాఘిస్తూనో, ‘పేడతొక్కి పడ్డవాడికి దేహశుద్ధి’గా వర్ణిస్తూనో, ‘కాళీయ మర్దనం’గా అభివర్ణిస్తూనో వార్తలూ వీడియోలూ వైరల్ అయ్యాయి.

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. అయిదు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి, మనువాచకం. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. పిల్లల కథా సంపుటం: అల్లిబిల్లి కథలు. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- యింకా జాతీయాల మీద వచ్చిన ‘పురాణ పద బంధాలు’, పిల్లల సమస్యల మీద వచ్చిన ‘ఈ పెద్దాళ్ళున్నారే’, మంచిపుస్తకం తానా ప్రచురణ ‘నువ్వేమిస్తావు?’ తో కలిపి మొత్తం యిరవైతొమ్మిది వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్‌లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’, ప్రజాతంత్ర ‘శోభ’లో ‘మెరుపు తీగెలు’ కాలమ్స్‌కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply