“గోడలు , అనే ప్రేమకథను మీరెప్పుడైనా విన్నారా?” అంటూ వైకోం మహమ్మద్ బషీర్ ఈ కథను చెప్పటం మొదలెడతారు. జైలులో సహ ఖైదీలయిన ఒక జంట మధ్యన ఏర్పడిన ప్రేమ, ఎడబాటు ఇందులో ప్రధానమైన అంశాలు కాబట్టి ఆయన దీన్ని ప్రేమకథ అన్నారు కానీ నిజానికి ఈ కథ పరిథి అంతకన్నా విస్తృతమైనది. మలయాళ సాహిత్యానికి అంతర్జాతీయ స్థాయి కల్పించిన రచయితల్లో బషీర్ ఒకరు . ఈ దేశ సామాజిక,సాంస్కృతిక ఆవరణంలో ముస్లింల భాగస్వామ్యాన్ని సాధికారంగా ప్రకటించిన రచనలు ఆయనవి . పదునైన వ్యంగ్యాన్ని, అతి సున్నితమైన భావుకతను మేళవించిన విలక్షణమైన శైలి ఆయనది. “మదిలుగల్ “ అనే పేరుతో మలయాళంలో బషీర్ రాసిన కథకు తెలుగు అనువాదం ఈ “గోడలు “ . తన స్వీయ కథ రూపంలో ఫస్ట్ పర్సన్ లో ఈ కథ చెప్పారు రచయిత .
కథా కాలం నాటికి భారత దేశంలో బ్రిటిష్ పాలన సాగుతున్నది . ప్రభుత్వాన్ని విమర్శించే రచనలు చేసినందుకు బషీర్ అనే రచయితను రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తీసుకు రావడంతో కథ మొదలవుతుంది . జాతీయోద్యమం లో కార్యకర్త అయిన ఈ రచయితకు పోలీసులతో దెబ్బలు తినటమూ, జైల్లో పడటమూ కొత్త కాదు. వార్దర్ లతో హాస్యాలాడుతూ ,తోటి ఖైదీలతో స్నేహాలు కలుపుకుంటూ, తనకు కావలసిన సౌకర్యాలను చాకచక్యంగా సమకూర్చుకుంటూనే మధ్యలో జైలు వాతావరణాన్ని మనకు పరిచయం చేస్తాడు బషీర్. ఆ ఎత్తైన గోడల నడుమ బంధితులైన మనుషులు పైకి ఒకే విధంగా కనబడతారు కానీ వాళ్ళలో చాలా తరగతులు ఉన్నాయంటాడు . అధికారులను మంచి చేసుకునే తెలివితేటలు , వ్యాపార మెలకువలు ఉండాలేగానీ జైలు జీవితం హాయిగా గడిచి పోతుందట .
“నిజం చెప్పాలంటే జైల్లో దొరకనిదంటూ ఏమీ ఉండదు. బీడీలు , అగ్గిపెట్టెలు , గంజాయి ,సారా ,బెల్లం డబ్బులు ఉండాలంతే !”అంటాడు . మరొక వైపున జైలు అధికారుల పెత్తనాన్ని , అవినీతిని ప్రశ్నించినందుకు చావు దెబ్బలు తింటూ, తిండికి మాడే ఖైదీలు – తప్పుడు కేసులతో జైలు పాలైన అమాయకులు – క్షణికావేశంలో నేరాలు చేసి ఉరికంబాలెక్కే అభాగ్యులు – కుటుంబాలూ , సమాజమూ వెలివేసిన ఒంటరులూ … ఎందరినో మన ఎదుట నిలుపుతాడు. బషీర్ జైలుకొచ్చిన కొద్ది రోజులకు రాజకీయ ఖైదీలు అందరినీ విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది . అందరూ ఉత్సాహంగా వెళ్ళటానికి సిద్ధమయ్యారు .కానీ ఏదో కారణంతో బషీర్ విడుదల మాత్రం ఆగిపోయింది . సహచరులందరూ వెళ్లి పోవటంతో అతడు పూర్తిగా ఒంటరి అయ్యాడు . కబుర్లు ,కాలక్షేపాలు లేవు. బయటి వార్తలు తెలియటం లేదు .తన కేసు ఎలా ముగుస్తుందో అంతు పట్టటం లేదు . ఈ పరిస్థితి నుండి బయట పడితే తప్ప తన జీవితానికి అర్థం ఉండదు .అందుకే తెగించి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు . జైలు గోడ దూకి వెళ్ళే ఏర్పాట్లు చేసుకుని ,ఒక వర్షపు రాత్రి కోసం ఎదురు చూస్తున్నాడు .
* * *
ఇంతలో అతడి జీవితం అనుకోని మలుపు తిరిగింది . దానికి కారణం తన సెల్ పక్కనున్న ఆడవాళ్ళ జైలు లోని ఒక మహిళా ఖైదీ పరిచయం . అంటే ప్రత్యక్షంగానేమీ కాదు – మొదట ఆమె నవ్వులతోనూ ,ఆపైన ఆమె మాటలతోనూ పరిచయం . మధురమైన ఆ నవ్వు అతడి ఒంటరితనాన్ని, ప్రేమ రాహిత్యాన్ని మరింతగా ఎత్తి చూపింది . స్త్రీ,పురుషుల నడుమ సహజమైన ఆకర్షణను, సాహచర్య కాంక్షనూ గుర్తు చేసింది . “నిజానికి ఈ ఆలోచనలు నా ఒక్కడివీ కాదు. జైల్లో ఉన్న నా సహచరుల భావాల ప్రతిధ్వనులే నా ఆలోచనలు . మా ఒంటరి రాత్రులు ,ఏకాకి భావనలు ,మాలో మెదిలే శృంగారపుటూహలు …” అంటాడు బషీర్. అంత తీయగా నవ్విన ఆ స్త్రీకి ,తనకు కేవలం ఒక గోడ మాత్రమే అడ్డం ! ఈ భావనతో అతడిలో చిత్రమైన అనుభూతి కలిగింది . “అప్పుడప్పుడూ ఆడవాళ్ళ జైలుకేసి అలా చూస్తూ ఉంటాను .ఆ గోడలు భయపెడుతూనే స్నేహాన్ని వ్యక్తం చేసేవి “ అని చెప్తాడు .
బషీర్ చెప్పినట్టు , ఈ ఆలోచనలు అతడొక్కడివే కాదు కదా ! అందుకే ,అతడికన్నా ముందు ఆ జైల్లో ఉండిన ఆడ ,మగ ఖైదీలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు ఒక ఉపాయం కనిపెట్టారు . రెండు జైళ్ల మధ్యనున్న గోడకు రహస్యంగా ఒక రంధ్రం చేశారు . దానిగుండా వాళ్ళు చూసుకోవటం, మాట్లాడుకోవడం , తినుబండారాలు ఇచ్చి పుచ్చుకోవడం సాగుతుండేవి. ఒక వార్డరు దాన్ని కనిపెట్టి, ఆ రంధ్రంతో వ్యాపారం మొదలు పెట్టాడు . అందులోంచి చూడాలనుకునే వాళ్లు అతడికి ఒక అణా డబ్బులు పన్నుగా కట్టాలి .అలా కట్టలేని ఒక ఖైదీ దీనికి ఎదురు తిరిగి గొడవ పడ్డాడు . అందుకుగానూ అతడి మీద ఏదో నేరం మోపి పాతిక కొరడా దెబ్బలు కొట్టించి ,ఆ రంధ్రాన్ని సిమెంటుతో మూసేశాడు వార్డర్ .దీన్ని గురించి చెబుతూ ,” ఈ సంగతంతా వినగానే మీరు నీతీ నిజాయతీగురించి ఉపన్యసించడానికి సిద్ధ పడుతున్నారనుకుంటా. కానీ , మాకక్కర్లేదు !మీరు అత్యున్నతమైన ఆత్మలూ ,అద్భుతమైన సుగుణాలు కలబోసిన మహాత్ములు . మేం మామూలు అల్ప మానవులం. లోభ, మోహ, మద మాత్సర్యాలతో నిండిన హీనులం, బలహీనులం …స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. తెలుసా ?” అంటాడు బషీర్.
ఒక రోజు గోడ పక్కగా ఈల వేసుకుంటూ నడుస్తున్న బషీర్ ను అవతలి నుంచి ఆమె పలకరింపు సంభ్రమంలో పడేసింది . ఊరూ, పేరూ, వయసూ, పడిన శిక్షల వివరాలూ చెప్పుకోవటంతో పరిచయం మొదలైంది. ఆమె పేరు నారాయణి. పద్నాలుగేళ్ల శిక్షతో ఏడాది కిందటే జైలుకు వచ్చింది. వయసు ఇరవైమూడు. యవ్వనంలో ఉన్న స్త్రీపురుషుల నడుమ సహజమైన ఆకర్షణ, ఆసక్తి తోనే వాళ్ళిద్దరికీ మాటలు కలిసినప్పటికీ తొందరలోనే అవి మరింత సన్నిహితమైన సంభాషణలుగా పరిణమించాయి. “నీ ముఖం ఎలా ఉంటుంది? కళ్ళు పెద్దవా ,చిన్నవా ? శరీర ఛాయ ఏమిటి ?” అనే వివరాలు పరస్పరం చెప్పుకునే వారు. హాస్యాలూ, మోహ ప్రకటనలూ నిస్సంకోచంగా సాగిపోతున్నాయి. ఒకరి కష్టసుఖాలు, ఇష్టాల గురించి మరొకరికి శ్రద్ధ ఏర్పడింది. ఆమెకు ఇష్టమైన గులాబీ మొక్కలను అతడూ, అతడికి నచ్చే తినుబండారాలను ఆమె గోడ మీదుగా ఇచ్చిపుచ్చకోవడం మామూలయింది. తను చేసిన ఏ పొరబాట్లవల్ల ఈ జైలుకు రావలసి వచ్చిందో నారాయణి చెప్పుకుంటే, బషీర్ ఆమెకు ధైర్యం చెప్పాడు.
ఆ ఆత్మీయతకు ఆమె కరిగి కన్నీరయితే, అతడు ఓదార్చాడు. “ నన్ను ప్రేమిస్తావా … నన్నొక్కదాన్నే!”అనే నారాయణి ఆశకు, ”అనుమానమెందుకు ?” అంటూ బషీర్ భరోసా!
ఇద్దరూ గోడ వద్దకు ఎప్పుడు రావాలో తెలిసేందుకు ఒక సంకేతం ఏర్పాటయింది. ఎవరూ గమనించని సమయంలో ఆమె ఒక కర్రపుల్లను గోడపై పెట్టాలి, అతడు వెంటనే గోడ వద్దకు వెళ్ళాలి. ఇక బషీర్ ధ్యాసంతా గోడ మీదుగా కనబడే కర్ర కోసం కాచుకోవటమే.
ఈ మధ్యలో, అతడు జైలు నుంచి పారిపోయేందుకు అనువైన వర్షపు రాత్రులు వచ్చి పోయాయి. అతడికిప్పుడు జైలు నుంచి వెళ్లే ఉద్దేశ్యమే లేదు. “బయటి ప్రపంచంలో మాత్రం స్వేచ్ఛ ఎక్కడుందని?
అదొక పెద్ద జైలు మాత్రమే !” అనేది ఇప్పుడు అతడి అభిప్రాయం .
కలిసి బతకటం ఎలాగూ సాధ్యం కాదు, కనీసం దూరం నుంచైనా చూసుకోవాలనే కోరిక ఇద్దరిలోనూ బలపడుతోంది . చివరికి ఒక అవకాశం కలిసొచ్చింది.
మహిళా ఖైదీలు వైద్య పరీక్షల కొరకు జైలు ఆస్పత్రికి వెళ్లాల్సిన రోజు దగ్గర పడింది . నారాయణి ఆ సంగతి చెప్పగానే బషీర్ సంతోషం పట్టలేక పోయాడు. ఆస్పత్రిలో పనిచేసే ఆర్డర్లీ అతడికి మిత్రుడే . తన కుడి బుగ్గపై నల్లటి పుట్టుమచ్చ ఉంటుందని గుర్తు చెప్పిందామె. తనకు కాస్త బట్టతల ఉంటుందనీ, చేతిలో ఎర్ర గులాబీ పట్టుకుని నిలబడతాననీ అతడు చెప్పాడు .
***
ఇద్దరూ కలుసుకునే రోజు రానే వచ్చింది .
నారాయణి ఆస్పత్రికి వెళ్లే ముందు గోడ వద్దకు వచ్చి కర్రను దానిపై ఉంచుతుంది. ఆ వెంటనే బషీర్ కూడా
బయల్దేరాలి .
అతడు పొద్దున్నే పనులన్నీ ముగించుకుని సంకేతం కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు.
ఇంతలో జైలరు వచ్చి అతడి లాకప్ గదిలో కూర్చున్నాడు. తీరిగ్గా కబుర్లు మొదపెట్టాడు. ఎంతకూ కదలడు! నువ్వు మామూలు దుస్తుల్లో ఎలా ఉంటావో చూడాలని ఉందంటూ, బలవంతాన జైలు యూనిఫాం నుండి మార్పించాడు. కాసేపటి తర్వాత “తమరిక వెళ్ళి పోవచ్చండీ బషీర్ గారూ ! మీరు విడుదలయ్యారు !”అంటూ శుభవార్త చెప్పాడు .
సరిగ్గా అప్పుడే గోడ మీదుగా కర్ర పైకి లేస్తోంది .
బషీర్ తలపై పిడుగు పడింది .
“ఎందుకు విడుదల కావటం ? ఎవరికి కావాలీ స్వేచ్ఛ ?
చిన్న జైల్లోంచి పెద్ద జైల్లోకి వెళ్ళటం తప్ప ?” అంటున్న బషీర్ ఆక్రోశాన్ని ఏదో హాస్యం అనుకున్నాడు జైలర్ . తనే స్వయంగా లాకప్ గదికి తాళం వేసి అతడిని బయటికి పంపాడు .
గోడ మీద కర్ర ఇంకా అలాగే పైపైకి లేస్తోంది .
చేతిలో ఎర్ర గులాబీతో ఒంటరిగా, నిస్సహాయంగా జైలు గేటు ముందు నిలబడి పోయాడు బషీర్ !
“ఈ జైలు గోడలకు రక్తమాంసాలు లేవన్నది నిజమే . కానీ, వాటికి హృదయం ఉందేమో అనిపిస్తుంది నాకు .అవి ఎన్నో దృశ్యాలను చూడగలవు . ఎన్నెన్నో ధ్వనులను వినగలవు “అంటాడు ఈ ఖైదీ బషీర్.
నిజమే ! జైలు గోడలను వర్ణిస్తూ ప్రారంభమైన ఈ కథ, జైలు లోపలా, వెలుపలా మనుషుల నడుమ మొలుచుకొచ్చిన ఎన్ని రకాల కనబడని గోడలను మనకు చూపించింది ? జైలుకు వచ్చే వాళ్ళంతా నిజంగా
నేరస్తులేనా ? ఇరవై రెండేళ్ల నారాయణిని హత్యా నేరంపై జైలుకు పంపిన పరిస్థితులేమిటి ? కాసేపట్లో ఉరికంబం ఎక్కబోతూ కాస్త టీ తాగాలనీ, ఒక బీడీ కాల్చాలనీ కోరుకునే ఆ అభాగ్యులెవరు ? “మృత్యువు పిలుపు” ఎప్పుడూ వినబడుతూ ఉండే ఈ అసహజమైన వాతావరణం ,జైలు జీవితం , నేరస్తులను ఎలా
సంస్కరించ గలుగుతుంది ? ఎన్నో ప్రశ్నలను రేపుతుంది ఈ కథ .
మదిలుగల్ , అనే ఈ కథను అదే పేరుతో అద్భుతమైన సినిమాగా రూపొందించారు అదూర్ గోపాల కృష్ణన్ . ఒక్క సారయినా తెర మీదికి రాని నారాయణి , కె పిఏ సి లలిత కంఠం ద్వారా మన కళ్ళకు కనబడుతుంది . నారాయణీ ! అంటూ బషీర్ గా జీవించిన మమ్ముట్టి పిలిచే పిలుపు సినిమా ముగిసినా మన చెవుల్లో మోగుతూనే ఉంటుంది.
మీరు చేసిన చాలా మంచి అనువాదం ఆ కథ. అందులో టీ పౌడర్ దాచుకోవడం ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నానో టీ ప్రియున్ని కావడం వల్ల.
థాంక్యూ ఖదీర్
ఈ సినిమా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లో వస్తే చూశాను కాత్యాయనీ! నారాయణి గొంతు ఎంత మనోహరంగా వినిపిస్తుందో! సినిమా కూడా ఈ అనువాదం లాగే భలే హృద్యంగా ఉంటుంది!
కథ చాలా సున్నితంగా మనస్సును హత్తుకునే విధంగా వుంది. చదవడం పూర్తయినా వదలక పాఠకులను వెంటాడే కథ. ఖైదీలు నేరస్తులయినా వాళ్లలోనూ సున్నితమయిన భావాలూ, భావోద్వేగాలూ ప్రేమలూ వుంటాయని గుర్తుచేసిన కథ. జైలు గోడలే కనక మాట్లాడడం మొదలు పెడితే ఇటువంటి కథలు ఎన్ని లక్షలు చెపుతాయో! బెల్లంకొండ అనురాధ రాసిన జైలు కథలు పుస్తకం కూడా ఇలాగే అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇంత మంచి కథను పరిచయం చేసినందుకు చాలా థాంక్స్ కాత్యాయని.