నిర్మానుష్యమైన ఒక వీధి. మూసుకున్న తలుపుల వెనక దాక్కున్న జనం. ఒంటరిగా, భయంగా, వేగంగా వీథిలో నడుస్తున్న ఓ మనిషి.
దూరంనుండి ఏవో నినాదాలు. ఓ పెద్ద గుంపులోని మనుషులు ఆవేశంగా, ఉన్మాదంగా వేస్తున్న కేకలవి. నడుస్తున్న మనిషిలో ఆందోళన, నడకలో మరింత వేగం.
ఎక్కడినుండో అరుస్తున్న గుంపు వీధి మలుపు తిరిగి ఇటే వస్తోంది . ఒంటరి మనిషి వెన్నులో వణుకు. వాళ్ళు తనను చూసేస్తారిక. తర్వాత?
‘ ఐనా నేనేమీ వాళ్ళకు శత్రువును కాదుగదా!’ అని ధైర్యం చెప్పుకుంటూ మరికొన్ని అడుగులు వేశాడు. గుంపు ఎదురుగా, మరింత దగ్గరగా దూసుకొస్తోంది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లోని విచ్చుకత్తులు కూడా స్పష్టంగా కనబడ్డాయి.
‘అనవసరంగా బయల్దేరానా?’ అని సందేహం మొదలైంది అతనిలో. వెనక్కి తిరిగి పారిపోయే సమయం లేదు. తలదాచుకుందామంటే తెరుచుకునే తలుపు లేదు. ఎదుర్కొనేంత శక్తీ లేదు. ఐనా తనేమీ వాళ్ళ శత్రువు కాదుకదా, తననేం చేస్తార్లే, అని మరోసారి ధైర్యం చెప్పుకుందామని ప్రయత్నం చేశాడు. గుంపు చేతుల్లోని కత్తుల తళతళలు కూడా కనబడుతున్నాయిప్పుడు. అప్పుడు మెరిసింది అతడి బుర్రలో మరో ఆలోచన- ‘నేను వాళ్ళకు శత్రువును కాకపోవచ్చు కానీ, మిత్రుడిని కూడా కాదు కదా!”
అంతే!కర్తవ్యం బోధపడింది. గుంపు దగ్గరికొస్తున్నా నిర్భయంగా నిలబడ్డాడు. కాసేపట్లో అతడు కూడా గుంపులో ఒకడయ్యాడు. మరుక్షణం అతడి చేతికి కూడా ఎవరో ఓ కత్తిని అందించారు. అతడు గుంపుతో కలిసి ముందుకు సాగుతున్నాడు. అందరికన్నా గట్టిగా నినాదాలిస్తూ, కత్తి తిప్పుతూ, మరొక ఒంటరి మనిషి కోసం గాలిస్తూ… !
* *
పై సన్నివేశం బెన్యామిన్ రాసిన ఓ కథలోది. ‘ద ఎనిమీ’ అనే ఒకటిన్నర పేజీల ఆ కథ మానవసమాజపు అన్ని దశలకూ ఒక వ్యాఖ్యానం. గుంపులో కలవని మనుషుల స్థితికి ఒక సూచిక. తమవైన వ్యక్తిత్వాలతో,విచక్షణలతో, విలువలతో బతకాలనుకునే మనుషులకు హెచ్చరిక.
దేశంలో ఈనాడున్న వాతావరణంపై అంచనా ఉన్నవారికి కథలోని గుంపుకు ఒక పేరు తోచవచ్చు. కానీ, ఈ కథ పరిథి అంతకన్నా విస్తృతమైనది. ఎన్నో వ్యక్తిత్వాలను నయానో, భయానో గుంపుల్లో భాగంగా మార్చిన చరిత్రంతటిది.
కొన్ని ఉమ్మడి అవసరాల ప్రాతిపదికన వ్యక్తులు సమూహాలుగా సంఘటితమవటం సహజ పరిణామం. ఆ సమూహాలు తమ అవసరాలరీత్యా కొన్ని నియమాలను ఏర్పరచుకుని నిర్దిష్టమైన నిర్మాణాలుగా రూపొందుతాయి. ఎక్కువ ప్రతిభ, చొరవా కలిగిన కొందరు వ్యక్తులు ఆ నిర్మాణాలకు చోదకశక్తులై ముందు నిలుస్తారు. వాళ్ళు వేసే బాటల్లో నిశ్చింతగా నడవటం సుఖంగా ఉంటుందని మిగతా సభ్యులను ఒప్పిస్తారు. ఆ ఒప్పుదలలో సుఖానికి మెజారిటీ మనుషులు బానిసలవుతారు. బలవత్తరమైన శక్తిలో ఐక్యమై ఒక గుంపుగా ఘనీభవిస్తారు.
క్రమంగా పరిస్థితి మారుతుంది. ఉమ్మడి ప్రయోజనాల స్థానాన్ని బలవంతుల ప్రయోజనాలు ఆక్రమిస్తాయి. అవి కఠినమైన విధివిధానాలుగా కరడుగడతాయి. అందరి స్థలాన్ని ఆక్రమించి పెత్తనం చేస్తాయి. ఆ ఊపిరాడని తనానికి అలవాటు పడలేని జీవచైతన్యం ఏ ఒక్కరినో ఇబ్బందిపెట్టి , ప్రశ్నగా వెలువడుతుంది. దాని గొంతు నొక్కటానికి గుంపు సర్వశక్తులతో విరుచుకు పడుతుంది. ఒంటరి మనుషులు దానితో పోరాడి నశించటమో, గుంపులో లీనమవటమో తప్పదు.
బెన్యామిన్ కథలోలాగా స్వతంత్రంగా నడుద్దామని కొందరు ఎప్పుడూ బయల్దేరుతూనే ఉంటారు. వాళ్ళ నడకకు అడుగడుగునా అవరోధాలుంటాయి. దారి పొడుగునా నిఘా నేత్రాలుంటాయి. గుంపులతో ప్రత్యేకంగా శత్రుత్వాన్నే ప్రకటించనక్కర్లేదు- స్నేహంగా వాటేసుకోకున్నా చాలు. గుంపులు అనుమానిస్తాయి. ముఖాలపై ముద్రలు వేస్తాయి, వెంటాడి వేధిస్తాయి. కుటుంబాల దగ్గర మొదలెట్టి అన్ని నిర్మాణాల్లోనూ ఏదో ఒక స్థాయిలో గుంపు తత్వమే రాజ్యమేలుతుంది. అది మనుషులలోని అల్పత్వాలలోకి అతి చొరవగా చొచ్చుకుపోయి, కూడగడుతుంది. అంతకంతకూ బలపడుతుంది. చీకటై చుట్టుముడుతుంది. ఇంకెప్పటికీ తెల్లారబోదని నిశ్చింతగా నిద్రపోదామనుకుంటుంది.
కానీ, దానికి నిద్రాభంగం కలిగిస్తూ ఎప్పటికప్పుడు ఏదో అలజడి తలెత్తుతూనే ఉంటుంది. సమూహాల్లో జీవం సమూలంగా చచ్చిపోనంతకాలం ఈ అలికిడి వినబడుతూనే ఉంటుంది. ఎవరిదో ఒక గొంతు వేకువపాటను ఆలపిస్తూ మన చెవిసోకుతుంది. దానికి స్పందించే హృదయాలు, వంతపలికే గొంతులు ఎన్నిటిని మనం మిగుల్చుకున్నామో తరచి చూసుకోవాలి.
రేపటి భవిష్యత్ చిత్రానికి సూచికలు అవే కదా!