క్రైస్తవ మిషనరీల వల్ల కలిగిన జ్ఞాన చైతన్యాల వల్ల కావచ్చు , గుఱ్ఱం జాషువా నుండి పొందిన స్ఫూర్తి కావచ్చు , గుంటూరు జిల్లా నుండి దళితులు ఎక్కువగా సాహిత్యరంగం లో ప్రవేశించి తమవైన అనుభవాలను, అనుభూతులను ప్రకటించుకోగలిగారు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ పిల్లి శాంసన్ వ్రాసిన దళిత సాహిత్య చరిత్ర(2000) వాళ్ళను గురించి సమాచారం ఇచ్చే ప్రధమ వనరు. అది ఆధారంగా మరో నలుగురు గుంటూరు కవుల గురించి తెలుసుకుందాం.
నూతక్కి అబ్రహం , పినపాటి జెర్మియా ఇద్దరూ 1925 లో పుట్టినవాళ్ళు. ఇద్దరూ తెనాలి తాలూకా వాళ్ళే. అబ్రహం కొలకలూరి వాడైతే జెర్మియా పుట్టిన వూరే ఇంటి పేరైనవాడు. నూతక్కి అబ్రహం జాషువా శిష్యులలో ప్రధమగణ్యుడు అని, ఆయన వ్రాసిన మత్కుణం కావ్యానికి జాషువా ముందుమాట కూడా వ్రాసాడని తెలుస్తున్నది. కానీ జాషువా ఖండ కవితలలో ప్రస్తావనకు వచ్చిన ఆయన శిష్యుల, అభిమానుల సమూహంలో అబ్రహం కనబడడు. జాషువాకు ఏకలవ్య శిష్యులమని చెప్పుకొనేవాళ్లు అనేకులు ఉన్నారని జాషువానే చెప్పుకొన్నాడు. వారిలో ఒకడేమో తెలియదు.
అబ్రహం విద్యా రంగంలో తెలుగు పండితుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ సాహిత్య కృషి కొనసాగించాడు. సంస్కృతం, ఆంగ్లం కూడా ఆయనకు బాగా తెలుసు. మత్కుణం కావ్యాన్ని అబ్రహం ఇరవై ఆరేళ్ళ వయసులో వ్రాసాడు. ఆ తరువాత నాలుగేళ్లకు 1955 లో అది అచ్చు అయింది. 1992 లో పునర్ముద్రణ పొందింది. మత్కుణం అనే మాట సంస్కృత సమమం. విశేష్యం. అకారాంత పుంలింగ శబ్దం. దానికి నల్లి , కొమ్ములు లేని ఏనుగు, నారికేళము అనే అర్ధాలు ఉన్నాయి. అయితే ఈ కావ్య కథా విషయం కుక్కి మంచంలో పడుకొన్న దళితుడు తనను కుట్టిన నల్లిని చేతిలోకి తీసుకొని దానితో సంభాషించటం కనుక నల్లి అనే అర్ధమే ఇక్కడ సార్ధకం. నల్లి అంటే అందరికీ తెలిసే మాటకు బదులు తెలుగు సమాజం వ్యవహారంలో లేని ‘మత్కుణం’ అని మాటను ఎన్నుకొని కావ్యనామంగా చేయటం పాఠక ప్రపంచాన్నితన భాషా పదప్రయోగ నైపుణ్యంతో దిగ్భ్రమకు గురిచేసి సాంఘికంగా తక్కువగా చూడబడే తన కులాన్నిమరిచిపోయేట్లు చేయటానికే కావాలి.
కావ్య నాయకుడు దళితుడు. నల్లితో అతను చేసిన సంభాషణ దళితులపై జరుగుతున్న సామాజిక దౌష్ట్యం గురించి. ఈ కావ్యం జాషువా గబ్బిలం నమూనాలోనే ప్రారంభం అయింది. ఉదయం నుండి కష్టం చేసి సూర్యాస్తమయం తరువాత ఇల్లు చేరి గంజి తాగి ప్రక్కమీద మేను వాల్చిన జాషువా కావ్య నాయకుడివంటి వాడే ఇతను కూడా. జాషువా నాయకుడు రెక్కల గాలిచేత దీపం ఆర్పి గుడిసెలో తిరుగుతున్న గబ్బిలంతో సంభాషిస్తే ఇతను నల్లితో మాట్లాడాడు. రెండు కావ్యాలలో సంభాషణ సారం ఒకటే. ‘భయద రాకాసి దూసినబాకు ముందు శిరము వంచిన’ పేద నివసించే భూమికి ఎట్లా వచ్చావు అని నల్లిని సంబోధిస్తూ అడుగుతాడు మత్కుణం నాయకుడు. తాగటానికి నాదగ్గర ఉన్న రక్తమెంత !? ‘…కులములనెడి కొన్ని గూళ్ళు కట్టి / యుక్తితోడ బ్రతికి…’ పొట్టలు పెంచుకొనేవాళ్ళ రక్తం తాగమని చెప్తాడు. పీడకుల పట్ల పీడితుల అసహనం ఎట్లా తీవ్రస్థాయికి చేరుతున్నదో సూచిస్తున్నది ఈ కావ్యం.
మత్కుణం తరువాత ముప్ఫయినాలుగేళ్ళకు 1989 లో అబ్రహం పరిపూర్ణుడు అనే ఖండకావ్య సంపుటి ప్రచురించాడు. “ఒంటరివాని జేసిరి సహోదరులే నను గెంటినారు”అని దళితులు సవర్ణులపై చేసిన ఆరోపణ పూర్తిగా కొత్తదేమీ కాదు. జాషువా కవిత్వంలో అలాంటి వ్యక్తీ కరణలు ఉన్నాయి. వెలివాడల దురపిల్లే దౌర్భగ్యం, నడువీధి నడయాడు హక్కులు లేకపోవటం అనుభవంలో ఉన్న ఆదిమాంధ్రుడి గురించి చెప్పి దళితుల ఐక్యత సమస్యల పరిష్కారానికి మార్గం గా ప్రతిపాదిస్తాడు కవి. అబ్రహం అభాగ్యజీవి, పిడుగులు, జలహురాక్షి , పావురము అనే మరొక నాలుగు కావ్యాలు ప్రచురించినట్లు, కులవ్యవస్థ , పాపక్షమ అనే రెండు అముద్రిత కావ్యాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
పినపాటి జెర్మియా అధ్యాపకుడు. హరికథలు చెప్పటం ప్రవృత్తి. క్రైస్తవ విశ్వాసాలనుండి తొలి వెలుగు, అమృతోక్తులు, మాత వేలాంగిణి మహిమ వంటి కావ్యాలు వ్రాసాడు. జాషువా మార్గంలో లౌకిక దళిత జీవిత సమస్యలు వస్తువుగా కావ్య రచన ఎప్పుడు మొదలు పెట్టాడో కానీ ఆయన అరవై అయిదేళ్ల వయసులో అంటే 1990 వ దశకంలో అవి ప్రచురించబడ్డాయి. వాటిలో హతాశుడు 1991 లో నగ్న సత్యాలు 1993 లో వచ్చాయి. హతాశుడు అంటే ఆశలు చంపబడ్డవాడు. బతుకుమీద ఆశ చంపబడినవాడు. ఎవరు అతను? పేదవాడు అదే సమయంలో దళితుడు. వాని రెక్కల కష్టం మరొకడు తినే స్వార్ధ భూయిష్టమైన ప్రపంచం వైపు వేలు చూపిస్తాడు కవి ఈ కావ్యంలో. కలవారి బలగం వాని దేహాన్ని పంచుకు తింటుందని బాధపడతాడు. శ్రామిక జనశక్తి సంపదను కొల్లగొట్టే దుర్గుణులను, కార్మికుల కర్షకుల శ్రమ ఫలితాన్ని దోచే దొరలను ఏవగించుకొంటాడు. పస్తులున్న గాని పరుల సొమ్ముకు ఆశపడని దొడ్డగుణం దళితుడిది అని చెప్తాడు. దయాగుణాన్ని, ధర్మగుణాన్ని దళితుల సహజ స్వభావం అని చేసే ఇలాంటి వర్ణనలు వ్యతిరేక పరిస్థితుల మధ్య జీవించే వాళ్ళు సహనం కోల్పోకుండా చేయటానికి ఉద్దేశించినవి, దానిని నమ్మి ప్రవర్తించేటట్లు దళితులకు ఇయ్యబడే ఒక సాంస్కృతిక శిక్షణలో ఇది భాగం.
నగ్న సత్యాలు కావ్యం లో పరిమిత కుటుంబం , కట్టు బానిస,లేదు కొఱత అన్న మూడు శీర్షికలతో ఖండికలు వున్నాయి. కట్టు బానిసలో దళిత శ్రామికుడి జీవితం కట్టు బానిసగా ఉండటాన్ని శ్రమ దోపిడీకి గురి కావటాన్ని వర్ణించి ‘ నిరాదరించు శక్తుల నెదిరించి నిలుచు శక్తి గలిగి నప్పుడె విముక్తి అని ప్రబోధిస్తాడు కవి. ‘లేదు కొఱత’ దేశంలోని దోపిడీ పీడనలపైన, స్త్రీలపై, దళితులపై జరిగే దాడులపై , పేదరికంపై వ్రాసిన వ్యంగ రచన. జెర్మియా ఈ కావ్యాలను ప్రచురించే నాటికి దళిత సమస్యను చూడటంలో , పరిష్కారాలను వెతకటం లో విప్లవాత్మకమైన మార్పును తెచ్చిన చారిత్రక ఘటనలు సంభవించాయి. అవి కారంచేడు (1985), చుండూరు ( 1991) గ్రామాలలో దళితుల మీద జరిగిన అగ్రవర్ణ దాడులు, హత్యాకాండ. దళితులకు ఆత్మగౌరవంతో జీవించే హక్కును గురించిన ప్రశ్నను లేవనెత్తాయి ఆ ఘటనలు. దళిత అస్తిత్వ చైతన్యం అంబేద్కర్ మార్గంలో కొత్త రాజకీయ పదునును సంతరించుకొన్నది. కానీ జెర్మియా రచనలలో వీటి ప్రభావం ఏమీ లేదు. జాషువా పద్ధతిలో దళిత జీవిత యథార్ధాన్ని వర్ణించిన ఈ కావ్యాలు పందొమ్మిదివందల యాభై అరవైల నాటికే వ్రాయబడి ఆలస్యంగా ప్రచురించబడి ఉండాలి.
ఇక కొలకలూరి గోపయ్య గుంటూరు జిల్లా అమరావతి దగ్గర నరుకుళ్లపాడులో పుట్టి వృత్తి రీత్యా ధరణికోటలో స్థిరపడ్డాడు.గాదెలపర్తి రాధా ఆశీర్వాదం తెనాలి తాలూకా చిన్నగాదెలపర్రులో పుట్టి శ్రీకాకుళం జిల్లా సాలూరులోని అరికతోట అనే గ్రామంలో స్థిరపడ్డాడు. గోపయ్య 1934లో పుడితే, రాధా ఆశీర్వాదం 1935లో పుట్టాడు. గోపయ్య రచనలు – దేవమాత శతకము, కన్యాకుమార ద్విశతి, అరుణశ్రీ , కలువపూజ , నక్షత్ర మాల మొదలైనవి ప్రధానంగా క్రైస్తవ మత సంబంధమైనవి. ఈ కావ్యాలు లభించే కొద్దీ క్రైస్తవ మత గాధలకు ఆయన సృజన శక్తి జోడింపువలన వచ్చిన విశిష్టత ఏమిటో పరిశీలించటానికి వీలు ఏర్పడుతుంది. ఏకలవ్యుడు ఆయన వ్రాసిన సామాజిక కావ్యం. అగ్రవర్ణ అధికారవర్గ రాజకీయాల వల్ల విద్యావిజ్ఞాన శస్త్ర శాస్త్ర నైపుణ్యాలు పొందే మార్గాలు మూసుకుపోయిన దళితులకు ప్రతినిధిగా పౌరాణిక పాత్ర అయిన ఏకలవ్యుడిని సంభావించటం ఎప్పటి నుండి మొదలైందో కానీ గోపయ్య ఏకలవ్యుడు అనే కావ్యమే వ్రాసాడు. ఇది కూడా 1991 లో వచ్చినదే. కవి వయస్సు అప్పటికి యాభై ఏడేళ్లు. ‘బోడికులము’ అని కవి కులాన్ని ఏవగించుకొన్నాడు. పాముకన్న, విషం కన్నా కులవిషం ప్రమాదకారి అని హెచ్చరించాడు. కులాన్ని బట్టి ఎవరు ఏ విద్య నేర్చుకొనటానికి తగినవాళ్ళో చెప్పే నీతిని నిరసించాడు. ద్రోణ నీతి ఏకలవ్యులపాలిటి చావుదెబ్బ అవుతున్నదని బాధపడ్డాడు. ఏకలవ్యుడి మానసిక వేదనను వినిపించి దళితులను అప్రమత్తం కావాలని హెచ్చరించాడు.
“రాతిపొలాలలో దళిత రత్నము రక్తము జిందకున్నచో
చేతికి జిక్కునె గొనగ చిట్టెడు గంజి పరోపకారియై
జాతికి జీవగఱ్ఱ యయి సాగేడు వానికి వాని సేవకున్
క్ష్మాతలి పొచ్చె ముండెనె? విఘాత కులమ్ములు కూడు వెట్టునే “ —
ఇటువంటి పద్యాలపై “వాని ఱెక్కల కష్టంబు లేనినాఁడు సస్యరమ పండి పులకింప సంశయించు” వంటి జాషువా పద్యాల ప్రభావం కాదనలేనిది. ఈ కావ్యం కూడా సమకాలాన్ని కాక సమీప గతానికి సంబంధించిన సంస్కరణ ధోరణినే ప్రధానంగా ప్రతిఫలించింది. కవుల చైతన్యం అరవైల నాటికే రూపొందినది కావటం అందుకు కారణమై ఉండవచ్చు.
రాధా ఆశీర్వాదకవి రచనా వ్యాసంగం ఎప్పటి నుండి ప్రారంభం అయిందో కానీ ముద్రిత రచనలు పదిహేను, అముద్రితాలు ఇరవై అయిదు ఉన్నట్లు తెలుస్తున్నది. నిత్య పీడనల మధ్య దళిత జీవిత గమనం గమ్యం లేనిది అవుతున్నదన్న వేదనతో 1979 లో ‘అగమ్యుడు’ అనే కావ్యం వ్రాసాడు. “వేదవేదాంగములయందు వెతికి జూడ/ పంచమ వర్ణము నెచ్చట గాంచలేదు/కొంచెపుం బుద్ధి గలిగిన వంచకుండు /సృష్టి గావించి రచియించె నిష్టయంచు” అనే వాదం 1930 నలభైల నాటిది. సవర్ణులతో సమానంగా మమ్ము గనలేద భరతమాత అంటూ సహజ హక్కు కు భంగకరమైన సామాజిక ఆచారాలపట్ల దళితుల ఆక్రోశం కూడా అప్పటిదే. అవి ఈ కావ్యంలో ప్రతిధ్వనించాయి. పంచములను అస్పృశ్యులు అని హీనజాతి అని ఉపాంతీకరణకు గురిచేస్తున్నవి భూసుర ముఠాలేనని నిర్ధారించి గర్హించటం ఈ కావ్యంలో కనబడుతుంది. కవితాలాపం, నిమ్నజాతుల జ్యోతి మొదలైనవి ఆయన ఇతర రచనలు. సామాజిక వైకల్యాలలకే కాదు శారీరక వైకల్యాల పట్ల కూడా కలతపడిన కవి హృదయాన్ని వికలాంగుల , కుష్టు వ్యాధిగ్రస్థుల వ్యధలను కూడా కావ్య వస్తువు చేసుకొనటంలో గుర్తించవచ్చు.