పక్కమీంచి ఇంకా నీలి లేవలేదు. అలా అని ఆమె నిద్ర పోవడం లేదు. వదిన అప్పటికే రెండుసార్లు వచ్చి లేపింది. లేద్దామనుకుంటూనే ఆలోచనలు తెగక లేవలేకపోతుంది. ఇంతలో మళ్లీ వదిన ‘నీలీ, నీలమ్మా అనుకుంటూ గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో టీ గ్లాసు. ‘లే పిల్లా ఆల్సం అయిపోవడం లేదా? ఏటలగ కల్లు తెరిసి కునకడం, లెగిసి టియ్యతాగు’ అని హడావిడి చేయడంతో లేచి టీ గ్లాసందుకుంది నీలి. వదిన ఆమెకెదురుగా కూర్చుంది.
“నువ్వేటి ఆలోసించక. పెద్దలు మనూరోల్లయినా తగువు మనకాసే సెప్తారని గేరంట్రీ నేదు. మనకయ్యన్నీ అనావసరం. మన మాట మీద మనవుందాం. మనెన్నెవ్వరేటి పీకనేరు, నువ్వు దయిర్రంగుండు” అని మొదలుపెట్టింది.
“ఇప్పుడు నేనేటన్నాను” నాకు బయివేత్తందని సెప్పానా? అంది నీలి.
“ఉండు పిల్లా, అన్నీ తరకాలే నీకు. బయ్యివని కాదు. మనవేటి సెయ్యాలన్నది మనకొక నిర్నయం ఉండాలి కదా? అందకంటున్నాను నీనూ… అంది వదిన.
“లెగు లెగిసి త్తానం సేస్సి, రడీగుండు. కబురొత్తే బయలెల్దాం. మీయమ్మ పొద్దున్నే తయారయిపోయి ఈదిగుమ్మంలో కూకోని తిడతంది, ఇక్కడ లేనోల్లని’ అంటూ వదిన లేచింది.
“వదినీ నీను అక్కడ ఒకటే మాట సెప్తాను, నీను కంప్లీటు ఎనక్కి తీసుకోననీ, అంతే కదా?” అంది నీలి.
“మరింకేటి సెప్తావ్, అదే సెప్తాం మన కుటుమానవంతా కలిసి. ఆలేటి మాటాడినా మనకనావసరం” అని గట్టిగా చెప్పి నీలి వదిన చిట్టెమ్మ బయటకు వెళ్లిపోయింది. నీలి మొహం కడుక్కోవడానికి ఇంటి బయటకి వచ్చింది. ఏదో అరుస్తున్న తల్లిని చూసి “ఎందుకలగ వాగుతున్నావూ? నువ్వు తిట్టీ నా కొడుకులెవరన్నా ఇక్కడున్నారా? లేనోల్లన తిట్టి నోరెందుకు నొప్పి సేసుకుంటున్నావూ? ఆపమ్మ ఇంక” అంది.
“నువ్వు నోరుముయ్యే గుంటా, నీవల్ల కదూ ఇలగ అందరి నోల్లల్లోనూ పడిపోడం, సివరకి ఊరి పంచాయితీకి నాగినావు మా బతుకుల్ని. నువ్వే నోరుమూసుకో ఎదవకానా” అని తిగిరి కూతుర్ని తిట్టింది.
“బాప్పా, ఏటిలగ మనలో మనం తిట్టుకోడం, జరిగింది సాల్లేదా? రా, నోపటిరా సల్డన్నం ఎట్టీసాను” అని కోడలు బయటకి వచ్చి ఇద్దరి నోళ్లు మూయించేసింది.
*
ఆరోజు పెద్దజాలారిపేట గ్రామంలో పంచాయితీ. నీలికీ, ఆమెని ప్రేమించానని చెప్పి కడుపు చేసిన చిన్నాగాడికి పంచాయితీ. తగువు నేరుగా పెద్దల దగ్గరకి రాలేదు. నీలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది చిన్నా మీద. ఆ కంప్లైంట్ రాజీ చేయమని చిన్నా కుటుంబం వీళ్ల పెద్దలనాశ్రయించింది. చిన్నా వాళ్లది టౌన్ జాలారిపేట. పెద్దలు నీలి కుటుంబానికి కబురుపెట్టి మాట్లాడారు. మాకు పంచాయితీతో పనిలేదు, స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాంకదా. అక్కడే చూసుకుంటామని నీలి వాళ్లు సమాధానం చెప్పారు. పెద్దలు అగ్గిఫైర్ అన్నట్లయిపోయి “అయితే మీకు ఊరితో పనిలేదన్నమాట, సూసుకుందామైతే” అనడంతో తప్పనిసరి అన్నట్లు వీళ్లు కూడా పంచాయితీకి వస్తామని ఒప్పుకున్నారు. చల్లబడిన పెద్దలు నీలి అన్నయ్య సత్తిరాజుల్తో “ఒరే సత్తిరాజులూ, అందరూ మన సేపలోల్లే, మీరు ఆల్లూ ఎవలూ మాకెక్కువ కారు. ఎటు నాయవైతే అటే సెప్తాం. నేప్పోతే రెండొరగాలకీ బుద్ది సెప్పి రాజీ పరుస్తాం. అంతేనా, ఇంకేటుంటాది? అంత మాత్రానికే “మీవురావు” అని మీరు మొండికెత్తడం ఎందుకురా? మీకు మావు నాయిం సెయ్యనేదనిపిత్తే ఎటూ మీ దారి మీకుంతాది. ఉంతాదేటీ అవల్రెడీ మీరు కంప్లైటు ఇచ్చీసీ ఉన్నారు కదా? అయినా ఆడపిల్లగలోల్లు మీకు నాయిం సెయ్యకంట ఎలగౌతాదిరా? ఏదో ఒక నాయిం కూర్చకపోవు, మా పెద్దలం గూడి’ అని మంచి మాటలు నాలుగు చెప్పారు. ‘సరే మాయా, వత్తానన్నాం కదా” అని సత్తిరాజులు వచ్చేసాడు. అక్కడికే ఇప్పుడా కుటుంబం బయల్దేరాలి.
*
బోదకాలు గురమ్మకి సత్తిరాజులు, అచ్చిరాజు కొడుకులు వాళ్ళ తరువాత చాలా కాలానికి పుట్టింది నీలమ్మ. నీలమ్మ పుట్టిన పదేళ్ళకి భర్త చెల్లిపోయాడు. కొడుకులిద్దరూ సముద్రంలో వేట వెళ్తారు. గురమ్మ మార్కెట్లో చేపలమ్మతాది. చిన్నకొడుకు అచ్చిరాజులు భార్యకీ గురమ్మకీ పడేదికాదు. ఆ తగువులు పడీపడీ కొడుకుని వేరే వెళ్ళిపొమ్మని గురమ్మ నిర్నయించింది. అదే సులువు అనుకున్న అచ్చిరాజులు భార్య తన పుట్టింటివైపు భర్తని మరలించింది. మెల్లగా కాపురాన్ని అత్తవారి ఊర్లోకి భీమిలీకి మార్చేసాడు, అచ్చిరాజులు పండక్కీ, పున్నమికీ పిల్లల్నీ, భార్యని తీసుకొని చుట్టంలా వస్తాడు అచ్చిరాజులు అమ్మ దగ్గరకి.
సత్తిరాజులుకి తన తమ్ముడి కూతుర్నే చేసింది. గురమ్మ ఆ కోడల్తో ఎప్పుడూ సఖ్యంగానే ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని బంగారంలాగా చూసుకుంటుంది. అత్తని, తాగిన టీగ్లాసు కూడా కడగనివ్వదు పెద్ద కోడలు చిట్టెమ్మ. మొగుడన్నా, పిల్లలన్నా అపురూపంగా చూసుకుంటాదామె. ఇక ఆడపడుచు నీలి అంటే వల్లమాలిన ప్రేమ. ఆ పిల్ల నోటికి ఊరంతా భయపడతారని మరీ మురిపెం ఆ పిల్లంటే, ఆ వదినకి. ఆ ఊళ్ళో ఆడపిల్లలకి చదువులు చాలా తక్కువ. పదిహేనేళ్ళు దాటితే వాళ్ళే ఎవర్నో చూసుకోవడమో, లేక పెద్దలే ఎవరికో ఒకరికి కట్టబెట్టడమో జరిగిపోద్ది. నీలికి ఇరవైఅయిదేళ్ళు దాటాయి. నాలుగిళ్ళల్లో పాచిపని చేస్తాది. ఇంట్లో పెళ్ళిఊసు ఎవరెత్తినా నోరేసుకొని పడిపోయి, ఆమాట ముందుకి కదలనిచ్చేదికాదు.
‘ఏం తిని ఉండనేప్పోతున్నారా? నాయూసు నీకెందుకు? నా బరువు మీరేవన్నా మోత్తన్నారా? నీను మిమ్మల్నడిగానా ఉండనేప్పోతన్నాను పెల్లి సెయ్యడర్రా’ అని మాటలు విధవిధాలుగా పేర్చి, పేట్రేగి పోయేది. ఊరంతా ఆ అమ్మాయి మాటలకి ముక్కున వేలేసుకునేవారు. తిరిగి ఏమన్నా అందామంటే మాట చొరనివ్వనంత గడ్డు సమాధానాలతో గొడవకి సిద్ధపడిపోయే నీలితో ఇంట్లో వాళ్ళుగానీ, బయటి వాళ్ళుగానీ పెళ్ళి విషయం మాట్లాడ్డం మానేశారు.
పాతికేళ్ళ నీలి సన్నగా, నల్లగా, పొడుగ్గా, పొందిగ్గా ఉంటాది. ఆ అమ్మాయి కళ్ళు నీలాలు పొదిగినట్లుంటాయి. జుట్టు రింగులు తిరిగి చింపిరి అలల్లాగా సయ్యాటలాడుతూ ఉంటుంది. నడుము అచ్చంగా వాళ్ళూరి దగ్గర సముద్రం తిరిగిన వంపే, ముక్కుకి పెట్టే ముత్యపు పుడక ఆమె రోషంతో ముక్కెగ బీల్చినప్పుడల్లా ముద్దులొలుకుతూ ఉంటుంది. ఆ పిల్ల నవ్విందంటే ఆ విరగబాటుకి చుట్టూ కలకలం రేగాల్సిందే.
పనులకెళ్ళి వచ్చిన డబ్బుల్తో చీటిలు వేస్తాది. నచ్చిన బట్టలు కొనుక్కుంటాది. కానీ అన్నింటికన్నా అన్న కొడుకుల కోసమే ఎక్కువ డబ్బులు ఖర్చుపెడతాది. వదినంటే వల్లమాలిన ప్రేమ. ఎవరిమాటా వినని ఆమె వదిన చెప్తే కొంచెంలో కొంచెం ఆగుతాది. గడసరి సొగసరి అయిన నీలి ఆ ఊరికే ఒక ఆకర్షణ అన్నట్టుంటాది. ఇంట్లో నీలి మాటకి తిరుగుండదు. వీధిలో ఎవ్వరు కేకలేసుకున్నా, తగాదాలాడుకున్నా అక్కడికి ప్రత్యక్షమయ్యే నీలి తనకి తోచిన న్యాయాన్ని గట్టిగా అరిచి చెప్తాది. ఒక్కొసారి తన సాక్ష్యం అవసరమైతే పోలీస్స్టేషన్కి కూడా వెళ్ళి తను చూసింది చూసినట్లు చెప్పేస్తాది. వాళ్ళింటివాళ్ళకు ఎవరితోనన్నా తగాదా వస్తే ఇక విశ్వరూపం ఎత్తేస్తాది. ఎవర్నైనా కొట్టడానికైనా జంకదు. కర్రో, రాయో, చీపురుకట్టో ఏది దొరికితే దాంతో దాడికి సిద్ధమైపోద్ది. నోరుగల గురమ్మ కూడా నీలిని ఒక ధైర్యంలాగా లోలోపల భావిస్తాది. నీలిని, ఆమె రూపం చూసి లేదా ఆడపిల్లకదా అని ఊర్లో కుర్రోళ్ళు ఏమైనా అనే సాహసం చెయ్యరు. ఎందుకంటే అలా ధైర్యం చేసిన పోకిరోళ్ళనీ, నిజంగా ఆమె నచ్చి వెంటబడిన కుర్రోళ్ళనీ ఆపిల్ల నలుగురైదుగుర్ని నడిరోడ్డు మీద చెంపలు వాయించీ, చెప్పుతో కొట్టి అవమానించి బుద్ధి చెప్పింది.
ఇక తెల్లారిందంటే వీధి కుళాయిలు విప్పుతారక్కడ. ఆ నీళ్ళని తగాదాలు లేకుండా వంతులవారీ పట్టుకోవడానికి ఎవరో ఒకరి నాయకత్వం కావాలక్కడ. పదేళ్ళ నుంచీ నీలికి ఆ పోస్ట్న నిరాటంకంగా చేస్తుంది. ఆ పిల్ల కొళాయి గట్టు ఎక్కిందంటే వంతుల ప్రకారం నీళ్ల పంపకం జరిగిపోతుందంతే. ఎవరైనా పద్ధతికి విరుద్ధంగా వస్తే నీలి నోటినుంచి వచ్చే బూతులు, ఆ పిల్ల చెలాయింపు భరించలేక వెనక్కి వెళ్లాల్సిందే. ఆ ఊళ్ళో నీలి గురించి వచ్చే మొదటి మాటలు ‘అమ్మో దాని నోట్లో నోరెట్టలేం’ అనేది ‘అది ఆడదేనా అసలా?” అంటారు.
అలాంటి నీలి ‘ఎవర్నో ప్రేమించడం ఏంటి? నాలుగవ నెల కడుపుతో స్టేషన్ కెళ్లడమేంటి?” అనే సందేహంతో ఆరోజు పంచాయితీ కిటకిటలాడిపోయింది. పనులెగ్గొట్టీ మరీ ఆడోళ్ళూ, మొగోళ్ళు పోటెత్తారు. గ్రామ చావిడికి చిన్నా వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఊరి పెద్దలు కొందరూ, చిన్నా తరపున వచ్చారు. గ్రామ పెద్దలు గద్దెమీద కూర్చున్నారు. అసలైన పెద్ద అసిరియ్య తగువు మొదలుపెట్టాడు.
‘మా యూరిపిల్లకీ, మీయూరి కుర్రోడికీ జరిగిన గొడవిది. నాయంగా ముందు మా యమ్మి మాకాడికి రావాలి. ఆ పిల్ల ఎవరోకాదు, మాకు సుట్టమే, నాకు మనవరాలి ఒరస అవుతాది. కాని ఆయమ్మ టేసనికి ఎల్లిపోయింది. అది ఆల్లిస్టం. ఇప్పుడీ మద్దిన తగూలన్నీ ఎక్కువగా టేసన్లంటే తేల్సుకుంటున్నారు మా ఊరోల్లు. మరీ ఆడగుంటలైతే ఆడక్కండి, తైయిక్కమని టేసెన్టెక్కడం, ఆనిచ్చక ఎటో ఒక్కేసి మీవూ పంచెలెగ్గట్టి బుస్కోట్లు తొడిగేసి టేసన్లకి తిరగడవూ అలవాటైపోయింది. సర్లెండి అయ్యన్నీ మరెందుగ్గానీ ఇయ్యాల ఇరుపచ్చాలూ మా ఎదట్నున్నాయి. ఎవులు సెప్పుకునేదాల్లు సెప్పుకుంతే మావేటి సెయ్యాలో మాకు బోదపడతాది. అని ముగించబోయి’ ఎక్కడన్నా ఆడపిల్ల ముందు సెప్పడం ఇదాయికం, మొదలెట్టమ్మీ’ అని నీలికి మొదటి అవకాశం ఇచ్చాడు.
నీలి మొదటి వరుసలోనే వదినకీ, తల్లికీ మధ్యన మాటలు రానిదానిలాగా తలొంచుకుని కూర్చుంది. తల్లి మోచేత్తో పిల్లని పొడిచి నెగిసి ‘జరిగిన యదారదం సెప్పు, ఆల్లకీ అరదమవ్వాలికదా, సెప్పు జరిగిందల్లా సెప్పు. ఆ బాబు నిన్నేటి సేసినాడో, నువ్వెందుకు టేసనకి ఎల్లినావో సెప్పు’ అని తొందర పెట్టింది. ‘ఉండు బాప్పా సెప్తాదిలే’ అని చిట్టెమ్మ నెమ్మదిగా ‘నెగిసి సెప్పు పిల్లా’ అని ఆడపడుచుకి చెప్పింది. నేలకి అంటుకుపోయిన దాన్లాగా కూర్చున్న నీలి లేవలేదు. నోరిప్పలేదు. పెద్దలూ, పిన్నలూ, జనాలూ అందరూ గోలగోలగా మాట్లాడారు. అయినా ఆ పిల్ల నోరిప్పలేదు. పెద్దలు అందర్నీ అదిలించి మళ్ళీ సభని ఆర్డర్లో పెట్టడానికి పావుగంట పట్టింది. పెద్దలు మంచిమాటలాడి ఆ పిల్లతో మాట్లాడించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
‘తెల్లారి నెగిత్తే నోరేసుకు పడిపోయీ దానివి, నీ కస్టం చెప్పుకోమంటే నోరెందుకు ఇప్పడం లేదు?” అని ఆడోళ్ళు డైరెక్టుగా నీలిని ప్రశ్నించారు.
ఊర్లో గొడవలన్నిటికీ ఒంటికాలిమీద నెగిసే గుంట దానిసయం వచ్చేతలికి నోరు పడిపోన్దాన్నాగా కూకోడం ఏటీ, సిత్రంక్కాప్పోతే’ అన్నారు. తల్లి ఆమాటలకి నొచ్చుకొని ‘ఏవే నోరు పడిపోయిందా? లే… లెగిసి మాటాడు, నోరిప్పకపోతే ఏటి సెయ్యగలు ఎవరన్నా?’ అని గట్టిగా గదమాయించి కూర్చున్నదాన్ని లేపడానికి ప్రయత్నించింది. అయినా నీలి నోరిప్పలేదు.
అప్పుడు చిన్నా వాళ్ళమ్మ గట్టిగా అందుకుంది. ‘ఇదేటమ్మా ఇలగ. నాల్రోజుల్నుండీ టేసనుకాడ మమ్మల్ని నిలబడనిచ్చింది కాదు, కూకోనిచ్చింది కాదు. అలగ రాలిపోయి, పేలిపోయిన ఆడది ఇప్పుడిలగ నాకేదీ తెల్డన్నట్టు కూకోడవేటి? అయితే, ఆ పిల్లకి పంచాయితీ ఇస్టంలేదేమో, నేప్పోతే ఎందుకలగ మూగదాన్నాగా కూకుంతాదీ?” అని కేకలేసింది.
అప్పుడు నీలి వదిన చిట్టెమ్మ ‘ఇస్టం ఉందో లేదో అదిప్పుడనాసరం. వచ్చాం కాబట్టి ఊరి జనాలుముందు దానికొచ్చిన కష్టం చెప్పక తప్పదు కదా! ఏవే నీలి ఎటా తరకం? లెగు, లెగిసిమాటాడు’ అని గట్టిగా కసిరి నీలిని లేపి నిలబెట్టబోయింది. నీలి మళ్ళీ కూర్చుండిపోయి ముడుకుల్లో తలపెట్టి చెవులు మూసుకొని ఉండిపోయింది. అప్పుడు చిట్టెమ్మ ‘దీనికేటోఅయింది’ ఇదింక మాటాడదు, అది ఏటనుకుంటే అదె. అయితే అదే సెప్పాలా? దాని బదులు జరిగిన ఇసయం నేను సెప్పీదా?’ అని పెద్లల్నడిగింది ‘ఒద్దు’ అంటే వాళ్ళు లేచిపోయి మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోతామంటారేమోనని పెద్దలు ఆగారు. వాళ్ళల్లో వాళ్ళేదో మాట్లాడుకున్నారు. చిన్నా కుటుంబం పిల్ల మాట్లాడాల్సిందేనని పట్టుపట్టారు. వాళ్ళని పక్కకి తీసికెళ్ళి పెద్దలు ‘మీకు పరిష్కారం కావాలంటే ఆగండని’ చెప్పారు. దాంతో వాళ్ళు ఆగారు. ఊరిజనం ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతుండగా పెద్దమనిషి గొంతుపెంచి ‘ఎవులు సెప్తేటీ? ఇస్యం తెలియాలిగానీ, నీలమ్మకంగీకారం అయితే ఆలవొదిన సెప్పడానికి మాకేవీ అబ్బెంతరం నేదు’ అని ప్రకటించాడు. అందరూ తలో వ్యాఖ్యానం చేస్తుండగా పెద్దమనిషి మళ్ళీ అందుకొని ‘అయితే రార్రా రాండ్రి, పార్రాండి మీలో ఎవరో ఒకలు గద్దెక్కేసి దానిసేత మాటాడించీయండి. అవును మరి మాకు సేతకాక ఇక్కడ ఒల్లకుండి పోనావా?’ అని గద్దించడంతో కాస్సెపటికి కొంచెం సద్దుమణిగింది. నీలి భంగిమ మార్చకుండా అలానే కూర్చుంది. వాళ్ళొదిన చిట్టెమ్మలేచి నిలబడి పెద్దలకీ, ఊరికి నమస్కారం చేసి చెప్పడం మొదలెట్టింది. ‘అయ్యలారా సిన్నదాన్ని, ఏటన్నా తప్పుగా ఆడితే సెమిచండి. మా యాడబొట్టి గునం ఊరందరికీ తెలిసిందే, అది సెడ్డదీ, పడ్డదీ కాదు. నోరెక్కువన్న మాటేగాని ఒక సెడుతిరుగుడు తిరిగిందిలేనేదూ. ఒకరికాసి సూసిందీ లేదూ, నవ్విందీ కాదు. ఇది ఊరందరికీ తెలిసినూసే. అంటుండగా ఆడోళ్ళందరూ తలలూపుతూ ‘ఔనవును’ అని వంతపాడారు. అలాంటిది అది ఒకడ్ని పేవించీ, ఆడితో తిరిగి కడుపు సేయించుకుందంటే మాకూ అది అచ్చంగానే ఉంది. కానీ కాదా? అంటే ఔను అనాల్సోత్తుంది. దానికిప్పుడు నాలుగోనెలని డాట్రు ఇచ్చిన సస్పీటు ఇదుగో అంటూ జాకెట్లొంచి నాలుగుమడతల కాగితం ఒకటి తీసి పెద్దలకిచ్చింది.
“మాకీ ఇసయం తెలిసిన్నాడు మాయత్త దాన్ని సీపిరికట్టతో బాదీసింది” అంటుండగా నీలి తలపైకెత్తి వాళ్ల వదిన్ని కోపంగా చూసి మళ్లీ తలదించీసింది.
“ఆల్లన్న కాల్లొట్టుకోని బతిమిలాడి అడిగినాడు ఇదిగో ఇప్పట్నాగే నోరిప్పింది కాదు. ఆ బాబూ సెయ్యి సేస్సికుంటాడేమోనని నీను పక్కకి లాగీసి, ఆ రాత్రి మంచి మాట్లాడి ఇసయం తెలుసుకున్నాను అని ఆగింది.
“అయితే అదేటో సెప్పూ” అన్నారు పెద్దలు.
“ఇదిగో ఈ సిన్నా రోజూ అది పనికెల్లీటప్పుడు బండేసుకోని ఎంటబడేవోడట. మల్లీ వచ్చీటప్పుడు కాస్సి ఎనకాతల వొచ్చీసి ‘నువ్వంటే నాకిస్టం’ అని రోజూ పోరుపెట్టీవోడట.
“మా ఊల్లో నీలాంటోల్లు బోల్డుమంది, నీనెవలకీ పడ్ను తెల్సా అన్నాదటిగుంట. ఆర్నెల్లు ఇసుపు లేకంటా దానెనకాల పడీ పడీ దాన్తో మొత్తానికీ మాట కలిపినాడట. ఇంత మొండిముండ మరెలగ పడిపోయిందో ఆడి వల్లో పడిపోయింది. ఇంకక్కడనుంచీ రోజు పన్నుంచి దాన్ని బండెక్కించుకోని కైలాసగిరీ, జూపారుక్కీ, అక్కడికెక్కడో మదురవాడ దగ్గిర జాతరా ఇయ్యన్నీ తిప్పడం మొదలెట్టాడంట. ఇదాలిసంగా ఇంటికొత్తుంటే ఒకపాలి నీనే అడిగాను. ఎందుకాలీస్సం అనీ. ఇంకొక పెద్దిల్లు ఒప్పుకున్నానొదినీ అని అబద్దవాడీసింది ఈ పిల్ల. అయినా దాన్ని “ఇదేదీ, ఇదెందుకూ” అని అడగ్గలిగీ దెయిర్రం మా ఇంట్లో ఎవలికుందీ? పోనలగని అది తప్పు సేత్తాదని డౌటు మాకెవలికన్నా ఉంతెకదా?” అలగ ఆడితో తిరిగీసి ఒచ్చిత్తుండీదట. ఆడు మోజు మీదున్నప్పుడు ఒక నెవెల్లో దాన్ని తిప్పాడు. అయితే రోజూ ఆడి పిలిసీ టైమ్కి ఇది ఆజరైపోవాలని ఆడు రూల్సులు ఎట్టడం మొదలెట్టాడు. పనికాడ ఆలీస్సం అయిందంటే ఒప్పుకునీవాడు కాదట. ఒకసారి రోడ్ మీదే దాన్ని లాగి జెల్ల కొట్టాడట. ఆడ్ని ఎయిటింగ్లో ఎట్టీసిందని. ఇదూరుకుంటాదా? తిరగబడి ఇదీ కొట్టీసిందట. అంతకుముందుకూడా బయట తిరిగీతప్పుడు దాన్ని అనుమానించి మాట్లాడ్డం, ఎక్కిరించడం, గిల్లడం, గిచ్చడం చేసాడట. నాకలగ ఇష్టం ఉండదని ఇదిసెప్తే నీ ఇష్టంతో నాకు పనేదన్నట్టూ మాటాడీవోడట. అసికాల మీద లంజా అన్నాడట ఒకసారి. ఇది నీనిలాటీ మాటలు పడనని వచ్చీత్తుంటే చెయ్యట్టుకోని లాగీసి, కొట్టేడట. దాని పౌరుసం సూసి మరింత రెచ్చిపోయి బలివిని దీన్ని నొంగదీస్సాడట ఆరోజు.
ఇదంటాదీ “అంతకి ముందూ ఆడూ నేనూ సర్దాగా వున్నాం. ఇష్టంతో ఉన్నామూ ఇలగ కొట్టీ బలవంతపెట్టడమేటనీ, అప్పుడ్నుంచీ మాటాడ్డం మానీసానొదినా” అంటాది. కానీ ఆడు ఒప్పుకోనేదట. పన్నించి వస్తున్నదాన్ని కొట్టి, తిట్టి బలివిన బండెక్కిచబోతే ఇది ఒప్పుకోక తిరగబడ్డంతోటి ఆడికీ దీనికీ సెడిందని ఇది నాకు ఇవరంగా సెప్పింది. అయితే పో నొల్లకో ఆడిస్టన్నేప్పోతే ఆడితో మాట్లాడకు. నీ ఊసు తేవొద్దని మీ యన్నియ్య ఆడితో మాట్లాడతాలే” అని నీను ఊరుకోబెట్టినాను. అప్పుడు సెప్పింది “దానికి నాల్గోనెలనీ. ఆలమ్మకి అనుమానవొచ్చే కొట్టిందని కూడా అప్పుడు సెప్పింది” అని ముగించింది చిట్టెమ్మ. ఔనా! అలాగా? అలగ జరిగిందా? అని పెద్దల్తో సహా అందరూ ఊసుల్లో పడిపోయారు కొంతసేపు.
పెద్ద మనుషుల్లోంచి పరదేశి అనే వ్యక్తి అందర్నీ ఆగమని “మరి, ఆడు పెళ్లి సేసుకుంతానంటున్నాడు కదా? ఇంకేటి పోబ్లం? టేసెనుకెందుకెక్కారు మీరు?” అని వాళ్లని అడిగాడు.
“మీరు ఇక్కడిదాకా వచ్చారు కదా, బాబూ మీ అభిప్రాయం ఏటీ, పెల్లి సేసుకుందావనే కదా? అని చిన్నా వాళ్ల వైపు తిరిగి అడిగాడు. వెంటనే చిన్నా, చిన్నా తండ్రీ లేచి నిలుచొని దండాలు పెట్టి అవును బాబూ, ఆ పిల్లని పెల్లాడతాననే మావోడు అంటున్నాడు. మాకూ ఏవీ అబ్యంతరాలు నేవు. ఆ నాయం మీరు కూరుత్తారనీ మీ కాడ కొచ్చినాం. పోలీసులు రేపు కేసెట్టెత్తాం ఏదో ఒక రాజీకి ఆల్లూ మీరు రాప్పోతే” అనంటన్నారు బాబూ మీరే నాయిం సెయ్యండి” అన్నారు.
అప్పటిదాకా నేలకంటుకుపోయి కూర్చున్న నీలి ఒక్క ఉదుటన లేచి పరుగున వెళ్లి చిన్నా కాలర్ పట్టీసుకుంది. ఎఎదవా… నిన్ను, నీలాటీ బేవర్స్ నాకొడకుని నీను పెళ్లాడాలా?” అని గుంజి గుంజి వదిలింది. అవమానంతో చిన్నా “ఏం మరెందుకు నన్ను పేమించావ్? అన్నాడు కసిగా అంతే మళ్లీ వచ్చి కూర్చొని మూగనోము పట్టింది నీలమ్మ. అందరూ ఒకటే గోలు. ఇదేదీ అన్నాయం? పేవించింది, ఆడితో పడుకుంది, కడుపంటది, పెల్లొద్దంటంది, అడిగితే మూగముద్దలా మాటాడకుంటది. ఏటీగోరం?” అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కింద వీధి పోలమ్మ పెద్దనోరేసుకుని మాట్లాడుతూ గద్దె దగ్గరకి వచ్చింది.
ఒలే నీలి, రంకు నంజా, నే, నెగిసి నేనడిగే ఒకే ఒక్క పెశ్నకి సమాధానం సెప్పు. సెప్తావా, సెప్పెట్టి అడాపెడా వాయించీమంతావా? అని గట్టిగా నీలమ్మని గదమాయించింది. ఆమె చెప్పుల్లేని కాళ్ళవైపు చూస్తు చిట్టెమ్మ ‘ఆగు పెద్దమ్మా ఆగు. ఎప్పుడూ లేంది నీకెందుకంత కోపం ఎలిపొచ్చింది? ఆగు ఆదేసెప్తాది, ఎందుకు సెప్పదూ? నువ్వడిగేదేదో అడుగు. ఎందుకు సెప్పదో సూద్దాం’ అని ఆడబడుచుకి అడ్డంగా నిలబడిపోయింది. ‘ఏటా పెల్లీ పెటాకులూ ఒద్దనుకున్నీ ఎదవ ఆడ్నేల పేవించాలి? ఆడితోని అడ్డవైన తిరుగుల్లూ ఎందుకు తిరగాలి? అదీగాక ఎవ్వల్నీ కాతరు సెయ్యకుండా మొగోడికి అమ్మ మొగుడ్నాగా తిరిగే గుంట ఆడికెలగ పడిపోయింది? ఇదీ నేను అడిగితే ఇసయం అది సెప్పవలసిన సమాదానవున్నూ ఆడికెందుకాస సూపించావే నీకిష్టంలేనప్పుడు నీలీ సెప్పే ముందు?’ అని న్యాయంగా, ధర్మంగా అడగాల్సిన గొంతుతో అడిగింది పోలమ్మపెద్దమ్మ. తనకి అడ్డంగా నిలబడిన వదిన్ని ఒక్క తోపుతోస్సి పరిగెత్తినట్లుగా పోలమ్మ ముందుకెళ్ళి నిలబడింది. ఒక్క వూపున నీలి.
సెప్పు, సెప్పు ఏటి సెప్తావో సెప్పు? ఆడేటంటే నువ్వాడికి ఒప్పుకున్నావో సెప్పు? అన్ని రొక్కించింది పోలమ్మ. నీలి గొంతుబాగా తగ్గించి, ‘బాప్పా ఆడు ఆడు, ఆడు నన్నేటన్నాడో తెల్సా? నువ్వు సానా మంచిదానివి అన్నాడు బాప్పా’ అని మళ్ళీ గిరుక్కున వచ్చి వాళ్ళ వదిన్ని పట్టుకొని బావురుమని ఏడ్చింది. నీల ఏడుస్తూ ‘అందరూ నన్ను దీనికి పొగరు, దీనికి నోరెక్కువ, దీన్తో సాల్లేం, గద్దరి ముండ, దీని నోటికోదండం అంటారు కదొదినీ, ఆడు నన్ను, నువ్వు సాలా మంచిదానివే నీలా అన్నాడొదినీ’ అని బెక్కిబెక్కి చెప్పింది. వదిన కర్ధమయింది. పోలమ్మ పెద్దమ్మ తలదించుకొని నడుచుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోయింది. కాస్సేపటికి టౌన్ జాలారిపేట పెద్దలు మౌనం వీడి ‘ఔన్రా చిన్నా ఏట్రా దాన్లోనంత మంచితనం చూస్సావు? ఆల్లూరోల్లందరూ దాన్ని నానా మాటలు అంటుంటే నీకేట్రా దాన్లోనంత మంచి అవుపించింది?’ అని గట్టిగా అడిగారు. చిన్నా సమాధానం కోసం సభ సైలెంటయిపయింది. చిన్నా ఆగి ఆగి చిన్నగా ఆయమ్మ రోజూ ఈదిలో కుక్కలకి బిస్కెట్లేత్తాది సిన్నాన్నా నాకది నచ్చింది. అందుకే ఆమాట అయమ్మితో సెప్పాను’ అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా వింటుండగానే నీలి మళ్ళీ వదిన్ని విడిపించుకుని ముందుకొచ్చి ‘మరీ నాలాంటి మంచిదాన్ని కోట్టాలనీ, తన్నాలనీ, తిట్టాలనీ నీకెందుకని పించింది? నాకు తెల్సు నువ్వు మాత్రం మంచోడివి కాదు. సూస్సాను కదా, నువ్వో మగోడివి. నువ్వునాకొద్దు’ అని ఖచ్చితంగా మాట్లాడి నిలబడిపోయింది. ఆడపడుచు తనని ఎవరైనా తిట్టినా సహిస్తాది, పట్టించుకోదు. కాని నువ్వు మంచిదానివన్న ముక్కని ఎలా గుండెల్లో దాచుకుందో, ఆ ముక్క చెప్పటానికెందుకు సిగ్గు పడిందో గ్రహించేసింది.
మంచిదానివంటూ మోసగించడం గురించి చెప్పడం చాలా కష్టం అని, అందుకే నీలి మాట్లాడలేదని ఆమెకే కాదు చాలా మందికర్ధమయింది. అప్పుడు మా పిల్ల ఆడ్ని చేసుకోదంతే’ అంది ఖరాఖండీగా చిట్టెమ్మ.
‘అయితే పోలీసుకేసెందుకూ? తీసేయండి’ అన్నారు వాళ్ళ పెద్దలూ, వీళ్ళ పెద్దలూ.
తియ్యం, బస్తీమె సవాల్ అని బతికిన నా ఆడబొట్టిని ఆడు తిట్టడం, తన్నీడం, బలివిన అనుబగించడం ఇవ్వన్నీ మీవు ఒప్పుకోం, మేం కేసు తియ్యం’ అంది చిట్టెమ్మ. అయితే ‘ఆగుంటడి బతుకు పోవల్సిందేనా?’ అన్నారు రెండువైపుల పెద్దలు. వాళ్ళు వీళ్ళు ఒక పక్కకివెళ్ళి మాట్లాడుకొని వచ్చారు కాస్సేపటికి.
ఏదేమైనా ఒక మొగోడు సేసేతప్పు వలన ఆడదే నస్టపోద్ది. మా పెద్దల నిర్నయవైతే, ఇది ఆడితో పెళ్ళికి ఒప్పుకోవాల, కాదూ కూడదు అంటే ఆ కడుపు తీయించీసుకోవడానికి, దాని బవిసెత్తుకీ ఎంతో కొంత నష్టపరేరం ఇత్తారు. తీసుకొని కేసు తీసీయాల, ఇదే మా రెండు వైపుల పెద్దల నిర్నయం’ అని అసిరయ్య ప్రకటించాడు.
నీలి వదినకళ్ళలోకి సూటిగాచూసి మాట్లాడు అన్నట్లుగా సైగచేసింది. చిట్టెమ్మ మొగోళ్ళ దగ్గర నిలబడి వున్న మొగుణ్ని చెయ్యిపట్టుకొని లాక్కొచ్చి బిగ్గరగా ‘మావు టేసనులో ఎట్టిన కేసు తియ్యం, మా పిల్లకి మావు కడుపు తియ్యించం. అది కంటాది. మీవు పెంచుకుంటాం. మా పిల్ల మాకు బంగారం, అది కాసిన పిల్లో పిల్లాడో మాకు బరువుకాదు. మా పిల్లత్తోనట్టునే ఆలూ పెరుగుతారు. ఇది ఎప్పట్నాగే ఉంతాది. తలెత్తుకొని బతుకుతాది. మా ఇంటి దైర్నం అయినదాన్ని కొట్టి తిట్టీ బాదపెట్టినోడికి సిచ్చ పడవలసిందే. మా పిల్లొక పచ్చిది. దాని రెక్కలు కత్తిరించాలనుకున్నోడి గురించి మావేవీ ఆలోచించం. కోరుటులోనే తేల్చుకుంటాం. దానికేం అది గాలిగువ్వ. అది ఎగిరితేనే మాకు సంతోసం. ఇది మా కుటుమానం నిర్నయం. అని ప్రకటించి ‘పదవే నీలి, పదబాప్పా అని ఇద్దర్ని చెరేవైపు పట్టుకొని మొగుడ్ని తోడ్కొని బయల్దేరింది ఆ ఇంటి కోడలు చిట్టెమ్మ.