గాజా నుంచి ఉత్తరాలు

(ఆతిఫ్ అబూ సైఫ్, పాలస్తీనా రచయిత
అనువాదం: సుధా కిరణ్
)

(ఆతిఫ్ అబూ సైఫ్ 1973లో గాజా లోని జబాలియా శరణార్థి శిబిరంలో జన్మించారు. ఆరు నవలలు, రెండు కథా సంకలనాలు ప్రచురించారు. బిర్జీట్ (వెస్ట్ బ్యాంక్ ), బ్రాడ్ ఫర్డ్ (ఇంగ్లాండు), ఫ్లారెన్స్ (ఇటలీ) యూనివర్సిటీలలో చదువుకున్నారు.)

నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు పాఠాలలో భాగంగా స్నేహితులకి ఉత్తరం రాయాల్సి ఉండేది. విదేశాలలో ఉన్న స్నేహితులని మా ఊరికి రమ్మని ఆహ్వానిస్తూ ఆ ఉత్తరం రాయాలి. వచ్చీరాని ఇంగ్లీషులో పదాలకోసం తడుముకుంటూ, వాక్యాలని పూర్తిచేయడానికి తంటాలు పడుతూ, మా ఆహ్వానం మర్యాద పూర్వకంగా, మా వూరు గొప్పదనం తెలిపేలా ఉత్తరం రాయాలంటే చాలా సమయం పట్టేది. ఈ ఉత్తరం రాసే క్లాసు చాలా ముఖ్యం మాకు. ఫైనల్ పరీక్షలలో ఈ ఉత్తరం ప్రశ్న తప్పనిసరిగా ఉండేది.

నేను పెరిగి పెద్దయ్యాక, ఆ ఆహ్వానపు ఉత్తరం రాయాల్సిన సందర్భం రానేరాదని నాకు అర్ధమైపోయింది. ఇప్పుడు నాకు నలభైమూడేళ్ళు. నాకు ప్రపంచమంతా చాలామంది స్నేహితులు ఉన్నారు. మా ఊరికి రమ్మని పిలుస్తూ నేను ఏ ఒక్కరినీ ఇంతవరకూ ఆహ్వానించలేదు.

చిన్నప్పుడు ఉత్తరాలలో, మా ఊరు ఎంత అందంగా ఉండేదో వర్ణిస్తూ రాసేవాళ్ళం. సముద్రతీరంలోని బీచ్ గురించీ, పెద్దపెద్ద నారింజ తోటల గురించీ, వీధులలో సంత గురించీ, ఇంకా క్రిస్టియన్లకీ, ముస్లింలకీ చారిత్రకంగా పవిత్రమైన స్థలాల గురించీ రాసేవాళ్ళం. అవి చాలా ఆకర్షణీయమైనవని మేము అనుకునేవాళ్ళం. నలభైఐదు కిలోమీటర్ల పొడవునా ఇసుక పరచుకున్న బీచ్, దానిని ఆనుకునే ద్రాక్ష తోటలు, అత్తిపళ్ళు, ఆలివ్ చెట్లు, నారింజ తోటలు అవి సందర్శకులని ఆకట్టుకుంటాయని అనుకునేవాళ్ళం.

ఆ తరవాత నేను యూరప్ లో చదువుకునేటప్పుడు, మాఊరికి, ఇంటికి స్నేహితులను ఆహ్వానించలేని పరిస్థితి గురించి ఎప్పుడూ బాధపడేవాడిని. ప్రత్యేకించి సెలవుల సమయంలో ఈ విషయం నన్ను మరింతగా సలిపేది. నేను మా స్నేహితుల ఇళ్ళకి వెళ్ళగలను, కానీ నేను వాళ్ళని మాత్రం మా ఇంటికి పిలవలేను. అందరూ సెలవులలో ఎక్కడికి వెళ్ళాలా అని చర్చిస్తూ ఉంటే, నేను మాత్రం మౌనంగా ఉండిపోయేవాడిని. నేను మా ఊరు ఎంత అందంగా ఉండేదో ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకవిధంగా చూస్తే, ప్రతీ ఊరూ, ప్రతీ చోటూ అందమైనవే. మా ఇంటికి వచ్చి, మా ఊరు ఎంత అందమైనదో చూడమని ఒప్పించడానికి నేను ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. మిత్రులూ, సందర్శకులూ రావడం సాధ్యం కాని విషయం. మా ఊరిలో, మా ఇంట్లో సాదర ఆహ్వానపు కౌగిలింతనీ, మా ఆతిథ్యాన్నీ స్వీకరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పత్రికా విలేఖరులూ, మానవ హక్కుల కార్యకర్తలూ, కొంతమంది రాజకీయవేత్తలూ మా ఊరికి వస్తే రావచ్చు. ప్రత్యేకించి ఘర్షణలూ, ఉద్రిక్తతలూ తీవ్రంగా ఉన్నప్పుడు వాళ్ళు రావచ్చు. కానీ ఇంటికి అతిథులు అంటూ రావడం మాత్రం జరగదు. గాజాలో పెరిగితే మీకు ఒక విషయం తెలుస్తుంది. స్నేహితులని ఆహ్వానించడం అన్నది పదో తరగతో ఫైనల్ పరీక్షలలో ఒక ప్రశ్న మాత్రమే. ఇంగ్లీషు భాష నేర్చుకోవడంలో ఒకానొక అభ్యాసం మాత్రమే. ఎలా పిలవాలో నేర్చుకొంటాం గానీ, ఆచరణలో పిలవడం మాత్రం జరగనే జరగదు.

సెలవులలో అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్లిపోయేవాళ్ళు. నేను మాత్రం హాస్టల్లోనే ఉండిపోయి, గాజాలో ఒక రోడ్డు దాటాలంటే వందలకొద్దిగా ఎదురయ్యే ఆటంకాల గురించి తలుచుకునే వాడిని. అది వెస్ట్ బ్యాంక్ లోని బిర్జీట్ యూనివర్సిటీలో బి ఏ చదివేటప్పుడు మొదలయింది. ఈద్ పండగ రోజు, అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పోయాక, గాజా నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులందరమూ ఖాళీగా మిగిలిన హాస్టల్ లోనే ఉండిపోయేవాళ్ళం. మిగతా సెలవు రోజులలోనూ అంతే. వెస్ట్ బ్యాంక్ లో వివిధ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళందరూ తమ ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్ళు. మేము మాత్రం హాస్టల్ లోనే. నాకు గుర్తుంది. 1991లో నేను బిర్జీట్ కి వచ్చినప్పుడు, గాజా నుంచి నుంచి నేను వెస్ట్ బ్యాంక్ కి రావాలంటే, ఒకే ఒక్క నీలం రంగు అనుమతి పత్రం (పర్మిట్) అవసరమయ్యేది. అక్కడ చదువు పూర్తయ్యే సరికి, గాజా నుంచి బయటికి రావడానికి ఒక అనుమతి పత్రం, వెస్ట్ బ్యాంక్ లో ప్రవేశానికి ఒక అనుమతి పత్రం, ఇంకా వెస్ట్ బ్యాంక్ లో నివాసముండడానికి ఇంకో అనుమతి పత్రం అవసరమయ్యాయి. గాజా నిర్బంధపు కట్టడిలో ఉన్న సమయంలో కూడా బయటికి వెళ్లాలంటే, ఇంకో ప్రత్యేక అనుమతి పత్రం, విద్యార్థిగా గుర్తింపు కార్డు, వ్యక్తిగత వివరాలని నిక్షిప్త పరచిన మరొక కార్డు కూడా ఉండేవి. ఈ అనుమతి పత్రాలు, కార్డులు అన్నీ ఎప్పుడూ దగ్గరే ఉండాలి. ఇజ్రాయిల్ సైనికులు ఎప్పుడు అడిగినా చూపించాలి. కాదనడానికి వీలులేదు.

పాలస్తీనీయులు భౌగోళిక బాధితులా? భూమిమీద అత్యంత పవిత్రమైన స్థలం పాలస్తీనీయుల మాతృభూమిలో ఉండడం వాళ్ళు చేసుకున్న నేరమా? పాలస్తీనీయులు ఈ భూభాగం మీద తమ ఆవాసం ఏర్పరచుకున్నాకనే భగవంతుడు, మతం అన్న భావనలు రూపుదిద్దుకున్నాయి. జనం కెనానైట్ నగరాలని నిర్మించుకుని, వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన తర్వాతనే, దైవదూతలు ఇక్కడికి వచ్చారు. భూగోళ శాస్త్రమే ఒక శత్రువు. దాని తర్కమే ప్రకృతికి విరుద్ధమైనది. చరిత్ర కూడా అందుకు భిన్నమైందది కాదు. అయితే, చరిత్ర విషయానికి వస్తే, అది మీరు చరిత్రని ఎక్కడ ఉండి చదువుతున్నారు, ఎవరి కథనాన్ని వింటున్నారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ, పాలస్తీనీయులు తమ భౌగోళిక శాస్త్రాన్నీ, తమ నైసర్గిక ప్రాంతాన్నీ, తమ చరిత్రనీ ప్రేమిస్తారు. తమ నగరాలని బట్టి పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు. నా ఒక్కగానొక్క కూతురు పేరు యాఫా. ఇజ్రాయిల్ ఏర్పాటు చేయడం కోసం మమ్మల్ని బలవంతంగా గెంటివేయక ముందు శతాబ్దాలపాటు మా తాతముత్తాతలు అందరూ నివసించిన ప్రాంతం నుంచి పెట్టుకున్న పేరు అది. మా అమ్మమ్మ పేరు ఆయేషా. తన దృష్టిలో జాఫా ని మించిన నగరం లేనేలేదు. ఆ సముద్రాన్ని పోలిన సముద్రం లేదు. ఆ సముద్రపు గాలి పరిమళానికి ఏదీ సాటిరాదు. తనకి దూరమైవున్న జాఫా నగరం గురించి మా అమ్మమ్మ దుఃఖాన్ని ఏ రచయితా వర్ణించలేడు. తానూ గాజాలో నివాసం ఉంటున్నా తన హృదయం మాత్రం జాఫాలోనే ఉండిపోయింది. తానొక శరణార్థి శిబిరంలో ఉంది, నేను కూడా ఆ శిబిరంలోనే ఉంటున్నాను. ఆ గాజా శరణార్థి శిబిరం ఎప్పటికీ తన సొంత ఊరు కాలేకపోయింది. తన జ్ఞాపకాలలో, తన మనసులో తనదైన మరొక వర్తమానాన్ని ఆమె సృష్టించుకుంది. తన ఊహలలో ఆమె సృష్టించుకున్న వర్తమానం తన గత జ్ఞాపకాలకి కొనసాగింపు. 1967లో ఇజ్రాయిల్ గాజాను ఆక్రమించుకున్నాక, చాలామంది అక్కడనుండి వెళ్లిపోక తప్పలేదు. అప్పుడామె చావనైనా చస్తానుగానీ, గాజాను విడిచిపెట్టబోనన్నది. కనీసం జాఫా నగరం ఉన్న విశాల పాలస్తీనా దేశంలో గాజా ఒక భాగంకదా అన్నది ఆమె ఆలోచన. ఆ రకంగా చూస్తే నేను అదృష్టవంతుడిని. నా కదలికలకి పరిసరాలు పరిమితి విధించిన భౌగోళిక నేపథ్యంలో నేను జన్మించాను. నువ్వు ఉన్న చోటును వదిలిపెట్టి, ఇతర ప్రాంతాలని చూసి, మళ్ళీ ఉన్నచోటుకి భద్రంగా వెనక్కి తిరిగిరాగలగాలంటే అదృష్టానికి అతీతమైనదేదో నీదగ్గర ఉండాలి. స్వర్గలోకపు సహాయమేదో నీకు దక్కి ఉండాలి. నా దగ్గర చదువుకున్న విద్యార్థిని ఒకామె ఈజిప్టు సరిహద్దు కంచెకి దగ్గరలో నివసిస్తుంది. తాను కిటికీ తెరిచి చూస్తే, ఈజిప్టు సరిహద్దు పట్టణం రఫా వీధులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వీధులూ మనుషులు నడుస్తూ ఉంటారు, కార్లు తిరుగుతూ ఉంటాయి. ఆ సరిహద్దు కంచెని దాటి అవతలివైపుకు వెళ్ళిరావాలన్నది ఆమె కల. ఆ కల, కోరిక తీరకుండానే ఆమె డిగ్రీ చదువు పూర్తయిపోయింది.
గాజా వార్తలకు పుట్టిల్లు. తాజా వార్తలని వండివార్చే ఒక పాకశాల అది. యుద్ధం గురించి కథలు, కథనాలు రాయడం కోసం మనుషులు ఇక్కడికి వస్తారు. ఇక్కడి ప్రాంతాలని చూడడానికి సందర్శకులుగా రారెవ్వరూ. ప్రముఖులూ, ప్రభుత్వాధినేతలూ గాజా గురించి తెలుసుకోవడానికి వస్తారు. గాజాని చూడడానికి సార్త్రే వచ్చాడు. మా నాన్న సార్త్రేని ఇక్కడ వీధిలో చూశాడు.

నేను ఒక టెలివిజన్ తెరమీద నివసిస్తూ వున్నానని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. శాశ్వతంగా న్యూస్ యాంకర్ కి ఎదురుగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ స్థితినుంచి తప్పించుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. కానీ, గాజా నుంచి నేను బయట పడిన సందర్భాలలో, ప్రత్యేకించి ఇంగ్లాడు, ఇటలీలలో చదువుకుంటూ ఉండిన సమయంలో కూడా, నేనీ మానసిక స్థితినుండి పూర్తిగా బయటపడలేకపోయాను. అక్కడ వున్నా, నా కుటుంబం గురించీ, వాళ్ళని చావు నిత్యం వెంటాడుతున్న వాతావరణం గురించీ ఆలోచిస్తూ ఉండేవాడిని. మేము ఒక యుద్ధకాలంలో పుట్టాము, యుద్ధ సమయంలోనే కన్నుమూస్తాము. మేము రాయగలిగేది వీటిగురించి మాత్రమే. మా అమ్మమ్మ ఆయేషా దుఃఖపు క్షణాల గురించీ, తాను తిరిగి వెనక్కి వెళ్ళాలనుకున్నచోటుగురించీ మాత్రమే మేము రాయగలుగుతాము. మాకు ప్రేమాస్పదులైన బంధుమిత్రులతో పంచుకోవాలనుకునే క్షణాల గురించే మేము రాయగలుగుతాము.
చదువుకునే సమయంలో యూరప్ లో ఉన్న స్నేహితులని గాజాకి రమ్మని ఆహ్వానిస్తూ ఊహాత్మకమైన ఉత్తరాన్ని రాసి దాదాపు ఇరవై ఐదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు కూడా నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను. రానివాళ్ళకీ, రాలేని వాళ్లకీ, రావడానికి అనుమతి లేని వాళ్లకీ నేను ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను, వచ్చి చూసిపొమ్మని. కానీ, గాజా ఎప్పుడూ వార్తలలోనే ఉంటూ ఉంది. ‘మధ్య ప్రాచ్యంలో యుద్ధం’ గురించిన ప్రసంగాలలో, గాజా ప్రస్తావనలు ఉంటూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఏదో ఒక రోజు అది వార్తలలో భాగం కాకూడదు. యుద్ధ విస్ఫోటనలకి దూరంగా, గాజా తన కలలు గురించి తాను ఆలోచించుకునే రోజు రావాలి. గాజా ప్రజలు మామూలు మనుషులుగా జీవించాలి. గాజా విద్యార్థులు ఊహలలో ఆహ్వానించిన అతిథులు గాజాను నిజంగా సందర్శించాలి.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply