ఖైదు లోపల పురుడోసుకుంటున్న ఆత్మవిశ్వాసపు సాహిత్యం

My body is in jail, but my spirit is free
and now may it leap to the sky.
I never thought much about poetry,
but in jail, what else can you do?
In jail, all time is long.
A song might brighten it up
అన్నాడు హోచిమిన్ తన Prison Dairy లో.

ఖైదులో కూడా ఇంత ఆత్మవిశ్వాసాన్ని రాజకీయ ఖైదీలు ప్రదర్శించడం మనం చూడొచ్చు. ఖైదును వాళ్ళ ఆచరణలో భాగంగానే చూస్తారు.

‘‘బహొత్ జల్దీ హీ టూటేంగీ గులామీ కి ఏం జంజీరే, కిసీ దిన్ దేఖ్నా ఆజాద్ ఏ హిందుస్తా హోగా!’’
(ఈ బానిస‌ సంకెళ్ళు ఖచ్చితంగా తెగిపోతాయి. ఏదో ఒకరోజు నా దేశం స్వేచ్ఛను పొంది తీరుతుంది) అని అంటాడు అష్ఫఖుల్లా ఖాన్. ఈ మనో నిబ్బరం అబ్బుర పరిచేదే. నిజానికి విహంగానికి రెక్కలు తెగ్గోయడమూ, మనిషిని బందీగా మార్చడమూ రెండూ ఒకటే. రెండింటి వెనుకా వేటగాళ్ళ ఆధిపత్యం ఉంది. స్వేచ్ఛని నిరాకరించడం అంటే మనిషి కార్యాలకు అడ్డుకట్టవేయడమే కదా! సామాజిక చైతన్యం కోసం పని చేసే మనుషులదీ, అందులో మన దేశంలాంటి బలమైన రాజ్యం పశు బలాన్ని ప్రయోగించడానికి వెనుకాడని నేపథ్యంలో ఆ కౄరత్వాన్ని తమ ఆచరణతో ఎదుర్కొనే మనుషులతో రాజ్యానికి చాలా ఇబ్బంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి రాజ్యం ఖైదుని ఉపయోగించుకుంటుంది. రాజ్య నిర్మాణంలో ఖైదు అంతర్భాగం. అది రాజ్యాంగం ముఖ్య అంగం. బహుశా దాని హృదయం కూడా. ఈ హృదయానికి చిల్లులు పడేలా చేసే ఉద్యమాలపై, ఉద్యమకారులపై జవాబుగా తన దమనకాండను ప్రదర్శిస్తుంది. తుపాకులు చూపి బెదిరించడమో, లేదా చంపడమో చేయవలసిన ఆగత్యం రాజ్యానికి నిజంగా ఉండకూడదు. అది చివరి లక్ష్యం.

ఉద్యమకారులను వారి పని నుంచి దూరం చేయడం అంటే రాజ్యం ఏ ప్రజల ద్వారా అధికారంలోకి వస్తుందో, ఆ ప్రజల ముందు తలవంచుకొని నిలబడడాన్ని నామోషిగా భావిస్తుంది. అలా తలవంచుకునేలా చేసే సామాజిక ఉద్యమాలతో నేరుగా తలపడే పరిస్థితులు రావొచ్చు. కాబట్టి ఉద్యమ నాయకత్వాన్ని నిలువరించడానికి కుట్రకేసులు బనాయిస్తుంది రాజ్యం. అర్బన్ నక్సల్స్ అనో, దేశద్రోహులనో, టుక్డే టుక్డే గ్యాంగ్ అనో పదబంధాలు సృష్టిస్తుంది. ప్రజల్లో భ్రమలు పెంచడానికి ఖైదును ఉపయోగించుకుంటుంది. తన వాదన నెగ్గించుకోడానికి ఉద్యమకారుల పని విధానంపై అబద్ధాలను ప్రచారం చేస్తుంది. ముస్లింలని పాకిస్తాన్ తీవ్రవాదులతో, మానవ హక్కుల కార్యకర్తలను మావోయిస్టులతో సంబంధం అంటగడుతుంది. దానికి దేశభక్తి (కుహనా )ఆసరా. దీన్ని సాధించడానికి ఎంచుకునే అనేక చీకటి చట్టాల్లో “ఉపా” ఒకటి మాత్రమే. కానీ ఇన్ని కుట్రలను, రాజ్య నిర్బంధాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయట స్వేఛ్ఛ కోసం ఎంతగా పరితపిస్తారో జైలుగది గోడల మధ్య ఉంటూ రచనల ద్వారా నో, కవిత్వం ద్వారానో నిర్బంధపు రోజుల్ని వర్ణమయం చేసుకుంటారు. తోటి ఖైదిలకి మార్గదర్శకులుగా ఉంటారు. సుధా భరద్వాజ్ తన తోటి మహిళా ఖైదీలతో పంచుకున్న అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చింది. అంతకు మునుపు అనురాధ, సాయిబాబా దానికి ముందు వివి వివిధ‌ సాహితీ రూపాలలో జైలు అనుభవాలను రాశారు. దీన్ని రాజకీయాచరణలో భాగంగానే చూడాలి. ఒక రకంగా ఇది ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలకి కూడా రాజకీయ పాఠాలే!

2014 తర్వాత జైళ్ళ నోళ్ళు సాధారణ ఖైదీల కంటే రాజకీయ ఖైదీల కోసం ఎక్కువ గా తెరుచుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దీని కోసం ఫాసిస్టు ధోరణిలో పలు కుట్రలకూ తెరలేపింది బిజెపి ప్రభుత్వం. వామపక్ష, దళిత,ముస్లీం ఉద్యమ కార్యకర్తలను నిర్భంధించడం రాజ్యానికి పరిపాటిగా మారింది. రాజకీయ లక్ష్యాల మధ్య వైరుధ్యాలు ఈ నిర్బంధానికి దారి తీస్తాయని ప్రత్యేకంగా ఊటించనవసరం లేదు. సగటు రాజకీయాల వెగటుతనాన్ని ప్రశ్నించడం ఇప్పుడు చాలా మంది యువ విద్యార్థినీ విద్యార్థులు పనిగా పెట్టుకున్నారు. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడటంతో పాటు, రాజ్యంతో పెట్టుకుంటే “ఊచలు లెక్కపెట్టే వలసి ఉంటుంది” అని సందేశం ఇవ్వడం కోసం ఈ అరెస్టులు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలే కారణంగా ఉంటాయి కాబట్టి పోలీసులకు, ఇడి సిబిఐ కి పెద్దగా మెదడు పెట్టే పని ఉండదు. పోలీసులు కేసులు పెట్టడానికి ఎంత బాగా అబద్ధాలను ఆధారంగా చేసుకున్నారు అనే దాని మీద ఈ విచారణ అరెస్టులు ఉంటాయి. సెహ్లా రషీద్ మీద రకరకాలుగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆమె నోరు మూయించారు. ఉమర్ ఖలీద్ దాదాపు నాలుగేళ్ళుగా జైలులో మగ్గుతున్నాడు. నజీబ్ అనే విద్యార్థి అసలు కనబడకుండా పోయాడు. సాయిబాబా, నవ్ లాఖా, కేరళ జర్నలిస్ట్ సిద్దీఖ్ కప్పన్ ఇటీవలె విడుదల అయ్యారు.

ఆ మధ్య బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నార్సీ, సిఎఎకి వ్యతిరేకంగా షాహిన్ బాగ్ వేదికగా ఢిల్లీలో జరిగిన చారిత్రాత్మకమైన ఉద్యమంలో జనం చురుకుగా పాల్గొన్నారు. నిజానికి ఈ ఉద్యమాన్ని లీడ్ చేసింది మహిళలు,మహిళా విద్యార్థులు. అందులో చాలా మందిని కుట్ర కేసుల్లో ఇరికించి జైలుకు పంపింది బిజెపి ప్రభుత్వం. ఈ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులలో “గుల్ఫియా ఫాతిమా” ఈ ఒక్క పేరు చాలు కదా ఆమె పై ఉపా పెట్టడానికీ, ఈ రాజ్యం దృష్టిలో ముస్లీం లు తమ హక్కుల పై గళం విప్పడం కంటే పెద్ద నేరం ఉండబోదు. ఈమె చేసిన నేరం అదే. ఫలితంగా జైలు పాలైంది. కానీ ఈ నిర్భంధం ఆమెని అంతరంగాన్ని ముక్కలు చేయవలసింది (షెహ్లా రషీద్ లాగా)కానీ అలా జరుగలేదు. ఆమె జైలు నుంచే తన పై పెట్టిన కుట్ర కేసు తో న్యాయం పోరాటం చేస్తూనే నింపాదిగా తన జైలు అనుభవాలను కవిత్వంగా, తన మిత్రులకు లేఖలు గా రాసుకుంటూ ఉంది. వీటిలో కొన్ని అనువాదాలు గా మాతృక పత్రికలో అచ్చయ్యాయి. కవి ఉదయమిత్ర ఈ కవిత్వాన్ని తెలుగు లోకి అనువదించాడు.

వ్యాసం మొదలులో చెప్పినట్టు ఆత్మవిశ్వాసం నిండా నింపుకున్న కవిత్వం ఈమె రాస్తోంది.
“చిట్టి చివరకు ఏదో ఒకనాడుఈ పాడుబడ్డ గోడలు కూలిపోతాయ్ వాటి స్థానంలో గుండెలనిండా నిశ్శబ్దంగా పులుముకు కొత్త గోడలు లేస్తాయి” ( నా చుట్టూ గోడలు) రాజ్యం నిలబెట్టే జైలు గోడలకు గుండె ఉండదు.‌ వాటిది ఒట్టి రాతి కాఠిన్యం. అయితే ఏనాటికైనా ఈ గోడలు కూలి వాటి స్థానంలో హృదయమున్న కొత్త గోడలు లేస్తాయి” అని ఆమె ఘంటాపథంగా చేబుతోంది.

“హద్దుల్లేని స్వేచ్ఛా లోకంలోకి ఎగరాలనుకున్న హృదయానికి బరువైన తాళం వేసి జ్ఞాపకాల గదిని మూసేస్తాడు” స్వేచ్ఛకోసం ఎంతటి తపనో కదా.” చరిత్ర పరీక్ష రాసేటప్పుడు అన్ని గుర్తుండిపోయేవి గానీ, ఎంత బట్టి పట్టినా తేదీలు మాత్రం మరచిపోయేదాన్ని , ఇపుడు తేదీలు మాత్రం గుర్తుండిపోయి అన్నీ మరిచిపోతున్న” ఆమె బెయిల్ కోసం ఎదురుచూస్తూ ఉంది. కానీ చట్టం దానిని తేదీల లెక్కన నిరాకరిస్తూ ఉంది. ఈ వైరుధ్యం, ఆలోచనల మధ్య ఈ సంఘర్షణ ఖచ్చితంగా ఆమె స్వేచ్ఛ వరకూ వెళుతుంది. అప్పటి దాకా రాజకీయ ఖైదిల స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఖైదు లో ఆమె వ్యక్తిత్వాన్ని కాపాడుకునేలా ధైర్యం గా ఉండేలా మన ప్రయత్నాలేవో చేయాలి కదా!?

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply