‘మన యిల్లే దేశం’ దేశభక్తితో అన్నాడు మా తమ్ముడు.
‘దేశమంత కుటుంబం మనది’ వీర దేశభక్తితో ఆన్నాడు మా అన్న.
‘మన అమ్మానాన్నే దేవతలు… దేశ నాయకులు’ తన్మయంతో అంది మా చెల్లెలు.
‘ఇలలో శ్రీరామచంద్రులు’ పారవశ్యంలో కళ్ళు తెరవనే లేదు మా అక్క.
‘వాళ్ళ చేతుల్లోనే మన భవిష్యత్తు’ భక్తిని మించిన భయంతో చేతులు జోడించి సారీ చేతులు కట్టుకొని అన్నాడు మా బామ్మర్ది.
మా నాయన తెల్లని గెడ్డం నిమురుకుంటూ అమాయకంగా చూశాడు. మాయమ్మ బట్టతల దువ్వుకుంటూ ముసుముసి నవ్వులు నవ్వింది. మా యింకో చిన్నమ్మ సగంపండిన జుట్టుని సిగపెట్టుకుంటూ గర్వంగా చూసింది.
ఇవాల్టికి యేమి పిడుగు పడుతుందోనని యింటిల్లిపాదీ అప్పటికే బిక్కచచ్చి వున్నాం.
ఇంతలో వీధిలో ‘బిందెలకు మాట్లేస్తాం’ అని వినిపించింది. కాదు, ఆ కేక దగ్గరయ్యాక అర్థమయ్యింది.
“ఓడలమ్ముతామమ్మా వోడలు… నీటోడలు… గాలోడలు… ఓడలు… సవగ్గా అమ్ముతాం కారుసవగ్గా… గంపగుత్తగా అమ్ముతాం”
ఇంటిల్లిపాదీ మా అమ్మానాయనల వంక బెరుగ్గా చూశాం.
‘పొలమూ పుట్టా మనం దున్నలేం, మనవల్ల కాదు, కౌలూ గివ్లూ జాన్తానై, యీ యవ్వారం యాపారం చెయ్యడం నావల్ల కాదు’ తత్వవేత్తలా పండు గెడ్డాము నిమురుకుంటూ తలడ్డంగా వూపాడు మా నాయన.
‘మన తాతల తండ్రుల నుండి అమ్ముకు తింటూనే వున్నాం, యిప్పుడు మనతరం వచ్చింది’ కొత్త కాదన్నట్టు ప్రభుభక్తితో గొణిగాడు మావయ్య.
‘వాళ్ళ హయాంలో వాళ్ళు అమ్మారు, మా హయాంలో మేము అమ్మకపోతే యెంత అప్రదిష్ట?’ గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు మా నాయనకే వత్తాసు పలికింది మాయమ్మ.
‘ఎనకటివాళ్ళ కంటే యెక్కువమ్ముతాం…’ నమ్మకాన్ని మించిన ఆత్మవిశ్వాసంతో పలికింది చిన్నమ్మ.
‘దున్నడం చేతకాని యెదవ… పండించడం చేతకాని యెదవ…’ అని అందరం వెనకాల గొణుక్కు తిట్టుకున్నాం.
ఇల్లు నడవాలంటే ఆదాయం వుండాలని- మా నాయనా అమ్మా చిన్నమ్మా మొత్తం పెద్దల బెటాలియన్ అంతా కలిసి మాజీతాల్లో నాతాల్లో గట్టిగానే నొక్కేస్తున్నారు. నొక్కేయడమేమిటి లాక్కుంటున్నారు. పీక్కుంటున్నారు. తిరిగి యేమి పీక్కుంటావో పీక్కోమన్నట్టు చూస్తున్నారు. అరే అగ్గిపెట్టె కొన్నా పన్నే. అన్నం తిన్నా పన్నే. పన్నే అంటే తప్పే అని మా భాష. మా బాధ.
నోరెత్తడానికి లేదు, పెద్దరికం అలాంటిది మరి. అన్ని పవర్సూ ఆల్లవే.
మళ్ళీ తెల్లారింది.
ఏ క్షణానికి యే పిడుగు పడుతుందోనని భయపడుతూనే మా బతుకేదో మేం లాగుదామని వురుకులెత్తుతున్నాం.
ఇంతలో వీధిలో ‘చేపలమ్మా చేపలు’ అని వినిపించింది. కాదు, ఆ కేక దగ్గరయ్యాక అర్థమయ్యింది.
“బ్యాంకులమ్ముతామమ్మా… బ్యాంకులు… సవగ్గా అమ్ముతాం కారుసవగ్గా… మొత్తం టోకున అమ్ముతాం”
ఇంటిల్లిపాదీ మా అమ్మానాయనల వంక బెరుగ్గా చూశాం.
‘మిల్లూ మిషనూ మనం నడపలేం, మనవల్ల కాదు, యీ యవ్వారం యాపారం చెయ్యడం నావల్ల కాదు’ పండు గెడ్డాము నిమురుకుంటూ తలడ్డంగా వూపాడు మా నాయన.
‘మనకదే ఆధారం. మనకదే లక్షల కోట్ల ఆస్తి, వుమ్మడి ఆస్తి యెవడి బొడ్డుమీదో పొయ్యడమేమిటి? పొయ్యడానికి అసలు నువ్వెవులు?’ అని మా నోరు పెగల్లేదు. పెగిలిన వాళ్ళని పేలిన వాళ్ళని కొట్టుగదిలో వేసి తాళం పెట్టారు మా అమ్మానాయన. ఇలాటి విషయాల్లో మా బట్టతల అమ్మ మా గట్టి మనిషి. పెద్దరికాన్ని యెదిరించడం ప్రశ్నించడం అంటే విప్లవమే అన్నట్టు చూస్తుంది. అడ్డలో పెట్టి అణిచేస్తుంది.
‘నువ్వేది అమ్ముతావో అమ్ము, డబ్బు రాబడి ముఖ్యం’ అని మా నాయనకు వంతపాడింది మా చిన్నమ్మ.
‘మీరు యేది చేసినా యింటికోసం… ధర్మం కోసం’ అలవాటుగా ప్రభుభక్తితో అన్నాడు మావయ్య.
ఇంటిని ముంచేస్తున్నారని యేడ్చుకున్నాం.
పదిమందిలో పందిరెయ్యడానికి మధ్యమధ్యలో దేశాలు పట్టి తిరిగి వస్తున్నాడు మా నాయన. అందర్నీ పిలిచి పీటేసి ‘మా యింట్లో మీకు కావలసింది మీరు తినండి’ అని ప్రోత్సహిస్తున్నాడు. ‘మీరొస్తే మా యింటికి మహా వెలుగు’ అని కూడా అంటున్నాడు.
మాకివ్వకపోయినా- అలా బైటనుండి వచ్చిన వాళ్ళకి నీళ్ళూ నేలా కరెంటూ ఫ్రీగా యిస్తామంటున్నాడు. కొంటామంటే కంపెనీలు చవగ్గా యిస్తామంటున్నాడు. వచ్చిన వాళ్ళ ముడ్డికింద వెయ్యడం కోసం పీట పట్టుకు తిరుగుతున్నాడు.
‘ఎలా తిరగనీ వొరగనీ, అయినోళ్ళకి ఆకుల్ల కానోళ్ళకి కంచాల్ల వడ్డించడం బాగోలేదు’ అనుకున్నాం. మా పిల్లలు తెలీక నిజం మాట్లాడి నిప్పుల్లో పడ్డట్టు కొట్టు గదిలో పడ్డారు.
మిట్ట మధ్యాన్నం.
‘ధర్మం గొడుగు అధర్మం పిడుగు. పిడుగు పడితే పడనీ’ అనుకున్నాం.
ఇంతలో వీధిలో ‘వుప్పమ్మా వుప్పు’ అని వినిపించింది. కాదు, ఆ కేక దగ్గరయ్యాక అర్థమయ్యింది.
“రైళ్ళమ్ముతాం… రైల్వే ష్టేషన్లమ్ముతాం… సవగ్గా అమ్ముతాం కారుసవగ్గా… మొత్తం టోకున అమ్ముతాం”
ఇంటిల్లిపాదీ మా అమ్మానాయనల వంక బెరుగ్గా చూశాం.
‘బండీ బక్కా మనం తిప్పలేం, మనవల్ల కాదు, యీ యవ్వారం యాపారం చెయ్యడం నావల్ల కాదు’ పండు గెడ్డాము నిమురుకుంటూ తలడ్డంగా వూపాడు మా నాయన.
‘చక్కగ నువ్వు యెవులెవులుకి యేటేటి యివ్వాలనుకుంటన్నావో యిచ్చీ, యింట్ల యే నాకొడుకు అడిగితే ఆడి పుచ్చ పేలిపోద్ది’ మాయమ్మ వొక చేత్తో బట్టతలని దువ్వుకుంటూ మరో చేత్తో కర్రతిప్పింది.
‘ఏదీ అమ్మకుండా డబ్బు ఆకాశం నుండి వూడిపడదు, కానీ’ మా నాయన అడుగులకు మడుగులొత్తుతున్నట్టు అంది చిన్నమ్మ.
‘రామ రామ నీకు అడ్డు చెప్పేది యెవరు మామ?’ యెంతో ప్రభుభక్తితో హనుమంతుడయ్యాడు మావయ్య.
ఇంటిల్లిపాదీ కిక్కురుమనకుండా వున్నాం.
మళ్ళీ తెల్లారింది.
‘పడితే పిడుగేకదా పడతాది పడనీ’ పల్లకున్నాం.
ఇంతలో వీధిలో ‘కూరలమ్మా ఆక్కూరలు’ అని వినిపించింది. కాదు, ఆ కేక దగ్గరయ్యాక అర్థమయ్యింది.
“బియ్యెస్సెన్నెల్లూ… యల్లైసీ… సవగ్గా అమ్ముతాం కారుసవగ్గా… మొత్తం టోకున అమ్ముతాం”
ఇంటిల్లిపాదీ మా అమ్మానాయనల వంక బెరుగ్గా చూశాం.
‘గొడ్డూ గోదా మనం పెంచలేం, మనవల్ల కాదు, యీ యవ్వారం యాపారం చెయ్యడం నావల్ల కాదు’ పండు గెడ్డాము నిమురుకుంటూ తలడ్డంగా వూపాడు మా నాయన.
‘అమ్మితే అమ్మినాం గాని, వొక పెద్దోడికి అమ్మితే మనకి అక్కరకొస్తాడు, అయినా నీకు చెప్పాలా సామీ’ మాయమ్మ బట్టతల మెరుస్తుండగా మెరుపు వెలుగుతో చూసింది.
‘ఇంకా అమ్మడానికి యేమున్నాయో చూసి లిస్టు రాస్తాను’ మా చిన్నమ్మ చాలా చలాకీగా అంది.
‘ఇంట్లున్న స్టీలు, గ్యాసు, కరెంటు… అన్నీ ఆల్రెడీ యిచ్చీసారు కదా?’ గొప్పగా భుజాలు యెగరేసి అన్నాడు మావయ్య.
ఇది అన్యాయమని ఆవేశపడ్డ మా అన్నదమ్ముల్ని కాళ్ళూ చేతులూ కట్టేసి కొట్టుగదిలో పడేశారు.
మనకెందుకొచ్చిన గొడవని యింటిల్లిపాదీ గుద్దా నోరూ బుద్ధిగా మూసుకున్నాం.
చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు వచ్చి చేరినాయి. వాటి అందం చూసి మా అమ్మా నాయినా చిన్నమ్మ బేచీ యెంతో పొగిడినారు. మేమెంతో శ్రమ పడి పాముల్ని తెచ్చినాం అన్నారు.
మేం బితుకు బితుకుమని వున్నామంటే వున్నాం.
‘వాళ్ళు మన యింట్లో గోతులు తవ్వుకున్నారు. నూతులు తవ్వుకున్నారు. చెరువులు తవ్వుకున్నారు. గనులు తవ్వుకున్నారు. ఆలవన్నీ తవ్వుకుంటేనే మనకి కూలిపని దొరుకుతాది’ మా నాయన తెల్లని గెడ్డం నిమురుకుంటూ మేధావిలా చూశాడు.
‘రామ రామ’ అన్నాం బుగ్గలమీద చేతులేసుకొని.
అంతే… ‘మీ కోసం రామాలయం కట్టిస్తాను, కోర్టు జట్టీలు లేకుండా నేను చూసినాను. రామాలయ నిర్మాణం మీరే చూడాల’ మా నాయన పెద్ద భక్తుడైపోయాడు.
‘మహానటుడు’ గొణుక్కుంటూ చందాలిచ్చాం.
ఇంతలో వీధిలో ‘ముగ్గుపిండమ్మా ముగ్గుపిండి’ అని వినిపించింది. కాదు, ఆ కేక దగ్గరయ్యాక అర్థమయ్యింది.
“స్టీల్ ప్లాంట్లూ… బొగ్గుబావులూ… సవగ్గా అమ్ముతాం కారుసవగ్గా… మొత్తం టోకున అమ్ముతాం”
ఇంటిల్లిపాదీ మా అమ్మానాయనల వంక బెరుగ్గా చూశాం.
‘అన్నీ అందరికీ యిచ్చీసినా మీ రక్షణ నేను చూస్తాను. మీ అందరికీ కాపలాగా నేనుంటాను’ ఛాతీ పొంగిస్తూ అన్నాడు మా నాయన.
‘ఇంట్లున్నవన్నీ యిచ్చేసినాక మాకు యింక రక్షణా కాపలా యేల?’ ధైర్యం చేసి అన్నాం. ఏటి యీక తెంపేస్తాడని తెగించి అడిగినాం.
‘ఆ రక్షణా కాపలా లేకపోతే నేనుండను కదా?’ అని మా నాయన నవ్వినాడు.
ఒళ్ళు సిరసిర మండిపోయింది.
‘మన యిల్లు యీదిల పడీడం కంటే, యింట్ల వున్నవన్నీ అమ్మీడం కంటే మమ్మల్నే అమ్మీరాదా?’ అన్నాం.
‘మీ పౌరసత్వం స్వదేశీయం. మీ జీవితం ప్రపంచ బానిసత్వం’
‘అదేంటి?’
‘అదే వసుదైక కుటుంబం’ అన్నాది మాయమ్మ.
ఇంతలో వీధిలో అంతవరకూ రోజుకొకటి అమ్ముతున్న ఆసామి వచ్చాడు.
‘అయ్యా! మీరు చెప్పినవన్నీ అమ్మినాను. క్లియరెన్సు సేల్ పెట్టి అమ్మితే బాగుంటుంది…’ అని మా నాయన చెవిలో యేదో చెప్పినాడు.
“మీకేం కావాలో మా యింట్లో మీరే కొనుక్కోండహో” అని అరుస్తూ అతగాడు వీధిలోకి వెళ్ళాడు.
ఇల్లు లేని మేం యింట్లోకి వెళ్ళాం!
జీవితం ప్రపంచ బానిసత్వం చక్కని చురక
😊బమ్మిడిగారు లాంటి పొలిటికల్ కాల్పనిక రచయితలు ఎందరోస్తే మన సాహిత్యం రూపురేఖలు మారతాయో
సేల్స్ అదిరాయి. నాయిన తెల్లగడ్డం బెగి కత్తిరించండి బాబూ.