1932, ఆగస్టు 30 జర్మనీ రాజధాని బెర్లిన్: 75 ఏళ్ల వృద్ధురాలు తన కామ్రేడ్స్ సాయంతో స్ట్రెచర్ నుండి కిందికి దిగింది. అప్పటికే నాజీలు గోలగోలగా అరుస్తూ కమ్యూనిస్టులను తిడుతున్నారు. ఆమె కర్రసాయంతో నెమ్మదిగా రీచ్స్టాగ్ (జర్మన్ పార్లమెంటు) భవనం ఎక్కి వణికే గొంతుతో తన ఉపన్యాసం ప్రారంభించింది. ఆమె పేరు క్లారా జెట్కిన్. జర్మన్ కమ్యూనిస్టు పార్టీ గ్రాండ్ మదర్ అంటారామెను. ఆ పార్టీ తరపున రీచ్స్టాగ్ కు ఎన్నికైంది. రీచ్స్టాగ్ సంప్రదాయం ప్రకారం అందరికన్నా పెద్దవయసు ఉన్న సభ్యులు పార్లమెంటు మొదటి సమావేశాన్ని ప్రారంభించాలి. ఆమె ప్రారంభించిన ఆ సమావేశమే రీచ్స్టాగ్ కు చిట్టచివరిది. ఆమె చివరి ఉపన్యాసమూ అదే. ఆ తర్వాత 1933 ఫిబ్రవరి 27న హిట్లర్ కుట్రపూరితంగా దానిని తగలబెట్టించి, ఆ నెపం కమ్యూనిస్టుల మోపి కమ్యూనిస్టులను, వారి వెంట పౌరప్రజాస్వామిక హక్కులనన్నిటినీ ఊచకోత కోసాడు.
ఆమె రీచ్స్టాగ్ సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ “నేను 1857 జులై 5న పుట్టాను, నా కన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా” అని ప్రశ్నించింది. నిశ్శబ్దం ఆవరించింది. ఆశేష శ్రామిక జనంపై పెట్టుబడిదారీ సంక్షోభం తుఫానులా విరుచుకుపడుతున్న ఆనాటి సందర్భాన్ని వివరిస్తూ గుత్త పెట్టుబడి సేవకుడిగా పార్లమెంటు ప్రమేయం లేకుండా ఏర్పడిన ప్రిసిడియల్ క్యాబినెట్ మొత్తం రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుందని, దీనికి కారణం బూర్జువా ఉదారవాదంలో కుళ్ళిపోతున్న సోషల్ డెమాక్రెట్లేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఆనాడు ప్రపంచ ఆర్థిక సంక్షోభ తీవ్రత జర్మనీ మీద విపరీతంగా ఉంది. ఒకవైపు ప్రజలను ఆకలి, నిరుద్యోగం పీడిస్తుంటే ప్రిసిడియల్ క్యాబినెట్ నాజీలపై నిషేధాన్ని ఎత్తివేసి ఫాసిస్టు భూతాన్ని నిద్రలేపింది. అది కమ్యూనిస్టులను హత్యలు చేస్తూపోయింది. క్లారా జెట్కిన్ రష్యాలో ప్రవాసం ఉంటూనే ఎన్నికల్లో గెలిచింది. జర్మనీలో అడుగుపెడితే చంపేస్తామని నాజీలు హెచ్చరించినా తన చివరి ప్రసంగం చేయడానికి ఆమె రీచ్స్టాగ్ వచ్చింది. ఫాసిజాన్ని ధ్వంసం చేయమని పిలుపిస్తూ ఆమె రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు. వాటి సారాంశం ఇది.
ఒకటి- ఉన్న వాటిలో తక్కువ చెడును ఎన్నుకుందాం అనే విధానం ప్రతికూల శక్తుల బలాన్ని పెంచుతూపోతుంది. ఎందుకంటే అ చెడుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన జనసమూహంలో ఇది నిష్క్రియాపరత్వాన్ని పెంపొందిస్తుంది. చివరికి చిన్న చిన్న దుర్మార్గుల స్థానంలో మహాదుర్మార్గుడు వచ్చి కూర్చుంటాడు.
రెండు- కొన్ని పరిమితుల్లోనైనా వర్గపోరాటానికి పార్లమెంటును ఉపయోగించుకోవచ్చు అనే విషయం గురించి. పార్లమెంటు ఏమేరకైనా శ్రామిక వర్గానికి ఉపయోగపడాలి అంటే దాని బయట బలమైన శ్రామికవర్గ పోరాటశక్తులు ఉండాలి. కమ్యూనిస్టు పార్టీలు పెద్ద దుర్మార్గుడిని నిలువరించడానికి చిన్న దుర్మార్గులను బలపరిచే క్రమంలో పార్లమెంటు వెలుపల అవి చేయవలసిన ప్రధాన కర్తవ్యాలను పక్కన పెడతాయి. శ్రామికవర్గాన్ని రాజకీయంగా బలమైన శక్తిగా మార్చడానికి అవి తమ శక్తియుక్తులను వినియోగించకుండా బూర్జువా ఉదారవాద పరిమితులకు లోనయ్యేకొద్దీ ప్రతికూల శక్తులు బలపడి ఫాసిజం తలెత్తుతుంది.
వివరాల్లోకి పోకుండానే మనం ప్రస్తుత భారతదేశ పరిస్థితిని దీనికి అన్వయించుకోవచ్చు. ఇప్పటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భం అంటే ఫాసిస్టు సందర్భమే. క్లారా జెట్కిన్ చివరి ప్రసంగం ఫాసిజం గురించే.
అంతర్జాతీయ మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జెట్కిన్ రివిజనిజంపై పోరాటంలోనూ, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ లోనూ గుర్తించదగ్గ పాత్ర పోషించారు. నిజానికి అమె రాజకీయాల్లోకి వచ్చేనాటికి సోషల్ డెమాక్రటిక్ పార్టీలో మహిళలకు సభ్యత్వం లేదు. అక్కడి నుండి అంతర్జాతీయ కమ్యూనిస్టు మహిళా ఉద్యమ నిర్మాణం వరకు అమె ప్రస్థానం సాగింది.
తల్లి జోసఫీన్ విటాల్ ఎయిస్ నర్ క్లారాకు మొదటి స్ఫూర్తి. ఫ్రెంచ్ విప్లవభావాలతో ప్రభావితమైన యువతిగా ఆమె స్త్రీల విద్యకై కృషి చేశారు. క్లారా తండ్రి మాత్రం సనాతన ప్రొటెస్టెంట్. క్లారా టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చేరాక ఆమె జీవితం మలుపు తిరిగింది. మహిళా సంఘాలతోనూ, సోషల్ డెమాక్రట్లతోనూ అమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ కమ్యూనిస్టు స్నేహాలను తల్లిదండ్రులిద్దరూ వ్యతిరేకించడంతో ఆమె తన కుటుంబానికి దూరంగా ఉండటం మొదలు పెట్టింది. అమె స్నేహితుడు, రష్యన్ ప్రవాసి ఓసిప్ జెట్కిన్ మార్క్సిజాన్ని అధ్యయనం చేయమని, కార్మికులతో పనిచేయమని ప్రోత్సహించాడు. సోషల్ డెమాక్రెటిక్ పార్టీలో మహిళలకు సభ్యత్వం లేకపోయినా అమె పార్టీ కోసం అన్ని రకాల పనులు చేయసాగింది. ఈ క్రమంలోనే పార్టీపై నిషేధం విధించారు. టీచర్ గా పనిచేస్తూనే క్లారా పార్టీ పనులు చేసేది. అజ్ఞాత నాయకుల కోసం చందాలు వసూలు చేసేది. అప్పటికే ఆమె ఓసిప్ జెట్కిన్ తో తన జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఓసిప్ ను జర్మనీ నుండి బహిష్కరిస్తే అమె అతనితోపాటు ఆస్ట్రియాకు ప్రవాసం వెళ్ళింది.
అక్కడే ఏడాద్నిర పాటు ఒక ధనిక కుటుంబంలో టీచర్ గా పనిచేసింది. అక్కడి నుండి అమె స్విట్జర్లాండ్ కు, అటు నుండి పారిస్ కు మారింది. ఎక్కడున్నా పార్టీని అంటిపెట్టుకుని ఉంది. ఓసిప్ ను పెళ్ళి చేసుకుంటే ఆమె జర్మన్ సభ్యత్వం పోతుంది. ఈ కారణంగా పదేళ్ళ పాటు వాళ్ళు లీగల్ గా పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించారు. ఇద్దరు పిల్లలతో వారిరువురూ కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. ఒకానొక సమయంలో ఇంటి అద్దె కట్టనందుకు ఆమెను కట్టుబట్టలతో వీధిలోకి తరిమారు. ఎన్ని కష్టాలున్నా ఆమె ఎన్నడూ పార్టీ కార్యకలాపాలను వదల్లేదు. ప్యారీస్ లో మహిళలను పార్టీలోకి సమీకరించింది. పగలు పిల్లల్ని చూసుకోవడం, ట్యూషన్లు చెప్పడం, రాత్రి వ్యాసాలు రాయడం, అనువాదాలు చేయడం చేసేది. విపరీతమైన శ్రమకు తట్టుకోలేక ఆమె శరీరం శుష్కించింది. టిబి బారినపడిన కూతుర్ని తల్లి ఇంటికి రమ్మని పిలిచింది. చాలా కాలం తర్వాత సొంత ఊరికి తిరిగి వెళ్లి అక్కడ కూడా ఆమె పాత కామ్రేడ్స్ ను కలిసి విదేశాల్లో సోషల్ డెమాక్రెట్ల కార్యకలాపాల గురించి, ఉద్యమంలో రోజురోజుకూ పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం గురించి చర్చించేది. పారీస్ తిరిగొచ్చాక కొద్దికాలానికే ఓసిప్ జట్కిన్ అనారోగ్యంతో చనిపోయాడు (1889 జులై 14). వ్యక్తిగత విషాదం నుండి తేరుకొని కొన్ని నెలలో రెండవ ఇంటర్నేషనల్ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నది. బెర్లిన్ కార్మిక మహిళల ప్రతినిధిగా రెండవ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ లో ఆమె కార్మిక మహిళల గురించి మాట్లాడింది. ఆ కాంగ్రెస్ కు 19 దేశాల నుండి నాలుగు వందల మంది ప్రతినిధులు హాజరైతే అందులో ఎనిమిది మంది మాత్రమే మహిళలు. స్త్రీలు పరిశ్రమల్లోకి రావడం వల్ల జీతాలు తగ్గిపోతున్నాయని, పనిగంటలు పెరిగిపోతున్నాయని వాదించే సోషలిస్టుల్ని క్లారా గట్టిగా వ్యతిరేకించారు. స్త్రీల శ్రమ దోపిడి గురించి వివరించి, శ్రామిక స్త్రీ పురుషులు కలిసికట్టుగా పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాడాల్సిన అవసరాన్ని చెప్పారు. ఆనాటి కాంగ్రెస్ స్త్రీపురుష సమానత్వం గురించి, పార్టీ శ్రేణుల్లో స్త్రీలను చేర్చుకోవాల్సిన అవసరం గురించి ప్రకటన విడుదల చేసింది. స్త్రీపురుషులిద్దరికీ సమాన వేతనం డిమాండ్ చేయాల్సిన బాధ్యత పురుష కార్మికులకు వుందని ప్రకటించింది.
జర్మనీ అధ్యక్షుడిగా బిస్మార్క్ గద్దె దిగాక సోషల్ డెమాక్రెట్లపై నిషేధం తొలగింది. పుస్తకాలు, పత్రికలు విరివిగా వచ్చాయి. క్లారా సోషలిస్టు ప్రచురణాలయాల్లో పనిచేసింది. ఎన్నో రచనలు, అనువాదాలు చేస్తూనే మహిళా పత్రిక ‘సమానత్వం’ సంపాదక బాధ్యతలను చేపట్టి దాదాపు 25 సంవత్సరాల పాటు ఎడిటర్ గా కొనసాగింది. పదేళ్ళలో పత్రిక సర్కులేషన్ 1100 కాపీల నుండి 1,25,000 కాపీలకు పెంచింది. అంతే కాదు, వివిధ ట్రేడ్ యూనియన్లలో పనిచేస్తూ వాటికి అంతర్జాతీయ సంబంధాలు నెలకొల్పింది. ఆమె ప్రధాన కేంద్రీకరణ కార్మికవర్గ స్త్రీలను సంఘటితం చేసే పనిగా ఉండింది. 1907లో క్లారా జట్కిన్ అంతర్జాతీయ సోషలిస్టు మహిళల కార్యదర్శిగా ఎన్నికైంది.
జర్మన్ పరిశ్రమల్లో స్త్రీల పని పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. రోజుకు 11 నుండి 14 గంటల వరకు పని. ఏ మూలకూ సరిపోని తిండి. ఫలితంగా స్త్రీలలో రక్తహీనత, రోగనిరోధక శక్తి లేకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉండేవి. న్యూయార్క్ కుట్టపని కార్మికుల పోరాటం అంతర్జాతీయంగా మహిళా ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. 1908 మార్చ 8 నాడు వారు చేసిన ఊరేగింపు, ఓటు హక్కు కోసం డిమాండ్ చేయడం, శక్తివంతమైన ట్రేడ్ యూనియన్ నిర్మాణాన్ని గురించి వారు మాట్లాడడం క్లారా జెట్కిన్ వంటి సోషలిస్టు మహిళల దృష్టిని ఆకర్షించింది. 1910 కోపెన్హాగన్ లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ మహిళా మహాసభ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతిపాదించింది. 1911లో మొదటిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు.
ఏ మహిళా ఉద్యమానికైనా రాజకీయ హక్కుల ఆకాంక్ష ఇరుసుగా ఉండాలని క్లారా చెప్పేది. స్త్రీలకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్యమాలు ఆరోజుల్లో ఉధృతంగా జరిగేవి. ఓటుహక్కు ప్రధానంగా ఒక సామాజిక హక్కు అని స్పష్టం చేస్తూనే, వ్యక్తిగత ఆస్తి చెక్కుచెదరనంత వరకు స్త్రీల విముక్తి సాధ్యం కాదని చెప్పేది.
స్త్రీలపై అణచివేత వ్యక్తిగత ఆస్తితో ముడిపడి ఉందని క్లారా కచ్చితమైన మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించారు. అతి ప్రాచీన వర్గవిభజన స్త్రీపురుషుల మధ్య జరిగిందని ఎంగెల్స్ అంటాడు. కుటుంబంలోపలే భర్త బూర్జువా అయితే భార్య కార్మికురాలు. ఇంటి యజమాని పురుషుడే కదా! పితృస్వామ్యం ఎంత ప్రాచీనమైనదైనా మహిళా సమస్య గురించిన ఎరుక పెట్టుబడిదారీ సమాజం రావడంతోనే కలిగిందని గుర్తించొచ్చు. ఒకరకంగా పాత ఆర్ధిక వ్యవస్థ ధ్వంసం అయ్యాక ఉత్పత్తిలో స్త్రీల ఉనికి ప్రశ్నార్ధకమైంది. కుటుంబం కేంద్రంగా జరిగే ఉత్పత్తి విధానంలో మహిళల పాత్ర కీలకంగా ఉంటుంది. కుటుంబ పోషణలో, సామాజిక ఉత్పత్తిలో నేరుగా భాగస్వామ్యం ఉన్నందున అమె అందులో లీనమైపోయేది. యంత్రాలు రావడంతో ఇళ్ళ వద్ద జరిగే చిన్నతరహా ఉత్పత్తి పోయింది. కేవలం ఇంటి పనులకు పరిమితమైన స్త్రీకి తన స్థానం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. అయితే మహిళా సమస్య లేదా లైంగిక వివక్ష, దోపిడి అనేవి మహిళలందరికీ ఒక్కలాగే ఉండవు. అందుకే మహిళలందరూ ఒకటి కాదని క్లారా అంటారు.
అస్తిపర వర్గాల్లో ఉన్న స్త్రీలకు కావలసినవన్నీ అందుబాటులో ఉంటాయి. తన హెూదా తను అనుభవిస్తుంది, వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటుంది. కానీ ఎన్ని ఉన్నా భర్త అనే యజమాని ఉంటాడు. ఇంత మాత్రమే కాదు. అటువంటి కుటుంబాల్లో ఆస్తి తర్వాతే నైతిక విలువలు, ప్రేమ, ఆపేక్షలు ఉంటాయి. పెళ్లిళ్లు ప్రేమ పునాదిగా కాకుండా డబ్బు లావాదేవీల్లో జరుగుతాయి. పిల్లలు తల్లుల వద్ద కన్నా సేవకుల వద్ద ఎక్కువగా ఉంటారు. ఈ వర్గం స్త్రీల డిమాండ్లు కూడా స్వతంత్రంగా డబ్బు ఖర్చు పెట్టడానికి తమకు స్వేచ్ఛ ఉండాలి అనే విధంగా ఉంటాయి.
మధ్యతరగతి (పెటీబూర్జువా) స్త్రీలు బూర్జువా వ్యవస్థ అవసరాలను తీర్చే మేధో కార్మికులుగా ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ జీవితం పట్ల ఆశలు కలిగి తమ పరిధికి మించిన కలలు కంటారు. అటు పురుషులు కూడా మంచి ఉద్యోగం, సౌకర్యాలు పొందేంత వరకు పెళ్ళిని వాయిదా వేస్తారు. ఈ వర్గం కోసమే ఎక్కువగా వేశ్యలు తయారు చేయబడతారు. పెటీబూర్జువా మహిళలు పురుషులతో సమానంగా విద్య, వృత్తి, ఉద్యోగ అవకాశాలను డిమాండ్ చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య పోటీ తలెత్తుతుంది. స్త్రీల హక్కులను మగవాళ్ళు వ్యతిరేకిస్తూ ఆడవాళ్ళు నిర్వర్తించవలసిన కర్తవ్యాల గురించి సుద్దులు చెబుతూ ఉంటారు. ఈ వర్గ స్త్రీలు తమ మానసిక అవసరాలను బాగా ఫీలవుతారు. ఆర్ధిక, బౌద్ధిక, మేధోపరమైన ఎదుగుదల కోసం తపనపడతారు.
ఇక శ్రామిక వర్గ స్త్రీలు అన్ని రకాల అణిచివేతలను, హింసను భరించవలసి వుంటుంది. వీలైనంత చవకగా శ్రమను కొల్లగొట్టాలని చూసే పెట్టుబడి స్త్రీలు మరింత లొంగి ఉండాలని కోరుకుంటుంది. కార్మికవర్గ స్త్రీ ఏ కొంచెం స్వేచ్ఛ కావాలన్నా ఎక్కువ మూల్యం చెల్లించాలి. అమె మనిషిగా ఒక వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం తక్కువ. కార్మిక స్త్రీల విముక్తి పోరాటం బూర్జువా స్త్రీల వంటిది కాదు. అది తన వర్గం పురుషులతో కలిసి చేయవలసిన పోరాటం. మరో ముఖ్యమైన అంశం బూర్జువా మహిళా పోరాటానికి బూర్జువా వ్యవస్థ స్పందించి చట్టాలు చేస్తుంది. కార్మిక వర్గ మహిళల విషయంలో ఇది అంత సులభం కాదు. కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యం కార్మిక వర్గ స్త్రీలను సంఘటితం చేయడం. ఇది స్థూలంగా మహిళా సమస్య గురించి, మహిళా విముక్తి పోరాటాల గురించి క్లారా జెట్కిన్ అవగాహన.
సోషల్ డెమాక్రటిక్ పార్టీలో సోషలిస్టు మహిళల స్వయం ప్రతిపత్తి సంఘాలు వుండాలని, మహిళల చౌరవ పెరగడానికి, వారు రాజకీయంగా ఎదగడానికి ఈ తరహా నిర్మాణం అవసరమని ఆమె వాదించింది. మగవారి ఆధిక్యత ఎక్కువ ఉన్న పార్టీలో మహిళలు తమకు తాము స్వేచ్ఛగా వ్యక్తమయ్యే అవకాశం తక్కువ వుంటుందని ఆమె అభిప్రాయం. ప్రత్యేక మహిళా సమావేశాలు పెట్టుకుని పార్టీ కాంగ్రెస్ కు స్త్రీలను ఎన్నుకునే విధానాన్ని 1890 నుండి పార్టీ అమలుచేసింది. అటువంటి సమావేశాల నుండి సాధారణంగా క్లారా జట్కిన్ మహిళా ప్రతినిధిగా ఎన్నికయ్యేది. 1908 తర్వాత సోషలిస్టు మహిళల స్వయంప్రతిపత్తిని రద్దు చేసి, ఆ సంస్థలను పార్టీ కమిటీల్లో కలిపేశారు. క్లారా దీనిని వ్యతిరేకించింది. ఆ కాలంలోనే క్రమంగా పార్టీ రివిజనిజంలో పడిపోతూ వచ్చింది. పార్టీ ప్రధానంగా ఎన్నికల మీద ఆధారపడడం, విప్లవ కార్యకలాపాల మీద శ్రద్ధ తగ్గిపోవడం గురించి ఆమె విమర్శించేది. పార్టీ పట్టించుకోకపోయినా అమె 1905 రష్యా విప్లవానికి మద్దతుగా విస్తృతంగా క్యాంపెయిన్ చేసింది. మొదటి ప్రపంచ యుద్ధసమయంలో సోషల్ డెమాక్రటిక్ పార్టీ దేశభక్తి పేరున జర్మన్ సామ్రాజ్యవాదాన్ని సమర్థించింది. వీరికి వ్యతిరేకంగా క్లారా జెట్కిన్, రోజా లక్జెంబర్గ్ లు పోరాడారు. సామ్రాజ్యవాద యుద్ధం కార్మికవర్గానికి నష్టం చేస్తుందని ప్రచారం చేశారు. యుద్ధవ్యతిరేక సోషలిస్టులు, నిజమైన విప్లవాన్ని కాంక్షించేవారు 1918లో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.
కానీ 1919 జనవరి 15న ముఖ్యనాయకులైన కార్ల్ లీట్ నెక్ట్, రోజా లక్జెంబర్గ్ ను నాజీల పూర్వరూపమైన ‘ఫ్రెయికార్డ్స్’ హత్య చేశారు. తదనంతర కాలంలో వందలాది కమ్యూనిస్టులు హత్యకు గురయ్యారు. ఇక జర్మన్ కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ నాయకురాలిగా మిగిలి ఉన్నది క్లారా మాత్రమే. 1920 నాటికి క్లారా కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కార్యనిర్వాహకవర్గ సభ్యురాలిగా, కమ్యూనిస్టు మహిళల అంతర్జాతీయ కార్యదర్శిగా ఎన్నికై ఎక్కువగా సోవియట్ యూనియన్ లో ఉంటూ వచ్చింది. తరచూ అనారోగ్యానికి గురవుతూ అక్కడే వైద్యం చేయించుకునేది. సోషలిస్టు మహిళా ఉద్యమం గురించి ఆమె లెనిన్ తో జరిపిన సంభాషణలు చాలా విలువైనవి. ఆమె ఆలోచనలు, ఆమె పోరాటాలు చిరకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.