( కాడ్వెల్ కవితతత్త్వం అనే శీర్షికతో ఇది వరంగల్ నుండి వచ్చే జనధర్మ ద్వైమాసిక పత్రికలో 1969 మార్చ్ నుండి 1969 సెప్టెంబర్ వరకు నాలుగు సంచికలలో ధారావాహికగా వచ్చింది. దాదాపు గ్రాంథికంలో ఉన్న రచనను విషయానికి తగిన వ్యావహారిక వచనంలోకి 1970 లోనే వ్రాసిపెట్టారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు. రామకోటిశాస్త్రి గారు 1991 లో మరణించాక 1998 అక్టోబర్ లో ప్రజాశక్తి బుక్ హౌస్ వారు ఈ పుస్తకాన్ని ఇలా ముద్రించారు. ఫాసిస్ట్ పెనుప్రమాదం జడలు విప్పి నర్తిస్తున్న వేళ కాడ్వెల్ అవగాహనను తెలుసుకొనటం మన ఆలోచనకు అవగాహనకు ఉపయోగకరంగా ఉంటుందని … ఇప్పుడిలా మళ్ళీ …)
పరిచయం
క్రిస్టోఫర్ కాడ్వెల్ 1937 ఫిబ్రవరి 12వ తేదీన స్పెయిన్ లో మరణించాడు. రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వరంగంగా నాజీ ఫాసిస్టులు సృష్టించిన అంతర్యుద్ధాన్ని స్పెయిన్ రిపబ్లికన్ ప్రభుత్వం ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రభుత్వం పక్షాన అంతర్జాతీయ సైనిక విభాగంలో చేరి ఎర్రసైనికొత్సాహంతో విజృంభించి కాడ్వెల్ వీర మరణాన్ని పొందాడు. అప్పటికతని వయస్సు 1907 అక్టోబర్ 20న పుట్టాడు గనుక సరిగ్గా 29 సంవత్సరాల మూడు నెలలు పన్నెండు రోజులు.
1933 వరకు కాడ్వెల్ మార్క్సిజం దగ్గరకు పోలేదు. 1934, 35 సంవత్సరాలలో మార్క్సిస్టు ప్రపంచజీవిత తాత్వికతను అధ్యయనం చేసి ఆ అవగాహనతో కవిత్వము యొక్క ఉత్పత్తి పరిణామాలు మౌలిక సామాజిక స్థితిగతులను గురించి ఇల్యూషన్ అండ్ రియాలిటీ అన్న గ్రంథం చిత్తుప్రతిని రచించాడు. డిసెంబర్లో పార్టీలో సభ్యుడై మరింత విజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందాలని పారిస్ వెళ్ళాడు. అక్కడ పొందిన ఉత్సాహశక్తితో ఆ గ్రంథాన్ని కాడ్వెల్ పకడ్బందీగా తిరుగవ్రాశాడు. స్టడీస్ ఇన్ ఎ డయింగ్ కల్చర్ అన్న పేర ప్రచురించిన పుస్తకంలోని వ్యాసాలనప్పుడే పూర్తి చేశాడు. ‘ది క్రైసెస్ ఇన్ ఫిజిక్స్’ అనే రచన మొదలు పెట్టాడు. 1936 నవంబర్ లో అంతర్జాతీయ సైనిక విభాగంలో చేరటానికి పోయేటప్పటికి ‘ఇల్యూషన్ అండ్ రియాలిటీ’ అన్న ఈ గ్రంథం అచ్చులో వుంది. నిజానికతని పేరు కాడ్వెల్ కాదు. సెంట్ జాన్ స్ప్రిగ్ . యుద్ధంలో కొండల మీద మరణించింది జాన్, జాన్ బ్రతికుండగా పుస్తకాలు రచించింది కాడ్వెల్. జాన్ స్ప్రిగ్ తల్లి పేరు జెస్సి మేరీ కాడ్వెల్. ఆ తల్లి పేరునే తన కలం పేరుగా పెట్టుకొన్నాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు జాన్. మార్క్సిస్టు తాత్విక రచయిత అవుతూ తాను పెట్టుకొన్న పేరు కాడ్వెల్. ఆ వైజ్ఞానిక సంకేతమే నిలబడింది.
మార్క్సిస్టు ఆలోచనాపరుడూ ఆచరణ శీలుడూ కాకముందు కాడ్వెల్ యొక్క జాన్ జీవితం ఆదొకచిత్రం. పదహారేళ్ళదాకా చదువుకొన్నాడు. తరువాత మూడేళ్ళపాటు యార్కు షైర్ అబ్జర్వర్ పత్రికకు విలేఖరిగా పనిచేశాడు. అప్పుడు లండన్ లోని ఒక విమాన విజ్ఞాన ప్రచురణ సంస్థలో సంపాదకుడుగా చేరి దానికి డైరెక్టరైనాడు. అప్పుడే విలువైన యంత్ర విభాగాలను స్వయంకృషిచేత కనిపెట్టాడు. విమాన విజ్ఞాన శాస్త్ర విషయాల్లో అయిదు పాఠ్యగ్రంథాలను వ్రాశాడు. అపరాధ పరిశోధక నవలలొక ఏడు రచించాడు. పద్యాలూ, చిన్న కథలూ సరేసరి, ఇదంతా జరిగింది ఇరవై అయిదేళ్ళలోపుగానేనంటారు. నిజంగా కూడా అంతే. 1934 నుండి మార్క్సిస్టు ఆయన.
మే, 1935లో ‘దిస్ మై హాండ్’ అన్న నవలకు రచయితగా తన పేరును క్రిస్టోఫర్ కాడ్వెల్ అని వేసుకొన్నాడు. ఆ వరుసలో చూస్తే కాడ్వెల్ రచనలు. 1. This My Hand (1935) 2. Illusion and Reality (1937) 3. Studies in a Dying Culture (1938) (4). The Crisis in Physics (1939) (5). Further Studies in a Dying Culture (1949) ఇలా వుంటాయి. నవలలు, పాఠ్యగ్రంథాలు తప్పిస్తే మిగిలిన కాడ్వెల్ రచనలన్నీ అతని మరణానంతరం అచ్చయినవే. 1939లో మొదటిసారి అచ్చయిన అతని కవితలు 1965లో పునర్ముద్రణలో వచ్చాయి. ఆ సంవత్సరమే Studies Crisis in Physics అనే రెండు పుస్తకాల మొత్తంగా The Concept of Freedom అనే గ్రంథమొకటి వచ్చింది.కాడ్వెల్ కమ్యూనిస్టుగా బ్రతికి, చావడం కూడా కమ్యూనిస్టుగానే చావడం అతనిది పూర్ణజీవిత మనటానికి నిదర్శనం.
ఈ శతాబ్దిలో సాంస్కృతిక సాహిత్య కళారూపాల అధ్యయనంలో తన పూర్వీకులను మించిపోయినవాడు కాడ్వెల్. అంటే సాంస్కృతిక సాహిత్యకళా రూపాలు మహాజనం యొక్క మనస్సులను తమ ఆంతర్యానికభిముఖంగా మార్చుకొని, వాళ్ళచేత ప్రపంచాన్ని మార్పు చేయిస్తాయన్న చారిత్రక వాస్తవికతను తెలిసి విశదీకరించి సాహిత్య అధ్యయన దృక్పథాన్ని మార్చిన వాడన్నమాట.
ప్రవేశిక
కవిత్వాన్ని గురించి, కవిత్వ ఉత్పత్తి మాతృకాస్థానాల గురించి మాట్లాడుతున్నామంటే మనం ఇంకా చాలావాటిని గురించి మాట్లాడటానికి సిద్ధపడ్డామన్నమాట. అవేమిటంటే కవిత్వమనేది ఏదో ఒక భాషలో గదా వుంటుంది! అప్పుడు భాషల ఉత్పత్తి విషయం కూడా మనపరిధిలోనిదే. అన్ని భాషలూ ఆయా సమాజాల సమష్టి ఉత్పత్తులు. ఆ సమాజంలోని మనుషులంతా తాము ఒకరితో ఒకరు సంబోధించి వ్యవహరించుకోవడం అవసరమై కూర్చుంటే ఆ అవసరం తీర్చే సాధనంగా అందరూ కలిసి యథాశక్తి ఆ భాషను సృష్టించుకున్నారు. అది సమష్టిమీద ఉత్పత్తి చేసినది గనుక అది సమాజం సాత్తు. ఆ సామాజిక సంపదయైన భాషను ఆశ్రయించి ఆ రూపంతోనే తాను వ్యవహారంలోకి వస్తున్నది కవిత్వం. ఆ భాష తన రూపాన్నిచ్చి సహకరించకపోతే కవిత్వం లేదు. లేదని ఎందుకనాలి? ఉన్నదనే అందాం. వున్నా అది ఉన్నట్లు తెలియకుండా మాత్రమే వుంటుంది. తెలియాలంటే భాషారూపాన్ని ధరించక తప్పదు. భాష తనకు రూపమిచ్చి తన ఉనికికి తోడ్పడుతున్నది. గనుక, కవిత్వం అందుకు కృతజ్ఞతగా భాషా లక్షణాలను తాను సంతరించుకుని త్వమేవాహమన్నట్లుగా వుంటుంది. భాషయొక్క ప్రధాన లక్షణమేమనుకొన్నాం? అది సమష్టి సామాజిక చైతన్య లక్షణలక్షిత. సరిగ్గా దాన్నే కవిత్వం కూడా సంతరించుకుంటుంది. అందువల్ల కవిత్వాన్ని గురించి విచారించడం మొదలు పెట్టామంటే దాని ప్రాథమికమైన స్వరూప స్వభావాలకు సంబంధించిన సమష్టి సామాజిక చైతన్య మూలమైన సాంఘిక అస్థిత్వరూప ఆర్ధిక రాజకీయ వ్యవస్థల స్థితిగతుల దగ్గర మొదలు పెడుతున్నామన్నమాట.
ఇలా మొదలు పెట్టడాన్ని పాతవాళ్ళెవరూ ఒప్పుకోరు. సాహిత్యాన్ని, సాహిత్యంగానే విమర్శించాలంటారు. ఉత్పత్తి స్థానాలతో సంబంధం కలిపి విచారించడం పద్ధతి కాదంటారు. కవిత్వం కవిత్వంలాగుండాలిగానీ మరొకలాగా అదివుండకూడదంటారు. కవిత్వాన్ని కవిత్వంగానే చూచి విమర్శించాలంటారు. ఇదంతా నిజమే. ఎప్పుడు నిజం? పదార్థ పరిశీలనలో, పరిశోధనలో విడివిడిగా దేనికది స్వయంసంపూర్ణమనుకునే అజ్ఞానమే విజ్ఞానంగా మనిషి ప్రవర్తించిన కాలంలో నిజం. అప్పుడు కవిత్వానికి మరొక దానితో సంబంధం లేదు. దాన్ని దానిగానే చూచేవాళ్ళు. అలాగే వ్యాకరణశాస్త్రం వేరు. తర్కశాస్త్రం వేరు. బాటని జువాలజీలు కూడా వేరు వేరే ఫిజిక్స్, కెమిస్ట్రీలు సరేసరి. మరిప్పటి పరిస్థితి వేరు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు రోజురోజుకూ ఆవన్నీ పరస్పర ప్రభావ ప్రసరణకు లోనవుతున్నాయని రుజువు పలుకుతున్నాయి. ఈ సంఘ ర్షణలో మేలుకలయికను సంతరించుకొన్నవి కొత్తరూపాలతో విజ్ఞాన రంగంలో అవతరిస్తు న్నాయి. ప్రకృతి విజ్ఞాన శాస్త్రాలీ విధంగా కొత్త కొత్త సత్యాలను కనుగొనడటం వల్లనే భౌతిక తాత్విక ధృక్పధం గతితార్కిక చారిత్రక భౌతిక తాత్వికతగా రూపొందింది. దాని నిరూపణకు నిలబడ్డవాడు మార్క్స్ గనుక అది ఆయన పేరుమీద మార్క్సిజంగా ప్రసిద్ధమైంది. అంటే మార్క్సిజం దేన్ని మరొకదానితో సంబంధం లేని స్వతంత్ర ప్రతిపత్తితో పున్నట్లనుకోదు. కర్త కర్మల సంబంధం క్రియాన్వయ సాపేక్షంగానే సార్థకంగా అవుతున్నట్లు చెబుతున్న వ్యాకరణ తత్వాన్ని జీవితానికి అన్వయించి వివేకాన్ని పెంచడంలో అందరికంటే మార్క్సిస్టులదే ముందడుగు. కర్మార్థాల విషయంలో క్రియాచరణ శీలుడు కావడం వల్లనే మనిషి నిశ్చయజ్ఞానం పొందగలుగుతున్నాడు. పొందటమంటే ఎమిటి? మరొకదాన్ని దేన్నో పొందగలగటమే కదా! దేన్ని గురించిన జ్ఞానమైనా మనిషికి తాను ప్రకృతి శక్తులతో కుస్తీలు పట్టడం వల్లనే కలుగుతుంది. మనిషికర్త . ప్రకృతి శక్తులు కర్మార్ధాలు.
కానీ వర్గ సమాజంలో బౌద్ధిక శ్రమ తాను వేర్పడి శారీరక శ్రమ ఫలితాలయిన కర్మలను తాననుభవించడానికి అలవాటుపడుతుంది. దీని ఫలితంగా రూపుగట్టుకున్నదే ఆనందానుభవం పరమాత్మదనీ,సుఖదుఃఖాలను ప్రసవించే కర్మ సంబంధం ఆయనకు లేదనీ, సుఖ దుఃఖాల ననుభవించడం అది జీవాత్మ ధర్మమని చెప్పే వేదాంతం. బుద్ధి జీవులూ, శ్రమ జీవులూ తెలిసి ఒకరు తెలియకుండా ఒకరు దోస్తూ దోచుకోబడుతూ కలిసి బతుకున్న సమాజంలో సాంఘిక వాస్తవికత జ్ఞానమూ, ఆచరణగా విడిపడివున్నది. దాన్ని బట్టే చైతన్య పరిధుల్లో జీవాత్మ పరమా త్మలు వేర్వేరుగా గుర్తింపబడుతున్నారు. వాస్తవిక సాంఘిక జీవితానుభవాలనుండి సముత్పన్నాలయిన అన్ని విషయాల అవగాహనకూ, మొదట సాంఘిక వాస్తవిక అస్తిత్వం గురిం చిన వివేకంయొక్క ప్రాధాన్యాన్ని మార్క్సిజం గుర్తించింది. అలా ఉత్పన్నమైన విషయాలలో ముఖ్యమైంది తాత్వికదర్శనమే. అదే ప్రపంచ దృక్పథం. అందువల్ల మొదట దాన్ని సాంఘిక వాస్తవికతకు సంబంధించినదిగా విచారించడానికి మార్క్సిజం పూనుకున్నది. సాంఘిక వాస్తవి కత అన్నది ఆ సమాజంలోని మనుషుల భిన్నభిన్న జీవితాలయొక్క మొత్తంగా వుంటుంది. అది అనేక రకాలయిన శీఘ్రగతి మార్పులకు లోనవుతూ వుంటుంది. సమాజంలోని మానవ సంబంధాల లక్షణ జ్ఞానమే సామాజికవిజ్ఞానం. ఒకానొక నిర్దిష్ట యుగ రూపమైన కాల పరిమితుల్లో మానవ సంబంధాలను నిర్ణయించగల సాంఘిక ఆస్తిత్వవివేకమూ, ఒక యుగాన్నుండి మరొక యుగానికి పోయేటప్పటికి ఆ సంబంధాలు మారడానికి వీరిచ్చిన అప్పటి సాంఘిక అస్తిత్వ పరిస్థితుల వివేకమూ కలిసి చారిత్రక భౌతిక వాద సిద్ధాంతాన్ని చేస్తున్నాయి.
యాంత్రిక భౌతికవాదంగానీ, భావవాదంగానీ ఒక్క తాత్వికదర్శనానికి మాత్రమే సంబం ధించినవని అనుకోకూడదు. అవి శాస్త్రవిజ్ఞానంలోనూ వున్నాయి.మానవజాతి చరిత్రలోనూ ఉన్నాయి.వట్టియాంత్రిక భౌతిక దృక్పధంగలిగిన మనోవైజ్ఞానికునకు కవిత్వమంతా అదొక రకమైన ప్రవర్తనా విధానంగా కనిపిస్తుంది. అదే విధంగా వచ్చిన తాత్వికునకు మానవ శరీరంలో విడిదిచేసిన జీవాత్మునకు స్వభావ సిద్ధంగా ఉన్న రసానుభవగుణానికి విషయంగా కనిపిస్తుంది. భావవాద దృక్పధం కవిత్వానికి ఎంతో అనుకూలంగా వుంటుంది. ఎందుకంటే భావవాదం చెప్పే సత్యశివసుందరత్రయంతో కవిత్వాన్ని వ్యాఖ్యానించవచ్చు. యాంత్రిక భౌతికవాద కళా దృక్పధం కర్త్రర్ధకమైన కళాకారుని సామాజిక జీవితంతో సంబంధాన్ని తెగదెంపులు చేసి కళారూపాన్నివట్టి కర్మార్ధకంగా చూస్తుంది. అప్పుడు కళారూపమొక్కటే చూపుకు విషయమ వుతుంది గనుక, అందువల్ల రూపరచనా శిల్పం గురించి మాత్రమే తెలియవస్తుందిగనుక, ఆ తెలిసినదాన్ని బట్టే కళానిరూపణ సిద్ధాంతాన్ని తయారుచేస్తుంది. అందులో కళాకారుని ఉనికిని గమనింపవలసిన అవసరంలేని కళారూపంలో కనిపించే రచనా శిల్ప విశేషాలను వర్ణించటం తప్ప మరేమీ వుండదు. ఇదే నిర్మాణ శిల్పసిద్ధాంతం.
తాత్విక విచారణలో యాంత్రిక భౌతికవాదమెంతో, కావ్యకళావివేక విచారణలో నిర్మాణ శిల్ప సిద్ధాంతమంత. భావవాద కళాదృక్పధం కళారూపాన్ని ఆత్మాశ్రయంగా చూస్తుంది. అంటే అది కళాకారుని మనోభావరూపమన్న మాట. అనుభవించేవాని విషయంలో కూడా అది అలాంటి దేనన్నమాట. తన చూపుకు ఆనినదాన్ని పట్టుకొని దానిమీద కళానిరూపణ సిద్ధాంతాన్ని తయారు చేయటానికి భావవాద దృక్పధం ప్రయత్నిస్తుంది. రసావేశరూపాలయిన మనోభావాలు అవి స్వభావసిద్ధాలై వుంటాయి గనుక ఇక వాటిని గురించి విచారించటానికేముంటుంది? వాటి మంచిచెడ్డలు ఆత్మారామునికి తెలుస్తూనేవున్నాయి. అందువల్ల ఏరకమైన శిల్పకళా విశేషాలను గురించి ఎవరు విమర్శించినా అదివారి వైయక్తిక అనుభవ లక్షణం తప్పమరేమీ కాదు. ఇదంతా రసభావావేశ సిద్ధాంతం. ఈ విధంగా అటుయాంత్రిక భౌతిక వాదమూ, ఇటు భావవాదమూ కూడా అశాస్త్రీయాలయిన ఆలోచనా ధోరణులతో తలక్రిందు సిద్ధాంతాలను సాహిత్యకళారంగాల్లో ప్రవ ర్తింపజేశాయి, చేస్తున్నాయి. ఈ రెండింటికీ తోడు ఇంకా అనేకరకాలయిన ఉదారవాదమనీ, కళకళ కోసమేననీ చెప్పుకునే సిద్ధాంతాలు కూడా ఆధునిక సాహిత్యకళావిమర్శనా భూముల్లో ప్రవర్తిస్తు న్నాయి.ఇంత కలగాపులగంగా సాహిత్య కళా విమర్శన రంగాలున్నాయంటే మన ఆలోచనా విధానాన్నీ, అందుకుమూలమైన అస్తిత్వాన్ని పరీక్షించుకోవలసిన సమయమాసన్న మైనదనే అర్థం.
సాహిత్య అధ్యయనంలో ముఖ్యంగా కావ్యశిల్పకళాధ్యయనంలో మనం కేవలం నిర్మాణ శిల్పసిద్ధాంతాన్నీ, రసభావావేశ సిద్ధాంతాన్ని రెండింటినీ కూడా ఆవిధంగా అంగీకరించం. మేమంగీకరిస్తామని ఎవరైనా అంటే మనకభ్యంతరంలేదు.వాళ్ళు మేము కవులమనీ, సహృద యులమనీ మరేమని అయినా అనుకోవచ్చు.విమర్శకులమని మాత్రం అనుకోకూడదు. ఆ పనిచేయటానికి రాకూడదు. ఎందుకంటే అలా అనేవాళ్ళెప్పుడూ కావ్యకళాగర్భంలోనే కండ్లు మూసుకొన పుట్టని శిశుపిండాలుగా తిరుగుతుంటారు. కవైనా అంతే, సహృదయుడైనా అంతే. ఆ దశలు దాటి బయటపడితే అప్పుడు కదా విమర్శనానికి అధ్యయనమూ విమర్శనమూనూ! అప్పుడు కావ్యకళాశిల్పఖండాలను వెలుపలినుండి చూడటానికి వీలవుతుంది. కావ్యకళా రూపా లకు వెలుపల ఏమున్నది? సామాజిక చైతన్యమున్నది. వెలుపల నుండి చూడటమంటే ఈ చైతన్యం నుండి చూడటం. సామాజిక చైతన్యం ఒక్క కావ్యకళారూపాలనే ఉత్పత్తి చేస్తున్నదా? లేదే. ఆర్థిక రాజకీయాలనూ, మత తాత్వికతలనూ, చరిత్రనూ, విజ్ఞాన శాస్త్రాలనూ కూడా ఆ చైత న్యమే సముత్పాదిస్తున్నది. సామాజిక చైతన్యమన్నదాయారూపాల ద్వారా మాత్రమే గ్రహించ టానికి వీలుగా వుంటుంది. మరో రకంగా వుండదు. అందువల్ల కావ్య శిల్ప కళారూపాల విమర్శ నకు తదితర సామాజిక చైతన్య రూపాల సంబంధ విజ్ఞానం అనివార్యమైన అవసరమే. అలాగని ఆయా ఇతర విషయాలను తెచ్చి కావ్యకళా విషయాలను కప్పి వేయకూడదు. ఆ అవసరాన్ని గుర్తించి అనుగుణంగా ప్రవర్తించే అచ్చమైన స్వాతంత్య్రాన్ని విమర్శకుడు తనంతట తాను సంపాదించుకోవాలి.అది ఒకరిస్తే మరొకరు తీసుకోవటానికి వీలైంది కాదు. అలా వ్యక్తులు స్వతం త్రంగా స్వాతంత్య్రాన్ని సంపాదించుకోవటానికి అవకాశమిచ్చే విజ్ఞానం చారిత్రక భౌతిక దర్శనం.
సామాజిక చైతన్య రూపాలు ఒక దానిమీద మరొక దాని ప్రభావాన్ని ఎలా ప్రసరింపచేసు కుంటాయో, ఆ చైతన్య రూపాల మొత్తం మీద సాంఘిక వాస్తవ జీవన అస్తిత్వప్రభావం ఎలా పడుతున్నదో, ఆ ఉపరితలం మీద ఈ పునాది నిర్మాణ ప్రభావం పడ్డట్లే, ఉపరితల చైతన్య ప్రభా వం పునాది మీద కూడా ఎలా పడి మార్పుకు కారణమౌతున్నదో మనకు స్పష్టంగా గతితార్కిక చారిత్రక భౌతికవాద వివేకం విశదపరుస్తుంది. అందువల్ల దాని సిద్ధాంత బలం మీదనే మనం చైతన్య కళారూపాలన్నింటినీ సాంఘిక అస్తిత్వ సంబంధంతో విచారించాలి. అది నిజమే అయినా అన్ని చేయలేం గనుక చేతనైన దొక్కటే చేస్తే చాలు కవితా కళాతత్వం గురించి అలా శాస్త్రీయమైన విచారణ చేద్దాం. ఎందుకంటే అది ఎంతో ప్రాచీనమైన గొప్ప చరిత్ర కలిగింది. అదెందుకో చచ్చుబడ్డ దానివలె ఈ కాలంలో చాలా వెనుక బడిపోతున్నది. అది అనేక రకాల మార్పులకు లోనవుతూ వున్నది. ఈ మార్పులన్నీ కవిత్వ కళయొక్క ప్రాచీన చరిత్ర గౌరవ మర్యా దలకు వ్యతిరేకంగా పోతున్నట్లు, అనేక సమస్యలను సృష్టిస్తున్నట్లు, అభివృద్ధి లక్షణానికి, అభివృద్ధి లక్షణం కాని దానికి భేదమే లేకుండా పోతున్నట్లూ, కవిత్వ కళాకారుల్లోనూ, విమర్శ కుల్లోనూ విద్వాంసుల్లోనూ కనిపించే అలజడి తొలగటానికి కావలసిన అవగాహన నిమిత్తం కవితా కళాతత్వం గురించి చారిత్రక భౌతిక దృక్పదంతో కొంత విచారణ చేద్దాం.
కవిత్వం-సమాజం
కవిత్వమంతా భాషామయం. భాష సమూహం నుంచి సంఘం ద్వారా ఉనికిలోకివచ్చింది. కవిత్వానికి భాష, భాషకు సమాజం మూలాధారాలు. అంటే కవిత్వానికి సమాజం మూలాధార మౌతోంది. కాబట్టి కవిత్వమర్ధం కావాలంటే దాని పుట్టుకకు మూలమైన సమాజం అర్ధంకావాలి. అసలా రెండూ రెండన్న చూపుతో చూడదగ్గవి కావు. కానీ కావ్యవిమర్శనమన్నప్పుడు సాధార ణంగా మూలాధారతత్త్వ విచారంతో దానికి సంబంధం లేదనుకోవడమే మనకలవాటు. కావ్యం అంటే కావ్యమే తప్ప మరేమీకాదు. దానికి సమాజంతో పనిలేదు. ఆఆలోచనే అనవసరం. అనవసరమేకాదు-అసందర్భం కూడాను అని మనలో కొందరు భావించేవాళ్ళున్నారు. వాళ్ళు కేవలం కావ్యరసాన్ని మాత్రమే ప్రశంసించదల్చినవాళ్ళు. అంత వరకు బాగానే వుంది. కానీ వాళ్ళు కావ్యార్ధవివేచన రూపంతో విమర్శ మొదలు పెట్టినప్పుడు తమతలంపును మరచి, కావ్య కళాభూములకు చెందని చారిత్రక విషయాల్ని, మనస్తత్వశాస్త్ర విషయాల్ని, కవి జీవించినప్పటి బ్రదుకు తెరువులు విషయాల్ని,మొదలైన అనేక విషయాల్ని స్పృశిస్తూ, మధ్య మధ్య ఏమేమో విచారిస్తారు.ఇది మన నిత్యానుభవం లోని విషయమే.వాళ్లు తాము స్పృశించినవాటి ఉచితాను చితాలను సమన్వయంచేసి సమర్ధించుకొనిపోవడం అవసరం అని కూడా అనుకోరు. అలాంటి వట్టి కావ్యరసవాదులు విమర్శకులే కారు గనుక వాళ్లను మనమంతగా నిలదీయనక్కర్లేదు కేవలం కావ్యరసవాదులు అనలు కావ్యవిమర్శకులు కారు, కావ్యరసాస్వాదనం లో మాత్రమే మునిగేచిత్తం వాళ్లది. వాళ్లు కవులు కావచ్చును. ఇంకాపోతే సహృదయులూ కావచ్చును. కావ్యనిర్మాణదశా, కావ్యరసాస్వాదన దశా అనే రెండింటినీ దాటాక, ఆ మీది దశ విసుర్శనారంగం. అందులోకి ప్రవేశించిన కవి కవికాడు. సహృదయుడు సహృదయుడు కాడు. అతడు విమర్శకుడు మాత్రమే అవుతాడు.
కళాఖండంలోపల వుండడం విమర్శకు పనికిరాదు. లోపల నుండి బైటకు రావాలి. అనుభవానికి లోపల, విచారణానికి బైటా, సంఘచైతన్యం యొక్క ఉత్పాదక శక్తి కళాఖండాల్ని ఉత్పాదిస్తున్నది. కవిత్వం అట్లా ఉద్భవించింది. కవిత్వానికి బైటనిలబడ్డం అంటే సంఘచైతన్యంలోకి రావడం(1) కళాఖండం యొక్క వెలుపల ఎప్పుడూ సంఘచైతన్యం లోపలనే వుంటుంది. ఇహ ఇప్పుడు విమర్శ అన్నది వట్టి రసాస్వాదనతో ఎలా భిన్నమైందో మనకు తెలిసివుండాలి. కవిత్వంలాగానే విమర్శకూడా సంఘ చైతన్యంలో నుండి పుట్టింది. కవిత్వం- విమర్శ-సమాజం-ఇదొక త్రిపుటి. సమాజం నానావిధాలు, దాని ఉత్పాదక శక్తి నానావిధాలు, అందులోని ఉత్పత్తులున్ను నానావిధాలు. అంటే ప్రపంచం నానావిధాలు. ఈ విధంగా సమాజం తో కవిత్వం ముడిపడి ఉంది. ఈ రెంటినీ సమన్వయించుకొని చేసే అధ్యయనమే అధ్యయనం. కళల, కళా విమర్శనల మర్యాదలను ప్రకాశింపజేయడానికి సాంఘిక శాస్త్రాభ్యుదయ విజ్ఞానం అధికంగా దోహదం చేస్తుంది.
1.
మానవజాతి యొక్క అతి ప్రాచీనమైన రసానుభవ వ్యాపారాల్లో కవిత్వ రచన ఒకటి. ఆదిమ మానవ సమాజంలో కవిత్వానికి వేరే ఉనికి (పృధగస్తిత్వం) లేదు.ఆనాడు అదొక్కటే వుందనడం ఇంకా ఎక్కువ సమంజసం. ఆనాడు మత చారిత్రక ధర్మవిషయాలన్నింటికీ అదే వాహిక. అది ఆనాడు లిపి రూపాన్ని పొందలేదు. ఒక ఛందస్సు, ఒక లయ కల్గివుంటూ సమాజ జిహ్వాంచలాలపై ఉండేది అది. మన భారతీయ వేద వాఙ్మయమంతా చరిత్రకందని రోజులనాటి మన పూర్వ సమాజం సముత్పాదించిన కవితావస్తు సంభారమే.అది ఛందోలయలతో కూడి వుండడం మూలాన కవిత్వమే అవుతోంది. ఇట్లాగే గ్రీకు, స్కాండినేవియన్, ఆంగ్లో సాగ్జన్, రోమన్, చైనా, జపాన్, ఈజిప్టు మొదలైన జాతులు సంరక్షించుకొన్న వారి ప్రాచీన వాఙ్మయాన్ని చూస్తే అది మన వేద వాఙ్మయంలాగానే ఛందోబద్ధం,లయాన్వితం అయి, బహుళార్ధ విషయవాహకంగా వుండడం గమనించవచ్చును. అట్లా చందోబద్ధం, లయాన్వితమూ అయిన దానిని మనం కవిత్వం అంటున్నాం. ఆనాటి వాళ్లు దాన్ని ఏమనుకొన్నారో మనకు తెలియదు. అది. నిత్యవ్యవహరంలో ఉపయోగించే భాషకంటే, ఉదాత్త గంభీరమైనభాష అక్కడ వుండటం చేతనే దాన్ని మనం కవిత్వం అంటున్నాము(2). అయితే ఆ భాష(ఉక్తి )అట్లా ఉదాత్త గంభీరంగా ఎట్లా తయారైంది? ఛందోబద్ధత వల్ల అట్లా తయారైందా? అవును. ఛందస్సు చేత, దానితో వచ్చిన లయతాళగతిచేత, యమకాది శబ్దాలంకారాలకు తావివ్వడం చేత, పాదమాత్రల నియమంచేత, యతిప్రాసల లాంటి ప్రత్యేకమైన లక్షణాలననుసరించడం చేత అందులోని భాష ఉదాత్త గంభీరంగా రూపొందింది. అందువల్లే ఆ భాష నిత్యవ్యవహారం నుండి భిన్నమయింది. భిన్న మయ్యింది కనుకే నిత్యవ్యవహారంలోనిదానికంటే దానికి సహృదయహృదయాకర్షక శక్తి ఇబ్బడిముబ్బడిగావుంది.
మొట్టమొదట ఛందోలంకారాలకూ, కవిత్వానికీ ఎలాంటి విడదీయరాని సంబంధం వుండిందో ఇప్పుడిక ఆలోచించాలి. ఛందోబద్ధంగా వుండడమే అది కవిత్వంగా గుర్తింపబడ్డానికి హేతువు.ప్రపంచంలోని ప్రాచీన వాఙ్మయాలన్నీ కవితామయాలే. అంటేఛందోమయాలన్న మాట.మన వాఙ్మయం సంగతి మనకు తెలుసు. ఈజిప్టులో ప్రాచీన ఖగోళశాస్త్ర విజ్ఞానం ఛందోబద్ధమయివుంది. ప్రపంచంలోని మతాలన్నీ తమతమ అవసరాలకు లయతాళగతివున్న భాషనే వాడుకొన్నవి. అన్ని మతాలూ భక్తిభావ ప్రచార ప్రబోధాల్ని లయాన్విత భాష ద్వారానే చేసినవి. ఉదాత్త గంభీరమైన ఆ భాష ప్రాచీన ప్రపంచ జాతుల సంస్కృతీ సంప్రదాయాల్ని నిలబెట్టేభారం వహించింది. ఛందస్సువల్లే అది ఆ పని చేయగల్గింది. అది నిత్యవ్యవహారంలో అందని అందాలున్న భాష. అలాంటి భాషామయత్వం వల్ల అది కవిత్వం. లయతాళగతి సాధించడంవల్ల కదా భాషను మనముదాత్తగంభీరం చేస్తున్నది. సంగీతనృత్యాలకు లయతాళ గతులు సంబంధించినవి. మరి ఇంతవరకేమో అవి కవిత్వభాషకు సంబంధించి వున్నట్లు మాట్లాడుతున్నాము. భాషను విడిచిపెట్టిన సంగీత నృత్యాలు లేవు. అవన్నీ కవిత్వం లాగానే భాషామయాలు.
కవిత్వ సంగీత నృత్యాలకు లయతాళగతులు ప్రాణాలు. ఇవన్నీభాషామయాలు, భాషను దాత్త గంభీరంగా చేయడం-ఆ ఉదాత్తత ఉట్టి పడేటట్లుగా చదవడం-వాటిని ప్రత్యక్షంగా కల్పిం చడం అనే ఈ వరుసలో కవిత్వం-సంగీతం- అనే మూడున్నూ ఆదిమ మానవ సమాజంలో ఏక రూపంగా కలిసే సాగినట్లు కనిపిస్తున్నవి. అసలవి కలిసి ఏకరూపంలోనే పుట్టినవి. ఆదిమ మానవ సమాజంలో ఉచ్చై స్వరంతో గొంతెత్తడం, చిందులు మధ్యమధ్య ఈలలు వేసి పొలికేకలు పెట్టడం, కర్రసాము, కత్తిసాములు ప్రదర్శనలలో చప్పుళ్లు చేయడం-ఇవన్నీ వారికవితా సంగీత నృత్యప్రదర్శనాలే. మానవ సమాజ ప్రాధమిక దశలో సంగీత నృత్యాలతో సంబంధించే కవిత్వ భాష వుంది. ఆ కాలంలో ముఖ్యంగా కవిత్వమూ, సంగీతమూ రెండుగా లేవు. వీటి ఏకరూపత్వం గ్రీకు కావ్య ప్రక్రియల్లో చూడవచ్చు. ప్రాచీన గ్రీకు కవిత్వం సంగీతంతో ముడిపడివుంది. ఆనాడు వాద్యసంగీతం లేనేలేదు.అంతా శాబ్దికమే. సంగీతం కోసమని చెప్పి కవిత్వం కూర్చిన కాలం అది.
దీనినంతా బట్టి మనం గ్రహించాల్సిందిది. ఆదిమ సమాజంలోని ఉదాత్త గంభీరమైన ఒక రకం భాష నుండి క్రమంగా అభ్యుదయ పరిణామాల్ని చెంది చెంది నాగరకత వెలసిన సమాజంలో లిఖిత వాఙ్మయం వెలుగులోకి వచ్చింది. ఆయా జాతిజనులు నాగరికులయి, కావ్యతత్వజ్ఞత్వాన్ని పెంచుకొని క్రమంగా ఆ ఉదాత్త గంభీరముద్ర వున్న భాషలోని విశేషాల్ని తెలిసికొని, తర్వాత దానిని దేనికి బడితే దానికి వాడకుండా ప్రత్యేక శ్రద్ధతో కాపాడుకుంటూ దాన్ని ఒక్క కవిత్వానికే ఉపయోగిస్తారు. ఆయా యుగాల్లో ఆ భాష సామాన్య జనుల నిత్యవ్యవహార భాషకి అతీతంగా వుంటుంది. ఆదిమ మానవ సమాజంలో బహుళార్థ సాధకంగా ఉపయోగపడిన గంభీరోదాత్తమయిన భాష క్రమంగా నాగరికత పెరిగిన యుగాలలో ఒక్క కవిత్వ భాషగా మాత్రమే నిలిచిపోతున్నది.అంటే నాగరికయుగంలో చందోబద్ధత్వం కవితాలక్షణం అని స్పష్టపడుతోంది. ఇలా నాగరికత ముందుకు సాగిపోతున్న కొద్దీ ఈ ఛందోబద్ధమైన గంభీరోదాత్త భాష పది పనులకి పనికిరాక ఒక్క కవిత్వానికే వాడబడుతూ సంకుచిత ప్రయోజనం ఉన్నది మాత్రమే అవుతుంది.
2.
ఆది పుట్టిన దేశకాలాల సాంఘికవ్యవస్థ నుండి కవిత్వాన్ని వేరు చేయడానికి వీలు లేదు. సాంఘికమైన నాగరికత దాని ఆర్ధిక ఉత్పత్తి శక్తిని బట్టి వుంటుంది. కాబట్టి కవిత్వం కూడా ఒక రకపు సాంఘిక ఆర్ధిక సంపదకావాలి. అది సమాజంపొత్తు.
ఆదిమ మానవ సమాజంలో మానవులు గుంపులు కట్టి జీవిస్తూ, వారివారి లింగవయో భేదాల కనుగుణమైన సాంఘిక క్రియాకలాపాలల్లో పాల్గొన్నారు. అప్పుడు ఒక్కొక్క వయస్సులో ఉండే స్త్రీ పురుషుల సాంఘికక్రియాకలాపాల్లో భేదం అంత పెద్దగా వుండేది కాదు. అందువల్ల వారివారి నిత్యవ్యవహారాల్లోని భాష, కవిత్వ రచనా పటువైనబుద్ధి, ఆనందించే అనుభవశక్తి ఈ మొదలైనవన్నీ అలాగే భేదం లేక వుండేవి. కాబట్టి ఆనాడు కవిత్వమెట్లా తన ఉత్పత్తి విషయంలో సమాజపరమో అనుభవం విషయంలో కూడా అట్లాగే సమాజపరం, గుణకర్మ విభాగం(క్రమవిభజన) ఏర్పడ్డాక వ్యక్తుల మధ్య ఆర్థికమైన హెచ్చుతగ్గులేర్పడ్డవి. ఆ హెచ్చు తగ్గుల్ని బట్టే వాళ్లవాళ్ల వ్యక్తిత్వాల్లో తారతమ్యం చోటు చేసుకొంది. ఆదిమ మానవ సమాజంలో ఇట్లాంటి తారతమ్యం లేదు. వాళ్ల వ్యక్తిత్వం వాళ్ల ఒడ్డు పాడుగులకు మాత్రమే సంబంధిం చిందానాడు. అది వర్గ రహిత సమాజం కావడం చేత సామాజికులందరూ కూడా సాంఘిక క్రియా కలాపాల్లోలాగానే ఆలోచనా క్రియాకలాపాల్లో కూడా సమానంగానే పాల్గొనే వాళ్లు. వాళ్లకి ఆలోచనల్లోనూ, అనుభూతుల్లోనూ కర్మల్లోలాగే సామ్యం ఎక్కువ. అలాంటి సంఘంలో వాళ్ళు – పదికాలాలపాటు నిలబెట్టుకోదల్చిన సామూహికమైన విజ్ఞానాన్నీ, అనుభూతుల్నీ గంభీరో దాత్తమైన భాషలోనే వ్యక్తీకరించారు. ఆ విధంగా మొదట కవిత్వం నాగరికత వల్ల వర్గ భేదానికి గురికాని సంఘ సామూహికశక్తి గర్భాన్నుండి సముత్పాదితమయింది. గంభీరోదాత్త భాషలో అయింది. అలాంటి భాష యుగాల మీద సాగి క్రమంగా పల్చబడి చరిత్రగా, వేదాంత శాస్త్రంగా ధర్మశాస్త్రంగా, భౌతిక శాస్త్రంగా, ఖగోళ శాస్త్రంగా అనేక విధాలుగా ఇలా విడిపోతుంది. ఇలా విడిపోయిన ఆయా విజ్ఞానశాఖలు తమ అవసరాల్ని బట్టి కొత్త పదజాలాన్ని సృష్టించుకొంటాయి. అలా సృష్టించుకొన్న పద సముదాయంతో ఉండే భాష నిత్య వ్యవహార భాషలాగా వుండదు.
ఇంతవరకూ గంభీరోదాత్తమైన భాష అని మనం అనుకొంటున్నది ఛందోగతి విశేషంతో వుంటుంది. సహజంగానే నిత్య వ్యవహారంలోని భాషకు లయ తాళ గతి ప్రత్యేకంగా ఉండదు. కవిత్వంలో అది ప్రత్యేకంగా ఆపాదితమౌతుంది. అలా ఎందుకు ఆపాదితమవ్వాలి? ఛందోలంకారాల వల్ల భాష వికృతమవుతుంది. సహజ సౌందర్యం పోతుంది. ప్రతిబంధకాలు లేని వ్యవహారభాషకంటే కృత్రిమమయిన కవిత్వ భాష తేజోహీనంగా కన్పిస్తుంది. అయినప్పుడు భాషను ఛందోమయం ఎందుకు చేయాలి? ఇట్లా ఆలోచించడంలోనూ తప్పు లేదు. దీనికోరకమైన సమాధానం వుంది. ఒక విషయాన్ని సులభంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఛందస్సు సమకూర్చే లయ సాయపడ్తుంది. ప్రాచీన భారతీయ విజ్ఞానమంతా కూడా లిఖిత రూపాన్ని పొందకుండానే విద్వాంసులు జిహ్వాంచలాలమీద కొన్ని వేల సంవత్సరాలు. పొల్లుపోకుండా నిలబడి రావడానికి ఆ విజ్ఞానానికి వాహకమైన భాషఛందోమయమయ్యి లయ తాళగతులు కలది కావడమే హేతువు. అంతేకాకుండా శ్రోతల చిత్తాన్ని ఏకాగ్రంగా వుంచడానికిన్నీ భాషలోని లయ తాళ గతి లక్షణం ఎక్కువగా దోహదం చేస్తుందనడం కూడా సత్యమే. అన్నింటి కంటే ముఖ్యమైన మాట ప్రాచీన కవిత్వాలు చావకుండా ఇంతకాలం బతికి బట్టగట్టి మన దాకా వచ్చినవంటే అందుకు ప్రధాన కారణం ఆ గంభీరోదాత్తమైన లయ తాళ గతి కల భాష దానికి వాహకం కావడమే.
మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇంకోటి వుంది. ప్రతి యుగంలోనూ సాధారణంగా పరిపూర్ణపక్వబుద్ధులు కాని వారే గొప్ప కవిత్వాన్ని సృష్టిస్తున్నారు. వివిధ సాహిత్య ప్రక్రియల్లో పనిచేస్తున్నారు. కవిత్వం మానవుని సహజాతమైన వైయక్తికత్వాన్ని విలక్షణంగా ప్రకటిస్తుంది. దీనికి నవల భిన్నమైంది.మానవుని సాంఘిక వ్యక్తిగా, అంటే సంఘం ఎట్లా గుర్తిస్తుందో అట్లా ప్రకటిస్తుంది. వర్గ సమాజంలో ఆర్థిక తారతమ్యాల మూలంగా వ్యక్తుల అంతస్తులు గుర్తింపబడ్డాయి. అట్లాంటి సంఘంలో కవిత్వం వెనుకబడి నవల ముందుకు వస్తుంది. అందువల్లే ఈ కాలంలో కవిత్వాభిమానం దిగనాసిల్లిపోతోంది. నవలా రచన పుంజుకుంటోంది. కవిత్వం సహజ ప్రకృతిక సమాజశక్తి తేజోగర్భం నుండి వెలువడింది. నసి చెడిన ఆధునిక సంస్కృతీ సంప్రదాయాల సమాజపు సంతానం నవల.(3)
ఆదిమ మానవ సమాజంలోని గంభీరోదాత్తమైన కవిత్వభాష కాలక్రమాన వికార పరి ణామాలకు లోనయి చివర చివరకు వట్టి వచనరీతి భాషగా అయి చరిత్ర, తత్వశాస్త్రం, కథ, నాటకం, నవల ఈ విధంగా సాహిత్యం తయారైంది. ఆదిమ మానవ సమాజంలో లయ తాళ గతి కమైన గంభీరోదాత్త భాష ఒక్కటే అన్నింటికీ వాహకమైనట్లు శ్రమ పరిణతి చెందిన నాగరిక సమాజం పండిన దశలో అన్నింటికి వక్రగతిలేని అచ్చమైన వ్యావహారికాగంధంతో వుండే వచనం వాహకమౌతుంది. ఇది శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకొన్నది. ఆవేశపుటార్బాటపు పొంగు లు లేనిది. ఆదిమ మానవ సమాజంలో భావోద్వృత్తి కవిత్వహేతువు. ఆధునిక సమాజంలో వాస్తవికత తీరుతెన్నుల్ని అవగాహన చేసుకోవడం కవిత్వ హేతువు. దీనికి రాగతాళ లయాన్విత మైన భాష అక్కరలేదు. ఆవేశాట్టహాసపుటూపుతో సంఘాన్ని ఊపడానికి, పూనకం తెప్పించడానికి అలాంటి భాష కావాలి. విషయాన్ని అవగాహన చేయించాలంటే శ్రోతల్ని ప్రబోధించాలి. కార్యోన్ముఖుల్ని చేసి ప్రోత్సహించాలి. లాభనష్టాల్ని బేరీజు వేసిచెప్పాలి. అందువల్ల ఆధునిక సమాజంలో కవిత్వ భాష ఆదిమ సమాజం కన్నా విభిన్నమైంది. అది చందస్సుతో పద్యం. ఇది ముక్తఛందమైన వచనం.
దైనందిన సామాజిక వ్యవహారంలో శబ్దాలకుండే భావ తీవ్రతాభివ్యక్తి లక్షణం మానవాను భవంలో ఉంది. అవసరం వచ్చిందన్నపుడు అనుభవాన్ని బట్టి మానవుడు అలాంటి అభివ్యక్తి శక్తి ఉన్న శబ్దాలను ఎన్నిక చేసి తాళలయానుబద్దంగా వాటినొక క్రమంలో కూర్చి, చదవగల్గిన వాళ్ళు దాన్ని చదవడం చేత శ్రోతలు ఆ భావ తీవ్రతను అనుభవించేటట్లు చేస్తున్నాడు. దానికే సంగీతమూ నృత్యమూ జోడించినప్పుడు దాని దీప్తి ఇంకా అధికమౌతుంది. ఈ విధంగా మొట్టమొదట కవిత్వాన్ని చందోబద్ధమైన లయ తాళ గతులతో కూడుకున్న భాష నిలబెట్టింది. సామూహిక భావావేశాన్ని కవితాకళ సక్రమమార్గంలో నడిపించింది. పండగల్నిపబ్బాల్నీ కేంద్రంగా చేసింది. కాకుంటే అవే ఆదిమ సమాజంలో కవిత్వాన్ని తయారు చేసినవని చెప్పినా చెప్పవచ్చును.
ఆదిమ మానవ సమాజ కవిత్వం ముఖ్యంగా పాట4. అది దాని రాగతాళ లయలతో సమూహం మీద సమాజాన్ని భావోద్వృత్తి చైతన్యం కలదాన్నిగా చేసేది. ఆ భాషలోని రహస్యమే అది. ఆ విధంగా అది తప్పెట్లతో తాళాల్తో పండుగలు పబ్బాలు నడుమ నడుమ తెచ్చే సమధికోత్సాహంతో పాటలుగా పదాలుగా సంగీతంగా నృత్యంగా వందలు వేలు సంవత్సరాలు సాగింది.
ఆదిమ సమాజంలో సమూహం మీద భావోద్వృత్తి చైతన్యం ఎట్లా కల్గింది?ఎట్లా అంటే పెద్దపులి కన్పించింది. శత్రువు వచ్చాడు. గాలి, గాలివాన ఈడ్చి కొట్టినవి. భూమి కంపించింది. ఈ అన్నింటికీ ఆయా గుంపులు కట్టిన జనసమూహం గుంపులు గుంపులుగానే భయపడ్డారు. ఆ భయం ఆ గుంపుకంతా సమానమే. నాగరికత పెరిగిన సామాజిక జీవితంలో అలాంటి భయహేతువులు లేనప్పుడు దానిని కల్పించడానికి ఒక సాధనముండాలి. ఆదిమ మానవుని సమాజపు నిత్యజీవిత సత్యం నుంచి కవిత్వం పుట్టింది. నాగరికత పెరుగుతూ సమాజాన్ని సత్యం నుండి మిధ్యాభూములు పట్టిస్తుంది. సమాజాన్ని బట్టి దాని ఉత్పాదనశక్తి. దానినిబట్టి కవిత్వం, మొత్తం ఆ విధంగానే వుంటుంది.
ఆదిమ మానవ సమాజం సామూహిక భావోద్వృత్తులు గంభీరమైన భాషలో వ్యక్తమై కవిత్వంగా మార్పు చెందినవి. దానివల్ల ఆనాడు వాళ్ళకు వాళ్ళ పనిపాటలు ప్రీతి పాత్రా లయ్యాయి. శ్రమ అనిపించక వారి మనస్సులు ఆనందించాయి. ఆ విధంగా కవిత్వం ఆనాడు ఆ సమాజపు కార్మికశక్తిని ఇనుమడింపచేసింది. అది సామూహిక ప్రయోజనం కనుక ఆ కవిత్వం సామూహిక భావోద్వృత్తుల్నే తనకు విషయాలుగా చేసికొంది. కామక్రోధాది భావావేశ ప్రవృత్తుల్ని సమాజానికి శ్రేయోదాయకాలుగా చేసి కవిత్వం చూపింది. దాని ప్రయోజనం అది. పరంపరగా అట్లా కవిత్వం సమాజం యొక్క ఆర్థిక స్థోమతను పెంచే సాధనమౌతుంది.
3.
శ్రమ విభజన ఎక్కువౌతున్నకొద్దీ కవిత్వం వాస్తవ జీవితం నుంచి దూరమౌతున్నది. వాస్తవజీవితం పట్టి పని పాటలతో నిండి ఉంటుంది. అప్పుడు కవిత్వానికి పనిపాటలతో సంబం ధం వుండదు. అది జీవిత విశ్రాంతి కాలంతో సంబంధం పెట్టుకొంటుంది. అలాంటి సమాజంలో కవి సామాజికుడు కాదు. ఏకాకి. ఆ ఒంటరితనంలో అతడు రాసే కవిత్వం భావ గీతాల వరకే మితిమీరిన శ్రమవిభజన పద్ధతి సమాజానికి సోమరితనాన్ని అలవాటు చేస్తుంది. సోమరిపోతులు బ్రతుకుతున్న సమాజంలో ఉత్పత్తి అవుతున్న కవిత్వం శ్రమజీవనానికి దూరమైంది. అది అట్లా కావడంవల్ల అటు కవితా కళకూ ఇటు శ్రమజీవనానికి రెండింటికీ నష్టమే కాని ఇక్కడో చిత్రం వుంది. అట్లా కవిత్వం సాంఘిక ప్రయోజన శూన్యమై నష్టపోయే కాలంలో దాని రచనా శిల్పం మాత్రం చిత్రాద్భుతా పాదకమయ్యి అపూర్వశోభతో మనోజ్ఞమవుతుంది.
సమూహంమీద అనుభవించిన భావోద్వృత్తులు ఒంటరితనంలో మానవుని విడిచిపెట్టక అంటి పెట్టుకునే ఉంటాయి. అందువల్ల ఏకాంతంలో భావగీతాలాలపిస్తున్న కవి ఎప్పుడో తాననుభవించిన సమసమాజం యొక్క అనుభూతుల్నే నెమరువేస్తున్నాడనుకోవాలి. ఆవిధంగా కవి తన సోదర జనసమాజంనుంచి కళా ప్రపంచం యొక్క ఏకాంతభూముల్ని ప్రవేశించటం, ఇంతకుముందుకంటే తన జాతి జనులతో ఇంకా ఎక్కువ సన్నిహితంగా ఉండాలని కొరే చేస్తాడు. రతి విషయం, ఋతు శోభ, సూర్యచంద్రోదయాస్తమయాదులు, కోకిల పాటలు, మందమారుతం, కొలనులు, పద్మాలు, తుమ్మెదలు మొదలైన వాటికన్నింటికీ సంబంధించినట్టి సమసమాజం యొక్క అనుభూతులు,తరతరాలుగా అనుభవింపబడుతూ ఆ చారిత్రక భావోద్వృత్తుల యొక్క ఇప్పటి మన ఛాయానుభూతుల్ని ఇంకా ప్రేరేపిస్తున్నవి.
శ్రమ విభజన ఫలితంగా సమాజం వర్గాలుగా, వర్ణాలుగా విడిపోయింది. పాలకులు- పాలి తులు అనే రెండు వర్గాలు మొట్టమొదట ఏర్పడ్డవి. వీటితోపాటు కీలకస్థానాన్ని ఆక్రమిస్తూ పురోహిత వర్గం లేస్తుంది. ఈ సమాజంలో కవిత్వం రాజుల్నీ, దేవతల్ని, దైవాంశ సంభూతుల్నీ, అవతార పురుషుల్ని ఆశ్రయిస్తుంది. ఇదే పురాణేతిహాసాల రచన జరిగే కాలం. ఆ ప్రభావంతో కొన్ని వందల సంవత్సరాలు సాగుతవి, అనేక విధాలైన మార్పులు వస్తవి. అలా అది భావగీతాలవరకు వస్తుంది. ఆ భావగీతం ఆదిమ మానవసమాజంలోని కవిత్వానికి భిన్నమైంది. అదేమో సాంఘికుల యొక్క సాధారణభావాభివ్యక్తి, ఇదేమో వైయక్తిక భావాభివ్యక్తి.
సంఘంలోని సామూహిక భావోద్వృత్తే ప్రపంచం. కళా ప్రపంచంలో భావోద్వృత్తి శబ్దచిత్రాలతో వుంటుంది. ఆ శబ్ద చిత్రాలు నిత్యజీవిత అనుభవంచేత కల్గుతవి. ఆ అనుభవాలు సర్వసాధారణాలు. అనేక రకాల అనుభవాలు కలవడం అనేది సంఘజీవిత విధానం విస్తరిం చడాన్ని బట్టే జరుగుతుంది. సంఘజీవన అభ్యున్నతిని అనుసరిస్తూ సర్వసాధారణంగా ఉన్న భావోద్వృత్తులు మారుతవి. మానవుడు తాను ప్రకృతి మార్పులతో సర్దుకొని పోవడానికి సాంఘి కంగా తనని తాన మార్చుకొంటాడు. పరిసర ప్రకృతి వాతావరణంతో ఇమిడి బ్రతకడానికి తాను కొట్టుమిట్టాడుతున్నప్పుడు మానవుని కవితావేశం అతని బ్రతుకుతెరువుని అంటిపెట్టుకొనే వుంటుంది.అలా ఉండే కాలంలో కవిత మానవుని ఇహలోక కవాటాన్ని బద్దలుకొట్టి ప్రవేశిస్తున్నది. ఆ లోకం దిన దిన గండమైన ఈ లోకంకంటే శ్రేష్టమైంది. ఇంతకంటే కూడా ఇంకా సత్యమైంది. నిజానికి దాని సంగతి మనకు తెలియదు. తెలిసికోవడానికి ఈ మాయా మోహనమైన కవిత్వమే ద్వారం. దీనిద్వారా ప్రవేశిస్తేనే ఆ సత్యం దర్శనీయమౌతుంది. ఆటపాటల్లో అందులోని శ్రమానుభవాన్ని కప్పిపుచ్చకపోతే అసలా కోత పనులకు, నాట్ల పనులకూ జనం మొగ్గేవారేకాక పోపచ్చును. ఆ పాటలవల్ల మనస్సులు తేలికపడి పనులు కూడా సులభ సాధ్యాలయినవి. అంటే కవిత్వం. ముందు ఒక సత్యాన్ని ప్రదర్శించడం ద్వారా. దాని వెనుకు మరో సత్యాన్ని ప్రాదుర్భవింపజేస్తుందన్నమాట. నిజానికి అది వరుసక్రమంలో రెండవదయినా పరమార్థం దృష్ట్యా అది అద్వితీయమైంది. దుర్గమమైంది. సంఘ సామూహిక భావోద్వృత్తి లక్షణాన్ని ప్రకృతి వాతావరణంతో సంబంధించి కిందిమీద బడే ఎప్పుడూ కవిత్వం వర్ణిస్తుంది. అత్యంత సూక్ష్మంగా వ్యక్తీకరిస్తుంది. మనిషి గుడ్డిగా ప్రవర్తించే విషయాలు కవిత్వానికి విషయాలు కావు. తెలిసి ప్రవర్తించే అర్ధ సంపాదక విషయాలే కవితా విషయాలు. ఇది ఇదే అని చెప్పడానికి వీలుకాని అవ్యక్త మధురవిషయాలు కవితా విషయాలు కావు. తెలిసీ తెలీని ఏదో మగతలో పాఠకుణ్ని వదలడం కవిత్వలక్షణంకాదు. దాని ప్రథమ లక్షణం స్పష్ట ప్రతిపత్తి. అది సంఘసామూహిక భావోద్వృత్తి చైతన్యానికి ప్రతిబింబం. సంఘం బింబము. చేతనలో ప్రతిఫలించిన ప్రతిబింబమే కవిత్వం. బింబం సత్యమైంది. ప్రతిబింబము మాయామోహము. సంఘం బింబము. సంఘశక్తి పేరు చైతన్యం. చైతన్యంలో సంఘం యొక్క సామూహిక భావ ప్రతిబింబమే కవిత్వం.
4.
మతాలు పుట్టుకొచ్చాయి. భౌతిక ప్రపంచం కంటే మత ప్రపంచం భిన్నమయింది. సంఘం యొక్క సామూహికమైన కవితా రసాస్వాదనమోహం క్రమంగా వ్యక్తి నిష్టమౌతుంది. సాలెగూడులాగా అల్లుకొని ఏర్పడే సంఘగర్భంలోనే ఆ మోహలక్షణ రహస్యం బీజరూపంలో వుంది. క్రమంగా అది ఇంకా మతాన్ని చుట్టుకొని విపరీతంగా విస్తారంగా పెరుగుతుంది. మానవుని స్వాత్మ/సామాజిక) చైతన్యమే కవిత్వం5 ఆ చైతన్యం కేవలం వ్యక్తి నిష్టమైంది కాదు. సర్వసాధారణమైన భావోద్వేగ ప్రపంచంలో మిగిలిన అందరితోబాటు తానున్నూ ఒక భాగస్వామి కాగల్గె వాని అంతస్సత్వ చైతన్యం- అది సంఘంలోని సామూహికోద్రేకం, పిడుగుపాటు, గాలివాన మొదలైనవాటివల్ల కల్గుతున్నది. అందువల్ల అది భౌతికసత్యం, అయితే ఆదిమ మానవ సమాజంలో భావోద్రేకం, భౌతిక సత్యమేనా? లేక మాయలో కూడుకొన్న ఒక ఆదర్శమా? నిజానికి అది అక్కడ ఈ రెండున్నూ కాదు.అది ఒట్టి సాంఘిక సత్యం మాత్రమే. మానవ సహజాతాలైన కామక్రోధాది రజస్తమో గుణాత్మక భావాలకున్న సాంఘికమైన చెలామణికి ఆనాటి భావోద్రేకం నిదర్శనం. కావ్యకల్పనం సాంఘిక ప్రతిబింబ ము.
కవి సృష్టించే కాల్పనిక ప్రపంచంలోని అన్ని సాహిత్య ప్రక్రియలున్నూ పురాణ, ఇతిహాస, కావ్య, నాటకాలు మొత్తం మీద ఒక సాంఘిక సత్యాన్నే పరమార్ధం చేసి చెపుతవి. సాంఘిక సత్యం అంటే ఇంతకుముందు సూచించిన సహజాతాలకూ సంఘానికి ఉన్న సంబంధమేనని అర్ధం చేసుకోవాలి. అది ఇంకా కూడా వైయక్తికం కాకుండా సమసామాజికం కావాలి. సమసామాజికం కావడం కోసరమే ఆ సంబంధం లయాన్వితమైన ఉదాత్త గంభీరభాషలో అభివ్యక్తంకావటం. కాని అభివ్యక్తమైనంత మాత్రంలో అది కవిత్వంకాదు. పిల్లనగ్రోవి వెదురుబొంగుకు రంధ్రాలు చేశారు. రంధ్రాలే సంగీతంకాదు. గాలినూది వాయిస్తుంటే శ్రోతకు ఏది అనుభవానికి వస్తుంటుందో అదే సంగీతం. అట్లాగే ఎంతటి భావోద్రేకాలు ఎంతటి భాషలో ఎంత జాగ్రత్తగా పొదగబడినా(6) నిజం మాట్లాడ్తే – అప్పుడే అది కవిత్వం కాదు. దాన్ని ఉచ్ఛారణ దక్షుడైనవాడు చదివి చూడాలి. అప్పుడు దాన్లోని కావ్యసౌరభాలు గుబాళిస్తాయి. చదువుతూన్నప్పుడే కావ్యం జీవిస్తుంది. చదవడం అంటే పైకి చదవడమనే అర్థం.
సంఘాన్ని గూర్చీ, దాన్తో తనకున్న సంబంధాన్ని గూర్చి మానవుడికి వుండే వ్యాకులమైన విజ్ఞానమే ఆదిమ సమాజంలో కవిత్వం.
భావోద్వృత్తులు స్వాత్మగతాలు కావడం వల్ల అవి మానవుడికి తన అదుపులో వున్నట్లే ఆగుపడ్డాయి. అందువల్లే భావోద్వృత్తుల మూలతత్వం ద్వారా మానవుడు బాహ్య జగత్తు మీద అధికారం చేయగల్గుతున్నాడు. మానవుడు తన వ్యష్టి సంకల్ప బలంచేత భౌతిక సత్యం ఐన ప్రకృతిని నియమించగల్గుతున్నాడు. మంత్రతంత్ర క్రియాదులచేత, ప్రయోగాదులచేత తాను సంకల్పించినదానికి అనుగుణంగా భావోద్రిక్తతల్ని ప్రేరేపించి తన పని ఈడేరింది (ఫలించింది). అనుకొంటున్నాడు. అందువల్లే అతడికి- అంతర్ముఖత్వాన్ని పెంచుకొంటే భౌతిక సత్యాలైన ప్రకృతిని అదుపులోవుంచి నడిపించగల్గుతాను అని ఇంకా అనిపిస్తోంది. ఈ ఆలోచన సశాస్త్రీయమయి, ప్రవృత్తి కర్మకు మార్గదర్శకమైనదయినప్పుడు మానవుడు నిజంగా అంత పనిని చేసి తీరుతాడు.సంఘమంటే వ్యక్తిని చుట్టుకొని వున్న వాతావరణం. ఆ వాతావరణానికి సహవాసి జనసమూహం, సంఘం. సంఘం యొక్క తొలిరోజుల్లో మంత్రతంత్రాలు మతాలు కలగాపులగంగా వుంటాయి. ఆ కాలంలో సంఘాభివృద్ధి చాలా స్వల్పంగా వుంటుంది.
మంత్రతంత్రాలు బాహ్యజగత్తును కొన్ని నియమాలకు లోబర్చుకొని నిలపడానికి చూస్తాయి. బాహ్యజగత్తేమో ఎదురు తిరుగుతుంది. దానివల్ల మాంత్రికుడికి జగత్తు యొక్క తిరుగుబాటు లక్షణం, దృఢవైఖరీ, చక్కగా అర్థమౌతాయి. అలాంటి దృఢ వైఖరితో వున్న ప్రకృతిని ఎదుర్కోవడానికోసం ఇంకా శక్తిమంతాలయిన మంత్రతంత్రాలు కావాలి. దీనివల్ల మనకొక విషయం తెలుస్తోంది. మహామంత్రాల శక్తి వినియోగాన్ని అవసరం ఐనంత తట్టుకొని నిలబడగలిగే బలం బాహ్యప్రకృతిలో వుందని. ఇంకా దీన్నిబట్టి ప్రకృతిలో వుండే బలవద్వైఖరులను అంతకన్నా బలవంతాలయిన దేవతాశక్తులు అధిగమింపగలవని అంగీకరించడం జరుగుతోంది. ఆ దేవతాశక్తుల యొక్క ఏకరూపత్వమే విధి. ఎవ్వడూ విధిని తప్పించుకోలేడు. ఏదే నియమం. దాన్ని అతిక్రమించే నియమంలేదు. ఇంద్రజాలి కాలైన మంత్రతంత్ర విద్యలు క్రమంగా మారి అంతకన్నా బలవంతమైన ‘విధి’ సిద్ధాంతంగా మారింది. ఈ విధిముందు మంత్రతంత్రాలు పనిచేయవు.
బాహ్య జగత్తుకూ, తనకూ వుండే సంబంధం యొక్క జ్ఞానం మానవుడికి సరిగాలేదు. అందువల్ల మంత్రతంత్ర విద్య ఆ జ్ఞానానికి తగ్గంతగానే ఉంటుంది. తాను అనుక్షణమూ బాహ్యజగత్తుతో పోరాడ్తూనే వున్నాడు. ఈ పోరాటం వల్లే వాడికి దాని ప్రకృతితత్వం అర్ధంకావాలి. పరిసర వాతావరణానికి స్వాత్మకూ ఉన్న దగ్గరితనం బోధపడాలి. ఆదిమ మానవసమాజం నాగరక దశాభిముఖంగా చేసే ప్రయాణంలో మంత్రతంత్రాత్మకత్వం, దేవతాత్మకమైన మతాచార అభినివేశం అనేవి రెండు మజిలీలు. అప్పుడు కవిత్వం మతాన్ని విడిచి వేరేగాలేదు. కొంతకాలం అలా గడిచింది. ఆ కాలమంతా ఒకవిధంగా మానవజాతి శిశుత్వదశ అని అనవచ్చు.
5.
కవిత్వాన్ని, మతాన్ని మనం వేరేవేరేగా చూడొచ్చు. మతం అచ్చమైన మతంగా పెరుగుతున్నకొద్దీ అందులో కనబడని ఒక విస్పష్టమైన లక్షణం దేశకాలాల్తో నిమిత్తం లేకుండా కవిత్వంలో కన్పిస్తున్నది. కవిత్వం ఫలోత్పాదకమైంది. దేశకాలాల్లో పరిణమించేది. ఒకతరం కవిత్వం, తర్వాతి తరం వాళ్ళకు తృప్తినివ్వలేదు. ప్రతి కొత్త తరం కూడా తనకు వారసత్వంగా సంక్రమించిన ప్రాచీన కవిత్వాన్ని ఆస్వాదించడం అర్ధంచేసుకొని అభినందించడం తప్పక నేర్చుకోవాలి. ఆ మీదట తన నిత్యజీవితంలోని కష్టసుఖాలు, సమస్యలు, ఆశనిరాశలు, మంచిచెడ్డల్ని ప్రత్యేకంగా పరిశీలించి. కవిత్వం రాయటాన్ని గురించి నిలదీసి అడగవచ్చు. ప్రతితరము ఆవిధంగా అడుగుతోంది గనుకే ఎన్నో కొత్తపాటలు, ఎన్నో కొత్త కథలు, ఎన్నో పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు తయారవడం. ఇదంతా మానవజాతి సాహిత్య జీవితంలోని ప్రత్యేకత .
ఈ ప్రత్యేకత ఏం చెప్తోంది. సాహిత్యకళకు మార్పు సహజమని చెప్తోంది. సంఘం అనే వృక్షం చిటారుకొమ్మన పూచిన పువ్వే కావ్యకళ. సంఘం మారినట్లల్లా అది మారుతుంటుంది. సంఘం పెరిగినకొద్దీ అది పెరుగుతుంటుంది. సంఘం బలపడిన కొద్దీ అది బలపడ్తుంటుంది. మారిన కొద్ది, పెరిగిన కొద్దీ, బలపడినకొద్దీ అది సంఘం మొత్తానికి ఉపయోగపడే కళ కవిత్వం. కావ్యకళ ఇంతగా మార్పులకు లోనవడానికది మాయామహితం కావడమే కారణం. మాయా మహితత్వం పరిణామ లక్షణరూపం. ఈ మాయాలక్షణం యొక్క పరిజ్ఞానం కలిగిన తర్వాత కావ్యం ప్రపంచంతో సరితూగుతూ వుండాలని ఎవ్వడూ భావించడు. ఆ విషయంలో అంత పట్టుదల కూడా ఎవ్వడూ చూపించడు. ఇట్లా అనడం వల్ల కావ్య ప్రపంచానికీ భౌతిక ప్రపంచానికి ఎలాంటి సమైక్య లక్షణం కనబడదని అంటున్నట్లుగా అర్ధం చేసుకోగూడదు. కావ్య విషయాలు తు.చ. తప్పని సత్యాలుగా ఎప్పుడూ అంగీకరించము. అదీగాక కావ్య విషయంలోనే పోయి చోటు చేసుకొని కూర్చోవాలనే తొందర వాస్తవికతకు మాత్రం ఏముంది? అది లేదు కనుకే నిరాటం కమైన కావ్యధార ఉత్పత్తి అవుతోంది. అసలిది దేశకాలాలతో సంబంధంలేని కవితాతత్వం. ఒకవిధంగా మతలక్షణం కూడా ఇదే. సంఘం తొలిదశలో తాను పుట్టినప్పుడు- అప్పుడు కవిత్వంతో కలిసివుండేది కదా. తానింకా పురాణశాస్త్రాదికాన్ని మించి కూడా అప్పుడు లేదు. కాలం సాగిన మీదట, పురాణ శాస్త్ర యుగం ముగిసిన తర్వాత మతం అచ్చమైనదై ప్రవర్తిస్తుంది.
6.
శ్రమ విభజనవల్ల వర్గ సమాజం ఏర్పడింది. ఈ సమాజంలో పాలకవర్గం బలవంతమయి పాలితులయొక్క సామూహికశక్తి ఉత్పత్తి చేసిన వస్తు జాలాన్ని వాళ్ళ నోళ్ళు కొట్టి తమ ఇళ్ళల్లో నింపుకొంటుంది. కనీస పక్షపు దోపిడీ విధానాన్ని అనుసరించినా, అందులోని మంచి వస్తువులూ, ఎంతో అవసరమైన నిత్యావసర వస్తువులూ పాలకులు కాజేస్తారు. పాలితులేమో అట్లాగే పీడింపబడ్తూ వుంటారు. పాలక వర్గం మొత్తం పెత్తందారీ వర్గం. వాళ్ళంతా బుద్ధిజీవులు, బుద్ధిశక్తినుపయోగించి. వాళ్ళు పని చేస్తారు. వారికి సర్వ సుఖానుకూలమైన పరిస్థితులున్నవి. సుఖానుభవానికి అవసరమైన విరామం(విశ్రాంతి) వుంది. ఉత్పాద్య వస్తువుల్లో వాళ్ళ భీముని చాటా వాళ్ళకు ఉంది. ఇవన్నీ నెమ్మదిగా ఆ వర్గానికొక ఆలోచనా విధానం, ఒక సంస్కృతి సంప్రదాయం అభివృద్ధి కావడానికి దోహదం చేస్తవి. పాలితుల్లో అలాంటి అభివృద్ధి కనబడదు. కష్ట భూయిష్టమయిన వాళ్ళ నిత్యజీవిత విధానం అలాంటి అభివృద్ధి విషయంలో పూర్తిగా పెడ మొగం పెట్టి ప్రవర్తిస్తుంది.ఈ విధంగా క్రమ విభజన ఏర్పడిన కాలం కొంత దాటిన తర్వాత ఇక సంఘం ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు కావడం మరింత ఎక్కువౌతుంది. ఈ వర్గ విభేదం పీడించే పాలక వర్గాన్ని రోజు రోజుకీ వాస్తవిక ప్రపంచానికి దూరం చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు దూరమైన కొద్దీ ఏకాంతమైన ఆలోచనా ప్రవాహాల్లో పడిపోవడం ఎక్కువవుతుంది. వాటిని నిజానికి ఆలోచనలనడం మంచిది. వినోద కాలక్షేపాలవసరం అవుతాయి. సంస్కృతి సంప్రదాయాల సంపద వాళ్ళకు పెంపుగా కన్పిస్తుంది. ఇక పీడితులు. వాళ్ళు ఆలోచనలకు దూరం ఊహలకు దూరం. సంస్కృతీ సంప్రదాయాలు వారి దగ్గరకురావు. వాళ్ళది మితిమీరిన శ్రమ జీవనం. వాళ్ళు పరిస్థితుల ఇరకాటంలో బ్రతుకుతారు.
వర్గ సమాజంలో శ్రమ విభజన మొదట మంచి ఫలితాల్నే ఇస్తుంది. కాని క్రమంగా అది సమాజాన్ని ఎంతో దయనీయమైన స్థితికి దిగలాగుతుంది. ఆలోచనాత్మకమైన జ్ఞానబుద్ధి క్రియాశీలం కాదు. పరపీడన పరాయణమైన పాలక వర్గం వట్టి భోగలాలస అయి పరాన్న భోజన ప్రియమైనప్పుడు భౌతిక సత్యమైన జగత్తు నుండి వాళ్ళ ఆలోచనలు విడివడి శుష్క పాండిత్య ప్రదర్శనానికి వెన్నుబలంగా నిలబడతాయి. పీడిత ప్రజానీకం ఇంకా దిగజారి కేవలం బానిసలుగా మారినప్పుడు శ్రమ పూర్తిగా జ్ఞాన బుద్ధితో తెగతెంపులు చేసికొంది. అప్పుడు శ్రమ (కర్మ)గానుగెద్దులాగా సాగింది. ఈ స్థితి సంఘ జీవితంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. కళాశాస్త్ర విజ్ఞానాల్లో ప్రతిబింబిస్తుంది. ఆర్థిక వస్తూత్పత్తి దెబ్బతింటుంది. రాజ్యం ‘అరాచకమవుతుంది. ఈ విధమైన క్షీణదశ అస్వతంత్ర భారత దేశంలో ఉండేది. పతనకాలపు రోమను సామ్రాజ్యం లోనూ, ఈజిప్టు, చైనా దేశాల్లో అప్పుడు ఈ క్షీణ యుగమే ప్రవర్తించింది.
శ్రమ విభజన వర్గ భేదము లేని సమాజాన్ని వర్గాలుగా విభజించింది. ఒక వర్గమంతా బుద్ధి జీవులు. మిగిలిన వర్గం శ్రమ జీవులు. ఇలాంటి సమాజం వల్ల సంఘం ఎంత నీచ స్థితికి చేరుతుందో అప్పటి మతాలు, కళలు- ఇవి కూడా అట్లాగే దిగజారి పోతాయి. అప్పుడిక మతంకాని, కర్మ కాని సంఘ సామూహిక శక్తి చేత ఉత్పన్నం కావు. పాలకవర్గమే వాటిని తయారుచేస్తుంది. వాళ్ళు శాసనాల్ని అమలు చేసినట్లుగానే తమ మతాన్ని జనం మీద అమలు చేస్తారు.
ఆదిమ సమాజంలో పరిస్థితి వేరు. ఒకరు ఇంకొకర్ని పనిచేయమని ఆదేశించేది లేదు. వాళ్ళ అవసరం కొద్ది వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు గుంపులు గుంపులుగా నివసించే వాళ్ళు కాబట్టి గుంపులుగానే పని చేసికొనే వాళ్ళు. వారికప్పటికున్న కొద్దిపాటి సంప్రదాయం. మతనియమాలు వాళ్ళను కార్యోన్ముఖుల్ని చేసేవి. వారికే సమస్య వచ్చినా అది ఆ గుంపులోనే అనుకూలంగా పరిష్కారమయ్యేది. ఆ గుంపంతా ఒకటిగానే బ్రతికేది కదా! అందువల్ల అది సాధ్యమయ్యేది. వర్గ సమాజంలో భిన్న వర్గాల ఆలోచనలు వేరు. ఆదర్శాలు వేరు. అభిరుచులు వేరు. పాలితుల్ని పాలకులు శాసిస్తారు. ఇప్పుడు వాళ్ళ పరస్పర సంబంధం నిర్బంధ లక్షణంలో ఉంటుంది.ఇహ మతం- అది మూఢాచారాల పుట్ట. సంఘానికి మోహాన్ని, విభ్రాంతినీ బోధిస్తూ అది మనుగడ సాగిస్తుంది.రాజులు పాలించే సమాజంలో పరమేశ్వరుడొకడుంటాడు. సమాజం సామ్రాజ్య భాగమైనప్పుడు దేవతా సమాజం పెద్దది అవుతుంది. మానవ లోకపాలకుల్ని అనుసరించే ఈ కాలంలో ఆ దేవలోకంలో కూడా దేవతల్లో అనేకవిధాల అంతస్తులు- హోదాలను బట్టి, అధికారాల్ని బట్టి ఏర్పడతవి. భూలోకంలాగానే దేవలోకం కూడా.
వస్తు విభాగంలోని అసమానత్వం వల్ల, పరస్పర వ్యతిరేకమైన కామనలవల్లా. విపరీతమైన విరోధం పెరిగి అది సంఘాన్నింకా విభేదాల పాలు చేస్తుంది. ఈ విభేదాల వల్లే అల్లర్లు, తిరుగుబాట్లు చెలరేగడం, అణచివేయటం సాగుతుంది. సంఘపరంగా ఉండాల్సిన ఉత్పత్తి సాధన వస్తు సామాగ్రి పూర్తిగా పాలక వర్గాల వారి హక్కు భుక్తంగా అయినప్పుడిక పీడిత ప్రజావర్గం బలప్రయోగానికి దిగక తప్పదు. అట్లా హక్కు భుక్తం చేసికొనే లక్షణమే నిరంకు శత్వం. మత విషయంలోనూ అంతే. సంఘ సామూహిక జీవిత స్పర్శ ఈషణ్మాత్రమూ లేకుండా. దేవతల్లోనూ, పరలోకంతోనూ నిండి అది నిరంకుశంగానే ప్రవర్తిస్తుంది. తత్ఫలితంగానే దాన్లో మూఢాచారాలు నిండుతవి. నిరంకుశత్వం, మౌఢ్యం అటు పరిపాలనలోనూ, ఇటు మతంలోనూ సమానంగానే ఉంటాయి. ఆ కాలంలో ప్రభుత్వమూ, మతమూ రెండూ రెండు కావన్నట్లుగా ఉంటాయి. ప్రభుత్వ మతమే ప్రజల మతం. భిన్న మతావలంబనం దోషం కూడా. పాలక వర్గం సామాజికమైన శ్రమ జీవనాన్ని పూర్తిగా వదలి బ్రతకడానికి పూనుకొనే కాలం వ్యావసాయికంగా అభివృద్ధి చెందిందై ఉంటుంది. వ్యావసాయిక నాగరకతలో ప్రభువు ప్రత్యక్ష దైవంగా సంఘంలో మహోన్నతుడుగా ఉంటాడు. అప్పుడు సమస్త సంఘశక్తి వాడి హస్తగతమే అవుతుంది. దాన్ని అతడే సంబాళించుకుని పోతున్నట్లుంటుంది. బానిసలు తమ శక్తి సామర్థ్యాల్ని తాము తెలిసి కోరు. పైగా తమ శక్తిసామర్థ్యాలు తమ ప్రభువువి అనే వాళ్ళు భావిస్తారు. ఆయన నియామకాన్ని అనుసరించే వాళ్ళ శక్తియుక్తులు పని చేస్తవి కదా అందుకని. బానిసకు ప్రభువు ప్రభు వర్గం- అందరూ పూజ్యులే. ఈ విధంగా బానిస, ప్రభువుకు స్వాత్మ సమర్పణం చేస్తాడు. వాడి శక్తి సామర్థ్యాలు ఉత్పాదించిన వస్తు నమూహం ఎలా పాలకవర్గాల పాలవుతుందో వాడి ఆత్మకూడా అట్లాగే అవుతుంది. ఆస్తిపోయింది. మానాభిమానాలు పోయినవి. బానిసలు ఎంత వినయ విధే యతలతో ఉంటారో ఆ సంఘంలో వాళ్ళ వల్ల అంతటి ఘన కార్యాలు నిర్వహించబడ్తున్న వని అర్థం.
మతం అంటే ప్రపంచం యొక్క విపరీత చైతన్యం. వర్గ సమాజంలో వర్గవిభేదం అధిక మవుతున్న కొద్దీ వస్తూత్పత్తి శక్తి సన్నగిల్లింది.అది కొందరి సొత్తు ఆయింది. అట్లాగే మతం కూడా అనేకరకాల నిర్బంధాలకు లోనయి కరుడుకట్టుకునిచావు బ్రతుకుల నడుమన ఉన్నట్లుం టుంది.పాలకవర్గం తాను తనమతంలో విశ్వాసం కలిగి ప్రవర్తిస్తూ అందులోని మంచిమంచి అనుకూలమైన వాటినన్నింటినీ స్వాయత్తం చేసుకుంటుంది. సంఘంలోని మేలుజాతి వస్తు సముదాయమంతా దాని సొంతమేకదా! మత విషయంలోనూ అది అట్లాగే ప్రవర్తిస్తుంది. స్వర్గసుఖాలన్నీ దానివే. ఆనందమంతా దానిదే. అట్లా సాగుతున్నకాలంలో ఎప్పుడైనా పీడితుల్లో మరీ మొండికెత్తిన రకం వాళ్ళు కొందరు ఎదురు తిరుగుతారు. అప్పుడు పాలకవర్గం తమ స్వాధీనంలో వుంచుకున్న ఆనందభూముల్లో ఇంత చోటిచ్చి వాళ్ళను శాంతింపచేస్తుంది. భౌతిక వస్తువులయితే మరొకళ్ళకిస్తే విలువలు తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక వస్తువుని ఎందరికిచ్చినా పోయేదేమీ లేదు. (కీస వెలితికాదు), ఇలాంటి సందర్భాల్లో కొన్నివిచిత్రాలు జరుగుతాయి. ఈజిప్టులో బానిసజాతికి కూడా శాశ్వతస్వర్గ సౌఖ్యం అంగీకరించబడింది. ఇంకా కొన్ని అవాంతర మతాలు మొట్టమొదట ప్రభువులపట్ల వుండే దైవభావాన్ని క్రమంగా దిగజార్చి అల్ప విషయాల్లో దైవాంశాల్ని ప్రవేశపెట్టాయి. రోజురోజుకీ ఎక్కువవుతున్న పీడిత ప్రజానీకం యొక్క దౌర్భా గ్యస్థితికి ప్రతిబింబమే ఇది. ధర్మంగా బ్రతికితే మరణానంతర జీవితంలో సుఖపడవచ్చనే ప్రచార ప్రబోధాలు. ధర్మంగా బ్రతకడం అంటే యజమానులకు లోబడి వినయ విధేయతల్తో వుండటమే.వర్గసమాజం స్వర్గలోకపుటూహా సౌఖ్యాల్నే పాలితుల్లో చాలామందికి మరణానంతరం సమకూర్చింది. ఆ విషయాన్నే బుఱ్ఱలకెక్కించింది. స్వర్గాదిలోకాలెంత సత్యాలో మరణానంతర జీవితమూ అంతే సత్యం. ఒక్క పాలక వర్గానికి తప్ప మిగిలిన వాళ్ళకెవరికీ వాస్తవమైన, నిత్యజీవితంలో అనుభవింపదగిన సుఖమేదీ పుండదు. వాళ్ళు పండించిన పంటే వాళ్ళకు దక్కదు కదా!మత విషయ ప్రయోజన జ్ఞానం యొక్క అభివృద్ధి క్రమంగా పాలకవర్గం వాళ్ళకు మతం విషయంలో అవిశ్వాసాన్ని పెంచుతుంది.తనకవిశ్వాసం పెరుగుతున్నకొద్దీ దాన్ని నిర్బంధం చేసి పరాయివాళ్ళమీద రుద్దుతుంది. అప్పుడింకా పాలకవర్గం ఒక మంచి మనోహరమైన ఆదర్శవాదాన్ని గానీ, రహస్యమైన వేదాంతతత్వాన్ని గానీ పెంచి దాని అండలో తాను నిలద్రొక్కుకుంటుంది.
పాలకవర్గం వారి పరిస్థితి ఇట్లావుంటే పాలితుల్లో కొన్ని మూఢవిశ్వాసాలు ప్రబలుతాయి. కొన్ని గాధలు ప్రచారమవుతాయి. దీనికంతటికీ మూలం జన సామాన్యంలో వ్యాపించిన పౌరాణికతే.కానీ పాలకవర్గం ఇప్పుడు పాలితుల మూఢవిశ్వాసాల్ని అమర్యాదకరంగా భావిస్తుంది. మొత్తం మీద అవమానింపబడ్డా, సన్మానింపబడ్డా అది వ్యాప్తిని పొందుతుంది. ఆ విశ్వాసాలు అదృష్టాలకు సంబంధించినవి. ఆహారం లభించడం, బంగారం చేజిక్కడం, అదృష్ట వంతులైన పిల్లలు పుట్టడం ఈ మొదలైనవన్నీ వాటికి సంబంధించి వుంటాయి. ఇలాంటి అదృష్టాలు వాళ్ళకీ జీవితంలో లేనేలేవు. ఆ విశ్వాసాలమీదనే వాళ్ళు బ్రతుకుపోరాటాన్ని సాగిస్తున్నారు. వాళ్ళకి విశ్వాసం విషయంలో ఏ మాత్రం అపనమ్మకం లేదు. ఎందుకంటే అవి ఎవరో నెత్తిన రుద్దినవి కావుకదా! అందుకోసం వాటిని సమాజం అంతా కలిసి పెంచుకొన్నది. అందుకని తన సమాజం అంటే విభజన జరగని తమ వర్గమని అర్ధం-మతం కవితా విషయం కాని కాలంలో వారి ఆ విశ్వాసాలే మతకవితా విషయాలు. అణగదొక్కబడిన వాళ్ళ కళావిషయం అది. మానవ సహజాతాలైన కామక్రోధలోభమోహాది వాసనలు సాంఘిక జీవితంలో కలిసిపోవడాన్ని ప్రకటించేటంతవరకు ఆ విశ్వాసాలే కవితా విషయాలు. కవితా విషయాలు మాత్రమే గాని ఉత్తమ కవితా విషయాలు కావు. అవి బానిసజనం విశ్వాసాలు కదా! సర్వతంత్ర స్వతంత్రులే ఉత్తమ కవితా నిర్మాణ దక్షులు. దీన్లో ఏ మాత్రం అబద్ధం లేదు. ఈ కవిత్వం వాంఛా సాఫల్యభూముల హద్దుకు లోబడే వుంటుంది. ఈ కవితా నిర్మాతల నిత్యజీవితంలోనే స్వేచ్ఛామూలకమైన ప్రవృత్తిలేదు. అందువల్ల వారి కవిత్వం కూడా అట్లాగే వుంటుంది.
(ఇంకా వుంది…)