కొత్త వెల్లువ

(జయమోహన్, తమిళ కథ)

నవంబరు 7, 1917. భయంకరమైన శీతాకాలం. అక్టోబరు నుంచి జనవరి దాకా ఆ నాలుగు నెలలూ రష్యా మిగతా భూప్రపంచం నుంచి వేరుపడే కాలం. ఘనీభవించిన హృదయంలా, ఆకాశంనుండి నిర్దయగా రాలిపడే మంచుపొర ఒకటి తన గడ్డకట్టిన తెల్లటి చేతివేళ్ళతో ఆ మహత్తర దేశాన్ని కొద్దిగా పైకి ఎత్తుతుంది. అప్పుడు రష్యా నీరవ నిశ్శబ్దం నిండిపోయిన బీడు భూమిలో కదలలేక ఇరుక్కుపోతుంది. అవునూ, ఆ మాట నిజమేనా?

గడ్డకట్టిన మంచు శిలలమధ్య చిక్కుకుపోయిన ఆ దేశం తన జీవశక్తిని వెచ్చదనంగా మార్చుకుని, కర్కశమైన శీతాకాలంతో పోరాడుతుంది. రాజేసిన కలప దుంగలు కడదాకా రగులుతూ ఉంటాయి. ఆశ, పదాలలోని చిట్టచివరి శబ్దం వరకూ ఊపిరి నిలబెట్టుకుంటుంది. ఫిబ్రవరి ఆఖరులో మంచు కరగడం మొదలయ్యేటప్పటికి, మళ్ళీ ఆ దేశం కొత్త జన్మ ఎత్తుతుంది. నిశీధి గర్భకుహరంలో పేరుకుపోయిన తెల్లటి మంచుని మెలమెల్లగా తొలగిస్తూ, కొత్త ఆకాశం కింద, మెరిసే కొత్త భూమి మీద మంచు కురుస్తూ ఉంటుంది. ప్రతీదీ పునర్జన్మ ఎత్తుతుంది. చెట్లూ, పక్షులూ, క్రిమి కీటకాలూ. మనుషులు కూడా. సంపూర్ణ విధ్వంసం నుంచి పునర్జన్మ పొందే రహస్యమేమిటో ఈ భూమికి తెలుసు.

కానీ, ఆ నవంబరు నెల భిన్నమైనది. బూడిద రంగు మంచు పొరల కింద తుపాకులు మోతమోగాయి. మసకమసకగా కనిపించే మంచు తెరలమధ్య తుపాకీ కాల్పుల వెలుతురు సన్నగా మిణుకుమిణుకుమంది. తూటాలు దూసుకుపోయే సవ్వడి సైతం ఆ మంచు దుప్పటిలో సరిగా వినిపించలేదు. అన్ని వైపులా మృత్యు ఆక్రందనలు. నిశ్చలమైన వస్తువుల దైన్యానికి తోడుగా ఘనీభవించిన ఇటుక భవనాలలో ఆ ఆక్రందనలు ప్రతిధ్వనించేయి. విజయధ్వానాలు కూడా మిన్నుముట్టాయి. మృత్యువు ఆక్రందనలని అవి మరుగు పరిచాయి. పట్టరాని సంతోషం, ఉద్వేగపు వత్తిడిలో గుండెలు నిండి, విప్పారిన కళ్ళలో వెలుగుతో, చేతులు పైకెత్తి నిశీధి ఆకాశంలోకి ఎలుగెత్తిన కోట్ల ప్రజల జనహృదయ ఘోష అది.

ఆ జనగర్జన ఆకాశంలో నిద్రిస్తున్న దేవతలని కుదిపిలేపింది. ఒక సందేశాన్ని అందించింది. దేవతలకి ఇక ఈ భూమి మీద పనిలేదు. ఆ దేవదేవతల కరుణా కటాక్ష వీక్షణాలకోసం వేల సంవత్సరాలు కన్నీళ్లు, నెత్తురు, చెమట చిందించిన పేదజనమే ఇప్పుడు మేల్కొన్నారు. తమదైన స్వర్ణసీమని స్థాపించేందుకు వాళ్ళు ఇప్పుడు సిద్ధమయ్యారు. తుపాకీయే ఇప్పుడు వాళ్లకి కొత్త దేవత.

విజయం సాధించిన పట్టరాని సంతోషంలో దిక్కులు మరిచిపోయిన జనం మంచు పేరుకుపోయిన సెయింట్ పీటర్స్ బర్గ్ నగరపు వీధులలో అటూ ఇటూ పరుగులు తీశారు. నాట్యం చేశారు, పొలాలలో పని చేసేటప్పుడూ, నూర్పిళ్లప్పుడూ పాడే పాటలనీ, ప్రేమ గీతాలనీ పాడారు. హఠాత్తుగా గాలిలోకి కాల్పులు జరిపారు. ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నారు. సాంత్వన కలిగేదాకా ఆపకుండా ఏడ్చేశారు. ఆ గుంపులోకి ఇద్దరు అమెరికన్ విలేఖరులు ప్రవేశించారు. ఒకరు జాన్ రీడ్, మరొకరు రైస్ విలియమ్స్. రష్యన్ మహా విప్లవం గురించి వాళ్ళు అప్పటికే వినివున్నారు. దానిని ప్రత్యక్షంగా చూడాలని అక్కడికి వచ్చారు.

‘దేశం దేశమంతా వెర్రెత్తిపోవడాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఈ ఉన్మత్త ఆవేశంలో నగరం చిన్నాభిన్నమై పోకుండా నిలవడం ఆశ్చర్యమే’నన్నాడు జాన్ రీడ్.

‘అది జరిగినా జరగొచ్చు. సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలోని చిత్ర ప్రదర్శన శాలలోకీ, వింటర్ ప్యాలస్ లోకీ జనం ఒక మహా కెరటంలా దూసుకెళ్ళారని సత్రం యజమాని చెప్పాడు. మాస్కో నగరం ఇంకా మిగిలి వుందా అని నా అనుమానం’ అని విలియమ్స్ అన్నాడు.
‘ఎంత ఉన్మత్త ఆవేశమిది! ఎంతటి అద్భుతానందమిది! బహుశా ఫ్రెంచి విప్లవం కూడా ఇలాగే వుండి వుండేదేమో!’
చింపిరి బట్టలు ధరించిన ఒక రైతు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. తన చేతిలో ఒక రైఫిల్ ఉంది. ‘తొవారిష్’ ‘తొవారిష్’ అంటూ పిలుస్తున్నాడు. వాళ్ళని ముద్దు పెట్టుకున్నాడు. తన దగ్గర రష్యన్లనుంచి సహజంగా వచ్చే నోటిపుండ్ల వాసన. ఆపుకోలేని ఉద్వేగంతో అతను ‘తొవారిష్’ ‘తొవారిష్’ అని పదే, పదే పిలుస్తున్నాడు. చేతులు చాచాడు. కళ్ళలో కన్నీటి ధారలు. అదే మాట పదే , పదే ఉచ్ఛరిస్తూ ఉన్నాడు.

‘ఏమంటున్నాడితను?’ అడిగాడు రీడ్.
‘అది ఒక వింతైన పదం. ఇంగ్లీషులో సహ యాత్రికుడు అనో , కామ్రేడ్ అనో చెప్పుకోవచ్చు.’
‘ఎందుకు ఆ పదం ఈ ముసలి మనిషిని ఇంతగా వివశుడిని చేస్తున్నదో?’
ఈ విప్లవ నినాదాలలో ఇదొక మాట. సమానత్వానికి, సామూహిక కార్యాచరణకీ, రక్త బంధుత్వానికీ ఈ పదమొక సంకేతం. ఇవాళ ఈ పేరుతో మీరు ఎవరినైనా పిలవొచ్చు. మిగతా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని గుర్తుంచుకోండి. భావాలతో కాదు, ఈ ఒక్క పదంలోని అద్భుత శక్తితోనే ఇక్కడ విప్లవం వచ్చింది.’

‘ప్రతీదీ అద్భుతంగా వుంది. మనం ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వాటిని చూసి ఎరగము. ఉత్సాహమూ, భయమూ ముంచెత్తుతున్నాయి.’
‘అసాధారణమైన విషయాలన్నీ అలాగే ఉంటాయి.’

వాళ్ళు మొదటి బారికేడ్ దగ్గరకు చేరుకున్నారు. తూటాల పొగ వెలువడుతున్న వెచ్చని తుపాకీ చేతిలో పట్టుకున్న యువ కార్మికుడు ఒకతను వాళ్ళను చూసి, లేచి నిలబడి అడిగాడు, ‘కామ్రేడ్, మీరెవరు? గుర్తింపు కార్డు చూపించండి.’
జాన్ రీడ్ తన ఐడెంటిటీ కార్డును చూపించాడు. ఆ యువ కార్మికుడు తలవంచి అభివాదం చేశాడు.

‘కామ్రేడ్ నా పేరు త్రిఫోనోవ్. నేను కమ్యూనిస్టును. జార్జియా నుంచి వచ్చాను. ఇదుగో, ఇతని పేరు యానిషేవ్, న్యూబుత్ నుంచి వచ్చాడు.’
‘నమస్తే కామ్రేడ్స్, మేము మీ నాయకుడు లెనిన్ ని చూడాలనుకుంటున్నాము.’
చలికి ముఖం ఎరుపెక్కిన యానిషేవ్ నవ్వాడు. ‘నాయకుడా? అలాంటి వాళ్ళెవరూ ఇక్కడ లేరు. మా దగ్గర లెనిన్ అనే పేరున్న ఒక కామ్రేడ్ ఉన్నాడు. ఆయన మాకు మార్గదర్శి, గురువు.’
‘అవును, మేము చూడాలనుకుంటున్నది అతనినే.’
‘అదుగో, అక్కడ ఆ కూడలికి అవతల, స్మోల్నీలో ఉన్నాడనుకుంటాను.’

‘ఏమిటా స్థలం?’
‘అంతకు మునుపు అది రాజవంశపు సైనిక కళాశాల. ఇప్పుడది, సోవియట్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ కార్యాలయం.’
‘మేము అక్కడికి వెళ్లాలనుకుంటున్నాము.’
‘అయితే, ఇప్పుడు అక్కడ తీవ్రమైన యుద్ధం నడుస్తున్నది. సైనిక కళాశాల విద్యార్థులు వేయిమంది ఇంకా అక్కడనే ఉన్నారు.’
అప్పుడు అంతలోనే తుపాకీ మోత వినిపించింది. రయ్యి రయ్యి మంటూ విజిల్స్ శబ్దం వినిపించింది.

‘కూర్చోండి, కామ్రేడ్స్, కూర్చోండి.’
కూర్చున్న తర్వాత, ‘కామ్రేడ్, బహుశా మీరు ఇలాంటి యుద్ధాన్ని చూసి వుండరేమో అనుకుంటున్నాన’ని త్రిఫోనోవ్ అన్నాడు.
‘అవును, ఆ విషయం మీకెలా తెలిసింది?’
‘మీరు విన్న విజిల్ శబ్దం తుపాకీ గుండ్లు దూసుకుపోయిన శబ్దం. వెంట్రుకవాసి తేడాలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు.’
ఇద్దరికీ ఒళ్ళు జలదరించింది. ‘ఓరి, దేవుడో, విప్లవ నాయకుడు ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో ఉన్నాడా?’ అని రీడ్ అడిగాడు.
మళ్ళీ యుద్ధం మొదలయ్యేసరికి వాళ్ళు బదులు ఇవ్వలేదు. తుపాకీ కాల్పులు, కేకలు కొనసాగి, కాసేపటికి సద్దుమణిగిన తర్వాత, మళ్ళీ ప్రశాంతత నెలకొన్నది.

‘కామ్రేడ్, మీరు మహా ప్రమాదకరమైన చోట ఉన్నార’న్నాడు రీడ్.
‘అవును, కొద్ది అడుగుల దూరంలోనే చావు కాచుకుని వుంది. చావు ఖాయం. అందులో అనుమానమే లేదు. అయితే, చనిపోతే మాత్రం ఏమిటంట? ఈ పది రోజుల కాలంలో నా జీవితంలోని ఆనందాన్నంతటినీ నేను అనుభవించాను.’ త్రిఫోనోవ్ ఉద్వేగాన్ని అదుపు చేసుకోవడానికి పెదవులని నొక్కిపడుతూ మాట్లాడాడు . ఎవరో తెలియని వాళ్లతో అర్ధం,పర్థమేలేని యుద్ధంలో నేను చనిపోవడంలేదు కామ్రేడ్. నేను నా తర్వాత తరాల వాళ్ళ కోసం చనిపోతున్నాను. దోపిడీ, అన్యాయాలకు తావులేని ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించేందుకు చనిపోతున్నాను. ఒక మనిషి జీవితానికి ఇంతకంటే సార్ధకమైన ముగింపు ఏముంటుంది?’

తమాయించుకోలేని ఉద్వేగమేదో జాన్ రీడ్ ని కదిలించివేసింది. తన కళ్ళలో కన్నీళ్ళు. ఆ కార్మికుడిని జాన్ రీడ్ అలాగే హత్తుకున్నాడు.
కొన్ని గంటల తర్వాత రక్షా బలగాలు సహాయంగా వచ్చాయి. బారికేడ్ ని ముందుకు జరిపారు. ఒక పాత బండిలో విలేఖరులిద్దరినీ స్మోల్నీకి తీసుకువెళ్ళారు. తోటలో చెట్లకింద రాలిపడిన యాపిల్ పళ్ళలా దారిపొడవునా శవాలు పడివుండడాన్ని వాళ్ళు గమనించారు. ఆ బారికేడ్ దగ్గర పోరాడిన వాళ్ళందరూ చనిపోయారన్న విషయం వాళ్లకి రెండురోజుల తర్వాత తెలిసింది.

స్మోల్నీ అన్నది ఒక పురాతన కట్టడం. రష్యా జారు చక్రవర్తి బృహత్ స్వప్నాలలో అది ఒకటి. ఇటుకలతో నిర్మించిన పెద్ద గుండ్రటి స్తంభాలు, విశాలమైన వరండాలు, వెడల్పాటి మెట్లు, ముందువైపు బండ్లు నిలపడానికి వీలుగా విశాలమైన జాగా ఉండేట్లు నిర్మించారు. మొదటి అంతస్తులో కూడా విశాలమైన వరండా ఉండేట్లు కట్టారు. వరండా, ముందు జాగా అంతటా జనం తొక్కిసలాడుతున్నారు. ఎటు చూసినా మనుషుల తలలు, మనుషుల వాసన, మనుషుల గోల. ఆ జనసమూహపు కెరటాల మధ్య బండి ముందుకు నడుస్తున్నది. సరిపోని, బిగుతైన బట్టలు తొడుక్కున్న యువకుడు ఒకరు ముందుకు వచ్చి, ‘అమెరికన్ విలేఖరులు మీరేనా’ అని అడిగాడు.
‘అవును.’
‘రండి. కామ్రేడ్ లెనిన్ మీ గురించే ప్రత్యేకంగా అడిగాడు.’
‘మా గురించా?’
‘అవును. రండి.’ జన సమూహాన్ని వాళ్ళు నెట్టుకుంటూ వెళ్లారు. స్మోల్నీ వరండాలో ఏర్పాటు చేసిన ఒక పెద్ద టేబుల్ వెనక ఒక కురచపాటి మనిషి కూర్చుని వున్నాడు. ఐడెంటిటీ కార్డుని పరీక్షించిన తర్వాత, ‘కామ్రేడ్స్, దయచేసి కూర్చోండి. మీతో పాటు ఇంకో ఇద్దరు జర్మన్ విలేఖరులు కూడా వున్నారు.’

ఆ మహా జనవాహినిలో ఉద్వేగం వాళ్ళని ఆకర్షించింది. ఆ సమూహంలో అందరూ ఒకే మనసుతో, ఆలోచనతో ఉన్నట్లనిపించింది. అంతలో ఒక పెద్ద కేక వినిపించింది. జనం చెదిరిపోయి, దారి వదిలారు. వీధి కూడలిలో జార్ చక్రవర్తి నికోలస్ ది ఒక పెద్ద విగ్రహం వుంది. అనేకమంది కార్మికులు ఆ విగ్రహం పైకి చీమలలా ఎగబాకారు. జార్ పాషాణ సదృశ నేత్రాలు క్రూరత్వాన్ని చాటుతున్నాయి. ఆ విగ్రహం మెడకీ, చేతులకి తాళ్ళు కట్టారు. వందలమంది జనం ఆ తాళ్ళచివర్లని పట్టుకుని లాగడం మొదలు పెట్టారు. అది కొద్దిగా కదిలింది. విగ్రహం పైకి ఎక్కిన జనం ఇప్పుడు కిందికి దూకేశారు. విగ్రహం తల విరిగి ధడేల్మని నేలపై పడిపోయింది. విగ్రహమూ, దానిని నిలబెట్టిన వేదికా మెల్లగా కదిలి, అటూ ఇటూ ఊగి నేలపై కూలిపడ్డాయి. ఒక మహా శబ్దం, పెను కేరింత. జనం వెర్రెత్తినట్లు నాట్యం చేశారు, కేకలు వేశారు, విరగబడి నవ్వారు, వెక్కి వెక్కి ఏడ్చారు. కార్మికులు కింద పడిన విగ్రహం మీదికి ఎక్కి, కేరింతలు పెట్టారు.

‘మనుషులు తమ విడి, విడి వ్యక్తిత్వాన్ని కోల్పోయి, ఒక ఐక్య, మహాశక్తిగా రూపొందగలరా? అది సాధ్యమయ్యే పనేనా?’ జాన్ రీడ్ అడిగాడు.
‘సాధ్యమయ్యింది. మనుషులంతా ఒకే సంకల్పంతో, ఒకే లక్ష్యంతో కదిలినప్పుడు చరిత్ర నిర్మాణమౌతుంద’ని సమాధానమిచ్చాడు విలియమ్స్.
ఆశ్చర్య చకితుడై, ‘అది ఒక మహాశక్తి’ అన్నాడు రీడ్. ‘సరిగ్గా నియంత్రించలేకపోతే, ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఇదే.’
‘ఆ మనిషి ఒక మాంత్రికుడు. ఈ జన సమూహపు వెల్లువపైన సంపూర్ణమైన నియంత్రణ అతని చేతుల్లోనే వుంది.’
‘కానీ, అది పైపైన కనిపించే విషయం మాత్రమే కావచ్చు. జార్ చక్రవర్తికేమైందో ఇప్పుడు నువ్వు చూశావుకదా? వేయి సంవత్సరాలుగా జనాల ఆలోచనలని జార్ శాసించాడు.’
‘కానీ, ఇది అందుకు భిన్నమైన మరొక యుగం.’
‘అవును, ఎలాంటి అడ్డూ అదుపూ లేని, మొరటైన, ఆదిమశక్తి యుగం. అదిగో, స్వర్ణయుగం పతనమైపోయింది. ఇప్పుడు ఇనుము యుగం ప్రారంభమౌతున్నది.’

‘ఈ మనిషి ఇనుముతో చేసిన మనిషా?’
‘లేదంటే, ఇదొక మహా వినాశనానికి నాందియా? ఈ జనాలకి ఒక ఇనుప మనిషి అవసరం. ఇనుములా లోహపు ఆలోచన, ఇనుము లాంటి మాటలు, ఇనుములాంటి లోహ సంకల్పం..’
‘ఈ మనిషి, వ్లదిమీర్ ఇల్యిచ్ (లెనిన్), ఇతనొక అద్భుతమైన వ్యక్తియ’ని వీళ్ళు చెబుతారు.’
‘నేను నమ్మను.’
‘సరే, చూద్దాం.’
అంతలో, ‘అందరూ నిశ్శబ్దంగా ఉండాల’ని ఎవరో అరిచారు. వందల గొంతులు అదే కేక పెట్టాయి. ముందువైపున ఉన్న జనం నిశ్శబ్దంగా మారిపోయారు. అదే మాట అందరిలో వ్యాపించింది. సముద్రం మంచులా ఘనీభవించినట్లు ఆ సమూహం మొత్తం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మారిపోయింది.
అక్కడికి లాక్కువచ్చిన ఫిరంగి శకటం పైకి ఒక మనిషి ఎక్కాడు.

తనని తాను తమాయించుకోలేక, ‘ఫిరంగి శకటం మీదనా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసాడు రీడ్.
‘చరిత్ర తాను సంకల్పించుకున్న రీతిలోనే వ్యాపిస్తుంది.’
‘అయినా..’
‘నువ్వే కదా ఇది ఇనుప యుగమని అన్నావు’
ఫిరంగి శకటం పైకి ఎక్కిన మనిషి నల్లటి సూట్ తొడుక్కున్నాడు. ఆ మనిషి పొట్టిగా వున్నాడు. బలమైన భుజాలు. కొట్టొచ్చినట్లు కనిపించే నుదురు. బట్టతల, కొంచెం ముందుకు వాలిన ముక్కు. పిల్లి గడ్డం, మెరిసే సన్నటి కళ్ళు, చిలిపిదనం ఉట్టిపడే చిరునవ్వు.

‘అది అతనే! ఫోటోలలో చూసినట్లే వున్నాడ’న్నాడు విలియమ్స్. విలియమ్స్ లో ఉత్సాహం రీడ్ కు కూడా అంటుకుంది. ‘ఇది చరిత్రలో అతి గొప్ప క్షణాలలో ఒకటి కాబోతున్నది. ఈ సంఘటన తర్వాత బహుశా ఈ ప్రపంచమే శాశ్వతంగా మారిపోవచ్చు. మానవాళి భవితవ్యమే ఈ క్షణంలో నిర్ణయమౌతున్నది… ప్రతీ దృశ్యమూ, ప్రతీ చిన్న సమాచారమూ, ప్రతీ శబ్దమూ, ప్రతీ వాసనా, తాను ఉచ్ఛరించే ఒక్కొక్క మాటా, ఆ మాట్లాడే మాటల మధ్య మౌనమూ.. అన్నిటినీ నేను శ్రద్ధగా గమనించాలి. అవి నా మనసులోకి లోతుగా ఇంకిపోయి, నా చైతన్యంలో ఒక భాగం గా మారాలి. ఆ తర్వాత ఈ క్షణానికి, ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షిగా నా శేష జీవితాన్ని గడుపుతాను. నా జీవిత లక్ష్యమే నెరవేరే క్షణమిది.’ రీడ్ శరీరమే కంపించిపోతోంది.
ఫిరంగి శకటం పైకి ఎక్కిన ఆ మనిషి, అభివాదపు సైగ చేస్తూ చేతులు పైకెత్తాడు. జనసమూహంలో అందరూ కేరింతలు కొట్టారు. ఆ పెద్ద స్మోల్నీ భవంతి జనం కేరింతల తాకిడికి కూలిపోతుందేమోననిపించింది. నిశ్శబ్దంగా ఉండమని కోరుతూ ఆ మనిషి సైగ చేశాడు. మరుక్షణంలోనే నిశ్శబ్దం నెలకొన్నది. అతను అలసిపోయినట్లు కనిపించింది. జుట్టు గాలికి రేగిపోయింది. తన బట్టలనిండా నల్లటి ధూళి. తన చిరునవ్వులో సైతం ఆ ధూళి, అలసట కనిపిస్తున్నాయి. ఒక పురాతనమైన, మహత్తరమైన చిత్రపటంలా కనిపించాడతను.

జనమంతా నిశ్శబ్దంగా ఉన్నారు. తుపాకీ కాల్పుల సవ్వడి, బూట్ల శబ్దం మధ్య గొంతు సవరించుకుంటుంటే ఆ నిశ్శబ్దం మరింతగా విస్తరించింది. అందరూ నిశ్శబ్దంలో. అంతటా నెత్తురు, చెమట, తుపాకిమందు, తెగిపోయిన చెప్పుల వాసన. ఆ మహాజనసమూహం అంతా శ్రద్ధగా వింటున్నారు. ‘కామ్రేడ్స్’ అన్నాడతను. మూసుకుపోయిన గొంతుతో ఆ మాట ఎవరికీ వినపడలేదు. ఇప్పుడతను బిగ్గరగా గర్జించాడు, ‘కామ్రేడ్స్, మనం సోషలిజం నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాం….’

(‘పింతొడరుం నిళలిన్ కురళ్’ నవలలోని కథ ఇది. ఈ నవల 1999లో వెలువడింది. నవల పేరుకు ‘వెంట వచ్చే నీడల గొంతు’ అని అర్ధం.)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

4 thoughts on “కొత్త వెల్లువ

  1. Very Emotional one. It sounds like original writing. Stands like a mirror to reflect hearts with the beats of change. Good work Kiran.

  2. చాలా బాగుంది సుధా కిరణ్. ఉద్వేగం క్యారీ అయ్యింది. జయమోహన్ తొలి దశలోని రచన అనుకోవచ్చా!

  3. చాలా బాగుంది సుధాకిరణ్ ఉద్వేగభరితంగా. ఏం ప్రవాహం, మార్చింగ్ సాంగ్ లాంటి భావోద్వేగపు నడక. ఏం రాసినా అలాగే రాస్తాడు రాక్షసుడు. అనువాదం కూడా అంతే గాఢంగా ఉంది. జయమోహన్ తొలిదశ రచన అనుకోవచ్చా!

  4. థాంక్యూ రామ్మోహన్! పిన్ తొడరుం నిళలిన్ కురళ్ జయమోహన్ మూడవ నవల అనుకుంటాను. జయమోహన్ తొలి దశలోని రచన అనుకోవచ్చు కానీ పూర్తిగా తొలిదశ అనీ అనలేమేమో. 1988 నుంచీ తాను రాస్తూనే వున్నాడు. తొలి కథలకే తనకి గుర్తింపు వచ్చింది. 1988లో రాసిన నవల రబ్బర్ కి ఆ తర్వాత 1990లో బహుమతి లభించింది. 1992 లో మొదటి కథా సంకలనమూ, 1993లో రెండవ కథా సంకలనమూ వచ్చాయి. 1997 లో వచ్చిన విష్ణురూపం నవలకి బాగా పేరు వచ్చాక, 1999లో రాసిందిది.

Leave a Reply