“ఈరన్నా… ఓ… ఈరన్నా…!”
గలువ ముంగటి కొచ్చి, ఎవలో పిలుస్తున్నరని ప్రబావతమ్మ దొర్సాన్ని నుదురు మీద సెయ్యి అడ్డం పెట్టుకోని మరీ ఆకిట్లకు తొంగి సూసింది. ఎవలవుపడలే!
“ఎవలుల్లా!!” కేక బెట్టింది గేటు దిక్కు సూచి.
గలువ ముంగటి కొచ్చి – “నేనేనండి ఎల్లన్నను. దొర లేడా!” అడిగిండు. ఆమె పసిగట్టింది ఎల్లడెందుకు వచ్చిండో!
“ఏం ముచ్చట కచ్చినవ్? జీతంలకు ఎందుకెగనాం బెట్టిండు నీ కొడుకు? వచ్చుడు పోవుడు అంత మీ ఇష్టమేనార? నడి కాలంల గిట్ల ముంచుతే ఇగమేం ఎవుసమేం జేత్తం, భూములమ్ముకోని సిప్పబట్టుకోవాలె.. అక్కెరున్నంత సేపు అయ్య… అయ్య అంటరు, అక్కెర తీర్నాంక…..”
ఆమె ఇంకేందో అర్వబోయింది గని ఎల్లన్న తల గుడ్డబీకి మోకాల్లకు గొట్టుకోని అరుగు మీద కూసుండు.
“ఆడు జీతంలకు రానంటుండు…” సావు కబురు సల్లంగ చెప్పిండు.
“అదే ఏం రోగం బుట్టిందంట…”
“వాల్లమ్మ గా తవ్వెడిత్తులు సాలయంటుంది.”
ఆ మాటకు ఆమె మొకం గండు పిల్లి మొకం లెక్క ఉబ్బరించింది.
“గామాట చెప్పెతందుకు వచ్చినవా? జీతాలు మాట్లాడుకోని కట్టలకట్టలు పట్కపోయిన్నాడు ఎర్కలే, పట్కపోయినయి అయిపోయినట్టుంది మల్ల మారాముల్లు జేసి ఇరుకుదమని జూత్తుర్రు… గా నాలిముచ్చు గాడ్డి కొడుకు మాకద్దే వద్దు… ఆడు నువ్వు ఏ గంగల్నన్న కలువుండి… మా పైసలు మాకు బాజాట్ల పారేసి పోర్రి…”
“అరే… ఏందమ్మ గట్ల మాట్లాడరు… దొరను బిలువు.” ఆమె లెక్క లేనట్టుగ అన్నడు.
భుజంమ్మీద కండువ సరిజేసుకుంట వచ్చిండు లోపల్నించి పతంజలి. ఆయనని చూస్తానే ఎల్లన్న లేవబోయినట్టు జేస్తుంటే, ఆడున్న కుర్సీల దొర కూసున్నడు ఎల్లన్ని కూసోమని సెయ్యి ఊపుకుంట.
“పోరడేడిరా… రెండొద్దులకోసారి గిట్ల జీతం ఎగ్గొడితెట్ల కావాలె? నడినెత్తిమీనికి పొద్దెక్కినా వాడు జాడలేడాయె.” పతంజలి చిరచిరమన్నడు.
“మీకెర్కలేకేంది గనీ ఇంట్ల రోజు లొల్లే మాకు… పోరడు ఏదన్న కావాల్నని అడిగితె నీ జీతం గంత బారు గింత బారు వుండెగ… ఆన్నే తెచ్చుకోబో అని వాల్లమ్మ వాన్ని దెబ్బలు గొడ్తది, లేకుంటే తిట్టుడు సాగిత్తది. దసర పండగొత్తాంది గదా కొత్తంగి పట్టియ్యమన్నడు. మీ దొరోల్లు పట్టిత్తరు పో నాకాడేవుంది అన్నది.”
“దానికి సాగుబాటెక్కువ… మా అంటది.” ప్రబావతమ్మ ఎకెసెక్కంగన్నది.
“సాగుబాటేం వున్నదుండి… అంగిలాగుకు ఎంతైతది మాంటె రెండొందలు అయిద్ది గావచ్చు… మీ కండ్ల ముంగటి పోరడు గాయింత సూడరానుండి?” ఎల్లయ్య నిష్ఠూరంగన్నడు.
“ఆఁ… ఈడ పాతర్లు తవ్వి రడెగున్నయి…”
“వాని దోస్తుగాల్లంత పట్నంల ఆస్టలల్ల వుండి సదువుతాండ్లు. ఇప్పుడు అంగిలాగు పట్టియ్యనందుకు పట్నం బోత… సదువుకుంట అని బెట్టి కూసున్నడింటికాడ.”
“మీరు మీరు కొట్క సచ్చుకుంట మా పని బందువెడ్తరా?”
“అరె నువ్వాగ రాదమ్మ… మాట్లాడుతున్న గదా! గింత చాయ్ పోయి ఎల్లనికి. ” ఆమెని ఎట్లనన్న లోపలికి పంపే ఉపాయంగ అన్నడు. లేకుంటే వాంతోని వాదన పెంచుతె మాటలు ఊల్లెదాంక పోతయి. అసలే ఊల్లె కొత్త కొత్త పోరగాండ్లు… ఎవలను మందలించెటట్టు లేదు. ఆమె మోతి తిప్పుకుంట లోపలికి పోయింది.
“ఆరీ… వాన్కి సదువాల్నని వుంటె సదువుపియ్యి. వద్దన నాకేం అక్కెర రా! నాయేందో నాకు పారేసి పో… అంతెగని పెట్టుకున్న జీతగాల్లందర్ని కూకుండబెట్టి మేపాల్నంటే నా గరిసె బోర్ల పడ్తది ఇన్నవా? ఇది ఎన్కటి దొరిర్కం గాదు… నేను సుత మీ లెక్కనే రోడ్డు పొంటి చాయ తాగుత, వోటల్ల టిపిను తింట… మూడు పానుదులెంబడి నిలబడి బాతఖాని కొడ్త… కనీ మా తాత… నాయినలు వున్ననాడు మీ తాత నాయినలు ఈ గడీలనే జీతాలు జేసిండ్రు… ఎన్కట మా నాయన బంకుల్ల తట్టు కుర్సీల కూసుంటె పాటకుల అవుతల సడకు మీంచి నడువాల్నంటేనే బయపడేటోల్లు… గిప్పుడేం వున్నదిరా! నీ కొడుక్కెన్నడు ఖయాలు దోత్తే గన్నడే ఇంట్లవోయి పంటడు… జీతంలకు రావేందిరా అనెతట్టుందా? అంటె కయితికాల పోరగండ్లకు మీరే శాత్రపురండలు జెప్పుతుండ్రి ఇండ్లల్ల కూకుండ బెట్టి.”
ఎల్లయ్య నవ్వి వూకుండు… ముందుగాల చాయ్ తాగాలె. అటెంక జీతం పైసలు పూరగ ఇయ్యిమనాలె.. లేకుంటే బియ్యం పట్క పోవాలె… అనుకుండు.
“ఈరిగాడు మస్తు మాదర్శోదోగాడు… దొర్సాని ఏవన్న పని చెప్తే మాటకు మాట ఒర్రిత్తడు. అరె ఇంట్ల వున్నది ముగ్గురం… మెప్పుతంగ పని చేసుకుంటే ఏదో గింత తిని టీవి సూసుకుంట కూలబడొచ్చు గదా! ఎన్కటి జీతాల తీరుగ కట్టం జేసి కడుపుకు తినకుంట రెక్కలు మర్రేసి సేసేదేమన్న ఉన్నదా?” కసురుకుంటనే చిన్నగ దువ్వినట్టన్నడు పతంజలి దొర.
ప్రబావతమ్మ గాజు కోపుల నీల్ల చాయ్ పోసి ఎల్లయ్య ముంగట పెట్టింది. పతంజలి దొరకు చాయ్ కోపు మీద సీన్మ యాక్టరు బొమ్మ వున్నది ఇచ్చింది. అసంతృప్తిగనే నీల్ల చాయ్ తాగి కోపు కడిగి గూట్లె బోర్లిచ్చి వచ్చి కూసున్నడు ఎల్లయ్య.
పొద్దూకినాంక తాగెటందుకని మంచి కల్లు బింకిలు గౌండ్ల ఎంకటేసు లోపలికి కొంట పోవుకుంట ఎల్లయ్యని చూసి నవ్విండు. అది జూసెటోర్కి కొడుకన్న మాటలు యాదికచ్చింది. పతంజలి దొర తల్లి శావనమ్మకు తాగెతందుకు మంచి కల్లు గావాలె… పతి రోజు పండేటపపడు రెండు గిలాసల కల్లు తాగుద్దని ఈరిగాడు ఇంట్ల చెప్తంటడు. గంత ముసలయినా ‘బాపూ అయ్యో పోరడు సూస్తుండు గదా వానికింత పోద్దమని, తాగుతడు పాపమనీ అనుకోదు’ అంటడు. ఇగ దొర్సానయితే చేపిచ్చిన పనే చేపిచ్చుకుంట ఊపిరి ఊపిరి సల్పనియ్యకుంట సావగొడదంట. దొరయితే రాయికన్న సెమటుంటది గని ఆయనకుండదంట. మనం మర్సిపోతే మన మడిమలే మాయం జేసే రకం అని ఇంటికచ్చినంక యాక్షన్ జేసుకుంట చెప్తంటే వాని మాటలకు తల్లి మెగురానికి ఆనుకోని కొడుకుని వల్లెకు తీసుకోని రెండు సేతులతోని తల్కాయ పునుక్కుంట మొటికలిర్సి నవ్వుద్ది.
దొరకాడ రాజస్థాన్ మేకలు యాభయి దాంక వుంటయి. అయ్యిసుత బలిసిన దుడ్డెల్లెక్కనే వుంటయి. గవాట్ని మేప్కరావుడు ఈరని పని. పొద్దు పొద్దున్నే ఆకిలూకి, రేతిరి బువ్వో గివ్వో వుంటె దొర్సాని పెడ్తె తిని మేకల్ని తోల్కపోవాలె. మల్ల పొద్దుగుంకె దాంక మేపుకొచ్చి దొడ్లె తోలి పోవాలె. పగటిలి బువ్వ ఎవలతోనన్న పంపుతరు. జీతమేమో చిన్న పోరడని లెక్కగడ్తరు, పనేమో పెద్ద జీతగాంతోని సరీగ పని జెప్తరు. గిదేందని ఎదిరిత్తె బండబూతులు తిడ్తరు. గట్ల తిట్టేవర్కి ఈరనికి కోపం… థూ ఆడెవలు పంజేత్తరు… నేను సదువుకు పోతనని ఏడుస్తడు. ఎల్లయ్య తాత దొర తాతకు జీతం వున్నడు. గప్పుడైతె నడుం ఎత్తేది లేదు, నోట్లకెల్లి మాట ఎల్లేది లేదు, దొరోల్ల తండ్రి కాడ తన తండ్రి జీతం వుండు. గప్పుడు సుత తల్కాయ ఎత్తింది లేదు, కాల్రెక్కలు నిముసం ఆగింది లేదు. కొన్నాండ్లు పతంజలి దొరకు తను కుడి భుజంలెక్క మెసిలిండు. కాలం మారింది దొరల రాజ్జం ఎన్నడో యాభయి ఏండ్ల కిందట్నే బందయ్యింది.
మేనాలు పోయి గుర్రం బండ్లచ్చినయి, అయిపోయి ఎడ్ల బండ్లు వచ్చినయి. అయిపోయి కార్లు వచ్చినయి, దొరలకు. ఇప్పుడు ఊరంతట్లకు ఏ మోతెవర్లకో జీతగాండ్లు వుంటుండ్రు దప్ప, ఎవని సక్కి వాడే దున్నుకుంటుండు సంతం చేసుకుంటుండ్లు… భూవి చెక్క లేనోడు బస్తి పట్కోని పని చూసుకుంటుండ్రు. పోరగాల్లు ఎక్కువ సదువులకు పోతున్నరు. జీతాలు వున్నకాడ జీతగాండ్లు ముప్పుతిప్పలు పెడుతుంటరు. ఒగమానంగ మాట ఇనరు… లక్ష షెర్తులు పెట్టి మరీ పనికి కుదుర్తుండ్రు… ఎన్కటోలిగ పైసబెడ్తే ఏవస్తానయి? ప్రతీదీ ఖరీదేనాయె… జీతం తిండికే సరింగ సాలలేవు… గట్లున్నయి రోజులు!
“ఏవాలోసిత్తానవు రా! చాయ్ తాగి సప్పుడేక కూసున్నవూ?” దొర మాటలకు నిర్విచారంగ సూసిండు.
అటెంక చెప్పిండు చిన్నంగ – “ఏం జెయ్యాలె కూసోక… దసర పండుగొస్తాంది గద ఈరనికి అంగిలాగు పట్టియ్యండి” ఇంకొక మాటయ్యా మందొర్సాని నోట్లె మంచినీల్లు సుత పొయ్యనియ్యకుంట పంజెప్పుద్దట… జర మీరే కని పెట్టుకోని పంజెప్పుకోవాలె గని ఏందుండి… గీ తిట్టుడు… శాపనలు బెట్టుడు…”
“మంచిగున్నదిరో నీ యవ్వారం, దర్మరాజా అంటే దుడ్డె బర్రె నాదే అన్నడట ఎన్కట, పొల్లగాడాయె తింటడు వుంటడని దొర్సాని గూడ సూసి సూడకుంట ఏదో ఒకటి పెడ్తనే వుంటది తినమని… గిదేం ముచ్చటరో!” పతంజలి దొర మాట అయిపోకముందే –
“మొన్న దొర్సానెందుకు తిట్టిందుండ్రి వాన్ని? ” నిగ్గదీసిండు ఎల్లయ్య.
“నీకెర్క లేనట్టే మాట్లాడ్తనవేందిరా! గడెన్కంగ ఉన్న సితపల్క పండ్ల చెట్ల కాయలు కోసిందెవలురా? ఈరిగాడు ఆని దోస్తుగాదా? ఎవలు రాకుంట పటాకులు (పాటకులు) బైటనించి బేడంబెట్టి బత్త సంచిలకు కాయలు కోస్కపోయిండ్రంట! గింత యింట్ల ఆడోల్లిద్దరే వుండిరి… కారేస్కోని నేను గుండాల బోయిన…. గదేనా వాడు జేసే పని… ఇంకోలింకోలైతే పంచాతిల కూసుండబెడ్తురు.
ఇయ్యాల ఎవన్నో పట్కొచ్చి కాయలెత్కవోయినోడు… రేపటి రోజున మట్ట ముదిరి ఇంకెవలనో తీస్కచ్చి గడే దోస్తడేమో! నాకైతే వాని సెకలు మంచిగన్పిస్త లెవ్వు. జీతంలకు రావుడు ఇష్టం లేకుంటే బల్మీటికి నాతాన ఎందుకురా? గవర్మెంట్ ఆస్టల్ల జేర్పియ్యి పట్నంల, వాడు సదువుకుంటె నీకైన పన్కొస్తడు గాదుర ముందు ముందు.”
దొర మాటలకు ఏన్నో గొడ్తున్నది ఎల్లయ్యకు. అయిన తమాయించుకున్నడు. పస్తాయించుకున్నడు మాట ఆపుకోని.
మల్ల పతంజలే అన్నడు. “వన మిడిసిన కోతి, ఊరిడిసిన మడిసి ఒక్కటే.”
దొర మాయల మరాఠి. మాటలతోని మత్తలు గొల్పుతడు. అరె సితపల్క కాయలెంత దాని బిసాదెంత? దొరల ఆందానికి ఏవి దింటే ఏంవొడుస్తయ్యి? లారీల కొద్ది కాయ దెంపినా దంగని కాయలు గడి సుట్టు వున్నయి. అయినా ముందుగాల గవాట్ని పట్నం అడ్తిదారుకు గంపగుత్తకు ఇత్తే వాల్లు ఏక్ నంబర్ కాయంత తెంపుక పోయినంకనే… చితుగు… బొతుకు పోరడు తెంపుకచ్చిండు. గిన్నేండ్ల సంది పెద్దల్నించి సిన్నల దంక అర్వ సాకిరి సేసినా గా కాయలు తినే అక్కు లేదా? మొన్న దొర సెల్కల్నే ఒక బాజు ముగ్గురాయి ఒక బెత్తెడు తెచ్చింది ఈరిగాని తల్లి, ఓ ఇగదాని కోసం ఎంతనో యాగి బెట్టింది దొర్సాని. పెద్ద జీతగాన్ని సాచ్చెం బెట్టి తవ్విన సున్నం రాల్లని సగం గడికి మల్పింది. ఎంత సేత జేసినా వీల్లకు తుర్తి అనేది లేదు… థూ… నీ…
గొంతు సరం బడ్డట్టు లేసి దూరంగ ఊంచి వచ్చిండు ఎల్లయ్య. ఎట్లనన్న గుంట జాగ దొరని అడుక్కోని ఇల్లేసుకోవాలె. పెద్ద కొడుకు ఊర్లె తెల్సినోల్లని పట్కోని అత్కార పార్టీలతోని పైరవి చేయించుకోని ఇల్లు సంపాయించుకున్నడు… హైద్రాదుల… కని ఇన్నాల్ల జీతాలు చేసి ఏవి లాభం? గింత మెహర్బానీ లేకుంట, నాయం లేకుంట వున్నడు దొర. ఈరిగాని తల్లి అంటనే వుంటది గొడ్డు బర్రెకు బందాలు పోసి పాలు పిండే రకం మీ దొరగాడు అని.
పతంజలి గమనిస్తనే వున్నడు ఎల్లన్ని… “వీడు ఈ మధ్యన తనకు తెల్సిన వాల్లతోని తనకు తెలువాల్నని మరీ – ‘ప్యాదోల్లం గింతంత ఇల్లు కట్టుకోను జాగ చూయిస్తే ఏం బోయింది. ఉన్న గుడిసె నా పెల్లానికి జబ్బు చేత్తె అమ్మిన, గందుల్నే కిరాయికి వుంటున్న… తాతల కాంచి ఆ దొర్లకే రెక్కల కట్టం దారవొత్తిమి… సన్న దోతులు వాల్లయయినవి, ముడ్డి గోసి గుడ్డ మాదయ్యింది. ఎప్పటికి మారదా గిసోంటి రాత?’ అంటుండట! భూవుల రేట్లు ఎట్లున్నయో మీ కెర్కలేదా, ఎకురం యాభయి లక్షలు వుందీ వూళ్ళ.. వీన్ని జూసి మరికొందరు తయారైతరు.” అనుకుండు మన్సుల పతంజలి.
“ఇర్వయి నాలుగ్గంటలు కొల్వుగొలిసినా మాకు పుట్టగోసులేనాయె… వాడు అడ్విలుంటేందీ ఊల్లుంటేందీ? ఎన్నడయిన సెట్ల కింది బత్కేనాయె!” నిష్టురంగన్నడు ఎల్లయ్య.
“అంత గరమేందిరో!!” కనుబొమలు ముడిచి ఒంకరగ చూసుకుంట అన్నడు. పతంజలికి తెలుసు ఎల్లడు కొడుకు వంక బెట్టుకోని జాగ అడిగెతందుకు వచ్చిండని. దాన్ని ఎత్తగొట్టెతందుకె ఆని కొడుకు మీన దొంగతనం మోపిండు. గా సంగతి పురాగ ఎల్లయ్యకు ఎరికె.
అదంత ఎరికె లేనట్టుగనే “గరమెందు దొరారూ… ఉన్న మాటంటె దొర్లకు కోపాలొత్తయి… ఎన్కట్నించి మీ కొలువే కొలుత్తంటిమి… ఆనాటి సుంది ఎంతిత్తె గంతతోనే బత్కినం… కరువచ్చింది… కాట్కమచ్చింది…పెట్టకాలమచ్చింది… ఏ కాలమచ్చినా నీ గడి పట్కోనే వున్నం… ఇన్నేండ్లు అచ్చినా మా దశ మారదాయె… నా యిల్లు సూడరాదు దొరా… మడుసులుండెటట్టున్నదా? మా పెద్దాడు పెండ్లాన్ని పట్టుకోని అదికార పార్టోల్లతోని డబల్ బెడ్ రూం జనగంల ఇత్తండ్రంటే రాపించుకోని అవతల పడ్డడు. మాకు మీరే ఏడనన్న ఇల్లిప్పియండ్రి లేకుంటే ఊల్లె గుంటజాగ ఏడనన్న సూయించుండ్రి. నా బొందిల పానముండంగ మీరుడంల పడిపోను… ఏంజేసైన రుడం తీర్సుకుంట!” కండ్లల్ల నీటి సెలిమ జారకుంట పై బట్టతోని అద్దుకున్నడు కండ్లు.
లోపల టీవీ ముంగట కూసున్న ప్రబావతమ్మ సయ్యిన ఉర్కొచ్చింది బైటికి ఎల్లని మాట విని. “ఏందీ… ఇంటి జాగలు సూపాల్నా… ఎన్నటి నించి చేసినం ఎన్నటి నించి చేసినం అని లావు చెప్తానవు గదా… దొర గూడా సెవులు దోరవెట్టుకోని మంచిగనే ఇంటుండు గద! నీ కొడుకు మమ్ముల పెట్టే యాష్టకు జీతంల వుంచుకోవుడే మా ఎక్వ, ఇంక భూవిజాగలిచ్చి సాదాల్నంటే మాతోని గాదు. ఎన్కట చేసిండ్రు గావచ్చు, అంత మందం తినకుంటనే వున్నరా? ఈరిగాన్ని ఏ గంగల్నన్న కలువనియ్యి… మా పైసలు మాకు పారేసి పోండి… దిక్కు మాల్న ఎవుసం ఎవలు బాగుపడ్డరిండ్ల…” ఖరాఖండిగ చెప్పిందామె.
“అరే… నేను మాట్లాడ్తనే వుంటి జరనువ్వాగరాదూ…”
మొగని మాటలు ఆమె సెవున బెట్టలె. ఎల్లడందుకున్నడు ఎంబటే – “నిజవే దొర్సానీ… గిప్పుడు ఈరడంటె పని పెద్దగ చెయ్యలేదు గావచ్చు. కని మేమందరం ఆరుగాలం కట్టపడి గుమ్ములు గరిసెలు నింపినోల్లమే. నేను గింతున్నప్పుడు మా నాయనను గా ఎల్లమంద పటేలు మన గొడ్లు ఆయన చేండ్ల పడ్డయ్యని పెండ్లామాలు తిట్టిండు. మా నాయన ఆయినని నోరిడ్సిండ్రంటే మంచిగుండదన్నందుకు తోలు పికుల గొట్టిండు. మీ మావగారు గుడక నవ్వుకుంట కచ్చేరికాడ నిల్సుండి సూసుడు అర్వయి ఏండ్లొచ్చినా నేం మర్వలే… గా తన్నులెందుకు దిన్నడు మా అయ్య మీకోసం గాదా!”
దొర్సాని మౌనం జూసి – “సరె నాయిన ముచ్చట పోనియ్యుర్రి… నా విషయంల ఏమన్న మంచి జరిగిందా? నన్ను పదేండ్ల పోరడుండంగనే ఆకిలూడ్వ, పిడకలు గొట్ట జీతం వుంచిండు మా నాయిన, ఆటగోలు పోరలకు ఇంట్ల దాపెడితె ఎట్లుంటది, గట్ల నా మన్సంత కోల్లు తవ్విన పెంటకుప్ప తీర్గుండేది. మా సిన్నతనంల దొరల టాట్ బాగుండేడిది… ఊల్లల్ల మామూలోల్లు బత్కాల్నంటే అరిసేతుల పానాలు పెట్కునేటోల్లు,.. గా టైముల్నే కమినిట్టోల్లు తయారైండ్రు… అబ్బో ఆల్లు జెయ్యబట్టి ఊల్లకు ఊల్లు ఊగులూగినయి. తుపాకులతోని దోస్తానా వుండేడిది దొర్లకు, అన్నలకు….”
పతంజలి మొకం చిట్లించిండు… సోదిల పడ్డడు వీడు… ఎప్పటిదో యాభయి ఏండ్ల కిందటి ముచ్చట తవ్వి తీసుడు గిప్పుడు వీడికి అవుసరమా! అసలు వీని ఉద్దేశం ఏమయి వుండొచ్చు… జాగ ఇయ్యకుంటే ఏం జేస్తడు? జాగకు అన్నలకు ఏవన్న సంబంధం గని వున్నదా ఏంది పీకులాటకున బారేత్తు…
అసలు పోరన్ని జీతంలకెల్లి తీసేత్తే పీడబాత్తది… ఎవుసమే తీసెయ్యాలని అనుకుంటుండు తను… కొడుకు దగ్గర పట్ల లేడు, బిజనెస్ చేస్తానని అమ్రికా పొయ్యిండు పదేండ్ల కింద. మనుమడు రెండేండ్లాయె సదువు పూర్తి చేసుకోని పట్నంల స్థిరపడ్డడు. వాడేందో కొత్త టెక్నాలజీ అనుకుంట కొత్త కొత్త బిజినెస్లు మోపు జేసి పల్లెకు పట్నంకు తిరుగుతుంటడు. రియల్ ఎస్టేట్ జేసెటోల్లకు భూవులు ఇచ్చి పట్నం ఎల్లిపోవాలె. ఎవుసమంటే గిప్పుడు మాటలు గాదు కూలి నాలోడు గుడుక చెప్పిన మాట ఇనక తల రిక్కిస్తుండ్రు. ఇయ్యాల గుంట భూవేగదాని వీనికిస్తే, వీని గాలి సోకి ఇంకో జీతగాడొస్తడు. ఎన్కటి నించి నేను చెయ్యలేదాంటడు. అసలు ఊల్లె మూడు పావులాల వంతు గడికి ఎట్టి చేసినోల్లే, ఏదో రకంగ గడికి ఉపయోగ పడినోల్లే. అందరికి గిట్ల ఇచ్చుకుంట వోతే మిగిలేది సిప్పే. దండెందాసెండ్లు బెట్టినోనికల్ల జాగలిచ్చుకుంట వోతే ఇక బాగే! అదే జరిగితే ఉన్నూళ్ళనే మనల్ని కానెటోడెవ్వడు వుండడు అనుకున్నడు.
“అన్నల ముచ్చట పోలీసుల ముచ్చట్లు గిప్పుడెందుకురా నీకు? ఒడిసిపాయె… పోరన్ని తోలిచ్చు జీతంలకు… పోరగాల్లని గావురం జేత్తె గిట్నే దొంగలకు మొగలైతరు… తిండికి లెవ్వంటివి గద… జీతంల సూసుకుందాం దొర్సాన్నడిగి గిన్ని బియ్యం కొంటవో… ఇత్తనం చెనిక్కాయ కొడితెందుకు వస్తె తినెటందుకు గింత కాయ పెడ్తది గదా దొర్సాని, గట్ల పని చెయ్యద్దని ఆలోశన బెట్టుకుంటే బాగుపడ్తార్ర… ఎంత సేపూ పుక్యానికి తిందవంటె ఎట్లరా! నేను హైద్రాదు పోవాలె… మల్ల కలువు…” పతంజలి కుర్చిల్నించి లేసిండు చిర చిరలాడుకుంట.
“బతికెతందుకు తలె ముంతలు సుత తాకట్టు పెట్టుకున్న… ఏం జేసినా నీ యిష్టం… దొర్సానికి యాభయి కిలోల బియ్యం ఇయ్యమని చెప్పుండి… రెండు మూడు రోజులల్ల పట్కపోత.” అనుకుంట గడి పటాకులు దాటిండు ఎల్లయ్య.
“ఎట్ల బుట్టిండో పాపపు ముండకొడుకు… వాండ్ల అయ్య సాలే వీనికొచ్చినట్టుంది, పైకి జూడ పతంజలి దొర నిమ్మలస్తుడు… కాపోని తీర్గనే గని… దొర పోకడ పోడు అని అందరంటరు. కని ఎన్కటి వాళ్ళ నాయన మా అయ్యని ఎన్ని తీర్ల తిప్పలు బెట్టలే? పోరడు రెండు సితపల్క కాయలు కోసిండని ఊరంత వాడు దొంగని గామె చెప్పిస్తాది పెద్ద సత్తే సంసారి లెక్క… నెత్తి మీదికి పొద్దచ్చెదంక పని చేపిచ్చుకుంట కడ్పు మాడబెట్టి ఇంటికెల్లగొట్టే మడ్షి కాదు… చి… చీ… గసోంటోల్ల కాడ పని చేసినా అట్ట దరిద్రం. ఇగ వానిష్టం… నీ యిష్టం… వాడు జీతంలకు పోడంట.. వాందోస్తులు పట్నం రమ్మంటున్నరు. కంపెన పంజూయిత్తరట… నీ దొరని నమ్ముకుంటే వాడు భూవియ్యడు, బుట్టియ్యడు గనీ!”
ఎల్లని పెండ్లాం పొద్దు పొడిచిన కాంచి మాటల యుద్ధం మొదలు పెట్టింది. ఇంటాంటె నిజవని ఏన్నో కొడ్తుంది మతికి.
పిల్ల పిల్ల తరాలు సేత సేసినా పతంజలి దొరకు నియ్యతి లేకుంట పాయె. ఏం జెప్పిండో గని ఊళ్ళె అందరు ‘ఈరిగాడు గడికే బేడం గొట్టి మరీ దొంగతనం జేసిండంట గదనే’ అనుడు నవ్వుడు. ఎల్లయ్యకు శరమన్పించి గడీకి పోబుద్ది గాలే, దొర్సాన్నడిగి బియ్యం తెచ్చుకోబుద్ది గాలె.
‘ఏందిరో గడీకే తొర్ర బెట్టినవంట గదా! ఊల్లెకు దొంగలను మోపు జెయ్యకురో’, అనుకుంట ఎక్కిరించిన సుట్టు పక్కలోల్లను సూత్తాంటే ఇల్లుగాలి పోతంటె పేలాలు ఏర్కతిన్నట్టు వీల్లందరేందిరా దరిద్రపు తద్దినం అనుకుంట కువిలి పోయిండు ఈరడు. గడెన్క సింతపల్క కాయలే తను తెంపింది. గడిల దొర్సానైతే దొరకు తెల్వకుంట, ఆమె అత్తకు తెల్వకుంట మినుములు, పెసాల్లు, కందులు లాంటియన్ని కుంచాలకు కుంచాలు దొంగతనంగ ఎన్నోసార్లు అమ్ముకున్నది. గా సంగతి ఊరంతెర్కె, మరామెను జూసి నవ్వుత లేరెందుకు? ఆ మాటనే తల్లినడిగిండు.
కిసకిస నవ్విందామె. “ఎడ్డి పోడా నువ్వు మందింట్ల సొమ్ము దొబ్బినవు. గామె ఆమింట్ల సొమ్ము అమ్ముకోని ముడ్డి కిందేసుకున్నది. అంటే సరుకు మార్చి సొమ్ము జేసుకుందన్నట్టు. సరుకు ఎత్తుకొచ్చుకోని తిన్నది నువ్వు.”
ఈరడు బదునాం మోసినా చిన్నంగ మెల్లెంగ జీతంలకు పోవుడు పెట్టిండు.
పండుగ పబ్బం లేకున్నా ఓనాడు లారినిండ మేకల్ని పట్నం తోల్కవోయిండ్రు బేరం అచ్చిందని. ఈరన్కి పని లేకుంటై ఇంట్ల కూసుండు. మల్లీ వారం పెద్ద జీతగాల్లకు సుత పని లేకుంటైంది ఎవుసం భూవుల్ల సిన్మహాలు కడ్తరంట గదెవరో కొన్నరని తెల్సి అందరు నోరెల్ల బెట్టిండ్రు. దొర కొత్త సిరస్త తెచ్చిండనుకున్నరు జనం. దొర ఇంటి ముంగటికి లారీలు ట్రాక్టర్లు వచ్చినయి… కూలీలు సమాను ఎక్కించిండ్రు. లోపల ఇంకొందరు సమాను సదుర్తున్రు… ఎల్లనికి తెల్సి ఉరుక్కుంట వచ్చిండు గడీకి. దొర కోసం సూత్తె ఆయిన ఎలుగు రాకముందే ఊరిడ్సిండంట. పైనించొచ్చిన కూలీలు సమాను సదుత్తుర్రు ఎవలని గడీ లోపటికి రానిస్తలేరు.
జనం పోగవుడు చూసి ఒగాయన బైటికచ్చి చెప్పిండు. “మీ దొరవారు హైద్రాదుల మకాం బెట్టిండు. ఈ గడీ భూవులన్ని మేం కొన్నం… గడీ సుత ఇండ్ల సమాను సుత… కొనుక్కున్నం తీస్కపోను సదుర్తన్నం…”
వాండ్ల మాటలిని- “సారెడు బూవి సెక్కకు ఆశపడి పోరన్ని జీతం వుంచితే… భూవియ్యక పాయె, పైనించి వాన్ని దొంగ అని పచారం చేయించి… సగం జీతం ఎగొట్టి పాయె… గింత పోరలున్నప్పటి కాంచి చేయించుకోని, పెయిల బిగి సచ్చినంక వద్దుపొమ్మన్నడు బట్టెవాజి దొర”, గడి ముందున్న ఏపసెట్టు కింద కాల్జేతులు వనుకుతాంటే కూలవడ్డడు ఎల్లయ్య.
పెద్ద జీతగాల్లు సేతులు పిసుక్కుంట ఒగలనొగలు సెప్పుకుంటుండ్రు. “ఆర్నెల్లాయె జీతమియ్యక… వడ్లు గొల్పియ్యమంటె ఇగో అగో అనవట్టె… కట్టం చేయించుకుండు… పాత బాకీల కింద బూవులు గూడ కుదువ బెట్టించుకుండు… గిప్పుడు దొంగలెక్క ఆవలబడ్డడు…” అనుకునెటోల్లల్ల గుండెలు జారినోల్లు, గుండెలు మండినోల్లు అందరు గదే మాట అనుకుంటుండ్రు.
“కుమ్మరాం పైకి సూత్తే మన్ను మెత్తి బాగనే కనిపిత్తది… కని లోపట మటికి కుత కుత ఉడుకుద్ది. ఇన్నాల్లు దొరా దొరా అనుకుంటాంటె లంజకొడుకు దొంగోలే ఆవలబడ్డడు… నన్నేమో దొంగని పచారం చేసిండు… అయిన దొర లెక్క ఊళ్ళెనే వున్న… వాడే దొంగ లెక్క ఊరినించి పారిపోయిండు.” ఈరడు మందిల చేరి లాసిగనే అన్నడు.
అందరు గదే అనుకున్నరు పాత దొరే నయం కొట్టినా, తిట్టిన తమను తిప్పలు పెట్టినా ఊరుపట్టుకోని వుండెటోడు. కొత్త దొరలు ఊరి జనాలను ముంచి పారిపోతాండ్రు… ఏడు సెప్పుల జోర్లరిగినా ఎంటిక మందం వసూలు సెయ్యలేము అనుకున్నరు. ఏపసెట్టు మీది కాకులు అనేకం ఒర్లుతున్నయి మనుషులోలిగె. దొరని తిడున్నయో దీవిస్తున్నయ్యో మరి అయిసుత!!