ఏ విషయం అయినా సరే ప్రతి పదేళ్లకోసారి కొత్తగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందేమో, అప్పుడే అంతకుముందు తెలియని ఇంకో కోణం కనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా మేనత్తలు ‘డబ్బు మనుషులు’- అని మా నాన్న, బాబాయిలు తెగ అంటూ వుండేవారు. నేను కూడా నమ్మేసేదాన్ని. కారణం ఏమిటంటే వాళ్ళు మా ఇంట్లో పెళ్ళికో దేనికో వచ్చినప్పుడు హారతిపళ్ళెం లో చిల్లర సరిగా వేయలేదనో, పెట్టిన చీరలో జరీ సరిగా లేదనో గొడవ పడేవాళ్ళు. ఇంట్లో వున్న అన్నదమ్ములు అంతా ఎప్పుడు కలిసినా ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకునేవారు, అరుచుకునేవాళ్ళు, అడ్డు వచ్చిన తల్లి ని తోసేసేవాళ్ళు. అయినా సరే వాళ్ళు డబ్బు మనుషులుగా మాకు తోచేది కాదు. ఎంతో న్యాయంగా హక్కుల గురించి మాట్లాడుకున్నట్టే వుండేది.
“అసలు ఎవ్వరికీ పైసా ఇవ్వను రా, చస్తే చావండి, నన్నెవరు మట్టి చేస్తే వాళ్ళకి రాస్తాను”- అంటూ హిస్టీరిక్ గా అరుస్తూ రోడ్డెక్కి నుంచునేది మా బామ్మ.
అప్పటిదాకా తాము తాగడం వల్ల వాగడం వల్ల, రక్తాలు కారేట్టు తన్నుకోవడం వల్ల పోని పరువు ఆవిడ అరవడం వల్ల పోయినట్టు కొడుకులు తెగ బాధపడిపోయి రెక్క పట్టుకుని లోపలికి గుంజుకొచ్చేసేవాళ్ళు.
“చి చి ఈ ముసల్ది ఇంత డబ్బు మనిషేమిటి, ఏం చేసుకుటుంది ఆస్తి? ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అందరికీ అనిపించేది. జరుగుతున్న యుద్ధ కాండలో నాన్న పక్షం వహించిన పిల్లలం కదా అందువల్ల ఆవిడ నిర్ణయం వెనక వున్న ఔచిత్యం అర్ధమయేది కాదు.
చివరికి ఆరుగురిలో ఒక ముగ్గురు తెలివైన కొడుకులు గిఫ్ట్ డి డి పేరుతో ఒకరికి తెలియకుండా ఒకరు సంతకం చేయించుకున్నారు. మీకేనా తెలివి, నాకు లేదా, అని 19 సార్లు వీలునామా మార్చి రాయించింది మా బామ్మ. తర్వాత మెల్లిగా లోకానికి టాటా చెప్పేసి పైకెళ్లిపోయింది. గుట్టపోసిన వీలునామాల్లో ఏది తుది ఏది మొదలు తెలియక కోర్టు కూడా తెల్లబోయేలా తయారయింది పరిస్థితి. తేల్చడానికి ఇరవై ఏళ్లు పట్టింది. ఈ లోగా వున్న ఆరుగురిలో నలుగురు పైకెళ్లిపోయారు ఇప్పుడు వారి సుపుత్రులు ఏరీనా లో నిలబడ్డారు. కుటుంబ కలహాల వల్ల మనసుషుల్లాగా కాకుండా పందెం కోళ్ళ లాగా పెరిగారు కాబట్టి, తండ్రులు వదిలిపోయిన ద్వేషాన్ని మాత్రం మీసాలు దువ్వి బుసకొట్టేవారు. మరి వాళ్ళకి వెనకో ముందో పుట్టిన అక్కాచెల్లెళ్లు వుంటారు కదా, మీతో బాటు మాకు కూడా న్యాయం జరగాలి అని ఆడగ్గానే “డబ్బు మనుషులు” అయిపోయారు. మా మేనత్త కొడుకు వాళ్ళ అక్కని గురించి ఇదే వ్యాఖ్యానం చేశాడు. అసలు అక్కలకి ఆస్తి ఎగొట్టడానికి వాడు ఇంకో గొప్ప సిద్ధాంతం కూడా చెప్పాడు అదేమిటంటే ఎన్టీఆర్ ఆస్తి హక్కు ప్రకటన కంటే ముందే పెళ్ళిళ్ళు అయిన ఇద్దరక్కలకి ఏమీ ఇవ్వక్కర్లేదని, దండల పెళ్లి కారణంగా మూడో అక్కకి, మతాంతరం కారణ౦గా నాలుగో అక్కకి కూడా హక్కులేదని వాదించడం మొదలుపెట్టాడు. ఈ వంశోద్ధారకుడికి బదులు అయిదోసారి కూడా వాళ్ళమ్మకి ఆడపిల్ల పుడితే ఇంత భావ దరిద్రం ఉండదేమో అని నాకు అనిపించిన మాట నిజం.
గిఫ్ట్ డి డి పుణ్యమా అని భయపెట్టో, భ్రమ పెట్టో అసలు వాటాల ప్రసక్తి లేకుండా ఆస్తి మొత్తం రాయించుకున్న నాన్నలు వాళ్ల పిల్లలకి బంగారు తండ్రులుగానే కనిపిస్తారు. వాళ్ళు చేసుకునే విందులకి హారతి ఇచ్చి చిల్లర విషయంలోనో చీర విషయంలోనో గొడవ పడే మా మేనత్తలు నాకిప్పుడు గుర్తు వస్తున్నారు. వున్న ఆస్తి రాసేస్తే రేపు తన గతి ఏమిటో, ఎవర్ని నమ్మాలో తెలియక వీధి కెక్కి అరుస్తున్న మా బామ్మ గయ్యాళి తనం వెనక వున్న అభద్రతా తెలుస్తోంది. ఏటికేదాడి టన్నులకొద్ది రాఖీలు అమ్ముడుపోతున్న ఈ దేశం లోనే, ‘నీ పాదం మీదా పుట్టు మచ్చనే చెల్లెమా’- అని పాడుకునే ఈ నేలమీదే తల్లి కూతుళ్లకి ఎక్కడ పైసా ఇస్తుందో అని భయపడి, పెన్షన్ చేతికివ్వకుండా సతాయించే కొడుకుల్ని చూశాను. అత్త కి రావాల్సిన అద్దె పైసలు ఊడబెరుక్కునే కోడళ్లని చూశాను. సందర్భం వచ్చినప్పుడల్లా కూతుళ్లమీద ప్రేమలు కురిపించే తండ్రులు తమ అక్కాచెల్లెళ్లమీద ప్రదర్శించిన ధోరణిని ఎంతో చక్కగా మర్చిపోతారు. ఈ కూతుళ్లకి మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు హారతి పళ్ళెంలో చిల్లరని పరిచయం చేస్తారు. ఇది చరిత్ర. ఈ కిలుం పట్టిన చిల్లర చప్పుడు కింద ఆడపిల్ల ఆస్తి హక్కు నలిగిపోతోంది. పెంపకంలో వున్న తేడా పంపకంలోనూ వున్నప్పుడు ఆ వివక్షని అదిమిపట్టి అపశృతి లేకుండా మంగళ హారతులు అద్దడం ఇక కష్టం. చిల్లర తీసుకోవడం ఇంకా నికృష్టం. ఆడపిల్లలు కుక్కపిల్లలు కాదు కదా మెడ కొక తోలుబెల్టు కట్టి పెళ్లి పేరుతోనో పిచ్చి పేరుతోనే బండెక్కించి పంపేస్తే నోరు మూస్కుని వుండటానికి. తప్పకుండా అడుగుతారు. “డబ్బు మనుషులు” అనిపించుకుంటారు. ఇప్పుడు కొత్తే ముంది. ఎప్పటినుంచో వింటున్న మాటేగా.
ఎన్నో ఏళ్ళ తర్వాత వాస్తవాన్ని తడిమి చూసుకున్నట్లుంది. ఇల్లంతా ఒకసారి కలియతిరిగినట్లుంది మేడం మీ ఆర్టికల్ చదువుతుంటే…
ఇప్పటికీ స్త్రీ పరిస్తితి మీరు రాసినట్టే ఉంది నిర్మలగారు