కొండ చిలువ

“సర్…ర్…ర్…ర్..” ఎండుటాకుల మీద ఏదో పాకింది.

శ్రావణి భయంతో అక్క రేణుక చేతిని గట్టిగా పట్టుకుంది.

“అక్కా… అది పామేనా?” అంది శ్రావణి భయంతో.

“ఏమోనే… పాములాగానే ఉంది” అంది రేణుక. “థూ… థూ” అని రెండు సార్లు ఉమ్మించి వీపు మీద కొట్టుకుంది.

“అవునే అక్కా… పాములు రాత్రి పూట నిద్ర పోవా?”

“పోతాయేమో… ఏమి దొరకకపోతే రాత్రి పూట తిరుగుతాయట. అమ్మ చెప్పింది.”

వాళ్ళిద్దరూ ఒకరి చెవి దగ్గర ఒకరు జరిగి గుస గుస మాట్లాడుకుంటున్నారు.

    ** ** **

అది దట్టమైన అడవి… పైగా గాడాంధకారం. అడవిలో పగలే చీకటిగా ఉంటుంది. ఇక రాత్రి చెప్పేదేముంది? దండకారణ్యంలో నిర్బంధంలాంటిది. అనుభవిస్తేనే తెలిసేది.

అల్లిబిల్లిగా అల్లుకున్నతీగలు, చెట్టెక్కడుందో, పుట్టెక్కడుందో, వాగేదో, వొంపేదో అన్ని కలగలుపుకొని చిక్కని చీకటి. అందమైన రంగుల మీద ఒక నల్లని డాoబారు వేసి పులిమినట్టుగా ఉంది. వెల్తురు సైతం చొరబడటానికి వీల్లేదు.

            ** ** **

ఆ పిల్లలిద్దరు నల్లమల్ల లోని మల్లాపూర్ కి చెందిన చెంచు పిల్లలు. వాళ్ళు రేణుక(06), శ్రావణి(05)… తండ్రి నాగయ్య, తల్లి బయ్యమ్మ. పిల్లలిద్దర్ని కొల్లాపూర్ హాస్టల్ లో వేశారు. అక్కడ తిండి పడక ఇంటిమీద బెంగ తో జ్వరం రావడం తో ఇంటికోచ్చారు. కొద్ది రోజులు బెంగ తీరాక పంపిద్దాం అనుకొని తల్లిదండ్రులు కూడ తమ పెంటలోనే ఉంచేసుకున్నారు.

    ** ** **

ఎంతటి ధీశాలినైనా గుండెలు దిగజార్చే ఆ చీకటిలో ఇద్దరు పిల్లలు దారీ తెన్నూ తెలీక నడుస్తున్నారు. అడుగు తీసి అడుగేస్తే ఏం జరుగుతుందో తెలీదు. తాము భూమ్మీద అడుగేస్తామో… పడుకున్న పాము మీద అడుగేస్తామో… మండ్ర గబ్బ(తేలు) మీద అడుగేస్తమో తెలీని స్థితి.

మూడు రోజుల కింద వర్షం వచ్చి వెలియడంతో భూమి కాస్త మెత్తబడ్డది. ఎక్కడో కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. చిమ్మేటలు ఒకటే రొద పెడుతున్నాయి. గాలి బరువెక్కి బహుదూరపు బాటసారిలా చెట్ల మధ్యన పాడుతూ సాగిపోతోoది. చెట్లు ఫార్మేషన్ లో నిలబడ్డ గెరిల్లా యోధుల్లా ఉన్నాయి. అప్పుడప్పుడు పక్షుల అరుపులు, నక్కల ఊళలు వినిపిస్తున్నాయి. అడివి గర్భాన అనంత సంచలనం, అంతుపట్టని రహస్యం.

    ** ** **

ఇవేవి ఆ పిల్లలకు పట్టి లేవు. వాళ్ళ శరీరాలలో అణువణువు భయం వ్యాపించి ఉంది. వాళ్ళకు ఈ అనుభవం మొదటిది. ఊహకందనిది. పెను గాలికి వణికిపోయే చిగురుటాకుల్లా ఉన్నారు వాళ్ళు.

“అక్కా… మనం తప్పు చేసినమేమో…” అంది శ్రావణి లో గొంతుకతో.

“ఏం తప్పు?” ఎదురు ప్రశ్న వేసింది రేణుక.

“తాత మేకలను తోల్కపోతుంటే మనం ఎంబడి పోతింగద. ఆయన పొమ్మనప్పుడే వాపసు పోయి ఉంటె గీ తిప్పలు వచ్చేవి గావు”

“నువ్వే గద నక్కేరి పండ్లు తిందాం అంటివి మనం వాటికోసo తిరుగుకుoట దారి తప్తిమి.”

“గిట్ల ఎంత దూరం నడుద్దమే. కాళ్ళు పీక్కపోతున్నాయే. అమ్మ యాదికొస్తున్నదే.”

“అవునే… అమ్మ పక్కన లేకపోతె మనకు నిద్రనే రాదు.”

“అక్కా… ఈ రాత్రికి ఈడ యాడనన్న పడుకుందమే నిదురొస్తున్నది.”

“అమ్మ… నాయన మన కోసం చూస్తున్నారేమో”

ఏడుపు…

    ** ** **

చీకట్లోనే దొరికిన నాలుగు కొమ్మలు విరిచి కింద మెత్తగా వేసుకొని ఓ పొదలో నిద్రకుపక్రమించారు. శ్రావణి వెంటనే నిద్ర పోయింది. రేణుకకు ఎంత మాత్రం నిద్ర రావడం లేదు. కప్పుకేసి చూసింది. ఏమి కనబడలేదు. పైన చీకటి, కింద చీకటి.

ఆకలితో నకనకలాడే రేణుకకు నిద్ర రావడం లేదు. ఆ పిల్లకి సోలార్ లైట్ ఉంటెగాని అమ్మ పక్కనుంటే గాని నిద్ర పట్టదు.

చెల్లెలుకు దగ్గరగా జరిగింది. అపూర్వమైన వెచ్చదనం.

“శ్రావణి… శ్రావణి…” అంది రేణుక. గాఢంగా నిద్రపోతుంది ఆ పిల్ల.

“దూపైతున్నదే… గిన్ని నీళ్ళు కావాలి”

“………….”

“లేవే… చెల్లె… లేవవా… నాకు భయం ఐతున్నది.”

“………..”

“నేనే పోయొస్త… దగ్గరలో నీళ్ళు దొరుకుతాయేమో చూసివొస్త”

                            ** ** **

శ్రావణి ని పొదలోనే ఒంటరిగా ఒదిలి నీళ్ళకై బయలుదేరింది రేణుక. ఆ పిల్లకి… ఆ రాత్రి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి…

చిక్కుల తర్వాత చిక్కులు. చీకటి తీగలు ఆ పిల్లని కొండచిలువలా అల్లుకున్నాయి.

నీళ్ళకోసo ఆ రాత్రి దయ్యంలా తిరిగింది ఆ పిల్ల. అడవిలో పులుల కోసం మడులలో నీళ్ళు నిoపుతారని తాత చెప్పగా ఎప్పుడో విన్నది. కనీసం ఆ నీళ్లైన దొరికితే బావుండునని అనుకుంది. ఒకవేళ పులి ఒచ్చి దాడి చేస్తే, నీళ్ళు తాగిన తృప్తితో పులి నోట్లోకి వెళ్ళిపోతుంది.

 అటుతిరిగి ఇటుతిరిగి మొత్తo మీద పులి కోసం కట్టిన నీటిమడిని చేరింది. దోసిళ్ళతో నీళ్ళు గబగబా తాగింది. కడుపు నిండినాక అక్కడే కూలబడిపోయింది. ఆయాసం తగ్గింది. అప్పుడు గాని ఆ పిల్లకి అసలు సమస్య తెలిసి రాలేదు. వాపసు ఎట్లా పోవాలి? దిగ్గున లేచి పరుగు లాంటి నడక మొదలెట్టింది. “చెల్లెలు ఒంటరిగా ఉంది ఎమన్నా జరిగిందేమో?” దేవుడికి వేల సార్లు మొక్కుకుంది. విపరీతంగా ఏడవసాగింది. అమ్మ, నాన్న, ఊరు, కుక్కపిల్లలు, కోడిపిల్లలు అన్ని యాదికొస్తున్నాయి. దారి మాత్రం దొరకడంలేదు. “చెల్లె… చెల్లె… శ్రావణి… శ్రావణి…”

గట్టిగ అరిచింది. చీకటి ముక్కలుముక్కలుగా చీలిపోయింది. బండమీదకి ఎప్పుడు చేరిందో ఎప్పుడు నిద్ర పోయిందో ఆ పిల్లకే తెలవదు.

                                               ** ** **

తెల్లారినట్టుంది… కోతుల కిచకిచలతో లేచి కూర్చుంది.

పొద్దున్నే రకరకాల పక్షులు భిన్నమైన గొంతుకతో గొప్ప కోరసును అందుకున్నాయి. ఆగి ఆగి ఒస్తున్న శబ్దాల మధ్య నిశబ్దం అనుభూతికి అందనిది.

ఏవో శబ్దాలు వినవొస్తున్నాయి. చెవులు రిక్కించి విన్నదాపిల్ల. “శ్రావణి… శ్రావణి… రేణుకా… రేణుకా… అమ్మా… అమ్మా…” అరుస్తున్నారెవరో. రేణుకకు ప్రాణం లేచొచ్చింది. “అమ్మా నాయనా… నేనిక్కడ ఉన్నా…” జవాబు పలికింది. అటునుంచి ఇటునుంచి అరుపులే అరుపులు.

అల్లంత దూరాన తల్లిదండ్రి కనపడగానే ఆ పిల్ల పరిగెత్తుక పోయి వాళ్ళను కావలించుకుంది. ఎంత బాధను అనుభవించిందో ఏడ్వనికె గూడ వశం ఐతలేదు.

“చెల్లేదే?” భయంగా అడిగింది బయమ్మ. ఆ పిల్ల జవాబు చెప్పే స్థితిలో లేదు. ఏడుస్తూనే అడవి వైపు చూయించింది. భయం గడ్డకట్టి ఆ పిల్ల గొంతుకు అడ్డంపడ్డది.

                                            ** ** **

మూడు రోజులు గడిచాయి… శ్రావణి జాడ లేదు… చెంచులు వెతకని చోటంటూ లేదు… వాగులు, వంపులు, గుట్టలు, మిట్టలు… ఒకటేమిటి? అడవిని జల్లెడపట్టారు. శ్రావణి దొరకలేదు… పెంటలోదుఃఖానికి అంతేలేదు…

విషయం బయటకి పొక్కింది. సేన్సషనల్ వార్త అయింది. అంతే చప్పున చల్లారిపోయింది. పోలిసోళ్ళు ఫారెస్ట్ వాళ్ళు నామమాత్రంగా వెతికి చేతులు దులిపేసుకున్నారు.

దిన్ని పెద్దగ చేస్తే అడవి నుంచి తమను ఎక్కడ వెల్లగోడతారోననే భయం తో చెoచులు మిన్నకుండిపోయారు.

బాధ నాభి లోకి దిగి భయoకరంగా సలుపుతోoది.

                           ** ** **

“పోరి సంగతి ఎమన్నా తెలిసిందానే” అంటు వచ్చి కూసింది గురువమ్మ.

“తెల్వదక్క. అడవంత తిరిగినాం. జాడ మాత్రం తెలవలేదు.” ముక్కు చీదుతూ అంది బయ్యమ్మ.

“ఒకేలా పెద్దపులి చంపిందేమో” అనుమానంగా అడిగింది గురువమ్మ.

“లేదక్క… పెద్దపులి దాడి చేస్తే కనీసం బట్టలైన లేకపోతె బొక్కలైన దొరికేవి గదా” నిశ్చలంగా అంది బయ్యమ్మ.

“మరి ఏమయుంటదే?” గురువమ్మలో కుతూహలం పెరిగింది.

“నా అనుమానం ఐతే నా బిడ్డను కొండచిలువనే మింగి ఉంటది” అంది బయ్యమ్మ బియ్యంలో రాళ్లు ఏరటం ఆపేసి.

ఒక్కసారిగా పక్కన బాంబు పెలినట్టైంది.

“వామ్మో… కొండచిలువనా? అంత పెద్దది ఇక్కడ ఎక్కడిది. అవి బాగా అడివి లోపల ఉంటాయి అట గదా…”

“అవును ఇవి అడివి లోపల పుట్టిపెరిగినవి కావు ఇవి సర్కారు తెచ్చి ఇడ్చిన కొండచిలువలు.”

“నిజంగానా…”

“అవునక్కా… మనల్ని అడవిలకేలి ఎల్లగొట్టనికే సర్కారోల్లు “పొమ్మనక పొగపెట్టినట్టు” విషపు పాముల్ని పెద్దపెద్ద కొండచిలువల్ని పెద్దపులులను అడివల ఇడుస్తున్నరట.”

“వాళ్ళకేం లాభం?”

“మనం అడవిని ఇడిస్తే దిన్ని గదేదో కంపెనీకి… గదేందమ్మ గదేదో పేరుండే… ఆ… ఆ… డీబీర్స్ కంపెనీకి అప్పచెప్తారట.”

“వాల్లెంచేస్తారు?”

“గీ భూమిల వజ్రాలు యురేనియం ఇంకా ఏవేవో దొరుకుతయంట”

“అంటే మనం అడివి ఇడువాల్సిందేనా?

“అంతే గద. చెపితే పోతలెం అని ఈ కొండచిలువని తెచ్చి ఇడిసిన్రు.”

“వామ్మో… మనల్ని ఎల్లగొట్టనికే ఇన్ని కుట్రలు చేస్తున్నారా? ఈల్లింట్ల పీనుగెల్ల”

                               ** ** **

కుక్క ఒక్కటే తీరుగ మొరుగుతుంటే, గొలుసు తీసుకొచ్చి గుంజకి కట్టేసింది బయ్యమ్మ. అప్పుడే నాగయ్య బయటికొచ్చాడు. చేతిలో ఈటె… వీపుకు విల్లంబులు… నడుముకు వేలాడుతున్న వేట కొడవలి… ఎక్కడో యుద్ధానికి బయలుదేరినట్టుగా ఉన్నాడు.

“యాడికి?” అని అడిగింది బయ్యమ్మ భయంగా.

“అడివికి” నిశ్చలమైన జవాబు.

“ఎందుకు?”

“పిల్లని దేవులాడి ఒస్త.”

“ఇంకెక్కడి పిల్ల… దాన్ని కొండచిలువ మింగే ఉంటది.”

“గీ ఒక్కరోజు చూసి ఒస్త… పానం నెమనెమ అంటున్నది.”

“చూసిరానికె గీయన్ని ఎందుకు?”

“లోతట్టు అడవిలకి పోవాలి గద… ఏ జీవం ఎదురొస్తదో మన జాగ్రత్తల మనం ఉండాలి”

“నీ ఇష్టం… పొద్దుమూకక ముందే ఒచ్చేయి.”

రేణుకను దగ్గర తీసుకోని ముద్దు పెట్టుక్కొని బయలుదేరాడు.

                       ** ** **

నాగయ్య తన భార్యకు అబద్ధం చెప్పాడు గాని అతను కొండచిలువ కోసమే బయలుదేరాడు. తన బిడ్డ ఆనవాళ్ళు కూడ దొరకలేదంటే ఆ పిల్లని కొండ చిలువనే మింగేసిందని అతని నమ్మకం. పెoటoత అదే నమ్మకంతో ఉంది.

అది తూర్పున నీలగిరి కొండల్లో తిరుగుతుందని వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాడు. అంటే తమ పెంటకు దగ్గర్లోనే తిరుగాడుతుందనమాట.

నాగయ్య తన ఆలోచనను ఇతర చెంచులతో పంచుకున్నాడు గాని వాళ్ళు రకరకాల పనుల వల్ల రాలేకపోయారు. ఇది కాదని ఒక్కడే బయలుదేరాడు.

                                    ** ** **

నాగన్నకు కొండచిలువల గురించి బాగానే తెలుసు. సాధారణంగా చిన్న కొండచిలువలు 8 నుండి 10 అడుగుల పొడవు ఉంటాయి. వాటివి శీతల శరీరాలు కాబట్టి పగలంతా ఎండలో సేద తీరుతాయి. రాత్రైతే చాలు ఏ చెట్టు కొమ్మనో చుట్టుకొని ఏ గడ్డిపోదల మాటునో, ఏ నిలువ నీటి మాటునో దాక్కొని ఎర కోసం ఎదురుచుస్తుంటాయి. పెద్ద కొండచిలువలు మాత్రం పదిహేను నుండి ఇరవై ఐదు అడుగులు ఉంటాయి. అవి అడవిలో “దాదా” లలాగ ప్రవర్తిస్తుంటాయి. అవి ఒక ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంగా ఎంచుకొని ఇతర కొండచిలువల్ని రానివ్వవు. ఎక్కువగా బయట తిరుగకుండ దొరల లాగ ఉన్న చోటనే ఆహారం సంపాదించుకుంటాయి.

చిన్న కొండచిలువలు పక్షులు ఎలుకలు కప్పలు కుందేళ్ళు మొదలైన వాటి మీద ఆధారపడ్తాయి. పెద్దవి మాత్రం వీటన్నిటితో పాటు లేళ్ళను గొర్లను మేకలను ఆఖరికి మనషులను సైతం మింగేస్తుంటాయి. ఒక దేశంలో ఐతే ఓసారి గర్భిణీ స్త్రీని కూడా మింగేసిందట.

ఎర దొరికితె చుట్టూ చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసి, చనిపోయిన తర్వాత అమాంతం మింగేస్తాయి. ఒక్కసారి ఒక ఎర దొరికింది అంటే కొన్ని రోజులు లేదా వారం రోజుల వరకు వేటాడవు. ఒక్కోసారి నెల రోజులు కూడా పట్టొచ్చు.

నాగన్న మునుపటి మనిషిలాగా లేడు. కసితో రగిలిపోతున్నాడు. తన ముందు తన బిడ్డ శ్రావణిని కొండచిలువ మింగుతున్న దృశ్యం కదలాడుతున్నది. ఆ పిల్ల ఎంత మరణయాతనకు గురైందో అతను అంత కన్నా వందలరెట్లు గోస పడ్డాడు. అది తలచుకున్న కొద్ది అతను ఇతర మనుషుల నుండి వేరుపడి మరో మానవుడిలా మారిపోతున్నాడు.

      ** ** **

నాగన్న ఈటెకు అంబులకు విషపు పసరు పుసాడు. వేటకోడవలిని నిన్నటి దినం అంతా బండ మీద నూరుతూనే ఉన్నాడు. చూస్తుంటే అతడేదో యుద్ధభూమికి బయలుదేరినట్టే ఉన్నాడు.

అతడు నిషిద్ధ భూమిలోకి ప్రవేశించాడు.

                              ** ** **

అడవి దట్టమైన కొద్ది అతని వొంటి నిండా కళ్ళు మొలిచాయి. అతని కళ్ళే కాదు మొత్తం శరీరం అంత అడవిలోని ప్రతి కదలికను గమనిస్తుంది. మాటి మాటికి ఈటె మీద పిడికిలి బిగుస్తుంది.

                                  ** ** **

ఉన్నట్టుండి కోతులు కీచ్ కీచ్ మంటూ అరవడం మొదలుపెట్టాయి. పక్షులు రెక్కలు అల్లారుస్తూ పైకి లేచాయి. నాగన్న అలర్ట్ అయ్యాడు. అతను మెల్లెగా చెట్టు చాటుకి వెళ్లి నక్కి చూసాడు. అరగంట సేపు ఏ అలికిడి లేదు. ఎదో జరగబోతుంది.

నాగన్న పొద వైపు తీక్షణంగా చూస్తున్నాడు. మెల్లగా ఏదో అలికిడి మొదలైంది. ఎదో పెద్ద జీవం మెల్లిగా కదులుతున్నట్టు ఉంది. ఈట మీద చెయ్యి బిగుసుకుంది. కన్నార్పకుండా చూస్తున్నాడు. మొదట తల కనబడింది. త్రికోణాకారం లో నిలువు కళ్ళతో సన్నని మూతి గల కొండచిలువ తల కనబడ్డది. తల బయట పెట్టి అటు ఇటు చూసి ముoదుకొచ్చింది.

దాన్ని చూసిన వెంటనే నాగన్న కళ్ళు బైర్లుకమ్మాయి. అది సుమారు ఇరువై అడుగుల పొడవు ఉంటది. మెల్లిగా బయటకి ఒచ్చి మెత్తగా ముందుకు సాగిపోతుంది. అక్కడ దగ్గరలో పచ్చిగడ్డి మేస్తున్న కుందేలు మీద దాని దృష్టి ఉంది. చాల జాగ్రత్తగా తన నిలువు కళ్ళతో కుందేలు కదలికల్ని గమనిస్తున్నది.

నాగన్న మల్లి అలెర్ట్ అయ్యాడు. తన చుట్టు పక్కల పెంటల్నిగడగడలాడిస్తున్న కొండచిలువ, తన బిడ్డని మింగిన కొండచిలువ ఇదే అయి ఉండాలి. అతని సిక్స్త్ సెన్స్ ఇదే చెబుతున్నది. నాగన్న బాణం తీసాడు. అంబును నారి మీద పెట్టి బయన్న దేవుణ్ణి తలుచుకొని గురి చూసి కొట్టాడు. అది రివ్వుమని దూసుకుపోయి నడుము భాగంలో దిగింది. అది సర్ ర్ మని వెనకకు చూసింది. ఎదురుగ నాగన్న కనబడ్డాడు. అంత పెద్ద కొండచిలువని అంత దగ్గరగా చూడడం అతనికి మొదటిసారి. అది మెల్లగా పొదల్లోకి జారుకుంది.

నాగన్న చావుని లెక్కబెట్టే స్థితిలో లేడు. అటో ఇటో తేలిపోవాలి. తన వేటకొడవలిని తీసుకోని పిచ్చివాడిలాగా పొదలని నరకడం మొదలు పెట్టాడు. “మమ్మల్ని పంపనికే మీరొచ్చినారే. ఇప్పుడు చూడు మిమ్మల్ని ఒక్కటే సారి పైకి పంపుతాం. మా అడివలకేల్లి మమ్మల్ని పంపనికే ఎవని తరం. ఈ అడవి మాదే” పిచ్చి వాడిలాగా అరుస్తున్నాడు. అతని కసి అంతా చెమటరూపంలో బయటికి ఒస్తున్నది.

                                             ** ** **

తాను అలసిపోవద్దు. అలిసిపోతే కొండచిలువతో పోరాడే శక్తి ఎట్లా ఒస్తది. శక్తి మిగిలాలి. మనిషి మిగిలాలి.

అలిసిపోయిండేమో పొదలు నరకడం మాని మెల్లిగా మద్ది చెట్టు కాడ విశ్రాంతి కోసం నడుస్తున్నాడు. దుసరి తీగల్ని నరుక్కొని బయటకి రాగానే ఎదురుగ కొండచిలువ నోరు తెరుచుకొని తన వైపే ఒస్తున్నది. దాని నోరు ఒక గుహ లాగ ఉంది. దాని గొంతు ఒక గొట్టంలాగా ఉండి రైళ్ళని మింగేసే పర్వతసొరంగం లాగ ఉంది.

               ** ** **

అది తన వైపే ఒస్తున్నది. తనను చుట్టుకోకుండా చూసుకోవాలి. నాగన్న ఒడుపుగా తప్పుకొని ఈటతో తలపైన పొడిచాడు. అది గురి తప్పి మరోచోట తగిలింది. జీవితంలో భయాన్ని కోల్పోయిన మనిషి దొరికిన చోటల్ల ఈటతో పొడుస్తూనె ఉన్నాడు. మరో వైపు కొండచిలువ నాగన్నను చుట్టేయాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నది.

సరిగ్గా ఆ స్తితిలో అక్కడేదో రాయి తగిలి నాగన్న పడిపోయాడు. చేతిలో ఈటె అల్లంత దూరాన పడిపోయింది. అంతటి గందరగోళంలోను తన చేతికి వేటకొడవలి తీసుకున్నాడు. అతను తేరుకునేలోపు కొండచిలువ అతని కాళ్ళని పట్టేసింది. ఆలస్యం చేయకుండా శరీరాన్ని చుట్టేయడం మొదలుపెట్టింది. నాగన్న పట్టుకోల్పోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. దొరికిన చోట దొరికినట్టు వేటకొడవలితో నరుకుతున్నాడు.

ఎక్కడో ఫట్ ఫట్… మని ఎముకలు విరిగిన చప్పుడు. నాగన్న నోట్లో నుంచి రక్తం ఒస్తున్నది. రక్తాన్ని ఉమ్మేసి పిచ్చివాడిలా అరవడం మొదలుపెట్టాడు. “నీయమ్మ నా బిడ్డను సంపుతావే ఇయాల నువ్వో నేనో తేలాలె” దెబ్బ… మరో దెబ్బ…”

కొండచిలువ వొంటినుండా గాయాలతో రక్తంతో మండుతున్న అగ్నిపర్వతంలా తయారైంది. బాణాలకు ఈటెకు పూసిన విషపు పసరు ప్రభావం మెల్లిగా రక్తంలోకి ఇంకడం మొదలైంది.

మెల్లగా కొండచిలువ శరీరం పట్టుతప్పుతున్నది. మరోవైపు ఎముకలు విరిగిన నాగన్న పట్టు తప్పుతున్నాడు. శరీరం లోంచి చేతుల్లోంచి ఎవరో శక్తి లాగేస్తున్నారు. “దీనమ్మ శరీరంల మొత్తం ఎముకలు విరిగిన ఓడిపోయేది లేదు.” మనసులో అనుకున్నాడో బయటికే అన్నాడో తెలియదు.

గెలవాలనే ప్రయత్నంలో ఇద్దరు అలిసిపోతున్నారు. మెల్లమెల్లగా కొండచిలువ నీరసoగా తలను వాల్చేసింది. నాగన్న అదే పనిగా తలవాల్చేసాడు. ఒక భీకరప్రాణితో ఒక బక్కపలుచని ఆదివాసీ యుద్ధం చేసాడు. గెలుపు వోటములు తర్వాతా. యుద్ధం చేయాలనుకోవడం, నిలవడం కలబడడం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ముఖ్యం.

చెట్ల మీద కోతులు అదే పనిగా అరుస్తున్నాయి. కొండచిలువ పట్టులోంచి ఎట్లా బయటపడ్డడో తనకే తెలవదు.

         ** ** **

మరుసటి రోజు అటువైపుగా ఒచ్చిన చెంచులు ఆ దృశ్యం చూసి షాక్ కి గురయ్యారు. అక్కడున్న వాతావరణాన్ని బట్టి పెద్ద యుద్దమే జరిగినట్టుంది.

ఓ వైపు కొండచిలువ చచ్చిపడి ఉంది. మరోవైపు నాగన్న నిస్త్రాణగా పడి ఉన్నాడు. ఇద్దరి మీద చీమలు పాకుతున్నాయి. నాగన్న చేతిలో వేటకొడవలి అట్లాగే ఉంది. నోట్లో కారిన రక్తం గడ్డకట్టినట్టుగా ఉంది. అక్కడ చీమలు పాకుతున్నాయి.

ఎవరో ముక్కుదగ్గర చేయి పెట్టి చూసారు. బతికే ఉన్నాడు. ఆలస్యం చేయకుండా చెంచులు ఏవేవో పసర్లు తెచ్చి వొంటి నిండా పూసారు. నల్లటి మనిషి ఆకుపచ్చ మనిషిగా మారాడు.

ఓ వ్యక్తి నీళ్ళు తెచ్చి మొఖం మీద చల్లాడు. కల్లుదెరిచి చూసాడు. మరో చెంచు అతని చేతిలో చెయ్యివేసి నవ్వుతూ కుడివైపు చూయించాడు. మెల్లగా తల తిప్పిచూసాడు. అక్కడ 20 అడుగుల కొండచిలువ చచ్చి పడి ఉంది. రక్తం తో తడిసిన నాగన్న నోరు మెల్లగా విచ్చుకుంది మందారం పువ్వులా. సన్నగా నవ్వాడు. మళ్లీ నవ్వాడు… విరిగిన ఎముకలు సలుపుతున్నా నవ్వాడు.

ఆ నవ్వు ఒక ధిక్కారం

మృత్యువు మీద పరిహాసం

ప్రకృతి మీద రాజ్యం మీద

ఆదివాసీ ప్రకటిస్తున్న ధిక్కారం

కత్తులమొనల మీద నడుస్తున్న

కలలు కనే ఆత్మవిశ్వాసం

అడివిలోని చెట్లన్నీ మనిషి అజేయేతకు ఆమోదముద్ర వేసినట్టు అదే పనిగా ఊగుతున్నాయి.

“ఇంకెన్ని కొండచిలువలని ఇడిసిన్రో వాటిపని పట్టాలి” అన్నాడో చెంచు.

“కొండచిలువలు, విషపు పాములు, పులులు ఎన్ని ఇడిసిన పారిపోయేది లేదు” మరో చెంచు అందుకున్నాడు.

“సర్కార్ ఒస్తదేమో చూద్దాం. అడవిని ఇడిచేది లేదు. అమ్మని ఇడిచేది లేదు. అడవి మనది. ఎవనికో అప్పచెపుతమంటే ఎట్లా ఊరుకుoటo” గట్టిగ అరిచాడు ఓ చెంచు.

“మనం చచ్చినా మన పిల్లలకి ఒక మంచి బతుకు ఇవ్వాలి” ముగింపుగా పలికాడు ఓ చెంచు.

ఒక వెచ్చని విశ్వాసం ఏదో అడవంత వ్యాపించింది. ఆకాశాన్ని కమ్మేసింది.

డోలి మల్లాపూర్ కేసి సాగింది.

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

2 thoughts on “కొండ చిలువ

  1. “గెలుపు వోటములు తర్వాతా. యుద్ధం చేయాలనుకోవడం, నిలవడం కలబడడం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ముఖ్యం” కథ చాలా బాగుంది.వామ్మో, భయంకూడా వేసింది.

Leave a Reply