కొంచెం స్వేచ్ఛగావాలి

దోపిడి నుంచి, దాష్టీకాల నుంచి, ఆధిపత్యాల నుంచి, అజ్ఞాన పూరిత మూఢనమ్మకాలు నుంచి జాతిని కాపాడాల్సిన పాలకులు, శాస్త్రీయతను పెంపొందిచాల్సిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని నిర్బంధంలోకి నెట్టేస్తున్న వర్తమానమిది. పురోగమనం నుంచి తిరోగమనంలోకి జారిపోతున్న రోజులివి. పాలకులే దోపిడీ దారుల కొమ్ము కాస్తున్న పాలనలో పౌరస్వేచ్ఛ గురించి, ప్రజా సంక్షేమం గురించి ఎక్కువగా ఆశించడం హాస్యాస్పదమే అయినా ఎప్పటికప్పుడు ఆశను నమ్మకాన్ని కూడగట్టుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యం ఎంతైనా ఉంది.

దేశంలో వాతావరణం ఏమి బాలేదు.

మనుషులు మనుషులుగా జీవించే పరిస్థితి రానురాను సన్నగిల్లిపోతోంది. నిజం నల్లపూసైపోయింది.అసత్యం పల్లకి ఎక్కి ఊరేగుతోంది.ఏదో ఒక ఊరని కాదు, రాష్ట్రమని కాదు, దేశమని కాదు ప్రపంచమే ఆ మాదరి అయిపోతావుందిప్పుడు. దురదృష్టమేమిటంటే మన చుట్టూ సాగుతున్న రాజకీయాలు ఇందుకు కర్త కర్మ క్రియలై పబ్బం గడుపుకుంటున్నాయి. మోసం ద్వేషం పౌర మెదళ్ళలోకి కూరబడుతోంది.మనిషితనం, మనిషి జీవించే సహజమైన వాతావరణం మృగ్యమైపోతున్న సందర్భంలో మనం జీవిస్తున్నాం.

ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మతస్వేచ్ఛపై వార్షిక నివేదికను విడుదల చేస్తూ,యూదులు, ముస్లిమ్లపై ప్రపంచ వ్యాప్తంగా మతదాడులు పెరిగాయని తెలియజేస్తూ భారత్ లో అయితే మత స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు.నిజానికి మత స్వేచ్చే కాదు,పౌరులకు రాజ్యాంగ బద్ధంగా లభించిన ప్రాథమిక హక్కులు ఏవీ ఉండాల్సి విధంగా మనుగడలో లేవన్నది అనేక సందర్భాల్లో రుజువవుతూనే ఉంది.పైగా పౌరుల హక్కుల గురించి,దేశ సహజ వనరుల దోపిడీ గురించి మాట్లాడే వారిని, ప్రగతిశీలవాదులను రాజ్యం శత్రువులుగా భావిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది.దీనికి ఇటీవల జరిగిన, జరుగుతున్న అనేక పరిస్థితులు ఉదాహరణగా చెప్పవచ్చు. కాశ్మీర్ లో జరిగిన పరిస్థితులు కావచ్చు,మొన్ననే మణిపూర్ లో జరిగిన దారుణాలు కావచ్చు, ప్రభుత్వమే పౌరుల వాక్ స్వాతంత్ర్యాన్ని నిలుపు చేసి బయట ప్రపంచానికి అక్కడ ఏమి జరుగుతోందో తెలియకుండా ప్రవర్తించింది.ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటూ అంతటా విస్తరిస్తున్న పాసిస్టు ధోరణులు, నియంతృత్వ విధానాలు కోకొల్లలు.ఇటువంటి వాటిని మాట్లాడుతున్న అభ్యుదయ, ప్రగతిశీల దృక్పథాల్ని చర్చిస్తున్న మేధావులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు అధికారపు ఉక్కు పాదాలకింద తొక్కివేయబడుతున్నారు.అక్రమంగా నిర్భందాల్లోకి తోయబడుతున్నారు.

చట్టాలను ,చట్టాలలోని లొసుగులను అడ్డుపెట్టుకుని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితులు యధావిధిగా సాగుతున్నాయి. ఇవన్నీ కళ్ళముందు విచ్చలవిడిగా సాగుతున్న ఎందుకిలా అని అడగటమే నేరమై పోయిన కాలమిది.

ఇటువంటి సందర్భాలను కవులు తమదైన అవగాహన తో ఆలోచనలతో నిరసిస్తూనే వున్నారు. ఆలోచనపరులు, బుద్ధిజీవులను చైత్యన పరుస్తున్నారు. ప్రజా మద్దతు కూడగట్టి అన్యాయాన్ని నిలదీసే పౌర సమాజాన్ని కలగంటున్నారు. ఇటువంటి ఆలోచనను అవగాహనను అందిస్తున్న తెలుగు కవుల్లో ప్రసిద్ధ కవి కె.శివారెడ్డి గారు ఒకరు. వీరి కొంచెం స్వేచ్ఛగావాలి కవితను చదువుతుంటే ఇప్పటి దాకా మాట్లాడుకున్న వాస్తవాలు కళ్ళముందు కదులుతాయి.

కొంచెం స్వేచ్ఛగావాలి

కొంచెం స్వేచ్ఛ గావాలి
రెక్కలల్లార్చటానికి
చినుకుపడ్డ రెక్కల్ని విదల్చటానికి
ముక్కుతో ఈకలు సరిదిద్దుకుంటానికి
ఈ కాలు యిలా, ఆ కాలు అలా చాచటానికి- ‘టప్’మని ఒక చినుకు నెత్తిమీద పడితే
తల పైకెత్తి చెట్ల ఆకులకేసి చూడటానికి-
మహా మృదువుగా గాలి వీస్తే
ముకుపుటాలు పెద్దవి చేసి
కళ్లతో గాలి పీల్చటానికి-

కొంచెం స్వేచ్ఛ గావాలి
మనిషిని మనిషని చెబటానికి
పశువుని పశువని చెబటానికి
కొంచెం స్వేచ్ఛ గావాలి
రాత్రిని రాత్రని చెబటానికి
పగటిని పగలని చెబటానికి-

కొంచెం స్వేచ్ఛ గావాలి
రెక్కలల్లార్చి
గాల్లో ఎగరటానికి-

(ఈ కవిత ‘పక్కకి ఒత్తిగిలితే’ కవితాసంపుటిలో ఉంది. అప్పటి స్థితికంటే ఇప్పటి ఈ స్థితికి మరింతగా సరిపోతుందని ఇక్కడ మొదటి కవితగా ప్రత్యక్షం.)

కవి కె.శివారెడ్డి గారు ఇటీవలె వెలువరించిన కొంచెం స్వేచ్ఛ గావాలి కవితా సంపుటిలోని ఈ కవిత మొదటిగా ‘పక్కకు వొత్తిగిల్లితే’ సంపుటిలో ఒక కవితగా ముద్రించినా తరువాత దేశ పరిస్థితులు గమనించిన కవి ఆ పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించారు. ఆ రకంగా వర్తమాన సామాజిక, రాజకీయ పరిస్థితులు ప్రజా జీవితాన్ని ఎటువంటి నిర్బంధాల్లోకి, నియంతృత్వపు విధానాల్లోకి నెట్టేస్తున్నాయో కవి ప్రతీకాత్మకంగా చెప్పారు. ‘మనిషిని మనిషని చెప్పటానికి’ కూడా స్వేచ్ఛ కావల్సిన విషాద పూరిత సందర్భాన్ని ఆవిష్కరించిన కవిత యిది. స్వేచ్చాయిత వాతావరణంలో ఎవడిబతుకు వాడు బతకలేని సామాజిక వాస్తవికతకు అద్దం పట్టిన వాక్యాలు ఇవి.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని నిలబెట్టడానికి మనమంతా ఒకతాటిపై నిలబడాల్సిన సమయమిది. న్యాయాన్ని న్యాయమని, అన్యాయాన్ని అన్యాయమని గొంతెత్తి చెప్పగలిగే సమాజాన్ని నిర్మించుకోవాలి. స్వార్ధపూరిత రాజకీయాలనుంచి సమాజాన్ని, మన కుటుంబాలని రక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్న కవిత కొంచెం స్వేచ్ఛగావాలి.

ఈ కవిత చదువుతున్నప్పుడు “ఎప్పటికప్పుడు ఉద్యమ అవసరాలనుతీరుస్తూ,సాహిత్య మూలాలను పరిరక్షించడం సృజనకారుడి కర్తవ్యం”అన్న ప్రముఖ కవి, రచయిత డా.కోయి కోటేశ్వరరావు గారి మాటల్ని గుర్తు చేసుకున్నాను.
ఏ కవి అయినా తాను జీవిస్తున్న సమాజంలో జరుగుతున్న అన్యాయల్ని, పాలకులు చేస్తున్న కుట్రలని కనిపెట్టి సమాజాన్ని జాగృతి పరచడం బాధ్యతగా స్వీకరించాలి కదా. అటువంటి కదలికను, ఆలోచనను అందించిన కవి శివారెడ్డి గారికి అభినందనలు చెబుతూ…

కాలం గుండె చప్పున్ని కవిత్వంలో వినిపించే మరో కవితతో, కవి గుండె హృదయంతో మళ్లీ కలుసుకునేదాకా సెలవు…

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

One thought on “కొంచెం స్వేచ్ఛగావాలి

  1. కొంచెం స్వేచ్ఛ గావాలి కవితను సరిగ్గానే అంచనా వేశారు.శుభాకాంక్షలు

Leave a Reply