శతాబ్దాలుగా చెదరని స్వప్నం కుర్దిస్తాన్

“నా పేరు ఒక స్వప్నం.
నా దేశం ఒక అద్భుత లోకం.
పర్వతం నా తండ్రి.
పొగమంచు నా తల్లి.
నేను
తన నెల హత్యచేయబడిన సంవత్సరంలో,
తన వారం హత్య చేయబడిన నెలలో,
తన గంటలు హత్య చేయబడిన రోజులో పుట్టాను.” అని ప్రముఖ కుర్దు కవి శెర్కో బెకస్ (Sherko Bekas) కుర్దిస్తాన్ కలనీ, అస్తిత్వ వేదననీ, దుఃఖాన్నీ మనకి వినిపిస్తాడు.

ఇంతకీ కుర్దులు ఎవరు? ఎక్కడ ఉన్నారు? సుమారు మూడున్నర నుండి నాలుగున్నర కోట్ల మంది కుర్దులు టర్కీ, ఇరాక్, సిరియా, ఇరాన్, ఆర్మీనియా సరిహద్దుల వెంబడి వ్యాపించి ఉన్న పర్వత ప్రాంతంలో వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. మధ్య ప్రాచ్య ప్రాంతంలోని జాతులలో సంఖ్యా పరంగా కుర్దులు నాలుగో స్థానంలో ఉన్నా, స్వతంత్ర దేశం కోసం రెండు శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.

చరిత్రకారులు కుర్దులు ఇండో-యూరోపియన్ జాతుల్లో ఇరానీ తెగకు చెందినవారిగా చెప్తారు. 612 BC లో అస్సిరియా, ఇరాన్, అనాటోలీయా ప్రాంతాలను పాలించిన మీడ్ జాతికి చెందిన ప్రజలను, కుర్దుల పూర్వీకులుగా పరిగణిస్తారు. అందుకే 612 BC ని కుర్ద్ జాతీయవాదులు మొదటి కుర్ద్ సంవత్సరంగా భావిస్తారు.

ఏడవ శతాబ్దంలో మొదలయిన అరబ్- ముస్లిం దండయాత్రలను కుర్దులు వందేళ్ల కాలం గట్టిగా ప్రతిఘటించి చివరికి ఇస్లాం మతంలో చేరారు. ఇస్లాంలో చేరినా కుర్దులు తమ సామాజిక అస్తిత్వాన్ని కోల్పోలేదు. ముస్లింలుగా మారారు కానీ అరబులుగా మారలేదు.

తొమ్మిదవ శతాబ్దంలో మహ్మదీయ ఖలీఫా అధికారం క్షీణించడంతో, అప్పటికే కళలు, చరిత్ర, తత్వశాస్త్రాలలో రాణించిన కుర్దులు, తమ సొంత రాజకీయాధికారాన్ని స్థాపించుకోవడం మొదలుపెట్టారు. 1150 లో కుర్దు దేశాన్ని ఆక్రమించుకున్న టర్కిష్ సుల్తాన్ అయిన సంజార్ (Sandjar) మొదటిసారి కుర్దు ప్రాంతానికి కుర్దిస్తాన్ అనే పేరు ఇచ్చాడు. పన్నెండవ శతాబ్దంలో కుర్దిస్తాన్ ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా గుర్తించబడి, ముస్లిం రాజ్యాలలో తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకుంది. కుర్దు భాషలో గొప్ప లిఖిత సాహిత్యం వెల్లివిరిసిన ఆ శతాబ్దం కుర్దు చరిత్రలో సంపన్నమైన కాలం. ఎన్నో టర్కో-మంగోలియన్ దండయాత్రలను చవి చూసిన కుర్దిస్తాన్ పదిహేనవ శతాబ్దంలో వాటి నుండి తేరుకొని ఒక స్వతంత్ర ప్రాంతంగా నిలబడింది. రాజకీయంగా చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉన్నా భాష, సంస్కృతి, నాగరికతల పరంగా కుర్దిస్తాన్ తన ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉండింది. ఆ కాలంలో వివిధ చిన్న కుర్దు రాజ్యాలకు చెందిన విద్యావంతులు తామంతా ఒక్క దేశానికి చెందినవారమనే స్పృహతో ఉన్నారు.

పదహారవ శతాబ్దపు కవి, బోటాన్ (Bohtan) రాజ్యానికి చెందిన మెలాయె జాజిరి (Melaye Djaziri) తనని తాను ఇట్లా పరిచయం చేసుకుంటాడు:
బోటాన్ తోటలోని గులాబీ పువ్వును నేను
కుర్దిస్తాన్ రాత్రులను వెలిగించే కాగడాను నేను.

పదహారవ శతాబ్దంలో ఆటమన్ (Ottoman), పర్షియన్ (Persian) సామ్రాజ్యాలు కుర్దు దేశం మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు చేశాయి. ఆ సందర్భంలో ఆటమన్ సామ్రాజ్యపు ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ కుర్దు రాజ్యాలు కుదుర్చుకున్న ఒప్పందంలో వాటికి స్వయం ప్రతిపత్తి లభించింది. ప్రతిగా కుర్దు రాజ్యాలు ఇరానీ సరిహద్దును పర్షియన్ దాడుల నుండి రక్షించడానికి ఒప్పుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల కుర్దిస్తాన్ లో దాదాపు మూడు శతాబ్దాలు శాంతి వెల్లివిరిసింది. సాహిత్యం, సంగీతం, చరిత్ర, తత్వశాస్త్ర రంగాలలో సృజనాత్మకత అలరారిన ఆ కాలాన్ని కుర్దులకు స్వర్ణ యుగంగా చెప్పవచ్చు.

పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో ఆటమన్ సామ్రాజ్యం కుర్దుల స్వయం ప్రతిపత్తిని కాలరాసే ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు, కుర్దిస్తాన్ ఏకీకరణ, స్వాతంత్ర్యం కోసం పోరాటాలు మొదలయినాయి. ఆ పోరాటాలను అణిచివేయడానికి యూరోప్ శక్తులు కుర్దులకు వ్యతిరేకంగా ఆటమన్ సామ్రాజ్యానికి సహాయపడ్డాయి. 1918 లో మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాల చేతిలో ఆటమన్ సామ్రాజ్యం ఓటమి పాలయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంలో కీలకమైన వర్సాయ్ సమావేశంలో (Conference of Versailles) కుర్దు జాతీయవాదులు స్వతంత్ర కుర్దిస్తాన్ కొరకు తమ నివేదికను అందించారు. 1920 లో జరిగిన సెవ్ర ఒప్పందం (The International Treaty of Sèvres) ప్రకారం స్వతంత్ర కుర్దిస్తాన్ దేశాన్ని ఏర్పరచాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాతి మూడేళ్లలోనే ఆ ప్రాంతంలో జరిగిన అధికార సమీకరణాలలో మార్పుల వల్ల సెవ్ర ఒప్పందాన్ని ఉల్లంఘించారు.

పన్నెండవ శతాబ్దం నుండి కుర్దిస్తాన్ గా పిలువబడిన కుర్దుల దేశం, 1925లో టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా దేశాల మధ్య నాలుగు ముక్కలు చేయబడింది. దాని చరిత్రలో మొదటిసారి కుర్దిస్తాన్ తన సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా కోల్పోయింది.

అంతర్జాతీయ సమాజం కుర్దిస్తాన్ అస్తిత్వాన్ని కాలరాస్తూ, కుర్దు ప్రజలకు చేసిన మోసం గురించి ప్రముఖ కుర్దు కవి అబ్దుల్లా పష్యూ:

నా వయసు గురించి కొన్ని వాక్యాలు
– అబ్దుల్లా పష్యూ

‘నువ్వు ఈ ప్రపంచంలో మొదట ఎప్పుడు అడుగు పెట్టావు?’ అని
వలీయా నన్ను అడిగినప్పుడు,
నా నోటి మంచులోనుండి నా నవ్వు
రూబార్బ్ మొక్కలా పొడుచుకొచ్చింది.
నా నవ్వు ప్రపంచంలోని చిరునవ్వులన్నింటినీ
నలిపేసే ఒక శోకం.

అవును వలీయా,
ఈ ప్రపంచంలో మొదట నా కాలు మోపినప్పుడు
నేను ఒక ఆదిమ మానవున్ని.
నా కళ్ళతో ప్రవక్తల యుగాన్ని
ప్రత్యక్షంగా చూశాను,
నా నుదుటి ముడతలపైన
సిగ్గుమాలిన చరిత్ర గమనం కవాతు చేసింది
అయినా…
కుళ్ళిపోయిన మనస్సాక్షితో
కాలంలోని మోసపూరిత వ్యవస్థలు
సమస్త ప్రాణుల గ్రంథంలో
నా పేరును నమోదు చేయలేదు.

1925 లో టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా దేశాల మధ్య విభజించబడిన కుర్దులు, గత వందేళ్లుగా ఆ నాలుగు దేశాలలోనూ స్వయం నిర్ణయాధికారం కోసం, స్వతంత్ర కుర్దిస్తాన్ కోసం సాయుధ పోరాటాలు చేస్తున్నారు. నాలుగు దేశాలలోనూ కుర్దులు తీవ్రమైన వివక్షకు, అణిచివేతకు గురి చేయబడుతున్నారు. అమెరికా తన సామ్రాజ్యవాద అవసరాలకు అనుగుణంగా కుర్దులను వాడుకుంటోంది. ఆ నాలుగు దేశాల్లో ఆ సమయంలో అమెరికాకు శత్రువైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుర్దులకు మద్దతునివ్వడం. అదే సమయంలో పక్క దేశాలలో తనతో మిత్రవైఖరితో ఉన్న ప్రభుత్వాలకు కుర్దులను అణిచివేయడానికి సహాయం చేయడం.

ఉదాహరణకు 1970 లలో సోవియెట్ యూనియన్ పంచన చేరిన ఇరాక్ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి అమెరికా ఇరాకీ కుర్దులకు సహాయపడింది. తర్వాత ఇరాన్, ఇరాక్ మధ్య జరిగిన ఒప్పందంపై సంతకం పెట్టి కుర్దులకు ఆయుధాల సరఫరా ఆపివేసింది. దానితో ఇరాకీ సైన్యం వేలాది మంది కుర్దులను ఊచకోత కోసింది. అట్లానే 1980 లలో సద్దాం హుసేన్ ప్రభుత్వం కుర్దుల జాతి నిర్మూలనకు పాల్పడింది. హాలబ్జా లో రసాయన ఆయుధాలను ఉపయోగించి వేల మంది ఇరాకీ కుర్దులను హతమార్చింది. రీగన్ ప్రభుత్వానికి ఆ విషయం తెలిసినా కూడా, సద్దాం అప్పటి అమెరికా శత్రువైన ఇరాన్ దేశానికి నష్టం కలిగిస్తున్నందుకు అతని పట్ల ఎలాంటి చర్యా తీసుకోలేదు.

జవాబు
– శెర్కో బెకస్

హాలబ్జా ఊపిరాడక మరణించాక
నేను దేవుడికి ఒక పెద్ద ఫిర్యాదు రాశాను.

అందరికన్నా ముందు,
దానిని ఒక చెట్టుకి చదివి వినిపించాను.
చెట్టు కన్నీరు కార్చింది.

ఒక వైపు నుండి వార్తలు మోసుకెళ్లే పక్షి,
“ఇంతకీ దీన్ని ఎవరు చేరవేస్తారు?
నేను తీసుకెళ్లాలని ఆశిస్తున్నావేమో,
నేనైతే దేవుడి సింహాసనాన్ని చేరుకోలేను,” అన్నది.

ఆ రాత్రి బాగా పొద్దుపోయాక,
దివ్యమైన నా కవిత, నల్లని దుస్తులు ధరించి,
“దిగులు పడకు.
నేను దీనిని ఆకాశపుటంచులలోకి
తీసుకువెళ్తాను.
కాని ఈ లేఖను దేవుడే స్వయంగా తీసుకుంటాడని
నేను వాగ్దానం చేయలేను.
సర్వోన్నతుడైన దేవుడిని
ఎవరు చూడగలరు చెప్పు?” అన్నది.

“సంతోషం! ఎగిరి వెళ్లు” అన్నాను.

నా కవిత దేవదూతలా
నా ఫిర్యాదును పట్టుకు ఎగిరిపోయింది.
మరుసటి రోజు, అది తిరిగివచ్చింది.

దేవుడి కింద నాలుగో కార్యదర్శి,
ఒబేద్ అనేవాడు,
అదే ఫిర్యాదు లేఖ చివరన,
నాకు అరబిక్ లో రాసి పంపాడు:
“మూర్ఖుడా! లేఖను అరబిక్ లో రాసి పంపు.
ఇక్కడి వాళ్లకు కుర్దు భాష తెలియదు.
వీళ్లు నీ లేఖను దేవుడికి చేరవేయరు.”

(మార్చ్ 16, 1988 న, సద్దాం హుసేన్ సైన్యం, హాలబ్జా లో రసాయన ఆయుధాలను ఉపయోగించి వేల మంది ఇరాకీ కుర్దులను హతమార్చింది.)

టర్కీలో 1920 నుండి కుర్దులు స్వాతంత్ర్యం కోసం ఎన్నో తిరుగుబాట్లు చేశారు. 1978 లో అబ్దుల్లా ఓజలాన్ (Abdullah Ocalan) నాయకత్వంలో, మార్క్సిస్ట్-లెనినిస్ట్ భావజాలంతో, స్వతంత్ర కుర్దిస్తాన్ సాధించే లక్ష్యంతో కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (PKK) ఏర్పడింది. 1980 లలో మొదలుకొని PKK గెరిల్లా సాయుధ పోరాటం చేస్తోంది. టర్కీ PKK ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 1978 నుండి నేటి వరకు టర్కీ-కుర్దుల మధ్య యుద్ధంలో నలభై వేల మందికి పైగా చనిపోయారు. అందులో ఎక్కువ శాతం మంది టర్కీ సైన్యం చేత చంపబడిన సాధారణ కుర్దు పౌరులే. యూరోపియన్ మానవ హక్కుల కోర్టు టర్కీ చేసే వేలాది మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించింది. సాధారణ కుర్దు పౌరులను చంపడం, చిత్రహింసలు పెట్టడం, ఊర్లను ధ్వంసం చేయడం, బలవంతంగా ఖాళీ చేయించడం, అక్రమ అరెస్టులు, జర్నలిస్టులను, ఆక్టివిస్టులను, రాజకీయ నాయకులను మాయం చేయడం, హత్యలు చేయడం గురించి మానవ హక్కుల కోర్టు టర్కీకి వ్యతిరేకంగా తీర్పులిచ్చింది.

సిరియాలో 2003 లో వామపక్ష భావజాలంతో, కుర్దుల హక్కుల కోసం పోరాడే లక్ష్యంతో కుర్దు డెమోక్రాటిక్ యూనియన్ పార్టీ (PYD) ఏర్పడింది. 2004 లో PYD తన సాయుధ విభాగం పీపుల్స్ డిఫెన్స్ యూనిట్స్ (YPG) ని ఏర్పరిచింది. YPG సరసన స్త్రీల విభాగం వుమెన్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (YPJ) కుర్దుల పోరాటంలో చురుకుగా పాల్గొంటోంది.

స్త్రీల స్వేచ్ఛ, సమానత్వాలను నమ్మి, ఆచరించే PKK, YPJ మహిళా దళాల్లో కుర్దు స్త్రీలే కాక టర్కీ, యజిది స్త్రీలు కూడా పెద్ద సంఖ్యలో చేరి పోరాటం చేస్తున్నారు.

మార్క్సిస్ట్ సిద్ధాంతం, లౌకికవాదాన్ని నమ్మే కుర్దు సాయుధ గెరిల్లాలు సహజంగానే మతఛాంధసవాదులైన ISIS (Islamic state of Syria and Iraq) కు శత్రువులుగా పరిణమించారు. సిరియా, ఇరాక్ దేశాల్లోనూ వాళ్ళు ISIS కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

గుర్తు తెలియని యోధుడు
– అబ్దుల్లా పష్యూ

ఏదో ఒకరోజు ఒక అధికార ప్రతినిధి నా దేశానికి వచ్చి
‘ఇక్కడ గుర్తు తెలియని యోధుని సమాధి ఎక్కడ?’ అనిఅడిగాడనుకో:
నేను ఇట్లా చెప్తాను:
‘అయ్యా!
ఏ వాగు ఒడ్డు మీదయినా,
ఏ మసీదు బెంచీ మీదయినా,
ఏ ఇంటి నీడలోనయినా,
ఏ చర్చీ గడప మీదయినా,
ఏ గుహ ద్వారంలోనయినా,
పర్వతాల్లో ఏ రాయిమీదయినా,
తోటల్లోని ఏ చెట్టు మీదయినా,
నా దేశంలో,
ఏ జానెడు భూమి మీదయినా,
ఆకాశంలోని ఏ మబ్బు కిందయినా సరే,
నిశ్చింతగా,
చిన్నగా వంగి నమస్కరించి,
మీ పూల దండను పెట్టి వెళ్లండి.’

వేర్లు
– శెర్కో బెకస్

చుక్కలూ, మబ్బులూ, గాలీ, సూర్యుడూ
హంతకులను చూడకపోయినా,
పక్షులు ఆకాశంలో చంపబడినప్పుడు,
దిక్కులన్నీ వాటిని పెడచెవిన పెట్టినా,
పర్వతాలూ, నదులూ వాటిని గుర్తు పెట్టుకోకపోయినా
వాటి మరణాన్ని కళ్ళారా చూసి
వాటి పేర్లను తన వేర్లలో రాసుకున్న
చెట్టు ఒక్కటైనా ఉండి తీరాలి.

టర్కీ రాజ్యం కుర్దులను రాజకీయాంగానే కాక వాళ్ళ భాషా, సంస్కృతులను కూడా అణిచివేస్తూ వస్తోంది. టర్కీలోని కుర్దిష్ నివాస ప్రాంతాలలో కుర్దుల భాష, దుస్తులు, జానపద కథలు, పేర్లను నిషేధించారు. వాళ్ల ఉనికిని నిరాకరిస్తూ, టర్కీ ప్రభుత్వం కుర్దులను 1991 వరకు “మౌంటెన్ టర్క్స్” గా వర్గీకరించింది. “కుర్దులు”, “కుర్దిస్తాన్”, “కుర్దిష్” అనే పదాలను టర్కీ ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. 1980 నాటి సాయుధ తిరుగుబాటు తరువాత, కుర్దిష్ భాష ప్రభుత్వ, ప్రైవేట్ జీవితాలలో అధికారికంగా నిషేధించబడింది. కుర్దిష్ భాషలో మాట్లాడినా, ప్రచురించినా లేదా పాడినా చాలా మందిని అరెస్టు చేసి జైలులో పెట్టారు.

గత వందేళ్లలో తామున్న నాలుగు దేశాలలోనూ అణిచివేతను తట్టుకోలేక కుర్దులు లక్షల సంఖ్యలో పొరుగు దేశాలకు పారిపోయారు. అన్యాయాన్ని నిరసిస్తూ గొంతెత్తిన బుద్ధిజీవులు, కవులు, కళాకారులకు ప్రవాస జీవితం తప్పని పరిస్థితి. ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్న కవులు శెర్కో బెకస్, అబ్దుల్లా పష్యూ కూడా ఎన్నో ఏండ్లు ప్రవాసంలో జీవితం గడిపినవాళ్ళే.

మట్టి
– శెర్కో బెకస్

నా చేయి చాచి నేను కొమ్మను ముట్టుకోబోయాను
భరించలేని నొప్పితో కొమ్మ ముడుచుకుపోయింది
కొమ్మను అందుకోబోతుండగా
చెట్టు కాండం బాధతో అరిచింది
చెట్టు కాండాన్ని హత్తుకున్నానా
కాళ్ల కింద భూమి కంపించింది
రాళ్లు దుఃఖంతో మూలిగాయి
నేను నేలకు వంగి పిడికెడు మట్టిని చేతిలోకి తీసుకున్నాను
కుర్దిస్తాన్ యావత్తూ ఒక్కసారిగా విలపించింది

మంచు తుఫాను
– అబ్దుల్లా పష్యూ

మంచు తుఫాను వచ్చింది.
మునిమాపు వేళ, తిరుగాడుతున్న మంచు రేణువు కోసం,
నా దోసిలిని గూడుగా చేశాను.
ప్రియుడిలా దానిని తదేకంగా చూశాను.
అది కరిగిపోయాక దానిని గుర్తు పట్టాను-
కుర్దిస్తాన్ లో ఒక నీటి చుక్క!

వందల ఏండ్లుగా కుర్దులు స్వయం ప్రతిపత్తి కోసం, ఆత్మగౌరవంతో బతికే హక్కు కోసం, తమ భాష, సంస్కృతులను కాపాడుకోవడం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. యుద్ధం, మారణహోమం, క్రమబద్ధమైన అణచివేత నుండి పారిపోవడానికి వారు ఆశ్రయించే పర్వతాలను ఉద్దేశిస్తూ కుర్దులకు ప్రసిద్ధ సామెత ఒకటి ఉంది, వారికి “పర్వతాలు తప్ప స్నేహితులు లేరు” అని. “పర్వతాలు” మాత్రమే కాదు అంతర్జాతీయ సమాజం కూడా వాళ్ళకి స్నేహితులేనని చాటుతూ వాళ్ల న్యాయమైన పోరాటానికి సంఘీభావం, మద్దతు ఇవ్వడం నేటి అవసరం.

విమర్శకుల కోసం
– అబ్దుల్లా పష్యూ

నువ్వు నన్ను నిర్విరామంగా, నిర్దయగా అడుగుతావు
నాలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడిదని
ఆకు లాంటి నా నాలుక, నిస్సహాయమైన ఒక సన్నని మాంసపు ముక్క
ఫరో రాజభవనంలోని పరదాలను
ఎట్లా చీల్చి చింపగలిగిందని
ముండ్ల భూమి మీద
ముండ్ల తీగల కంచె గుండా
నిర్భయంగా ఎట్లా దాటగలిగిందని అడుగుతావు.

ఏ సింహాసనం, ఏ మకుటం నాకు దన్నుగా ఉందని అడుగుతావు,
ఏ జేబు నుండి నేను కత్తిరించబడ్డానని అడుగుతావు.

కొంత శాంతించి…
నీకు చెప్తాను విను:
నా పేదరికం ఒక నిండు ఖజానా అయినప్పుడు,
నా నిరాశ్రయత ఆకాశహర్మ్యం అయినప్పుడు,
నా నిద్రలేమి వెచ్చని పరుపు అయినప్పుడు,
నా దుఃఖాల ద్రాక్షాతోటలు నాలుగు కాలాలూ
రసమయంగా, గాలి జొరబడలేనంత గుబురుగా పెరిగినప్పుడు,
స్వేచ్ఛ నన్ను వెతుక్కుంటూ రాదా?
మొక్కవోని ధైర్యమే నా ఆంతరంగీకురాలు కాదా?

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

3 thoughts on “శతాబ్దాలుగా చెదరని స్వప్నం కుర్దిస్తాన్

  1. కుర్దిస్తాన్ చరిత్ర, మూలాలు కుర్దిష్ ల స్వయంప్రతిపత్తి పోరాటాలు చాలా బాగా విశ్లేషించావు చైతన్యా.
    ప్రజల పోరాటాలు,ఉద్యమాలతో సమాంతరంగా నడిచిన, ఆ చరిత్రను సాహిత్యంలో లిఖుంచిన కుర్దిష్ కవుల పరిచయం …వాళ్ల కవిత్వంతో సహా పరిచయం చేయడం చాలా గొప్పగా ఉంది.అభినందనలు చైతన్యా. స్వేచ్ఛ నన్ను వెతుక్కొంటూ రాదూ అన్న కవి మాటల్లో ఎంత ఆత్మ విశ్వాసం?

  2. Yet another great, well analyzed article from you Chaitanya. Thank you for writing these. Keep writing!!

Leave a Reply